Saturday, 14 December 2013

కొత్త స్పూర్తి, కొత్త ఆశ

కేజ్రివాల్

కొత్త స్పూర్తి, కొత్త ఆశ

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
పాపం పండాలి, కుంచం నిండాలిఅని పాత కాలంవాళ్ళు అనేవారు.  భారత దేశపు గ్రాండ్ ఓల్డ్ పార్టిగా  భావించే కాంగ్రెస్ కు ఇప్పుడు పాపం పండినట్టుకనిపిస్తోంది. అత్తకిచ్చిమాట కోసం శిశుపాలుని నూరు తప్పులు కాసిన శ్రీకృష్ణుడు  నూటొక్కో తప్పును కూడా కాయడుకదా! యూపీయే ప్రభుత్వం పేరుతో కాంగ్రెస్ ఇప్పటికే వెయ్యి తప్పులు చేసింది.  వెయ్యిన్నోకటో తప్పును కాయడానికి ప్రజలు సిధ్ధాంగాలేరు.

        వర్తమాన భారత రాజకీయల్లో ప్రధాన విషాదం ఏమంటే సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం. అమెరికాలో రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ లా,  యునైటెడ్ కింగ్ డమ్ లో కన్జర్వేటివ్స్, లేబర్ పార్టీలా, ఇండియాలో  కాంగ్రెస్బీజెపి ఒకదానికొకటి శాశ్విత ప్రత్యామ్నాయాలుగా స్థిరపడిపోయాయి. ఇలాంటి జంట ప్రత్యామ్నాయాలవల్ల ఒక ప్రమాదం ఏమంటే కొంత కాలానికి వాళ్ల మధ్య ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక అవగాహన ఏర్పడిపోతుంది. రాజకీయాలు సైధ్ధాంతిక ఘర్షణగాకాక,  ప్రణయకలహంగా మారిపోతాయి.  దీనికి పరాకాష్ట ఏమంటే అధికారంలో నువ్వున్నప్పుడు నువ్వు దోచుకో నేనున్నప్పుడు నేను దోచుకుంటాఅని ఒకరికొకరు హామీ ఇచ్చుకునే స్థాయికి  వ్యవహారం చేరిపోతుంది. ప్రజలు కూడా రెండు మూడు ఎన్నికలు చూసి,  వీళ్ళుపోతేవాళ్ళు వాళ్లుపోతేవీళ్లు వస్తారు అనే నిర్వేదానికి గురవుతారు. క్రమంగా వాళ్లకు  రాజకీయాల మీద ఆసక్తి, నమ్మకం కూడా తగ్గిపోతుంది. వీటి ఫలితమే కూటమి రాజకీయాలు.  కూటమి ప్రభుత్వాలు.
       
        ఆంధ్రప్రదేశ్ రాజకీయాలూ ఇందుకు భిన్నంగాలేవు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ కు టిడిపి, టిడిపికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా స్థిరపడిపోయాయి.  ప్రత్యర్ధి  పార్టి అధికారంలోవుందనే బాధతోకన్నా తరువాత తామే అధికారంలోనికి వచ్చేస్తామనే ధీమాతోనే ప్రతిపక్షపార్టీలు  బతికేస్తున్నాయి. ప్రజలు తమను ఒకసారి ఓడించినా, ఆపైవచ్చే ఎన్నికలో అయినా తమను ఎన్నుకోక  తప్పదనే ధీమాలో అధికారపార్టీలు బతికేస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీల ప్రత్యేక విధానాలు,  ఎన్నికల వాగ్దానాలు,  సాధారణ పరిపాలనా బాధ్యతలు సహితం గాలికి కొట్టుకుపోతున్నాయి. 

         ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వంలోని యూపియే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోవుంది. యూపీయేకు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు కనుక  వచ్చే ఎన్నికల్లో  విజయం తమదే అనే ధీమాతో బీజేపి నాయకత్వంలోని ఎన్డీయే వుంది.  దుందుడుకు (బీజేపి భాషలో దూసుకుపోయే) స్వభావంవున్న నరేంద్ర మోడి వంటి ప్రధాని అభ్యర్ధి దొరకడాన్ని ఆ కూటమి అదనపు అదృష్టంగా భావిస్తోంది.  జాతీయ రాజకీయాల్లో బీజేపి ఆలోచిస్తున్న తీరులోనే రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం ఆలోచిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు బాటలో ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఎంత ఖాయమో చెప్పడానికి డిజిటల్ డిస్ ప్లేలు ఇస్తున్నారు. 

        చాలా అరుదుగా మాత్రమే  రాజకీయాల్లో బలమైన  మూడో ప్రత్యామ్నాయం  పుట్టుకు వస్తుంటుంది. గత ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయాలంటూ యన్. జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పేరుతో, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పేరుతో రంగప్రవేశం చేశారుగానీ, ప్రజల ఆమోదాంశాన్ని  పొందడంలో వాళ్ళిద్దరూ  విఫలమయ్యారు. కూకట్ పల్లీలో పోటీ చేయడంలోనే జేపి బలహీనత బయటపడిపోయింది. చిరంజీవి స్వయంగా అత్తారిల్లు  పాలకొల్లులో పోటీ చేసి ఓడిపోయారు. రెండో స్థానంగా పోటీచేసిన తిరుపతిలో  వారు గెలవడం వేరే విషయం. 

        మూడో ప్రత్యామ్నాయం అనగానే ఎవరికైనా గుర్తుకు రావల్సిన మొదటి పేరు యన్టీ రామారావు. అంతవరకూ కాంగ్రెస్ – కమ్యూనిస్టుగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదికని  ఆయన కాంగ్రెస్- తెలుగుదేశంగా మార్చేశారు. నిజాం పతనాన్నీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటునీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో శాసించిన పార్లమెంటరీ వామపక్షాల్ని రాజకీయ ప్రధాన స్రవంతి నుండి తప్పించగలగడానికి కమ్యూనిస్టుల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణం.   పార్లమెంటరీ వామపక్షాలు తాము చెప్పే దీర్ఘకాలిక లక్ష్యాలను ఎలాగూ చేరుకోలేక పోయాయి.  ప్రజలు కోరుకునే తక్షణ లక్ష్యాలనీ సాధించలేకపోయాయి.  వెరసి రాజకీయాల్లో గుడ్డి దీపంలా మారిపోయాయి.

సినిమాలకు కథ ముఖ్యం. పార్టీలకు రాజకీయాలు ముఖ్యం. తెలుగునాట ఈ విజయ రహాస్యం యన్టీ రామారావుకు తెలిసినంతగా మరెవరీకీ తెలియదంటే అతిశయోక్తికాదు. వెండితెర మీద పురాణ పురుషులకు ఒక రూపాన్నిచ్చినట్టే, రాజకీయ రంగంలోనూ సంక్షేమ పథకాలకు   అయన ఒక కొత్త వూపునిచ్చారు. యన్టీ రామారావు 1982లో రాజకీయ రంగంలో ప్రవేశించగానే రాష్ట్ర రాజకీయాలు ఆయన చుట్టూ తిరగడం ఆరంభించాయి.

ఇప్పటికీ చాలా మంది గుర్తించని అంశం ఏమంటే, యన్టీ రామారావు నేరుగా  సినిమారంగం నుండి రాజకీయాల్లోనికి రాలేదు.  సినిమారంగంలో వుండగానే, తన రాజకీయ దృక్పధాన్ని రూపకల్పన చేసుకున్నారు. సందర్భాన్నిబట్టి దాన్ని ప్రచారంలో పెడుతూవచ్చారు. యన్టీ రామారావు మొదటీ నుండీ ద్రావిడ అభిమాని. ఆయన మొట్టమొదటిసారిగా దర్శకత్వం  వహించిన 'సీతారామ కళ్యాణం' సినిమాలోనే అది ప్రస్పుటంగా కనిపించింది. స్వంత  బేనర్‌, నేషనల్‌ ఆర్ట్‌ ధియేటర్స్‌ నిర్మించిన ఆ సినిమాలో రామారావు కథానాయకుడు కాదు. ప్రతినాయకుడు. రావణాసురునిగా బహుళ ప్రచారంలో వున్న పాత్రను ఆయన రావణబ్రహ్మగా మలిచి ప్రాణప్రతిష్ట చేశారు. తదుపరి సినిమా, 'శ్రీకృష్ణపాండవీయం' లోనూ దుర్యోధనుణ్ణి సుయోధనుడ్ని చేశారు.

        యన్టీ రామారావు సాంస్కృతిక దృక్పధం ఆర్యవ్యతిరేకత అనేది సుస్పష్టం. అది ఆయనకు, పుట్టినిల్లు గుడివాడ తాలూకాలో కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి ద్వార అబ్బిందో, మెట్టినిల్లు మదరాసులో పెరియార్‌ ఇ.వీ. రామస్వామి నాయకర్‌ ద్వారా అబ్బిందో, లేక సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ తనకు మార్గదర్శిగా భావించే యం.జీ. రామచంద్రన్‌ ద్వారా అబ్బిందో చరిత్రకారులు తేల్చాల్సేవుంది.  రాజకీయాల్లో భౌగోళికంగా ఆయన దక్షణాది అభిమానాన్నీ, ఉత్తరాది వ్యతిరేకతను ప్రదర్శించేవారు.  దానికి కొనసాగింపే, ఆయనిచ్చిన  సాంస్కృతిక నినాదం 'తెలుగుజాతి ఆత్మగౌరవం'. ''ఢిల్లీ ఒక మిధ్య'' అనడం అప్పట్లో ఆయనకుమాత్రమే సాధ్యమయ్యే విషయం.
        సరిగ్గా యన్టీ రామారావు వంటి ఆశావహ  ప్రత్యామ్నాయం ఇప్పుడు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రూపంలో ప్రత్యక్షమయింది. అప్పట్లో యన్టీఆర్ తీరాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల నుండి పోటీ చేసి మూడు చోట్లా గెలిచి, తన సత్తా చాటారు.  కేజ్రీవాల్ నేరుగా సిట్టింగ్ సియం షీలా దీక్షిత్  మీద పోటీకి దిగారు. అలాంటి తెగువను ఇటీవలి కాలంలో ఇంకెవరూ చూపలేదు.

        సాంప్రదాయ రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయనడానికి గత ఏడు పార్లమెంటు ఎన్నికలే ప్రబల సాక్ష్యం. దాదాపు మూడు దశాబ్దాలుగా, పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకీ, సాధారణ అధిక్యత (మ్యాజిక్ ఫిగర్ 273) దక్కడంలేదు. అన్నీ కూటమి ప్రభుత్వాలే.   ఏఐఏడీయంకే అధినేత్రి జయలలిత కూటమి నుండి తప్పుకోవడంతో 1999 మధ్యలో పతనమైపోయిన మొదటి యన్డీయేను కార్గిల్ యుధ్ధం ఆదుకుంది!. ఆ యేడాది చివర్లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో బీజేపి సీట్లు 182 నుండి పెరగనప్పటికీ, కాంగ్రెస్ సీట్లు తగ్గి, మొత్తమ్మీద యన్డీయే పక్షాలకు ఆధిక్యం లభించింది. 2002 లో నరేంద్ర మోదీ హయాంలో సాగిన గుజరాత్ మారణకాండ 2004  లో రెండవ యన్డీయే ప్రభుత్వానికి చరమగీతం పాడింది.  

        ప్రజల్లో కొత్త ఆశల్ని కల్పిస్తూ, కాంగ్రెస్ నాయకత్వాన 2004 లో ఏర్పడిన మొదటి యూపియే ప్రభుత్వం అంచనాల మేరకు పనిచేసింది ఏమీలేదు. అయినప్పటికీ, గుజరాత్ మారణకాండ వంటివి లేకపోవడంతో. 2009 లో ఆ కూటమికి మద్దతు పెరిగి, రెండవ యూపీయే ప్రభుత్వం ఏర్పడింది.  ప్రజల నమ్మకాన్ని రెండవ యూపీయే వమ్ము చేసింది. దేశంలో ప్రాయోజిత పెట్టుబడీదారి విధానం విజృంభించింది.  అధికారాన్ని చేపట్టిన మరునాటి నుండే గుట్టలుగుట్టలుగా స్కాములు బయటపడ్డం మొదలెట్టాయి. సాక్షాత్తు ప్రధానమంత్రి మీదనే భారీ ఆరోపణలు వచ్చాయి. మరోవైపు, దేశంలో పేద, మధ్య తరగతి జీవితం నరకంగా మారిపోయింది. దేశంలో 1990 ల నాటి ఆర్ధిక సంక్షోభాన్ని పరిష్కరించిన సంస్కరణల శిల్పి అని ప్రచారంలోవున్న మన్మోహన్ సింగ్ హయాంలోనే దేశ ఆర్ధిక స్థితిగతులు అధఃపాతాళానికి  చేరుకున్నాయి. కొత్త విధానంతో, బంగారం తాకట్టుపెట్టి బతుకును వెళ్లదీసే పరిస్థితి కూడా ఇప్పుడు మధ్యతరగతికి లేకుండాపోయింది.  
        బీజేపి, కాంగ్రెస్  లకు భిన్నంగా కాస్త మేలైన పాలనని అందించే నాయకుని కోసం దేశప్రజలు గత మూడేళ్ళుగా కళ్ళుకాయలుగాచేట్టు  ఎదురు చూస్తున్నారు. సరిగ్గా అలాంటి సందర్భంలో   ప్రత్యక్షమయ్యాడు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలు అధికార కాంగ్రేస్  ను పాతాళానికి తొక్కేశారు. విపక్ష బీజేపికి ఆధిక్యం లేకుండా చేసేశారు. బలమైన ప్రత్యామ్నాయంవుంటే ఇప్పుడు ఢిల్లీలో జరిగిందే రేపు దేశమంతటా జరగవచ్చు!  మొదటి ప్రయత్నం హంగ్ తో ముగిసినా, రెండో ప్రయత్నంలో భారీ ఆధిక్యం కూడా రావచ్చు.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
14  డిసెంబరు 2013

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

15  డిసెంబరు 2013 

No comments:

Post a Comment