బ్లెస్సింగ్
ఇన్ డిజ్ గైజ్
డానీ
రాజకీయ కార్యకలాపం అంటే ప్రత్యర్ధుల్ని
తిట్టడమే అనే అర్ధం దాదాపుగా ఖాయం అయిపోయింది. ప్రభుత్వాధినేతలకు ఇందులో ఒక
సౌకర్యం వుంది. వాళ్ళు ప్రజల కోసం పెద్దగా సంక్షేమ పథకాలను చేపట్టకపోయినా తమ ప్రత్యర్ధులను తరచూ విమర్శిస్తూ వుంటే చాలు.
ప్రజలకు ఆ స్వల్ప ఆనందాన్ని పంచుతూ
వుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తుతం
ఈ పధ్ధతిని ఆస్వాదిస్తున్నట్టు కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ తిట్టుకుంటూ
వుండడంవల్ల ప్రత్యర్ధులుగా కనిపిస్తున్నారుగానీ, తిట్టుకోవడానికి వాళ్ళిద్దరూ ఒకే విధానాన్ని
ఎంచుకుంటున్నారు. ఆ మేరకు వాళ్లమధ్య ఎత్తుగడల ఐక్యత వుంది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసిఆర్ కు తన రాష్ట్రంలో రాజకీయంగానూ నైతికంగానూ ఒక
సానుకూల వాతావరణం వుంది. అంచేత మూడు నెలలు
“మస్తుగ శోచాయించుత. ఆ
తరువాత పని మొదలెడత’
అని ప్రకటించడం అయనకు సాధ్యం అయింది. చంద్రబాబు పరిస్థితి అలా సానుకూలంగాలేదు. “నేను నిద్రపోను. మిమ్మల్ని నిద్రపోనివ్వను” అని అంటేగానీ వారి బండి
నడిచేలా లేదు. నిజానికి పని మొదలెట్టను అన్న కేసిఆర్ ఒకదాని వెంట ఒకటిగా పనులు చేసుకుంటూ పోతున్నారు. చంద్రబాబుకే పనులు
ఎక్కడ మొదలెట్టాలో ఏలా మొదలెట్టాలో అర్ధం అవుతున్నట్టులేదు.
హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని
సీమాంధ్ర నాయకులు తెచ్చిన వత్తిడిని
నిరాకరించడం, అంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ , తెలంగాణ ప్రాంతానికి గొప్ప సానుకూల
అంశం. అదే బిల్లులో శేషాంధ్రప్రదేశ్ కు మూడు ఓదార్పు అంశాలున్నాయి. హైదరాబాద్ ను పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా మార్చి,
అక్కడి శాంతిభద్రతల బాధ్యతను గవర్నర్ కు ఇవ్వడం, విద్యారంగంలో ప్రస్తుత కోటాలు,
సౌకర్యాల కొనసాగించడం, ముంపు ప్రాంతాన్ని శేషాంధ్రప్రదేశ్ లో కలుపుతూ పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం,
నిజానికి మూడు అంశాలూ తమవైన పధ్ధతుల్లో వివాదాస్పదమైనవే. అయితే, ఒక బిల్లును
ఆమోదించడం అంటే అందులోని సానుకూల, ప్రతికూల అంశాలతో సహా మొత్తంగా స్వీకరించడం అనే
అర్ధం. కొన్ని తీసుకున్నప్పుడు కొన్ని ఇవ్వకతప్పదనే ఇంగితం తెలియని వారేమీకాదు
కేసిఆర్. అయితే, రాజకీయం అలా వుండనివ్వదు. “అవ్వాకావాలి, బువ్వాకావాలి” అనేవాళ్ళే
క్రీయాశీల రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న కాలమిది.
రాజకీయంగా నిలదొక్కుకున్న కేసిఆర్ ఇప్పుడు అంధ్రప్రదేశ్ పునర్
వ్యవస్థీకరణ బిల్లులో శేషాంధ్రప్రదేశ్ కు ఓదార్పుగా పొందుపరచిన అంశాల మీద ప్రత్యంక్షంగానే
దాడి మొదలెట్టారు. పోలవరం ముంపు ప్రాంతం, విద్యార్ధుల సౌకర్యాలు, హైదరాబాద్ శాంతిభద్రతల
బాధ్యత అంశాల మీద ఆందోళనను స్వయంగా కేసిఆర్ యే మొదలెట్టారు. మూడింటిని వ్యతిరేకించినవాళ్ళు
త్వరలో ఉమ్మడి రాజధాని అంశాన్ని కూడా
వ్యతిరేకిస్తారనే అనుకోవాలి. ఆ పనిని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అప్పుడే మొదలెట్టేశారు కూడా.
“ఏపీ మంత్రులకు చీము, నెత్తురు ఉంటే
ఆంధ్రా నుంచే పాలన కొనసాగించాలి” అని వారు తాజాగా సవాలు విసిరారు.
ఇలాంటి ప్రో-యాక్టివ్ శైలివల్ల ఇటు కేసిఆర్ కు తక్షణ రాజకీయ ప్రయోజనం
ఎలాగూ వుంది. విచిత్రంగా ఇది చంద్రబాబుకు కూడా సానుకూలంగా మారుతోంది. ఎందుకంటే
రెండు రాష్ట్రాలలోనూ వాళ్ళిద్దరే క్రమంగా ఏకైక ప్రతినిధులుగా మారుతున్నారు.
ఇప్పటికే కష్టాల్లోవున్న ఆంధ్రప్రదేశ్ ను,
కేసిఆర్
మరింత ఇబ్బందుల లోనికి నెట్టేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు వైఫల్యాలను విమర్శించే నైతిక ధైర్యం
అక్కడి విపక్షాలకు సరిపోవడంలేదు. ఆంధ్రప్రదేశ్ నుండి శాసనసభ, లోక్ సభల్లో కాంగ్రెస్ కు ఎలాగూ ప్రాతినిధ్యంలేదు. ప్రాతినిధ్యంవున్న
జగన్ కు అనుభవంలేదు. పెద్దగ్రహం చిన్నగ్రహాలను వీలీనం చేసుకుంటుంది లేదా
ఉపగ్రహాలుగా మార్చుకుంటుంది అనే అంతరిక్ష సూత్రానికి అనుగుణంగా ఇతర పార్టీల
ప్రజాప్రతినిధులు క్రమంగా తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నారు. మరోమాటల్లో
చెప్పాలంటే కేసిఆర్ వైఖరి చంద్రబాబుకు బ్లెస్సింగ్ ఇన్ డిజ్ గైజ్ గా మారుతోంది.
తెలంగాణలో
విపక్షాల పరిస్థితి కూడా భిన్నంగా లేదు.
ఎన్నికల్లో ఓడిపోయినా, అంతర్గత కుమ్ములాటల్ని మాత్రం వదులుకోకుండా కాంగ్రెస్ తన
ప్రత్యేకతను కొనసాగిస్తోంది. జానా, పొన్నల వివాదాలు గాంధీ భవన్ ప్రహరీ గోడదాటి
నాంపల్లి రోడ్దు మీద పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ
ఎలాగూ ప్రభుత్వంలో భాగస్వామి కనుక దానికి ప్రస్తుతం ప్రత్యేక ఇబ్బందులు ఏమీలేవు.
తెలంగాణ బీజేపీది చిత్రమైన పరిస్థితి. అది కేసిఆర్ కేంద్రంతో చేసే పోరాటంలో
మునపటిలా గొంతు కలపనూలేదు; కేంద్రంలోని యన్డీయే ప్రభుత్వం తెలంగాణ అంశంపై తీసుకునే
నిర్ణయాలను గట్టిగా సమర్ధించనూ లేదు. తెలంగాణ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం
తీసుకుంటున్న నిర్ణయాలు గత యూపీయే హయాంలో తీసుకున్నవే అనడంతప్ప ఆ పార్టీ
రాష్ట్రశాఖకు మరో మార్గంలేదు. రాజకీయ పార్టీలు ఇలాంటి ఇబ్బందుల్లో వున్నప్పుడు
చిన్నచిన్న అంశాల మీద పెద్దపెద్ద హంగామాలు చేస్తుంటాయి. సానియా మీర్జా కేసు అలా
తెలంగాణ బీజేపీకి ఒలిచిపెట్టిన అరటిపండులా దొరికింది.
సంఘ్
పరివరికుడుగా పేరున్న వేద్ ప్రతాప్ వైదీక్ పాకిస్తాన్ పర్యటనలో లష్కరే చీఫ్ హఫీద్
సయీద్ ను కలుసుకోవడం జులై రెండవ వారంలో భారత రాజకీయాల్ని కుదిపివేసింది. రెండు
మూడు రోజులు పార్లమెంటు అట్టుడుడికిపోయింది. సరిగ్గా ఈ సమయంలో కేసిఆర్ టెన్నిస్ కీడాకారిణి
సానియా మీర్జాను తెలంగాణ అంబాసిడర్ గా ప్రకటించారు. ఇది బీజేపీకి బ్లెస్సింగ్ ఇన్
డిజ్ గైజ్ గా మారింది. కేసిఆర్ నిర్ణయం ’ముస్లిం
సంతుష్టీకరణ” అంటూ బీజేపి నేతలు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు పెద్ద
వివాదాన్ని రేపారు. ఇది బీజేపీకి రెండు విధాలా వుపయోగపడింది. మొదటిది, బీజేపి
నేతలు బయటికి వచ్చి మాట్లాడడానికి అవకాశం దొరికింది. రెండోది, వేద్ ప్రతాప్ వైదీక్
వివాదం నుండి జనం దృష్ఠిని మళ్ళించడానికి తోడ్పడింది. ఇలాంటి ఎత్తుగడల్నే ఇటీవల మీడియా మేనేజ్ మెంటు అంటూ ఘనంగా
పేర్కొంటున్నారు.
“సానియా
మీర్జాకు 1965 ‘స్థానికత’ వర్తించదా?”, “సానియా
మీర్జాకు కోటి రూపాయలు; ఎవరెస్టు ఎక్కిన పిల్లలకు 25 లక్షలా?” “కామన్ వెల్త్ కీడల కప్పులు తెచ్చినవాళ్ళకు 50 లక్షలా?” “సానియా మీర్జా స్వాతంత్ర
సమయోధురాలా?” “తెలంగాణ ఉద్యమంలో
పాల్గొన్నదా?” వంటి ప్రశ్నలతో బీజేపి
నేతలు, వాళ్ళ అభిమానులు చెలరేగిపోయారు. ముస్లింల ప్రస్తావన రాగానే సంఘ్ పరివారం
అంబుల పొదిలో పాత ఆయుధాలు చాలా వుంటాయి. ప్రభుత్వ లోగోలో చార్మినార్‌ను ముద్రించడం,
తెలంగాణలో నవాజ్ అలీ జంగ్ జయంతిని ఇంజనీర్స్ డేగా ప్రకటించడం వగయిరాలు ఈ
జాబితాలో వున్నాయి. అంతిమంగా, ప్రభుత్వం ముస్లిం సానుకూల విధానాలను మార్చుకోకపోతే
తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపి నేతలు హెచ్చరించారు.
వాణిజ్య ప్రచారం కోసం బ్రాండ్ రాయబారిని
నియమించుకున్నప్పుడు పారితోషికం భారీగా వుండాల్సిందే. ఒక రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా అయితే, తెలంగాణ ప్రభుత్వం సానియా మీర్జాకు ఇచ్చిన కోటి రూపాయల పారితోషికం చాలా తక్కువ మొత్తం అనే
చెప్పాలి. అయినప్పటికీ, సంఘ్ పరివారం దీనిపై వివాదాన్ని రేపింది. ఇప్పుడు దాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపోల్స్ లో
ముస్లిం ఓట్ల కోసం ఇచ్చిన నజరానాగా చిత్రించింది. ఈ రోజుల్లో కోటి రూపాయలు అన్నది
పెద్ద మొత్తమేమీకాదు. హైదరాబాద్ జనాభాకు ఒక పూట రోడ్డు పక్క టీ కూడా రాదు కోటి రూపాయలతో. ఎన్నికల వ్యయం అనేది కోటి రూపాయలకు కొన్ని వేల
రెట్లు ఎక్కువ వ్యవహారం. దానికి ఇటీవలి ఎన్నికలే సాక్ష్యం.
సానియా మీర్జా నియామకాన్నీ వివాదం చేస్తున్న
వారికి స్వాతంత్ర సమరయోధులకూ బ్రాండ్ అంబాసిడర్లకూ తేడా
తెలియలేదు. స్వాతంత్ర సమరయోధుల్ని, ఉద్యమాల్లో త్యాగాలు చేసినవారిని తప్పక
ఆదుకోవాల్సిందే. ఆదరించాల్సిందే. ఆపనిని ప్రభుత్వం వివిధ పథకాల ద్వార చేసే వీలుంది.
బ్రాండ్ అంబాసిడర్ అన్నది అచ్చంగా వాణిజ్య ప్రచారానికి సంబంధించిన అంశం. దానికీ
స్వాతంత్ర సమరయోధులు, ఉద్యమకారులకూ సంబంధమేలేదు. షారూఖ్ ఖాన్ వెస్ట్ బెంగాల్
బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఆ రాష్ట్ర ఉద్యమాల్లో ఎప్పుడూ పాల్గోలేదు. అమితాభ్ బచన్
గుజరాత్ రాష్ట్ర సాధన ఉద్యమంలో
పాల్గొన్నాడని నరేంద్ర మోదీ అయన్ను ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ చేశారా? ఆయనేమయినా స్వాతంత్ర
సమర యోధుడా?
అమితాభ్ బచ్చన్ నిస్సందేహంగా మనబోటి చాలా
మందికి అభిమాన నటుడు. కానీ, ఆయన ప్రజా జీవితం మాత్రం అంత
ఘనమైనదేమీకాదు అది మూడేళ్లలోనే అవమానకరంగా ముగిసింది. అప్పట్లో ఆయన రాజీవ్ గాంధీకి
అత్యంత సన్నిహితుడిగా వున్నారు. ఆయనతో పాటే ”బోఫోర్స్ గన్స్ కొనుగోళ్ల
కుంభకోణం’లో నిందలు మోశారు. పైగా అప్పట్లో ఆయన
మీద భారీ నిందలు వేసినవాళ్లలో సంఘ్ పరివారకులూ వున్నారు. అమర్ సింగ్ తో కలిసి
అమితాభ్ ములాయం సింగ్ దగ్గరికి చేరడం, వారి ద్వార అంబానీలకు దగ్గర కావడం, అంబానీల
ద్వార నరేంద్ర మోదీకి సన్నిహితులు అవ్వడం అంతా ఆ తరువాతి చరిత్ర.
అమితాభ్ బచ్చన్ కు గుజరాత్ తో, షారూఖ్
ఖాన్ కు బెంగాల్ తో గత అనుబంధం ఏమీ లేదు. నిజానికి సానియా మీర్జాకు తెలంగాణతో
ప్రగాఢ అనుబంధం వుంది. పుట్టిన మూడు నెలలు మినహాయిస్తే ఆమె సంపూర్ణంగా తెలంగాణ పోరి!
ఇప్పుడు చంద్రబాబు, కేసిఆర్ ల మధ్య కొత్త
పోటీ పంద్రాగస్టు ఉత్సవాల నిర్వహణ.
చంద్రబాబు కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఉత్సవాలు
నిర్వహిస్తుండగా. కేసిఆర్ గోల్కొండ ఖిలాలో నిర్వహిస్తున్నారు. నిర్వహణ స్థలానికి సంబంధిన వివాదాలు ఎలావున్నా, పంద్రాగస్టు నాడయినా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
నాలుగు మంచి సంక్షేమ పథకాలు ప్రకటిస్తారని ఆశిద్దాం.
(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
11 ఆగస్టు 2014
No comments:
Post a Comment