Muslim Affirmation -
Social Justice Courts
ముస్లీం
రిజర్వేషన్లు :
సామాజిక న్యాయస్థానాలు కావాలి
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
ఆంధ్రప్రదేశ్ ముస్లిం
రిజర్వేషన్చట్టం - 2007ను కొట్టివేస్తూ
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం (2010) ఫిబ్రవరి 8న తీర్పు చెప్పింది. ముస్లిం రిజర్వేషన్చట్టాన్ని
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడం
ఇది ముచ్చటగా మూడోసారి. ఇందులో, విచిత్రమూ, ఆశ్చర్యకరమూ
ఏమీలేవుగానీ, కాలం చెల్లిన ధర్మపన్నాలతో న్యాయమూర్తులు
ఇచ్చిన తీర్పు న్యాయస్థానాల సాంప్రదాయ విశ్వసనీయతని మసకబార్చేటట్టుగా వుండడమే
కొత్త పరిణామం.
ఆంధ్రప్రదేశ్ ముస్లిం
రిజర్వేషన్ చట్టం - 2007 ను కొట్టివేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విస్తృత
ధర్మాసనం ఏడు ప్రధాన కారణాలను పేర్కొంది.
అవి :
1.
మతప్రాతిపదికన రిజర్వేషన్లు
చెల్లవు.
2.
ముస్లిం రిజర్వేషన్లు
మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తాయి.
3.
చట్టాన్ని దుర్వినియోగం చేసే
అవకాశముంది.
4.
ముస్లిం సమాజంలో కులాలను
సరిగ్గా నిర్వచించలేకపోయారు.
5.
ఇతర మతాల దరఖాస్తుల్ని
పక్కనపెట్టి, ముస్లింల దరఖాస్తుల్నే పరిష్కరించారు.
6.
బీ.సీ. కమీషన్ నిర్వహించిన సర్వే అసమగ్రంగావుంది.
7.
రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లింలకు
రిజర్వేషన్లు ఇచ్చారు.
కేసు కొట్టివేయడానికి
హైకోర్టు ఇప్పుడు చూపిన కారణాల్లో ఒక్కటీ కొత్తదికాదు. ముస్లిం
ఆలోచనాపరులు, పౌరహక్కుల సంఘాలవాళ్ళేకాక, హిందూ ఉదారదులు సహితం ఇలాంటి సాకుల్ని పదేపదే ఖండిస్తూనే వున్నారు.
ఆధునిక సమాజంలో ఉద్దీపన చర్యలకు
విస్తృతంగా పెరుగుతున్న
ఆమోదాంశాన్ని చూడడానికి ’ధర్మదేవత’ కు నిజంగానే కళ్ళులేవు!. మనతరం దురదృష్టం ఏమంటే
సమాజం మరింత ఉదారంగా మారాల్సిన సమయంలో, మారుతున్న సమయంలో,
న్యాయస్థానాలు ఛాందసంగా మారుతున్నాయి.
గతంలో అనేక మంది
అనేకసార్లు, అనేక విధాల వివరించిన అంశాలే అయినప్పటికీ,
మళ్ళీమళ్ళీ ముందుకువస్తున్న పాతసాకులకు కొత్త వివరణలు ఇవ్వక
తప్పడంలేదు.
1. మతప్రాతిపదికన రిజర్వేషన్లు
చెల్లవు!
మతప్రాతిపదికన
రిజర్వేషన్లు చెల్లవు అన్నమాట వినంగానే మధ్యతరగతివర్గాలకు ఆ వాదన సమంజసమే
అనిపిస్తుంది. చాలామంది సమయానుకూలంగా మరిచిపోతున్న వాస్తవం
ఏమంటే, భారతదేశంలో, రాజ్యాంగం ద్వార
రిజర్వేషన్ల ప్రక్రియ మతప్రాతిపదికనే
ఆరంభమైంది.
1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వార ‘హిందూ దళితుల’కు ఎస్సీ హోదా కల్పించారు. రిజర్వేషన్ల తొలి అడుగే హిందూ మతప్రాతిపదికన ఆరంభమైందని ఇప్పుడు కొత్తగా
చెప్పాల్సిన పనిలేదు. ఆ తరువాత ‘శిక్కు
దళితులకు’, ‘బౌధ్ధ దళితులకు’ ఎస్సీ
హోదా కల్పించారు. అంచేత, మలి అడుగు,
ఆతరువాతి అడుగులు కూడా మతప్రాతిపదికనే సాగాయి. ఆ తరువాతి కాలంలో
క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు
ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.
Ms. No. 5, SW Dept., Dt. 24.1.1981 ద్వార క్రైస్తవ దళితులకు బీసీ-సి రిజర్వేషన్ ఇచ్చారు. ఆ
సందర్భంగా క్రైస్తవ దళిత సమూహాన్ని Scheduled Castes
converts to Christianity and their progeny అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఇవన్నీ మతప్రాతిపదికన చేపట్టిన ఉద్దీపన చర్యలే.
అయినప్పయికీ ముస్లిం దళితులకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి ఇప్పటికీ అడ్దంకులు తొలగలేదు.
రాజ్యాంగం
అమలులోనికి వచ్చిన తరువాత రాజకీయ పోరాటాల ఫలితంగా, 1951లో భారత
రాజ్యాంగానికి తొలి సవరణగా వెనుకబడిన తరగతులకు వచ్చిన
రిజర్వేషన్ల అమలు కూడా క్రమంగా మత ప్రాతిపదికను సంతరించుకున్నాయి. వెనుకబడిన
తరగతుల కోసం ఉద్దేశించిన ఉద్దీపన చర్యలు, ఆచరణలో, హిందూ
వెనుకబడిన కులాల స్వంత ఆస్తిగా మారిపోయాయి. ’కులం’ అనేది మత ప్రత్యయం అనీ, ’తరగతి’ అనేది రాజ్యాంగ ప్రత్యయం అని ఇప్పుడు న్య్సాయమూర్తులతోసహా అందరూ మరిచిపోయినట్టు ప్రవర్తిస్తున్నారు.
కొందరైతే, ఒక అడుగు ముందుకేసి, ”వెనుకబడిన తరగతులు’ అంటే ”హిందూ వెనుకబడిన కులాలే” అని గడుసుగా, వాదిస్తున్నారు. వాస్తవాలు
ఇలా వుండగా మతప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని ఉన్నత న్యాయస్థానాలు
పేర్కోవడాన్ని ముస్లిం సమాజం ఎలా అర్ధం
చేసుకోవాలి?
అంతకన్నా ప్రాణప్రదమైన సైధ్ధాంతిక మర్మం ఒకటుంది. ఒక సామాజికవర్గానికి
మతప్రాతిపదికపై ఉద్దీపన చర్యలు చేపట్టడం, ఒకవేళ, మతాతీత లౌకిక ప్రమాణమే అయితే,
ఒక సామాజిక వర్గానికి మతప్రాతిపదికపై ఉద్దీపన చర్యల్ని
నిరాకరించడం కూడా మతాతీత లౌకిక ప్రమాణాలకు
వ్యతిరేకమే అవుతుంది. నిజానికి, ఇప్పుడు
ఉద్దీపన చర్యల్ని కోరుతున్నది భారత
ముస్లింలు ఆధ్యాత్మికంగా ఆచరిస్తున్న ఇస్లాంకు కాదు; సామాజిక,
ఆర్ధిక, విద్యా, ఉపాధి
రంగాల్లో భారత ముస్లింలు అనుభవిస్తున్న
పేదరికానికి!. ఈపాటి ధర్మసూక్ష్మాన్ని హైకోర్టు ధర్మాసనం
పరికించలేకపోయింది.
2. ముస్లిం రిజర్వేషన్లు
మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తాయి!
విద్యా ఉద్యోగ రంగాల్లో,
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తే మతమార్పిడులు పెరిగిపోతాయనే
అపోహల్ని సంఘ్ పరివారం చాలాకాలంగా
పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నది.
ఇప్పుడు ఈ వాదనకు న్యాయస్థానాలు సహితం వత్తాసు పలకడమే సరికొత్త
విషాదం. భారతదేశంలో కత్తి మొన మీద ఇస్లాం వ్యాప్తిచెందిందని
గతంలో ప్రచారం చేసిన ఈ సంఘపరివారశక్తులే ఇప్పుడు ’కాగితాల
ద్వార’ ఇస్లాం వ్యాప్తి చెందిపోతుందనే కొత్త వాదనని ముందుకు
తెస్తున్నాయి.
ఈ సందర్భంగా, ముస్లిం సమాజపు కూర్పు గురించి రెండు అంశాలు చెప్పాల్సివుంది. ధార్మికంగా, ఇస్లాం, ఒక బహిరంగ మతం. విశ్వాసుల
రాక కోసం ఇస్లాం ద్వారాలు నిరంతరం
తెరిచేవుంటాయి. విశ్వాసం వున్నవాళ్ళు
ముస్లిం సమాజంలోనికి రావచ్చు. విశ్వాసం లేనివాళ్ళు ముస్లిం సమాజాన్ని వదిలేసి పోవచ్చు. మనుషులు రావడానికీ, మనుషులు పోవడానికీ ముస్లిం సమాజంలో
అవకాశం ఎప్పుడూ వుంటుంది. అయితే, ఇక్కడ
వివాదం ధార్మిక పరమైనదికాదు, లౌకికపరమైనది. "రిజర్వేషన్లను అనుభవించడం కోసం
ఇస్లాంను స్వీకరించేవారు ఎవరూ?"
అనే ఒక చిన్న ప్రశ్న చాలు సంఘ్ పరివారం ప్రచారం చేస్తున్న
అపోహలన్నీ పటాపంచలైపోతాయి. .
హిందూ ఆదివాసులు, హిందూ దళితులకు భారతరాజ్యాంగం
ఎస్టీ, ఎస్సీ హోదా ఇచ్చింది. వాళ్ళు
ఇస్లాంను స్వీకరిస్తే ఇప్పుడున్న చట్టాల
ప్రకారం రిజర్వేషన్ సౌకర్యం స్థాయి
తగ్గిపోతుందేగానీ ఎట్టిపరిస్థితుల్లోనూ పెరగదు. క్రైస్తవాన్ని స్వీకరించిన దళితులు ఎస్సీ హోదాను
కోల్పోయి బీసీ-సీ స్థాయికి తగ్గాల్సి వుంటుందని
మనకు తెలుసు. ఇప్పుడు ఎస్టీ,
ఎస్సీ సౌకర్యాలు పొందుతున్నవాళ్ళు మతం మారితే బీసీ-ఇ సౌకర్యాలకు మాత్రమే పరిమితం
కావల్సివుంటుంది. ఒకవేళ, హిందూ
వెనుకబడిన కులాలు ఇస్లాంను స్వీకరించినా వాళ్లకూ అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీలేదు;
సౌకర్యం స్థాయి తగ్గడంతప్ప. ఇప్పటి వరకు బీసీ- ఏ,బీ,,డీ, సౌకర్యాల్ని
పొందుతున్నవాళ్ళు బీసీ-ఇ సౌకర్యాలకు పరిమితం అవ్వాల్సివుంటుంది. అంచేత రిజర్వేషన్ల
ఆకర్షణతో ఆదివాసులు, హిందూ దళితులు, హిందూ నిమ్నకులాలవాళ్ళు ఇస్లాంను స్వీకరించే ప్రసక్తేలేదు.
అంచేత రిజర్వేషన్లు మతమార్పిడిని ప్రోత్సహిస్తాయి అనే అభిప్రాయం నిరాధార్మైనది.
3. చట్టాన్ని దుర్వినియోగం చేసే
అవకాశముంది
మతమార్పిడికి ఆదివాసులు,
హిందూ దళితులు, హిందూ నిమ్నకులాలవాళ్ళ తరువాత ఇక మిగిలింది హిందూ
పెత్తందారీ కులాలు. భారత ముస్లిం సమాజపు సాంస్కృతిక అంతస్తుల
దొంతరలో, పైభాగానవున్న సయ్యద్, సయీద్,
ముషాయిక్, మొఘల్, పఠాన్,
ఇరానీ, అరబ్, బోహ్రా,
షియా, ఇమామి, ఇస్మాయిలీ,
ఖోజా, కచ్చిమేమో, జమాయత్,
నవాయత్ తదితరుల్ని ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ చట్టం -2007 నుండి
మినహాయించారు. అంటే ఈ ఉద్దీపన చర్యలు వాళ్ళకు వర్తించవు. ప్రస్తుతం ముస్లిం సమాజంలో వున్న ‘ఉన్నత కులాల’ వాళ్ళకే వర్తించనపుడు,
ఇక కొత్తగా ఇస్లాంను స్వీకరించే హిందూ పెత్తందారీ కులాలకు
ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ చట్టం - 2007 ఎలా వర్తిస్తుంది?
అంచేత, హిందూ పెత్తందారీ కులాలు వేరే కారణాలతో
మతమార్పిడికి పాల్పడవచ్చేమోగానీ,
రిజర్వేషన్ సౌకర్యం పొందడం కోసం మాత్రం మతమార్పిడికి పాల్పడే
అవకాశం లేనేలేదు. "రేపు ఓ కమ్మ కులస్తుడో, రెడ్డి కులస్తుడో, మెడిసిన్ సీటు కోసమో, ఇంజినీరింగు సీటుకోసమో
ఇస్లాంను స్వీకరించి, తాను గారడీ సాయిబుననో, తురక బుడముక్కిననో, ముస్లిం గోసంగీననో ప్రకటించుకుంటే
అప్పుడు పరిస్థితి ఏమిటీ?" అని కొందరు గడుసుగా
ప్రశ్నించవచ్చు. అలాంటివాళ్ళు నూటికి ఒక్కరుకాదు, కోటికి ఒక్కరైనా వుంటారా? అన్నది అంతకన్నా సహేతుకమైన
ప్రశ్న!
హిందూయేతరులు ఎవరైనా
ఇష్టపడి హిందూమతాన్ని కూడా స్వీకరించవచ్చు. హిందూ
సాంప్రదాయాల్నీ, కర్మకాండను కూడా పాటించవచ్చు. కానీ, అలా మతం మారినవాళ్ళు, ఉద్యోగం
కోసమో, వృత్తివిద్యా కోర్సులో సీటు కోసమో తాను కోయ, గోండు అని గానీ,
మాల, మాదిగ అనిగానీ, కుర్మ,
మంగలి అనిగానీ అధికారికంగా ప్రకటించుకోవడం సాధ్యమా? ఇంత చిన్న ధార్మికబసూత్రాన్ని న్యాయస్థాన ధర్మాసనాలు ఎలా విస్మరించాయో అర్ధంకాదు.
పదేళ్ళక్రితం, ఓ రాజకీయ నాయకుడు తాను ఎస్టీ అని
చెప్పుకుని, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం నుండి లోక్ సభకు
ఎన్నికయ్యాడు. ఐదేళ్ళు
పదవీకాలం ముగిసిన తరువాత అతను అసలు ఎస్టీ కాదని తేలింది. చట్టాన్ని
దుర్వినియోగం చేసినందుకు అతనిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు
తీర్పుచెప్పాయి. అంతేతప్ప, దుర్వినియోగం
చేసే అవకాశం వుందనే సాకుతో, మొత్తం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల చట్టాన్నే కొట్టివేయాలని తీర్పు ఇవ్వలేదు. చట్టాల్ని అమలుచేయడానికీ, వాటి దుర్వినియోగాన్ని
నిరోధించడానికీ, దుర్వినియోగం చేసేవాళ్ళని శిక్షించడానికీ
ప్రభుత్వ యంత్రాంగంలో ప్రత్యేక నియంత్రణా విభాగం ఎలాగూ వుంటుంది.
ప్రతి చట్టంలోనూ కొన్ని
లోపాలుంటాయి. దుర్వినియోగం చేయడానికి ఆస్కారమేలేని చట్టం
ఇంతవరకు ఈ భూమి మీద పుట్టనేలేదంటే అతిశయోక్తికాదు. ఇతర
చట్టాలతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ చట్టం -
2007 దుర్వినియోగం
అయ్యే అవకాశాలు చాలాచాలాచాలా తక్కువ.
సామాజిక అవసరాల
నేపథ్యంలోనే చట్టాలన్నీ రూపుదిద్దుకుంటాయి. అందువల్ల,
చట్టాలు చేసే సమయంలో వాటిని తీసుకురావాల్సిన చారిత్రక అవసరాన్ని
కల్పించిన సామాజిక సమస్యల పరిష్కారానికే
అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశాలను కనిపెట్టి, వాటి
నివారణకు కొన్ని పరిమితులు, షరతులు పెట్టే అవకాశం ఎలాగూ
వుంటుంది. అంతేతప్ప, ఒక పీడిత సమూహపు అభ్యున్నతి కోసం
చేపట్టిన
న్యాయమైన ఉద్దీపన చర్యల్ని దుర్వినియోగం
అవుతాయనే సాకుతో న్యాయస్థానాలు
కొట్టివేయడం మొదలుపెడితే, ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ చట్టం-2007కు పూర్వం వచ్చిన వేలవేల చట్టాలను, దానికన్నా ముందే` కొట్టివేయాల్సి
వుంటుంది. న్యాయస్థానాలు న్యాయాన్ని నిజంగానే అంత ఖచ్చితంగా
పాటించాలనుకుంటున్నాయా? కేవలం ముస్లిం సమాజం కోసమేనా ఈ ఆంక్షలు?
అన్నింటికన్నా ప్రాధమిక
ప్రశ్న ఒకటుంది. హిందూత్వేమే ఏకైక ఎజెండాగా వున్న సంఘ్
పరివార శక్తులకు మతమార్పిడుల అంశం రాజకీయంగా ఒక మేత లాంటిది. భారతదేశంలో హిందూయేతరుల జనాభా
ప్రమాదకరంగా పెరిగిపోతున్నదని అపోహల్ని ప్రచారంచేసి, హిందూ
ఓటు బ్యాంకును కొల్లగొట్టి, అధికారాన్ని చేపట్టడానికి
ప్రయత్నించడం సంఘ్ పరివార్ శక్తుల ప్రధాన కార్యకలాపం. కానీ, రాజ్యాంగాన్ని
అమలుపర్చాల్సిన న్యాయస్థానాలు సహితం
మతమార్పిడుల్ని అభ్యంతరకర వ్యవహారంగా పేర్కొనడం సరికొత్త పరిణామం. రాజ్యాంగంలోని 19వ అధీకరణ భారత పౌరులకు మతస్వేచ్చను ప్రసాదించిందని ధర్మాసనం మరిచి పోయినట్టుంది. సాక్షాత్తు
భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మూడు లక్షల 65 వేలమంది సహచరులు అనుచరులతో
1956లో ఒక పౌరహక్కుగా బౌధ్ధమతాన్ని స్వీకరించారన్న అంశాన్ని కూడా ధర్మాసనంలోని న్యాయమూర్తులు
కన్వీనియంటుగా మరచిపోయినట్టున్నారు. భారత రాజ్యాంగాన్ని
అంచెలవారీగా ఓడిస్తున్నదెవరూ?
4. ముస్లిం సమాజంలో కులాలను
సరిగ్గా నిర్వచించలేకపోయారు.
భారత గడ్ద మీద కులం లేని మతం వుండదు. అయితే మత సమూహాలన్నింటిలోనూ కులం ఒకేలా వుండదు.
వైవిధ్యాలు ప్రత్యేకతలు వుంటాయి. హిందూమతంలోని కులవ్యవస్థను మాత్రమే ప్రమాణికంగా భావించేవారికి
ముస్లిం సమాజంలోని కులాలు కులాలుగా కనిపించవు.
మనుషుల్ని అసమానులుగా తానే సృష్టించానని
సాక్షాత్తు దేవుడే చెప్పాడనే మతాలున్నాయి. దేవుని ముందు
మనుషులందరూ సమానులనే మతాలూ వున్నాయి. దేవుని ముందేకాదు;
సమాజంలోని ప్రతి వ్యక్తీ; మరో వ్యక్తి ముందు
సమానుడేనని ఇస్లాం అంటుంది. ఈ సర్వసమానత్వ సూత్రమే ముస్లిం
సమాజంలో సౌభ్రాతృత్వానికి పునాదిగా కొనసాగుతోంది..
ప్రతి మతానికీ ఆధ్యాత్మిక
సిధ్ధాంతం (డాక్టరిన్), కర్మకాండా, ఆచార వ్యవహారాలు (రిచువల్స్) వుంటాయి.
ముస్లిం సమాజం దీనికి మినహాయింపుకాదు. అధ్యాత్మికంగా
ఇస్లాం అంతర్గత వివక్షకు వ్యతిరేకమే అయినప్పటికీ, భారతీయ
ముస్లిం సమాజం ఏకశిలా సదృశ్యమేమీకాదు. హిందూసమాజంలోని
అంతర్గత అణిచివేత కారణంగా భారత ఉపఖండంలోని ఆదివాసులు, పంచములు,
శూద్రులు పెద్ద ఎత్తున ఇస్లాంను స్వీకరించారు. హిందూ సమాజంలోని పెత్తందారీ కులాలకు చెందిన వారు, అగ్రవర్ణాలకు చెందినవారు
సహితం ఇస్లాం ను స్వీకరించిన సందర్భాలున్నాయి. ఫలితంగా భారతీయ ముస్లిం
సమాజం ఆచరణలో కులవ్యవస్థతోసహా దాదాపు హిందూ సమాజానికి నకలుగా తయారైంది.
ఆ మేరకు భారతీయ ముస్లిం
సమాజంలో ప్రథానంగా మూడు అంతస్తులు ఏర్పడ్డాయి. అవే, అర్జాల్, అజ్లాఫ్, అష్రాఫ్, భారత రాజ్యాంగాన్ని
అక్షరబధ్ధంగాగాక స్ఫూర్తిబధ్ధంగా అర్థం చేసుకుంటే అర్జాల్ వర్గాలను యస్టీలుగానూ,
అజ్లాఫ్ వర్గాలను యస్సీలుగానూ పరిగణించి తగిన రిజర్వేషన్ సౌకర్యం
కల్పించాలి. అందుకు
వాళ్ళు అన్ని విధాలా అర్హులు. నిజానికి వాళ్ళు ఆయా వర్గాల
నుండి ఇస్లాంను స్వీకరించడమేకాదు; ఇప్పటికీ ఆయా
వర్గాలతోనే సన్నిహితంగా వుంటున్నారు.
(ఇక్కడ పాఠకులు ఒకందుకు ఈ వ్యాసకర్తను క్షమించాలి. అష్రాఫ్ వర్గానికి చెందిన ఈ వ్యాసకర్తకు, ఈ పేర్లను
అర్జాల్, అజ్లాఫ్ వర్గాల్లో ఆమోదం వుందోలేదో తెలీదు. )
భారతీయ ముస్లిం సమాజానికి,
హిందూ సమాజంతో ఇన్నిరకాల
పోలికలున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
భారత ముస్లిం సమాజంలో కొనసాగుతున్న మూడు అంతస్తుల మధ్య కంచంపొత్తు
వున్నప్పటికీ, మంచం పొత్తు అనేది ఇప్పటికీ అరుదైన వ్యవహారమే. ఆమేరకు అది, హిందూ సమాజ లక్షణమే. అయితే, విడిగా అష్రాఫుల మధ్య కంచంపొత్తుతో పాటూ మంచం పొత్తు కూడావుంది.
ఆమేరకు, అది హిందూ సమాజంకన్నా పూర్తిగా
భిన్నమైనది. ఇలాంటి వైవిధ్యం
కారణంగా మస్లిం సామాజికవర్గాలను హిందూ కులాల పధ్ధతిలో నిర్వచించడం సాధ్యంకాదు.
ఒక మతానికి మరేమతమూ సర్వసమానంకాదని తెలిసినపుడు, హిందూ మతానికి మాత్రమే ప్రత్యేకమయిన కులవ్యవస్థ ఇతర మతాల్లోనూ సరిగ్గా అదే
పధ్ధతిలో ఉంటుందనుకోవడం, ఉండాలనడం ఏపాటి న్యాయం?.
భారత రాజ్యాంగ నిర్మాతలు
ఆదివాసులకు ఎస్టీలుగానూ, దళితుల్ని ,
ఎస్సీలుగానూ గుర్తించి రిజర్వేషన్లు కల్పించారు. హిందూ నిమ్నకులాలకు
రిజర్వేషన్లు కల్పించే సమయంలో ముందు చూపుతో తరగతులు, వర్గాలు
అనే ప్రత్యేక పదాల్ని ప్రయోగించారేతప్ప ’కులాలు’ అని పేర్కొనలేదు. ఎస్.సీ.లో ’సి’ అంటే క్యాస్ట్ (కులం) అని అర్ధం. అయితే, బీ.సీ.లో ’సి’ అంటే క్లాస్ (తరగతి) అని అర్ధం.
సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన ఏ ప్రజాసమూహానికైనా ఉద్దీపన చర్యలు
తీసుకునేందుకు వీలుగానే రాజ్యాంగంలో ’క్లాస్, తరగతులు, వర్గాలు’ వంటి
పదప్రయోగం జరిగిందని అర్ధం చేసుకోవాలి. కులాలకూ వర్గాలకూ
పోలికలుండవచ్చు, సంబంధం కూడా వుండవచ్చు. అయినప్పటికీ, ఉద్దీపనకు వర్గమే ప్రాతిపదికగాబట్టీ, ఇలాంటి
సందర్భాల్లో, మనం నిర్వచించాల్సింది వర్గాల్నేకానీ కులాల్ని
కాదు. ఈ అంశంలో ధర్మాసనం తద్విరుధ్ధంగా స్పందించి, ముస్లింలకు అన్యాయం చేసింది.
5. ఇతరమతాల దరఖాస్తుల్ని
పక్కనపెట్టి, ముస్లింల దరఖాస్తుల్నే పరిష్కరించారు.
హిందూ, శిక్కు తదితర ఇతర మతాలకుచెందిన 112 కులాల దరఖాస్తులు బీసీ గుర్తింపు కోసం ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం ముస్లింల సమస్యనే ప్రస్తుతానికి అత్యవసరంగా భావించిందని ఈ కేసులో
పిటీషనర్లు పేర్కొన్నారు. కేసును కొట్టివేయడానికి ఆ అంశాన్ని
కూడా ధర్మాసనం ప్రధానంగా పేర్కొంది.
పిటీషనర్ల వాదన రెండు
వాస్తవాలను దురుద్దేశపూర్వకంగా దాచింది. మొదటిది, ముస్లింలను బిసి జాబితాలో చేర్చాలనే ప్రయత్నాలు 1970వ దశకంలోనే
ఆరంభమయ్యాయి. రెండవది, ఏపి బిసి జబితాలో
ప్రస్తుతంవున్న 94 కులాల్లో కేవలం
నాలుగుతప్ప మిగిలినవన్నీ హిందూకులాలే. ఈ రెండు వాస్తవాలని ధర్మాసనం విస్మరించింది.
రాష్ట్ర ఓబీసీ జాబితాలో బీసీ-ఏ లో ఒక అర్జాల్ తరగతికీ, బీసీ-బీలో రెండు అజ్లాఫ్ తరగతులకు
నాలుగు దశాబ్దాలుగా రిజర్వేషన్ సౌకర్యం వుంది. అయితే
ఓబీసీ జాబితాలో చేరని అర్జాల్, అజ్లాఫ్ సమూహాలు అంధ్రప్రదేశ్ లో నాలుగు డజన్లకు పైగానే వున్నాయి. వీళ్లకు
రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండు నలభై యేళ్ళుగా పెండింగ్ లో వుందన్న విషయాన్ని కుడా న్యాయస్థానం
పట్టించుకోలేదు. అన్యాయం జరిగింది, జరుగుతున్నదీ
ముస్లింలకు అయితే, హిందువులకు అన్యాయం జరుగుతున్నట్టు కొన్ని
హిందూ వెనుకబడిన కులాల నాయకులు సాగించిన దుష్ప్రచారంలో ధర్మాసనం కొట్టుకుపోయింది.
ముస్లింలు అనగానే సామాన్యులకు పాతతరాల్లో నిజాం నవాబో, కొత్త
తరాల్లో బాబూ ఖాన్ లాంటివాళ్ళో గుర్తుకువస్తారు. వాళ్ళకు
రిజర్వేషన్ ఏమిటీ? అనే
సందేహమూ సహజంగానే కలుగుతుంది. చాలా మందికి అపోహాలేతప్ప,
ఆంధ్రప్రదేశ్ ముస్లిం రిజర్వేషన్ చట్టం-2007 వల్ల భారత ముస్లిం సమాజంలో
ఏ సమూహాలకు రిజర్వేషన్లు దక్కే అవకాశం వుండిందో వాస్తవాలు తెలియవు. ఆ 14 వర్గాల
జాబితా ఇది : _
1.
అచ్చుకట్లవాళ్ళు, సింగాలీ, సింగంవాళ్ళు, అచ్చుపనివాళ్ళు,
అచ్చుకట్టువాళ్ళు, అచ్చుకట్టలవాళ్ళు,
2.
అత్తరు సాయిబులు, అత్తరోళ్ళు,
3.
ధోబి ముస్లిం, ముస్లిం ధోబీ, ధోబీ ముసల్మాన్, తుర్క చాకల, తుర్క చాకలి, తురుక
చాకలి, తులుక్క వన్నన్, త్సాకలస్,
సాకలాస్, చాకలాస్, ముస్లిం
రజక,
4.
ఫకీర్లు, ఫఖీరు, బుడబుక్కల, ఘంట ఫకీర్లు,
ఘంట ఫఖీర్లు, తురక బుడబుడ్కి, దర్వేష్,
5.
గారడీ ముస్లిం, గారడి సాయిబులు, పాములవాళ్ళు, కనికట్లువాళ్ళు,
గారడోళ్ళు, గారడిగా,
6.
గోసంగీ ముస్లిం (కాటికాపరులు), ఫకిర్ సాయిబులు,
7.
గుడ్డిఎలుగువాళ్ళు, ఎలుగుబంట్లవాళ్లు, ముసల్మానీ కీలుగుర్రాలవాళ్ళు,
8.
హజాంలు, నాయి, నాయి ముస్లిం, నవీద్,
9.
లబ్బీ, లబ్బే, లబ్బో, లబ్బా,
10.
బోరేవాలే, బొంతల,
11.
ఖురేషీ, కురేషి, కసాబ్, ముస్లిం కటిక,
ఖటిక ముస్లిం,
12.
షేకులు, శేఖ్, శేక్ వర్గాలు.
13.
సిద్ది, యాబ. హబ్షీ, జసి,
14.
తురక కాశ, కక్కుకొట్టే జింకసాయిబులు, చక్కిట కానేవాలే, తిరుగాడు గొంతలవాళ్ళు, తిరుగాటిగాంట్ల, రోడ్లకు కక్కు కొట్టేవాళ్ళు, ఫత్తర్ ఫోడూలు, చక్కెటకారే తురక
సామాజికార్ధిక వెనుకబాటు కారణంగా, న్యాయంగా ఎస్టీ, ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన ఈ
వర్గాల్ని బిసి-ఇ జాబితాలో చేరుస్తున్నా ఆడ్డుకోవడం మానవత్వం అనిపించుకోదు. న్యాయస్థానాలు ఇప్పుడు సరిగ్గా ఈ
పనే చేస్తున్నాయి. న్యాయదేవత కళ్ళు మూసుకోవడమేగాక మానవహృదయాన్ని కూడా పోగొట్టుకున్నట్టుంది..
ఈ సందర్భంగా, ఒక విషయాన్ని గుర్తుచేసుకోవాలి. ఓబీసీలకు కేటాయించిన
27 శాతం రిజర్వేషన్లలో
8.5 శాతం ముస్లిం
ఓబీసీల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాలని, గతంలో బి.పీ. మండల్ కమీషన్ పేర్కొంది.
మండల్ కమీషన్ సిఫార్సును అమలుచేయడానికి ప్రభుత్వాలు జంకాయి. హిందూ ఓబీసీలు పొందుతున్న 27 శాతానికి బయట, ముస్లిం ఓబీసీలకు విడిగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, చేతులు దులుపుకున్నాయి.
సాధారణంగా, పిచ్చుకను ఎత్తుకు పోతున్నపుడు గ్రద్ద మౌనంగా వుంటుంది. పిచ్చుక ప్రాణభయంతో అరుస్తుంటుంది. ముస్లిం కేసులో
పిచ్చుకలు మౌనంగా వుండిపోయాయి. గద్దలు అరిచాయి. ఎందుకంటే, చచ్చేటప్పుడు
కూడా గొంతు పెగలని దీనత్వం ముస్లిం పిచ్చుకలది. ధర్మాసనానికి
గ్రద్దల అరుపులే వినిపించాయి.
6. బీ.సీ. కమీషన్నిర్వహించిన సర్వే అసమగ్రంగావుంది.
బీ.సీ.
కమీషన్ నిర్వహించిన సర్వే అసమగ్రంగావుందనేది ధర్మాసనం చేసిన మరో
ఆక్షేపణ. మానవ విజ్ఞానశాస్త్ర వివరణ కోసం ఆంథ్రోపాలజీ సర్వే
ఆఫ్ఇండియా సేకరించిన సమాచారాన్ని ముస్లిం రిజర్వేషన్ల కోసం వాడారంటూ అది
తప్పుపట్టింది. ఇతర సంస్థలు ఒక ప్రయోజనం కోసం సేకరించిన
సమాచారాన్ని ఇతర ప్రయోజనాల కోసం వాడడంపట్ల అభ్యంతరం చెప్పింది. ఈ ఆక్షేపణలు చాలా మందికి సమంజసంగానే కనిపించవచ్చు. ఇక్కడ
అంతకన్నా కీలక ప్రశ్న ఒకటుంది. లోపాలు లేని సర్వేల గురించి
ఇటీవలి కాలంలో ఎవరైనా, ఎక్కడైనా విన్నారా?
రేషన్ కార్డుల పంపిణీలో
పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనీ, లబ్దిదారుల జనాభాకన్నా
రేషన్ కార్డులు ఎక్కువగా వున్నాయని
సాక్షాత్తు ముఖ్యమంత్రి కే రోశయ్య, పౌరసరఫరాలశాఖా
మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. రేషన్ కార్డుల
లబ్దిదారుల్ని గుర్తించడంలో శాస్త్రీయత లోపించిందంటూ మొత్తం రేషన్ కార్డుల్ని
రద్దు చేస్తారా? ఓటర్ల జాబితాలు తయారుచేయడంలో అవధుల్లేని
అవకతవకలు జరిగిన సందర్భాలు అనేకం వెలుగులోనికి వస్తున్నాయి. సామ్యాన్యుల ఓట్లేకాక, అత్యంత ప్రముఖుల ఓట్లు సహితం గల్లంతుకావడం సాధారణ విషయం అయిపోయింది.
ఓటర్ల జాబితాలో శాస్త్రీయత లోపించిందంటూ మొత్తం ఎన్నికల ప్రక్రియనే
రద్దు చేస్తూ తీర్పునివ్వడం సాధ్యమేనా?
ఐరిస్ కార్డుల యుగంలోనూ జనాభా గణాంక వివరాలను కఛ్ఛితంగా
సేకరించగలమని గుండే మీద చేయి పెట్టుకుని ఎవరైనా చెప్పగలరా? ఇతర
అనేకానేక అంశాల్లో ఎన్నడూ శాస్త్రీయత
గుర్తుకురాని న్యాయస్థానాలకు ఇలా ముస్లింల
విషయంలో మాత్రమే శాస్త్రీయత గుర్తుకు రావడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
బ్రిటీష్ ఇండియాలో
విద్యావ్యవస్థను సంస్కరించదలచిన అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్
కులప్రాతిపదికపై జనాభా సేకరణ కోసం 1882లో, ఒక కమీషన్ వేశాడు. దానికి అధ్యక్షుడిగా, విద్యావేత్త విలియం విల్సన్ హంటర్ ను
నియమించాడు. హంటర్ కమీషన్ తరువాత ఇప్పటి వరకు
భారతదేశంలో, కులప్రాతిపదికన జనాభా సేకరణ జరగలేదు. కులాల జనాభా గురించి ప్రభుత్వమైనా, ప్రభుత్వేతరులైనా
చెప్పే గణాంకాలన్నీ హంటర్ కమీషన్ నివేదిక ఆధారంగా లెఖ్ఖలు కట్టినవే! నూట ముఫ్ఫయి యేళ్ళుగా ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా సేకరణే చేపట్టనపుడు,
వర్తమాన, వాస్తవ, శాస్త్రీయ
గణాంకాలు ఎవరికైనా ఎక్కడ నుండి వస్తాయి? ఈ చారిత్రక వాస్తవాన్ని పట్టించుకోని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మరో
చారిత్రిక అన్యాయానికి దోహదం చేసింది.
7. రాజకీయ ప్రయోజనాల కోసం
ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం,
రాజకీయ ప్రయోజనాల కోసం
ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని ధర్మాసనం నిందార్ధంలో పేర్కొంది.
నిజానికి, ఉద్దీపన చర్యలు, రిజర్వేషన్లు అనే భావాలు
పుట్టిందే రాజకీయ ప్రయోజనాల కోసం.
ఈ అంశాన్ని అర్ధం చేసుకోవడానికి మనం మరీ మహాత్మా గాంధీ- అంబేడ్కర్
పూనా ఒప్పందం వరకు వెళ్ళాల్సిన పనిలేదు. దేశసమగ్రత అంటేనే
రాజకీయం. భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం చేసిందే.
వుధృత రాజకీయ ఉద్యమాల ఫలితంగానే, వెనుకబడిన
తరగతుల సంక్షేమం కోసం, 1951లో, భారత రాజ్యాంగానికి తొలి సవరణ చేపట్టారు. అలాంటి సవరణ చేయకపొతే, నిమ్నకులాలు దేశం నుండి విడిపోతాయని హెచ్చరిస్తూ, ఆందోళనకారులు
భారత రాజ్యాంగ ప్రతుల్ని తగలబెట్టారు.
అనుమానం ఉన్నవాళ్ళు అరవై యేళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వుంటుంది.
ఆ తరువాత ఇప్పటి వరకు చేపట్టిన ప్రతి రాజ్యాంగ సవరణ, ప్రతి చట్టం, ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు, ప్రతి ఆర్డినెన్సు సమస్తం ఏదో ఒక రాజకీయ ప్రయోజనం కోసం చేసినవే.
నిజానికి, పార్టీ ఆధారిత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, రాజకీయ
ప్రయోజనాలను సాధించడమే ప్రాణప్రదమైన అంశం. పార్లమెంటరీ
ప్రజాస్వామ్యంలో, ఇటు ప్రజలకు, అటు
రాజకీయ పార్టీలకు రెండు నిర్దిష్ట రాజకీయ కార్యకలాపాలుంటాయి. ఓట్ల ద్వార ప్రజల మద్దతు పొంది, అధికారాన్ని చేపట్టి,
ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడం
రాజకీయ పార్టీల కార్యకలాపమైతే, తమ సమస్యల
పరిష్కారానికి ఓట్ల మాధ్యమాన్ని ఉపయోగించడం ప్రజల కార్యకలాపం. ఈ విషయాలు న్యాయమూర్తులకు తెలియకకాదు. రాజకీయ
నాయకులపట్ల మధ్యతరగతివర్గాల్లో సాధారణంగా వుండే నిస్సహాయపు ఏవగింపును చవకబారు
పధ్ధతుల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ధర్మాసనం.
రాష్ట్ర వున్నత ధర్మాసనం పేర్కొన్న అభ్యంతరాల
సంగతి ఇలా వుండగా, ముస్లిం వ్యతిరేక నినాదాలతో రాజకీయలబ్ది పొందడానికి పెయత్నించే బీజేపి
మరో వాదనను ముందుకు తెస్తోంది. అది : . “ముస్లింలకు రిజర్వేషన్లు దేశ సమగ్రతకు భంగకరం” అనేది. ఇప్పుడు దాన్నీ
పరిశీలిద్దాం.
8.
ముస్లింలకు రిజర్వేషన్లు దేశ సమగ్రతకు భంగకరం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత
న్యాయస్థానం ముస్లిం రిజర్వేషన్ చట్టం- 2007ను కొట్టేస్తూ
తీర్పు నిచ్చిన పది రోజుల తరువాత భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశాలు ఇండోర్ సమీపాన జరిగాయి. బీజేపి శ్రేణులు తమ ప్రాణాల్ని ఫణంగాపెట్టైనాసరే ముస్లిం రిజర్వేషన్లను
అడ్డుకోవాలని బీజేపి ఇండోర్ సమావేశం పిలుపిచ్చింది.
ముస్లిం రిజర్వేషన్లను
అడ్డుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తూ బీజేపి చెప్పిన కారణాలు పాతవే అయినా ఈసారి
కొంచెం కొత్త ఆసక్తిని కలిగించాయి.
మత ప్రాతిపదికన రిజేర్వేషన్లు ఇస్తే అది మత మార్పిడుల్ని
ప్రోత్సహించినట్టు అవుతుంది అనే హెచ్చరికతోసహా, ఏపి హైకోర్టు
పేర్కొన్న కారణాలనే యధాతధంగా బీజేపి
నాయకులు పేర్కోవడం విశేషం. ముస్లింలకు తాము రిజర్వేషన్లు
ఇచ్చేందుకు సిధ్ధంగావున్నా, న్యాయస్థానాలే
మోకాలడ్డుతున్నాయనే భావనను యూపియే సర్కారు ప్రజల్లో కల్పిస్తోందంటూ, బీజేపి నాయకులు, దుయ్యబట్టారు. యూపియే ప్రభుత్వం చేపట్టే అవివేకపు చర్యలవల్ల ప్రజలకు న్యాయస్థానాల మీద
విశ్వాసం సన్నగిల్లుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. బీజేపి ఇండోర్ జాతీయ మండలి
సమావేశ తీర్మానాలను గమనిస్తే, న్యాయస్థానాల్ని చూసి సంఘ్ పరివార శక్తులు ఉత్తేజాన్ని పొందుతున్నాయా?
లేక, సంఘ్
పరివారాన్ని చూసి న్యాయస్థానాలు
ఉత్తేజాన్ని పొందుతున్నాయా? అనే అనుమానాలు ఎవరికైనా వస్తాయి.
బీజేపి నాయకులు తమ సహజ ధోరణిలో మరో అడుగు ముందుకేసి,
ముస్లిం రిజర్వేషన్లు అమలైతే మరోసారి దేశ విభజన ఖాయం అని
హెచ్చరించారు. ఇదొక చిత్రమైన వాదన. తమకు
రిజర్వేషన్లు కల్పించకపోతే, తాము భారతదేశంలో అంతర్భాగంగా
వుండాల్సిన పనిలేదని గతంలో ద్రావిడ నాయకులు హెచ్చరించడం మనకు తెలుసు. ప్రాంతాలమధ్య, సామాజికవర్గాల మధ్య అసమాన అభివృధ్ధి
కొనసాగుతున్నప్పుడు ఏదేశమైనా, ఆ మాటకొస్తే ఏ రాష్ట్రమైనా,
సమగ్రతను పరిరక్షించుకోవడం సాధ్యంకాదు. దేశసమగ్రతను
సాధించడానికి, బాధిత ప్రాంతాలకూ, బాధిత
సామాజికవర్గాలకూ రాయితీలు ఇవ్వడం అనివార్యం. వెనుకబడినవర్గాల్ని
ఉద్దీపన పధకాలతో అభివృధ్ధిచేస్తే, సమాజంలో శాంతిసామరస్యాలు
వెల్లివిరుస్తాయి. విభిన్న
ప్రజాసమూహాల మధ్య సంఘీభావం ఏర్పడి దేశ సమగ్రత, సమైక్యత
బలపడతాయి. నిజానికి దేశ సమగ్రత, సమైక్యతలకు
ముప్పు వచ్చేది అలాంటి ఉద్దీపన చర్యల్ని వ్యతిరేకించినప్పుడే! అందరికీ తెలిసిన సత్యాన్ని తలకిందులు
చేసి, దాన్ని భావోద్వేగ అంశంగా మార్చి, రాజకీయంగా లబ్దిపొందడానికి
ప్రయత్నించడం సంఘ్ పరివారానికి పుట్టుకతో అబ్బిన విద్య.
మనం మరిచిపోతున్న విషయం
ఏమంటే, తమ సమస్యల పరిష్కారాల కోసం ఎంచుకోవడానికి ప్రజలు అనేక
మార్గాలు వుంటాయి. పార్లమెంటరీ
ప్రజాస్వామ్యం వాటిల్లో ఒకటి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమయినప్పుడు పార్లమెంటేతర
ప్రజాస్వామ్యం, అహింసామార్గం విఫలమైనపుడు అహింసేతర మార్గం, శాంతియుత
పోరాటాలు విఫలమైనపుడు శాంతియేతర పోరాటాలు, పాలకవర్గాల
న్యాయస్థానాలు విఫలమయినపుడు ప్రజాన్యాయస్థానాలు ప్రత్యామ్నాయంగా రంగప్రవేశం చేస్తాయి.
ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా పరిపాలనను సాగించేటట్టు
పర్యవేక్షించే అత్యున్నత బాధ్యతను న్యాయస్థానాలకు అప్పగించారు మన ప్రజాస్వామిక
వ్యవస్థ రూపశిల్పులు. న్యాయమూర్తుల బాధ్యత; రాజ్యాంగానికి
అక్షరబధ్ధంగా వ్యాఖ్యానాలు చేసినంతమాత్రాన సరిపోదు. ఇది
వాళ్ళకు ప్రాధమిక కర్తవ్యం మాత్రమే. నిజానికి ఆ మాత్రం పని చేయడానికి
మనుషులు అఖ్ఖరలేదు; యంత్రాలు
కూడా చేస్తాయి. న్యాయంగానైతే, విభిన్న
ప్రజాసమూహాలు, సామాజికవర్గాలకూ విద్యా, ఉపాధిరంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దడానికి రాజ్యాంగంలో ఎన్నిరకాల
అవకాశాలున్నాయని న్యాయనిపుణులు ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ముస్లిం
రిజర్వేషన్ చట్టం-2007 కేసులో విచారణ ప్రక్రియలో అందుకు విరుధ్దంగా జరిగింది. ముస్లిం సమాజంలోని వెనుకబడినవర్గాలకు ప్రభుత్వం ఇవ్వదలిచిన రిజర్వేషన్లను
నిరాకరించడానికి రాజ్యాంగాన్ని
ఎన్నిరకాలుగా అడ్డుపెట్టవచ్చు అని
ధర్మాసనం భారీ కసరత్తు చేసింది. ఇదీ ఈ కేసులో
అసలు విషాదం!
న్యాయం చేయడంలో ఆలస్యం,
న్యాయాన్ని నిరాకరించడం రెండూ ఒక్కటే అనేది న్యాయశాస్త్రంలో
ప్రాధమిక సూత్రం. స్వతంత్ర భారతదేశంలో న్యాయం కోసం ముస్లిం
వర్గాలు 63 సంవత్సరాలుగా
ఎదురుచూపులు చూస్తున్నాయి. వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఆగాలని మన దేశపు న్యాయస్థానాలు
భావిస్తున్నాయి? హైదరాబాద్ లో ఉగ్రవాదం ఉపిరిపోసుకోవడానికి
అనేకానేక కారణాల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కావడం కూడా ఒకటని ఒక సందర్భంలో
సిపియం నేత బీ. వి. రాఘవులు
గుర్తించారు. ఇప్పుడు
ఆ జాబితాలో న్యాయస్థానాలు చేరకూడదని ఆశిద్దాం.
రాజ్యాంగ సమయాన్నీ,
రాజ్యాంగ హృదయాన్ని భావబధ్ధంగా వ్యాఖ్యానించి, ప్రజల్లో రాజ్యాంగంపట్ల విశ్వసనీయతను పెంచుతూవుండడమే న్యాయస్థానాల
దీర్ఘకాలిక కర్తవ్యం. సరిగ్గా ఈ అంశాన్నే ఏడుగురు
న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం విస్మరించింది. భారతదేశంలో
పోలీసు వ్యవస్థ తరువాత ఎక్కువ అవినీతి న్యాయవ్యవస్థలోనే వున్నదంటూ ట్రాన్స్ పెరెన్సీ
ఇంటర్నేషనల్ వంటి అంతర్జాతీయ సంస్థలు గగ్గోలుపెడుతున్న కాలంలో, న్యాయస్థానాల విశ్వసనీయతను
పెంచడం న్యాయమూర్తులకు మరింత అత్యవసర
కర్తవ్యంగా మారుతుంది. ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు మిగిలిన ఐదుగురి
తీర్పుతో విభేదించడం ఒక్కటే, ఈ కేసులో, కొంత సానుకూల అంశం. ఇప్పటికిప్పుడే
కాకపోయినా, సమీప భవిష్యత్తులోనైనా సామాజిక న్యాయస్థానాలు
అవతరిస్తాయని ఆశిద్దాం.
(రచయిత సామాజిక కార్యకర్త)
హైదరాబాద్,
22 ఫిబ్రవరి 2010
ప్రచురణ : వీక్షణం మాస పత్రిక, మార్చ్ 2010
No comments:
Post a Comment