ఒక మంచిసినిమా – ఒక చెత్త
సినిమా!
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
అక్కినేని
నాగేశ్వరరావు సినిమాల్ని ముఫ్పయ్యేసి సార్లు చూసేవారట నిన్నటితరపు మరో హీరో
కృష్ణంరాజు. మంచి సినిమాను చూసేకొద్దీ
రసాస్వాదన పెరుగుతుంది. ప్రతిసారీ అంతకు
ముందు మనం గమనించని అనేక సునిసిత అంశాలు ఆవిష్కారం అవుతుంటాయి.
తెలుగు వెండి
తెరపై యన్టీ రామారావు ప్రచండభానుడిగానూ, అక్కినేని నాగేశ్వరరావు వెండి వెన్నల
జాబిలిగానూ వుండేవారు. దాని అర్ధం యన్టీ
రామారావు సాత్వికపాత్రల్నీ, అక్కినేని
నాగేశ్వరరావు రౌద్రపాత్రల్నీ పోషించలేరనికాదు. కానీ, వాళ్ళిద్దరి ఆహార్యానికి అవి
అంతగా నప్పేవికావు.
అక్కినేని మా అమ్మమ్మకు బాలరాజు; మా అమ్మ,
నాన్నలకు నాగేశ్వరరావు; మా తరానికి ఏఎన్నార్. 1964లో నరసాపురం పరిసరాల్లో మూగమనసులు సినిమా
తీశారు. అందులో హీరో అక్కినేని. ఆ సినిమా
చాలా పెద్ద హిట్టు. అలా ఆయన
గోదావరినదికి “బ్రాండ్ అంబాసిడర్” అయ్యారు. అంతకు
ముందు సినిమాల్లో గోదావరి వుందోలేదోగానీ,
మూగమనసులు తరువాత గోదావరి తీరం అనేది తెలుగు సినిమా రంగంలో పెద్ద హిట్టు ఫార్మూలా
అయిపోయింది.
1969 సంక్రాంతికి
విడుదలైన అదృష్టవంతులు సినిమాలో “అయ్యయ్యో బ్రహ్మయ్య” పాటలో అక్కినేని నేరో కట్ ట్రౌజర్ లో కనిపించి ఆనాటి
యువతరాన్ని షేక్ ఆడించారు. కాలేజీ జీవితాన్ని గడుపుతున్న మాతరం అంతా ఆ పాట మైకంలో దర్జీ దుకాణాలకు
పరుగులు పెట్టి పాత గొట్టం ప్యాంటుల్ని ఆల్టర్ చేయించుకోవాల్సి వచ్చింది.
ప్రేక్షకుల మీద
మహానటుల ప్రభావం కేవలం చొక్క, ప్యాంటు, హెయిర్ స్టైల్, సిగరెట్టు pogaపొగ రింగులు
వదలడానికే పరిమితంకాదు. అది అంతకు మించిన ఒక ఉన్నత సంస్కృతిని ప్రమోట్ చేస్తుంది.
వెండితెర మీద భగ్నప్రేమికుడ్ని అక్కినేని అద్భుతంగా ఆవిష్కరించారు. రొమాంటిక్ హీరో ఇమేజ్ ను కొనసాగిస్తూనే
ట్రాజెడీ కింగ్ అనిపించుకోవడం సాధారణమైన
విన్యాసంకాదు. అమ్మాయిలతో ఎలా
వ్యవహరించాలి అనేదానికి మా తరానికి అక్కినేనియే ప్రమాణికం. నిజజీవితంలో ’డోంట్ కేర్’ గా వుండే యువకులు
సహితం అమ్మాయిల విషయం రాగానే చాలా సున్నితంగా మారిపోయేవారు. విఫలప్రేమికులు సహితం
ప్రియురాలి పెళ్ళికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పివచ్చేవారు. మిత్రుల మధ్య అదొక
వున్నత విలువగా కొనసాగేది. మా తరంలో ప్రేమనగర్ సినిమా ప్రభావం ఆ స్థాయిలో వుండేది.
గొప్ప నటులు,
గొప్ప సినిమాల గురించి చెప్పుకున్నాక, చెత్త నటులు, చెత్త సినిమాల గురించి
మాట్లాడుకోవడం ఇబ్బందిగానే వుంటుంది. చెత్త సినిమాను ఒక్కసారి చూడడం కూడా
శిక్షగానే వుంటుంది. చెత్త సినిమాను ఎవరైనా
శాసనసభ ప్రత్యక్ష ప్రసారాలతో పోల్చారోలేదోగానీ, పోల్చినా తప్పుకాదు.
వైయస్ విజయమ్మగారికి నెల రోజులుగా తీరని
సందేహం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు – 2013పై చర్చ మాత్రమే వుంటుందా? ఓటింగు కూడా నిర్వహిస్తారా?
వారికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఎప్పటికీ సమాధానం చెప్పరు. ఈ పునరుక్తి దోషాన్ని
మనం ఇప్పటికే డజన్ల సార్లు ఛుశాం. ఈ నెలాఖరు వరకు చూడకతప్పకపోవచ్చు.
హిచ్ కాక్
సినిమా అనుకుంటాను. ఒకమ్మాయి దుస్తులన్నీ తీసేసి స్విమ్మింగ్ పూల్ లోనికి
దూకుతుంది. సరిగ్గా ఆమె చివరి కాస్ట్యూము తీసే సమయానికి ఒక కారు అడ్డం వస్తుంది. ఆ
సినిమాని ఒక ప్రేక్షకుడు వరుసగా నెల రోజులు చూశాట్ట. ఆ అమ్మాయి ఒక్కసారయినా కారు
రాకముందే దూకకపోద్దా? లేకపోతే, కారు వెళ్ళిపోయాక
అయినా దూకకపోద్దా? అని. తెలుగు టివీ న్యూస్ ఛానళ్లలో శాసనసభా ప్రత్యక్ష
ప్రసారాలు చూసేవాళ్ళు ఆ హిచ్ కాక్ సినిమా ప్రేక్షకునికన్నా భిన్నమైనవాళ్ళేమీకాదు. విజయమ్మగారికి
కొత్త సందేహం వస్తుందేమోననీ, పాత
నిర్ణయాలకు మాండేట్ రాలేదు కనుక చంద్రబాబు కొత్త నిర్ణయం తీసుకుంటారేమోననీ, జగన్
సమైఖ్య శంఖారావం చిత్తూరు జిల్లా
దాటుతుందేమోననీ, కిరణ్ కుమార్ రెడ్డి ఏదో
ఒక క్షణాన్న కొత్త పార్టీని ప్రకటిస్తారేమోనని, సీమాంధ్ర సభ్యులు ఇప్పుడైనా భారీ ప్యాకేజి అడుగుతారేమోనని, తెలంగాణ సభ్యులు
కొంచెమైనా మెతకబడతారేమోనని వాళ్ళు కళ్లప్పగించి, టీవీలకేసి చూస్తుంటారు.
తల్లిదండ్రులు
ఏది ఇచ్చినా పిల్లలు కింద పడేసుకుని, మళ్ళీ అదే కావాలని మారాం చేస్తుంటారు. క్రిస్మస్,
న్యూయియర్, సంక్రాంతి పేరున శెలవులు ఆస్వాదించి, జాతి చరిత్రలో అత్యంత
ప్రాణప్రదమైన సమయాన్ని నిర్లక్ష్యంగా వృధాచేసిన
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బిల్లుపై చర్చకు మరింత గడువు అడగడం పిల్లచేష్టకన్నా
భిన్నమైనదేంకాదు. బహుశ సొమవారం నుండి శాసన సభలో కొత్త అధ్యాయాన్ని మనం
చూడబోతున్నాం. కొత్త అధ్యాయం అన్నంతమాత్రాన అది
ప్రగతిశీలమైనది అయిపోనక్కరలేదు. బిల్లుపై చర్చ జరగకుండానే వచ్చేవారం కూడా గడిచిపోయే సూచనలు
కనిపిస్తున్నాయి. చర్చకు వ్యవధి మరింత పెంచాలని
సీమాంధ్ర నేతలు మరోవారం రోజులు భీకరపోరు చేయవచ్చు. ఈసారి రాష్ట్రపతిని కూడా
టార్గెట్ చేయవచ్చు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం (
ఎక్స్ పెడైట్) చేయడానికి వీలుగా శాసనసభలో చర్చను త్వరగా ముగించాలని గడువు పెంపు
ఉత్తర్వుల్లో రాష్ట్రపతి పేర్కొనడం కొత్త
వివాదానికి కావలసినంత ఇంధనాన్ని సరఫరా చేసింది.
ఏపీఎన్జీవోలు
భారీగా ప్రచారం చేసిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ప్రతిరోజూ ఇందిరాపార్క్ వద్ద
జరిగే అనేకానేక నిరసన కార్యక్రమాల్లో ఒకానొక కార్యక్రమంగా మిగిలిపోయింది.
ఎన్జీవోలు తమ కోర్కెల్ని నెరవేర్చుకున్నాక
వాళ్లలో పూర్వపు విద్యుత్తు కనిపించడంలేదు. రాజు తిరుగుబాటు చేయడం రాజ్యాంగబధ్ధమేనా?
అంటూ కేజ్రీవాల్ ధర్నాపై ఎంయల్ శర్మా అనే న్యాయవాది ఈమధ్య సుప్రీంకోర్టులో ప్రజాహిత
వాజ్యం వేశారు. రాజాస్థాన ఉద్యోగులు చేసే తిరుబాట్లు కూడా ఈ కోవలోనికే వస్తాయి!
ఇందిరాపార్కు అయినా, శాసనసభ అయినా సీమాంధ్ర
ప్రతినిధుల వ్యవహారశైలిలో పెద్దగా మార్పులేదు. సమైక్యతా సమగ్రతా తమ నినాదం, విధానం అనేవాళ్ళు సభలో ఎలా ప్రవర్తించాలీ? విభజన కోరేవాళ్లను నచ్చచెప్పాలి. ఒప్పించాలి. బతిమాలాలి. బుజ్జగించాలి. అలా
కాకుండా కాలుదువ్వితే ఏమవుతుందీ? విభజన ప్రక్రియ మరింత వేగం అవుతుంది. ఈపాటి
ధర్మసూక్ష్మం తెలిసినవాళ్ళు కూడా మనకిప్పుడు రాజకీయాల్లో కనిపించడంలేదు.
రాష్ట్రాన్ని విభజించాలనుకునేవాళ్ళూ,
రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలంటున్నవాళ్ళూ ఒకే విధంగా కాలుదువ్వుతున్నారు. సంభాషణల్ని సినిమావాళ్ళే రాస్తున్నారో
మరొకటోగానీ, మన ప్రతినిధులు ఈ మధ్య సినిమా డైలాగులు విపరీతంగా వాడుతున్నారు.
చాలా కాలంక్రితం చదివిన అల్పిక. కొడవటిగంటి కుటుంబరావుగారిది అనుకుంటాను. బక్కపల్చగావున్న హింసావాది, బాగాబలిసిన అహింసావాది తలపడతారు. ఆ పోరులో హింసావాది చనిపోతాడు. "హింసావాదం చనిఫోయింది. అహింసావాదం గెలిచింది". అని అహింసావాది విజయగర్వంతో అరుస్తాడు. సేవ్
ఆంధ్రప్రదేశ్ ధర్నా శిబిరం వద్ద "ఎవడి దెబ్బ తగిలితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో
వాడే సమైక్యవాది" డైలాగ్ విన్నప్పుడు ఎవరికైనా కోకు అల్పిక గుర్తుకు వచ్చివుండాలి. కత్తి
మొన మీద సమైక్యతను సాధించడానికి కొందరు ఉత్సాహంగా వున్నట్టున్నారు!. ఎక్కడో ఒకచోట
విభజన ప్రక్రియకు దైవికంగా బ్రేక్
పడుతుందనే ఒక విశ్వాసం కొందరు
సమైక్యవాదుల్ని నడిపిస్తున్నట్టుంది.
రాష్ట్ర
ప్రజలు ముఖ్యంగా సీమాంధ్రులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నింగ్ ను ఈ వారం చూడగలిగాం. వారు క్రీజు లోనికి దిగడానికి
ముందు సుదీర్ఘ ప్రాక్టీస్ చేశారని ఎవరికైనా అర్ధం అవుతుంది. అయితే, వారు సుదీర్ఘ ఇన్నింగ్ ఏమీ ఆడలేదు.
లగడపాటి రాజగోపాల్ ఊరించినట్టు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించలేదు.
కొన్నిసార్లు భారీ షాట్ల కోసం కు ప్రయత్నించి, బ్యాటును గాల్లోకి లేపారుగానీ
బంతిని మాత్రం ఆశించినట్టు పెవిలియన్ కప్పు పైకి పంపలేకపోయారు. అయితే, వారు వచ్చే వారం
మరో ఇన్నింగ్ ఆడే అవకాశాలు కూడా వున్నాయి. అప్పుడు బ్యాట్ ను ఝళిపిస్తారని
అనుకోవచ్చు.
తొలి ఇన్నింగ్స్ లో కిరణ్ కుమార్ తీసిన పరుగులు పెద్దగా
లేకపోయినా, స్వంత టీమ్ నుండి మంత్రులు డొక్క మాణిక్యవరప్రసాద్, పసుపులేటి బాలరాజు భిన్న స్వరాన్ని అందుకోవడం వారికి పెద్ద దెబ్బే.
వరప్రసాద్, బాలరాజు ఇద్దరూ అణగారినవర్గాలకు చెందినవారు. సీమాంధ్రలో బలహీనవర్గాలు భిన్నంగా ఆలోచిస్తున్నారు అనడానికి
ఇది సంకేతం అయితే, ఈ సంకేతాన్ని తక్కువగా చూడడానికి వీల్లేదు.
తొలి ఇన్నింగ్ ముగిశాక “ఢిల్లీ బహుత్ దూర్ హై” అంటూ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్
చరిత్రాత్మకమైనది. కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో యన్టీ రామారావు ముప్ఫయి యేళ్ల
క్రితం “కేంద్ర
మిధ్యా” అన్నారు. దానికి ఏమాత్రం తగ్గనిది ఇప్పటి కిరణ్ కుమార్
రెడ్డి కామెంట్! ఇలాంటి వాదాలు
విస్తృతంగాసాగి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను పునర్ నిర్వచించగలిగితే ఫెడరల్ విలువలు
పెరగడానికి దోహదపడవచ్చు!
మనకిప్పుడు శాసనసభలో కళ్ళకు కనిపిస్తున్న ఒక వైచిత్రి కొనసాగుతోంది. సమైక్యతావాదులు అనైక్యతారాగాన్ని ఆలపిస్తుంటే,
విభజనవాదులు సమైక్యతారాగాన్ని ఆలపిస్తున్నారు.
రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఎప్పుడూ వుండేవే. ఆ అంశాన్ని పక్కన పెడితే,
ఆధునిక శాసనకర్తలు ఎలా వుండాలో ఈవారం అక్బరుద్దీన్ ఒవైసీ, కేటిఆర్ చాటిచెప్పారు.
వాళ్ళు చెప్పిన అభిప్రాయాల మీద సీమాంధ్రుల్లో కొందరికో అందరికో భిన్నాభిప్రాయాలు
వుండవచ్చు. అయినప్పటికీ, పరిశోధన, సంసిధ్ధత, సమర్పణ లేనిదే ఎవరూ శాసనసభలో
రాణించలేరని వారిధ్ధరూ నిరూపించారు. ప్రస్తుతం మనకు సీమాంధ్ర నుండి శాసనసభలో
సభ్యత్వం పొందినవాళ్ళున్నారుగానీ శాసనకర్తలులేరంటే
ఎవరూ బాధపడాల్సిన పనిలేదు!
(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ : 90102 34336
హైదరాబాద్
25 జనవరి 2014
ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
26 జనవరి 2014
No comments:
Post a Comment