Sunday, 7 September 2014

శ్వేతబసు – కల్పన - మీడియా


శ్వేతబసు – కల్పన  - మీడియా


మీడియా  లైఫ్ సేవింగ్ డ్రగ్ – సోషల్ రిపోర్టింగ్

మీడియా సంస్థలు అనేక రాజకీయ వత్తిళ్ల మధ్య పనిచేయాల్సి వుంటుందనేది ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. రాజకీయేతర సంఘటనల్లో అయినా మీడియా సోషల్ రిపోర్టింగ్ ను క్రియాశీలంగా కొనసాగిస్తే అది దానికి లైఫ్ సేవింగ్ డ్రగ్ గా పనిచేస్తుంది. నిర్భయ కేసులో జాతీయ మీడియా చేసింది ఇదే. ఆ కేసులో మీడియా అతిగా స్పందించింది అనే విమర్శలు కుడా వున్నాయి. కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాటి ప్రభుత్వాధినేతలు సహితం వచ్చి నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేలా మీడియా చేయగలిగింది. అంతిమంగా నిర్భయ చట్టాన్ని రూపొందించేలా రాజకీయ వ్యవస్థ మీద అడ్వకసీ / ప్రెషర్  గ్రూపుగా  వత్తిడి తేగలిగింది. ఆ మేరకు మీడియా తన ఆమోదాంశాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకో గలిగింది.

మీడియా సంస్థలు నయా వేశ్యా వాటికలుగా మారిపోతాయి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీడియా సంస్థల పైన గతంలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో రాజకీయ వత్తిడి ఇప్పుడు  కొనసాగుతోంది. మీడియా ఇంతటి నిస్సహాయ  స్థితిలో పడిపోవడం గత యాభై యేళ్లలో ఎన్నడూ లేదు. ఇలాంటి సంకట స్థితిలో మీడియా వ్యూహాత్మకంగా  సోషల్ రిపోర్టింగ్ మీద దృష్టి పెట్టి తన జీవికను నిలబెట్టుకోవాలి. అయితే, ఇన్నాళ్ళుగా పొలిటికల్ రిపోర్టింగ్ కు అలవాటు పడిన మీడియా ఒక్కసారిగా సోషల్ రిపోర్టింగు చేపట్టడం అంత సులువుకాదు. అయినా అభ్యాసం చేసుకోవాలి. లేకపోతే మీడియా సంస్థలు నయా వేశ్యా వాటికలుగా మారిపోతాయి!

బెంగాల్ కు చెందిన టాలివుడ్ నటి శ్వేత బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం సినిమాలో ఎకడా? అనే వింత ఉఛ్ఛారణతో  ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే, ఆ తరువాత పెద్దగా హిట్లు లేక సినిమా అవకాశాలు తగ్గి, బతుకు అవసరాలు పెరిగి  విలవిల్లాడుతున్న అమె కొత్త బంగారు లోకంను వెతుక్కునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కింది. బంజారా హిల్స్ లోని ఒక విలాసవంతమైన హొటల్లో వ్యభిచారం చేస్తున్న ఒక సినీ హీరోయిన్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని దాదాపు అన్ని పత్రికలు, టివీ న్యూస్ ఛానళ్ళ లోనూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఏమైందోగానీ, ఆమె మీద కేసు పెట్టకుండా, కోర్టులో ప్రవేశపెట్టకుండా మూడు నెలలు వుండేలా  నేరుగా రెస్క్యూ హోంకు పంపించారు.

ఈ కేసులో చాలా మార్మికత వుంది. వ్యభిచారం నేరంలో రెడ్ హ్యాండెడ్గా అంటే ఆమెతో పాటూ ఒక పురుషుడ్ని కూడా పట్టుకున్నారని అర్ధం. ఆ పురుషుడెవరూ? అన్నది ఎవరికైనా రావలసిన ఒక కీలక సందేహం. అతని వివరాలను పోలీసులు ఎందుకు దాచారూ? అనేది రెండో సందేహం. వ్యభిచారం జరుగుతున్నదని చెపుతున్న హొటల్ యజమాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారూ? అనేది ఇంకో సందేహం. రెస్క్యూ హోంకు పంపడానికి శ్వేత బసు మీద ఎలాంటి కేసు పెట్టారు? అన్నది ఇంకో సందేహం. అసలు కేసే పెట్టకుండా రెస్క్యూ హోంకు పంపడానికి వీలుందా? అన్నది మరో సందేహం. మీడియాలో చాలా మందికి ఇలాంటి సందేహాలు రాలేదు. కొందరికి వచ్చినా అడగాల్సిన వాళ్లను నిలదీసే సాహసం లేకపోవచ్చు. సాహసించినా సమాధానాలు రాబట్టే స్తోమత లేకపోవచ్చు. సమాధానాలు రాబట్టినా ప్రచురించే అవకాశం లేకపోవచ్చు. మీడియా బతికేదే ప్రకటనదారుల దయాదాక్షిణ్యాల మీద కనుక వాళ్ళు అడ్డుపడి వుండవచ్చు.. నికరంగా జరిగిందేమిటంటే ఈ సంఘటనను సంచలనం చేసి మీడియా లబ్దిపొందింది. ఒక అమ్మాయి దయనీయ జీవితాన్ని బజారున పడేసింది. ఇది మీడియా స్థాయిలో హీనమైన చర్య.


శ్వేత బసు కేసు - నీతులు చెప్పడం సులువు ఆచరించడం కష్టం!

మేము ఈ వృత్తిలో బతకాలంటే కొన్ని సర్దుబాట్లు లొంగుబాట్లు తప్పవు అంటుంటారు కొత్త తరం జర్నలిస్టులు. మీరు గట్టున పడ్డారు (రిటైరు అయ్యారు) గనుక చెప్పడం సులువు అని నాకు ఒక చురక కూడా వేస్తుంటారు. నిజానికి వర్కింగ్ జర్నలిస్టుగా మారిన కొత్తలోనూ నేను ఇంతకన్నా ఎక్కువ తెగువను చూపించేవాడిని. ఉద్యోగం పోతే కులవృత్తి (మెకానిక్) వుందిగా అనుకునేవాడిని.  

పోలీసులతో సన్నిహితంగా వుండడం నాకు కుదరదు కనుక క్రైమ్ తప్ప ఏ బీటు అయినా  చేస్తాను అనే షరతుతో నేను వర్కింగ్ జర్నలిస్టుగా ఆంధ్రభూమిలో చేరాను. అయితే, ఏడాది తిరక్కుండానే ఒక  క్రైమ్  అసైన్ మెంట్ చేయకతప్పలేదు. 1989 సెప్టెంబరు నెలలో విజయవాడలో జరిగిన కల్పన హత్యకేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. నిందితుడు సుప్రసిధ్ధ బెంజ్ కంపెనీ యజమాన్య సభ్యుడు కావడం. హతురాలు మూడు నక్షత్రాల ఖాంథారి హొటల్ లో బసచేయడం. నిందితుని స్నేహితులు బంగారు నగర పాలకులు కావడంతో ఈ కేసుకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అప్పటి మా ఎడిషన్ ఇన్ చార్జి తాడి ప్రకాష్ నన్ను కల్పన కేసు టేకప్ చేయమన్నారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులకు నాకూ పడదు అన్నాను. “ఇది మీరే చేయగలరు అన్నారు.  కల్పన మరణ రహాస్యం ఒక్క డిఎంఓ కే తెలుసు!శీర్షికతో  మొదటి రోజు నేను రాసిన కథనం సంచలనం రేపింది. అందులో బాక్స్ ఐటెమ్ గా రాసిన వాక్యాలు మరీ భూకంపాన్ని సృష్టించాయి.

కల్పన ఎలాగూ చనిపోయింది. ఆమె మరణ రహాస్యం మాత్రం బతికే వుంది!. దాన్ని చంపే ప్రయత్నం జరుగుతున్నదనే పత్రికల ఆందోళన! కల్పన  మరణం మిస్టరీకాదు! ఆ రహాస్యం శేషగిరికి తెలుసు. డాక్టర్ జయప్రకాష్ కీ తెలుసు. పోలీస్ కమీషనర్ భాస్కర రెడ్డికి తెలుసు. మనిషి చచ్చిపోయినా నిజం చచ్చిపోకూడదు. కల్పన – ఏ కుట్రా జరక్కుండా – తీసుకున్న విషంవల్ల చనిపోతే ఆ వాస్తవమే కావాలి. కొందరు ఆస్తిపరుల నోట్ల కట్టల కింద మట్టు పెట్టబడితే ఆ చేదు నిజమే కావాలి. మనిషి ప్రాణం తీయడానికి వెనుకాడని క్రూరులు నవ్వుతూ మన మధ్య తిరక్కూడదు. మరో కల్పనను ఖాంధారి హొటల్ మెట్లెక్కించ కూడదు
ఇంతమంది మీద ఇంతటి తీవ్ర ఆరోపణలు చెస్తే బతకనివ్వరు అని నన్ను భయపెట్టినవాళ్ళు వున్నారు. నా కథనాన్ని ప్రచురించడమేగాక, ప్రధాన నిందితుడు బాడుగ శేషగిరిరావును అరెస్టు చేసేవరకు నన్ను ప్రోత్సహించిన తాడి ప్రకాష్ కు ఈ ఘనత దక్కుతుంది,

ఇది నా గొప్పలు చెప్పుకోవడానికి పోస్ట్  చేయలేదు. ఇలా రాయవచ్చు. రాసి నిలదొక్కుకోవచ్చు  అని కొత్త తరాలకు ఉత్తేజాన్ని ఇవ్వడానికీ దీన్ని మీ ముందు వుంచుతున్నాను.

Danny Notes
7 September 2014

Kalpana Case - Modus operandi

కల్పనది తణుకు సమీపాన వేల్పూరు. అందంగా, ఆకర్షణీయంగా, చలాకీగా,  చాlAలామంది i వాణిజ్యవేత్తలకు కలలరాణిగా వుండేది. పుట్టింది సామాన్యమైన కుటుంబమే అయినా విలాసవంతమైన జీవితం గడిపేది. బాడిగ శేషగిరి రావుతో కొంతకాలం  ఆమెకు  సన్నిహిత సంబంధాలు వుండేవి. 1989 సెప్టెంబరులో కల్పన విజయవాడ వచ్చి  సెటిల్ మెంట కోసం నాలుగు రోజులు ఖాందారి హొటల్ లో బస చేసింది.  హొటల్ గదిలో చర్చోప చర్చలు సాగాయి. ఆటోమోబైల్ దిగ్గజాల పుత్రరత్నాలు కూడ ఈ చర్చల్లో పాల్గొన్నారు. నాలుగో రోజు, స్పృహలోలేని స్థితిలో వున్న కల్పనను ఎవరో అగంతకుడు యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీ వార్డులో చేర్చి వెళ్ళిపోయాడు. ఆమె శరీరంలో విషం ప్రభావాన్ని గుర్తించిన వైద్యులు  విరుగుడు చికిత్స మొదలెట్టారు. ఆరాత్రి ఆసుపత్రిలో  కోలుకుంటున్నట్టు కనిపించిన కల్పన  తెల్లవారే సరికి చనిపోయింది. ఇదీ స్థూలంగా కేసు.

Modus operandi

సాధారణంగా సంచలన కేసులు జరిగినపుడు ప్రతి రోజూ సాయంత్రం నగర పోలీసు కమీషనర్ మీడియా మీట్ పెట్టి, ఆ రోజు దర్యాప్తు వివరాలు చెప్పడం సాంప్రదాయం. చాలా మంది రిపోర్టర్లు  పోలీసు వున్నతాధికారుల ప్రకటనల ఆధారంగానే కథనాలు రాస్తారు. కొందరు వాటిమీద తమ అనుమానాల్నీ వ్యక్తం చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే తమ స్వంత దర్యాప్తు జరుపుతారు. 

మనుషులకు తమ పూర్తి సామర్ధ్యాన్ని ప్రదర్శించే అవకాలు జీవితంలో చాలా అరుదుగా మాత్రమే వస్తాయి. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు చెలరేగిపోవాలి. కల్పన కేసును నాకు అప్పచెప్పగానే మిస్టరీని చేధించడానికి కొంచెం కొత్త పధ్దతిని  పాటించాలనుకున్నాను. పోలీసుల్నినమ్మకపోగా వాళ్లను రక్షణాత్మక స్థితిలో పడేయాలనేది తొలి ఎత్తుగడ. కేసు చిక్కుముడుల్ని  సాంకేతికంగా విప్పుకుంటూ రావాలనేది రెండో ఎత్తుగడ.

పాత్రికేయులకు నిర్వహణ సామర్ధ్యం వుంటే చాలు. వాళ్ళు ఏ అంశంలోనూ సూపర్ స్పెషలిస్టులు కావల్సినపనిలేదు. కీలకమైన సబ్జెక్టుల్లో  నిపుణుల సలహా ఇవ్వడానికి ఫోన్ - ఫ్రెండ్స్వ్యవస్థ ఒకటి  నాకు వుండేది.  మెడికల్ వ్యవహారం కనుక ఇద్దరు డాక్టర్ మిత్రుల్ని సంప్రదించి యాంటీ డోట్ వైద్యంలో కొన్ని సాంకేతిక మెళుకువలు తెలుసుకున్నాను. ఒక సీనియర్ లాయర్ ను సంప్రదించి వారం రోజుల ఎపిసోడ్లు సీరియల్ గా ఎలా నడపాలో ప్లాన్ చేసుకున్నాను. వాటికి తోడు  నా గెరిల్లా యుధ్ధతంత్రం నాకు ఎలాగూ వుంది. మొదటి రోజు కథనంలోనే పోలీసు వున్నతాధికారి మీద, వైద్యం చేసిన డాక్టరు మీద బాంబులు వేశాను. వాళ్ళు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అసలు దోషిని బయటపెట్టాల్సి వుంటుందని ఎందుకో అనిపించించింది. (ఇది పుస్తకాలు చదివిన ప్రభావమో, సినిమాలు చూసిన ప్రభావమో కావచ్చు. )

చివరకు బాడిగ శేషగిరి రావును అరెస్టు చేసి, జుడీషియల్ కష్టడీకి పంపేరు. డీయంఓ ను  సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

కొంచెం కామెడీ
కల్పన కేసు పరిశోధన సందర్భంగా చాలా హాస్య సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ఒకసారి పోలీస్ కమీషనర్ భాస్కరరెడ్డి దగ్గర విషప్రయోగం చర్చ వచ్చింది. కుళ్ళిపోయిన మాసం తిన్నా మనుషులు చచ్చిపోతారు అన్నారు ఒక పోలీసు అధికారి. అయితే, ఖాందారీ హొటల్లో కుళ్ళిన మాసం తిని కల్పన చనిపోయిందనా మీ అభిప్రాయం అన్నాను. నా చలోక్తి చాలా కాలం చాలా ప్రభావాన్ని చూపింది. ఖాంథారి హొటల్ కళా హీనంగా మారి పోయింది. చివరకు దాన్ని అమ్మకానికి పెట్టారు.

No doubt it is a risky task in the given situation then. But one should not ignore the fact that there are very progressive elements among both KAMMAS and KAPUS of Vijayawada. Fortunately, there were and there are good friends of mine in the both communities in the same city. After all Vijayawada is my second home town. It is my court and I can play any game there.

విజయవాడ నా రెండవ జన్మభూమి

కల్పన కేసు గురించి రాసాక చాలా మంది మిత్రులు Comments లోనూ  Chat లోనూ కొందరు Phone Talkలోనూ ఈ కేసు లోని కులం కోణం గురించి కుతూహలంగా అడుగుతున్నారు. నిజానికి కల్పన కేసులో   ఒక కులం లేదు. చాలా కులాలున్నాయి. హతురాలు కళావంతులు (బిసి). ప్రధాన నిందితుడు కాపు సామాజికవర్గానికి చెందినవారు.. ప్రధాన నిందితుడి స్నేహితులు, అనుమానితులు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. నగర పోలీసు కమీషనర్ ది రెడ్డి సామాజికవర్గం. డీఎంఓ ది కమ్మ సామాజికవర్గం.

ఇక నాకు ఈ కేసు అప్పచెప్పిన తాడి ప్రకాష్ గారిది కాపు సామాజికవర్గం. నాకు మెడికల్ సలహాలు ఇచ్చిన డాక్టర్లలో ఒకరు యాదవ సామాజికవర్గానికి చెందిన వారు. ఇంకొకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. నా లీగల్ అడ్వైజర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. నా రాజకీయ గురువు వాసిరెడ్డి వెంకట కృష్ణారావుగారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు.   ఇక నా విషయం ; పుట్టుక రీత్య ముస్లిం సామాజికవర్గమే అయినా  నా ఉనికి అప్పుడు కరుడు కట్టిన రాడికల్. ఇటు ఈ చివర యస్సీల దగ్గర నుండి అటు ఆ చివర బ్రాహ్మణుల వరకు నాకు అన్ని సామాజికవర్గాలతోనూ సన్నిహిత సంబంధాలు వుండేవి. సన్నిహితం అనేది ఏదో లాంఛనంగా వాడిన పదంకాduduదు.  నన్ను ద్వేషించేవాళ్ళు కొందరు వున్నట్టే నన్ను విపరీతంగా ప్రేమించేవాళ్ళు అనేక సామాజికవర్గాల్లో అనేకమంది వుండేవాళ్ళు. అంచేత తూకం నా వైపే వుండేది.

అన్నింటికి మించి గమనించాల్సిన అంశం ఏమంటే విజయవాడ అంటే రౌడీల హడ్డా మాత్రమే కాదు అంతకు మించిన ప్రగతిశీలశక్తుల నిలయం అది. నా రెండవ జన్మభూమి అది. అది నా మైదానం. అక్కడ నేను ఏ ఆట అయినా ఆడగలను. అప్పుడూ ఇప్పుడూ!

7 September 2014

No comments:

Post a Comment