Saturday, 18 January 2014

గడువు పొడిగించే వ్యూహం

గడువు పొడిగించే వ్యూహం 

ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)

సింగితం శ్రీనివాసరావు సినిమా ఆదిత్య_369 లో కథానాయకుడు బాలకృష్ణ టైమ్ మిషన్ లో ఐదు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి చేరుకుంటాడు. అక్కడ జరిగే ప్రతీ విషయం కథానాయకునికి ముందుగానే తెలిసిపోతుంటుంది. జరిగే విషయాలను ముందుగానే పసిగట్టడానికి టైం మిషన్లు అఖ్ఖరలేదు. కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలకు కారణమైన హేతువునూ, చర్యప్రతిచర్యల్నీ, వివిధ సంఘటనల మధ్య అన్యోన్యసంబంధాన్నీ గుర్తించగలిగితే జరగబోయే పరిణామాల్ని కచ్చితంగా కాకపోయినా కొంచెం అటుఇటుగా అయినా  పరికల్పన చేయవచ్చు. ఇదేమీ జ్యోతిష్యంకాదు. సామాజికశాస్త్రం. ప్రకృతి శాస్త్రానికీ, సామాజికశాస్త్రానికీ ఒక తేడా ఏమంటే  ప్రకృతిశాస్త్రాల్లో ఫలితాన్ని కఛ్ఛితంగా అంచనావేయవచ్చు. సామాజికశాస్త్రాల్లో ఫలితాన్ని ఊహాగానం మాత్రమే చేయగలం. పరిణామం అలాగే వుండవచ్చు లేదా స్వల్పమార్పులు వుండవచ్చు.

ఎవరైనా చనిపోగానే కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా భోరున ఏడుస్తారు. ఇరుగుపొరుగు వచ్చి వాళ్ళు ఏడుస్తూ, వీళ్లను ఓదారుస్తారు. అరగంట తరువాత అందరి ఏడ్పులు ఆగిపోతాయి. బంధువులు చొరవచేసి మృతుని కుటుంబ సభ్యుల్ని ఏదైనా తినమని బతిమాలుతారు. ఆ సమయంలో, మృతునితోపాటూ తాము కూడా చనిపోదామనే భావోద్వేగంలోవున్నకుటుంబసభ్యులు ఆహారాన్ని నిరాకరిస్తారు.  ఒకటి రెండు గంటల తరువాత  పిల్లలకు పాలు పట్టించడంతో మళ్ళీ ఆహార కార్యక్రమం మొదలవుతుంది.  వాతావరణం నిశ్శబ్దంగా వుంటుంది. శవం అంతిమ యాత్ర మొదలవుతుంది. కుటుంబసభ్యులు,  బంధుమిత్రులు ఒక్కసారిగా భోరున ఏడుస్తారు.  శవానికి అంత్యక్రియలు జరిపి మగవాళ్ళు తిరిగివస్తారు.  మళ్ళీ ఏడ్పులు. మళ్ళీ నిశ్శబ్దం.  మరో రెండు గంటల తరువాత ఎవరో దయగలవారు భోజనం వండి పంపిస్తారు. ఈసారి కుటుంబ సభ్యులు సహితం ఎంగిలిపడతారు. మరునాడూ ఏడ్పులు, నిశ్శబ్దంతో గడుస్తుంది. ఆ తరువాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు.  దీనికి స్క్రిప్టు, దర్శకత్వం ఏదీ వుండదుగానీ ఎవరైనా చనిపోయినపుడు అందరి ఇళ్లలోనూ దాదాపు ఇలానే జరుగుతుంది. కొన్ని పనులు తధ్ధర్మక్రియలా జరిగిపోతుంటాయి.  ఇదే గ్రాండ్ నేరేటివ్స్!  

శాసనసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు_2013 పై  చర్చ సాగుతున్న తీరు గ్రాండ్ నేరేటివ్స్ కు చక్కటి తాజా  ఉదాహరణ. సభ ప్రారంభంకాగానే అన్ని పార్టీల సభా నాయకులు వాయిదా తీర్మానాలు ప్రవేశపెడతారు. స్పీకర్ వాటిని తిరస్కరిస్తారు. బీయేసీలో  నిర్ణయించిన ప్రకారం పోదాం అంటారు. సభ్యులు వినరు. స్పీకర్ పోడియంను చుట్టు ముట్టుతారు.  సభా కార్యక్రమాల్ని స్థంభింపచేస్తారు. స్పీకర్ సభను అరగంట వాయిదా వేస్తారు. అరగంట తరువాత వైయస్సార్ సిపి సభానాయకురాలు వైయస్  విజయమ్మ సభలో ముందు ఓటింగ్ జరిపి తరువాత చర్చ మొదలెట్టాలంటారు. స్పీకర్ కుదరదంటారు. దానికి నిరసనగా ఆరోజుకు వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి విజయమ్మ వెళ్ళిపోతారు. ఆ తరువాత విభజనవాదులు, సమైక్యవాదులు తమ తమ ప్రసంగాలు మొదలెడతారు. పురాణగాధలు, తమ గురించిన అతిశయోక్తులుతప్ప,  ప్రత్యర్ధుల్ని సహితం ఒప్పించే ప్రయత్నం  అందులో ఏ కోశానా వుండదు.

సీమాంధ్ర టీం కెప్టెన్లలో జగన్  సమయం అంతా చిత్తూరుజిల్లాలో  స్పెషల్ ప్రాక్టీసు చేయడానికే సరిపోతోంది.  వారు వాటర్ బాయ్ ద్వార టీం మెంబర్సుకు  మార్గదర్శకాలు పంపగలరుగానీ, బ్యాటు పట్టి శాసన సభలో బ్యాటింగ్ విన్యాసాలు చేయలేరు. ఇక్కడ శాసన సభలో జగన్ టీం వైస్ కెప్టెన్ వైయస్ విజయలక్ష్మీ ప్రతిరోజూ  రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరుగుతున్నారు. టీంలో ఎంతమంది వున్నారో కూడా వారికి అంచనా లేనట్టుంది.  సభలో వారి నిస్సహాయతను చూసి ఎవరికైనా జాలి వేస్తుంది.

సీమాంధ్ర మరో కెప్టెన్ చంద్రబాబు ఒకే సమయంలో తెలంగాణ టీంకు కూడా కోచ్ గా వ్యవహరిస్తున్నారు.  ద్వంద సభ్యత్వం కారణంగా  వారు ప్యాడ్లు కట్టుకుని బ్యాటు పట్టుకుని మైదానంలోనికి దిగే అవకాశాలు చాలా తక్కువ.  "కీప్ కార్డ్స్ క్లోజ్ టు చెస్ట్స్" అనేది  పేకాటలో  మంచి వ్యూహమేగానీ, తన ముక్కలు తానే చూసుకోలేని పరిస్థితి చంద్రబాబుకైనా చిత్రమైన విషాదమే!

సీమాంధ్ర తాజా కెప్టెన్  కిరణ్ కుమార్ రెడ్డి, బ్యాటింగ్ విన్యాసాలు మనకు తెలీనప్పటికీ, ఇప్పటికైతే వారు  ప్రత్యర్ధులతో బ్రహ్మాండంగా మైండ్ గేమ్ అడుతున్నారు.  ఏరికోరి తెచ్చుకున్న సాకే శైలజానాథ్ ను ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా  పంపి తన తెలివిని ప్రదర్శించారు.  కెప్టెన్ ఆదేశాల ప్రకారం  శైలజానాధ్   వికెట్ల ముందు పాతుకుపోయే ప్రయత్నం విజయవంతంగా  చేసినప్పటికీ స్పోర్ట్స్ మీడియా దృష్టిలో మాత్రం  నైట్  వాచ్ మన్ అనిపించుకున్నారు. ఈ ఇన్నింగ్స్ లోనే బ్యాట్ తో ప్రత్యర్ధులకు సమాధానం చెపుతాను అని కెప్టెన్ కిరణ్ చేసిన ప్రకటన కూడా శైలజానాధ్ ను  నైట్  వాచ్ మన్ గా మార్చాయి.  అయితే, మ్యాచ్ ముగిశాక  శైలజానాథే తమ ప్రధాన బ్యాట్స్ మన్ అని కెప్టెన్ ప్రకటించడం వేరే విషయం!

బ్యాటింగ్ లోనూ అతివాదులు, మితవాదులు వుంటారు. యువరాజ్ సింగ్, మహెందర్ ధోనీ భారీ యాక్షన్ తో బంతిని కసితీరా కొట్టి బౌండరీలు దాటిస్తారు. అజహరుద్దీన్, వీవీఏస్ లక్ష్మణ్ వంటివాళ్ళు మణికట్టు మాయాజాలంతో  సుతారంగా బంతి దారి మళ్ళించి  బౌండరీలు సాధిస్తారు. సభలో శైలజానాధ్ భారీ షాట్లకు ప్రయత్నించారుగానీ,  టెక్నిక్  లేమివల్ల  బంతుల్ని మాత్రం బౌండరీలు దాటించలేకపోయారు.

శైలజానాధ్ తొలిరోజు ఆటలో కొన్ని చూడ ముఛ్చటైన షాట్లున్నాయి.  అవిభక్త హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో అప్పటి గజ్వేల్ ఎమ్మెల్యే  వాసుదేవ్ ఇచ్చిన ఆర్ధిక నివేదికని ప్రస్తావించడం అందులో ఒకటి.  వ్యవసాయరంగ అభివృధ్ధి గురించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల మధ్యనేకాదు, సీమాంధ్రలో రాయలసీమ, తీరాంధ్ర మధ్యన కూడా అపోహలున్నాయి. 1956లో అంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి తెలంగాణ, తీరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నీటిపారుదలా సౌకర్యంవున్న వ్యవసాయ భూముల విస్తీర్ణం వివరాలు ఇప్పుడు కావాలీ? శైలజానాధ్ చెపుతున్న గణాంకాల ప్రకారం అంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక  తెలంగాణలో సాగునీటి సౌకర్యం 15 నుండి 20 శాతం వరకు పెరిగింది. ఈ స్థాయిలో, తీరాంధ్ర, రాయలసీమల్లో సాగునీటి సౌకర్యం  పెరిగిందా? అన్నది సమంజసమైన ప్రశ్నే!

వీర తెలంగాణ పోరాటం గురించి దళితులకు తెలిసినట్టు దొరలకేం తెలుసూ? గడీలకేం తెలుసూ? అంటూ శైలజానాధ్ తాను మాత్రమే విసరగల బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఇలాంటి షాట్ ను మనం బహుశ కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగులో కూడా చూడలేకపోవచ్చు. అయితే,  శైలజానాధ్ మరో వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం వుంది.  అంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అభివృధ్ధికి నోచుకోని ప్రాంతాల్లో వర్గపొరాటాలు మొదలవ్వడం, నీటిపారుదలా సౌకర్యం సమృధ్ధిగా వున్న ప్రాంతాల్లో కులపోరాటాలు తలెత్తడం ఒక ధోరణిగా సాగుతోంది. కంచికచర్ల కోటేశు, కారంచేడు, చుండూరు, పిప్పర, పాదిరి కుప్పం, వేంపెంట, లక్ష్మీపేట తదితర అమానుషదాడులన్నీ సీమాంధ్రప్రాంతంలోనే జరిగాయి.  దళితులపై దాడులు తెలంగాణలో సాపేక్షంగా తక్కువ.

శైలజానాధ్ వాదన పటిమను ప్రదర్శించే అవకాశం ఆయనకూ, చూసే అవకాశం . మనకూ దక్కడం గొప్ప విషయమే. అయితే, తెలుగువాళ్లను విభజించడానికి  జరుగుతున్న కుట్రను అడ్డుకోవడానికీ  తాము పోరాడుతున్నామని చెప్పిన శైలజానాధ్ ఆ పోరాటానికి తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల మద్దతు కూడగట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రం శూన్యం, పైగా, ఆయన ఉపన్యాసంలో టెక్నిక్ లోపించడంవల్ల తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని మరింత రెచ్చగొట్టింది. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని నచ్చచెప్పడంకన్నా, రెచ్చగొట్టడమే సీమాంధ్రలో తనకు భారీ రాయితీలు తెచ్చి పెడతాయని శైలజానాథ్ అనుకుంటె అదివేరేవిషయం!

చట్ట సభల్లో టెక్నిక్ అంటే ఏమిటీ?  అనేది యక్ష ప్రశ్న. వాదన ముఖ్యమా? కార్యసాధన ముఖ్యమా? అనేది అంతకన్నా క్లిష్ట సమస్య!  మన అభిప్రాయాల్ని బలంగా చెప్పడం వాదన. కరడుగట్టిన ప్రత్యర్ధులు కూడా మన అభిప్రాయాలతో  ఏకీభవించేలా చేయడం కార్యసాధన. ఎప్పుడైనా నాయకునికి వాదనకన్నా కార్యసాధన ముఖ్యం.

శాసనసభలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అనుసరుస్తున్న వ్యూహాలు, ఎత్తుగడల్ని చూస్తే ఎవరికైనా సులువుగానే ఒక విషయం అర్ధం అవుతుంది. వీళ్ళు రాష్ట్ర విభజననను ఎలాగూ అడ్డుకోలేరు. విభజన సంధర్భంగా సీమాంధ్రకు దక్కాల్సిన న్యాయమైన హక్కుల్నీ సాధించలేరు. ఆ మేరకు సీమాంధ్రకు తీరని అన్యాయం చేస్తారు. వాళ్ళు గెలవడం కోసం యుధ్ధం చేయడంలేదు.  ఘోరంగా ఓడి ప్రజల సానుభూతి సాధించే దగ్గరదారుల్ని వెతుక్కుంటున్నారు. ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల గేటు ముందు సీమాంధ్ర ఎంపీలు ప్రయత్నిస్తున్నదీ  సానుభూతి రాయతీల కోసమే!  గ్రాండ్ నేరేటివ్స్ గురించి కనీస అవగాహన వున్నా రేపు జరగబోయేది ఊహించడం కష్టంకాదు.

ఒకవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేసిఆర్ అప్పుడే కసరత్తు మొదలు పెట్టేశారు. టీఆర్ ఎస్ అగ్రనేతలు జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి న్యాయకోవిదుల్ని కలిసి రాజ్యాంగపరమైన చిక్కుల్ని అధిగమించేమార్గాలపై చర్చిస్తున్నారు.    

మరోవైపు, రాష్ట్రపతి పంపిన ముసాయిదా రాష్ట్రానికి వచ్చి నెల రోజులు దాటినా సభలో చర్చ జరిగింది ఒక్కరోజే!   వాదనతో కాకుండా సాంకేతిక కారణాలతో  రాష్ట్ర పునర్విభజన బిల్లును అడ్డుకోవాలని భావిస్తున్న సీమాంధ్ర నేతలు బిల్లుపై చర్చకు మరి కొంతకాలం గడువుకోరాలని భావిస్తున్నారు. ప్రశ్నలన్నింటికీ సమగ్రంగా సమాధానం  రాయగల సమర్ధులు పరీక్షహాల్లో  పది అడిషన్ షీట్లు అడిగి తీసుకున్నా అర్ధం వుంది. ప్రశ్నాపత్రం అర్ధంకాక,  ఏం చేయాలో తోచక మూడుగంటలు గడిపేసినోళ్ళు  కూడా చివరి నిముషంలో  పది అడిషన్ షీట్లు అడిగితే అర్ధం ఏమిటీ?


(రచయిత ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌)
మోబైల్‌ : 90102 34336

హైదరాబాద్‌
18 జనవరి 2014

ప్రచురణ :
సూర్య దినపత్రిక, ఎడిట్ పేజి
19    జనవరి  2014

No comments:

Post a Comment