ముస్లిం ఏబిసిడి వర్గీకరణ
ఏ.యం. ఖాన్ యజ్దానీ (డానీ)
చట్టాల కోసం సమాజమా? సమాజం కోసం చట్టాలా? అనే ప్రశ్న తలెత్తితే అందరూ సమాజం కోసమే చట్టాలు ఉండాలంటారు. కానీ, భారత ముస్లింల సంక్షేమం ప్రస్తావన వచ్చినపుడెల్లా ఈ నియమం తలకిందులౌతున్నది. రాజ్యాంగ పరిధిలో ముస్లింల సంక్షేమాన్ని సాధించడం ఎట్లా అనేది ఇప్పుడు మన ముందున్న సమస్య.
దేశంలో ఇతర ఏ సామాజిక సమూహాలతో పోల్చినా, ముస్లింలు సామాజిక, విద్యా, ఆర్థిక రంగాల్లో వెనుకబడివున్నారని అందరూ అంగీకరిస్తారు. ప్రత్యేకంగా భారత ముస్లింల స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి నియమించిన నాటి గోపాల్ సింగ్ కమిటీ నుండి నేటి వరకు మినహాయింపు లేకుండా, అన్ని కమిటీలు మళ్ళీమళ్ళీ కనుగొంటున్నది ఈ సత్యాన్నే. అంతేకాదు, ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) జాబితాను సిద్ధం చేయడానికి వివిధ సందర్భాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కాకా కలేల్కర్ కమిటీ, బీ.పీ మండల్ కమిటీ, పుట్టుస్వామి కమిటీ మొదలైనవన్నీ నిర్థారించింది కూడా ఈ సత్యాన్నే.
రోగాన్ని నిర్థారించిన తరువాత వైద్యన్ని ఆరంభించడమేగాక, రోగ నివారణకూ చర్యలు తీసుకోలి. అదేం దురదృష్ఠమోగానీ, ముస్లింలకు విద్యా, ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు అనే ప్రస్తావన రాగానే మహాపాతకం ఏదో జరిగిపోయినట్టు కొన్ని సంస్థలు గగ్గోలు పెడుతుంటాయి. సచార్ కమిటీ నియామకం జరిగిన తరువాత భారత రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు దీనికి కొత్త ఉదాహరణ.
సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో ముస్లింల స్థితిగతులపై సాధికారిక నివేదికను రూపొందించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ 2005 మార్చి 5న ఏడుగురు సభ్యులతో కూడిన ఒక ఊన్నత స్థాయి సంఘాన్ని నియమించారు. ఢీల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజిందర్ సచార్ ఈ కవిూటీకి అధ్యక్షులు.
సచార్‌కమిటీ నియామకం జరిగిన మరుక్షణం నుండే సంఘ్‌పరివారం దానిపై యుధ్ధాన్ని ప్రకటించింది. ముస్లింలపట్ల, కాంగ్రెస్ ప్రభుత్వాలు సానుకూలతను ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తే చాలు, కేంద్రంలో అధికార పగ్గాలు మళ్ళీ తన చేతుల్లోకి వస్తాయని బీజేపి ఆశలు పెంచుకుంటుంది. సచార్‌కమిటీకి వ్యతిరేకంగా ఆ పార్టి, ఇద్దరు రథసారధులతో రెండువైపుల నుండి భారత్ సురక్షా యాత్రనే ఆరంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో, కాబోయే ప్రధానమంత్రి తానేనని గట్టిగా నమ్మే బీజేపి మహారధి ఎల్. కే. అద్వానీ, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం, భారత రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకమని దేశమంతా ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఆలోచనా ధోరణి దేశ సమగ్రతకు ముప్పు తెస్తుందన్నారు. మరోసారి దేశాన్ని విభజించే విధానాలకు కాంగ్రెస్ పాల్పడుతోందన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, ముస్లింలకు పూర్తిగా లొంగిపోయిన కాంగ్రెస్ నేతలు ముస్లిం సంతుష్టీకరణకు పాల్పడుతున్నారన్నారు. సర్దార్‌పటేల్, జవహర్‌లాల్‌నెహ్రు మొదలుకుని బీ ఆర్ అంబేద్కర్‌వరకు అందరూ, భారత రాజ్యాంగం మొదలుకుని ఉన్నత న్యాయస్థానాల వరకు అన్నీ ముస్లింల రిజర్వేషన్లకు వ్యతిరేకమని విడమర్చి మరీ చెప్పారు. (అద్వాని నాగపూర్‌ప్రసంగం, 21 ఏప్రిల్, 2006).
అద్వానీ లేవనేత్తిన అంబేద్కర్, భారత రాజ్యాంగం వంటి వివాదాలపై తక్షణం స్పందించకపోయినా ముస్లింలకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేవిూలేదు. గానీ, దేశ సమగ్రతవంటి సున్నితమైన అంశాలపై సంఘ్ పరివారం వివాదాన్ని రెచ్చగొట్టినపుడు మాత్రం ముస్లింలు తక్షణమే స్పందించాల్సివుంటుంది.
సమాజ విచ్ఛిత్తి, దేశవిచ్ఛిత్తీ వంటి భయాందోళనల్ని ప్రచారం చేయడం సంఘ్ పరివారానికి, కొత్త ఎత్తుగడేవిూకాదు. ఈ ప్రచారాన్ని, ముస్లింలకు వ్యతిరేకంగా మాత్రమే సంఘ్ పరివారం ప్రయోగిస్తున్నదనుకున్నా పొరపాటే. స్వాతంత్రం వచ్చిన కొత్తలో, అణగారిన కులాలకు వ్యతిరేకంగా, పెత్తందారీ కులాలు, ఇలాంటి భయాందోళనల్నే పెద్దఎత్తున ప్రచారంలో పెట్టాయి. సంఘ్ పరివారం ప్రొద్బలంతో, పెత్తందారీకులాలు సాగించిన దుష్ప్రచారాల్ని; పెరియార్ ఇవీ రామసామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమం, సమర్థంగా తిప్పికొట్టింది. అణగారిన కులాలకు ప్రత్యేక రక్షణ లేనపుడు, ఇండియన్ యూనియన్ లో ద్రవిడప్రాంతం ఎందుకు కలిసివుండాలని, ఘాటుగానే ప్రశ్నించింది. కుల-వర్ణ వ్యవస్థను బలపరుస్తున్నాయంటూ, 1957 నవంబరు 26న, భారత రాజ్యాంగ అధికరణాలను తగలబెట్టింది. కేంద్ర ప్రభుత్వం, పెత్తందారీ కులాలను ప్రోత్సహిస్తున్నదంటు, 1960 జూన్ లో, వేలాదిమంది ద్రవిడ కజగం కార్యాకర్తలు, నడిరోడ్ల విూద ఇండియన్ యూనియన్ మ్యాపుల్ని తగలబెట్టారు. (వెబ్ సైట్ తమిళ్ నేషన్.ఓఆర్ జి).
అణగారినవర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పిస్తే, సామాజిక శాంతి నెలకుంటుంది. పాలక వర్గాలకూ, పాలిత వర్గాలకూ మధ్య ఘర్షణ తగ్గుతుంది. సహజ వనరుల్లో, సామాజిక వ్యవస్థల్లో, ముస్లింలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పిస్తే; ప్రభుత్వంపట్ల, ప్రజాస్వామిక వ్యవస్థపట్ల, భారతరాజ్యాంగంపట్ల, మరీ ముఖ్యంగా సాటి హిందూవులపట్ల, ముస్లింలకు; నమ్మకం, విశ్వాసం పెరుగుతుందేగానీ, తగ్గదు. సామాజిక న్యాయాన్ని ఆచరిస్తే భిన్న సామాజిక సమూహాల మధ్య విశ్వాసంపెరిగి, దేశ సమగ్రత మరింతగా బలపడుతుంది.
నిజానికి, సమాజంలో వెనుకబడిన సమూహాల్ని పట్టించుకోనపుడే దేశ సమగ్రతకు ముప్పు వచ్చే అవకాశం వుంటుంది. సామాజిక వాస్తవాలను తలకిందులుగా చిత్రించి, సెంటిమెంటల్ బ్లాక్ మెయిలింగ్ చేయడం, సంఘ్ పరివారానికి కాషాయంతో పెట్టిన విద్య.
షెడ్యూలు తెగలు, షెడ్యూలు కులాలు, ఇతర వెనుకబడిన తరగతులకు మాత్రమే రిజర్వేషన్లు పోందే అవకాశాన్ని భారత రాజ్యాంగం కల్పిస్తోంది. అంచేత, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఏదైనా ఒక సామాజికవర్గానికి సంక్షేమాన్ని తలపెట్టదలిస్తే, ముందుగా ఆ సమూహాన్ని ఈ మూడింటిలో ఏదో ఒక వర్గంగా ప్రకటించాల్సి వుంటుంది. అంతవరకూ బాగానే వుందిగానీ, యస్సీ, యస్టీ, ఓబిసి అనే సామాజిక వర్గీకరణ, గతితప్పి, ధార్మిక వర్గీకరణగా రూఢి అయిపోవడంతో కొత్త వివాదాలు తలెత్తుతున్నాయి. ఓబీసీలో ''సీ'' అనేది 'కులం' కాదనీ, సామాజిక 'తరగతి' అని గుర్తించడానికి ఇప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు. హిందూ మతానికి ప్రత్యేక లక్షణమైన కులాన్ని, ఇప్పుడు ఉపఖండంలోని ఇతర మతాలకూ అనివార్యంగా వర్తింపచేయాల్సి వస్తున్నది!
సామాజిక వెనుకబాటుతనాన్ని ఆర్థిక వెనుకబాటుతనంతో ముడిపెట్టరాదనే వాదన కూడా బలంగా వినిపిస్తున్నది. రిజర్వేషన్ వెసులుబాటు అనేది కులాలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక హక్కు అని పలురాజకీయ పార్టీలు, అనేక సాంఘీక సంస్థలు భావిస్తున్నాయి. కొందరు ఇంకొంత ముందుకు వెళ్ళి, హిందూ కులాలకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక హక్కు అని కూడా వాదిస్తున్నాయి. న్యాయాస్థాలుకూడా దీనికి మినహాయింపుకాదు. ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్ ఇస్తూ వై.యస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వు న్యాయస్థానాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులే దీనికి తాజా ఉదాహరణ. సామాజిక న్యాయాన్ని అందించడంలో రాజ్యాంగమే ఓడిపోయిందో, పెత్తందారీ కులరాజకీయాలే రాజ్యాంగాన్ని ఓడించాయో తేల్చుకోవాల్సిన సమయం ఇది.
అధికార రాజకీయాలను, ముస్లిం ఆలోచనాపరులు, రెండు స్రవంతులుగా వర్గీకరిస్తారు. మొదటిది, ముస్లింలను ఊరించే రాజకీయం. రెండోది; ముస్లిం వ్యతిరేక రాజకీయం. నిజాయితీగా ముస్లింల సంక్షేమాన్ని కోరే రాజకీయపార్టి స్వతంత్ర భారత దేశంలో ఇంతవరకు పుట్టలేదు. కనుచూపుమేరలో కనిపించడమూ లేదు. అయితే, కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్దపుడూ, కొత్త కవిూషన్లను వేసినపుడూ ముస్లిం సమాజంలో సహజంగానే ఒక ఆశ చిగురించడమూ, దాన్ని వెన్నంటే ఒక అనుమానం ఆవరించడమూ కొత్తేవిూకాదు. సచార్ కమిటీ కూడా అలాంటి ఆశల్నీ, అనుమానాల్నీ రేకెత్తించింది.
సచార్ కమిటీ సిఫార్సులు ఏమిటీ? దానిపై యూపీయే ప్రభుత్వ స్పందన ఎలావుంటుంది? ముస్లింలకు రిజర్వేషన్లను ప్రకటిస్తారా? ప్రకటిస్తే ఎంత శాతం? రిజర్వేషన్లు 50 శాతం దాటేస్తే న్యాయపరమైన ఇబ్బందులు రావా? తొమ్మిదవ షెడ్యూలును ప్రయోగిస్తారా? సుప్రీం కోర్టు ఊరుకుంటుందా? పబ్లిక్ రంగం రోజురోజుకూ బలహీన పడిపోయి, ప్రైవేటు రంగం వటవృక్షంలా బలపడిపోతున్నప్పుడు ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చినా ప్రయోజనమేమిటీ? ప్రైవేటు రంగంలోనూ ముస్లింలను ప్రోత్సహిస్తారా? ఆర్థిక సంస్థల్లో ముస్లింల పరపతిని పెంచుతారా? మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలతో ముస్లింలకు ఒనగూడే భౌతిక ప్రయోజనాల సంగతి ఎలావున్నా, సచార్ కమిటీ నివేదిక ముస్లింలకు నైతికంగా గొప్ప మేలు చేసిందనేచెప్పాలి. 'ముస్లిం సంతుష్టీకరణ' మిధ్యను సచార్ కమిటీ నివేదిక పటాపంచలు చేసింది. కాంగ్రెస్-వామపక్షాల కూటమి దేశాన్ని (హిందువుల్ని) కొల్లగొట్టి ముస్లింలకు కట్టబెడుతోందని సంఘ్ పరివారం చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు వాస్తవం కూడా లేదని సచార్ కమిటీ స్పష్టం చేసింది. హిందూ ఓబీసీలకన్నా భారత ముస్లింలు సామాజికంగా, ఆర్థికంగా మరింతగా వెనుకబడి వున్నారని కవిూటి మరోసారి నిర్థారించింది. స్థూలంగా హిందూ యస్సీ, యస్టీలకన్నా ముస్లింల ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్నప్పటికీ అనేక రంగాలలో ముస్లింల ప్రాతినిథ్యం రోజురోజుకూ అంతరించిపోతున్నదని హెచ్చరించింది. దేశాన్ని తమ జనాభాతో నింపేయడానికి; ముస్లింలు; పిల్లల్ని కనడంతప్ప మరో పనిపెట్టుకోరని సంఘ్ పరివారం చేస్తున్న ప్రచారం కూడా శుధ్ధఅబద్ధమని తేల్చింది. దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని నేషనల్ శ్యాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ గణాంకాల సాక్ష్యంగా వివరించింది. మరో విధంగా చెప్పాలంటే, ఇప్పటి వరకూ ముస్లిం సమాజం తన స్థితిగతుల గురించి విలపిస్తున్నదాన్నే, సచార్ కమిటి నిర్థారించింది. జస్టిస్ రాజిందర్ సచార్ హై-లెవల్ కవిూటివల్ల ముస్లిం సమాజానికి దక్కిన తక్షణ నైతిక ప్రయోజనం ఇదొక్కటే!
సచార్ కవిూటీ టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కీలకమైన మరో అంశం భారత ముస్లిం సమాజంలోని ఓబీసీలకు సంబంధించింది. ముస్లిం ఓబీసీల స్థితిగతులపై ఒక సంపూర్ణ నివేదికను సమర్పించడానికి కమిటీ ప్రయత్నించింది.
ధార్మిక అర్థంలో ముస్లింకులాలు అనేది ఒక దుశ్శమాసం. మనుషుల్ని అసమానులుగా తానే సృష్టించానని స్వయంగా దేవుడే చెప్పాడనే మతాలున్నాయి. దేవుని ముందు మనుషులందరూ సమానులనే మతాలూ వున్నాయి. దేవుని ముందేకాదు; సమాజంలోని ప్రతి వ్యక్తీ; మరొకని ముందు; సమానుడేనని ఇస్లాం అంటుంది. సమాజంలోని సభ్యుల వ్యక్తిగత ధార్మిక స్థాయిని నిర్థారించడానికి ఇస్లాంలో ఒకే ఒక కొలమానం వుంది. అది; ధార్మిక ఆచరణ.
ఇస్లాం ఒక బహిరంగ మతం. దానికి సరిహద్దులూ, గోడలూ వగైరాలూ లేవు. ఎవరైనా, ఎప్పుడైనా, ఇస్లాంను స్వీకరించి, ముస్లిం సమాజంలోనికి ప్రవేశించవచ్చు. ఎవరైనా, ఎప్పుడైనా, ఇస్లాంను త్యజించి ముస్లిం సమాజం నుండి బయటికి వచ్చేయవచ్చు. సంఘ సభ్యుల విషయంలో ముస్లిం సమాజానిది తెరిచిన తలుపుల విధానం. మనుషులు వస్తుంటారు; పోతుంటారు అనే ధర్మం ముస్లిం సమాజానికి సరిగ్గా సరిపోతుంది. ముస్లిం సమాజంలో పుట్టుక అనేది ప్రామాణికం కానేకాదు; దానికి ఆచరణే ప్రామాణికం. పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ ఆలీ జిన్నా, జాతీయకవి అల్లామా ఇక్బాల్ తో సహా, చరిత్రలో ప్రముఖ ముస్లింలుగా నిలిచిపోయిన పలువురి పూర్వికులు తమ సవిూప గతంలోనే ఇస్లాంను స్వీకరించినవారు అనంటే చాలా మందికి నమ్మశక్యంగా వుండకపోవచ్చు; కానీ, ఇది వాస్తవం.
ముస్లిం సమాజంలో మతపరంగాగాక, మతేతర కారణాలవల్ల, ఆచరణల ఆధారంగా భిన్న సమూహాలు అనేకం ఏర్పడ్డాయి. అయితే వీటిని వర్ణాలుగానో, కులాలుగానో భావించడం అవగాహనలోపమే. వర్ణానికీ, కులానికీ మతపరమైన ప్రతిపత్తి వుంటుంది. ముస్లిం సమాజంలోని వర్గీకరణకు మత ప్రతిపత్తిలేదు; అది అచ్చంగా లౌకిక పరమైనది.
బహిరంగ మతాలకు సంబంధించి ఇంటాబయటా కూడా అనేక తరగతులుంటాయి. ముస్లిం సమాజంలో; ముస్లిం ధర్మాలను పాటిస్తున్నవారూ, పాటించకుండ బయటికి పోతున్నవారూ వున్నట్టే, ముస్లిం సమాజానికి బయట; ముస్లిం సమాజానికి ఆకర్షితులౌతున్నవాళ్ళూ, ముస్లిం సమాజాన్ని ద్వేషిస్తున్నవాళ్ళూ వుంటారు. ఈ నాలుగు తరగతుల్లో, మళ్ళీ అనేక ఉప తరగతులుంటాయి. అన్నింటికన్నా; వీటిల్లో; మూడవ తరగతి స్థానాన్ని నిర్ణయించడం కష్టసాధ్యమైన పనే. ఈ తరగతి వాలు; ముస్లిం సమాజంవైపు వుందా? ముస్లిమేతర సమాజంవైపు వుందా? అనే అంశంపైనే ముస్లిం సమాజంలో, అంతస్తులు ఏర్పడుతుంటాయి. వాలు ముస్లిమేతరులవైపు వుంటే, అది వారి ఇష్టం. దానికి ముస్లిం సమాజం చెయ్యగలిగింది కూడా ఏవిూ వుండదు. వాలు, ఒకవేళ, ముస్లింలవైపు వుంటే, వాళ్ళను ముస్లిం సమాజం అక్కున చేర్చుకుంటుంది.. ఇస్లావిూకరణ అంటే ఇదే!
బహిరంగ మతంలో; వచ్చే, పోయే అలల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ వుంటుంది. ఆమేరకు తాత్కాలిక సామాజిక అంతస్తులు ఏర్పడి, అంతరిస్తుంటాయి. చారిత్రక కారణాలవల్లనో, రాజకీయ కారణాలవల్లనో, ప్రాంతీయ కారణాలవల్లనో, ఏదైనా ఒక దశలో, ఇలాంటి ప్రక్రియ స్థంభించిపోతే, అప్పటి ఆంతస్తులు కులాలుగా స్థిరపడడాన్ని ఇప్పుడు మనం భారత ముస్లిం సమాజంలో చూస్తున్నాం.
పాక్షికంగానో, సంపూర్ణంగానో ఇస్లాంను ఆచరిస్తున్న133 సామాజిక సమూహాలని 1901 నాటి సెన్సెస్ గుర్తించింది. వీటిల్లో 82 సమూహాలను వృత్తి ఆధారిత కులాలుగా బీ.పీ. మండల్ కవిూషన్ గుర్తించి, ఓబీసీలుగా ప్రకటించింది. యన్.యస్.యస్.ఓ సరికొత్త నివేదిక ప్రకారం భారత ముస్లిం జనాభాలో 40.7 శాతం ఓబీసీలని సచార్ కమిటి తేల్చింది. భారత దేశ మొత్తం ఓబీసీల్లో ముస్లిం ఓబీసీలు 15.7 శాతం వున్నారని అంచనావేసింది.
భారత ముస్లిం సమాజాన్ని; సచార్ కమిటి; అష్రాఫ్ (యూ.సీ.), అజ్లాఫ్ (ఓబీసీ), అజ్రాల్ (యస్.సీ) అనే మూడు అంతస్తులుగా వర్గీకరించింది. భారత ముస్లింలు మొత్తంగా ఇతర మతాల ఓబీసీలకన్నా అన్ని రంగాలలో వెనుకబడివుంటే, భారత ముస్లింలలో ముస్లిం ఓబీసీలు మరింత వెనుకబడివున్నరని కమిటి వివరించింది. ముస్లింలలోని మూడు వర్గాలూ దయనీయ స్థితిలో వున్నాయి కాబట్టి, మూడు వర్గాలకూ మూడురకాల ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టాల్సిన అవసరాన్ని సచార్ కమిటీ నొక్కి చెప్పింది.
వర్గీకరణ పూర్తయిపోయింది గాబట్టి ముస్లింలకు చట్టపరిథిలో రిజర్వేషన్లు ఎలా ప్రకటించాలనేది ఇప్పుడు మన ముందున్న సమస్య.
(రచయిత సీనియర్ పాత్రికేయుడు)
హైదరాబాద్
జనవరి, 2007
ప్రచురణ : వీక్షణం మాసపత్రిక, ఫిబ్రవరి, 2007
No comments:
Post a Comment