నమ్మిన రైతుకు వెన్నుపోటు !
ఉషా యస్ డానీ
రైతు రుణమాఫీ చేసి తీరుతానని గత ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేశారు. అది
సాధ్యంకాదనీ వారి రాజకీయ ప్రత్యర్ధి జగన్ అన్నప్పుడు చంద్రబాబు ఎద్దేవ చేశారు.
అసాధ్యాన్ని సాధ్యం చేసే చరిత్ర తమకు వున్నదన్నారు. టీడీపి ఎన్నికల ప్రణాళికలోను రైతు రుణమాఫీ హామీని
ప్రముఖంగా ప్రచురించారు.
తొలివిడత తొమ్మిదేళ్ళ చంద్రబాబు పాలన వ్యవసాయానికి ’హాలిడే’ ప్రకటించింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో
రైతుల జనాభా తగ్గుముఖం పట్టింది. అదిప్పుడు రాష్ట్ర జనాభాలో 16.47 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ, ఐదు
కోట్ల మంది జనాభాగల రాష్ట్రంలో వున్న దాదాపు 85 లక్షల మంది రైతులు తమ రుణవిముక్తి ప్రదాత
చంద్రబాబు రూపంలో వచ్చాడని మరోసారి నమ్మారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ కు
చెందిన పదమూడు జిల్లాల్లో టిడిపికి పడిన ఓట్లలో అత్యధికం రైతు కుటుంబాల నుండి
వచ్చినవే. ఈ ఎన్నికల్లో టిడిపి, వైయస్సార్
కాంగ్రెస్ లకు మధ్య ఓట్ల శాతంలో తేడా
వెంట్రుకవాసి మాత్రమే. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద వెంట్రుకవాసి అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపురేఖలే
మారిపోయివుండేవి.
వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగించడం వేరు. వ్యవసాయ భూమిని కలిగివుండడం వేరు. వ్యవసాయాన్ని వృత్తిగా సాగించేవాళ్ళలో కౌలు
రైతులు, వ్యవసాయ కూలీలు వుంటారు. వాళ్ళిద్దరూ చంద్రబాబుగారి రుణమాఫీ ఖాతాలో లేరు.
చంద్రబాబు ఖాతాలో వున్నది వ్యవసాయభూమిని కలిగివున్న రైతులు మాత్రమే. తొలి
అడుగులోనే వారు వ్యవసాయ జనాభాని సగానికి పైగా నరికేశారు.
రైతురుణాల్లో పంటరుణం, వ్యవసాయరుణం, కుటుంబరుణం అనే మూడు రకాలు వుంటాయని అందరికీ
తెలిసిన విషయమే. ఈ మూడు రుణాలు ఒకదానితో మరొకటి ముడిపడి వుంటాయని వ్యవసాయార్ధిక
అంశంపై పరిశోధనా వ్యాసం రాసిన చంద్రబాబుకు మరింత లోతుగా తెలుసు.
ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికల ప్రణాళికలోనూ చంద్రబాబు రైతురుణం మాఫీ చేస్తానని చెప్పారేగానీ పంటరుణం
మాత్రమే మాఫీ చేస్తానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పంట రుణం సాధారణంగా ఎకరాకు 20 - 25 వేల రూపాయల మేర మాత్రమే వుంటుంది. రెండెకరాల
రైతుగా జీవితాన్ని మొదలుపెట్టిన చంద్రబాబుకు పంటరుణం వేల రూపాయల్లోనూ, రైతురుణం
లక్షల రూపాయల్లోనూ వుంటుందని అనుభవపూర్వకంగా తెలుసు.
అపరిమిత వాగ్దానాలు చేసి ఎన్నికల్లో గెలిచిన
చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన మరుక్షణం నుండే వాటికి రోజుకో తూటు చొప్పున
పొడుస్తున్నారు. రైతురుణాల్నీ, వ్యవసాయరుణాల్నీ చంద్రబాబు, వారి ప్రచారకర్తలు
ముందుగానే విజయవంతంగా తుంగలో తొక్కారు. ఇప్పుడు పంటరుణాన్ని సహితం తుంగలో
తొక్కడానికి వాళ్లంతా పడరానిపాట్లు పడుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే కొత్త
ఆయుధాన్ని కనిపెట్టింది వీళ్ళే. రైతులు పంటరుణం ఎంత తీసుకున్నారు? అనేదాన్ని
పక్కనపెట్టి, పంటరుణం ఎంత తీసుకోవడానికి
అర్హులు? అనేదాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్
ప్రాతిపదికగా తీసుకుంటుంది. అంటే
రైతులకున్న పంటరుణంలో కూడా వీరు భారీ కోత పెట్టారు అన్నమాటా.
వ్యవసాయ రుణానికైతే టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టడం వంటి
లాంఛనాలు వుంటాయిగానీ పంటరుణానికైతే కొన్ని సడలింపులు వుంటాయి. అనేక వ్యవసాయ పరపతి
సొసైటీలతో పాటూ కొన్ని బ్యాంకుల్లో కూడా టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను తాకట్టు
పెట్టుకోకుండానే పంటరుణం ఇవ్వడం అనేది చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తోంది. దానికి
విరుధ్ధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డాక్యుమెంట్లు తాకట్టు పెట్టని పంటరుణాల్ని “అండర్ ప్రాసెస్” గా ఆన్ లైన్లో
పెడుతున్నారు. అలాంటి రుణాలు ఎప్పటికీ మాఫీ కావని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
సిహెచ్ కుటుంబరావు తేల్చేశారు. .
ఆస్తులు, పొలాలు పంచుకున్న తరువాత కూడా అన్నదమ్ములు ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో
కలిసి నివాసం వుండడం గ్రామీణప్రాంతంలో సాధారణ విషయం. అనేక సందర్భాల్లో అన్నదమ్ముల
పేర్లు ఒకే రేషన్ కార్డులో వుంటాయి. అలాంటి
అన్నదమ్ములు చెరో కొంత భూమి మీద చెరో కొంత పంటరుణాన్ని తీసుకుని వుంటే, ఇద్దరిలో
ఒక్కరికి మాత్రమే పంటరుణం మాఫీ అవుతుంది. ఒక రేషన్ కార్డుపై ఒకరికే రుణ మాఫీ అనేది
కొత్త నిబంధన. అంటే, చంద్రబాబు పంటరుణం
పథకం గ్రామీణ వుమ్మడి కుటుంబాల్లో కొత్త చిచ్చు రగుల్చుతోంది.
రుణమాఫీ జాబితాపై అభ్యంతరాలుంటే, నెల
రోజుల లోపు, సంబంధిత డాక్యుమెంట్లతో జన్మభూమీ కమిటీలకు విన్నవించుకోవాలని ఒక
అప్పీలెట్ అవకాశం కల్పించారు. ఇందులో ఒక విచిత్రం ఏమంటే, సదరు పత్రాలను జారీ
చేయాల్సిన జిల్లా అడిషనల్ జాయింట్ కలక్టరే, జన్మభూమీ కమిటీకి అధ్యక్షులుగా
వుంటారు. వారు పత్రాలు జారీ చేయడానికి రెండు నెలల గడువు అడుగుతారు. కానీ, పత్రాలు
సమర్పించడానికి మాత్రం లబ్దిదారులకు నెల రోజుల గడువు ఇస్తారు. ఇలాంటి విచిత్రాలు
చంద్రబాబు మార్కు రుణమాఫీ పథకంలో అనేకం వున్నాయి.
రుణమాఫీ సంబంధిత పత్రాలు పోయిన సందర్భాల్లో వాటి ట్రూ-కాపీల కోసం బ్యాంకుల పాలకమండళ్ళు, రెవెన్యూ అధికారులులతో
పాటూ కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారుల సహకారాన్ని కూడా పొందాల్సివుంటుంది.
వ్యవసాయదారుల్లో అత్యధికులు నిరక్షరాశ్యులు. వయోవృధ్ధులు. ఇన్ని కార్యాలయాల చుట్టూ
తిరిగి రుణ మాఫీ పత్రాలని సక్రమంగా సేకరించడం అనేది వాళ్లవల్ల అయ్యే పనికాదు. పైగా
అనేక జిల్లాల్లో వ్యవసాయభూమి వివరాలు తెలిపే అడంగళ్ళు - పహానీ, 1-బీ ఆర్ ఓ ఆర్
లు గతవారం వరకు వెబ్ సైటుకు ఎక్కలేదు.
రుణమాఫీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతు ప్రపంచంలో ఒక కొత్త కల్లోలాన్ని
సృష్టించింది.
కాదేదీ తూట్లకు అనర్హం అన్నట్టు
ఇప్పుడు ఆధార్ కార్డుతో కూడా రుణమాఫీకి తూట్లు పొడిచే ప్రయత్నాలు మొదలయాయి. ఇప్పటి
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ భూములు వుండి, ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డు వున్న
రైతులు రుణమాఫీ పొందడానికి అనర్హులని ప్రణాళికా సంఘం ప్రకటించింది. ఆరు నెలలక్రితం
విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలోనేకాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆంధ్రా
రైతులు పెద్ద సంఖ్యలో నివాసం వుంటున్నారు. వాళ్ళకు సహజంగా ఆ రాష్ట్రాల్లోనే ఆధార్
కార్డులు వుంటాయి. శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆర్దిక-ప్రణాళికశాఖా
మంత్రి యనమల రామకృష్ణుడు హైదరాబాద్ లోని
ఆంధ్రా రైతులకు రుణమాఫీ అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. వారి ప్రకటన వచ్చిన గంటలోపే ప్రణాళికా సంఘం
ఉపాధ్యక్షులు సిహెచ్ కుటుంబరావు శాసనసభ బయట స్పందించారు. అలాంటి రుణమాఫీ అసాధ్యమని
తేల్చేశారు.
ఇప్పటికీ హైదరాబాద్ లోనే నివాసంవుంటూ, అక్కడే ఆధార్ కార్డు, ఓటరు ఐడి
కలిగివున్న చంద్రబాబుగారికి పొరుగు
రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీచేసి, ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన నిబంధనలు రైతుల దగ్గరికి రాగానే
అడ్డుకట్టగా ఎలా మారిపోతున్నాయో వారి ప్రణాళిక సంఘం వివరిస్తే బాగుంటుంది. రైతుల్ని
ఎన్నివిధాలా రుణభారం నుండి తప్పించవచ్చు అని ఆలోచించడం మానేసి, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుండి తప్పించవచ్చు
అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇది విషాదం!
(రచయిత సీనియర్ పాత్రికేయులు సామాజిక విశ్లేషకులు)
హైదరాబాద్
24 డిసెంబరు 2014
Mobile : 9010757776
ప్రచురణ : సాక్షి దినపత్రిక, 29
డిసెంబరు 2014
http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/29122014/4
No comments:
Post a Comment