Tuesday, 9 February 2016

హైదరాబాదీల పరిణితి గ్రేట్! Great Maturity of Hyderabadis

హైదరాబాదీల పరిణితి గ్రేట్! 
-     డానీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందనేది ఊహించిందే.  అయితే, కేసిఆర్ పాలన మీద ఆంధ్రా ‘సెటిలర్స్’ విశ్వాసాన్ని ప్రకటించారన్నదే ఈ ఎన్నికలు తేల్చిన ప్రధాన సామాజిక అంశం. సెటిలర్స్ అనే పదాన్ని నిఘంటువు అర్ధంలో వాడినా, మంచిఅర్ధంలో వాడినా, చెడు అర్ధంలో వాడినా ఆంధ్రా ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారికి ముల్లు గుచ్చుకున్నట్టే వుంటుంది. అమెరికాలో “నల్లవాళ్లను” ఆఫ్రికన్ – అమెరికన్స్ అన్నట్టు.  వాళ్లను ఆంధ్రా హైదరాబాదీలు, తెలంగాణ ఆంధ్రులు అని పిలవడం మంచిది. క్రమంగా వాళ్ళే హైదరాబాదీలు అయిపోతారు. వాళ్లను సెటిలర్స్ గా పిలిచినంత కాలం సామాజిక సమ్మేళనం వాయిదా పడుతూ వుంటుంది.

జీహెచ్ ఎంసీ ఎన్నికలు ప్రకటించినపుడు తెలంగాణాను గెలిచినంత సులువుగా టీఆర్ ఎస్ హైదరాబాద్ ను గెలవలేకపోవచ్చంటూ కొన్ని ఉహాగానాలు చెలరేగాయి. హైదరాబాద్ లో అత్యధికంగావున్న తెలంగాణ ఆంధ్రులు టీఆర్ ఎస్ కు ఓటు వేయకపోవచ్చనే అభిప్రాయమే ఇలాంటి ఊహాగానాలకు  ఊతం ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో తెలంగాణ అంధ్రులకు కొంత ఆందోళన,  ఒక సంధిగ్ధం వున్నమాట వాస్తవం. ఆంధ్రా ప్రాంతానికి తిరుగు వలసలు తప్పవనే అభిప్రాయం కూడా అప్పట్లో బలంగా ముందుకు వచ్చింది. ఉద్యమ కాలంలో తెలంగాణ సిధ్ధాంతకర్త జయశంకర్, కొదండ రామ్ లతో సహా అనేక మంది టీఆర్ ఎస్ నాయకులు ‘”ఆంధ్రా సెటిలర్స్”  గురించి దురుసుగా మాట్లాడిన సందర్భాలు కొన్ని వున్నాయి. ఫలితంగా తెలంగాణ అంధ్రుల్లోనూ టీఆర్ ఎస్ నేతల మీద కొన్ని భయాలూ, అపోహలు సహజంగానే వుండేవి.

ప్రభుత్వాధినేతగా మారిన తరువాత తెలంగాణ ఆంధ్రుల భయాందోళనల్ని దూరం చేయడానికి కేసిఆర్  ప్రత్యేక శ్రధ్ధ చూపించారు. దాని ఫలితంగానే  తెలంగాణ ఆంధ్రుల్లో తిరుగు వలసలు అనే అభిప్రాయం క్రమంగా  చల్లబడిపోయింది. ఆంధ్రాను మరిచిపోదాం తెలంగాణే శాశ్విత నివాసం అనే అభిప్రాయం బలపడడం మొదలయింది.

గ్రేటర్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను కేటిఆర్ కు ఇవ్వడంలోనే కేసిఆర్ సగం విజయాన్ని సాధించారు. మిగిలిన సగం విజయాన్ని కేటిఆర్ సాధించిపెట్టారు. టీఆర్ ఎస్ లో ఎన్నికల మేనేజ్ మెంట్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది హరీష్ రావు. అనేక ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాలు సాధించిపెట్టిన చరిత్ర హరీష్ రావుది. వారిని పక్కన పెట్టి కేటిఆర్ కు హైదరాబాద్ బాధ్యతలు ఇచ్చినపుడు మరికొన్ని ఊహాగానాలు చెలరేగాయి. హరీష్ , కేటిఆర్ మధ్య విబేధాలొచ్చాయనేది వాటి సారాంశం.  విబేధాలు కాదుగానీ వాళ్ళిద్దరి మధ్య స్పష్టమైన ఒక వైవిధ్యం వుంది. సమరానికి  హరీష్ రావు గొప్ప సేనాని అయితే, సంధికి కేటిఆర్ గొప్ప దౌత్యవేత్త.  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సమరంకన్నా సంధి ప్రధానం అని గమనించడమే కేసిఆర్ దూరదృష్టికి నిదర్శనం.

ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీకీ ఎంతో కొంత ఓటు బ్యాంకు వుంటుంది. కానీ విభిన్న సంస్కృతులున్న సమాజంలో కేవంలం ఒకటో రెండో ఓటు బ్యాంకుల ద్వార గెలవడం సాధ్యంకాదు. స్వంత ఓటు బ్యాంకుతోపాటూ ఇతర సమూహాల మద్దతును కూడా కూడగట్టాల్సి వుంటుంది. నిజానికి ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయించేది కొత్తగా మద్దతు పలికే సమూహాలే. ఇవే కేటలిస్ట్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. జయాపజయాల్ని నిర్దేశిస్తాయి.

గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా హైదరాబాదీల్ని కెటలిస్ట్ ఏజెంట్లు అనడం అతిశయోక్తికాదు. ఆంధ్రా హైదరాబాదీల ముందు మొదటి నుండీ ఒకటే లక్ష్యంవుంది; ప్రభుత్వం నుండి రక్షణపొందడం. వాళ్ళు దాన్ని సాధించుకోవడానికి రెండు మార్గాలున్నాయి. మొదటిది; టీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటేసి కేసిఆర్ మీద వత్తిడి రాజకీయం నడపి లబ్దిపొందడం. రెండోది; టీఆర్ ఎస్ ను సంపూర్ణంగా బలపరిచి కేసిఆర్ ను ప్రసన్నం చేసుకోవడం. ఈ విషయం మీద ఆంధ్రా హైదరాబాదీ సమూహాల్లో చాలా చర్చోపచర్చలు జరిగాయి. అంతిమంగా వాళ్ళు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. దీన్ని ఆంధ్రాహైదరాబాదీల్లో పెరుగుతున్న పరిపక్వతగా భావించాలి.  వాళ్ళు ఈ ఎన్నికల్లో కెటలిస్ట్ ఏజెంట్లుగా పనిచేశారు. కేసిఆర్ మీద ఆంధ్రా హైదరాబాదీల విశ్వాసాన్ని పెంచడానికి కెటలిస్ట్  ఏజెంటుగా పనిచేసింది మాత్రం  కేటిఆర్. 

కేటిఆర్ కు స్పష్టంగా గమ్యం తెలుసు. దానికి అనుగుణంగా తన గమనాన్ని మార్చుకోవడమూ తెలుసు. ఈ రెండు విషయాలు తెలిసిన వాళ్ళకు విజయం తనకు తానుగానే వరిస్తుంది.  గ్రేటర్ ఎన్నికలు అంతిమంగా కేటిఆర్ ను ఆంధ్రాహైదరాబాదీల కొత్త  ఆశగా మార్చాయి. ఆయనే ఈ ఎన్నికల హీరో !

అసహన రాజకీయాలపై మతసామరస్యవాదుల విజయం ఈ ఎన్నికల్లో మరో విశేషం.  ఎన్నికల ప్రచారఘట్టం సాగుతున్న రోజుల్లోనే రిపబ్లిక్ డే వచ్చింది. భారత సమాజంలో అసహన వాతావరణం పెరుగుతున్నదనే అంశాన్ని మొదటిసారిగా ముందుకు తెచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన రిపబ్లిక్ డే సందేశంలోనూ దాన్ని గుర్తు చేశారు. ప్రత్యక్షంగా దాని ప్రభావం వున్నాలేకున్నా హైదరాబాదీలు మాత్రం ఈ ఎన్నికల్లో అసహన వాతావరణాన్ని సృష్టించే రాజకీయశక్తుల్ని ఘోరంగా ఓడించారు. నగరంలోనే ఒక కేంద్రమంత్రివున్నప్పటికీ  కేవలం  మూడు శాతం సీట్లు సాధించడానికి బీజేపీ ప్రాణరక్షణ మందులు వాడాల్సివచ్చింది. మరోవైపు యంఐయం తన పరువును కాపాడుకోవడమేగాక ఒకటోఅరో సీట్లు పెంచుకుంది. అది అచ్చంగా ముస్లీం ఓటు బ్యాంకువల్ల వచ్చిన విజయం అని అసదుద్దీన్ ఒవైసీ అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి వుండదు. యంఐయంకు అదనపు సీట్లను అందించిన ఘనత మతసామరస్యవాదులైన హిందూసామాజికవర్గానిది. వాళ్లకు యంఐయం రుణపడి వుండాలి.

ఈ ఎన్నికల్లో ఘోరపరాజయాన్ని మూటకట్టుకున్న రాజకీయ నాయకుడు చంద్రబాబు. హైదరాబాద్ లో ఎన్నికల ఘట్టం సాగుతున్న కాలంలోనే రెండుసార్లు నగరానికి వచ్చిన రాహుల్ గాంధీ ఏరకంగానూ ఈ అంశాన్ని పట్టించుకోలేదు. రాహుల్ గాంధీలా చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి దూరంగా వుండలేక పోయారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి  పక్క రాష్ట్రపు ఒక నగర మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడం అంత హుందాగా వుండదని వారికి తోచినట్టులేదు. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రే రోడ్ షో జరపకుండా ఒక బహిరంగసభ, ఒక వీడియో మీటింగుకు మాత్రమే పరిమితమయ్యారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కనుక ప్రచారానికి తాను వెళ్లక తప్పదని చంద్రబాబు భావించి వుండవచ్చు. అయితే, పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి "హైదరాబాద్ ను నేనే అభివృధ్ధి చేశాను, సైబరాబాద్ నా మానసిక పుత్రిక, ఇక ఇక్కడే వుంటాను" అనడం ఆంధ్రా హైదరాబాదీలకు కూడా నచ్చలేదు. చంద్రబాబుగారు హైదరాబాద్ చూరును పట్టుకుని వేలాడకుండా ఆంద్రప్రదేశ్ ను అభివృధ్ధి చేయడం మీద దృష్టిపెట్టాలని ఆంధ్రా హైదరాబాదీలు చాలా స్పష్టంగానే చెప్పారు.

(రచయిత సీనియర్ పాత్రికేయులు)
మొబైల్  : 9010757776


http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=452981&boxid=735647400

No comments:

Post a Comment