Saturday, 25 January 2014

ఒక మంచిసినిమా – ఒక చెత్త సినిమా!

ఒక మంచిసినిమా ఒక చెత్త సినిమా!
. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్ని ముఫ్పయ్యేసి సార్లు చూసేవారట నిన్నటితరపు మరో హీరో కృష్ణంరాజు. మంచి సినిమాను చూసేకొద్దీ  రసాస్వాదన పెరుగుతుంది.  ప్రతిసారీ అంతకు ముందు మనం గమనించని అనేక సునిసిత అంశాలు ఆవిష్కారం అవుతుంటాయి.

తెలుగు వెండి తెరపై యన్టీ రామారావు ప్రచండభానుడిగానూ, అక్కినేని నాగేశ్వరరావు వెండి వెన్నల జాబిలిగానూ వుండేవారు.  దాని అర్ధం యన్టీ రామారావు సాత్వికపాత్రల్నీ,  అక్కినేని నాగేశ్వరరావు రౌద్రపాత్రల్నీ పోషించలేరనికాదు. కానీ, వాళ్ళిద్దరి ఆహార్యానికి అవి అంతగా నప్పేవికావు.

        అక్కినేని మా అమ్మమ్మకు బాలరాజు; మా అమ్మ, నాన్నలకు నాగేశ్వరరావు; మా తరానికి ఏఎన్నార్. 1964లో నరసాపురం పరిసరాల్లో మూగమనసులు సినిమా తీశారు. అందులో హీరో అక్కినేని. ఆ సినిమా  చాలా పెద్ద హిట్టు.  అలా ఆయన గోదావరినదికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అంతకు ముందు సినిమాల్లో గోదావరి వుందోలేదోగానీ,  మూగమనసులు తరువాత గోదావరి తీరం అనేది  తెలుగు సినిమా రంగంలో పెద్ద హిట్టు ఫార్మూలా అయిపోయింది.

1969 సంక్రాంతికి విడుదలైన అదృష్టవంతులు సినిమాలో అయ్యయ్యో బ్రహ్మయ్య పాటలో అక్కినేని నేరో కట్ ట్రౌజర్ లో కనిపించి ఆనాటి యువతరాన్ని షేక్ ఆడించారు. కాలేజీ జీవితాన్ని గడుపుతున్న  మాతరం అంతా ఆ పాట మైకంలో దర్జీ దుకాణాలకు పరుగులు పెట్టి పాత గొట్టం ప్యాంటుల్ని ఆల్టర్ చేయించుకోవాల్సి వచ్చింది.

ప్రేక్షకుల మీద మహానటుల ప్రభావం కేవలం చొక్క, ప్యాంటు, హెయిర్ స్టైల్, సిగరెట్టు pogaపొగ రింగులు వదలడానికే పరిమితంకాదు. అది అంతకు మించిన ఒక ఉన్నత సంస్కృతిని ప్రమోట్ చేస్తుంది. వెండితెర మీద భగ్నప్రేమికుడ్ని అక్కినేని అద్భుతంగా ఆవిష్కరించారు.  రొమాంటిక్ హీరో ఇమేజ్ ను కొనసాగిస్తూనే ట్రాజెడీ కింగ్ అనిపించుకోవడం  సాధారణమైన విన్యాసంకాదు.  అమ్మాయిలతో ఎలా వ్యవహరించాలి అనేదానికి మా తరానికి అక్కినేనియే ప్రమాణికం. నిజజీవితంలో డోంట్ కేర్గా వుండే యువకులు సహితం అమ్మాయిల విషయం రాగానే చాలా సున్నితంగా మారిపోయేవారు. విఫలప్రేమికులు సహితం ప్రియురాలి పెళ్ళికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పివచ్చేవారు. మిత్రుల మధ్య అదొక వున్నత విలువగా కొనసాగేది. మా తరంలో ప్రేమనగర్ సినిమా ప్రభావం ఆ స్థాయిలో వుండేది.

గొప్ప నటులు, గొప్ప సినిమాల గురించి చెప్పుకున్నాక, చెత్త నటులు, చెత్త సినిమాల గురించి మాట్లాడుకోవడం ఇబ్బందిగానే వుంటుంది. చెత్త సినిమాను ఒక్కసారి చూడడం కూడా శిక్షగానే వుంటుంది. చెత్త సినిమాను ఎవరైనా  శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలతో పోల్చారోలేదోగానీ, పోల్చినా తప్పుకాదు. 

        వైయస్ విజయమ్మగారికి నెల రోజులుగా తీరని సందేహం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు – 2013పై  చర్చ మాత్రమే వుంటుందా? ఓటింగు కూడా నిర్వహిస్తారా? వారికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎప్పటికీ సమాధానం చెప్పరు. ఈ పునరుక్తి దోషాన్ని మనం ఇప్పటికే డజన్ల సార్లు ఛుశాం. ఈ నెలాఖరు వరకు చూడకతప్పకపోవచ్చు.

హిచ్ కాక్ సినిమా అనుకుంటాను. ఒకమ్మాయి దుస్తులన్నీ తీసేసి స్విమ్మింగ్ పూల్ లోనికి దూకుతుంది. సరిగ్గా ఆమె చివరి కాస్ట్యూము తీసే సమయానికి ఒక కారు అడ్డం వస్తుంది. ఆ సినిమాని ఒక ప్రేక్షకుడు వరుసగా నెల రోజులు చూశాట్ట. ఆ అమ్మాయి ఒక్కసారయినా కారు రాకముందే దూకకపోద్దా? లేకపోతే, కారు వెళ్ళిపోయాక  అయినా దూకకపోద్దా? అని. తెలుగు టివీ న్యూస్ ఛానళ్లలో శాసనసభా ప్రత్యక్ష ప్రసారాలు చూసేవాళ్ళు ఆ హిచ్ కాక్ సినిమా ప్రేక్షకునికన్నా భిన్నమైనవాళ్ళేమీకాదు. విజయమ్మగారికి కొత్త సందేహం వస్తుందేమోననీ,  పాత నిర్ణయాలకు మాండేట్ రాలేదు కనుక చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకుంటారేమోననీ, జగన్ సమైఖ్య శంఖారావం  చిత్తూరు జిల్లా దాటుతుందేమోననీ,  కిరణ్ కుమార్ రెడ్డి ఏదో ఒక క్షణాన్న కొత్త పార్టీని ప్రకటిస్తారేమోనని, సీమాంధ్ర  సభ్యులు ఇప్పుడైనా  భారీ ప్యాకేజి అడుగుతారేమోనని, తెలంగాణ సభ్యులు కొంచెమైనా మెతకబడతారేమోనని వాళ్ళు కళ్లప్పగించి, టీవీలకేసి  చూస్తుంటారు. 
తల్లిదండ్రులు ఏది ఇచ్చినా పిల్లలు కింద పడేసుకుని, మళ్ళీ అదే కావాలని మారాం చేస్తుంటారు. క్రిస్మస్, న్యూయియర్, సంక్రాంతి పేరున శెలవులు ఆస్వాదించి, జాతి చరిత్రలో అత్యంత ప్రాణప్రదమైన సమయాన్ని నిర్లక్ష్యంగా వృధాచేసిన  సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బిల్లుపై చర్చకు మరింత గడువు అడగడం పిల్లచేష్టకన్నా భిన్నమైనదేంకాదు. బహుశ సొమవారం నుండి శాసన సభలో కొత్త అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. కొత్త అధ్యాయం అన్నంతమాత్రాన అది  ప్రగతిశీలమైనది అయిపోనక్కరలేదు. బిల్లుపై చర్చ జరగకుండానే  వచ్చేవారం కూడా గడిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చర్చకు వ్యవధి మరింత పెంచాలని  సీమాంధ్ర నేతలు మరోవారం రోజులు భీకరపోరు చేయవచ్చు. ఈసారి రాష్ట్రపతిని కూడా టార్గెట్ చేయవచ్చు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం ( ఎక్స్ పెడైట్) చేయడానికి వీలుగా శాసనసభలో చర్చను త్వరగా ముగించాలని గడువు పెంపు ఉత్తర్వుల్లో రాష్ట్రపతి  పేర్కొనడం కొత్త వివాదానికి కావలసినంత ఇంధనాన్ని సరఫరా చేసింది.

ఏపీఎన్జీవోలు భారీగా ప్రచారం చేసిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతిరోజూ ఇందిరాపార్క్ వద్ద జరిగే అనేకానేక నిరసన కార్యక్రమాల్లో ఒకానొక కార్యక్రమంగా మిగిలిపోయింది. ఎన్జీవోలు తమ కోర్కెల్ని  నెరవేర్చుకున్నాక వాళ్లలో పూర్వపు విద్యుత్తు కనిపించడంలేదు. రాజు తిరుగుబాటు చేయడం రాజ్యాంగబధ్ధమేనా? అంటూ కేజ్రీవాల్ ధర్నాపై ఎంయల్ శర్మా అనే న్యాయవాది ఈమధ్య సుప్రీంకోర్టులో ప్రజాహిత వాజ్యం వేశారు. రాజాస్థాన ఉద్యోగులు చేసే తిరుబాట్లు కూడా ఈ కోవలోనికే వస్తాయి!  

 ఇందిరాపార్కు అయినా, శాసనసభ అయినా సీమాంధ్ర ప్రతినిధుల వ్యవహారశైలిలో పెద్దగా మార్పులేదు. సమైక్యతా  సమగ్రతా  తమ  నినాదం,  విధానం అనేవాళ్ళు సభలో ఎలా  ప్రవర్తించాలీ? విభజన కోరేవాళ్లను నచ్చచెప్పాలి.  ఒప్పించాలి. బతిమాలాలి. బుజ్జగించాలి. అలా కాకుండా కాలుదువ్వితే ఏమవుతుందీ? విభజన ప్రక్రియ మరింత వేగం అవుతుంది. ఈపాటి ధర్మసూక్ష్మం తెలిసినవాళ్ళు కూడా మనకిప్పుడు రాజకీయాల్లో కనిపించడంలేదు. రాష్ట్రాన్ని విభజించాలనుకునేవాళ్ళూ,  రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటున్నవాళ్ళూ ఒకే విధంగా కాలుదువ్వుతున్నారు.  సంభాషణల్ని సినిమావాళ్ళే రాస్తున్నారో మరొకటోగానీ, మన ప్రతినిధులు ఈ మధ్య సినిమా డైలాగులు విపరీతంగా వాడుతున్నారు. 

చాలా కాలంక్రితం చదివిన అల్పిక. కొడవటిగంటి కుటుంబరావుగారిది అనుకుంటాను. బక్కపల్చగావున్న హింసావాది, బాగాబలిసిన అహింసావాది తలపడతారు. ఆ పోరులో హింసావాది చనిపోతాడు. "హింసావాదం చనిఫోయింది. అహింసావాదం గెలిచింది". అని అహింసావాది  విజయగర్వంతో అరుస్తాడు.  సేవ్ ఆంధ్రప్రదేశ్ ధర్నా శిబిరం వద్ద  "ఎవడి దెబ్బ తగిలితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో వాడే సమైక్యవాదిడైలాగ్ విన్నప్పుడు  ఎవరికైనా కోకు అల్పిక గుర్తుకు వచ్చివుండాలి. కత్తి మొన మీద సమైక్యతను సాధించడానికి కొందరు ఉత్సాహంగా వున్నట్టున్నారు!.  ఎక్కడో ఒకచోట  విభజన ప్రక్రియకు  దైవికంగా బ్రేక్ పడుతుందనే ఒక విశ్వాసం  కొందరు సమైక్యవాదుల్ని నడిపిస్తున్నట్టుంది.

        రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సీమాంధ్రులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నింగ్  ను ఈ వారం చూడగలిగాం. వారు క్రీజు లోనికి దిగడానికి ముందు సుదీర్ఘ ప్రాక్టీస్ చేశారని ఎవరికైనా అర్ధం అవుతుంది.  అయితే, వారు సుదీర్ఘ ఇన్నింగ్  ఏమీ ఆడలేదు.  లగడపాటి రాజగోపాల్ ఊరించినట్టు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించలేదు. కొన్నిసార్లు భారీ షాట్ల కోసం కు ప్రయత్నించి, బ్యాటును గాల్లోకి లేపారుగానీ బంతిని మాత్రం ఆశించినట్టు పెవిలియన్ కప్పు పైకి పంపలేకపోయారు. అయితే, వారు వచ్చే వారం మరో ఇన్నింగ్ ఆడే అవకాశాలు కూడా వున్నాయి. అప్పుడు బ్యాట్ ను ఝళిపిస్తారని అనుకోవచ్చు.

తొలి ఇన్నింగ్స్ లో కిరణ్ కుమార్ తీసిన పరుగులు పెద్దగా లేకపోయినా, స్వంత టీమ్ నుండి మంత్రులు డొక్క మాణిక్యవరప్రసాద్, పసుపులేటి బాలరాజు  భిన్న స్వరాన్ని అందుకోవడం వారికి పెద్ద దెబ్బే. వరప్రసాద్, బాలరాజు ఇద్దరూ అణగారినవర్గాలకు చెందినవారు. సీమాంధ్రలో  బలహీనవర్గాలు భిన్నంగా ఆలోచిస్తున్నారు అనడానికి ఇది సంకేతం అయితే, ఈ సంకేతాన్ని తక్కువగా చూడడానికి వీల్లేదు.

తొలి ఇన్నింగ్ ముగిశాక ఢిల్లీ బహుత్ దూర్ హై అంటూ  కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ చరిత్రాత్మకమైనది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో యన్టీ రామారావు ముప్ఫయి యేళ్ల క్రితం కేంద్ర మిధ్యా అన్నారు. దానికి ఏమాత్రం తగ్గనిది ఇప్పటి కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్! ఇలాంటి వాదాలు  విస్తృతంగాసాగి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించగలిగితే ఫెడరల్ విలువలు పెరగడానికి దోహదపడవచ్చు!

మనకిప్పుడు శాసనసభలో కళ్ళకు కనిపిస్తున్న ఒక వైచిత్రి కొనసాగుతోంది.   సమైక్యతావాదులు అనైక్యతారాగాన్ని ఆలపిస్తుంటే, విభజనవాదులు సమైక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు.  రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ వుండేవే. ఆ అంశాన్ని పక్కన పెడితే, ఆధునిక శాసనకర్తలు ఎలా వుండాలో ఈవారం అక్బరుద్దీన్ ఒవైసీ, కేటిఆర్ చాటిచెప్పారు. వాళ్ళు చెప్పిన అభిప్రాయాల మీద సీమాంధ్రుల్లో కొందరికో అందరికో భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. అయినప్పటికీ, పరిశోధన, సంసిధ్ధత, సమర్పణ లేనిదే ఎవరూ శాసనసభలో రాణించలేరని వారిధ్ధరూ నిరూపించారు. ప్రస్తుతం మనకు సీమాంధ్ర నుండి శాసనసభలో సభ్యత్వం పొందినవాళ్ళున్నారుగానీ  శాసనకర్తలులేరంటే ఎవరూ బాధపడాల్సిన పనిలేదు!

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
25  జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి

26    జనవరి  2014

Saturday, 18 January 2014

గడువు పొడిగించే వ్యూహం

గడువు పొడిగించే వ్యూహం 

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

సింగితం శ్రీనివాసరావు సినిమా ఆదిత్య_369 లో కథానాయకుడు బాలకృష్ణ టైమ్ మిషన్ లో ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి చేరుకుంటాడు. అక్కడ జరిగే ప్రతీ విషయం కథానాయకునికి ముందుగానే తెలిసిపోతుంటుంది. జరిగే విషయాలను ముందుగానే పసిగట్టడానికి టైం మిషన్లు అఖ్ఖరలేదు. కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలకు కారణమైన హేతువునూ, చర్యప్రతిచర్యల్నీ, వివిధ సంఘటనల మధ్య అన్యోన్యసంబంధాన్నీ గుర్తించగలిగితే జరగబోయే పరిణామాల్ని కచ్చితంగా కాకపోయినా కొంచెం అటుఇటుగా అయినా  పరికల్పన చేయవచ్చు. ఇదేమీ జ్యోతిష్యంకాదు. సామాజికశాస్త్రం. ప్రకృతి శాస్త్రానికీ, సామాజికశాస్త్రానికీ ఒక తేడా ఏమంటే  ప్రకృతిశాస్త్రాల్లో ఫలితాన్ని కఛ్ఛితంగా అంచనావేయవచ్చు. సామాజికశాస్త్రాల్లో ఫలితాన్ని ఊహాగానం మాత్రమే చేయగలం. పరిణామం అలాగే వుండవచ్చు లేదా స్వల్పమార్పులు వుండవచ్చు.

ఎవరైనా చనిపోగానే కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా భోరున ఏడుస్తారు. ఇరుగుపొరుగు వచ్చి వాళ్ళు ఏడుస్తూ, వీళ్లను ఓదారుస్తారు. అరగంట తరువాత అందరి ఏడ్పులు ఆగిపోతాయి. బంధువులు చొరవచేసి మృతుని కుటుంబ సభ్యుల్ని ఏదైనా తినమని బతిమాలుతారు. ఆ సమయంలో, మృతునితోపాటూ తాము కూడా చనిపోదామనే భావోద్వేగంలోవున్నకుటుంబసభ్యులు ఆహారాన్ని నిరాకరిస్తారు.  ఒకటి రెండు గంటల తరువాత  పిల్లలకు పాలు పట్టించడంతో మళ్ళీ ఆహార కార్యక్రమం మొదలవుతుంది.  వాతావరణం నిశ్శబ్దంగా వుంటుంది. శవం అంతిమ యాత్ర మొదలవుతుంది. కుటుంబసభ్యులు,  బంధుమిత్రులు ఒక్కసారిగా భోరున ఏడుస్తారు.  శవానికి అంత్యక్రియలు జరిపి మగవాళ్ళు తిరిగివస్తారు.  మళ్ళీ ఏడ్పులు. మళ్ళీ నిశ్శబ్దం.  మరో రెండు గంటల తరువాత ఎవరో దయగలవారు భోజనం వండి పంపిస్తారు. ఈసారి కుటుంబ సభ్యులు సహితం ఎంగిలిపడతారు. మరునాడూ ఏడ్పులు, నిశ్శబ్దంతో గడుస్తుంది. ఆ తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు.  దీనికి స్క్రిప్టు, దర్శకత్వం ఏదీ వుండదుగానీ ఎవరైనా చనిపోయినపుడు అందరి ఇళ్లలోనూ దాదాపు ఇలానే జరుగుతుంది. కొన్ని పనులు తధ్ధర్మక్రియలా జరిగిపోతుంటాయి.  ఇదే గ్రాండ్ నేరేటివ్స్!  

శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు_2013 పై  చర్చ సాగుతున్న తీరు గ్రాండ్ నేరేటివ్స్ కు చక్కటి తాజా  ఉదాహరణ. సభ ప్రారంభంకాగానే అన్ని పార్టీల సభా నాయకులు వాయిదా తీర్మానాలు ప్రవేశపెడతారు. స్పీకర్ వాటిని తిరస్కరిస్తారు. బీయేసీలో  నిర్ణయించిన ప్రకారం పోదాం అంటారు. సభ్యులు వినరు. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టుతారు.  సభా కార్యక్రమాల్ని స్థంభింపచేస్తారు. స్పీకర్ సభను అరగంట వాయిదా వేస్తారు. అరగంట తరువాత వైయస్సార్ సిపి సభానాయకురాలు వైయస్  విజయమ్మ సభలో ముందు ఓటింగ్ జరిపి తరువాత చర్చ మొదలెట్టాలంటారు. స్పీకర్ కుదరదంటారు. దానికి నిరసనగా ఆరోజుకు వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి విజయమ్మ వెళ్ళిపోతారు. ఆ తరువాత విభజనవాదులు, సమైక్యవాదులు తమ తమ ప్రసంగాలు మొదలెడతారు. పురాణగాధలు, తమ గురించిన అతిశయోక్తులుతప్ప,  ప్రత్యర్ధుల్ని సహితం ఒప్పించే ప్రయత్నం  అందులో ఏ కోశానా వుండదు.

సీమాంధ్ర టీం కెప్టెన్లలో జగన్  సమయం అంతా చిత్తూరుజిల్లాలో  స్పెషల్ ప్రాక్టీసు చేయడానికే సరిపోతోంది.  వారు వాటర్ బాయ్ ద్వార టీం మెంబర్సుకు  మార్గదర్శకాలు పంపగలరుగానీ, బ్యాటు పట్టి శాసన సభలో బ్యాటింగ్ విన్యాసాలు చేయలేరు. ఇక్కడ శాసన సభలో జగన్ టీం వైస్ కెప్టెన్ వైయస్ విజయలక్ష్మీ ప్రతిరోజూ  రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరుగుతున్నారు. టీంలో ఎంతమంది వున్నారో కూడా వారికి అంచనా లేనట్టుంది.  సభలో వారి నిస్సహాయతను చూసి ఎవరికైనా జాలి వేస్తుంది.

సీమాంధ్ర మరో కెప్టెన్ చంద్రబాబు ఒకే సమయంలో తెలంగాణ టీంకు కూడా కోచ్ గా వ్యవహరిస్తున్నారు.  ద్వంద సభ్యత్వం కారణంగా  వారు ప్యాడ్లు కట్టుకుని బ్యాటు పట్టుకుని మైదానంలోనికి దిగే అవకాశాలు చాలా తక్కువ.  "కీప్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్స్" అనేది  పేకాటలో  మంచి వ్యూహమేగానీ, తన ముక్కలు తానే చూసుకోలేని పరిస్థితి చంద్రబాబుకైనా చిత్రమైన విషాదమే!

సీమాంధ్ర తాజా కెప్టెన్  కిరణ్ కుమార్ రెడ్డి, బ్యాటింగ్ విన్యాసాలు మనకు తెలీనప్పటికీ, ఇప్పటికైతే వారు  ప్రత్యర్ధులతో బ్రహ్మాండంగా మైండ్ గేమ్ అడుతున్నారు.  ఏరికోరి తెచ్చుకున్న సాకే శైలజానాథ్ ను ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా  పంపి తన తెలివిని ప్రదర్శించారు.  కెప్టెన్ ఆదేశాల ప్రకారం  శైలజానాధ్   వికెట్ల ముందు పాతుకుపోయే ప్రయత్నం విజయవంతంగా  చేసినప్పటికీ స్పోర్ట్స్ మీడియా దృష్టిలో మాత్రం  నైట్  వాచ్ మన్ అనిపించుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లోనే బ్యాట్ తో ప్రత్యర్ధులకు సమాధానం చెపుతాను అని కెప్టెన్ కిరణ్ చేసిన ప్రకటన కూడా శైలజానాధ్ ను  నైట్  వాచ్ మన్ గా మార్చాయి.  అయితే, మ్యాచ్ ముగిశాక  శైలజానాథే తమ ప్రధాన బ్యాట్స్ మన్ అని కెప్టెన్ ప్రకటించడం వేరే విషయం!

బ్యాటింగ్ లోనూ అతివాదులు, మితవాదులు వుంటారు. యువరాజ్ సింగ్, మహెందర్ ధోనీ భారీ యాక్షన్ తో బంతిని కసితీరా కొట్టి బౌండరీలు దాటిస్తారు. అజహరుద్దీన్, వీవీఏస్ లక్ష్మణ్ వంటివాళ్ళు మణికట్టు మాయాజాలంతో  సుతారంగా బంతి దారి మళ్ళించి  బౌండరీలు సాధిస్తారు. సభలో శైలజానాధ్ భారీ షాట్లకు ప్రయత్నించారుగానీ,  టెక్నిక్  లేమివల్ల  బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించలేకపోయారు.

శైలజానాధ్ తొలిరోజు ఆటలో కొన్ని చూడ ముఛ్చటైన షాట్లున్నాయి.  అవిభక్త హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అప్పటి గజ్వేల్ ఎమ్మెల్యే  వాసుదేవ్ ఇచ్చిన ఆర్ధిక నివేదికని ప్రస్తావించడం అందులో ఒకటి.  వ్యవసాయరంగ అభివృధ్ధి గురించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యనేకాదు, సీమాంధ్రలో రాయలసీమ, తీరాంధ్ర మధ్యన కూడా అపోహలున్నాయి. 1956లో అంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి తెలంగాణ, తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నీటిపారుదలా సౌకర్యంవున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం వివరాలు ఇప్పుడు కావాలీ? శైలజానాధ్ చెపుతున్న గణాంకాల ప్రకారం అంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక  తెలంగాణలో సాగునీటి సౌకర్యం 15 నుండి 20 శాతం వరకు పెరిగింది. ఈ స్థాయిలో, తీరాంధ్ర, రాయలసీమల్లో సాగునీటి సౌకర్యం  పెరిగిందా? అన్నది సమంజసమైన ప్రశ్నే!

వీర తెలంగాణ పోరాటం గురించి దళితులకు తెలిసినట్టు దొరలకేం తెలుసూ? గడీలకేం తెలుసూ? అంటూ శైలజానాధ్ తాను మాత్రమే విసరగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఇలాంటి షాట్ ను మనం బహుశ కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగులో కూడా చూడలేకపోవచ్చు. అయితే,  శైలజానాధ్ మరో వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం వుంది.  అంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అభివృధ్ధికి నోచుకోని ప్రాంతాల్లో వర్గపొరాటాలు మొదలవ్వడం, నీటిపారుదలా సౌకర్యం సమృధ్ధిగా వున్న ప్రాంతాల్లో కులపోరాటాలు తలెత్తడం ఒక ధోరణిగా సాగుతోంది. కంచికచర్ల కోటేశు, కారంచేడు, చుండూరు, పిప్పర, పాదిరి కుప్పం, వేంపెంట, లక్ష్మీపేట తదితర అమానుషదాడులన్నీ సీమాంధ్రప్రాంతంలోనే జరిగాయి.  దళితులపై దాడులు తెలంగాణలో సాపేక్షంగా తక్కువ.

శైలజానాధ్ వాదన పటిమను ప్రదర్శించే అవకాశం ఆయనకూ, చూసే అవకాశం . మనకూ దక్కడం గొప్ప విషయమే. అయితే, తెలుగువాళ్లను విభజించడానికి  జరుగుతున్న కుట్రను అడ్డుకోవడానికీ  తాము పోరాడుతున్నామని చెప్పిన శైలజానాధ్ ఆ పోరాటానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రం శూన్యం, పైగా, ఆయన ఉపన్యాసంలో టెక్నిక్ లోపించడంవల్ల తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని మరింత రెచ్చగొట్టింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని నచ్చచెప్పడంకన్నా, రెచ్చగొట్టడమే సీమాంధ్రలో తనకు భారీ రాయితీలు తెచ్చి పెడతాయని శైలజానాథ్ అనుకుంటె అదివేరేవిషయం!

చట్ట సభల్లో టెక్నిక్ అంటే ఏమిటీ?  అనేది యక్ష ప్రశ్న. వాదన ముఖ్యమా? కార్యసాధన ముఖ్యమా? అనేది అంతకన్నా క్లిష్ట సమస్య!  మన అభిప్రాయాల్ని బలంగా చెప్పడం వాదన. కరడుగట్టిన ప్రత్యర్ధులు కూడా మన అభిప్రాయాలతో  ఏకీభవించేలా చేయడం కార్యసాధన. ఎప్పుడైనా నాయకునికి వాదనకన్నా కార్యసాధన ముఖ్యం.

శాసనసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అనుసరుస్తున్న వ్యూహాలు, ఎత్తుగడల్ని చూస్తే ఎవరికైనా సులువుగానే ఒక విషయం అర్ధం అవుతుంది. వీళ్ళు రాష్ట్ర విభజననను ఎలాగూ అడ్డుకోలేరు. విభజన సంధర్భంగా సీమాంధ్రకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల్నీ సాధించలేరు. ఆ మేరకు సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తారు. వాళ్ళు గెలవడం కోసం యుధ్ధం చేయడంలేదు.  ఘోరంగా ఓడి ప్రజల సానుభూతి సాధించే దగ్గరదారుల్ని వెతుక్కుంటున్నారు. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల గేటు ముందు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నిస్తున్నదీ  సానుభూతి రాయతీల కోసమే!  గ్రాండ్ నేరేటివ్స్ గురించి కనీస అవగాహన వున్నా రేపు జరగబోయేది ఊహించడం కష్టంకాదు.

ఒకవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేసిఆర్ అప్పుడే కసరత్తు మొదలు పెట్టేశారు. టీఆర్ ఎస్ అగ్రనేతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి న్యాయకోవిదుల్ని కలిసి రాజ్యాంగపరమైన చిక్కుల్ని అధిగమించేమార్గాలపై చర్చిస్తున్నారు.    

మరోవైపు, రాష్ట్రపతి పంపిన ముసాయిదా రాష్ట్రానికి వచ్చి నెల రోజులు దాటినా సభలో చర్చ జరిగింది ఒక్కరోజే!   వాదనతో కాకుండా సాంకేతిక కారణాలతో  రాష్ట్ర పునర్విభజన బిల్లును అడ్డుకోవాలని భావిస్తున్న సీమాంధ్ర నేతలు బిల్లుపై చర్చకు మరి కొంతకాలం గడువుకోరాలని భావిస్తున్నారు. ప్రశ్నలన్నింటికీ సమగ్రంగా సమాధానం  రాయగల సమర్ధులు పరీక్షహాల్లో  పది అడిషన్ షీట్లు అడిగి తీసుకున్నా అర్ధం వుంది. ప్రశ్నాపత్రం అర్ధంకాక,  ఏం చేయాలో తోచక మూడుగంటలు గడిపేసినోళ్ళు  కూడా చివరి నిముషంలో  పది అడిషన్ షీట్లు అడిగితే అర్ధం ఏమిటీ?


(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
18 జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
19    జనవరి  2014

Wednesday, 15 January 2014

సీమాంధ్ర టాపర్ కిరణ్!

సీమాంధ్ర టాపర్ కిరణ్!
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

అతివాదానికీ మితవాదానికీ, ఆజ్ఞానానికీ అతితెలివికీ,  పెద్ద తేడా వుండదు. అనుమానం వున్నవాళ్ళు శాసనసభ శీతాకాల సమావేశాల్ని చూసి నివృత్తి చేసుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్రం సాకారమయిందని సంబరాలు చేసుకుంటున్నవాళ్ళూ,  తెలంగాణ ఇచ్చేశారు అని గగ్గోలు పెడుతున్నవాళ్ళూ శాసనసభలో ఒక్కలాగే ప్రవర్తిస్తున్నారు.  రాజకీయ నాయకులు జ్ఞానానికి అతీతులు అంటే కొంచెం కటువుగా కనిపించవచ్చుగానీ,   శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరును చూస్తుంటే ఇందులో ఏమాత్రం అతిశయోక్తిలేదని అనిపిస్తోంది.

మన ప్రజాప్రతినిధులు చాలా తెలివైనవాళ్ళు. అసెంబ్లీ హాలులో స్పీకర్ పోడియం ముందు  రచ్చ చేస్తారు. బయట మీడియా పాయింటు దగ్గర కొచ్చి చర్చ చేస్తారు.  మీడియా పాయింటును అసెంబ్లీ హాలుగానూ,  అసెంబ్లీ హాలును మీడియా పాయింటుగానూ మారిస్తే చర్చ, రచ్చ రెండూ సజావుగా  జరగవచ్చు.

దుర్యోధనుడ్ని గదతో తలపడాలి. కర్ణుడ్ని విలువిద్యతో తలపడాలి. చట్ట సభల్లో అభిప్రాయాలతో తలపడాలి. అభిప్రాయాలు కాకుండా మనుషులే తలపడితే అది చట్టసభ అనిపించుకోదు దొమ్మి అవుతుంది. చట్ట సభలు చట్టాలు చేస్తాయి. సవరిస్తాయి. రద్దు చేస్తాయి, చట్ట సభల్లో చట్ట పరిభాష మాత్రమే చెల్లుతుంది. బాఖీసబ్ బక్వాస్!  12 విభాగాలు, 13 షెడ్యూళ్ళతో వచ్చిన ఆంధ్రప్రదేశ్  పునర్విభజన బిల్లు _ 2013ని చట్టసభల పరిధి, పరిమితుల్లో  తిరస్కరించడం ఎలాగో తెలీకో, చేతకాకో సీమాంధ్ర నేతలు ఆపసోపాలు పడుతున్న వైనాన్ని చూస్తుంటే జాలి వేస్తోంది.  సుదీర్ఘ అనుభవంవున్నా ఏమీచేయలేని స్వయం సంధిగ్ధం చంద్రబాబుగారిది. అనుక్షణం  అనుభవరాహిత్యాన్ని చాటుకుంటున్న బేలతనం వైయస్ విజయమ్మగారిది. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ మొదలెట్టడానికి ముందే ఓటింగు జరిపి తిరస్కరించాలని వైయస్సార్ సిపి  కోరడం  విచిత్రం. రేపు ఎన్నికల్లో కూడా ముందు జగన్ ను సియంగా ఎన్నికైనట్టు ప్రకటించి, ఆ తరువాత పోలింగ్ జరపాలని ఆ పార్టి  కోరినా మనం ఆశ్చర్యపోనవసరంలేదు.

బిల్లు మీద ఓటింగు జరగాలనే అంశంపై గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద చర్చే జరుగుతోంది. ఓటింగ్ మీద అనవసర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. 119 పెద్దదా? 175 పెద్దదా? అని అడిగితే, కిండర్ గార్డెన్ పిల్లాడు కూడా సమాధానం చెపుతాడు. పార్టీలకు అతీతంగా తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధులు రెండు శిబిరాలుగా మారిపోయినపుడు, ఓటింగ్  లేకుండానే ఫలితాన్ని చెప్పవచ్చు.   శాసనసభకు బిల్లును పంపినవాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. శాసనసభల్లో ఓటింగు ముఖ్యంకాదు. అభిప్రాయాలు ముఖ్యం. అత్యధికుల అభిప్రాయం అనేది ఒక  కొలమానమేగానీ, అన్ని సందర్భాలలోనూ శిరోధార్యంకాదు.  మహిళా రిజర్వేషన్ ను పురుషుల అంగీకారంతోనూ,  దళితుల రిజర్వేషన్ ను ఆధిపత్య కులాల అంగీకారంతోనూ,  మత అల్పసంఖ్యాకవర్గాల రిజర్వేషన్ ను మత అధిక సంఖ్యాకవర్గాల అంగీకారంతోనూ చేయాలనడం హాస్యాస్పదం మాత్రమేకాదు; సామాజిక అపచారం అవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలానికున్న ప్రాధాన్యతను తక్కువ చేయనక్కరలేదుగానీ, సామాజిక అంశాల్ని అంకెల గారడీతో తేల్చాలనుకుంటే అది ఘోర తప్పిదం అవుతుంది.

శాసనసభ బయట ఏపీ ఏన్జీవో అగ్రనేత పరుచూరి అశోక్ బాబు  తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమాన్ని ప్రకటించారు. అలా చేయడంవల్ల సీమాంధ్ర ప్రజలకు  ఒనగూడే ప్రయోజనం ఏమిటో వాళ్ళే చెప్పాలి.  విభజన_ సమైక్య ఉద్యమాలవల్ల ఇరుప్రాంతాల ప్రజలు, చిన్న వ్యాపారులు భారీగా నష్టపోగా,  లాభపడింది మాత్రం నిస్సందేహంగా ఉద్యోగవర్గాలే. కలిసివచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళ కోరికల్ని చాలా వరకు నెరవేర్చుకున్నారు.  సువిశాల సామాన్య ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వోద్యోగులకు సాధ్యమూకాదు; అది వాళ్ల పరిధిలోని అంశమూకాదు.  ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం ఉద్యమించడం దుస్సమాసం! రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి తాత్కాలికభృతి, హెల్త్ కార్డులు తదితర సదుపాయాల్ని వాళ్ళు వదులుకోలేరు.  వాళ్ల కోరికలు నెరవేరిన తరువాత ప్రజల కోసం కూడా మాట్లాడవచ్చుగానీ, అదొక కంటితుడుపు మాత్రమే!

ఏపీ ఏన్జీవో సంఘం పిలుపుతో ఉత్తేజం పొంది చేశారో, లేక జగన్ ఆదేశాలమేరకు చేశారోగానీ,   శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్  పార్టి ఎమ్మెల్యేలు బిల్లు పత్రాలను చించి, స్పీకర్ ముఖాన్న కొట్టారు. ఇలాంటి చర్యలు కొందరు వీరాభిమానులకు ఉత్తేజాన్నీ ఇవ్వచ్చుకానీ, పటిమలేని మొగుడు పెళ్ళాన్ని కొట్టడంకన్నా ఇది భిన్నమైనదేంకాదు. శాసనసభలో సభ్యుల సామర్ధ్యానికి ఒకేఒక కొలమానం రాజకీయ భావాల సంచయనం!  సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్లో అదే లోపించినట్టు కనిపిస్తోంది.

కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చుగానీ, రాజకీయ భావాల సంచయనంతోపాటూ,  చట్ట పరిభాషను తెలంగాణవాదులు ఇటీవలి కాలంలో అద్భుతంగా అభివృధ్ధి చేశారు.  శుక్రవారం సభలో ఈటెల రాజేందర్ తనకు దొరికిన అవకాశాన్ని వాడుకున్న తీరే దీనికి తాజా ఉదాహరణ.  సీమాంధ్ర అతిరథ, మహా రథులు రాజేందర్ ముందు కూడా నిలాడలేక విలవిల్లాడారు. ఇది సీమాంధ్ర నాయకుల మేధోదారిద్యాన్ని సూచిస్తోంది.  సభలో మృదువుగా వ్యవహరించే ఈటెల రాజేందర్ ముందే నిలబడలేనివాళ్ళు, దూకుడుగా వ్యవహరించే హరీష్ రావు, కేటీఆర్, మోత్కుపల్లి వంటి వాళ్లముందు ఇంకేం నిలబడతారు?  

రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే  సోనియా గాంధి రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఎస్_తమ్ముళ్ళు, ఎస్_కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ కూడా పసలేనిదే. సోనియా గాంధీ అనేకాదు రాజకీయ నాయకులు ఎవరైనా కృషి చేసేదీ, చెయ్యాల్సిందీ తమ రాజకీయ లక్ష్యాల్ని సాధించుకోవడంకోసమే!  సియం కావడమే చంద్రబాబు, జగన్ ల రాజకీయ లక్ష్యం అనంటే వాళ్లకూ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. నిజానికి తాను సియం అవుతానని కేసిఆర్ బాహాటంగా ఎన్నడూ ప్రకటించలేదు. వారి మనసులో ఆ కోరిక వుందోలేదో కూడా మనకు తెలీదు.   సియం అవ్వాలనే కోరికను జగన్, చంద్రబాబు దాదాపు ప్రతిరోజూ, ప్రతిపూట బాహాటంగానే ప్రకటిస్తున్నారు.  వారు అంతటితో ఆగడంలేదు సియం అయ్యాక తొలి సంతకాలు ఏఏ ఫైళ్ళ మీద చేస్తారో కూడా చెప్పి ప్రజల్ని ఊరిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ళ క్రితం రాష్ట్ర విభజనకు అంగీకారపత్రాన్ని సమర్పించిందీ తాను ముఖ్యమంత్రి కావడంకోసమే. జగన్ మూడేళ్లక్రితం ఆర్టికల్ త్రీని ప్రయోగించి రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందీ తాను ముఖ్యమంత్రి కావడం కోసమే. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాటమార్చిందీ  ముఖ్యమంత్రి కావడం కోసమే. వందరోజుల్లో తాను ముఖ్యమంత్రి  అవుతానని చంద్రబాబు అంటుంటే, నాలుగు నెలల్లో రాజన్నపాలన తెస్తానని జగన్ అంటున్నారు.  అద్దాలమేడల్లో వుండేవాళ్ళు ఇతరుల ఇళ్ల మీద రాళ్ళు విసరకూడదు.

సోనియా గాంధి, చంద్రబాబు, జగన్ ల పార్టీలు వేరు కావచ్చుగానీ, రాజకీయ లక్ష్యాల్లో ఆ ముగ్గురూ ఒకే తానులో గుడ్డలే! ముగ్గురిలో సోనియా కొంచెం నయం. తన కొడుకును భారత ప్రధాని చేయాలని  వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటిస్తున్నారు. "వచ్చే ఎన్నికల్లో టిడిపిని తీసుకురండి. మీ జీవితాల్లో మార్పు చూపించే హామీ నాది" అని తాజాగా శుక్రవారం డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని ఏ రాష్ట్రంలో నెరవేరుస్తారో మాత్రం చెప్పలేరు. జగన్ పరిస్థితీ అంతకు భిన్నం ఏమీకాదు. ఆయన ముఫ్ఫై యంపీ సీట్లు కావాలంటారు. వాటిని ఏ రాష్ట్రం నుండి సాధిస్తారో మాత్రం చెప్పలేరు. రాష్ట్రం పేరు కూడా చెప్పలేనివాళ్ళు ముఖ్యమంత్రులు కావాలనుకోవడం మన రాజకీయాల్లో ప్రబలుతున్న మృతసంస్కృతికి తాజా నిదర్శనం.

చంద్రబాబుకన్నా  దయనీయ స్థితి జగన్ ది. ఆయన రాష్ట్రం పేరేకాదు, స్వంత పార్టి పేరును కూడా విస్తరించి చెప్పలేరు. టిడిపి అంటే తెలుగుదేశం పార్టీ అన్నట్టు వైయస్సార్ సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టి అని జగన్ అనలేరు. వైయస్సార్ అంటే వైయస్ రాజశేఖర రెడ్డి అనుకోవాలని వారు అనుకుంటారు. కానీ,  వాస్తవం అదికాదు.  రాజకీయ అభిప్రాయాల్ని ప్రచారం చేసి, కష్టపడి ఓట్లు సేకరించడంకన్నా సానుభూతిని గాలుల్ని ఆస్వాదించడమే రాజకీయాల్లో సులువైనమార్గమని జగన్ నమ్ముతున్నట్టున్నారు. నాయున చనిపోయాడనీ, జైల్లో పెట్టారనీ, బెయిల్ ఇవ్వడంలేదనీ, సస్పెండు చేశారనీ ఇలా ప్రతిసారీ ఏదో ఒక సానుభూతి కారణంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మన రాజకీయాల్లో సానుభూతికి సానుకూల స్థానం వున్నమాట నిజమేగానీ, అది చాలా కొద్దికాలమే పనిచేస్తుంది. సానుభూతి సంవత్సరాల తరబడి  కొనసాగదు. ఇందిరాగాంధి హత్యానంతరం సానుభూతి ప్రభావంతో రాజీవ్ గాంధిని ప్రధానిని చేసిన ప్రజలే ఐదేళ్ళు తిరక్కుండానే ఘోరంగా ఓడించారు.  

కుప్పం నుండి శ్రీకాళం వరకు జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర  నెలన్నరైనా  చిత్తూరు జిల్లా దాటడంలేదు. ఇప్పటి నత్త నడకన ఆయన యాత్ర శ్రీకాళం చేరడానికి కనీసం ఎడాది పట్టవచ్చు.  తెలంగాణ జిల్లాల్లో కూడా  సమైక్య శంఖారావాన్ని పూరించాలనుకుంటే అది రెండేళ్ల కార్యక్రమం అవుతుంది.  పేరు వరకే అది సమైక్య శంఖారావంగానీ నిజానికి అది జగన్ చిత్తూరు జిల్లా యాత్ర.. అది ముఖ్యమంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబుల స్వంత జిల్లా కావడమే అసలు కారణం.

చంద్రబాబు, జగన్,  కిరణ్ కుమార్ రెడ్డిల ప్రస్తావన వచ్చింది కనుక వాళ్ల గ్రాఫుల గురించి ఒక విషయం చెప్పాలి. పంచాయితీ ఎన్నికల నాటికి సీమాంధ్రలో పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతికూలంగానూ, చంద్రబాబుకు అనుకూలంగానూవుంది. బెయిల్ మీద బయటికి వచ్చాక ర్యాంకుల్లో జగన్ మొదటి స్థానానికి చేరుకోగా. చంద్రబాబు, కిరణ్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గడిచిన నాలుగు నెలల్లో జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. రాష్ట్ర విభజన బిల్లును ఎదుర్కోవడంలో  జగన్ అనుసరించిన వ్యూహాలు ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దంపట్టాయి. ఇప్పుడు వారు చంద్రబాబుకన్నా దిగువకు చేరుకున్నారు. విశేషం ఏమంటే, స్వంత పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలతో, సీమాంధ్రలో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తేజకర నాయకుడిగా మారారు.  ఆ తరువాతి స్థానం చంద్రబాబుది. ఆ తరువాతి స్థానం జగన్ ది.  

సీమాంధ్ర మంత్రుల్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ చొరవచేసి ఒక భిన్నమైన వాదనను సభలో ప్రవేశపెట్టారు. వారు రాష్ట్ర విభజనని నేరుగా సమర్ధించలేదుగానీ, విభజన జరగాల్సివస్తే ఏం చేయాలో చెప్పారు. ఆ మేరకు వారు ఒకడుగు ముందుకువేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసి, .మిగిలిన సీమాంధ్ర ప్రాంతంతో తెలుగునాడు ఏర్పాటు చేయాలనీ అన్నారు.  మాణిక్యవరప్రసాద్ గమనించారో లేదోగానీ, కొత్త ప్రతిపాదనవల్ల తెలుగు, తెలంగాణ భిన్న జాతులని వారు తేల్చారు.  ఇది ఇప్పటి రాజకీయ సన్నివేశంలో నిస్సందేహంగా సంచలనాత్మక ప్రతిపాదన.

భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలనే పాత డిమాండునే మాణిక్యవరప్రసాద్ మరోసారి ముందుకు తెచ్చారు. అలాకాకుండా, పోలవరం ముంపు ప్రాంతాన్ని తెలుగునాడు (సీమాంధ్ర) లో కలపాలని కోరివుంటే మరింత వుపయోగకరంగానూ, ఆచరణాత్మకంగానూ  వుండేది.

భద్రాచలం రామాలయాన్ని నిజాం తహశీల్ దారు కంచర్ల గోపన్న నిర్మించాడు కనుక ఆ ప్రాంతం తమదే అని ఈటెల రాజేందర్ చేసిన వాదన పసలేనిది.  తెలంగాణవాదులు 1956 కు పూర్వపు నిజాం ప్రాంతాలు కూడా కావాలనుకుంటే   ఒక్క భద్రాచలంతోనే ఎందుకు ఆగాలీ? ఇప్పుడున్న  రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలు, ఇప్పటి ఒడీషాలోని గంజాం, గజపతి జిల్లాలు, కర్ణాటకలోని బళ్ళారి, దావణ్ గిరే  జిల్లాలు కూడా గడిచిన నాలుగు శతాబ్దాల్లో  అత్యధిక కాలం నిజాం పాలనలో వున్నవే. ఇవికాక,  మహారాష్ట్రలో ఓ నాలుగు జిల్లాలు,  కర్ణాటకలో మరో మూడు జిల్లాలు వున్నాయి. అవన్నీ కలిపి సువిశాల నిజాం సంస్థానాన్ని పునరుధ్ధరించడానికి  టీఆర్ ఎస్  సిధ్ధపడుతుందని అనుకోలేము. అదలా వుంచినా, ఈటెల రాజేందర్ భద్రాచలం రామాలయాన్నీ, ఆలయభూముల్ని మాత్రమే అడుగుతున్నట్టున్నారు. ఇది ఆలోచించదగ్గ ప్రతిపాదనే! సీమాంధ్రులు ఇప్పుడు ఆలయభూములకన్నా ముంపు ప్రాంతాన్ని కోరడమే సమంజసంగా వుంటుంది.

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
11 జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
12   జనవరి 2014

Sunday, 5 January 2014

విజయమా? ఆదర్శమా?


విజయమా? ఆదర్శమా?
 ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

        చట్టసభల నిర్వచనాలు మారిపోతున్నాయి. కేసిఆర్ కు  శాసనసభ సీమాంధ్రుల అడ్డాగా కనిపిస్తుంటేముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అది క్రికెట్ మైదానంలా కనిపిస్తోంది.  ఉండవల్లి అరుణ్ కుమార్ కు అది  బిగ్ (బుల్) ఫైట్  ఎరీనాగా కనిపిస్తుంటేలగడపాటి రాజగోపాల్ కు అది సినిమా థియేటర్ గా కనిపిస్తోందిజయప్రకాష్ నారాయణకు అది ఏకంగా రాజ్యాంగాన్ని ఖననం చేసే గోరీల దొడ్డిగా కనిపిస్తోంది.

        అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు నెలలోనే ఆరంభమయ్యాయి. క్రిస్మస్ సెలవులు, నూతనసంవత్సర సెలవులు అయ్యాక శుక్రవారం మలివిడత సమావేశాలు ఆరంభం అయ్యాయి. శీతాకాల సమావేశాల తొలి, మలి విడతల మధ్య కిరణ్ కుమార్ రెడ్డి  శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మార్చి, ఆ శాఖను సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్ సాకే శైలజానాథ్ కు అప్పచెప్పి కొత్త వివాదానికి తెరలేపారు. .

                కిరణ్ మార్ రెడ్డి పూర్వాశ్రమంలో  మంచి క్రికెటర్. కాలేజీ, యూనివర్శిటీ, జోనల్ స్థాయిల్లో ఆడినవారు. అప్పట్లో  క్రికెట్ టీమ్ లో వారు ఎన్ని రాజకీయాలు నడిపారో మనకు ఇప్పుడు తెలిసే అవకాశాలులేవుగానీ, ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రాజకీయాల్ని వారు క్రికెట్ ఆటగా మార్చారని తెలియనివాళ్ళుమాత్రం ఇప్పుడు ఎవరూలేరు! .

        క్రికెట్ ప్రస్తావన వచ్చింది గనుక 1980ల నాటి ఒక సంఘటన చెప్పుకోవాలి.  క్రికెట్లో అప్పటికి  తటస్థ ఆంపైర్ల విధానం రాలేదు.  ఏ దేశంలో మ్యాచ్ జరుగుతుంటే ఆ దేశపు ఆంపైర్లే వుండేవారు. క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని  పాకిస్తాన్ టీం అద్భుత ఫామ్ తో వరుస విజయాలు సాధిస్తున్న రోజులవి.  అయితేపాకిస్తాన్ జట్టులో ఆంపైర్లు కూడా ఆటగాళ్ళు అనే విమర్శ కూడా వుండేది. స్వదేశీపక్షపాతంతో వాళ్ళు చేసే నిర్ణయాలు కూడా పాకిస్తాన్ విజయాల్లో కీలకపాత్ర పోషించాయి అనేవారు.

        భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ను అప్పట్లో ఒక క్రీడావిలేకరి పాకిస్తాన్ టీంలో ఒక ఆటగాడిని మీకు ఇస్తానంటే ఎవర్ని ఎంచుకుంటారు?” అని అడిగాడు. గవాస్కర్ సహజంగానే ఇమ్రాన్ ఖాన్ పేరు చెపుతాడని ఆ విలేకరి ఆశించాడు. కానీ, గవాస్కర్ తడుముకోకుండా ఆంపైర్ అన్నాడు.

        క్రికెట్ పండితులైన కిరణ్ కుమార్ రెడ్డిగారికి ఆంపైర్ల ప్రాముఖ్యం తెలుసు. కేసిఆర్, జానారెడ్డి, దామోదర రాజా నరసింహ, హరీశ్ రావు, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, మోత్కుపల్లి, ఎర్రఎల్లి, గండ్ర వెంకటరమణలతో కూడిన  తెలంగాణ టీం సాధిస్తున్న విజయాల్లో ఆంపైర్ల పాత్ర కూడా వుందని వారు అనుమానించినట్టున్నారు. వెంటనే తెలంగాణ  ఆంపైర్ ను తొలగించి సీమాంధ్ర  ఆంపైర్ ను నియమించారు. టోర్నమెంటు డిప్యూటీ రిఫరిమల్లు భట్టి విక్రమార్క కూడా తెలంగాణ వారే కనుక సమీప భవిష్యత్తులో వారినీ మార్చవచ్చు! 

        తెలంగాణ అంశం ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో, శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాలశాఖ నుండి తప్పించడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.  కేసిఆర్ అయితే, కిరణకుమార్ రెడ్డిది  రాక్షసానందంఅంటున్నారు.  మంత్రివర్గంలోనికి ఎవర్ని తీసుకోవాలి? ఎవర్ని తీసివేయాలి? ఎవరికి ఏ శాఖను ఇవ్వాలి? ఎవర్ని ఏ శాఖకు మార్చాలి? అనేవి రాజ్యాంగం ప్రకారం పూర్తిగా ముఖ్యమంత్రి హక్కు.  రాజ్యాంగపరమైన హక్కు గనుక దాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు,. అంతవరకు నిజమేగానీఎప్పుడు? ఎందుకు? ఎవరికోసం? ఆ హక్కును వుపయోగించారనేది రాజకీయాల్లో ఎప్పుడైనా చర్చనీయాంశమే!
       
        హక్కును ఎప్పుడు వాడుకోవాలి? ఎప్పుడు వదులుకోవాలి? అని చెప్పడానికి క్రికెట్  లోనే కొన్ని మహత్తర ఉదాహరణలున్నాయి.  1975 నాటి తొలి ప్రపంచ కప్పులో వెస్టిండీస్ బౌలర్లు  ఆండీ రాబర్ట్స్డెరిక్ ముర్రేలు ఒక వికెట్టు తేడాతో పాకిస్తాన్ ను ఓడించారు.  అలాంటి సందర్భమే 1987 నాటి నాలుగవ ప్రపంచకప్పు సందర్భంగా లాహోర్ మ్యాచ్ లో పునరావృతమైంది.  పాకిస్తాన్ ఆ మ్యాచ్ చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పట్లో అద్భుత ఫామ్ లోవున్న వెస్టీండీస్ ఫాస్ట్ బౌలర్  కోర్ట్నీ వాల్ష్ ను చివరి ఓవర్ వేయమన్నాడు కెప్టెన్ వీవ్ రిచర్డ్స్. ఇక మ్యాచ్ వెస్టీండీస్ వశమైపోయిందని క్రికెట్ పండితులు అందరూ భావించారు.  పాకిస్తాన్ టెయిలెండర్లు  అబ్దుల్ ఖాదిర్, సలీమ్ జాఫర్ అనూహ్యంగా ఐదు బంతులకు 12 పరుగులు చేశారు.  పాకిస్తాన్ గెలవాలంటే చివరి బంతికి రెండు పరుగులు చేయాలి. స్ట్రయికర్ ఖాదిర్.  వెస్టీండీస్ గెలవాలంటే చివరి బంతికి వికెట్ తీయాలి. బౌలర్ వాల్ష్.  తట్టుకోలేనంత ఉత్కంఠ.  వాల్ష్  రన్ అప్ పూర్తిచేసి బాల్ విసిరే లోపునే, నాన్-స్ట్రయికర్ గా వున్న సలీమ్ జాఫర్ కంగారుగా క్రీజ్ వదిలి రన్ కోసం పరుగెట్టాడు. నిబంధనల ప్రకారం వాల్ష్ తన చేతిలోని బాల్ ను వికెట్లకు ఆనిస్తే చాలు జాఫర్ రనౌట్ అయినట్టు. వెస్టిండీస్ గెలిచినట్టు.

        అంతటి ఉత్కంఠలోనూ వాల్ష్ అసాధ్యమైన నిగ్రహాన్ని ప్రదర్శించాడు. చావోబతుకో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విజయం వీధి గుమ్మం నుండి గాక పెరటి గుమ్మం నుండి వస్తానంటే క్రీడా స్పూర్తితో నిరాకరించాడు. పొరపాటున బంతి తన చేతిలో నుండి జారిపోయి ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ ఎక్కడ ఔటయిపొతాడో అని భయపడిపోయినట్టుగాబంతిని, చేతుల్ని గట్టిగా చంకలో అదిమి పట్టుకుని నిలబడ్డాడు. జాఫర్ ను వెనక్కి పిలిచి మళ్ళా బంతి వేస్తాను అన్నాడు. ఆ తరువాతి బంతికి ఖాదిర్ రెండు పరుగులు చేసి పాకిస్తాన్ ను సాంకేతికంగా గెలిపించాడు. మ్యాచ్ ఓడిపోయి వెస్టిండీస్ ఇంటికి పొయిందిగానీ, కోర్ట్నివాల్ష్  క్రీడాస్పూర్తితో క్రికెట్ నైతికంగా గెలిచింది. మరోసారి జంటిల్ మెన్స్ స్పోర్ట్స్  అనిపించుకుంది. అసలే  వాల్ష్  పొడగరి. వ్యక్తిత్వంలోనూ ఆ ఏడాది అతను ప్రపంచంలోనే అత్యంత ఎత్తయినా మనిషి అనిపించుకున్నాడు. విజయంకన్నా ఆదర్శం గొప్పది.

        తన దగ్గర ఇంకా లాస్ట్ బాల్ వుందని కిరణ్ కుమార్ రెడ్డి గతవారం విభజనవాదుల్ని హెచ్చరించారు. వారు చెప్పిన లాస్ట్ బాల్ ను ఇప్పుడు విసిరేశారు. వారి దగ్గర ఇంకా బాల్స్  వున్నాయోలేవో మనకు తెలీదు. అయినప్పటికీ, శ్రీధర్ బాబును తప్పించడం ద్వార విభజనవాదులపై యార్కర్ విసిరి, తాను కరడుగట్టిన సమైక్యవాదినని సీమాంధ్రకు గట్టి సంకేతాన్ని పంపగలిగానని కిరణ్ కుమార్ సంతృప్తిగావున్నారు. అది వారు పెడతారని ప్రచారం జరుగుతున్న కొత్త పార్టీకి సీమాంధ్రలో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని కిరణ్ అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రిపై తెలంగాణులు కురిపిస్తున్న తిట్ల వర్షాన్ని కూడా వాళ్ళు ఆశిస్సులుగా భావిస్తున్నట్టున్నారు.

 విభజన బిల్లుపై తమ వాదనని సమిష్ఠిగా ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులు  తెలంగాణ ఆల్ పార్టీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు.  టి-కాంగ్రెస్, టీ-టిడిపి, టిఆర్ ఎస్, బీజేపి ప్రస్తుతం ఇందులో చేరాయి. యంఐయం, సిపిఐ, సిపియం లను కూడా ఒకే వేదిక మీదికి తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపివున్న వేదికను యంఐయం, సిపిఐ, సిపియం పంచుకుంటాయా? అన్నది సందేహం.  లోక్ సత్తా ఈ కూటమిలో చేరే అవకాశాలు ఎలాగూ లేవు.

        సీమాంధ్రలో దీనికి పూర్తిగా భిన్నమైన సన్నివేశం మనకు కనిపిస్తోంది. తెలంగాణకు ఎనిమిది పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తుండగాసీమాంధ్రకు కేవలం మూడు పార్టీలే ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అయినా వాళ్లమధ్య  సమస్వయంలేదు. శాసనసభలో బిగ్ డిబేట్ జరగాలని  ఎస్-కాంగ్రెస్ నేతలు అంటుంటే,   చర్చలో పాల్గోవడమంటేనే విభజనను అంగీకరించినట్టు అని  జగన్ కాంగ్రెస్ వాదిస్తోంది. సభా కార్యక్రమాలను స్థంభింపచేసి శాశ్విత బహిష్కరణకో, తాత్కాలిక బహిష్కరణకో గురైతే, సీమాంధ్రలో అమరవీరులస్థాయిదక్కి సానుభూతి పెరుగుతుందని  వైయస్సార్ సిపి నేతలు భావిస్తున్నట్టు కనిపిస్తోంది.  రాజకీయాల్లో సానుభూతే ఇప్పుడు విజయరహాస్యం!

        తమనుతాము సమైక్యవాదులమని చెప్పుకునేవారికి సంస్థాగత ఐక్యత గురించి బొత్తిగా తెలిసినట్టులేదు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు ఇస్తే, విభజన బిల్లుపై చర్చను భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లా హోరాహోరీగా సాగించాలని  సీమాంధ్ర  కాంగ్రెస్ తిరుగుబాటు  ఎంపీలు పిలుపునిచ్చారు. నెల క్రితం వరకు సీమాంధ్ర హీరోగా కనిపించిన ఎపీ ఏన్జీవోల సంఘం నాయకుడు పరుచూరి అశోక్ బాబు గతవైభవాన్ని కోల్పోయారు. ఉద్యోగుల ప్రయోజనాలు, స్వంత రాజకీయ ప్రయోజనాలకే ఆయన పరిమితపైపోయారనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.  విభజన బిల్లు వస్తే అసెంబ్లీకి మిలియన్ మార్చ్ చేస్తానన్న విషయాన్ని వారు మరిచిపోయారు.  ఇప్పుడు  సీమాంధ్రలో సాగుతున్న  దిష్టి బొమ్మల దహన కార్యక్రమంలో అశోక్ బాబు దిష్టిబొమ్మ కూడా చేరింది.

        సీమాంధ్ర రాజకీయాల్లో అందరికన్నా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది  చంద్రబాబు గురించి.  టి-తమ్ముళ్ళు, యస్-తమ్ముళ్ళు శాసనసభలో ఎలా దెబ్బలాడుకోవాలో ఇరుపక్షాలకు వారే స్వయంగా శిక్షణ ఇచ్చి ఆదర్శతండ్రిఅనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే సీమాంధ్రులు అంగీకరించాలి. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచాలంటే తెలంగాణులు  అంగీకరించాలి.అంటూ తామరాకు మీద నీటి బొట్టు వంటి ఒక మెట్టవేదాంతాన్ని వారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర విభజన అనేది  చంద్రబాబు దృష్టిలో ముగిసిన అంశం.  ప్రజాగర్జన పేరుతో వారు సాగిస్తున్నది అచ్చంగా ముందస్తు ఎన్నికల ప్రచారం. ఆ విధంగా వారు అందరికన్నా ముందున్నారు. ప్రజాగర్జనలో వారు ఇస్తున్న హామీలను చూస్తే ఈ విషయం ఎవరికైనా సులువుగానే  అర్ధం అవుతుంది.

        తనను సియం చేస్తే, రైతుల రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఫైళ్లపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అంటున్నారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు తొలి సంతాకాలు చేస్తానన్న అంశాలనీ సేకరిస్తే అవి వంద వరకు వుంటాయి అనంటే అతిశయోక్తికాదు.  తొలి సంతకం అనేది  ఒక్కటే వుంటుందని అశోక్ గజపతి రాజోగాలి ముద్దు కృష్ణమ నాయుడో వారికి చెపితే బాగుంటుంది. బీసీలకు వంద సీట్లు కేటాయిస్తానని చంద్రబాబూ అంటున్నారు.  వారు చెపుతున్నవన్నీ మంచిపనులే. అందులో ఏమాత్రం సందేహంలేదు.  కానీ, ఇవన్నీ ఏ రాష్ట్రంలో చేస్తారూఆంధ్రప్రదేశ్ లోనాతెలంగాణలోనా? సీమాంధ్రలోనా? రాయలసీమలోనా? అని సమంజసమైన సందేహం ఎవరికైనా వస్తే మాత్రం చంద్రబాబు సహించలేకపోతున్నారు.

        జగన్ ది ఇంకో విచిత్రం.  తెలంగాణలో చెయ్యాల్సిన సమైక్య శంఖారావం యాత్రని  వారు సీమాంధ్రలో చేస్తున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల స్వంతజిల్లాలో, వాళ్ల నియోజకవర్గాల్లో యాత్రచేస్తున్నారు.  సీమాంధ్రలో తనకు గట్టి సవాలు విసురుతున్న చంద్రబాబుకిరణ్ కుమార్ రెడ్డిలతో పొటీపడడానికే జగన్ ఇప్పుడు తాపత్రయపడుతున్నారని  ఎవరికైనా సులభంగానే అర్ధం అవుతుంది. 

        సమైక్యవాద ముసుగులో సాగుతున్న సీమాంధ్ర అగ్రనేతలెవ్వరికీ నిజాయితీలేదు. వాళ్ళిప్పుడు పోరాడుతున్నది వర్తమాన విభజనవాదులతోకాదు; రేపు ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రంలోని  భావి ప్రత్యర్ధులతో.      

(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
4 జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
5  జనవరి 2014     
http://www.suryaa.com/opinion/edit-page/article-165526