Wednesday, 31 December 2014

Social Media – A New Weapon

Social Media – A New Weapon


 Danny Notes
1 January 2015

ఆలోచనాపరుల కొత్త ఆయుధం సోషల్ మీడియా 

ప్రాపంచిక దృక్పథం రీత్యా నేను పీడితప్రజల పక్షపాతిని. నిర్మాణం రీత్య బలహీనవర్గాల సమాఖ్య అధ్యక్షుడ్ని. నా వ్యాఖ్యలన్నీ కఛ్ఛితంగా పక్షపాతంతోనే వుంటాయి. వుండాలి కూడా. అవి సహజంగానే పీడకవర్గాల ప్రతినిధులకు ఇబ్బందిగానే వుంటాయి. వాళ్ళను సంతృప్తిపరచడం కోసమో మొగమాటం కోసమో పాలకవర్గాలపై నా విమర్శల్ని ఆపుకోలేను. పాలకవర్గాలంటే నా ఉద్దేశ్యంలో ప్రభుత్వాధినేతలేకాదు; తమ బాధ్యతల్ని సమర్ధంగా నెరవేర్చని ప్రతిపక్ష నేతలు కూడా.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు తన పాత అమెరికా- ప్రపంచ బ్యాంకు స్కీములతోనే ముందుకు సాగుతున్నారు. ఇది ప్రజా వ్యతిరేకమయిన పంథా. ప్రత్యేకించి బలహీనవర్గాలకు  వ్యతిరేకమయిన పంథా. సంఘ్ పరివారాన్ని సంతృప్తి పరచడం కోసం వారు బాహాటంగానే ముస్లింలను తన మంత్రివర్గం నుండి బహిష్కరించారు. ఆ మేరకు వారు హిందూత్వ ఎజెండాను సహితం పటిష్టంగా ముందుకు తీసుకుపోతున్నారు.

తెలంగాణలో ఉద్యమ ప్రభావంతో కేసిఆర్ కొన్ని నిర్ణయాలు ప్రజానుకూలంగా తీసుకుంటున్నప్పటికీ వారి త్రాసు క్రమంగా అమెరికా - ప్రపంచ బ్యాంకు విధానాల వైపు మొగ్గుతోంది.  నరేంద్ర మోదీతో వారు కొత్తగా ప్రేమలో పడ్డారు కనుక త్వరలో హిందూత్వ ఎజెండా కూడా పురివిప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రతిపక్షం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా వున్నది. పొన్నాల, జగన్ ఇద్దరూ రాజకీయ వ్యక్తిత్వాన్ని అభివృధ్ధి చేసుకోలేకపోతున్నారు. ప్రతిపక్షం వుధృతంగా కార్యకలాపాలు నిర్వహించడానికి తెలంగాణలో ప్రస్తుత వాతావరణం అంతగా అనుకూలంగా లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అద్భుతమైన అవకాశం వుంది. ప్రజలు జగన్ కు ప్రతిపక్షపాత్ర ఇచ్చారు. దాన్ని వారు సమర్ధంగా నిర్వహించలేకపోతున్నారు. ప్రియురాలిని దక్కించుకోలేక, కట్టుకున్నదానితో కాపురం చేయలేక  సతమతమయ్యే వింత మొగుడిలా జగన్ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు జగన్ తన నాయన వైయస్ రాజశేఖర రెడ్డి  1999-2004 మధ్య కాలంలో పోషించిన పాత్రను నిర్వర్తించాల్సి వుంది. రాజశేఖర రెడ్డి  అప్పట్లో ప్రపంచ బ్యాంకు వ్యతిరేక విధానాన్ని కూడా అనుసరించారు.

చారిత్రక అపచారాలు చేసీచేసీ కమ్యూనిస్టు నాయకులు తమ వునికిని దాదాపుగా కోల్పోయారు. నక్సలైటు నాయకులు సహితం దీనికి మినహాయింపేమీకాదు.  పిదప వచ్చిన అస్థిత్వవాద వుద్యమాలు సహితం అవకాశవాదం, అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకుని  ప్రభావహీనంగా మారిపోయాయి. 

ఇప్పుడు ఎవరికీ ఎవరిమీదా నమ్మకం లేదు. మొన్నటి ఎన్నికల్లో అటు చంద్రబాబునీ, ఇటు కేసిఆర్ నీ గెలిపించిన వారి నమ్మకం సన్నగిల్లుతున్న సంకేతాలు వస్తున్నాయి. రెండేళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇద్దాం. అప్పుడే విమర్శలువద్దు అని తెలంగాణ మిత్రులు  పెడుతున్న కామెంట్స్ ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయి. మంగళగిరిలో చెట్లకింద, విజయవాడలో షెడ్డుల కింద పనిచేస్తానని చెప్పి ma హైదరాబాద్ ను వదలనప్పుడే చంద్రబాబు మాటలు  వఠ్ఠి ప్రగల్భాలు అని తేలిపోయింది. వారిని గట్టిగా సమర్ధించిన ప్రజాశ్రేణులు తీవ్ర నిరాశకు గురికాగా, ఆ శిబిరంలోని ఆలోచనాపరుల్లో  మనోవైఫల్యం (Frustration) ప్రస్పుటంగా కనిపిస్తోంది. డిసెంబరు నెలలో చంద్రబాబును బౌధ్ధికంగా సమర్ధిస్తూ ఒక్క పోస్టింగు కూడా రాకపోవడం దీనికి నిదర్శనం.

ప్రభుత్వాధినేతల కార్పొరేట్ స్వభావంవల్ల రైతాంగం, శ్రామికులు, దళితులు, అల్పసంఖ్యాకవర్గాలు తీవ్రంగా నలిగిపోతున్నారు. ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు ఆ పాత్రను ఆలోచనాపరులు చేపట్టాలి. మీడియా సంస్థలు ఆర్ధికంగా కార్పొరేట్ స్వభావాన్నీ, రాజకీయంగా పాలకవర్గాల స్వభావాన్నీ సంతరించుకున్నాయి. కనుక ప్రధాన స్రవంతి పత్రికలు, న్యూస్ ఛానళ్ళలో మేధో సంచయనానికి అవకాశాలు దాదాపుగా అంతరించిపోయాయి. ఇప్పుడు ఆలోచనాపరుల కొత్త ఆయుధం సోషల్ మీడియానే. దాన్ని పదునుగా వాడుదాం. 2015  దానికే అంకితం.




No comments:

Post a Comment