Saturday, 28 December 2013

కిరణ్, బాబు, జగన్ – 1,2,3

కిరణ్, బాబు, జగన్ – 1,2,3

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
        ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ భీష్ములు. గాంధీ_నెహ్రు వంశానికి మూడు తరాలుగా ఆపద్బాంధవులుగా వుంటున్నవారు. తాను రాష్ట్రపతి భవనానికి చేరినా వీలుకుదిరితే  రాహుల్ గాంధీకి కూడా తన  అనుభవాన్నీ, విద్వత్తునీ అందించాలనుకుంటున్నవారు. రాహుల్ గాంధీకి దాన్ని అందుకునే స్తోమత వుందా? లేదా? అన్నది వేరే విషయం!

        గడ్డకట్టే ఢిల్లీ  చలి నుండి విడుపు కోసం శీతాకాలం విడిది హైదరాబాద్ కు వచ్చిన ప్రణబ్ దాకు ఇక్కడ వెచ్చదనం సంగతి ఎలావున్నా రోజూరోజుకీ  వేడుక్కుతున్న రాష్ట్ర రాజకీయ సెగలు మాత్రం గట్టిగానే తగులుతున్నట్టున్నాయి.  

       ప్రతి సమస్యకూ వారి దగ్గర పరిష్కారాలు వున్నాయోలేవో మనకు తెలీదుగానీ,  ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం వుంటుందని తెలిసిన జ్ఞాని ప్రణబ్ దా! తెలంగాణ నాయకులతోపాటూ, సీమాంధ్ర నాయకులు కూడా పలు సందర్భాల్లో పలు హోదాల్లో ప్రణబ్ ముఖర్జీని కలిశారు. విభజన రాష్ట్ర అంశంపై  తమ అభిప్రాయాల్ని చెప్పారు. ఇప్పుడు  మళ్ళీ  చెపుతున్నారు. అప్పటికీ ఇప్పటికీ తెలంగాణ నేతల అభిప్రాయాల్లో పెద్ద తేడా ఏమీలేదుగానీ, సీమాంధ్ర నేతల తలకిందుల తప్పస్సు మాత్రం ప్రణబ్ దా వంటి తలపండిన రాజకీయ నాయకునికి కూడా అశ్చర్యం కలిగిస్తూ వుండవచ్చు. 

        ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు-2013  సీమాంధ్రులకు ఎలాగూ నచ్చదని అందరికీ తెలుసు.   విచిత్రం ఏమంటే, తెలంగాణవాదులు కూడా ఇప్పుడు బిల్లు మీద పెదవి విరుస్తున్నారు.  అటు సీమాంధ్రులది ఏదో కోల్పోతున్నామనే ఆవేదన. భవిష్యత్తు అర్ధంకాని అయోమయం.  ఇటు తెలంగాణవాదులది  "యే దిల్ మాంగే మోర్ " ఉరిమే ఉత్సాహం! బరువులు, బాధ్యతలు, అప్పులు, హామీలు లేని తెలంగాణ కావాలని ఇప్పుడు కెసిఆర్ కొత్త పాచికలు కదుపుతున్నారు. 
       తాముచెపుతున్న సమైక్యవాదాన్ని సమైక్యంగా వినిపించి విజయాన్ని సాధించాలని సీమాంధ్ర నాయకులు ఏ దశలోనూ అనుకోలేదు;  అనుకోవడమూలేదు.  రేపు ఏర్పడబోయే సీమాంధ్ర రాష్ట్రంలో ఓట్లు, సీట్లు ఎలా దండుకోవాలనేదే వాళ్ల తాపత్రయంగా కనిపిస్తున్నది. 

       2004 ఎన్నికల నాటికి అధికారంలోవున్న చంద్రబాబు  సహజంగానే సమైక్యవాది.  ఆ ఎన్నికల్లో,  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును  వాగ్దానం చేసిన కాంగ్రెస్ సహజంగానే టీఆర్ ఎస్ తో పొత్తుపెట్టుకుంది. రాజకీయంగా తనను ఎదుర్కోలేని వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర విభజన అంశాన్ని ముందుకు తెచ్చారని ఆ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు విమర్శించేవారు. గురువారం రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడినప్పుడు కూడా  చంద్రబాబు ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. 2004 ఎన్నికల తరువాత ఏర్పడిన యూపియే ప్రభుత్వ కార్యక్రమాల్లో  చేరిన తెలంగాణ అంశాన్ని పరిశీలించడానికి వేసిన కేంద్ర  మంత్రివర్గ ఉపసంఘానికి ప్రణబ్ ముఖర్జీయే అధ్యక్షులు. 

       2009 కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చారు. ఆ ఎన్నికల్లోనే జగన్ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోనికి ప్రవేశించి, కడప లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్టుపై  గెలిచారు.  2004లో రాజశేఖరరెడ్డి చేసిన పనినే, 2009 ఎన్నికల్లో చంద్రబాబు చేశారు.  రాజకీయంగా వైయస్ ను ఎదుర్కోలేనని భావించి, కేసిఆర్ తో పొత్తు పెట్టుకున్నారు.  ఆ పొత్తు కోసం ముందు షరతుగా తెలంగాణ ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి ఒక లేఖ కూడా ఇచ్చారు. అప్పుడూ ఆ ఉప సంఘానికి అధ్యక్షులు ప్రణబ్ ముఖర్జీనే! చంద్రబాబుగారి చాణిక్యం ఎక్కడ వుంటుందంటే, వారు 2004 ఎన్నికలని  గుర్తుచేస్తారుగానీ, 2009 ఎన్నికల్లో టిఆర్ ఎస్ తో పెట్టుకున్న పొత్తు గురించి మాట్లాడరు.  2009 ఎన్నికల్లో 45 సీట్లు ఇస్తే  10 సీట్లు కూడా  గెలవలేకపోయారని కేసిఆర్ ను ఎద్దేవ చేస్తారుగానీ, కేసిఆర్ తో పొత్తుపెట్టుకోవడానికి తాను తహతహలాడిన  అంశాన్ని దాస్తారు. 

       కీలక వాస్తవాలని  దాయడంలో జగన్ కు కూడా చంద్రబాబే ఆదర్శం.  2009 ఎన్నికల్లో,  తొలి విడతగా తెలంగాణలో పోలింగ్ అయిపోయిన తరువాత, సీమాంధ్రలో పోలింగ్ ఆరంభం కావడానికి ముందు  వైయస్ రాజశేఖర రెడ్డి తొలిసారిగా బహిరంగంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. జగన్ ఈ అంశాన్నే గుర్తుచేస్తారుగానీ, కేసిఆర్ ను వెలుగులోనికి తెచ్చిందే  రాజశేఖర రెడ్డి అనే వాస్తవాన్ని దాచే ప్రయత్నం చేస్తారు. కాంగ్రెస్ నుండి విడిపోయి స్వంత పార్టీని పెట్టుకున్న తరువాత కూడా జగన్, ఆయన తల్లి విజయమ్మ. చెల్లి షర్మీల కూడా చాలా సంధర్భాల్లో తెలంగాణకు సానుకూలంగా ప్రకటనలు, తీర్మానాలు చేశారు. జగన్ ఒక అడుగు ముందుకువేసి, మూడవ అధీకరణం అధారంగా రాష్ట్రాన్ని విభజించాలని సూచనలూ చేశారు. ఇప్పుడు వారు, రాజ్యాంగంలో మూడవ అధీకరణాన్ని సవరించడానికి రాష్ట్రాలుపట్టి తిరుగుతున్నారు. 

       అందరికీ తెలిసిన వాస్తవాలని  దాయాలని సీమాంధ్రకు చెందిన ఇద్దరు కీలక నాయకులు ఎందుకు విఫలయత్నం చేస్తున్నారు? అనేది ఎవరికైనా రావలసిన ప్రశ్నే!  సీమాంధ్ర ప్రజలు తమను గుడ్డిగా అనుసరిస్తారని వీరిద్దరూ అనుకున్నారు. ఇది అతివిశ్వాసమూ కావచ్చు. అహంభావమూ కావచ్చు.  మరోవైపు, తెలంగాణలో బోనస్ ఓట్లు, సీట్లు రాబట్టుకోవడానికి వెకిలి రాజకీయ విన్యాసాలన్నీ చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీమాంధ్రను రాసిచ్చారు.!  వ్రతం చెడినా ఫలితం దక్కలేదు. తెలంగాణలో ఎలాగూ నూకలు చెల్లిపోయాయి. సీమాంధ్ర ఓట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి దాపురించింది. సీమాంధ్ర  ఓట్లనైనా కాపాడుకోవడానికి  "అశ్వథ్థామ అతః (కుంజరః)" అంటూ సగం దాచి, సగం బయటికి చెప్పడానికి నానా తంటాలు పడుతున్నారు.  

        గతాన్ని గుర్తు చేస్తే జగన్, చంద్రబాబు ఇద్దరికీ చిర్రెత్తుకొస్తుంది. గతాన్ని గుర్తు చేసే పాత్రికేయుల మీదే వీళ్లకు ఇప్పుడు ప్రధాన కోపం అంటే అతిశయోక్తికాదు. పాత్రికేయుల మీద  అసహనాన్ని వ్యక్తం చేయకుండా ఇటీవలి కాలంలో చంద్రబాబు, జగన్ ల మీడియా సమావేశాలు ముగియడం లేదు! 

       సీమాంధ్ర సియం రేసులో ఆఖర్న చేరిన నాయకులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. చంద్రబాబు, జగన్ లాగ కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు అనుకూలంగా లెటర్లూ ఇవ్వలేదు. ప్రకటనలూ చేయలేదు. ఆ మేరకు వారిమీద సీమాంధ్రలో ప్రతికూల ప్రభావం లేదు. అయితే, వారికున్న సానుకూల ప్రభావం ఎంతో కూడా అంతుచిక్కడంలేదు. తన దగ్గర ఇంకా లాస్ట్ బాల్ వుందని కిరణ్ కుమార్ రెడ్డి ఈమధ్య అభిమానుల్ని ఊరిస్తున్నారు. అయితే, పునర్విభజన బిల్లుపై శాసనసభ అభిప్రాయం చెప్పడానికి రాష్ట్రపతి విధించిన జనవరి 23 గడువు ముగిసేలోగా వారు తన దగ్గరున్న లాస్ట్ బాల్ బయటికి తీసేలాలేరు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి బలహీనతనే చెపుతోందిగానీ, బలాన్నికాదు. కిరణ్ కుమార్ ను నమ్మలేని, జగన్ క్యాంపులో ఇమడలేని మంత్రులు సహితం ఇప్పుడు చంద్రబాబు క్యాంపులో సీటు కోసం ప్రయత్నిస్తున్నారని గట్టి వినికిడి! ఆ మేరకు, జగన్, కిరణ్ ల మీద ఇది చంద్రబాబు విజయం అనే చెప్పాలి.

        ఇప్పుడు సీమాంధ్ర నాయకులు విభజన బిల్లును చర్చల ద్వారకాక, న్యాయవ్యవస్థలోని సౌలభ్యం, తర్కం ద్వార అడ్డుకోవాలనుకుంటున్నారు.  అందులోనూ నిజాయితీ కొరవడింది. ప్రాణప్రదమైన వునర్విభజన బిల్లుపై నిజాయితీగా, సుదీర్గ్జంగా చర్చ చేయాలనుకుంటే శాసనసభ సెలవులు రద్దు చేస్తే సరిపోతుంది. క్రిస్మస్ కు ఒక రోజు, సంక్రాంతికి ఒక రోజు సెలవు చాలదూ? దానికోసం రాష్ట్రపతిని కలిసి మరో ఇరవై రోజుల గడువు అడగడం దేనికీ?  చేతిలోవున్న కాలాన్ని సెలవుల్లో గడిపి, రాష్ట్రపతిని కలిసి గడువు కోరడం నిజాయితీ అనిపించుకోదు.

        విభజన బిల్లును తక్షణం శాసనసభ ఆమోదించాలని టీ-తమ్ముళ్ళు మోత్కుపల్లి సర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ వాదిస్తుంటే,  బిల్లు సమగ్రంగా లేదు కనుక దాని ప్రస్తుత రూపాన్ని మార్చాలని ఎస్-తమ్ముళ్ళు వాదిస్తున్నారు. జగన్ వర్గం  పది అడుగులు ముందుకువేసి,  బిల్లుపై శాసన సభలో చర్చకు అంగీకరించడమంటేనే విభజనకు అంగీకరించినట్టు అని ఒక అతివాదాన్ని ముందుకు తెచ్చింది. అలాకాకుండా శాసనసభ్యులందరూ అఫిడవిట్లు ఇవ్వాలని జగన్  కొత్త  విరుగుడుని కనుగొన్నారు.  వాదనకు వ్రాత రూపమే అఫిడవిట్ అయినపుడు నోటితో వాదించడానికీ,  రాసి ఇవ్వడానికీ తేడా ఏమిటీ? అనే సందేహానికి సమాధానం ఇవ్వడానికి జగన్ శిబిరం సిధ్ధంగాలేదు. 

       ఇక్కడ "శాసనసభ్యులందరు" అని ఎవరైనా అంటున్నపుడు వాళ్ళు తమ ప్రాంతపు శాసనసభ్యుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని అనుకోవాలి. ఇప్పుడు రాష్ట్రప్రజల్ని సంయుక్తంగా సంభోధించగల నాయకులు మనకు ఒక్కరూ లేరని అర్ధం చేసుకోవాలి.

       చట్టసభల్లో విభజన ప్రక్రియను అధ్యయనం చేయడానికి  స్పీకర్ నాదెండ్ల మనోహర్  లక్నో వెళ్లడం కూడా వివాదంగా మారింది.  అయితే, "స్పీకర్ కు బుధ్ధుందా? జ్ఞానముందా?" అని  జగన్  చేసిన విమర్శలు సంచలన విలువకేతప్ప, విలుపైన ఫలితాలను సాధించడానికి ఏమాత్రం ఉపయోగపడవు.   ఆరేళ్ల పిల్లవాడికి కూడా తెలుసు అని జగన్ అంటున్న విభజన ప్రక్రియ ఇప్పుడు మహానాయకులకు కూడా అర్ధంగాకేకదా ఇంతమంది తలలు బద్దలుగొట్టుకుంటున్నదీ? అయితే, సీమాంధ్రలో అరేళ్ల పిలగాడికి కూడా  తెలిసిన విషయం ఒకటుంది ఈ చిచ్చుకు వైయస్, చంద్రబాబు ఇద్దరూ తలోవైపు నుండి చెరో చెంబుడు  పెట్రోలు పోశారనీ, దానికి జగన్ సహితం సమిధనొక్కటి ధారబోశారనీ! 
   
        తెలంగాణలో భిన్న పార్టీల శాసనసభ్యుల మధ్య కనిపించే ఐక్యత సీమాంధ్రలో మచ్చుకైనా కనిపించడంలేదు. భిన్నపార్టీల మధ్య ఐక్యత సంగతి పక్కనపెట్టినా ఒకే పార్టిలోని శాసన సభ్యుల మధ్య కూడా ఐక్యత కరువైపోయింది. జేసి దివాకర రెడ్డి ఉదంతం దీనికి పెద్ద ఉదాహరణ. సమైక్యవాదులమంటూ నిత్యం గొంతు చించుకునే  నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం నాయకుల పచ్చి అవకాశవాదంతప్ప  మరేమీకాదు. ఇవన్నీ సీమాంధ్రలో యుధ్ధం మొదలవ్వడానికి ముందే కనిపిస్తున్న ఓటమి సంకేతాలు.

       ప్రస్తుతం, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర 'ఒక' బంతి మాత్రమే వుంది. చంద్రబాబు దగ్గర 'రెండు' కళ్ల సిధ్ధాంతం పదిలంగావుంది.  జగన్ 'మూడవ' అధికరణాన్ని నమ్ముకున్నారు. ఈ ఒకటి, రెండు, మూడు ఆయుధాలు సీమాంధ్రకు ఎంత వరకు  న్యాయం చేస్తాయో చూడాలి! 

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
28 డిసెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

29 డిసెంబరు 2013

No comments:

Post a Comment