విజయమా? ఆదర్శమా?
ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ)
చట్టసభల నిర్వచనాలు మారిపోతున్నాయి. కేసిఆర్
కు శాసనసభ సీమాంధ్రుల అడ్డాగా కనిపిస్తుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి
అది క్రికెట్ మైదానంలా కనిపిస్తోంది. ఉండవల్లి
అరుణ్ కుమార్ కు అది బిగ్ (బుల్) ఫైట్ ఎరీనాగా కనిపిస్తుంటే, లగడపాటి రాజగోపాల్ కు అది సినిమా
థియేటర్ గా కనిపిస్తోంది,
జయప్రకాష్ నారాయణకు అది ఏకంగా రాజ్యాంగాన్ని ఖననం చేసే గోరీల
దొడ్డిగా కనిపిస్తోంది.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబరు నెలలోనే
ఆరంభమయ్యాయి. క్రిస్మస్ సెలవులు, నూతనసంవత్సర
సెలవులు అయ్యాక శుక్రవారం మలివిడత సమావేశాలు ఆరంభం అయ్యాయి. శీతాకాల సమావేశాల తొలి, మలి విడతల
మధ్య కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభా వ్యవహారాల
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మార్చి, ఆ శాఖను సీమాంధ్ర
కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్ సాకే శైలజానాథ్ కు అప్పచెప్పి కొత్త వివాదానికి
తెరలేపారు. .
కిరణ్ మార్ రెడ్డి పూర్వాశ్రమంలో మంచి క్రికెటర్. కాలేజీ,
యూనివర్శిటీ, జోనల్ స్థాయిల్లో
ఆడినవారు. అప్పట్లో క్రికెట్ టీమ్ లో వారు
ఎన్ని రాజకీయాలు నడిపారో మనకు ఇప్పుడు తెలిసే అవకాశాలులేవుగానీ,
ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రాజకీయాల్ని వారు క్రికెట్ ఆటగా
మార్చారని తెలియనివాళ్ళుమాత్రం ఇప్పుడు ఎవరూలేరు! .
క్రికెట్ ప్రస్తావన వచ్చింది గనుక 1980ల నాటి
ఒక సంఘటన చెప్పుకోవాలి. క్రికెట్లో అప్పటికి తటస్థ ఆంపైర్ల విధానం రాలేదు. ఏ దేశంలో మ్యాచ్ జరుగుతుంటే ఆ దేశపు ఆంపైర్లే వుండేవారు.
క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని
పాకిస్తాన్ టీం అద్భుత ఫామ్ తో వరుస విజయాలు సాధిస్తున్న రోజులవి. అయితే,
పాకిస్తాన్ జట్టులో ఆంపైర్లు కూడా ఆటగాళ్ళు అనే విమర్శ కూడా
వుండేది. స్వదేశీపక్షపాతంతో వాళ్ళు చేసే నిర్ణయాలు కూడా పాకిస్తాన్ విజయాల్లో కీలకపాత్ర
పోషించాయి అనేవారు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ను
అప్పట్లో ఒక క్రీడావిలేకరి “పాకిస్తాన్
టీంలో ఒక ఆటగాడిని మీకు ఇస్తానంటే ఎవర్ని ఎంచుకుంటారు?”
అని అడిగాడు. గవాస్కర్ సహజంగానే ఇమ్రాన్ ఖాన్ పేరు చెపుతాడని
ఆ విలేకరి ఆశించాడు. కానీ, గవాస్కర్ తడుముకోకుండా
“ఆంపైర్” అన్నాడు.
క్రికెట్ పండితులైన కిరణ్ కుమార్ రెడ్డిగారికి
ఆంపైర్ల ప్రాముఖ్యం తెలుసు. కేసిఆర్, జానారెడ్డి,
దామోదర రాజా నరసింహ, హరీశ్ రావు,
ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి,
మోత్కుపల్లి, ఎర్రఎల్లి,
గండ్ర వెంకటరమణలతో కూడిన
తెలంగాణ టీం సాధిస్తున్న విజయాల్లో ఆంపైర్ల పాత్ర కూడా వుందని వారు అనుమానించినట్టున్నారు.
వెంటనే తెలంగాణ ఆంపైర్ ను తొలగించి సీమాంధ్ర ఆంపైర్ ను నియమించారు. ’టోర్నమెంటు
డిప్యూటీ రిఫరి” మల్లు భట్టి
విక్రమార్క కూడా తెలంగాణ వారే కనుక సమీప భవిష్యత్తులో వారినీ మార్చవచ్చు!
తెలంగాణ అంశం ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో,
శ్రీధర్ బాబును శాసనసభా వ్యవహారాలశాఖ నుండి తప్పించడం రాష్ట్ర
రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. కేసిఆర్
అయితే, కిరణకుమార్ రెడ్డిది “రాక్షసానందం”
అంటున్నారు. మంత్రివర్గంలోనికి
ఎవర్ని తీసుకోవాలి? ఎవర్ని తీసివేయాలి?
ఎవరికి ఏ శాఖను ఇవ్వాలి? ఎవర్ని ఏ శాఖకు
మార్చాలి? అనేవి రాజ్యాంగం ప్రకారం పూర్తిగా
ముఖ్యమంత్రి హక్కు. రాజ్యాంగపరమైన హక్కు గనుక
దాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదు,. అంతవరకు నిజమేగానీ, ఎప్పుడు?
ఎందుకు? ఎవరికోసం?
ఆ హక్కును వుపయోగించారనేది రాజకీయాల్లో ఎప్పుడైనా చర్చనీయాంశమే!
హక్కును ఎప్పుడు వాడుకోవాలి?
ఎప్పుడు వదులుకోవాలి? అని చెప్పడానికి
క్రికెట్ లోనే కొన్ని మహత్తర ఉదాహరణలున్నాయి. 1975 నాటి తొలి ప్రపంచ కప్పులో వెస్టిండీస్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్, డెరిక్ ముర్రేలు ఒక వికెట్టు
తేడాతో పాకిస్తాన్ ను ఓడించారు. అలాంటి సందర్భమే
1987 నాటి నాలుగవ ప్రపంచకప్పు సందర్భంగా లాహోర్ మ్యాచ్ లో పునరావృతమైంది. పాకిస్తాన్ ఆ మ్యాచ్ చివరి ఓవర్లో విజయానికి 14
పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పట్లో అద్భుత ఫామ్ లోవున్న వెస్టీండీస్ ఫాస్ట్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ ను చివరి ఓవర్ వేయమన్నాడు కెప్టెన్
వీవ్ రిచర్డ్స్. ఇక మ్యాచ్ వెస్టీండీస్ వశమైపోయిందని క్రికెట్ పండితులు అందరూ భావించారు. పాకిస్తాన్ టెయిలెండర్లు అబ్దుల్ ఖాదిర్, సలీమ్ జాఫర్
అనూహ్యంగా ఐదు బంతులకు 12 పరుగులు చేశారు. పాకిస్తాన్ గెలవాలంటే చివరి బంతికి రెండు పరుగులు
చేయాలి. స్ట్రయికర్ ఖాదిర్. వెస్టీండీస్ గెలవాలంటే
చివరి బంతికి వికెట్ తీయాలి. బౌలర్ వాల్ష్.
తట్టుకోలేనంత ఉత్కంఠ. వాల్ష్ రన్ అప్ పూర్తిచేసి బాల్ విసిరే లోపునే,
నాన్-స్ట్రయికర్ గా వున్న సలీమ్ జాఫర్ కంగారుగా క్రీజ్ వదిలి
రన్ కోసం పరుగెట్టాడు. నిబంధనల ప్రకారం వాల్ష్ తన చేతిలోని బాల్ ను వికెట్లకు ఆనిస్తే
చాలు జాఫర్ రనౌట్ అయినట్టు. వెస్టిండీస్ గెలిచినట్టు.
అంతటి ఉత్కంఠలోనూ వాల్ష్ అసాధ్యమైన నిగ్రహాన్ని
ప్రదర్శించాడు. చావోబతుకో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో విజయం వీధి గుమ్మం నుండి గాక పెరటి
గుమ్మం నుండి వస్తానంటే క్రీడా స్పూర్తితో నిరాకరించాడు. పొరపాటున బంతి తన చేతిలో నుండి
జారిపోయి ప్రత్యర్ధి బ్యాట్స్ మన్ ఎక్కడ ఔటయిపొతాడో అని ’భయపడిపోయినట్టుగా’
బంతిని, చేతుల్ని గట్టిగా
చంకలో అదిమి పట్టుకుని నిలబడ్డాడు. జాఫర్ ను వెనక్కి పిలిచి మళ్ళా బంతి వేస్తాను అన్నాడు.
ఆ తరువాతి బంతికి ఖాదిర్ రెండు పరుగులు చేసి పాకిస్తాన్ ను సాంకేతికంగా గెలిపించాడు.
మ్యాచ్ ఓడిపోయి వెస్టిండీస్ ఇంటికి పొయిందిగానీ, కోర్ట్నివాల్ష్ క్రీడాస్పూర్తితో క్రికెట్ నైతికంగా గెలిచింది.
మరోసారి జంటిల్ మెన్స్ స్పోర్ట్స్ అనిపించుకుంది.
అసలే వాల్ష్ పొడగరి. వ్యక్తిత్వంలోనూ ఆ ఏడాది అతను ప్రపంచంలోనే
అత్యంత ఎత్తయినా మనిషి అనిపించుకున్నాడు. విజయంకన్నా ఆదర్శం గొప్పది.
తన దగ్గర ఇంకా లాస్ట్ బాల్ వుందని కిరణ్ కుమార్
రెడ్డి గతవారం విభజనవాదుల్ని హెచ్చరించారు. వారు చెప్పిన లాస్ట్ బాల్ ను ఇప్పుడు విసిరేశారు.
వారి దగ్గర ఇంకా బాల్స్ వున్నాయోలేవో మనకు
తెలీదు. అయినప్పటికీ, శ్రీధర్ బాబును
తప్పించడం ద్వార విభజనవాదులపై యార్కర్ విసిరి, తాను కరడుగట్టిన
సమైక్యవాదినని సీమాంధ్రకు గట్టి సంకేతాన్ని పంపగలిగానని కిరణ్ కుమార్ సంతృప్తిగావున్నారు.
అది వారు పెడతారని ప్రచారం జరుగుతున్న కొత్త పార్టీకి సీమాంధ్రలో సానుకూల వాతావరణాన్ని
కల్పిస్తుందని కిరణ్ అభిమానులు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రిపై తెలంగాణులు కురిపిస్తున్న
తిట్ల వర్షాన్ని కూడా వాళ్ళు ఆశిస్సులుగా భావిస్తున్నట్టున్నారు.
విభజన బిల్లుపై తమ వాదనని సమిష్ఠిగా ప్రవేశపెట్టడానికి
తెలంగాణ ప్రజా ప్రతినిధులు తెలంగాణ ఆల్ పార్టీ
కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు.
టి-కాంగ్రెస్, టీ-టిడిపి,
టిఆర్ ఎస్, బీజేపి ప్రస్తుతం
ఇందులో చేరాయి. యంఐయం, సిపిఐ,
సిపియం లను కూడా ఒకే వేదిక మీదికి తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
బీజేపివున్న వేదికను యంఐయం, సిపిఐ,
సిపియం పంచుకుంటాయా? అన్నది సందేహం. లోక్ సత్తా ఈ కూటమిలో చేరే అవకాశాలు ఎలాగూ లేవు.
సీమాంధ్రలో దీనికి పూర్తిగా భిన్నమైన సన్నివేశం
మనకు కనిపిస్తోంది. తెలంగాణకు ఎనిమిది పార్టీలు ప్రాతినిథ్యం వహిస్తుండగా, సీమాంధ్రకు కేవలం మూడు పార్టీలే
ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అయినా వాళ్లమధ్య
సమస్వయంలేదు. శాసనసభలో బిగ్ డిబేట్ జరగాలని ఎస్-కాంగ్రెస్ నేతలు అంటుంటే, చర్చలో పాల్గోవడమంటేనే విభజనను
అంగీకరించినట్టు అని జగన్ కాంగ్రెస్ వాదిస్తోంది.
సభా కార్యక్రమాలను స్థంభింపచేసి శాశ్విత బహిష్కరణకో, తాత్కాలిక
బహిష్కరణకో గురైతే, సీమాంధ్రలో
’అమరవీరుల’ స్థాయిదక్కి
సానుభూతి పెరుగుతుందని వైయస్సార్ సిపి నేతలు
భావిస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయాల్లో
సానుభూతే ఇప్పుడు విజయరహాస్యం!
తమనుతాము సమైక్యవాదులమని చెప్పుకునేవారికి
సంస్థాగత ఐక్యత గురించి బొత్తిగా తెలిసినట్టులేదు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన ముసాయిదా
బిల్లుపై జరిగే చర్చను బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక పిలుపు
ఇస్తే, విభజన బిల్లుపై చర్చను భారత్-పాక్
క్రికెట్ మ్యాచ్‌లా హోరాహోరీగా సాగించాలని
సీమాంధ్ర కాంగ్రెస్ తిరుగుబాటు ఎంపీలు పిలుపునిచ్చారు. నెల క్రితం వరకు సీమాంధ్ర
“హీరో” గా కనిపించిన
ఎపీ ఏన్జీవోల సంఘం నాయకుడు పరుచూరి అశోక్ బాబు గతవైభవాన్ని కోల్పోయారు. ఉద్యోగుల ప్రయోజనాలు,
స్వంత రాజకీయ ప్రయోజనాలకే ఆయన పరిమితపైపోయారనే విమర్శలు గట్టిగానే
వినిపిస్తున్నాయి. విభజన బిల్లు వస్తే అసెంబ్లీకి
మిలియన్ మార్చ్ చేస్తానన్న విషయాన్ని వారు మరిచిపోయారు. ఇప్పుడు
సీమాంధ్రలో సాగుతున్న దిష్టి బొమ్మల
దహన కార్యక్రమంలో అశోక్ బాబు దిష్టిబొమ్మ కూడా చేరింది.
సీమాంధ్ర రాజకీయాల్లో అందరికన్నా ప్రత్యేకంగా
చెప్పుకోవాల్సింది చంద్రబాబు గురించి. టి-తమ్ముళ్ళు, యస్-తమ్ముళ్ళు
శాసనసభలో ఎలా దెబ్బలాడుకోవాలో ఇరుపక్షాలకు వారే స్వయంగా శిక్షణ ఇచ్చి ’ఆదర్శతండ్రి”
అనిపించుకుంటున్నారు. “ ఆంధ్రప్రదేశ్
ను విభజిస్తే సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచితే తెలంగాణకు
అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని
ఏర్పాటు చేయాలంటే సీమాంధ్రులు అంగీకరించాలి. ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచాలంటే తెలంగాణులు అంగీకరించాలి.” అంటూ తామరాకు
మీద నీటి బొట్టు వంటి ఒక మెట్టవేదాంతాన్ని వారు ప్రచారం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర
విభజన అనేది చంద్రబాబు దృష్టిలో ముగిసిన అంశం. ప్రజాగర్జన పేరుతో వారు సాగిస్తున్నది అచ్చంగా ముందస్తు
ఎన్నికల ప్రచారం. ఆ విధంగా వారు అందరికన్నా ముందున్నారు. ప్రజాగర్జనలో వారు ఇస్తున్న
హామీలను చూస్తే ఈ విషయం ఎవరికైనా సులువుగానే
అర్ధం అవుతుంది.
తనను సియం చేస్తే,
రైతుల రుణమాఫీ, డ్వాక్రా సంఘాల
రుణమాఫీ ఫైళ్లపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు అంటున్నారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు
తొలి సంతాకాలు చేస్తానన్న అంశాలనీ సేకరిస్తే అవి వంద వరకు వుంటాయి అనంటే అతిశయోక్తికాదు. తొలి సంతకం అనేది ఒక్కటే వుంటుందని అశోక్ గజపతి రాజో, గాలి ముద్దు కృష్ణమ నాయుడో వారికి
చెపితే బాగుంటుంది. బీసీలకు వంద సీట్లు కేటాయిస్తానని చంద్రబాబూ అంటున్నారు. వారు చెపుతున్నవన్నీ మంచిపనులే. అందులో ఏమాత్రం
సందేహంలేదు. కానీ,
ఇవన్నీ ఏ రాష్ట్రంలో చేస్తారూ? ఆంధ్రప్రదేశ్ లోనా? తెలంగాణలోనా?
సీమాంధ్రలోనా? రాయలసీమలోనా?
అని సమంజసమైన సందేహం ఎవరికైనా వస్తే మాత్రం చంద్రబాబు సహించలేకపోతున్నారు.
జగన్ ది ఇంకో విచిత్రం. తెలంగాణలో చెయ్యాల్సిన సమైక్య శంఖారావం యాత్రని వారు సీమాంధ్రలో చేస్తున్నారు. ప్రత్యేకించి చంద్రబాబు,
కిరణ్ కుమార్ రెడ్డిల స్వంతజిల్లాలో,
వాళ్ల నియోజకవర్గాల్లో యాత్రచేస్తున్నారు. సీమాంధ్రలో తనకు గట్టి సవాలు విసురుతున్న చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలతో పొటీపడడానికే
జగన్ ఇప్పుడు తాపత్రయపడుతున్నారని ఎవరికైనా
సులభంగానే అర్ధం అవుతుంది.
సమైక్యవాద ముసుగులో సాగుతున్న సీమాంధ్ర అగ్రనేతలెవ్వరికీ
నిజాయితీలేదు. వాళ్ళిప్పుడు పోరాడుతున్నది వర్తమాన విభజనవాదులతోకాదు;
రేపు ఏర్పడే సీమాంధ్ర రాష్ట్రంలోని భావి ప్రత్యర్ధులతో.
(రచయిత ఆంధ్రా
జర్నలిస్టుల ఫోరం కన్వీనర్)
మోబైల్ :
90102 34336
హైదరాబాద్
4 జనవరి
2014
ప్రచురణ :
సూర్య దినపత్రిక,
ఎడిట్ పేజి
5 జనవరి 2014
http://www.suryaa.com/opinion/edit-page/article-165526
No comments:
Post a Comment