Thursday, 18 September 2014

తెలుగు సినిమాల్లో కథా దారిద్యం

తెలుగు సినిమాల్లో
కథా దారిద్యం 
ఉషా యస్ డానీ

తెలుగు సినిమాల మార్కెట్టు విస్తృతి,  సాంకేతిక విలువలు పెరిగినట్టుగా కథా విలువలు పెరగలేదు. దానికి కారణం సినిమాలు తీసేవాళ్ళేననేది ఒక నింద అయితే, సినిమాలు చూసే ప్రేక్షకులేననేది మరో నింద. ఇలాంటి పరస్పర విరుధ్ధ నిందల మధ్య ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, ముగ్గురు కమేడియన్లు, నాలుగు ఫైట్లు, ఐదు ఫారిన్ లొకేషన్స్, ఆరు డ్యూయట్లు అనేది తెలుగు సినిమా  ఫార్మూలాగా స్థిరపడిపోయింది. చూస్తున్నారు గాబట్టి తీస్తున్నాం అని నిర్మాతలు తప్పించుకుంటుంటే తీస్తున్నారు గాబట్టి చూస్తున్నాం అని ప్రేక్షకులు సర్దుకుంటున్నారు. సత్యం బహుశ ఈ రెండింటి మధ్య వుండవచ్చు. 

చూస్తున్నారు గాబట్టి తీస్తున్నాం అనడంలోనే ప్రేక్షకులు చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ తీస్తున్నారనే అర్ధం వుంది. ఒక పోలీసు కథ హిట్టు కాగానే, టాలివుడ్ లో ప్రతి హీరో ఖాకీ డ్రెస్సు వేసేస్తాడు!  రెండు కుటుంబాలను కలిపే కథ ఒకటి హిట్టు కాగానే ఆ మూసలో పది సినిమాలు వచ్చేస్తాయి. ఇందులో మరీ దారుణం ఏమంటే అదే హీరోతో అదే కథ కొత్త సినిమాగా వచ్చేస్తోంది. ఆగర్భ శత్రువులైన రెండు కుటుంబాల మధ్య ప్రేమను నాటే కథలు షేక్స్ పియర్  రోమియో జూలియట్ కాలం నుండే వున్నాయి.  ప్రస్తుతం టాలివుడ్ ఫార్మూలా ఈ మూసనే నమ్ముకుంది. ఫలితంగా ఒక హిట్టు పది ఫట్టులు వస్తున్నాయి. బృందావనం సినిమా నాలుగు డబ్బులు చేసుకుందని అదే యన్టీఆర్ తో రభస సినిమా తీస్తే ఏమవుతుందో్ ఇటీవల మనం చూశాం.

జీవితం (సమాజం) నుండి స్పూర్తి పొందాల్సిన కథను  హిట్టయిన సినిమా నుండి స్పూర్తి పొందడానికి ప్రయత్నించడంలోనే మొదటి తప్పు వుంది. కొన్నేళ్ళ క్రితం ఒక సినిమాలో ఫస్ట్ హాఫ్ ను బ్రహ్మానందం మీద, సెకండ్ హాఫ్ ను యంఎస్ నారాయణ మీద నడిపి, హీరోను అనుసంధానకర్తగానూ, ఇద్దరు అమ్మాయిలతో డ్యూయట్లు పాడేవాడిగానూ మార్చారు. ఆ సినిమా పెద్ద హిట్టు అయింది. అంతే. బ్రహ్మానందం, యంఎస్ నారాయణ మరియూ ఒక హీరో అనే ఫార్మూలాలో పది సినిమాలు తయారయ్యాయి. బ్రహ్మానందం, ఆలీ, యంఎస్ నారాయణలలో ఎవరో ఒకరు లేకుండా సినిమా తీసే దమ్ము  ఇప్పుడు టాలివుడ్ లో ఎంతమందికుందీ? మనం గమనించడం లేదుగానీ మన సినిమాలన్నీమల్టీస్టారర్ లే. వాటిల్లో కమేడీయన్లే అసలు హీరోలు.

సినిమా మాత్రమేకాదు, మొత్తం కళాసాహిత్యాల తక్షణ ప్రయోజనమే అలరించడం.  వినోదం అంటే  నవ్వించడం మాత్రమేకాదు; ఏడిపించడం కూడా!. ప్రేక్షకుల కన్నీళ్ళను ధియేటర్లలో జలపాతాల్లా ప్రవహింపచేసిన సినిమాలుlu సహితం sahitaMగొప్ప విజయాల్ని సాధించిన సందర్భాలు మనకున్నాయి. శ్రీరంజనీ, సావిత్రీ కాలం నుండి మాధవి నటించిన మాతృదేవోభవ వరకు ఇలాంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి.  ఇప్పుడు వినోదం అంటే హాస్యమే అనే పాక్షిక, సంకుచిత అర్ధం స్థిరపడిపోయింది. అది వెకిలి హాస్యమైతే మరీ మంచిది అనుకుంటున్నారు సినీనిర్మాతలు.

టెలివిజన్ రంగంలో ప్రొడ్యూసర్ అంటే సృష్టికర్త అని అర్ధం. సినిమారంగంలో ప్రొడ్యూసర్ అంటే ఫైనాన్షియర్ అని అర్ధం. పూర్వపు రోజుల్లో విఖ్యాత దర్శకులు కేవీ రెడ్డి  ఫైనాన్షియర్ ను ప్రొడ్యూసర్ అనవద్దని వాదించేవారట. వారి దృష్టిలో ప్రొడ్యూసర్ అంటే డైరెక్టరే.  ప్రొడ్యూసర్ ఫైనాన్షియర్ అయినపుడు, అతను సురక్షిత మదుపు (సేఫ్ ఇన్వెస్ట్ మెంట్) గురించి ఆలోచిస్తాడు. ఆ క్రమంలో సకల కళల్ని డబ్బుతో కొలుస్తాడు. ఆ మేరకు అవి జీవాన్ని కోల్పోతాయి. జీవాన్ని కోల్పోయినదేదీ ఉద్వేగాన్ని సృజించదు.  ఉద్వేగాన్ని సృజించే లక్షణం లేనిది కళకాదు.

అసలు ఏ ఉద్వేగమూ లేకుండా ఏ సినిమా అయినా  ఎలా విజయవంతం అవుతుందీ? అనేది విలువైన సందేహమే. సినిమాను ఎంతో కొందమంది ప్రేక్షకులు చూడాలంటే అందులో ఏవో కొన్ని ఉద్వేగాలు ఏదో ఒక స్థాయిలో వుండి తీరాలి. ప్రస్తుతం టాలివుడ్ రెండు రకాల ఉద్వేగాల్ని నమ్ముకుని బండి నడిపేస్తోంది. ఇందులో మొదటిది హీరో ఇమేజి. రెండోది హాస్యనటులు. మొదట హాస్య నటులు, తరువాత హీరో అనుకున్నా తప్పుకాదు.

ఫైనాన్షియర్లు ఫలానా హీరో హీరోయిన్లతో సినిమా తీస్తున్నామని గొప్పగా ప్రకటిస్తారేతప్ప,  ఫలానా కథను సినిమా తీస్తున్నామని  ప్రకటించరు. చాలా అరుదుగా మాత్రమే హీరో, కథ రెండూ నప్పవచ్చు. అప్పుడు ఒక హిట్టు రావచ్చు. మిగిలినవన్నీ పరాజయం పాలయ్యేవే. ఫైనాన్షియర్లు అనుసరిస్తున్న సురక్షిత పెట్టుబడి విధానం ఏమేరకు సురక్షితమో నిజానికి ఎవ్వరూ చెప్పలేరు. చావు దెబ్బలు తింటున్నా తెలుగు సినిమారంగం మాత్రం  పట్టు విడువక ఫైనాన్షియర్ల దృక్పథంలోనే నడుస్తున్నది.

తమ అభిమాన హీరోను తెర మీద చూడగానే ప్రేక్షకులు ఉద్వేగానికి గురవుతారు. హీరో హాస్యనటుల్ని ఆట పట్టించడం కూడా వాళ్ళకు చాలా వినోదాన్నిస్తుంది. ఇదే ఒక హీనమైన వినోదమైతే, హాస్యనటుల్ని తరచూ కొట్టడమే  అభిమానులకు మరింత వినోదం అని నమ్మే దర్శకులు ఇప్పుడు ఎక్కువైపోయారు. హీరో చేతిలో ప్రతి సీన్లో దెబ్బలు తినేందుకే ప్రముఖ హాస్యనటులకు భారీ గౌరవవేతనం ఇస్తున్నారన్నా అతిశయోక్తికాదు.  ఇలా సినిమా వ్యాపార వ్యూహం అంతా, మొత్తం ప్రేక్షకుల్ని అలరించేదిగా కాకుండా, కేవలం అభిమానుల్ని అలరించేదిగా కుచించుకుపోయింది.చూస్తున్నారుగాబట్టి తీస్తున్నాం అని నిర్మాతలు అంటున్నది ఈ అభిమానుల్ని దృష్టిలోపెట్టుకునే. దానితో ప్రేక్షకులు అంటే హీరో అభిమానులు అనే సంకుచిత అర్ధం స్థిరపడిపోయింది.

హీరోల అభిమానులుకాని  తటస్థ ప్రేక్షకులూ వుంటారు. నిజానికీ వాళ్ళూ పెద్ద సంఖ్యలోనే వుంటారు. వాళ్లను అలరించే సినిమాలు క్రమంగా తగ్గిపోయాయి. దానితో,  వాళ్ళూ క్రమంగా థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడడం తగ్గించేస్తున్నారు. ఎప్పుడయినా వాళ్లను ఆకర్షించే సినిమా ఏదైనా వచ్చినపుడో, కుటుంబ సభ్యులతో విహారానికి వెళ్ళాల్సిన సందర్భాల్లోనో మాత్రమే తటస్థ ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు. లేకపోతే, ఆర్నెల్ల తరువాత టీవీల్లో వచ్చే ఉచిత ప్రసారాల్ని ఇంట్లో కూర్చుని చూస్తున్నారు.  

ఇళ్ళలో టివీలకు పరిమితమయ్యే  తటస్థ ప్రేక్షకుల్ని సినిమా మార్కెట్ పరిథిలోనికి తీసుకు రావడానికి నిర్మాతలు ఇప్పుడు  అనేక కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. దృశ్య స్థాయినీ పెంచడం, సామాన్య జనం చూడాలని ఆశించే పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్ జరపడం దగ్గర నుండి ఇంట్లో టీవీల్లో చూసే సినిమాలకూ ధర వసూలు చేసే వరకు అనేక వ్యూహాలు వున్నాయి.

పర్యాటక ప్రాంతాల్ని చూడలేనివాళ్ళు వెండితెర మీద వీటిని చూసి ఆనందిస్తారు.   నాలుగు దశాబ్దాల క్రితం సినిమా పాటల్ని ఊటీ, బృందావనాల్లో తీసేవారు. హిమాలయాల్లో తీయడం దీనికి కొనసాగింపు. ఆ తరువాత సింగపూర్, మలేషియా వెళ్ళడం సాధారణ విషయంగా మారింది.  ఇప్పుడు వెనిస్, ఇస్తాంబుల్ వంటి నగరాలకు వెళుతున్నారు. అక్కడి దృశ్యాల్ని  సాధారణ ఇళ్లలో వుండే చిన్న టీవీల్లో చూసి ఆస్వాదించడం కష్టం.  పెద్ద దృశ్యాల్ని థియేటర్లలోని పెద్ద తెరమీద చూడాల్సిందే. ఐమాక్స్ లో చూస్తే వాటిని  ఇంకా గొప్పగా ఆస్వాదించవచ్చు. ఈ కారణాలతో టీవీ-సినిమా ప్రేక్షకుల్ని, తటస్థ ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటరు -సినిమా ప్రేక్షకులుగా మార్చవచ్చు అనేది నిర్మాతల వ్యూహం. 

 అయితే, ప్రపంచ వింతలు, పర్యాటక ప్రదేశాలు అన్నింటినీ సినిమాల్లో చూపెట్టేశాక ఏం చేయాలీ అనేదీ ఒక ప్రశ్నే. కొత్త టెక్నిక్ ను  ప్రవేశ పెట్టడం ద్వార పాత ప్రేక్షకుల్ని మళ్ళీ థియేటర్లకు రప్పించే పని అవతార్ లాంటి సినిమా చేసింది. అవతార్  సినిమాలో అద్భుతం అనిపించే సాంకేతిక విలువలు వున్నప్పటికీ అంతకు మించి వర్తమాన ప్రపంచ మార్కెట్ ను ప్రతిబింబించే సరికొత్త కథాబలం వుందన్నది మరచిపోరాదు. టెక్నిక్ ను మాత్రమే నమ్ముకుని కథను నిర్లక్ష్యం చేస్తే  రజినీ కాంత్, దీపికా పదుకునే నటించిన సినిమా కూడా  బాక్సాఫీసు ముందు బోల్తా పడుతుందని కొచ్చడయాన్ సినిమా నిర్మాతల చెంప మీద కొట్టి మరీ చెప్పింది.
అమెరికా, కెనడా రచయితలు అడపాదడపా విశాఖపట్నం వచ్చి  దండకారణ్యం జీవితాన్ని అధ్యయనం చేసి వెళుతుంటే, మన సినిమా రచయితలు ఒక హిట్టు సినిమాని పదిసార్లు చూసి అందులో నుండి వంద మూస సినిమాలు సృష్టించే పనిలో మునిగితేలుతున్నారు.  నిజానికి మంచి కథల కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన పనిలేదు. సమాజమే కథల గని. రోజూవారీ జీవితంలోని చిన్నచిన్న సంఘటనల్నిగొప్ప గొప్ప సినిమా కథలుగా మలచవచ్చు. అనుమానం వున్నవాళ్ళు ఇరానియన్, లాటిన్ అమెరికన్  సినిమాలు చూడవచ్చు.

ఖమ్మం జిల్లా సరిహద్దుకు ఆవల జనతన సర్కార్ పాలన వుందని, ఆ వాస్తవాన్ని   సెల్యులాయిడ్ మీద అద్భుతమైన కావ్యంగా మలచవచ్చని మన నిర్మాతల్లో ఒక్కరికయినా ఆలోచన వస్తుందా? అదే సమాచారం మెక్సికన్ - స్పానిష్ దర్శకుడు గుల్లేర్మో డెల్ తోరో కు తెలిసివుంటే ఈపాటికి పాన్స్ లాబిరింత్ (2006) వంటి మరో మాహాకావ్యాన్ని సెల్యులాయిద్ మీద  ఆవిష్కరించి వుండేవాడు.

ఇరాన్ దర్శకులయితే మరీనూ. ఆరేళ్ల పాప వంద రూపాయల నోటు పట్టుకెళ్ళి గాజు కుండీలో గోల్డ్ ఫిష్ చేపను కొనుక్కుని రావడం ఒక సినిమా కథ అవుతుందని మనం ఊహించగలమా?  (ద వైట్ బెలూన్  1995). స్కూలు బూట్లు ఒక జత పోతే మిగిలిన ఒక జత బూట్లను అన్నాచెల్లెలు వంతులవారీగా వాడుకోవాల్సిరావడాన్ని ఒక సినిమాగా తీయవచ్చా? అంటే తీయవచ్చు అంటాడు మాజిద్ మాజిదీ. అదే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ (1997). ఒకాయనకు చనిపోవాలనిపించింది. తనే సమాధి తవ్వుకుని అందులో పడుకున్నాడు. ఈలోపులో గాలివాన వచ్చి ఒక చెర్రీ పండు అతని నోటిలో పడింది. దాని రుచి చూశాక అతనికి జీవితం మీద మళ్ళీ  కోరిక పెరిగింది. (టేస్ట్ ఆఫ్ ఛెర్రి – 1997). ఇదీ ఒక ఇరానియన్  సినిమా కథే.  ఇలా ప్రతి అంశాన్నీ సినిమాగా మలిచేయగల మాంత్రికులు ఇరాన్ దర్శకులు. 

ఇలాంటి ఆఫ్ బీట్ కథల్ని మన ప్రేక్షకులు చూడరండీ అని చాలా మంది పెదవి విరుస్తుంటారు.  వారు ఏ రకం ప్రేక్షకుల్ని ఉద్దేశించి ఆ మాట అంటున్నారు అనేది అసలు ప్రశ్న. ఏదో ఒక హీరోకు అభిమానులుగా వున్నవారు మాత్రమే ప్రేక్షకులా? తటస్థంగా వుండేవాళ్ళు ప్రేక్షకులుకారా? వంటి ప్రశ్నలూ ముందుకువస్తాయి. స్లమ్ డాగ్ మిలీనియర్ వంటి ఆఫ్ బీట్ సినిమాను ప్రపంచమంతా పడిపడి చూశారన్నది మనం మరిచిపోతున్నాం. ఎవరయినా ఒక మంచి సినిమా తీస్తేతటస్థ ప్రేక్షకులు మాత్రమేకాకా, కొందరు హీరోలకు అభిమానులుగా ముద్రపడినవాళ్ళు కూడా దాన్ని చూస్తారని చాలాసార్లు రుజువయ్యింది. గతంలో యన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు అభిమానుల మధ్య భీకర పోటి సాగుతున్న సమయంలో నాగేశ్వరరావు ప్రేమనగర్ సినిమా వచ్చింది. యన్టీఆర్ అభిమానులు సహితం ఆ సినిమాను గొప్పగా ఆస్వాదించారు. అలా ఏఎన్నార్ అభిమానులు యన్టీ రామారావు సినిమాలను ఆస్వాదించిన సంఘటనలూ మరెన్నో వున్నాయి.

తెలుగు సినిమాలు ఐదు వందల కోట్లు, హిందీ సినిమాలు వెయ్యి కోట్ల రూపాయలు  వసూలు చేసే రోజులు ఎంతో దూరంలో లేవని సినీ పండితులు వేస్తున్న అంచనాలు నిజమే కావచ్చు. కానీ, సమాజం నిరంతరం సృష్టించే కొత్త కథల మీద దృష్టి పెట్టకుండా వసూళ్ల మీద మాత్రమే దృష్టి నిలిపినంతకాలం వర్తమాన  తెలుగు సినిమాల్లో  కథా దారిద్ర్యం, మృతసంస్కృతి  కొనసాగుటూనే వుంటుంది. ! 

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకుడు)
సెల్ ఫోన్ : 76749 99089

9 September 2014

Monday, 8 September 2014

BARAN (2001) Movie

Danny Notes
9 September 2014
BARAN (2001) Movie
ఇప్పుడే బరణ్ సినిమాను మా 144” స్క్రీన్ మీద చూశాను. Majid Majidi రచన-దర్శకత్వంలో 2001లో వచ్చిన మరో ఇరాన్ సినిమా ఇది.
బరణ్ చూడగానే పది మందికి ఫోన్ చేసి నేను ఒక గొప్ప సినిమా చూశాను అంటూ కథను ఒకటికి పదిసార్లు చెప్పాలనిపించేస్తుంది. ఇరాన్ సినిమాల్లో కథ తక్కువగానూ, జీవితం, ప్రకృతి ఎక్కువగానూ వుంటాయి. అంచేత, మీరూ చూడండి అనడంతప్ప కథ చెప్ప దలుచులోలేదు. బరణ్ అంటే వరణ్, అంటే వర్షం. దాన్ని బట్టి ఇప్పటికి కథను ఊహించుకోండి.

CHILDREN OF HEAVEN CLIMAX


Danny Notes
8 September 2014
స్వర్గలోకపు పిల్లలు
చెల్లెలి స్కూలుబూట్లను పోగొట్టిన అన్న ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలీకుండా తన స్కూలుబూట్లను పూటకొకరు చొప్పున వాడుకుందామంటాడు.
ఇదీ గంటన్నర సినిమా కథ అంటే చాలామంది నమ్మకపోవచ్చు. అలాంటివాళ్ళు Majid Majidi రచన-దర్శకత్వంలో వచ్చిన 1997 నాటి సినిమా Children of Heaven తక్షణం చూడండి. నేను ఇప్పుడే చూశాను.
“ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, నాలుగు ఫైట్లు, ఆరు డ్యూయట్టులు” అనే నాలుగు కాళ్ల మీద సంచరిస్తున్న టాలీవుడ్ సినిమాలకు అలవాటుపడినవాళ్ళు ఈ సినిమా చూశాక మూర్చపోయే ప్రమాదముంది. ముఖం మీద చల్లడానికి దగ్గర్లో ఏరియేటెడ్ సోడా వుంచుకోవాలని మనవి.


CHILDREN OF HEAVEN CLIMAX

అన్నచెల్లెలు ఆలీ, జహ్రాల జీవన్మరణ సమస్య బూట్లు. మూడవ స్థానం సాధిస్తే ప్రైజుగా  బూట్లు వస్తాయనే ఒకేఒక ఆశతో,  ఆధునిక శిక్షణ, ట్రాక్ సూట్, కనీసం రన్నింగ్ షూస్ కూడా లేకపోయినా పాత బూట్లతో ప్రతిష్టత్మక  పరుగు పందెంలో పాల్గొంటాడు ఆలీ. కానీ, విధి ‘వక్రీకరించి’ ఫస్టు ప్రైజు గెలుస్తాడు.

1. పరుగు పందెంలో ఫస్టు ప్రైజ్ వచ్చిన ఆనందం ఆలీకి ఏమాత్రం లేదు. మూడవ ప్రైజుగా వచ్చే బూట్లు రానందుకు అతను వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.  
2. మరోవైపు, అదే సమయంలో, వాళ్ల నాన్న మార్కెట్లో పిల్లలిద్దరికీ కొత్త బూట్లు కొని ఇంటికి బయలుదేరాడు.  
3. ఈలోపు ఆలీ విచారంగా ఇంటికి వచ్చాడు. బూట్ల కోసం అన్న చేతులు, కాళ్లను చూసింది చెల్లెలు. అన్న బూట్లు తేలేదని తెలిసి చెల్లి నిరాశగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అవమాన భారంతో ఆలీ  కుంగిపోతున్నాడు.
4. ఆలీకి కొత్త బూట్లు రాలేదు. అన్నా చెల్లెలు వంతుల వారీగా వాడుకుంటున్న పాత బూట్లు కూడా  తెగిపోయాయి. వాళ్ల కష్టాలు మరింత పెరిగాయి.  
5.  బూట్లూ,  సాక్సులు తీశాడు ఆలీ. కాళ్ళకు బొబ్బలు లేచివున్నాయి. సేదదీరడానికి  కాళ్లు నీటి తొట్టెలో  పెట్టాడు.
6. నీళ్ళలో బంగారువన్నె చేపపిల్లలు ఆలీ కాళ్ల చుట్టూ తిరుగుతూ అతని పాదాల్ని ముద్దు పెట్టుకుంటుండగా బ్లాక్ స్క్రీన్ వస్తుంది.
ఇదీ ఈ సినిమా  క్లైమాక్సు స్వీక్వెన్షియల్ ఆర్డరు. 
ఇంకొకరయితే, స్కూలునిర్వాహకులు, విద్యార్ధులు, కుటుంబసభ్యులు కలిసి కప్పు గెలిచిన ఆనందోత్సవాలను జరుపుకుంటుండగా, వాళ్ల మీద పూలు కురుస్తుండగా కథను ముగించేవారు. అలాంటివి వందల సినిమాల్లో మనం చూసి వుంటాం.

ఇరాన్ దర్శకులు,(ముఖ్యంగా Majid Majidi)  ముగింపును చాలా కళాత్మకంగా తీస్తారు.  చాల సహనం, సంయమనం పాటిస్తారు. ఈ సినిమా ముగింపులో,  వాళ్ల నాన్న బూట్లు కొని తెస్తున్నాడనే సమాచారం దర్శకుడు ప్రేక్షకులకు ఇచ్చే ఓదార్పు మాత్రమే. ఆ ఓదార్పు  ఆలీకీ, అతని చెల్లెలికీ తెలీదు.  ఆలీకి ఓదార్పు ఆ చేపపిల్లల ముద్దులు. అదీ అసలు ముగింపు. ఈ సినిమా వాల్ పోస్టర్ లోనూ ఆకాశంలో విహరిస్తున్న చేపపిల్లలుంటాయి. 

Sunday, 7 September 2014

శ్వేతబసు – కల్పన - మీడియా


శ్వేతబసు – కల్పన  - మీడియా


మీడియా  లైఫ్ సేవింగ్ డ్రగ్ – సోషల్ రిపోర్టింగ్

మీడియా సంస్థలు అనేక రాజకీయ వత్తిళ్ల మధ్య పనిచేయాల్సి వుంటుందనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. రాజకీయేతర సంఘటనల్లో అయినా మీడియా సోషల్ రిపోర్టింగ్ ను క్రియాశీలంగా కొనసాగిస్తే అది దానికి లైఫ్ సేవింగ్ డ్రగ్ గా పనిచేస్తుంది. నిర్భయ కేసులో జాతీయ మీడియా చేసింది ఇదే. ఆ కేసులో మీడియా అతిగా స్పందించింది అనే విమర్శలు కుడా వున్నాయి. కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాటి ప్రభుత్వాధినేతలు సహితం వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేలా మీడియా చేయగలిగింది. అంతిమంగా నిర్భయ చట్టాన్ని రూపొందించేలా రాజకీయ వ్యవస్థ మీద అడ్వకసీ / ప్రెషర్  గ్రూపుగా  వత్తిడి తేగలిగింది. ఆ మేరకు మీడియా తన ఆమోదాంశాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకో గలిగింది.

మీడియా సంస్థలు నయా వేశ్యా వాటికలుగా మారిపోతాయి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీడియా సంస్థల పైన గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో రాజకీయ వత్తిడి ఇప్పుడు  కొనసాగుతోంది. మీడియా ఇంతటి నిస్సహాయ  స్థితిలో పడిపోవడం గత యాభై యేళ్లలో ఎన్నడూ లేదు. ఇలాంటి సంకట స్థితిలో మీడియా వ్యూహాత్మకంగా  సోషల్ రిపోర్టింగ్ మీద దృష్టి పెట్టి తన జీవికను నిలబెట్టుకోవాలి. అయితే, ఇన్నాళ్ళుగా పొలిటికల్ రిపోర్టింగ్ కు అలవాటు పడిన మీడియా ఒక్కసారిగా సోషల్ రిపోర్టింగు చేపట్టడం అంత సులువుకాదు. అయినా అభ్యాసం చేసుకోవాలి. లేకపోతే మీడియా సంస్థలు నయా వేశ్యా వాటికలుగా మారిపోతాయి!

బెంగాల్ కు చెందిన టాలివుడ్ నటి శ్వేత బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో ఎకడా? అనే వింత ఉఛ్ఛారణతో  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే, ఆ తరువాత పెద్దగా హిట్లు లేక సినిమా అవకాశాలు తగ్గి, బతుకు అవసరాలు పెరిగి  విలవిల్లాడుతున్న అమె కొత్త బంగారు లోకంను వెతుక్కునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కింది. బంజారా హిల్స్ లోని ఒక విలాసవంతమైన హొటల్లో వ్యభిచారం చేస్తున్న ఒక సినీ హీరోయిన్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని దాదాపు అన్ని పత్రికలు, టివీ న్యూస్ ఛానళ్ళ లోనూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఏమైందోగానీ, ఆమె మీద కేసు పెట్టకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా మూడు నెలలు వుండేలా  నేరుగా రెస్క్యూ హోంకు పంపించారు.

ఈ కేసులో చాలా మార్మికత వుంది. వ్యభిచారం నేరంలో రెడ్ హ్యాండెడ్గా అంటే ఆమెతో పాటూ ఒక పురుషుడ్ని కూడా పట్టుకున్నారని అర్ధం. ఆ పురుషుడెవరూ? అన్నది ఎవరికైనా రావలసిన ఒక కీలక సందేహం. అతని వివరాలను పోలీసులు ఎందుకు దాచారూ? అనేది రెండో సందేహం. వ్యభిచారం జరుగుతున్నదని చెపుతున్న హొటల్ యజమాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారూ? అనేది ఇంకో సందేహం. రెస్క్యూ హోంకు పంపడానికి శ్వేత బసు మీద ఎలాంటి కేసు పెట్టారు? అన్నది ఇంకో సందేహం. అసలు కేసే పెట్టకుండా రెస్క్యూ హోంకు పంపడానికి వీలుందా? అన్నది మరో సందేహం. మీడియాలో చాలా మందికి ఇలాంటి సందేహాలు రాలేదు. కొందరికి వచ్చినా అడగాల్సిన వాళ్లను నిలదీసే సాహసం లేకపోవచ్చు. సాహసించినా సమాధానాలు రాబట్టే స్తోమత లేకపోవచ్చు. సమాధానాలు రాబట్టినా ప్రచురించే అవకాశం లేకపోవచ్చు. మీడియా బతికేదే ప్రకటనదారుల దయాదాక్షిణ్యాల మీద కనుక వాళ్ళు అడ్డుపడి వుండవచ్చు.. నికరంగా జరిగిందేమిటంటే ఈ సంఘటనను సంచలనం చేసి మీడియా లబ్దిపొందింది. ఒక అమ్మాయి దయనీయ జీవితాన్ని బజారున పడేసింది. ఇది మీడియా స్థాయిలో హీనమైన చర్య.


శ్వేత బసు కేసు - నీతులు చెప్పడం సులువు ఆచరించడం కష్టం!

మేము ఈ వృత్తిలో బతకాలంటే కొన్ని సర్దుబాట్లు లొంగుబాట్లు తప్పవు అంటుంటారు కొత్త తరం జర్నలిస్టులు. మీరు గట్టున పడ్డారు (రిటైరు అయ్యారు) గనుక చెప్పడం సులువు అని నాకు ఒక చురక కూడా వేస్తుంటారు. నిజానికి వర్కింగ్ జర్నలిస్టుగా మారిన కొత్తలోనూ నేను ఇంతకన్నా ఎక్కువ తెగువను చూపించేవాడిని. ఉద్యోగం పోతే కులవృత్తి (మెకానిక్) వుందిగా అనుకునేవాడిని.  

పోలీసులతో సన్నిహితంగా వుండడం నాకు కుదరదు కనుక క్రైమ్ తప్ప ఏ బీటు అయినా  చేస్తాను అనే షరతుతో నేను వర్కింగ్ జర్నలిస్టుగా ఆంధ్రభూమిలో చేరాను. అయితే, ఏడాది తిరక్కుండానే ఒక  క్రైమ్  అసైన్ మెంట్ చేయకతప్పలేదు. 1989 సెప్టెంబరు నెలలో విజయవాడలో జరిగిన కల్పన హత్యకేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుడు సుప్రసిధ్ధ బెంజ్ కంపెనీ యజమాన్య సభ్యుడు కావడం. హతురాలు మూడు నక్షత్రాల ఖాంథారి హొటల్ లో బసచేయడం. నిందితుని స్నేహితులు బంగారు నగర పాలకులు కావడంతో ఈ కేసుకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అప్పటి మా ఎడిషన్ ఇన్ చార్జి తాడి ప్రకాష్ నన్ను కల్పన కేసు టేకప్ చేయమన్నారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు నాకూ పడదు అన్నాను. “ఇది మీరే చేయగలరు అన్నారు.  కల్పన మరణ రహాస్యం ఒక్క డిఎంఓ కే తెలుసు!శీర్షికతో  మొదటి రోజు నేను రాసిన కథనం సంచలనం రేపింది. అందులో బాక్స్ ఐటెమ్ గా రాసిన వాక్యాలు మరీ భూకంపాన్ని సృష్టించాయి.

కల్పన ఎలాగూ చనిపోయింది. ఆమె మరణ రహాస్యం మాత్రం బతికే వుంది!. దాన్ని చంపే ప్రయత్నం జరుగుతున్నదనే పత్రికల ఆందోళన! కల్పన  మరణం మిస్టరీకాదు! ఆ రహాస్యం శేషగిరికి తెలుసు. డాక్టర్ జయప్రకాష్ కీ తెలుసు. పోలీస్ కమీషనర్ భాస్కర రెడ్డికి తెలుసు. మనిషి చచ్చిపోయినా నిజం చచ్చిపోకూడదు. కల్పన – ఏ కుట్రా జరక్కుండా – తీసుకున్న విషంవల్ల చనిపోతే ఆ వాస్తవమే కావాలి. కొందరు ఆస్తిపరుల నోట్ల కట్టల కింద మట్టు పెట్టబడితే ఆ చేదు నిజమే కావాలి. మనిషి ప్రాణం తీయడానికి వెనుకాడని క్రూరులు నవ్వుతూ మన మధ్య తిరక్కూడదు. మరో కల్పనను ఖాంధారి హొటల్ మెట్లెక్కించ కూడదు
ఇంతమంది మీద ఇంతటి తీవ్ర ఆరోపణలు చెస్తే బతకనివ్వరు అని నన్ను భయపెట్టినవాళ్ళు వున్నారు. నా కథనాన్ని ప్రచురించడమేగాక, ప్రధాన నిందితుడు బాడుగ శేషగిరిరావును అరెస్టు చేసేవరకు నన్ను ప్రోత్సహించిన తాడి ప్రకాష్ కు ఈ ఘనత దక్కుతుంది,

ఇది నా గొప్పలు చెప్పుకోవడానికి పోస్ట్  చేయలేదు. ఇలా రాయవచ్చు. రాసి నిలదొక్కుకోవచ్చు  అని కొత్త తరాలకు ఉత్తేజాన్ని ఇవ్వడానికీ దీన్ని మీ ముందు వుంచుతున్నాను.

Danny Notes
7 September 2014

Kalpana Case - Modus operandi

కల్పనది తణుకు సమీపాన వేల్పూరు. అందంగా, ఆకర్షణీయంగా, చలాకీగా,  చాlAలామంది i వాణిజ్యవేత్తలకు కలలరాణిగా వుండేది. పుట్టింది సామాన్యమైన కుటుంబమే అయినా విలాసవంతమైన జీవితం గడిపేది. బాడిగ శేషగిరి రావుతో కొంతకాలం  ఆమెకు  సన్నిహిత సంబంధాలు వుండేవి. 1989 సెప్టెంబరులో కల్పన విజయవాడ వచ్చి  సెటిల్ మెంట కోసం నాలుగు రోజులు ఖాందారి హొటల్ లో బస చేసింది.  హొటల్ గదిలో చర్చోప చర్చలు సాగాయి. ఆటోమోబైల్ దిగ్గజాల పుత్రరత్నాలు కూడ ఈ చర్చల్లో పాల్గొన్నారు. నాలుగో రోజు, స్పృహలోలేని స్థితిలో వున్న కల్పనను ఎవరో అగంతకుడు యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో చేర్చి వెళ్ళిపోయాడు. ఆమె శరీరంలో విషం ప్రభావాన్ని గుర్తించిన వైద్యులు  విరుగుడు చికిత్స మొదలెట్టారు. ఆరాత్రి ఆసుపత్రిలో  కోలుకుంటున్నట్టు కనిపించిన కల్పన  తెల్లవారే సరికి చనిపోయింది. ఇదీ స్థూలంగా కేసు.

Modus operandi

సాధారణంగా సంచలన కేసులు జరిగినపుడు ప్రతి రోజూ సాయంత్రం నగర పోలీసు కమీషనర్ మీడియా మీట్ పెట్టి, ఆ రోజు దర్యాప్తు వివరాలు చెప్పడం సాంప్రదాయం. చాలా మంది రిపోర్టర్లు  పోలీసు వున్నతాధికారుల ప్రకటనల ఆధారంగానే కథనాలు రాస్తారు. కొందరు వాటిమీద తమ అనుమానాల్నీ వ్యక్తం చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే తమ స్వంత దర్యాప్తు జరుపుతారు. 

మనుషులకు తమ పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించే అవకాలు జీవితంలో చాలా అరుదుగా మాత్రమే వస్తాయి. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చెలరేగిపోవాలి. కల్పన కేసును నాకు అప్పచెప్పగానే మిస్టరీని చేధించడానికి కొంచెం కొత్త పధ్దతిని  పాటించాలనుకున్నాను. పోలీసుల్నినమ్మకపోగా వాళ్లను రక్షణాత్మక స్థితిలో పడేయాలనేది తొలి ఎత్తుగడ. కేసు చిక్కుముడుల్ని  సాంకేతికంగా విప్పుకుంటూ రావాలనేది రెండో ఎత్తుగడ.

పాత్రికేయులకు నిర్వహణ సామర్ధ్యం వుంటే చాలు. వాళ్ళు ఏ అంశంలోనూ సూపర్ స్పెషలిస్టులు కావల్సినపనిలేదు. కీలకమైన సబ్జెక్టుల్లో  నిపుణుల సలహా ఇవ్వడానికి ఫోన్ - ఫ్రెండ్స్వ్యవస్థ ఒకటి  నాకు వుండేది.  మెడికల్ వ్యవహారం కనుక ఇద్దరు డాక్టర్ మిత్రుల్ని సంప్రదించి యాంటీ డోట్ వైద్యంలో కొన్ని సాంకేతిక మెళుకువలు తెలుసుకున్నాను. ఒక సీనియర్ లాయర్ ను సంప్రదించి వారం రోజుల ఎపిసోడ్లు సీరియల్ గా ఎలా నడపాలో ప్లాన్ చేసుకున్నాను. వాటికి తోడు  నా గెరిల్లా యుధ్ధతంత్రం నాకు ఎలాగూ వుంది. మొదటి రోజు కథనంలోనే పోలీసు వున్నతాధికారి మీద, వైద్యం చేసిన డాక్టరు మీద బాంబులు వేశాను. వాళ్ళు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అసలు దోషిని బయటపెట్టాల్సి వుంటుందని ఎందుకో అనిపించించింది. (ఇది పుస్తకాలు చదివిన ప్రభావమో, సినిమాలు చూసిన ప్రభావమో కావచ్చు. )

చివరకు బాడిగ శేషగిరి రావును అరెస్టు చేసి, జుడీషియల్ కష్టడీకి పంపేరు. డీయంఓ ను  సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

కొంచెం కామెడీ
కల్పన కేసు పరిశోధన సందర్భంగా చాలా హాస్య సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఒకసారి పోలీస్ కమీషనర్ భాస్కరరెడ్డి దగ్గర విషప్రయోగం చర్చ వచ్చింది. కుళ్ళిపోయిన మాసం తిన్నా మనుషులు చచ్చిపోతారు అన్నారు ఒక పోలీసు అధికారి. అయితే, ఖాందారీ హొటల్లో కుళ్ళిన మాసం తిని కల్పన చనిపోయిందనా మీ అభిప్రాయం అన్నాను. నా చలోక్తి చాలా కాలం చాలా ప్రభావాన్ని చూపింది. ఖాంథారి హొటల్ కళా హీనంగా మారి పోయింది. చివరకు దాన్ని అమ్మకానికి పెట్టారు.

No doubt it is a risky task in the given situation then. But one should not ignore the fact that there are very progressive elements among both KAMMAS and KAPUS of Vijayawada. Fortunately, there were and there are good friends of mine in the both communities in the same city. After all Vijayawada is my second home town. It is my court and I can play any game there.

విజయవాడ నా రెండవ జన్మభూమి

కల్పన కేసు గురించి రాసాక చాలా మంది మిత్రులు Comments లోనూ  Chat లోనూ కొందరు Phone Talkలోనూ ఈ కేసు లోని కులం కోణం గురించి కుతూహలంగా అడుగుతున్నారు. నిజానికి కల్పన కేసులో   ఒక కులం లేదు. చాలా కులాలున్నాయి. హతురాలు కళావంతులు (బిసి). ప్రధాన నిందితుడు కాపు సామాజికవర్గానికి చెందినవారు.. ప్రధాన నిందితుడి స్నేహితులు, అనుమానితులు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. నగర పోలీసు కమీషనర్ ది రెడ్డి సామాజికవర్గం. డీఎంఓ ది కమ్మ సామాజికవర్గం.

ఇక నాకు ఈ కేసు అప్పచెప్పిన తాడి ప్రకాష్ గారిది కాపు సామాజికవర్గం. నాకు మెడికల్ సలహాలు ఇచ్చిన డాక్టర్లలో ఒకరు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. ఇంకొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. నా లీగల్ అడ్వైజర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. నా రాజకీయ గురువు వాసిరెడ్డి వెంకట కృష్ణారావుగారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.   ఇక నా విషయం ; పుట్టుక రీత్య ముస్లిం సామాజికవర్గమే అయినా  నా ఉనికి అప్పుడు కరుడు కట్టిన రాడికల్. ఇటు ఈ చివర యస్సీల దగ్గర నుండి అటు ఆ చివర బ్రాహ్మణుల వరకు నాకు అన్ని సామాజికవర్గాలతోనూ సన్నిహిత సంబంధాలు వుండేవి. సన్నిహితం అనేది ఏదో లాంఛనంగా వాడిన పదంకాduduదు.  నన్ను ద్వేషించేవాళ్ళు కొందరు వున్నట్టే నన్ను విపరీతంగా ప్రేమించేవాళ్ళు అనేక సామాజికవర్గాల్లో అనేకమంది వుండేవాళ్ళు. అంచేత తూకం నా వైపే వుండేది.

అన్నింటికి మించి గమనించాల్సిన అంశం ఏమంటే విజయవాడ అంటే రౌడీల హడ్డా మాత్రమే కాదు అంతకు మించిన ప్రగతిశీలశక్తుల నిలయం అది. నా రెండవ జన్మభూమి అది. అది నా మైదానం. అక్కడ నేను ఏ ఆట అయినా ఆడగలను. అప్పుడూ ఇప్పుడూ!

7 September 2014

Wednesday, 3 September 2014

Diet Canteen

Diet Canteen
1.    100 gms.        Phulkas
2.   75 gms         Curd Rice
3.   100  gms       Dal Curry
4.   100  gms       Vegetable Curry
375 gms

Extended
1.    100 gms         Ragi / Rice Soup
2.   100 gms.        Vegetable salad
3.   100 gms        Fruit Salad
4.   100 gms         Savoury

Whole Grains
1.    Wheat
2.   Jowar / Millet
3.   Ragi / Finger Millet
4.   Rice Flour
5.   Bajra / Pearl Millet
6.   Makkai / Maize
7.   Jau / Barley

Monday, 1 September 2014

Blessing In Disguise


బ్లెస్సింగ్ ఇన్ డిజ్ గైజ్
డానీ

రాజకీయ కార్యకలాపం అంటే ప్రత్యర్ధుల్ని తిట్టడమే అనే అర్ధం దాదాపుగా ఖాయం అయిపోయింది. ప్రభుత్వాధినేతలకు ఇందులో ఒక సౌకర్యం వుంది. వాళ్ళు ప్రజల కోసం పెద్దగా సంక్షేమ పథకాలను చేపట్టకపోయినా తమ ప్రత్యర్ధులను తరచూ విమర్శిస్తూ వుంటే చాలు. ప్రజలకు ఆ  స్వల్ప ఆనందాన్ని పంచుతూ వుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తుతం ఈ పధ్ధతిని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ వుండడంవల్ల ప్రత్యర్ధులుగా కనిపిస్తున్నారుగానీ, తిట్టుకోవడానికి వాళ్ళిద్దరూ ఒకే విధానాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మేరకు వాళ్లమధ్య ఎత్తుగడల ఐక్యత వుంది.

రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసిఆర్ కు  తన రాష్ట్రంలో రాజకీయంగానూ నైతికంగానూ ఒక సానుకూల  వాతావరణం వుంది. అంచేత మూడు నెలలు మస్తుగ శోచాయించుత. ఆ తరువాత పని మొదలెడత అని ప్రకటించడం అయనకు సాధ్యం అయింది. చంద్రబాబు పరిస్థితి అలా సానుకూలంగాలేదు. నేను నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను అని అంటేగానీ వారి బండి నడిచేలా లేదు. నిజానికి పని మొదలెట్టను అన్న కేసిఆర్ ఒకదాని వెంట ఒకటిగా  పనులు చేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబుకే పనులు ఎక్కడ మొదలెట్టాలో ఏలా మొదలెట్టాలో అర్ధం అవుతున్నట్టులేదు.

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర నాయకులు తెచ్చిన  వత్తిడిని నిరాకరించడం, అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ , తెలంగాణ ప్రాంతానికి గొప్ప సానుకూల అంశం. అదే బిల్లులో శేషాంధ్రప్రదేశ్ కు మూడు ఓదార్పు అంశాలున్నాయి. హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా మార్చి, అక్కడి శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ కు ఇవ్వడం, విద్యారంగంలో ప్రస్తుత కోటాలు, సౌకర్యాల కొనసాగించడం, ముంపు ప్రాంతాన్ని శేషాంధ్రప్రదేశ్ లో కలుపుతూ పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం, నిజానికి మూడు అంశాలూ తమవైన పధ్ధతుల్లో వివాదాస్పదమైనవే. అయితే, ఒక బిల్లును ఆమోదించడం అంటే అందులోని సానుకూల, ప్రతికూల అంశాలతో సహా మొత్తంగా స్వీకరించడం అనే అర్ధం. కొన్ని తీసుకున్నప్పుడు కొన్ని ఇవ్వకతప్పదనే ఇంగితం తెలియని వారేమీకాదు కేసిఆర్. అయితే, రాజకీయం అలా వుండనివ్వదు. అవ్వాకావాలి, బువ్వాకావాలి అనేవాళ్ళే  క్రీయాశీల రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న కాలమిది.

రాజకీయంగా నిలదొక్కుకున్న కేసిఆర్ ఇప్పుడు అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో శేషాంధ్రప్రదేశ్ కు ఓదార్పుగా పొందుపరచిన అంశాల మీద ప్రత్యంక్షంగానే దాడి మొదలెట్టారు. పోలవరం ముంపు ప్రాంతం,  విద్యార్ధుల సౌకర్యాలు, హైదరాబాద్ శాంతిభద్రతల బాధ్యత అంశాల మీద ఆందోళనను స్వయంగా కేసిఆర్ యే మొదలెట్టారు. మూడింటిని వ్యతిరేకించినవాళ్ళు త్వరలో ఉమ్మడి రాజధాని అంశాన్ని కూడా  వ్యతిరేకిస్తారనే అనుకోవాలి. ఆ పనిని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అప్పుడే మొదలెట్టేశారు కూడా. ఏపీ మంత్రులకు చీము, నెత్తురు ఉంటే ఆంధ్రా నుంచే పాలన కొనసాగించాలి అని వారు తాజాగా సవాలు విసిరారు.

ఇలాంటి ప్రో-యాక్టివ్  శైలివల్ల ఇటు కేసిఆర్ కు తక్షణ రాజకీయ ప్రయోజనం ఎలాగూ వుంది. విచిత్రంగా ఇది చంద్రబాబుకు కూడా సానుకూలంగా మారుతోంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలలోనూ వాళ్ళిద్దరే క్రమంగా ఏకైక ప్రతినిధులుగా మారుతున్నారు. ఇప్పటికే కష్టాల్లోవున్న  ఆంధ్రప్రదేశ్ ను,  కేసిఆర్  మరింత ఇబ్బందుల లోనికి నెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో  చంద్రబాబు వైఫల్యాలను విమర్శించే నైతిక ధైర్యం అక్కడి విపక్షాలకు సరిపోవడంలేదు. ఆంధ్రప్రదేశ్ నుండి శాసనసభ, లోక్ సభల్లో   కాంగ్రెస్  కు ఎలాగూ ప్రాతినిధ్యంలేదు. ప్రాతినిధ్యంవున్న జగన్ కు అనుభవంలేదు. పెద్దగ్రహం చిన్నగ్రహాలను వీలీనం చేసుకుంటుంది లేదా ఉపగ్రహాలుగా మార్చుకుంటుంది అనే అంతరిక్ష సూత్రానికి అనుగుణంగా ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు క్రమంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. మరోమాటల్లో చెప్పాలంటే కేసిఆర్ వైఖరి చంద్రబాబుకు బ్లెస్సింగ్ ఇన్ డిజ్ గైజ్ గా మారుతోంది.

తెలంగాణలో విపక్షాల  పరిస్థితి కూడా భిన్నంగా లేదు. ఎన్నికల్లో ఓడిపోయినా, అంతర్గత కుమ్ములాటల్ని మాత్రం వదులుకోకుండా కాంగ్రెస్ తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. జానా, పొన్నల వివాదాలు గాంధీ భవన్ ప్రహరీ గోడదాటి నాంపల్లి రోడ్దు మీద పడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎలాగూ ప్రభుత్వంలో భాగస్వామి కనుక దానికి ప్రస్తుతం ప్రత్యేక ఇబ్బందులు ఏమీలేవు. తెలంగాణ బీజేపీది చిత్రమైన పరిస్థితి. అది కేసిఆర్ కేంద్రంతో చేసే పోరాటంలో మునపటిలా గొంతు కలపనూలేదు; కేంద్రంలోని యన్డీయే ప్రభుత్వం తెలంగాణ అంశంపై తీసుకునే నిర్ణయాలను గట్టిగా సమర్ధించనూ లేదు. తెలంగాణ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గత యూపీయే హయాంలో తీసుకున్నవే అనడంతప్ప ఆ పార్టీ రాష్ట్రశాఖకు మరో మార్గంలేదు. రాజకీయ పార్టీలు ఇలాంటి ఇబ్బందుల్లో వున్నప్పుడు చిన్నచిన్న అంశాల మీద పెద్దపెద్ద హంగామాలు చేస్తుంటాయి. సానియా మీర్జా కేసు అలా తెలంగాణ బీజేపీకి ఒలిచిపెట్టిన అరటిపండులా దొరికింది.

సంఘ్ పరివరికుడుగా పేరున్న వేద్ ప్రతాప్ వైదీక్ పాకిస్తాన్ పర్యటనలో లష్కరే చీఫ్ హఫీద్ సయీద్ ను కలుసుకోవడం జులై రెండవ వారంలో భారత రాజకీయాల్ని కుదిపివేసింది. రెండు మూడు రోజులు పార్లమెంటు అట్టుడుడికిపోయింది. సరిగ్గా ఈ సమయంలో కేసిఆర్ టెన్నిస్ కీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్ గా ప్రకటించారు. ఇది బీజేపీకి బ్లెస్సింగ్ ఇన్ డిజ్ గైజ్ గా మారింది. కేసిఆర్ నిర్ణయం ముస్లిం సంతుష్టీకరణ అంటూ బీజేపి నేతలు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు పెద్ద వివాదాన్ని రేపారు. ఇది బీజేపీకి రెండు విధాలా వుపయోగపడింది. మొదటిది, బీజేపి నేతలు బయటికి వచ్చి మాట్లాడడానికి అవకాశం దొరికింది. రెండోది, వేద్ ప్రతాప్ వైదీక్ వివాదం నుండి జనం దృష్ఠిని మళ్ళించడానికి తోడ్పడింది. ఇలాంటి ఎత్తుగడల్నే ఇటీవల  మీడియా మేనేజ్ మెంటు అంటూ ఘనంగా పేర్కొంటున్నారు.

సానియా మీర్జాకు 1965 స్థానికతవర్తించదా?”, సానియా మీర్జాకు  కోటి రూపాయలు; ఎవరెస్టు ఎక్కిన పిల్లలకు 25 లక్షలా?” “కామన్ వెల్త్ కీడల కప్పులు తెచ్చినవాళ్ళకు 50 లక్షలా? సానియా మీర్జా స్వాతంత్ర సమయోధురాలా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా? వంటి ప్రశ్నలతో బీజేపి నేతలు, వాళ్ళ అభిమానులు చెలరేగిపోయారు. ముస్లింల ప్రస్తావన రాగానే సంఘ్ పరివారం అంబుల పొదిలో పాత ఆయుధాలు చాలా వుంటాయి. ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను ముద్రించడం, తెలంగాణలో నవాజ్‌ అలీ జంగ్‌ జయంతిని ఇంజనీర్స్‌ డేగా ప్రకటించడం వగయిరాలు ఈ జాబితాలో వున్నాయి. అంతిమంగా, ప్రభుత్వం ముస్లిం సానుకూల విధానాలను మార్చుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపి నేతలు హెచ్చరించారు. 

 

వాణిజ్య ప్రచారం కోసం బ్రాండ్  రాయబారిని  నియమించుకున్నప్పుడు పారితోషికం భారీగా వుండాల్సిందే. ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయితే, తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాకు ఇచ్చిన కోటి రూపాయల పారితోషికం చాలా తక్కువ మొత్తం అనే చెప్పాలి. అయినప్పటికీ, సంఘ్ పరివారం దీనిపై వివాదాన్ని రేపింది. ఇప్పుడు దాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపోల్స్ లో ముస్లిం ఓట్ల కోసం ఇచ్చిన నజరానాగా చిత్రించింది. ఈ రోజుల్లో కోటి రూపాయలు అన్నది పెద్ద మొత్తమేమీకాదు. హైదరాబాద్ జనాభాకు ఒక పూట రోడ్డు పక్క టీ కూడా రాదు  కోటి రూపాయలతో.  ఎన్నికల వ్యయం అనేది కోటి రూపాయలకు కొన్ని వేల రెట్లు ఎక్కువ వ్యవహారం. దానికి ఇటీవలి ఎన్నికలే సాక్ష్యం.

సానియా మీర్జా నియామకాన్నీ వివాదం చేస్తున్న వారికి  స్వాతంత్ర సమరయోధులకూ బ్రాండ్ అంబాసిడర్లకూ తేడా తెలియలేదు. స్వాతంత్ర సమరయోధుల్ని, ఉద్యమాల్లో త్యాగాలు చేసినవారిని తప్పక ఆదుకోవాల్సిందే. ఆదరించాల్సిందే. ఆపనిని ప్రభుత్వం వివిధ పథకాల ద్వార చేసే వీలుంది.  బ్రాండ్ అంబాసిడర్ అన్నది అచ్చంగా  వాణిజ్య ప్రచారానికి సంబంధించిన అంశం. దానికీ స్వాతంత్ర సమరయోధులు, ఉద్యమకారులకూ సంబంధమేలేదు. షారూఖ్ ఖాన్ వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఆ రాష్ట్ర ఉద్యమాల్లో ఎప్పుడూ పాల్గోలేదు. అమితాభ్ బచన్ గుజరాత్ రాష్ట్ర సాధన  ఉద్యమంలో పాల్గొన్నాడని నరేంద్ర మోదీ అయన్ను ఆ రాష్ట్రానికి  బ్రాండ్ అంబాసిడర్ చేశారా? ఆయనేమయినా స్వాతంత్ర సమర యోధుడా?
అమితాభ్ బచ్చన్ నిస్సందేహంగా మనబోటి చాలా మందికి  అభిమాన నటుడు.  కానీ, ఆయన ప్రజా జీవితం మాత్రం అంత ఘనమైనదేమీకాదు అది మూడేళ్లలోనే అవమానకరంగా ముగిసింది. అప్పట్లో ఆయన రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా వున్నారు. ఆయనతో పాటే బోఫోర్స్ గన్స్ కొనుగోళ్ల కుంభకోణంలో నిందలు మోశారు.  పైగా అప్పట్లో ఆయన మీద భారీ నిందలు వేసినవాళ్లలో సంఘ్ పరివారకులూ వున్నారు. అమర్ సింగ్ తో కలిసి అమితాభ్ ములాయం సింగ్ దగ్గరికి చేరడం, వారి ద్వార అంబానీలకు దగ్గర కావడం, అంబానీల ద్వార నరేంద్ర మోదీకి సన్నిహితులు అవ్వడం అంతా ఆ తరువాతి చరిత్ర.

అమితాభ్ బచ్చన్ కు గుజరాత్ తో, షారూఖ్ ఖాన్ కు బెంగాల్ తో గత అనుబంధం ఏమీ లేదు. నిజానికి సానియా మీర్జాకు తెలంగాణతో ప్రగాఢ అనుబంధం వుంది. పుట్టిన మూడు నెలలు మినహాయిస్తే  ఆమె సంపూర్ణంగా తెలంగాణ పోరి!

ఇప్పుడు చంద్రబాబు, కేసిఆర్ ల మధ్య కొత్త పోటీ పంద్రాగస్టు ఉత్సవాల నిర్వహణ.  చంద్రబాబు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఉత్సవాలు నిర్వహిస్తుండగా. కేసిఆర్ గోల్కొండ ఖిలాలో నిర్వహిస్తున్నారు. నిర్వహణ స్థలానికి సంబంధిన వివాదాలు ఎలావున్నా, పంద్రాగస్టు నాడయినా  రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాలుగు మంచి సంక్షేమ పథకాలు ప్రకటిస్తారని ఆశిద్దాం.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)

హైదరాబాద్
11 ఆగస్టు 2014