విప్లవమార్గాన్ని చూపించినవాడు
ఉషా యస్ డానీ
పాత్రికేయుడు తిరుమాని సత్యనారాయణ రాజు (టీఎస్ ఎన్ రాజు) రాత్రి కాకినాడలో బ్రెయిన్ హెమరేజ్ తో చనిపోయాడు. తను నా బాల్యమిత్రుడు; నరసాపురంవాడు. సముద్రతీరాన వేములదీవి వాళ్ల స్వగ్రామం.
టీఎస్ ఎన్ రాజుకు చాలా ప్రత్యేకతలున్నాయి. మాఊరి లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివాడు. శ్రీశ్రీ మహాప్రస్తానం కవితల్ని అద్భుతంగా ఆలపించేవాడు. నాటికల్లో భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవపాత్రలు వేసేవాడు. హఠాత్తుగా ఇల్లువదిలి, ఊరు వదిలి అదృశ్యమైపోయేవాడు. ఎక్కడెక్కడో కష్టజీవులతో కొన్నాళ్ళు గడిపి అంతే హఠాత్తుగా మళ్ళీ ప్రత్యక్షమయ్యేవాడు. మేమంతా అతన్ని 'కారుడు' అనేవాళ్ళం. విప్లకారుడికి అది సంక్షిప్త రూపం. నేను చూసిన తొలి విప్లవకారుడు కూడా తనే.
1970వ దశకం అంటే యువతరం నిలువెల్లా రగిలిపోయిన కాలం. జాతియోద్యమ స్వప్నాలు చితికిపోయి చేదు జీవన వాస్తవం కళ్లముందు సాక్షాత్కరిస్తున్న రోజులవి. ఏ పట్టణంలో అయినాసరే అప్పటి యూత్ సహజంగానే ఉదయం వుమెన్స్ కాలేజీల దగ్గర, సాయంత్రం సినిమాహాళ్ల దగ్గర చేరేది. డీనికి నరసాపురం యూత్ మినహాయింపేమీకాదు. అయితే, ఉదయానికీ సాయంత్రానికీ మధ్య సమయంలో కోర్టువీధిలోని లైబ్రరీ దగ్గర చేరేది. ఏతరంవాళ్లయినా, ఏ పట్టణంలో అయినా లైబ్రరీని అడ్డాగా చేసుకోవడం మహత్తర విషయం. అంచేతే కావచ్చు నరసాపురంలో పాఠకులేకాదు రచయితలూ పెద్ద సంఖ్యలో వుండేవారు. నరసాపురం నాటకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన యంజీ రామారావు, ధవళ సత్యం మాకు సీనియర్లు.
నరసాపురం నీటిలోనే ఏదో కళాసాహిత్య లవణాలు వున్నాయని నమ్మే వాళ్ళలో నేనూ ఒకణ్ణి. పట్టణంలో పేటకో నాటక బృందం వుండేదంటే అతిశయోక్తికాదు. ఊర్లో యువకళాకారులకు కొదవేలేదు. ఇప్పటి మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పటి బృందంలో సభ్యులే. పేర్లు రాసుకుంటూ పోతే పెద్ద జాబితాయే అవుతుంది. కొందరి పేర్లు మరిచిపోతే వాళ్ళకు మనస్తాపం కలుగుతుంది కనుక జాబితాను రాయదలచలేదు. ఏమైతేనేం ఒక్కొక్కరు అగ్నికణం.
రాజు మాకు అతిథి మిత్రుడు. అతను కొన్నాళ్ళు నరసాపురంలో వుండేవాడు. కొన్నాళ్ళు కాకినాడలో వుండేవాడు. కొన్నాళ్ళు ఎక్కడున్నాడో కూడా తెలిసేది కాదు. వచ్చినపుడు మాత్రం బోలెడు వార్తలతో వచ్చేవాడు. తను చూసిన "చైనాలో రిక్షావాలా, చెక్ దేశపు గని పనిమనిషి, ఐర్లండున ఓడకళాసి, అణగారిన ఆర్తులందరి" జీవిత విశేషాలు ఓ వారం రోజులు ఎడతెరపిలేకుండా చెప్పేవాడు. మేమంతా కళ్ళు పెద్దవి చేసుకుని, చెవులు రిక్కించి వినేవాళ్లం.
మా తరంలో నిక్షిప్తమైవున్న కళాసాహిత్య నైపుణ్యాల్ని 1972-73 నాటి జైఆంధ్రా ఉద్యమం సానపెట్టింది. అప్పుట్లో వేసిన నాటకాల్లో పరిటాల సత్యనారాయణ గాంధీజీ, పొట్టి శ్రీరాములు వంటి సాత్విక పాత్రలు వేస్తే రాజు విప్లవపాత్రలు వేసేవాడు. పెట్టుడు గడ్డం-మీసాలు లేకుండానే తను విప్లకారుడిగా కనిపించేవాడు. నిజజీవితంలోనే విప్లవకారుడైనవాడికి నాటకంలో మేకప్పుదేనికీ?
రాజు గుర్తుకు వచ్చినప్పుడెల్లా తను భోజనం చేసే విధానం కళ్లముందు కనిపిస్తుంది. భోజనం చేస్తే కంచంలో ఒక్క మెతుకు కూడా మిగిల్చేవాడుకాదు. పచ్చిమిరపకాయలు, ఎండి మిరపకాయలు, కరివేపాకు, చివరకు చేప ముళ్ళు కూడా నమిలి మింగేసేవాడు. తినడానికీ తిండి లేక అలమటిస్తున్న ప్రజలు ఎందరో నివశిస్తున్న దేశంలో అన్నాన్ని వృధా చేసే హక్కు ఎవరికీ లేదని నిర్మొహమాటంగా చెప్పేవాడు. తరచూ కళ్ళు పెద్దవి చేసి, ఆవేశంగా ఇలాంటి హెచ్చరికలు చేస్తుండేవాడు.
1977లో మా మిత్రబృందం అభ్యుదయ యువజన సంఘాన్ని మొదలెట్టింది. రాజు కూడా అందులో సభ్యుడు. ఆ ఏడాది చివర్లో దివి సీమను ఉప్పెన ముంచెత్తినపుడు వేలాదిమంది చనిపోయారు. బాధిత కుటుంబాల సహాయం కోసం అభ్యుదయ యువజన సంఘం నరసాపురంలో పాతబట్టలు, దుప్పట్లు వసూలు చేసింది. వాటిని తీసుకెళ్ళి బాధితులకు అప్పచెప్పినవాడు రాజు అని గుర్తు.
1978లో నా స్నేహితురాలు చొప్పరపు ఉషారాణి చనిపోయినపుడు నేను కొన్ని రోజులు దిగాలుగా వున్నాను. అప్పట్లో నన్ను పరామర్శించడానికి రాజు విజయవాడ వచ్చాడు. ప్రోగ్రెసివ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ అనే ఒక విప్లవ సంస్థలో ఉష పనిచేసేది అని చెప్పాడు. విశాఖపట్నంలో ఆ సంస్థ ప్రముఖులతో తనకు కూడా సన్నిహిత సంబంధాలు వున్నాయన్నాడు. ఉష ఏదో మహిళా సంఘంలో పనిచేసేదని తెలుసుగానీ అది విప్లవ సంఘమని అప్పటి వరకు నాకు తెలీదు. నేను కూడా విప్లవమార్గాన్ని అవలంబిస్తే జీవితానికి ఒక విలువను సాధించుకోవచ్చని ఆరోజు రాజు సూచించాడు. నాకు కూడా అతని సూచన నచ్చింది.
ఆ తరువాత ఇన్నేళ్లలో మేము కలుసుకున్న సందర్భాలు చాలా అరుదు. రెండేళ్ల క్రితం ఓ రాత్రి హఠాత్తుగా ఫోన్ చేశాడు. మా ఉమ్మడి మిత్రుడొకరు నా గురించి ఏదో నెగటివ్ గా మాట్లాడితే గట్టిగా మందలించానని అదే పాత ఆవేశంతో చెప్పాడు.
మన వెనుక మనకు వ్యతిరేకంగా మాట్లాడుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. మన పరోక్షంలో మన గురించి మంచిగా మాట్లాడేవాళ్ళు ఒకరిద్దరున్నా అది గొప్ప విషయమే. అలాంటి గొప్ప స్నేహితుడు రాజుని నేను కోల్పోయాను.
చనిపోవడానికి ముందు రాత్రి హాస్పిటల్ లో మిత్రులతో మాట్లాడుతూ తనను మోల్డ్ చేసినవారిగా నన్నూ, సతీష్ చందర్ నూ, నరసాపురం వాతావరణాన్నీ తలచుకున్నాడట. నేను తనని ఏ మేరకు మోల్డ్ చేశానో తెలీదుగానీ, నాకు విప్లవమార్గాన్ని చూపించినవాడు మాత్రం తనే.
హైదరాబాద్
30 March 2015
మొబైల్ నెం : 9010757776
No comments:
Post a Comment