కటార
ఉషా యస్ డానీ
జీవితంలో స్థిరపడే ఆలోచన వచ్చాక ప్రతి మనిషీ తనకోసం ఒక
స్వర్గాన్ని నిర్మించుకునే పనిలో పడతాడు. ఇందులో, విషాదం ఏమంటే, మనుషులు తమ
స్వర్గాన్ని తామే పాతిపెట్టేసి, ఆ
తరువాత దానికోసం జీవితాంతం అన్వేషిస్తూ వుంటారు. అలాంటి కోట్లాది మందిలో కేసీ నాయుడు ఒకడు.
కే అంటే కాకాని అనీ, సీ
అంటే చిట్టయ్య అనీ
చాలా మందికి తెలీదు. అయినా సరే, ఇంటిపేరు, ఊరిపేరు చెప్పకపోయినా సరే
కేసీ నాయుడు అంటే చాలు ఈ రాష్ట్రంలో అందరూ గుర్తుపడతారు.
చిన్నప్పుడు నాయుడు తూనీగల్లా వుండేవాడు.
నచ్చింది చేసేవాడు. నచ్చంది పట్టించుకునేవాడుకాదు. అప్పుడు
అతనికి జీవితమే ఆనందం!. ఆనందమే జీవితం!
యవ్వనంలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో నాయుడు చాలా కష్టాలు పడ్డాడు. పొట్టకూటి కోసం చాలా పనులు చేశాడు. అప్పట్లో, కొంతకాలం కమ్యూనిస్టులతో కూడా తిరిగాడు. అప్పుడే అతనికి జీవితసారం తెలిసింది. జీవితమంటే
కష్టపడ్డమే అనుకున్నాడు. కసికొద్దీ కష్టపడ్డాడు.
ఓ చిట్‌ఫండ్ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తున్నపుడు నాయుడికి జీతం కొత్త అర్ధం చెప్పింది. డబ్బు సంపాదించడం ఒక్కటే జీవిత పరమార్ధం అని
అప్పుడే కనిపెట్టాడు. కసికొద్దీ సంపాదించాడు.
డబ్బు వుంటే అధికారం వుంటుంది. డబ్బూ అధికారం రెండూ వుంటే చాలు. ఈ ప్రపంచంలో కోరుకున్నవన్నీ వాటికవే వరసపెట్టి వచ్చి ముంగిట్లో వాలుతాయని నాయుడికి యవ్వనపు రెండో అడుగులోనే జ్ఞానోదయం అయ్యింది
ఆ తరువాత నాయుడు వెనక్కి చూడలేదు. అతను కొత్త వ్యాపారంవైపు కన్నెత్తి చూస్తే చాలు, అక్కడున్న పాత కాపులందరూ కట్టకట్టుకుని సన్యాసం పుచ్చుకుని, కాషాయ బట్టలేసుకుని కాశీప్రయాణం కట్టేసేవారు.
వ్యాపారం పెరుగుతున్నప్పుడు కొంచెం చాటు అవసరం. చాటు వ్యాపారాలకు దిష్టి తగలకుండా మీడియా తెర కప్పడం ఆచారం. కేసి నాయుడు ప్రింట్ మీడియా వైపు చూసినపుడు పాత మీడియా హౌసులన్నీ కాలిపోయాయి. అతను ముందు పత్రికల్లో కాలుపెట్టాడు. ఆ
తరువాత ఎలక్టానిక్ మీడియాలో తల పెట్టాడు. శాటిలైట్ చానళ్ళ బొకేపెట్టి రాష్ట్రం మొత్తమ్మీద ఒక మీడియా తెర అల్లాడు. అతను వ్యాపారంలో కింగ్;
రాజకీయాల్లో కింగ్ మేకర్ అనగా అచ్చతెలుగులో రాజగురువు.
మనిషిగా నాయుడు చీమంత కూడా చెడ్డవాడుకాదు. చాలాచాలా నిష్టాగరిష్టుడు. భార్యనుతప్ప ఇంకో అమ్మాయిని ఎప్పుడు చూడలేదు. అంత సమయం అతను వృధా చేయదలచలేదు. జీవితంలో ఎప్పుడూ మందు కొట్టలేదు. మందు కొట్టేవాళ్ళు వాగుతారు. వాగడం అతనికి ఇష్టంలేదు. కార్యసాధకులు వాగకూడదని అతని దృఢనిశ్ఛయం. వాగే మనుషులు కార్యసాధకులు కాలేరని అతని ప్రగాఢ నమ్మకం.
నాయుడు ఎప్పుడూ ఎలక్షన్ల జోలికి పోలేదు. కానీ, ఎలక్షన్లు దగ్గరపడ్ద ప్రతిసారీ రాష్ట్ర ప్రజలు నాయుడివైపే చూసేవారు; అతను ఈసారి ఎవరికి మద్దతు ఇస్తాడని. నలుగురు సియంలని ఇంటిదారి పట్టించాడనీ, ఇద్దరు సన్నిహితుల్ని సియం కుర్చీలో కూర్చోబెట్టాడని నాయుడికి పెద్దపేరు. రాష్ట్రంలో నాయుడు "నా"
అనుకున్నవాళ్ళే ముఖ్యమంత్రి అయ్యేవారు. నాయుడుని రోజూ
సేవించుకున్నవాళ్ళే మఖ్యమంత్రి కుర్చీలో సజావుగా కూర్చోనేవాళ్ళు.
రాజకీయ నాయకులకు వున్నట్టే నాయుడికీ ఒక వ్యూహమూ, ఎత్తుగడ వుండేవి. వీటిని ఎప్పటికప్పుడు సరిచేయడానికి ఒక
కోటరీ వుండేది. రాష్ట్ర సచివాలయంలో ప్రపంచబ్యాంకు స్వంతంగా ’అమలు సచివాలయం’ పెట్టుకున్నట్టు, నాయుడు కూడా సియం ఛాంబరులో ఓ ’ఇంప్లిమెంటేషన్ సెక్రతేరియట్’ పెట్టుకున్నాడు.
ఎన్నికలకు ముందు
ఏ పార్టి ఏ పార్టీతో జట్టుకట్టాలో నాయుడే చెప్పేవాడు. ఎన్నికల తరువాత మంత్రివర్గంలో ఎవరెవరికి చోటివ్వాలో నాయుడే తేల్చేవాడు. సియం ఛాంబరులో కూర్చోవడం, సియం క్యాంపు కార్యాలంలో
కాపురం చేయడం మాత్రమే ముఖ్యమంత్రుల పని.
ఏ ఫైలు మీద సంతకం పెట్టాలో, ఏ ఫైలును పక్కన పెట్టాలో నాయుడే డిసైడ్ చేసేవాడు. కాదన్నవాళ్ల
కాళ్లకు న్యూస్ పేపర్ చుట్టి సియం కుర్చీ నుండి నిర్దాక్ష్యంగా లాగేసేవాడు. అవునన్నవాళ్లను తీసుకొచ్చి సియం కుర్చీలో కూర్చోబెట్టేవాడు.
రంజి ఆడినవాడు టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకున్నంత సహజంగా నాయుడి కన్ను కేంద్ర రాజకీయాల మీద పడింది. మరీ
ప్రధాని కాకపోయినా ఉపప్రధాని, మరీ రాష్ట్రపతి కాకపోయినా ఉపరాష్ట్రపతి స్థాయివాళ్ళు హైదరాబాద్ వచ్చినపుడెల్లా నాయుడు ఇంట్లో మర్యాద పూర్వకంగా ఓ
పూట విందు చేయడం ఒక సాంప్రదాయంగా మారింది.
సెలెబ్రిటి అన్న పదం
నాయుడి ముందు చిన్నబోయింది. లెజెండ్ అన్న పదం కూడా అతని పరిధికి సరిపోలేదు. ఫోర్బ్స్ సర్వే ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన పదిమంది పురుషుల్లో నాయుడు ఆరవవాడు. ఐదు విశ్వవిద్యాలయాల్లో అతని మీద
పరిశోధనా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్స్, మీడియా, సినిమా, పర్సనాలిటీ డెవలప్ మెంట్, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ... ఒక్క
టేమిటీ? అన్ని రంగాల్లోనూ అతని మీద పరిశోధనలు సాగుతుండేవి.
నాయుడు అంతలా తీరికలేకుండావున్న రోజుల్లోనే భార్య చనిపోయింది. పని వత్తిడిలో ఆ విషయాన్ని అతను అంతగా పట్టించుకోలేదు. హాజరు అవ్వాలిగాబట్టి అంత్యక్రియలకు హాజరయ్యాడు. స్నానం చేయాలిగాబట్టి స్మశానంలో స్నానం చేశాడు. మర్యాద కోసం ముఖ్యమంత్రి
అయినా స్మశానంలో గంటసేపు వున్నాడేమోగానీ, నాయుడుకు మాత్రం అంత తీరికలేదు. తడిబట్టలతోనే కొత్త కేబినెట్ ను కూర్చడానికి వెళ్ళిపోయాడు.
తను కష్టపడి నిర్మించిన సామ్రాజ్యాన్ని కొడుకులు మహాసామ్రాజ్యంగా పెంచేస్తారని నాయుడు అత్యంత సహజంగానే అనుకున్నాడు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, కృష్ణపట్నం ఓడరేవు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులు అన్నీ తన కొడుకులే కట్టాలని అతను అనుకున్నాడు.
ఆ తరువాత ఆ
మహా సామ్రాజ్యాన్ని
మనవళ్ళు మహామహా సామ్రాజ్యంగా పేంచేస్తారని అతని నమ్మకం. అయితే, ఆ
మహామహా సామ్రాజ్యం
నెట్ వర్త్ ఎంతుంటుందో అంచనా కట్టడానికి క్యాలిక్యూలేటర్ లో
అంకెలుసరిపోలేదు.
నాయుడి కొడుకుల ప్రపంచంవేరు. వాళ్ల అభిరుచులువేరు. పెద్ద కొడుకు బాబా రామ్ దేవ్ భక్తుడు. అతను భక్తజనంతోపాటూ దేశాలు తిరుగుతూ వెళ్ళిపోయాడు. రెండో కోడుక్కి శాస్త్రీయ సంగీతం లో
ప్రవేశంవుంది. ఎప్పటికైనా హైదరాబాద్ రవీంద్రభారతీలో గాత్రకచేరీ
జరపాలనేది అతని జీవిత లక్ష్యం. కొడుకు కోరిక నెరవేర్చడానికి అలాంటి కచేరి ఒకదాన్ని ఏర్పాటు చేయాలని నాయుడు ఒకసారి అనుకున్నాడు. అయితే, ఆత్మాభిమానం అడ్డొచ్చి, ఆ
కుర్రాడే ఒప్పుకోలేదు.
మహా సామ్రాజ్యాన్ని నిర్మించేపని కొడుకులతో ఇక కాదని తెలుసుకున్నాక కూడా నాయుడు నీరసపడిపోలేదు. తన
వయస్సును ఓ ఇరవై యేళ్ళు తగ్గించుకుని, మరింత ఉత్సాహం తెచ్చుకుని,
జాతీయ రాజకీయాల మీద
గట్టిగా దృష్టి పెట్టాలనుకున్నాడు. అతని తదుపరి మజిలి ప్రధానమంత్రి కార్యాలయం. ఇండియాలో రైల్వేల్ని ప్రైవేటుపరం చేయించి, ఓ రెండు జోన్లు తన కంపెనీ ఖాతాలో వేసుకోవడం అతని తదుపరి లక్ష్యం.
అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కూడా డకౌటు
చేసే బౌలర్లు ఉంటారు అన్నట్టు మైనింగ్ మాఫియాలు అటు రాజకీయాల్లోకి ఇటు
మీడియాలోకీ వచ్చి పడ్డాయి.
మైనింగ్ మాఫియా వచ్చాక అవినీతి రేంజ్ పెరిగిపోయింది. ఒక్కో డీల్ లో లక్షల కోట్ల రూపాయలు చేతులు మారిపోతున్నాయి. ఒకడ్ని చంపితే హత్య; వంద
మదిని చంపితే యుధ్ధం అన్నట్టు లక్ష రూపాయలు తింటే అవినీతి. లక్ష కోట్లు దోచేస్తే అద్భుతం అయిపోతోంది. ఇదీ మైనింగ్ మాఫియాల వ్యాపార నీతి.
కంప్యూటర్లో ఒక్క ఫైలుకు వైరస్ సోకినా మొత్తం ఆపరేటింగ్ సిస్టం కరప్ట్ అయిపోయినట్టు,
రాజకీయం, వ్యాపారం కలిసి కాపురం పెట్టాక వాటి గాలిసోకి మిగిలిన రంగాలు కూడా మైల పడిపోయాయి. రైతుబజార్లో కిలో రామ్ములక్కాయల ధర
అరవై రూపాయలు పలుకడంతో, హైకోర్టులో బెయిల్ పిటీషను ధర కోట్ల రూపాయలు పలకడం మొదలెట్టింది.
నాయుడు కింది నుండి సియం ఆఫీసు వరకు పైకి ఎదిగాడు. మైనింగ్ మాఫియాలు పియంవో నుండి కిందికి దూసుకు వచ్చాయి. నాయుడు ఢిల్లీ చేరక ముందే మైనింగ్ మాఫియాలు పియంవోలొ పాగా వేసేశాయి.
మైనింగ్ మాఫియా తయారు చేసుకున్న ఓ
పొలిటికల్ ప్రాజెక్టు బ్లూప్రింట్ ఓ
రోజు నాయుడి చేతికి చిక్కింది. రాష్ట్ర
ప్రభుత్వానికి, ఆర్ధిక వ్యవహారాల్లో సలహాదారుగావున్న ఓ
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాన్ని తయారు చేశాడు.
ఆ ప్రాజెక్టు పేరు ’డబల్ జీరో’. దాన్ని సాగదీస్తే, ’క్యాప్చరింగ్ పవర్ విత్ జీరో క్యాపిటల్ అండ్ జిరో ఎక్స్ పీరియన్స్’ అవుతుంది. ఆ
ప్రాజేక్టు రిపోర్టు రెండు వందల పేజీలకు పైగా వుంది. రెండు పేజీలున్న దాన్ని సినాప్సిస్ ను
నాయుడు అక్షరం అక్షరంగా వందసార్లు చదివాడు. ఆ
ప్రవేశిక ఇలా సాగింది:
"రాష్ట్రంలో మొత్తం ఏమ్మేల్యసీట్లు రెండు వందల తొంభైనాలుగు. పవర్లొకి రావడానికి కావలసిన మేజిక్ ఫిగరు నూట నలభై ఎనిమిది. సేఫ్ సైడ్ గా
నూట యాభై వుంటె మంచిది. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పనిగానీ, ఎండల్లో నానా హైరానా పడి రోడ్ షోలు జరపాల్సిన పనిగానీ, నానా అబధ్ధాలాడి జనం దగ్గర ఓట్లు అడగాల్సిన పనిగానీ లేకుండా పవర్లోకి వచ్చేమార్గం ఒకటుంది".
ప్రజాస్వామ్యంలో చిల్లర వ్యాపారాలు పనికిరావు. టోకు వ్యాపారమే శరణ్యం. ఇద్దరో, ముగ్గురో ఎమ్మేల్యేల్ని కొంటే, పార్టీ మార్పిడి చట్టం ఒప్పుకోదు. నూట యాభై మందిని గంపగుత్తగా కొనెయ్య గలిగితే చట్టం ఫుల్లుగా మన పక్షాన వుంటుంది".
"అంచేత ఆల్రెడీ నెగ్గేసిన ఎమ్మేల్యేలు వంద
మందిని తలో పది
కోట్లు ఇచ్చేసి కోనేయాలి. దీనికి వెయ్యి కోట్లకు మించి ఖర్చుకాదు. ముఖ్యమంత్రి కావాలంటే, ఇంకో యాభై మంది సిట్టింగు ఎమ్మెల్యేలు కావాలి. అయుతే, ఇక్కడో కిటుకుంది. మిగిలిన యాభై మందికి డబ్బు ఇవ్వాల్సిన పనిలేదు. కేబినెట్ లో చోటిస్తే చాలు".
" పవర్ చేతికి వస్తే, ఏడాదికి లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ చేతికి వస్తుంది. ఐదేళ్ళకు ఐదు లక్షల కోట్లు. ఎంతో ధర్మబద్దంగా ఇందులో ఒక్కశాతం మాత్రమే మనది అనుకున్నా హీనపక్షం
ఐదువేల కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ సమకూరుతాయి. క్యాష్ ఆర్ కైండ్ ... అది మన ఇష్టం. వెయ్యి కోట్ల పెట్టుబడికి ఐదేళ్లలో ఐదువేల కోట్ల రాబడి!! అదీ ధర్మబధ్ధంగా!
"రూలు ప్రకారం ప్రతి ప్రాజెక్టులో రిస్క్ ఫ్యాక్టర్ గురించి తప్పనిసరిగా రాయాలి. అయితే, డబల్ జీరో ప్రాజెక్టులో రిస్క్ ఫ్యాక్టర్ అంటూ ఏమీలేదు. ప్రారంభ పెట్టుబడిగా ఆ వెయ్యి కోట్లు కూడా మనం
పెట్టాల్సిన పనిలేదు. మినిస్ట్రీ కావల్సినవాళ్ళు తలో ఇరవై కోట్ట్లు కట్టాలని ఓ
ఎస్సెమ్మెస్ ఇస్తే చాలు. ఎమ్మెల్యేలందరూ ఒక్క గంట
లోపు మన
ఇంటి ముందు క్యూలో నిలబడి డబ్బులు కట్టి వెళతారు. యాభై
మందిని రమ్మంటే, వందమంది ఎగబడి కట్టేస్తారు. ఆ
ఎగస్ట్రా యాభై మందికి మనం డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పనికూడాలేదు. కావాలంటే, తరువాత తీరిగ్గా కార్పొరేషన్ పదవులు ఇచ్చుకోవచ్చు. ఇక మనం
పేమెంటు చేయాల్సింది యాభై మందికి ఐదు వందల కోట్లు మాత్రమే. వ్యాపారం మొదలెట్టిన రోజే పదిహేను వందల కోట్లు లాభం. పేట్టుబడిలేకుండా, వాళ్ళ డబ్బుతో, వాళ్లతోనే వ్యాపారం. అదీ
దీని లాజిక్కు".
"ఈ ప్రాజెక్టు విస్తరణ కూడా చాలా సులభం. సేమ్ టూ
సేమ్ ఫార్మూలాను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయవచ్చు. మనకు గనుక ఓ
యాభై అరవై వేల
కోట్ల రూపాయలు మొబిలైజ్ చేసే అవకాశమే గనుక వుంటే, ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే ఏర్పాటు చేయవచ్చు"
"ఒక్క ముక్కలో చెప్పాలంటే, పాలిటిక్సును మించిన ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ
గ్లోబులో ఎక్కడాలేదు"
డబల్ జీరో ప్రాజెక్టు రిపోర్టు చదివి అంతటి నాయుడు కూడా బిత్తరపోయాడు. వ్యాపారంలో అందరికీ మెగాబైట్లే తెలిసిన రోజుల్లో నాయుడు గిగాబైట్లతో ఎంటరయ్యాడు. నాయుడ్ని అందుకోవడం అప్పట్లో ఎవరికీ సాధ్యం కాలేదు. ఈ మైనింగ్ మాఫియాలు ఏకంగా టెట్రాబైట్లు, పెటాబైట్లతో ఎంటరయ్యాయి. వాళ్ళను అర్ధంచేసుకోవడం నాయుడికే సాద్యంకాలేదు. ఆరోజే నాయుడు మొదటిసారి భయపడ్డాడు.
సరిగ్గా ఈ
రోజుల్లోనే నాయుడుకు మరో
షాక్ తగిలింది. నాయుడి ఆశీస్సులతో సీయం సీట్లో కొనసాగుతున్న ప్రసన్న కుమార్ కొంచెం తల ఎగరేశాడు.
అదెలా జరిగిందంటే, ఆ మధ్య శీతాకాలం విడిదికి రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. మర్యాద పూర్వకంగా ఆయన్ను కలవడానికి ముఖ్యమంత్రితో పాటూ, నాయుడూ వెళ్ళాడు.
”రాష్ట్ర రాజకీయాల్లో బాగుందికదయ్యా! మళ్ళీ నీకు జాతీయ రాజకీయాలు దేనికీ?” అని అడిగారు ముఖ్యమంత్రిని రాష్ట్రపతి.
కేంద్రంలో చక్రం తిప్పాలని ప్రసన్నకుమార్ కలలు కంటున్నట్టు నాయుడికి అప్పటిదాక తెలీదు. ”నాయుడుగారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాను. వారి ఆశీస్సులుంటే ప్రధాని కూడా అవుతాను” అని ...ప్రసన్నకుమార్ అంటాడని నాయుడు అనుకున్నాడు.
అప్పుడు ”ఈపని చేసిపెట్టినోడ్ని. నువ్వు నోరు విప్పి అడిగితే ఆ
పని మాత్రం చేసిపెట్టనా?” అని తను
చెప్పాలని నాయుడు నెక్ట్స్ డైలాగ్ కూడా సిద్ధంగా పెట్టుకున్నాడు. కానీ, అలా
జరుగలేదు.
”ముఖ్యమంత్రి అవుతానని మాత్రం అప్పుడు అనుకున్నానా? అయ్యాను. ఇది కూడా అంతే. ప్రధాని కాకూడదని ఏముందీ? అవుతానేమో!”అన్నాడు ప్రసన్న కుమార్ చాలా ధీమాగా.
ఎవరైనా తనను గుర్తించకపోతే నాయుడు భరించలేదు. ముఖ్యమంత్రి ఇలా స్వతంత్రం ప్రకటించుకుంటాడని నాయుడు అసలే అనుకోలేదు. ఆ రాత్రి నాయుడు పడుకోలేదు. అతనికి నిద్రపట్టలేదు.
చిన్నప్పుడైతే, నచ్చని విషయాల గురించి నాయుడు అస్సలు ఆలోచించే వాడేకాదు. పెద్దాయ్యాక నచ్చని విషయాల గురించే ఎక్కువగా ఆలోచించడం మొదలెట్టాడు. అలా ఆలోచించినపుడు అతనికి రాత్రుళ్లు నిద్రపట్టేదికాదు. నిద్రపట్టనుపుడు అతని ఆరోగ్యం దెబ్బతినేది.
డబ్బులు వచ్చినా, జబ్బులు వచ్చినా కట్టగట్టుకునే వస్తాయి. నాయుడికి ముందు డబ్బులు వచ్చాయి. వాటి వెనుక జబ్బులు వచ్చాయి.
మనం కారో, స్కూటరో కొన్నప్పుడు కంపెనీవాళ్ళు ఒక
వారంటీ కార్డు ఇస్తారు. ”ఐదేళ్లు లేదా 60 వేల
కిలోమీటర్లు.... వీటిల్లో ఏది
ముందయితే అది” అని
పూచీ పడతారు. మనిషి జన్మ కూడా అంతే. ప్రతిమనిషికి దేవుడు నిండా నూరేళ్ళ వారంటి ఇస్తాడు. అయితే, మనం మన
శరీరాన్నీ, అందులోని అవయవాల్ని వాడుకునేదాన్ని బట్టి మన
జీవితకాలం వుంటుంది. మనం
మన అవయవాల్ని ఎక్కువగా వాడేస్తే వారంటీ కాలం తగ్గిపోతుంది. పొదుపుగా వాడితే వారంటీ కాలం పెరుగుతుంది. అలాగని,
అస్సలు వాడకపోయినా అవయవాలు పనిచేయవు. అదీ విషయం.
ఆస్తి యావలో పడిపోయి నాయుడు కొన్ని అవయవాల్ని అతిగా వాడేశాడు. కొన్ని అవయవాల్ని అస్సలే వాడలేదు. అతిగా వాడిన అవయవాలు అరిగిపోయి పనికిరాకుండాపోయాయి. బొత్తిగా వాడని అవయవాలు పనిలేక పాడైపోయాయి. వెరసి నాయుడు ఆసుపత్రి బెడ్డెక్కాడు. ఆ తరువాత కోమాలోకి పోయాడు.
అంతటి లెజెండ్ ఏదీ చెప్పాపెట్టకుండా కోమాలోకి పోవడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ముఖ్యమంత్రి,
రాష్ట్ర కేబినెట్టేగాక, ఇద్దరు ముగ్గురు కేంద్ర మంత్రులు, సినిమా హీరోలు, యూనివర్శిటీ స్కాలర్లు, కొడుకులు, బంధువులు, గ్రూపు కంపెనీల సిబ్బంది, అభిమానులు అందరూ హాస్పిటల్ కాంప్లెక్స్‌లోనే మకాం వేశారు. మీడియావాళ్ళు సరేసరి. రీజినల్, నేషనల్ టీవీ ఛానళ్ళ వాళ్ళు ఓ
పాతిక డిఎస్
ఎన్‌జీలు పెట్టుకుని రాత్రింబవళ్ళు కాపలాకాశారు.
అందరిదీ ఒకటే కసి. నాయుడు స్పృహలోనికి వచ్చే దృశ్యాన్ని అందరికన్నా ముందు ప్రపంచానికి చూపెట్టాలని. ”ఎక్స్ క్లూజివ్" అని వాటర్ మార్క్ వేసి కథనం నడపాలని. టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవాలని. ఈ
విద్యను వాళ్ళు మునుపు నాయుడు దగ్గరే నేర్చుకున్నారు.
నాయుడు కళ్ళు తెరిచే ఆ శుభఘడియ రానే వచ్చింది. వారం రోజుల కోమా తరువాత, టీవీ లైవ్ కెమేరాల సాక్షిగా నాయుడు కళ్ళు తెరిచాడు. ఏం మాట్లాడుతాడోనని హాస్పటల్లో జనం, దేశంలో టీవీల ముందు ప్రేక్షకులు చెవులు రెక్కించి, కళ్ళార్పకుండా చూశారు. జీవిత పరమార్ధాన్ని కనుగొన్న జ్ఞానిలా నాయుడు ప్రశాంతంగా వున్నాడు. ముఖం తేటగా వుంది. వెలుగులు విరజిమ్ముతోంది. పెదాలు నెమ్మదిగా కదిలాయి. శక్తినంతా కూడదీసుకుని రెండే రెండు మాటలన్నాడు.
"డకోట, కటార"
అలా అంటున్నప్పుడు నాయుడి ముఖం మీద చిరునవ్వు వికసించింది. ఆ చిరువ్వు నవ్వుగా మారింది. ఆ
నవ్వు ఇంకా పెద్దదయింది. కేసి నాయుడు అంతగా నవ్వగా ఈ తరంవాళ్ళు ఎప్పుడూ చూళ్ళేదు. కళ్ళముందు ఏదో
స్వర్గం కనిపిస్తున్నట్టు నాయుడు తన్మయంతో కళ్ళు పెద్దవి చేశాడు. సరిగ్గా అప్పుడే అతని శరీరానికి వారంటీ అయిపోయింది. కళ్ళు తెరిచే, కన్నుమూశాడు నాయుడు.
నాయుడి చివరి పలుకుల్ని లైవ్ టెలీకాస్ట్‌లో దేశప్రజలంతా చూశారు. ఇక ఆ క్షణం నుండి రాష్ట్రమంతా ఒకటే చర్చ మొదలైంది. ఆ
తరువాత దేశమంతా, అదే
చర్చ "నాయుడి చివరి పలుకుల అర్ధం ఏమిటనీ?". కొన్ని
టివీ ఛానళ్ళు ” డకోట, కటార” పదాలకు అర్ధం తెలుసుకోవడానికి క్విజ్ ప్రోగ్రామ్స్ కూడా మొదలెట్టాయి.
మధ్యప్రదేశ్లో
కటారా అని పర్వత శ్రేణులున్నాయి. కాశ్మీర్ లోయలో కటార అని ఓ
గ్రామం వుంది. ఆయన
అక్కడికి వెళ్ళాలనుకున్నాడా? అంటూ ఓ
చర్చ మొదలైంది. అయితే, అంత పెద్ద మనిషికి అంత చిన్న చివరి కోరికలు వుండవని కొందరు కొట్టిపడేశారు.
భూమ్యాకాశాల్లో దేన్నయినా కొనగల సమర్ధుడు కనుక ఆ కొండల్ని, లోయల్నీ కొనాలనుకున్నాడా? అని మరి
కొందరు అనుమానంగా అన్నారు. అమెరికాలో డకోటా అని
ఓ రాష్ట్రం వుంది. పూర్వం అక్కడ డకోటా, లకోటా జాతి రెడ్ ఇండియన్లు వుండేవారు. వాళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకున్నాడా? అని మరో
అనుమానం ముందుకు వచ్చింది. ఎలాగూ ఇప్పుడు అమెరికా ఆర్ధిక ఇబ్బందుల్లో వుంది కనుక నాయుడు ఏకంగా డకోటా రాష్ట్రాన్నే కొనేయ్యాలనుకున్నాడా? అని
మరి కొందరు ఊహాగానాలు చేశారు.
రెండో ప్రపంచ యుద్దంలో డకోటా విమానాల్ని వాడారు. వాటి గురించి నాయుడు ఏమైనా చెప్పదలుచుకున్నాడా? అనేది ఇంకో అనుమానం. రాబోయే, మూడవ ప్రపంచ యుధ్దం గురించి అతనికి కొన్ని అభిప్రాయాలు వుండవచ్చని విశ్వవిద్యాలయాల్లో రీసెర్చిస్కాలర్లు కొన్ని శాస్త్రీయ సందేహాలు లేవనెత్తారు.
ఖతర్ దేశాన్ని కూడా ఒకప్పుడు కటార
అనేవారు. తొలి నాగరీకత వెలసిల్లిన మెసోపోటామియా ప్రాంతంలో కూడా పూర్వం కటార అనే ఒక గ్రామం వుండేది. చివరి రోజుల్లో నాయుడి మనస్సు మానవ నాగరీకత మీద పోయిందని కొందరు ప్రతిపాదించారు.
ఎంతమంది ఎన్నిరకాలుగా మేధోమధనం జరిపినా ”డకోట. కటార” పదాలకు నమ్మకంగా అర్ధం చెప్పగలిగినవాళ్ళు మాత్రం ఒక్కరూ కనిపించలేదు. ఈ లోపు, నాయుడి పెదకర్మ రానేవచ్చింది.
నాయుడి పెదకర్మకు రాష్ట్రమంతా తరలివచ్చింది. అతని స్వంత ఊరి నించి చిన్ననాటి స్నేహితులు కూడా వచ్చారు. అక్కడా "డకోట, కటార" గురించే చర్చ సాగింది.
”మా చిట్టిగాడు దాన్ని మర్చిపోలేదన్నమాటా? అని నాయుడి బాల్య మిత్రుడొకడు ఆశ్చర్చపోయాడు.
ఆ మాట
వినగానే పెదకర్మ పందిట్లో కలకలం బయలు దేరింది. జనం భోజనాలు మానేసి అతని చూట్టూ చేరారు. అప్పడు ఆ బాల్యమిత్రుడు అందరికీ ఒక బాలమిత్ర కథ
చెప్పాడు.
ఆ కథ
ప్రకారం ... నాయుడిది కృష్ణజిల్లా. బెజవాడకు పదిహేనుమైళ్ళ దూరంలో కృష్ణానది వొడ్డునే వుంది వాళ్ళ ఊరు. నాయుడి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. వాళ్ళ అమ్మ పాలు అమ్మేది. నాయుడు పాల క్యాను పట్టుకుని, పాత సైకిల్ మీద
రోజూ విజయవాడ వెళ్ళి పాలు పోసివచ్చేవాడు.
”కృష్ణా గట్టు వెంబడి సైకిల్
తొక్కేటప్పుడు వీచే జోరుగాలికన్నా మా
చిట్టిగాడే జోరుగా వుండేవాడు. హుషారుగా ఈల వేసేవాడు. పాటలు పాడేవాడు. చుట్టుపక్కల ఎవరూ వుండరుగా ... వాడిలోవాడే
ఏంటేంటో మాట్లాడుకునేవాడు. వుండుండి గట్టిగా నవ్వుకునేవాడు. మేమే అప్పడప్పుడు వాడ్ని ఆటపట్టించేవాళ్ళం. ఆ
డకోటా సైకిల్కే
ఇంత బడాయా? ఆ కటారాను చూసుకుని మరీ మురిసిపోమాకా అనే
వాళ్ళం. వాడు నవ్వేసే వాడు. ఏమాటకామాటే చెప్పుకోవాలి వాడి నవ్వు చాలా బాగుండేది.” అన్నాడు బాల్యమిత్రుడు.
”దేవుడి ఇఛ్ఛ ఏంటోగానీ, వాడు ఇంత
సంపాదించాడా? ఆ కటారా సైకిల్ పై తిరిగే రోజుల్లోనే వాడు ఎప్పుడూ నవ్వుతూ వుండేవాడు. అప్పట్లాగా అంత మనసిప్పి నవ్వగా ఆతరువాత ఎప్పుడూ
చూడలేదు వాడ్ని. వాడికి ఆ సైకిలంటే ప్రాణం. దానిమీద కృష్ణగట్టు వెంబడి గాలికి ఎదురుగా పోవడం ఇంకా ఇష్టం. అదే
వాడి స్వర్గం” అంటూ ప్లాష్ బ్యాక్ ముగించాడు బాల్యమిత్రుడు.
నాయుడి ఫ్లాష్ బ్యాక్‌లో, ఆ
చివరి పదం విన్నాక, చివరి క్షణాల్లో నాయుడి ముఖం అంతలా ఎందుకు వెలిగిపోయిందో ఇప్పడు అందరికీ అర్ధం అయిపోయింది. నాయుడి స్వర్గం కూడా అందరికీ స్పష్టంగా కనిపించింది.
”ఆ డకోటా సైకిల్ ఇంకా
ఎక్కడో వాడి ఇంట్లోనే వుంటుంది” అన్నడా బాల్య మిత్రుడు.
నిజమే. ఆ
డకోటా సైకిల్ నాయుడి ఇంట్లోనే వుండేది. నాయుడు చనిపోయిన రోజు కూడా ఆ కటారా ఆ
యింట్లోనే వుంది. నాయుడి పెదకర్మ కోసం ఇంటికి ఏషియన్ బ్రాండు లప్పం పేయింటు వేశారు. అప్పడు ఇంట్లోని పాతసామన్లతోపాటూ, తుప్పుపట్టిన ఆ
కటారా సైకిల్ను
కూడా బయట పడేశారు పనోళ్ళు.
ఇప్పుడు ఆ
డకోటా కోసం మనం
వెతికినా ప్రయోజనం లేదు. ఈ పాటికి ఏ
ఫర్నేస్‌లోనో కరిగి ముద్దయిపోయి వుంటుంది ... ఆ
కటారా.
హైదరాబాద్
రాసింది 29 నవంబరు 2010
సవరణ 5 డిసెంబరు 2010.
ప్రచురణ : ఢీ
వారపత్రిక, విజయవాడ, మార్చి, 2012
కథ చాలా బాగుందండి
ReplyDeletechaalaa thanks andi.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletekula pettubadidaarula meeda ilaanti kathalu AP lo enduku raavadam ledo? Dany gaari kalam nunchi ilaanti samakaaleena raajakiyardhika kathalu enno raavalani manasphoorthiga korukontunnanu
ReplyDeleteThank you for the comment. Please let me know your details.
DeleteSIR CHALA BAGUDE
ReplyDeleteమీ కథల్లో శైలి అద్భుతంగా ఉంటది.
ReplyDeletesomaraju chaitanya garu dhanyavaadaalu
ReplyDeletevenkataramana maramraju garu! thank you.
ReplyDeleteGood story and contemporary scenario is well presented. Barring a wishful poetic justice of simplicity as the resolution, the story stands for reflective of reality. Have you seen the film Citizen Kane?
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteUMAMAHESWARA RAO C
ReplyDeleteThank you for your positive comment.
I do have watched the 1941 movie Citizen Kane of Orson Welles. My story certainly has some similarities in its climax. But I draw the ‘concept of artificial heaven’ from the episode called “Shaddad’s Heaven” from Islamic literature and 1001 (Arabian) Nights. It is a very popular story among Muslim community.
It is my endeavor to add ‘folk element’ to my writings to attain rather epic
ఈ కథ సజీవమయ్యింది. మళ్ళీ పదేళ్ల తర్వాత చదివినా బాగానే ఉంటుంది.ఎప్పుడూ పాతవి మార్చి కొత్తవి కొంటాం.process of recycling goes on..It is interesting simple story with shades of contemporary political scene..ఇటువంటి వాటిల్లో పంచ తంత్ర కథలకుండే బిగింపు ఉండాలి. కథ చెప్పిన తీరులో గోప్ప ఉత్కంఠ లేదు
ReplyDeleteThank you for reading my story and offering suggestions.
Deleteకథ resolution లో surprise element కోసం ప్రయత్నించాను. Set up లోనే surprise element వుంటే ఇంకా బాగుండేదేమో అని మీ comment చదివేక అనిపించింది.
Delete‘కటార’ కథను ఇప్పుడు ఇంకోసారి చదవండి
ReplyDeleteవైయస్ జగన్ 2011 నవంబరు చివర్లో కాంగ్రెస్ నుండి బయటికి వచ్చి కొత్త పార్టీని ప్రకటించారు. వారు కాంగ్రెస్ ను మింగేస్తారని అప్పట్లో చాలా ఊహాగానాలు సాగాయి. కాంగ్రెస్ నే కాకుండా హైటెక్ చంద్రబాబు సైకిల్ ను కూడా జగన్ ఫర్నేస్ లో పడేస్తారని నాకు ఎందుకో అనిపించింది. అలా పుట్టింది నా ‘కటార’ కథ.
వాస్తవ రాజకీయ సంఘటనల్నే స్వీకరించి నాదైన శైలిలో చెప్పడం నాకు ఇష్టం. వీలయితే కొంత ఫోక్ ఎలిమెంట్ ను జోడించి చెప్పడం ఇంకా ఇష్టం. దాన్ని ఒక పరిమితిలో మేజికల్ రియలిజం అన్నా అనొచ్చు.
సృష్టికి ప్రతిసృష్టిగా ఒక కుత్రిమ స్వర్గాన్ని నిర్మించుకున్న షద్దాద్ అందులో ప్రవేశించకుండానే చనిపోయాడానే కథ ఒకటి ఇస్లామిక్ సాహిత్యంలో చాలా ప్రతీతి. ఆ ప్రభావమూ ఈ కథ శైలిలో వుంది.
మరొక్కసారి ‘కటార’ చదివి మీ అభిపొరాయాలని తెలుపండి.
Shadad's Heaven /Hell and the Angel of Death
ReplyDeletehttp://www.ummah.com/forum/showthread.php?48412-Shadad-s-Heaven-Hell-and-the-Angel-of-Death
The Story of Hud (as) and Shaddad's Heaven on Earth part 1
https://www.youtube.com/watch?v=vOXmEsWgShA
Shaddad and his Paradise, those who had very long life-spans
https://www.al-islam.org/kamaaluddin-wa-tamaamun-nima-vol-2-shaykh-saduq/chapter-54-shaddad-and-his-paradise-those-who-had
కటార
ReplyDeleteఒక Dystopian కథ
Utopian Dystopian
పదాలకు తెలుగులో మంచి అనువాదం ఏమిటీ?
కాల్పానిక ఆదర్శసమాజం, ఆవాంచనీయ సమాజం అనొచ్చా?