Friday, 27 December 2013

వేర్పాటువాదులకూ అసంతృప్తే

రాష్ట్ర విభజన బిల్లుపై
వేర్పాటువాదులకూ అసంతృప్తే
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

       పన్నెండు అధ్యయాలు, 13 షెడ్యూళ్ళు, 63 పేజీలున్న ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013 ప్రతులు రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి చేరాయి.  ఇంగ్లీషులో బిల్లు, డ్రాఫ్ట్ కాపీ వగైరాలుగా పిలిచేదాన్ని తెలుగులో చిత్తుప్రతి అంటారు. సైనిక విమానంలో అతి భద్రంగా  రాష్ట్రానికి  వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013  బిల్లు చిత్తుగానేకాదు చెత్తగానూ వుంది. ఇంగ్లీషులో కొంచెం నయం, తెలుగు తర్జుమా అయితే మరీ ఘోరం. ఉర్దూ తర్జుమా సంగతి చెప్పనక్కరలేదు.

        తొమ్మిది కోట్లమందికి సంబంధించిన  పంపకాల అంశంలో  కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందా? అని అశ్ఛర్యం వేస్తుంది. ఆక్రోశం వచ్చినా తప్పుకాదనిపిస్తోంది. ఆంధ్రప్రధేశ్ ను సమైక్యంగా వుంచడం సాధ్యంకాదనీ,  తెలుగు - తెలంగాణ విభజన తప్పదని భావిస్తున్నవాళ్ళు కూడా సమర్ధించలేనట్టుగా వుంది ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు – 2013. మరోమాటల్లో చెప్పాలంటే ఇరుప్రాంతాల మధ్య చెలరేగిన వివాదాల్ని  పరిష్కరించడంకన్నా,  అనేక కొత్త వివాదాలు సృష్టించేలా వుంది బిల్లు. ఇది ఒకవేళ శాసనసభ, శాసనమండలి దశను దాటినా, న్యాయపరమైన చిక్కుల రీత్యా పరిష్కారం కోసం సెలెక్ట్ కమిటీ చుట్టు చక్కర్లు కొడుతూ వుండిపోకతప్పదు.

        ఆంధ్రప్రదేశ్ విభజనలో అత్యంత కీలకమైన నదీజలాల వివాదాన్ని పదకొండవ షెడ్యూలులో అతితేలిగ్గా తీసిపడేశారు.  జస్టిస్ బ్రిజేష్ కుమార్ కృష్ణాజలాల వివాద ట్రిబ్యూనల్ ఇటీవల ప్రకటించిన తీర్పు మీద రాష్ట్ర ప్రజలు ఎంత ఆగ్రహంతో వున్నారో కేంద్ర ప్రభుత్వం  అస్సలు పట్టించుకోలేదు.  పైగా, కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ నిర్ణయించిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలి. ఆ కేటాయింపుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ప్రోటోకాల్‌ను ప్రకటిస్తుంది.అని ఒక ఫర్మానా జారీ చేసింది,  ఇది పుడు మీద కారం చల్లే వ్యవహారమే!
        ఇవ్వాల్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యనైనా, రేపటి తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యనైనా ఇరు ప్రాంతాల శాసనసభ్యులు  ప్రస్తుత రూపంలోవున్న అరకొర బిల్లుని ఏకగ్రీవంగా తిరస్కరించి, ఒక సమగ్రబిల్లుని పంపాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరి వుండాల్సింది. లేదా ఆ బిల్లుని పంపిన రాష్ట్రపతికి తమ మనోభావాల్ని సమిష్టిగా చెప్పివుండాల్సింది. ప్రాంతీయ  విబేధాలు వచ్చినపుడు  తెలంగాణులు 119 మంది. సీమాంధ్రులు 175 మంది అయితేకావచ్చుగానీ, ఇరు ప్రాంతాల ఉమ్మడి ప్రయోజనాలే దెబతింటున్నప్పుడు  తెలుగు-తెలంగాణులు 294  మంది అని చాటిచెప్పాలి.

        అయితే, రాజకీయాలు అంత విశాలహృదయంతో పనిచేయవు. ఎవరి ప్రయోజనాలు వారికుంటాయి. రాష్ట్రంలోని రాజకీయపార్టీల అధినేతలకూ,  ఇదే అదనుగా కొత్త పార్టీలు పెట్టాలని ఉవ్విళ్ళూరుతున్న నాయకులకూ అందరికీ చాలా రోజుల క్రితమే ఒక విషయం స్పష్టంగా తెలుసు; రాష్ట్రం విడిపోతున్నదనీ, దాన్ని ఆపడం సాధ్యమూ కాదని. ఇప్పుడు సాగుతున్న ప్రహసనం ఏమంటే, మినహాయింపు లేకుండా ప్రతిఒక్కరు వర్తమానం కోసంకాక, తమ రాజకీయ భవిష్యత్తు కోసం  పెనుగులాడుతున్నారు.

        తెలంగాణలో తమ కలలు పండించు కోవాలనుకుంటున్న రాజకీయపార్టీల నాయకులు ఎవరికివారు తెలంగాణను తామే సాధించామని చెప్పుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్లకు రాజకీయ సంధిగ్ధం ఏమీలేదు.  సీమాంధ్రలో  తమ కలలు పండించు కోవాలనుకుంటున్న రాజకీయపార్టీల నాయకులు విభజనను అడ్డుకోవడానికి తాము ప్రాణాలొడ్డి పోరాడామని చెప్పుకోవడానికి పోటీలు పడుతున్నారు. తమది ఎలాగూ విఫలయత్నమే అయినా సీమాంధ్ర ప్రజలు సానుభూతి ఓట్లు కురిపిస్తారని వాళ్ల నమ్మకం.

        టీఆర్ ఎస్, బీజేపి, యంఐయం, సిపిఐ, సిపియంలకు తెలంగాణ ప్రాంతంలో మాత్రమే  శాసనసభ్యులున్నారు. ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడంలో  వాళ్లకు భౌగోళిక సౌలభ్యం వుంది. జగన్ వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రాంతాన్ని వదులుకున్నారు కనుక వైయస్సార్ సిపి  బాహాటంగా సమైక్యాంధ్ర  అనడానికి సౌలభ్యం లభించింది. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర పీఠం తమదే అనీ నమ్మకంలో జగన్ అనుచరులున్నారు.
        రెండు ప్రాంతాల్లోనూ శాసనసభ్యులున్న కాంగ్రెస్, టిడిపి పరిస్థితే ఇప్పడు ఇబ్బందికరంగా మారింది. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ చెరోవైపు చెరో కళ్ళెం ఇచ్చేసి ఆయన కాడి దించేసి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలు కూడా అప్పుడపుడు రాజకీయాల్లో పనికివస్తాయి. కాంగ్రెస్  సీమాంధ్ర విభాగానికి  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, తెలంగాణ విభాగానికి సీనియర్ నేత జానా రెడ్డి, ఉపముఖ్యమంత్రి దామోదర రాజానరసింహ, గీతా రెడ్డి త్రయం నాయకత్వం వహిస్తున్నారు.  రాష్ట్రాన్ని  తెచ్చిన క్రెడిట్టును ఓటర్లు  కేసిఆర్ ఖాతాలో వేసేస్తారేమో అనే అనుమానంతప్ప, కాంగ్రెస్ తెలంగాణ విభాగానికి ఇతర సమస్యలు లేవు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకునే అవకాశం వాళ్లకు ఎలాగూవుంది. రాష్ట్రాన్ని చీల్చింది కాంగ్రెస్అని చెప్పాక ఆ పార్టీలో కొనసాగడం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు చాలా ఇబ్బందితో కూడిన వ్యవహారం. దీన్ని అధిగమించడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు నిజంగానే కొత్త బ్యాటు పట్టుకోవచ్చు.  అలా సీమాంధ్ర కాంగ్రెస్ క్రికెట్టు టీం  రెండు జట్లుగా మారవచ్చు.        ఒక జట్టు కిరణ్ కుమార్ తో నడిస్తే, రెండో జట్టు సోనియా విధేయులుగా మిగలవచ్చు, లేదా జగన్ శిబిరంలో చేరవచ్చు లేదా రాజకీయాల నుండి కొంతకాలం విశ్రాంతి తీసుకోవచ్చు.

        సీమాంధ్రలో జగన్ గుర్రం రేసులో ముందుంది అనేది కూడా పాక్షిక సత్యమే. బెయిలుపై బయటికి వచ్చాక ఆ ఐదు రోజుల లాంఛనపు దీక్ష, సమైక్య శంఖారావం  సభతప్ప, వారు  ప్రకటిస్తున్నట్టు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకున్న దాఖలాలు ఏమీలేవు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరుణంలో ఆయన పార్లమెంటులో మద్దతు కూడగట్టడానికి రాష్ట్రాల పర్యటనలు చేయడం పలాయనమో, ఫలితాలు రాబట్టడమో మరికొద్ది కాలానికిగానీ తెలియదు. ప్రస్తుతం అయనది మైదానంలో దిగి బ్యాటు ఝళిపిస్తున్న ఆటగాడి పాత్రమాత్రం కాదు.  ఒక విధంగా నాన్ ప్లేయింగ్ కెప్టెన్! 

        రాజకీయంగా అందరికన్నా ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు చంద్రబాబుగారిదే. అన్ని విధాలా ప్రజల తిరస్కారానికి గురౌతున్న కాంగ్రెస్ ఓడిపోతే, మళ్ళీ అధికారం తన చేతికే వస్తుందని కొంత కాలం వారు చాలా ధీమాగా వున్నారు.  గత ఎన్నికల్లో చిరంజీవి వచ్చి టీడిపి విజయాన్ని అడ్డుకున్నట్టు ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్, సీమాంధ్రలో జగన్ తన పాలిట సైంధవుడిలా  మారతారనే అనుమానం వారిలో బలపడుతోంది.

        బొత్స సత్తిబాబులా చంద్రబాబు కాడి వదిలేస్తే టిడిపి తెలంగాణ వ్యవహారాన్ని మోత్కుపల్లి నర్సింహులో, ఎర్రఎల్లి దయాకరో చూసుకునేవారు. ఆ పార్టి సీమాంధ్ర వ్యవహారాల్ని పయ్యావుల కేశవో, ముద్దు కృష్ణమనాయుడో చూసుకునేవారు. చంద్రబాబు అలా చేయలేరు. లేదా,  జగన్ లా తెగించి ఇక తెలంగాణ లేదనుకుని సీమాంధ్రలో సమైక్య  జెండా పట్టుకోనూలేరు.  రెండు చోట్లా లాభపడేమార్గాల్ని ఇప్పుడు వారు ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ ఆవరణలో  టి-తమ్ముళ్ళు, ఎస్ –తమ్ముళ్ళు కూడా ఆయన ఛాంబరు నుండే వెళ్ళి సభలో స్పీకర్ పోడియం ముందు పరస్పర విరుధ్ధమైన ప్లకార్డులు ప్రదర్శించడం రాజకీయ విచిత్రం!

        చంద్రబాబుగారికి దూరాలోచన ఎక్కువ.  అందరూ ఒక సమస్యలో తలమునకలై వున్నప్పుడు వారు ఆ తరువాతి ఘట్టాన్ని దర్శిస్తూ వుంటారు.  రాష్ట్రంలోని విపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినపుడు, ప్రధాన ప్రతిపక్షనేత అయివుండి కూడా  వారు బస్సుయాత్రలో రాజధాని నగరానికి దూరంగా వున్నారు.  ఇప్పుడు రాష్ట్ర పునర్విభజన బిల్లు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో వారు బీజేపీతో పొత్తు గురించి ఆలోచిస్తున్నారు.  తరచుగా బీజేపి నేతల్ని కలిసి, మళ్ళీ ఎన్డీయేలో తాను చక్రం తిప్పుబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

        చంద్రబాబుతో పొత్తు విషయంలో బీజేపి జాతీయ నేతల అభిప్రాయం ఏమిటో ఇంకా బయటికి రాలేదు.  కానీ, కిషన్ రెడ్డీతో సహా బీజేపి రాష్ట్ర నేతలు పొత్తులు వద్దని ఆహాటంగానే ప్రకటనలు చేస్తున్నారు. 2004  ఎన్నికల తరువాత బీజేపీతో పొత్తువల్లనే తాము ఓడిపోయామని తెలుగు తమ్ముళ్ళు ఒకవైపు, చంద్రబాబును నమ్మి ముందస్తు ఎన్నికలకు వెళ్ళీ నిండా మినిగిపోయాం అని కమలనాధులు మరోవైపు ఓ ఆరు నెలలు గుక్క తిప్పుకోకుండా తిట్టుకోవడం చాలా మందికి ఇంకా గుర్తుండేవుంటుంది.  ఏడేళ్ల తరువాత, 2011 టిడిపి మహానాడులో చంద్రబాబు గతంలో బీజేపీతో జత కట్టినందుకు పశ్ఛాత్తాపం చెందారు. అలా మహానాడులో పశ్ఛాత్తాపం చెందినందుకు  రెండున్నరేళ్ళ తరువాత వారు ఇప్పుడు మళ్ళా పశ్ఛాత్తాపం చెందుతున్నారు. భవిష్యత్తులో వారు  ఇలాంటి పశ్చాత్తాపాలు  మరిన్ని ప్రకటించవచ్చు.  టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు ఎందుకంత బాధ?అని మీడియా సమావేశాల్లో  ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.    

        రాష్ట్రంలో ఇప్పుడు వేడివేడిగా చర్చ జరుగుతున్న అంశం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టి పెడితే రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయని? కిరణ్ కుమార్ రెడ్డి  పార్టీ పెడితే అది నిస్సందేహంగా సీమాంధ్రలో జగన్ జోరుకు కళ్ళెం వేస్తుంది. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని తేల్చేసుకుని, జగన్ పార్టీలో జేబురుమాళ్ళు వేసుకు కూర్చున్న ఎస్-కాంగ్రెస్ వాళ్లలో చాలా మంది కిరణ్ కుమార్ రెడ్డి శిబిరంలో చేరే అవకాశాలు ఎక్కువగా వుంటాయి. సీమాంధ్రలో జగన్ కన్నా కిరణ్ దే పెద్ద పార్టి అయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు; ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టించిన అధ్బుతం లాంటిది ఇక్కడా ఏదైనా జరిగితేతప్ప, 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
20  డిసెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
22  డిసెంబరు 2013


No comments:

Post a Comment