సీమాంధ్ర టాపర్ కిరణ్!
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
అతివాదానికీ మితవాదానికీ, ఆజ్ఞానానికీ అతితెలివికీ, పెద్ద తేడా వుండదు. అనుమానం వున్నవాళ్ళు శాసనసభ శీతాకాల సమావేశాల్ని చూసి నివృత్తి చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం సాకారమయిందని సంబరాలు చేసుకుంటున్నవాళ్ళూ, తెలంగాణ ఇచ్చేశారు అని గగ్గోలు పెడుతున్నవాళ్ళూ శాసనసభలో ఒక్కలాగే ప్రవర్తిస్తున్నారు. రాజకీయ నాయకులు జ్ఞానానికి అతీతులు అంటే కొంచెం కటువుగా కనిపించవచ్చుగానీ, శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న తీరును చూస్తుంటే ఇందులో ఏమాత్రం అతిశయోక్తిలేదని అనిపిస్తోంది.
మన ప్రజాప్రతినిధులు చాలా తెలివైనవాళ్ళు. అసెంబ్లీ హాలులో స్పీకర్ పోడియం ముందు రచ్చ చేస్తారు. బయట మీడియా పాయింటు దగ్గర కొచ్చి చర్చ చేస్తారు. మీడియా పాయింటును అసెంబ్లీ హాలుగానూ, అసెంబ్లీ హాలును మీడియా పాయింటుగానూ మారిస్తే చర్చ, రచ్చ రెండూ సజావుగా జరగవచ్చు.
దుర్యోధనుడ్ని గదతో తలపడాలి. కర్ణుడ్ని విలువిద్యతో తలపడాలి. చట్ట సభల్లో అభిప్రాయాలతో తలపడాలి. అభిప్రాయాలు కాకుండా మనుషులే తలపడితే అది చట్టసభ అనిపించుకోదు దొమ్మి అవుతుంది. చట్ట సభలు చట్టాలు చేస్తాయి. సవరిస్తాయి. రద్దు చేస్తాయి, చట్ట సభల్లో చట్ట పరిభాష మాత్రమే చెల్లుతుంది. బాఖీసబ్ బక్వాస్! 12 విభాగాలు, 13 షెడ్యూళ్ళతో వచ్చిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు _ 2013ని చట్టసభల పరిధి, పరిమితుల్లో తిరస్కరించడం ఎలాగో తెలీకో, చేతకాకో సీమాంధ్ర నేతలు ఆపసోపాలు పడుతున్న వైనాన్ని చూస్తుంటే జాలి వేస్తోంది. సుదీర్ఘ అనుభవంవున్నా ఏమీచేయలేని స్వయం సంధిగ్ధం చంద్రబాబుగారిది. అనుక్షణం అనుభవరాహిత్యాన్ని చాటుకుంటున్న బేలతనం వైయస్ విజయమ్మగారిది. రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ మొదలెట్టడానికి ముందే ఓటింగు జరిపి తిరస్కరించాలని వైయస్సార్ సిపి కోరడం విచిత్రం. రేపు ఎన్నికల్లో కూడా ముందు జగన్ ను సియంగా ఎన్నికైనట్టు ప్రకటించి, ఆ తరువాత పోలింగ్ జరపాలని ఆ పార్టి కోరినా మనం ఆశ్చర్యపోనవసరంలేదు.
బిల్లు మీద ఓటింగు జరగాలనే అంశంపై గల్లీ నుండి ఢిల్లీ వరకు పెద్ద చర్చే జరుగుతోంది. ఓటింగ్ మీద అనవసర వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ క్షమాపణలు చెప్పుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. 119 పెద్దదా? 175 పెద్దదా? అని అడిగితే, కిండర్ గార్డెన్ పిల్లాడు కూడా సమాధానం చెపుతాడు. పార్టీలకు అతీతంగా తెలంగాణ, సీమాంధ్ర ప్రతినిధులు రెండు శిబిరాలుగా మారిపోయినపుడు, ఓటింగ్ లేకుండానే ఫలితాన్ని చెప్పవచ్చు. శాసనసభకు బిల్లును పంపినవాళ్ళకు కూడా ఈ విషయం తెలుసు. శాసనసభల్లో ఓటింగు ముఖ్యంకాదు. అభిప్రాయాలు ముఖ్యం. అత్యధికుల అభిప్రాయం అనేది ఒక కొలమానమేగానీ, అన్ని సందర్భాలలోనూ శిరోధార్యంకాదు. మహిళా రిజర్వేషన్ ను పురుషుల అంగీకారంతోనూ, దళితుల రిజర్వేషన్ ను ఆధిపత్య కులాల అంగీకారంతోనూ, మత అల్పసంఖ్యాకవర్గాల రిజర్వేషన్ ను మత అధిక సంఖ్యాకవర్గాల అంగీకారంతోనూ చేయాలనడం హాస్యాస్పదం మాత్రమేకాదు; సామాజిక అపచారం అవుతుంది. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలానికున్న ప్రాధాన్యతను తక్కువ చేయనక్కరలేదుగానీ, సామాజిక అంశాల్ని అంకెల గారడీతో తేల్చాలనుకుంటే అది ఘోర తప్పిదం అవుతుంది.
శాసనసభ బయట ఏపీ ఏన్జీవో అగ్రనేత పరుచూరి అశోక్ బాబు తెలంగాణ బిల్లును భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమాన్ని ప్రకటించారు. అలా చేయడంవల్ల సీమాంధ్ర ప్రజలకు ఒనగూడే ప్రయోజనం ఏమిటో వాళ్ళే చెప్పాలి. విభజన_ సమైక్య ఉద్యమాలవల్ల ఇరుప్రాంతాల ప్రజలు, చిన్న వ్యాపారులు భారీగా నష్టపోగా, లాభపడింది మాత్రం నిస్సందేహంగా ఉద్యోగవర్గాలే. కలిసివచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. వాళ్ళ కోరికల్ని చాలా వరకు నెరవేర్చుకున్నారు. సువిశాల సామాన్య ప్రజల సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వోద్యోగులకు సాధ్యమూకాదు; అది వాళ్ల పరిధిలోని అంశమూకాదు. ప్రభుత్వోద్యోగులు ప్రజల కోసం ఉద్యమించడం దుస్సమాసం! రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడానికి తాత్కాలికభృతి, హెల్త్ కార్డులు తదితర సదుపాయాల్ని వాళ్ళు వదులుకోలేరు. వాళ్ల కోరికలు నెరవేరిన తరువాత ప్రజల కోసం కూడా మాట్లాడవచ్చుగానీ, అదొక కంటితుడుపు మాత్రమే!
ఏపీ ఏన్జీవో సంఘం పిలుపుతో ఉత్తేజం పొంది చేశారో, లేక జగన్ ఆదేశాలమేరకు చేశారోగానీ, శాసనసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టి ఎమ్మెల్యేలు బిల్లు పత్రాలను చించి, స్పీకర్ ముఖాన్న కొట్టారు. ఇలాంటి చర్యలు కొందరు వీరాభిమానులకు ఉత్తేజాన్నీ ఇవ్వచ్చుకానీ, పటిమలేని మొగుడు పెళ్ళాన్ని కొట్టడంకన్నా ఇది భిన్నమైనదేంకాదు. శాసనసభలో సభ్యుల సామర్ధ్యానికి ఒకేఒక కొలమానం రాజకీయ భావాల సంచయనం! సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్లో అదే లోపించినట్టు కనిపిస్తోంది.
కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చుగానీ, రాజకీయ భావాల సంచయనంతోపాటూ, చట్ట పరిభాషను తెలంగాణవాదులు ఇటీవలి కాలంలో అద్భుతంగా అభివృధ్ధి చేశారు. శుక్రవారం సభలో ఈటెల రాజేందర్ తనకు దొరికిన అవకాశాన్ని వాడుకున్న తీరే దీనికి తాజా ఉదాహరణ. సీమాంధ్ర అతిరథ, మహా రథులు రాజేందర్ ముందు కూడా నిలాడలేక విలవిల్లాడారు. ఇది సీమాంధ్ర నాయకుల మేధోదారిద్యాన్ని సూచిస్తోంది. సభలో మృదువుగా వ్యవహరించే ఈటెల రాజేందర్ ముందే నిలబడలేనివాళ్ళు, దూకుడుగా వ్యవహరించే హరీష్ రావు, కేటీఆర్, మోత్కుపల్లి వంటి వాళ్లముందు ఇంకేం నిలబడతారు?
రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకే సోనియా గాంధి రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఎస్_తమ్ముళ్ళు, ఎస్_కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ కూడా పసలేనిదే. సోనియా గాంధీ అనేకాదు రాజకీయ నాయకులు ఎవరైనా కృషి చేసేదీ, చెయ్యాల్సిందీ తమ రాజకీయ లక్ష్యాల్ని సాధించుకోవడంకోసమే! సియం కావడమే చంద్రబాబు, జగన్ ల రాజకీయ లక్ష్యం అనంటే వాళ్లకూ అభ్యంతరం వుండాల్సిన పనిలేదు. నిజానికి తాను సియం అవుతానని కేసిఆర్ బాహాటంగా ఎన్నడూ ప్రకటించలేదు. వారి మనసులో ఆ కోరిక వుందోలేదో కూడా మనకు తెలీదు. సియం అవ్వాలనే కోరికను జగన్, చంద్రబాబు దాదాపు ప్రతిరోజూ, ప్రతిపూట బాహాటంగానే ప్రకటిస్తున్నారు. వారు అంతటితో ఆగడంలేదు సియం అయ్యాక తొలి సంతకాలు ఏఏ ఫైళ్ళ మీద చేస్తారో కూడా చెప్పి ప్రజల్ని ఊరిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ళ క్రితం రాష్ట్ర విభజనకు అంగీకారపత్రాన్ని సమర్పించిందీ తాను ముఖ్యమంత్రి కావడంకోసమే. జగన్ మూడేళ్లక్రితం ఆర్టికల్ త్రీని ప్రయోగించి రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందీ తాను ముఖ్యమంత్రి కావడం కోసమే. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాటమార్చిందీ ముఖ్యమంత్రి కావడం కోసమే. వందరోజుల్లో తాను ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు అంటుంటే, నాలుగు నెలల్లో రాజన్నపాలన తెస్తానని జగన్ అంటున్నారు. అద్దాలమేడల్లో వుండేవాళ్ళు ఇతరుల ఇళ్ల మీద రాళ్ళు విసరకూడదు.
సోనియా గాంధి, చంద్రబాబు, జగన్ ల పార్టీలు వేరు కావచ్చుగానీ, రాజకీయ లక్ష్యాల్లో ఆ ముగ్గురూ ఒకే తానులో గుడ్డలే! ముగ్గురిలో సోనియా కొంచెం నయం. తన కొడుకును భారత ప్రధాని చేయాలని వారు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటిస్తున్నారు. "వచ్చే ఎన్నికల్లో టిడిపిని తీసుకురండి. మీ జీవితాల్లో మార్పు చూపించే హామీ నాది" అని తాజాగా శుక్రవారం డ్వాక్రా మహిళలకు హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని ఏ రాష్ట్రంలో నెరవేరుస్తారో మాత్రం చెప్పలేరు. జగన్ పరిస్థితీ అంతకు భిన్నం ఏమీకాదు. ఆయన ముఫ్ఫై యంపీ సీట్లు కావాలంటారు. వాటిని ఏ రాష్ట్రం నుండి సాధిస్తారో మాత్రం చెప్పలేరు. రాష్ట్రం పేరు కూడా చెప్పలేనివాళ్ళు ముఖ్యమంత్రులు కావాలనుకోవడం మన రాజకీయాల్లో ప్రబలుతున్న మృతసంస్కృతికి తాజా నిదర్శనం.
చంద్రబాబుకన్నా దయనీయ స్థితి జగన్ ది. ఆయన రాష్ట్రం పేరేకాదు, స్వంత పార్టి పేరును కూడా విస్తరించి చెప్పలేరు. టిడిపి అంటే తెలుగుదేశం పార్టీ అన్నట్టు వైయస్సార్ సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టి అని జగన్ అనలేరు. వైయస్సార్ అంటే వైయస్ రాజశేఖర రెడ్డి అనుకోవాలని వారు అనుకుంటారు. కానీ, వాస్తవం అదికాదు. రాజకీయ అభిప్రాయాల్ని ప్రచారం చేసి, కష్టపడి ఓట్లు సేకరించడంకన్నా సానుభూతిని గాలుల్ని ఆస్వాదించడమే రాజకీయాల్లో సులువైనమార్గమని జగన్ నమ్ముతున్నట్టున్నారు. నాయున చనిపోయాడనీ, జైల్లో పెట్టారనీ, బెయిల్ ఇవ్వడంలేదనీ, సస్పెండు చేశారనీ ఇలా ప్రతిసారీ ఏదో ఒక సానుభూతి కారణంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మన రాజకీయాల్లో సానుభూతికి సానుకూల స్థానం వున్నమాట నిజమేగానీ, అది చాలా కొద్దికాలమే పనిచేస్తుంది. సానుభూతి సంవత్సరాల తరబడి కొనసాగదు. ఇందిరాగాంధి హత్యానంతరం సానుభూతి ప్రభావంతో రాజీవ్ గాంధిని ప్రధానిని చేసిన ప్రజలే ఐదేళ్ళు తిరక్కుండానే ఘోరంగా ఓడించారు.
కుప్పం నుండి శ్రీకాళం వరకు జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర నెలన్నరైనా చిత్తూరు జిల్లా దాటడంలేదు. ఇప్పటి నత్త నడకన ఆయన యాత్ర శ్రీకాళం చేరడానికి కనీసం ఎడాది పట్టవచ్చు. తెలంగాణ జిల్లాల్లో కూడా సమైక్య శంఖారావాన్ని పూరించాలనుకుంటే అది రెండేళ్ల కార్యక్రమం అవుతుంది. పేరు వరకే అది సమైక్య శంఖారావంగానీ నిజానికి అది జగన్ చిత్తూరు జిల్లా యాత్ర.. అది ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబుల స్వంత జిల్లా కావడమే అసలు కారణం.
చంద్రబాబు, జగన్, కిరణ్ కుమార్ రెడ్డిల ప్రస్తావన వచ్చింది కనుక వాళ్ల గ్రాఫుల గురించి ఒక విషయం చెప్పాలి. పంచాయితీ ఎన్నికల నాటికి సీమాంధ్రలో పరిస్థితి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రతికూలంగానూ, చంద్రబాబుకు అనుకూలంగానూవుంది. బెయిల్ మీద బయటికి వచ్చాక ర్యాంకుల్లో జగన్ మొదటి స్థానానికి చేరుకోగా. చంద్రబాబు, కిరణ్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గడిచిన నాలుగు నెలల్లో జగన్ గ్రాఫ్ భారీగా పడిపోయింది. రాష్ట్ర విభజన బిల్లును ఎదుర్కోవడంలో జగన్ అనుసరించిన వ్యూహాలు ఆయన రాజకీయ అపరిపక్వతకు అద్దంపట్టాయి. ఇప్పుడు వారు చంద్రబాబుకన్నా దిగువకు చేరుకున్నారు. విశేషం ఏమంటే, స్వంత పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలతో, సీమాంధ్రలో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తేజకర నాయకుడిగా మారారు. ఆ తరువాతి స్థానం చంద్రబాబుది. ఆ తరువాతి స్థానం జగన్ ది.
సీమాంధ్ర మంత్రుల్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ చొరవచేసి ఒక భిన్నమైన వాదనను సభలో ప్రవేశపెట్టారు. వారు రాష్ట్ర విభజనని నేరుగా సమర్ధించలేదుగానీ, విభజన జరగాల్సివస్తే ఏం చేయాలో చెప్పారు. ఆ మేరకు వారు ఒకడుగు ముందుకువేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటుచేసి, .మిగిలిన సీమాంధ్ర ప్రాంతంతో తెలుగునాడు ఏర్పాటు చేయాలనీ అన్నారు. మాణిక్యవరప్రసాద్ గమనించారో లేదోగానీ, కొత్త ప్రతిపాదనవల్ల తెలుగు, తెలంగాణ భిన్న జాతులని వారు తేల్చారు. ఇది ఇప్పటి రాజకీయ సన్నివేశంలో నిస్సందేహంగా సంచలనాత్మక ప్రతిపాదన.
భద్రాచలం డివిజన్ ను సీమాంధ్రలో కలపాలనే పాత డిమాండునే మాణిక్యవరప్రసాద్ మరోసారి ముందుకు తెచ్చారు. అలాకాకుండా, పోలవరం ముంపు ప్రాంతాన్ని తెలుగునాడు (సీమాంధ్ర) లో కలపాలని కోరివుంటే మరింత వుపయోగకరంగానూ, ఆచరణాత్మకంగానూ వుండేది.
భద్రాచలం రామాలయాన్ని నిజాం తహశీల్ దారు కంచర్ల గోపన్న నిర్మించాడు కనుక ఆ ప్రాంతం తమదే అని ఈటెల రాజేందర్ చేసిన వాదన పసలేనిది. తెలంగాణవాదులు 1956 కు పూర్వపు నిజాం ప్రాంతాలు కూడా కావాలనుకుంటే ఒక్క భద్రాచలంతోనే ఎందుకు ఆగాలీ? ఇప్పుడున్న రాయలసీమ, తీరాంధ్ర ప్రాంతాలు, ఇప్పటి ఒడీషాలోని గంజాం, గజపతి జిల్లాలు, కర్ణాటకలోని బళ్ళారి, దావణ్ గిరే జిల్లాలు కూడా గడిచిన నాలుగు శతాబ్దాల్లో అత్యధిక కాలం నిజాం పాలనలో వున్నవే. ఇవికాక, మహారాష్ట్రలో ఓ నాలుగు జిల్లాలు, కర్ణాటకలో మరో మూడు జిల్లాలు వున్నాయి. అవన్నీ కలిపి సువిశాల నిజాం సంస్థానాన్ని పునరుధ్ధరించడానికి టీఆర్ ఎస్ సిధ్ధపడుతుందని అనుకోలేము. అదలా వుంచినా, ఈటెల రాజేందర్ భద్రాచలం రామాలయాన్నీ, ఆలయభూముల్ని మాత్రమే అడుగుతున్నట్టున్నారు. ఇది ఆలోచించదగ్గ ప్రతిపాదనే! సీమాంధ్రులు ఇప్పుడు ఆలయభూములకన్నా ముంపు ప్రాంతాన్ని కోరడమే సమంజసంగా వుంటుంది.
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ : 90102 34336
హైదరాబాద్
11 జనవరి 2014
ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
12 జనవరి 2014

No comments:
Post a Comment