Monday, 8 September 2014

CHILDREN OF HEAVEN CLIMAX


Danny Notes
8 September 2014
స్వర్గలోకపు పిల్లలు
చెల్లెలి స్కూలుబూట్లను పోగొట్టిన అన్న ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలీకుండా తన స్కూలుబూట్లను పూటకొకరు చొప్పున వాడుకుందామంటాడు.
ఇదీ గంటన్నర సినిమా కథ అంటే చాలామంది నమ్మకపోవచ్చు. అలాంటివాళ్ళు Majid Majidi రచన-దర్శకత్వంలో వచ్చిన 1997 నాటి సినిమా Children of Heaven తక్షణం చూడండి. నేను ఇప్పుడే చూశాను.
“ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, నాలుగు ఫైట్లు, ఆరు డ్యూయట్టులు” అనే నాలుగు కాళ్ల మీద సంచరిస్తున్న టాలీవుడ్ సినిమాలకు అలవాటుపడినవాళ్ళు ఈ సినిమా చూశాక మూర్చపోయే ప్రమాదముంది. ముఖం మీద చల్లడానికి దగ్గర్లో ఏరియేటెడ్ సోడా వుంచుకోవాలని మనవి.


CHILDREN OF HEAVEN CLIMAX

అన్నచెల్లెలు ఆలీ, జహ్రాల జీవన్మరణ సమస్య బూట్లు. మూడవ స్థానం సాధిస్తే ప్రైజుగా  బూట్లు వస్తాయనే ఒకేఒక ఆశతో,  ఆధునిక శిక్షణ, ట్రాక్ సూట్, కనీసం రన్నింగ్ షూస్ కూడా లేకపోయినా పాత బూట్లతో ప్రతిష్టత్మక  పరుగు పందెంలో పాల్గొంటాడు ఆలీ. కానీ, విధి ‘వక్రీకరించి’ ఫస్టు ప్రైజు గెలుస్తాడు.

1. పరుగు పందెంలో ఫస్టు ప్రైజ్ వచ్చిన ఆనందం ఆలీకి ఏమాత్రం లేదు. మూడవ ప్రైజుగా వచ్చే బూట్లు రానందుకు అతను వెక్కివెక్కి ఏడుస్తున్నాడు.  
2. మరోవైపు, అదే సమయంలో, వాళ్ల నాన్న మార్కెట్లో పిల్లలిద్దరికీ కొత్త బూట్లు కొని ఇంటికి బయలుదేరాడు.  
3. ఈలోపు ఆలీ విచారంగా ఇంటికి వచ్చాడు. బూట్ల కోసం అన్న చేతులు, కాళ్లను చూసింది చెల్లెలు. అన్న బూట్లు తేలేదని తెలిసి చెల్లి నిరాశగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అవమాన భారంతో ఆలీ  కుంగిపోతున్నాడు.
4. ఆలీకి కొత్త బూట్లు రాలేదు. అన్నా చెల్లెలు వంతుల వారీగా వాడుకుంటున్న పాత బూట్లు కూడా  తెగిపోయాయి. వాళ్ల కష్టాలు మరింత పెరిగాయి.  
5.  బూట్లూ,  సాక్సులు తీశాడు ఆలీ. కాళ్ళకు బొబ్బలు లేచివున్నాయి. సేదదీరడానికి  కాళ్లు నీటి తొట్టెలో  పెట్టాడు.
6. నీళ్ళలో బంగారువన్నె చేపపిల్లలు ఆలీ కాళ్ల చుట్టూ తిరుగుతూ అతని పాదాల్ని ముద్దు పెట్టుకుంటుండగా బ్లాక్ స్క్రీన్ వస్తుంది.
ఇదీ ఈ సినిమా  క్లైమాక్సు స్వీక్వెన్షియల్ ఆర్డరు. 
ఇంకొకరయితే, స్కూలునిర్వాహకులు, విద్యార్ధులు, కుటుంబసభ్యులు కలిసి కప్పు గెలిచిన ఆనందోత్సవాలను జరుపుకుంటుండగా, వాళ్ల మీద పూలు కురుస్తుండగా కథను ముగించేవారు. అలాంటివి వందల సినిమాల్లో మనం చూసి వుంటాం.

ఇరాన్ దర్శకులు,(ముఖ్యంగా Majid Majidi)  ముగింపును చాలా కళాత్మకంగా తీస్తారు.  చాల సహనం, సంయమనం పాటిస్తారు. ఈ సినిమా ముగింపులో,  వాళ్ల నాన్న బూట్లు కొని తెస్తున్నాడనే సమాచారం దర్శకుడు ప్రేక్షకులకు ఇచ్చే ఓదార్పు మాత్రమే. ఆ ఓదార్పు  ఆలీకీ, అతని చెల్లెలికీ తెలీదు.  ఆలీకి ఓదార్పు ఆ చేపపిల్లల ముద్దులు. అదీ అసలు ముగింపు. ఈ సినిమా వాల్ పోస్టర్ లోనూ ఆకాశంలో విహరిస్తున్న చేపపిల్లలుంటాయి. 

No comments:

Post a Comment