Thursday, 16 November 2017

A fact finding report on Rohingya Refuges at Bolapur of Hyderabad

A fact finding report on Rohingya Refuges at Bolapur of Hyderabad
హైదరాబాద్ లో రోహింగ్యాలు
నిజనిర్ధారణ నివేదిక
-       డానీ

1.                మయన్మార్ లో రోహింగ్యాల అస్తిత్వానికి 1980వ దశకంలోనే ముప్పు మొదలయింది.
2.                2000 సంవత్సరం నుండి రోహింగ్యాలు హైదరాబాద్ కు రావడం మొదలెట్టారు.
3.                ప్రపంచంలో ఏ నగరంలో అయినా సరే వలస వచ్చినవాళ్ళు శివారు ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పరచుకుంటారు.  హైదరాబాద్ ఆగ్నేయ మూలలో బారకాస్ రోడ్డుకూ, ఇన్నర్ రింగు రోడ్డుకూ మధ్యన గుర్రం చెరువు పరిసరాల్లోని బోలాపూర్  లో రోహింగ్యాలు నివాసాలు ఏర్పరచుకున్నారు. బోలాపూర్ అంటే,  గణేష్ ఉత్సవాల లడ్డు అత్యధిక ధరకు అమ్ముడుపోతున్న ప్రాంతం.
4.                ప్లాస్టిక్ సంచులు కప్పుకున్న వెదురు పాకలు వీళ్ళ నివాసాలు. 120-150 చదరపు అడుగుల పాకలో ఓ అరడజను మంది చొప్పున నివశిస్తుంటారు. అవి కూడా అద్దె పాకలు. స్థలానికి నెలకు 500 రూపాయల అద్దె. విద్యా, వైద్య మాత్రమేకాదు రోడ్లు, నీళ్ళు, మలమూత్ర విసర్జన సౌకర్యాలు కూడా  లేని జీవనం వారిది.
5.                దాదాపు 20 క్యాంపుల్లో 4 వేల మంది వుండడంతో అదొక కాలనీగా మారింది. దీన్ని  రాయల్ కాలనీ అంటున్నారు.
6.                రోడ్ల మీద, చెత్త కుప్పల్లో పడేసే పాత ప్లాస్టిక్ సామానులు, ఇనుప ముక్కలు, తీగలు ఏరి  అమ్ముకుని వీళ్ళు రోజుకు 100-150 రూపాయలు సంపాదిస్తుంటారు. భవన నిర్మాణ కూలీలుగా, బేల్ దార్ హమాలీలుగా  కొందరు పనిచేస్తున్నారు.
7.                గడిచిన దశాబ్దంన్నర కాలంలో కొంచెం స్థిరపడిన రోహింగ్యాలు కొందరు  టీ బడ్డీలు, పాన్-సిగరెట్ బడ్డీలు, కిరాణ గుడిసెలు పెట్టుకున్నారు. కూలీల కోసం రెండు భోజన హొటళ్ళు కూడా  వెలిశాయి. (చికెన్ షేర్వాతో బగార ప్లేటు 35 రూపాయలు).
8.                మొదట్లో స్థానిక పోలీసులు వీళ్లను చాలా వేధించారు. అనేక సందర్భాల్లో తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు కూడా పంపించారు. మక్కా మసీదు పేలుళ్ళ కేసులో కూడా కొందరు రోహింగ్యాలను అన్యాయంగా అరెస్టు చేశారు.
9.                మజహర్ హుస్సేన్ నాయకత్వంలోని కోవా స్వఛ్ఛంద సంస్థ కృషి వల్ల మూడేళ్ళ క్రితం ఐక్య రాజ్య సమితి హై కమాండ్ ఫర్  రెఫ్యూజీస్ (UNHCR) వీరిలో చాలా మందికి శరణార్ధుల గుర్తింపు కార్డు ఇచ్చింది.
10.           ఈ ఏడాది ఆగస్టు నెలలో రోహింగ్యాలపై మయన్మార్ సైన్యం విరుచుకు పడింది. రోహింగ్యా గ్రామాల మీద రాకెట్ లాంచర్లు ప్రయోగించింది.
11.           కొత్త బాధితుల్లో అత్యధికులు బంగ్లాదేశ్ లో తల దాచుకుంటున్నారు. కొందరు ఇండియాకు కూడా వచ్చారు.  వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే  హైదరాబాద్ వచ్చారు.
12.           కొత్తగా వచ్చిన వాళ్ళను పోలీసులు పట్టుకుని బంగ్లాదేశ్ సరిహద్దు వరకు దించి వచ్చారు.
13.           శరణార్ధులుగా వచ్చిన వారిని నిర్ధాక్షిణ్యంగా వెనక్కు పంపడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం తీవ్రంగా విమర్శించింది. ఆ తరువాత వెనక్కు పంపే  కార్యక్రమానికి కొంత విరామం ప్రకటించినా కొత్తగా వచ్చిన రోహింగ్యాలు ఇప్పటికీ భయం భయంగానే బతుకుతున్నారు. ఏ క్షణాన్నయినా పోలీసులు తమను మూటకట్టి మయన్మార్ పంపించేస్తారని వాళ్ళ ఆందోళన.
14.           కొత్త శరణార్ధి,  క్షతగాత్ర రోహింగ్యాలు ఎక్కువ మంది బంగ్లాదేశ్ లో వున్నారు కనుక  విరాళాలు, సహాయక చర్యలు, పునరావాస పథకాలు  నిజానికి అక్కడ పెద్ద స్థాయిలో జరగాలి.  
15.           ఇండియాలో కూడా కొత్త రోహింగ్యాలు చెదురుమదురుగా అనేక నగరాల్లో వున్నారు. దాదాపు అన్ని చోట్లా అందరి జీవితం ఒకే విధంగా వుంది. హీనమైన జీవనం అభద్రతా భావం.
16.           ఇప్పుడు వచ్చిన కొత్త రోహింగ్యాలతో పోల్చితే  పదేళ్ళుగా ఇక్కడికి వచ్చిన వారి స్థితి కొంచెం మెరుగ్గా వుందని చెప్పవచ్చు. రక్తకన్నీరు నాటకం భాషలో చెప్పాలంటే  కొత్త రోహింగ్యాలు “అడుక్కోవడానికి బొచ్చె కూడా లేని బిచ్చగాళ్ళు” !
17.           రోహింగ్యాల నరమేధం మీద వార్తలు రావడంతో వితరణశీలురు గొప్పగా స్పందించారు. ముందు వాళ్ళని అభినందించాలి. ప్రభుత్వం వాళ్ళని చొరబాటుదార్లు అంటున్నా స్థానిక వితరణశీలురు గొప్ప మానవత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.
18.           బోలాపూర్ రాయల్ కాలనీకి అనేక దిశల నుండి సహాయం రావడంతో  పాటూ కొత్త సమస్యలు కుడా వచ్చాయి.
19.           అక్కడ తక్షణం సహాయాన్ని పొందాల్సిన వాళ్ళు (priority groups) :
1. క్షతగాత్రులు  2. రోగులు  3. పిల్లలు  4. అనాధలు 5. విధవాస్త్రీలు 6. వృధ్ధులు 7. కొత్తగా వచ్చినవాళ్ళు.
20.           కాలనీలోని రోహింగ్యా సమూహాల్లో మిగిలిన వారి ఆర్ధిక స్థితి బాగుందనికాదు. కొంచెం మెరుగ్గా వుందని మాత్రమే అనుకోవచ్చు.
21.           వితరణశీలురు సాధారణంగా మరీ అవసరం వున్న (priority groups) వారినే  ఆదుకోవాలనుకుంటారు.
22.           అందులోనూ కొన్ని చిక్కులున్నాయి. వితరణశీలురు అక్కడికి చేరగానే కొత్తగా వచ్చిన రోహింగ్యాల గురించి వాకబు చేస్తారు.
23.           కొత్తగా వచ్చిన వాళ్ళు తాము కొత్తగా వచ్చామని బాహాటంగా ప్రకటించుకోలేరు. పోలీసులు వేధిస్తారని వాళ్ళ భయం.
24.           priority groups కు బియ్యం, గోధుమలు పంపిణీ చేస్తున్నపుడు పాత రోహింగ్యాలు కూడా వచ్చి క్యూలో నిలబడతారు. వాళ్ళు కూడా కటిక దరిద్రంలోనే బతుకుతుంటారు కనుక వాళ్లను నిరాకరించడం అంత సులువుకాదు.
25.           ముస్లింలు పేదలకు సాధారణంగా గోధుమలు  దానం చేస్తారు.
26.           మయన్మార్ ముస్లింల ప్రధాన ఆహారం బియ్యం. అతి తక్కువ మంది మాత్రమే గోధుమ రొట్టెలు తింటారు.
27.           దానంగా వచ్చిన గోధుమలని పిండి పట్టించుకోవడానికీ,  రొట్టెలు కాల్చుకోవడానికి నూనె కొనడానికి కూడా  వాళ్ళ దగ్గర నగదు లేదు.
28.           నరేంద్ర మోదీ నీర్దేశిత నగదు రహిత జీవితాన్ని కఛ్ఛితంగా గడుపుతోంది ఇప్పుడు రోహింగ్యా శరణార్దులే!
29.           నగదు కోసం బోల్ పూర్ క్యాంపుల్లో  కొత్త పరిణామం మొదలయింది. దానంగా వచ్చిన గోధుమలని వాళ్ళు స్థానిక కిరాణా దుకాణాలకు ఇచ్చేసి బార్టర్ పధ్ధతిలో బియ్యం తీసుకుంటున్నారు  
30.           దీని మీద కూడా కొన్ని విమర్శలున్నాయి. తిండి ఎక్కువయ్యి రోహింగ్యాలు వాటిని అమ్ముకుంటున్నారనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది. ఇందులో ఒక వాస్తవం వుంది; ఒక అబధ్ధం కూడా వుంది. (దీన్ని నిర్ధారించడం కోసమే ఈ వ్యాసకర్త వరుసగా మూడు రోజులు అక్కడికి వెళ్ళాడు.)
31.           అందరూ బియ్యం, గోధుమలనే దానంగా ఇస్తుంటే వాళ్ళు ఎలా తింటారూ? వండుకుని తినాలంటే పప్పు, నూనె, ఉప్పు, కారం వగయిరాలు కూడా కావాలిగా.
32.           అంచేత దానంగా వచ్చిన బియ్యం, గోధుమల్లో కొంత భాగాన్ని వాళ్ళు అమ్మేసుకుని ఇతర వెచ్చాలు కొనుక్కుంటున్నారు. బయటివారికి ఇది తప్పుగా అనిపించవచ్చుగానీ శరణార్ధులకు  ఇది అనివార్యం.
33.           మరో విషయం ఏమంటే దాతలు ఆర్ధికంగా  మధ్యతరగతి,  ఆపై వర్గాలకు చెందినవారు. సాధారణంగా తమ ఇళ్ళలో వాడే  సోనా మసూరీ బియ్యం (HMT / Lachkari),  విదీష షర్బతీ గోధుమల్ని వాళ్ళు పంపిణీ చేస్తారు. వాటి సగటు ధర కిలో 45 రూపాయలుంటుంది.
34.           ఆ మురికి వాడల్లో  చాలా తక్కువ ధరకు (కేజీ 10-12 రూపాయలకు) కూడా ముతక  బియ్యం దొరుకుతుంది. అది ముక్కిపోయి, రాళ్ళు నిండి వుంటుంది. అయినాసరే  కిలో సోనా మసూరి బియ్యానికి నాలుగు కిలోల  ముతక  బియ్యం దొరుకుతుంది గనుక నాలుగు రోజులు తినవచ్చనే ఆశతో వాళ్ళు సరుకు మార్పిడి చేసుకుంటారు.   
35.           మురికివాడల్లో నిత్యావసర సరుకుల నాణ్యత చాలా తక్కువగా వుంటుంది. ధరలు చాలా ఎక్కువగా వుంటాయి. రోహింగ్యా శరణార్ధులు ఎవ్వరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవు. సబ్సిడీ వంటగ్యాస్ బండలు అస్సలు వుండవు. ఆ విధంగానూ వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారు.  
36.           ప్రస్తుతం వాళ్లకు బియ్యం కన్నా కందిపప్పు, వంట నూనె, ఉప్పు, కారం అత్యవసరంగా కావాలి. హైదరాబాద్ లో చలి మొదలయింది కనుక తక్షణం బ్లాంకెట్స్ / వున్ని దుప్పట్లు కావాలి.
37.           కాలనీలో కొన్ని సామాజిక ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి.  కొత్త రోహింగ్యాలకు దానం ఇస్తున్నపుడు పాత రోహింగ్యాలు కూడా వచ్చి క్యూలోచేరుతున్నారు.  తమకూ దానం ఇవ్వాలని అర్ధిస్తున్నారు.  
38.           దాతలు వంద మందికి దానం చేయడానికి వెళితే క్యూలో మూడు వందల మంది వచ్చి నిలబడుతున్నారు. కొందరికి మాత్రమే  దానం ఇచ్చి మిగిలినవాళ్ళకు లేదనడం ఆచరణలో చాలా ఇబ్బంది.
39.           దాతల్లో ముస్లింలతోపాటూ స్వల్పంగా హిందువులు కూడా వున్నారు. విశేషం ఏమంటే,  రోహింగ్యాలకు దానాన్ని అందజేయమని నన్ను సంప్రదించిన ముగ్గురు కూడా హిందూ సామాజిక వర్గానికి చెందిన వారే. వారిలో ఒకరు మహిళ.
40.           దాతల్లో ఎక్కువ మంది  ముస్లింలు కావడం వల్ల కూడా మరో వివాదం  మొదలయ్యింది.
41.           బోలాపూర్ లో స్థానిక ముస్లిం నిరుపేద కుటుంబాలు అనేకం వున్నాయి. వాళ్ళ ఆర్ధిక పరిస్థితి శరణార్ధులకన్నా మెరుగ్గా ఏమీలేదు. వాళ్ళు వచ్చి ఈ పంపిణీ కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారు. “మేము ముస్లింలం కామా? మేము పేదవాళ్లం కామా? దానం పొందే హక్కు మాకు లేదా?” అని వాళ్ళు గట్టిగానే అడుగుతున్నారు.
42.           తరచూ స్థానిక ముస్లింలకూ రోహింగ్యా ముస్లింలకు మధ్య మాటల యుధ్ధం కూడా జరుగుతోంది.
43.           బోలాపూర్  గుర్రం చెరువు పరిసరాల్లోని హిందూ పేదలు కూడా ఇలాంటి అభిప్రాయంతోనే వున్నారు. బిచ్చానికి కులం మతం ఏమిటనే వాళ్ళ ఆవేదన కొట్టిపడేయ దగిందేమీకాదు. ఒక ప్రాంతంలో అంతమంది ఆకలి దారిద్ర్యాలతో అలమటిస్తుంటే  వాళ్ళను  పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. రోహింగ్యా శరణార్ధులకు ఓట్లు లేవు గనుక రాజకీయ పార్టీలు కూడా వాళ్ల సమస్యల్ని పట్టింకోవడంలేదు.  
44.           ఈ వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించడానికి, చక్కదిద్దడానికీ  అక్కడ శరణార్ధులలోనే  చిన్న రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. అంటే రోహింగ్యాల్లో కొందరు ముఠా నాయకులు పుట్టుకు వచ్చారు.
45.           తమ పనులు మానుకుని ఈ పంపిణీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు కనుక ఈ ముఠా నాయకులు తమ జీవిక కోసం ఐదో పదో శాతం తిన్నా తింటారు. ఆ ముఠా నాయకుల ప్రవర్తన మనకు కొంచెం చికాకు కలిగించే మాట వాస్తవమేగానీ, వాళ్ళు అక్కడ అవసరమైన దెయ్యాలు (necessary evils). ఒక వ్యవస్థ ఏర్పడినపుడు దాని నిర్వహణకు కొంత ఖర్చు కూడా వుంటుంది. 
46.           రోహింగ్యా శరణార్ధులు ఆకలితో వున్నారు గనుక ఇప్పుడు ఆహారాన్ని ఇస్తున్నాం. ఇది తక్షణ సహాయక కార్యక్రమం మాత్రమే. వాళ్ళు జీవించాలి గనుక జీవనాధారాన్ని కల్పించాలి. వాళ్ళు జీవితంలో స్థిరపడడానికి వివిధ వృత్తుల్లో నైపుణ్యాన్ని అందించాలి. అలాంటి పునరావాస కార్యక్రమం ఒకటి రూపుదిద్దుకోవాలి.
47.           బోలాపూర్ రాయల్ కాలనీ ఇప్పుడు ఒక సామాజిక ప్రయోగశాల. అక్కడ స్థానికులున్నారు, దేశీయులున్నారు, విదేశీయులూ వున్నారు, ముస్లింలున్నారు, హిందువులున్నారు. భయానక పేదరికం వుంది. ఆకలి వుంది. ఆర్తనాదాలున్నాయి.  గొప్ప సంఘీభావం కూడా వుంది.
48.           వలస వచ్చిన వారినీ, శరణార్ధుల్ని సకాలంలో ఆదుకోకపోతే, వాళ్ళకు జీవిత సౌకర్యాలని కనీసంగా అయినా కల్పించకపోతే సహజంగానే వాళ్ళు గత్యంతరంలేక నేర ప్రపంచం లోనికి అడుగు పెడతారు. అది కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇలా ప్రతి నగరంలోనూ జరుగుతుంది.
49.           ఒక జాతిని ఒంటరివాళ్ళను చేసి అంతం చేసే విధానాలను మొగ్గలోనే అంతం చేయకపోతే అది మొత్తం మానవ జాతి అంతానికి దారి తీస్తుంది.
50.           మతసామరస్యం, వసుధైక కుటుంబం వంటి ఆదర్శాలు బోలాపూర్ లో  ఏ మేరకు వికసిస్తాయో చూడాలి.

(రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైల్ 9010757776
15 నవంబరు 29017
ప్రచురణ : మన తెలంగాణ, 16 నవంబరు 29017
http://epaper.manatelangana.news/1433444/Mana-Telangana-Daily/17-11-2017#page/4/2


(మన తెలంగాణ దినపత్రికకు ధన్యవాదాలు )

No comments:

Post a Comment