అభంగపట్నానికి భంగపాటు తప్పదు !
- - డానీ
అభంగపట్నానికి భంగపాటు తప్పదు !
- డానీ
"భరత్
రెడ్డిని 24 గంటల్లో అరెస్టు చేస్తాం" అని నిజామాబాద్ ఏసీపి యం. సుదర్శన్ నవంబరు 19 ఆదివారం మధ్యాహ్నం నవీపేట పోలీస్ స్టేషన్ ముందు దళిత బహుజన ప్రతిఘటన వేదిక
ఆధ్వర్యంలో ధర్నాచేస్తున్న ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు ప్రజలకు చేసే వాగ్దానాలు,
పోలీసులు ఆందోళనకారులకు ఇచ్చే హామీలు ఒక పట్టాన నెరవేరవు.
నవీపేట మండలంలోని అభంగపట్నం గ్రామ
దళితుల మీద అత్యాచారం కేసులో భరత్
రెడ్డి నిందితుడు. గ్రామం నుండి మొరం అనే ఒకరకం మట్టిని అక్రమంగా తరలిస్తున్న భరత్ రెడ్డిని స్థానిక దళితులు ప్రశ్నించారు.
దానితో ఆగ్రహం చెందిన భరత్ రెడ్డి దళితులైన లక్ష్మణ్, రాజేష్ అనే ఇద్దర్ని బెత్తంతో కొట్టడమేగాక
ముక్కును నేలకు రాయించి బహిరంగంగా అవమానించాడు. వాళ్ళను బలవంతంగా మురికి గుంటలో మునకలు
వేయించాడు. అంతటితో ఆగక కుల అహంకారంతో ఈ దౌర్జన్యాన్ని స్మార్ట్ ఫోన్ తో వీడియో తీసి అందరికీ చూపించాడు. ఫేస్ బుక్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో
ఆ వీడియో వైరల్ గా మారడంతో సభ్యసమాజం ఉలిక్కి పడింది. పేరునిబట్టే నిందితుడు రెడ్డి సామాజికవర్గానికి
చెందినవాడని స్పష్టంగానే తెలుస్తోంది. అతను భారతీయ జనతా పార్టీకి స్థానిక నాయకుడు కూడా.
నాయకుడంటే సాధారణంగా ఒకటో రెండో హత్య కేసుల్లో నిందితుడిగానూ వుంటాడు.
దళితుల
మీద దౌర్జన్యానికి సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారినపుడు సూమోటోగా కేసు నమోదు చేయమని పోలీసుల్ని న్యాయస్థాలు ఆదేశించవచ్చు.
దానికన్నా ముందే పోలీసులు కూడా తమంతట తాముగానే కేసు నమోదు చేయవచ్చు. అభంగపట్నంలో రెండూ
జరగలేదు. దళితుల విషయంలో న్యాయస్థానాలు, పోలీసు వ్యవస్థ ఎంత నిర్లక్ష్యంగా వుంటాయో
చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ మాత్రమే. అదే దళితులు ఓ గ్రామంలో రెడ్డి
సామాజికవర్గానికి చెందిన ఓ భూస్వామిని పట్టుకుని ముక్కుని నేలకు రాయించి, మురుగు నీటిలో
ముంచితే ఈపాటికి భూమ్యాకాశాలు ఏకమైపోయివుండేవి!. నిందితుల్ని మాత్రమేకాదు గ్రామంలోని
మొత్తం దళిత సామాజికవర్గాన్ని అరెస్టుచేసి
లాకప్పులో చిత్రహింసలు పెట్టి వుండేవారు!
ఈ
అంశం మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరినీ, పోలీసుల
నిర్లక్ష్యాన్నీ దుయ్యపడుతూ సోషల్ మీడియాలో
విమర్శల పరంపర సాగింది. యస్సీ, యస్టి, బీసీ, మైనారిటీ, ప్రజాస్వామిక సంఘాలన్నీ సంయుక్తంగా నవంబరు 19న అభంగపట్నంలో దళిత ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించాయి. వాళ్ళ
ప్రకటన వెలువడిన తరువాత మాత్రమే గత్యంతరం లేక
పోలీసులు కేసు నమోదు చేశారు. దళితులపై అత్యాచారం
జరిగిన సంఘటనలో ఎఫ్ ఐ ఆర్ కట్టడానికే ఇంతటి ఆందోళన అవసరమైతే దోషుల్ని అరెస్టు చేయడానికి
ఇంకెంతటి ఆందోళన అవసరం అవుతుందో?
నిందితుడు
కేంద్రంలో అధికారంలోవున్న పార్టీ నాయకుడు కనుక రాష్ట్రంలో అధికారంలోవున్న పార్టీ కూడా
సహజంగానే అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. నవంబరు 28న ప్రతిష్టాత్మక గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జీఈఎస్) ను, హైదరాబాద్
మెట్రో రైలును ప్రారంభించడానికి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటున్నదని
సంకేతాలు అందుకున్న టీఆర్ ఎస్ ఇటీవల ప్రధానికి ప్రేమ సంకేతాలు పంపుతున్నట్టు జనానికి
కూడా సంకేతాలు అందుతున్నాయి. అలాంటి సమయంలో ప్రధాని పార్టీకి చెందిన ఒక స్థానిక నాయకుడ్ని అరెస్టు
చేయమని పోలీసులను ఆదేశించే సాహసం రాష్ట్రప్రభుత్వం చేయకపోవచ్చు. అసలు భరత్ రెడ్డి తప్పించుకున్న
కారును సమకూర్చింది స్థానికి టీఆర్ ఎస్ నాయకుడే అని ఇప్పుడు నిజామాబాద్ లో గట్టిగానే వినిపిస్తోంది.
విషయం
బయటికి పొక్కి తన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నదని తెలియగానే భరత్ రెడ్డి తెలివిగా బాధితుల్ని కూడా తీసుకుని పరారయిపోయాడు. ఆ విషయం పోలీసు అధికారులకు తెలియడమేకాదు వాళ్ళు
కూడా తమవంతుగా తప్పక సహకరించి వుంటారు. పూటపూటకూ రహాస్య స్థావరాలను మార్చడమేగాక సెల్
ఫోన్ లో సిమ్ కార్డును కూడా మార్చేస్తూ వుండడంవల్ల తాము నిందితుడ్ని వెంటాడి పట్టుకోలేకపోతున్నట్టు
వాళ్ళు చెపుతున్నారు. పోలీసులకు స్వతహాగా దోషుల్ని పట్టుకోవాలనే ఆలోచనే లేనపుడు వాళ్ళకు
ఇజ్రాయిల్ వంటి విదేశాల నుండి ఆత్యంత ఆధునిక పరికరాలు ఎన్ని తెచ్చి ఇచ్చినా వృధాయేనని
ఈ సంఘటన రుజువు చేస్తోంది. అదీగాక, ఒక నిందితుడు బాధితుల్ని ఎత్తుకుపోవడం (అపహరణ),
వాళ్ళను రహాస్య స్థావరాల్లో దాయడం (బంధించడం) కూడా చాలా తీవ్రమైన నేరాలు. మరి భరత్
రెడ్డి మీద ఆ కేసుల్ని కూడా కట్టారా? అని అడిగితే పోలీసు వున్నతాధికారులు నీళ్ళు నములుతున్నారు.
తెలంగాణ
రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ విభాగాల్లో అత్యధిక ప్రోత్సాహకాలు అందుకున్నది పోలీసుశాఖే.
సిబ్బంది పెరిగారు, అధికారాలు పెరిగాయి. జీతభత్యాలు పెరిగాయి, సౌకర్యాలు పెరిగాయి,
ఆధునిక ఆయుధాలు సమకూరాయి. కొత్త వాహనాలు వచ్చాయి. హైటెక్ పరికరాలు వచ్చాయి. హోం మంత్రి అదుపు ఆజ్ఞలు
కూడా లేవు. అయినా పోలీసు మైండ్ సెట్ మారలేదు. దళితులు ఆదివాసులకు సంబంధించిన కేసుల్లో
పోలీసులు ఇప్పటికీ ప్రతికూల పాత్రనే నిర్వహిస్తున్నారు. బలహీనవర్గాలకు అనేక సందర్భాలలో
దోషులకన్నా పోలీసుల మీదనే ఎక్కువ ఆగ్రహం కలుగుతున్నదంటే
అతిశయోక్తికాదు. రేపు టీఆర్ ఎస్ పాలన మీద ప్రజల్లో
ఏదైనా అసంతృప్తి కలగడం అంటూ మొదలయితే దానికి తొలి కారణం పోలీసులే అవుతారు!. దీనికి బలమైన తాజా ఉదాహరణ నేరెళ్ళ.
నేరెళ్లలో
ప్రజలు మొదట్లో తిరగబడింది ఇసక ట్రిప్పర్ల మీదనే అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళ ఆగ్రహమంతా
పోలీసుల మీదనే వుంది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ ఇసుకను హైదరాబాద్ నగరానికి తరలించడానికి
ప్రతిరోజూ ఓ ఏడు వందల లారీలు ఇటూ ఇంకో ఏడు వందల లారీలు అటూ వేగంగా చక్కర్లు కొడుతుంటాయి.
ఒకదాన్ని మరొకటి అధిగమించే ఆతృతలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ ప్రమాదాల్లో స్థానికులు
చనిపోతుంటారు. చాలామంది గతంలో చనిపోయారు; వర్తమానంలో చనిపోతున్నారు. అలా చనిపోయేవారు
సహజంగా ఆదివాసీ, యస్సీ, బీసీ వంటి బలహీనవర్గాల వాళ్ళే అయ్యుంటారు.
నేరెళ్ల
సమీపాన రామచంద్రాపురం బస్‌స్టాప్ ప్రాంతంలోని హనుమాన్ గుడి దగ్గర జులై 2 సాయంత్రం ఒక
ఇసుక టిప్పర్ ఢీ కొనడంతో ఒక వృధ్ధుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు ఎరుకల తెగకు చెందిన
బదనపురం భూమయ్య. అతని మరణ వార్త వినంగానే పరిసర ప్రాంతాల ఎరుకల కుటుంబాలన్నీ అక్కడికి
చేరుకుని ఆ ట్రిప్పరు మీద తమ ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. ప్రభువులు ఎంత నిర్లక్ష్యాన్ని
అయినా ప్రదర్శించవచ్చు కానీ ప్రజలు చిన్న నిరసన కూడా ప్రదర్శించ కూడదు అనేది శాంతిభద్రతల
నియమం. మరునాడు రాత్రి ఆందోళనకారుల అరెస్టుల పర్వం మొదలయింది. జులై మూడు రాత్రి స్థానిక
యస్సై, జులై 4 రాత్రి సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కంపాటి పోలీస్ లాకప్పులో ఎనిమిది మంది
నిందితుల్ని బట్టలూడదీసి లాఠీతో చావబాదారు. ఈ విషయాన్ని సిరిసిల్లా శాసనసభ్యుడు, పంచాయితీరాజ్,
ఐటీ శాఖల మంత్రి కేటిఆర్ కు బాధితులు స్వయంగా విన్నవించుకున్నారు.
జులై
4 అంటే అమెరికా స్వాతంత్ర్య దినం, అల్లూరి
శ్రీరామరాజు పుట్టినరోజు వంటి విషయాలను పక్కన పెట్టినా తెలంగాణలో అలనాటి సాయుధ రైతాంగ పోరాటం
ఆరంభం అయిన రోజు. దళిత, బహుజనుల్ని చిత్రహింసలు
పెట్టడానికి జులై 4న ముహూర్తం పెట్టిన తెలంగాణ పోలీసుల చారిత్రక దృష్టిని మెచ్చుకోవాలి!
నెల
రోజులు ఆలస్యంగా అయినా బాధితుల గోడు విన్న ప్రభుత్వం సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కంపాటి
మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని చాలామంది ఆశించారు. కానీ, ప్రభుత్వం ఆయన్ని లడాఖ్‌లో
జరిగిన జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలకు రాష్ట్ర ప్రతినిధిగా పంపించి గౌరవించింది.
ఇలాంటి నిర్ణయాలు సహజంగానే బాధిత సామాజికవర్గాలకు గాయాల మీద కారం చల్లినట్టు వుంటాయి.
రాజకీయ
నాయకుల దగ్గర నుండి ఇంజినీర్ల వరకు అందరూ అనేమాట ఒకటుంది; ప్రాజెక్టులు కట్టాలంటే ఊర్లు
మునగక తప్పదని. ఆమాట చాలా మందికి సమంజసంగానూ అనిపిస్తుంది. ప్రాజెక్టుల కోసం ఆదివాసులు,
దళితులు, బహుజనులను మాత్రమే నిర్వాశితులుగా ఎందుకు మార్చాలీ? అని ఎవరయినా ప్రశ్నిస్తే
ఈ సమంజసవాదులు ఒక్కరూ సమాధానం ఇవ్వరు.
అధికారాన్ని
చేపట్టడానికీ, లేదా వున్న అధికారంలో కొనసాగడానికీ రాజకీయ పార్టీలు ప్రజలకు ఎక్కువ వాగ్దానాలు
చేస్తాయి; కార్పొరేట్లకు తక్కువ వాగ్దానాలు
చేస్తుంటాయి. అయితే, అధికారాన్ని చేపట్టిన తరువాత; కార్పొరేట్లకు ఇచ్చిన వాగ్దానాలని
అవి ఒక అకుంఠిత దీక్షతో పూర్తి చేస్తుంటాయి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మాత్రం అవి
నిర్లక్ష్యం చేస్తుంటాయి. ప్రభుత్వాలు కార్పొరేట్లకు చేసే మేళ్ళు ఏనుగు స్థాయికన్నా
ఎక్కువగా వుంటాయి. ఒకవేళ అవి ప్రజలకు ఇచ్చిన
వాగ్దానాలన్నింటినీ పూర్తి చేసినా వాటి విలువ
ఎలుక స్థాయికి మించి వుండదు. అంచేత ఎంత ఆదర్శ ప్రభుత్వ పాలన అయినా ముగింపుకు వచ్చే
సమయానికి కార్పొరేట్లు మరింత బలిసి వుంటారు; ప్రజలు మరింత చితికిపోయి వుంటారు. కొత్త
తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా వుందని ఏమీ అనిపించడంలేదు.
ఆర్మూర్,
మంథని, కమలాపూర్, సారంగాపూర్, ములుగు పాతపల్లి, ఎల్లారం,
ఎల్లారెడ్డి , చల్లూరు, పెద్దపల్లి,
నిజామాబాద్ ఒక్కటేమిటీ రాష్ట్రంలో దళితుల మీద దాడి జరగని మండలం ఒక్కటంటే ఒక్కటీ లేదనే
చెప్పాలి. 2016 డిసెంబరు 31 నాటికి అంటే కొత్త రాష్ట్రం ఏర్పడిన రెండున్నరేళ్ళ కాలంలోనే
ఎస్సీ/ఎస్టీ అత్యాచార
నిరోధక చట్టం కింద 5,120 కేసులు నమోదయ్యాయి. ఇందులో 120
మంది దళితుల హత్యలూ కూడా వున్నాయంటే
పరిస్థితిని ఎంత తీవ్రంగా వుందో అర్ధం చేసుకోవచ్చు.
దళిత
బాధితుల అత్యాచారాల్ని నిరసిస్తూ దళిత, బహుజన, ఆదివాసి, మైనారిటీల సంఘాల నాయకులు కార్యకర్తలతోపాటూ
ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు, ఉదారవాదులు,
విద్యార్ధులు సహితం పెద్ద సంఖ్యలో అభంగపట్నం వచ్చి పెత్తందారీ కులాల ఆగడాలను ఖండించారు. నవీపేటలో నిజామాబాద్-
బాసర రోడ్డు మీద రాస్తారోకో జరిపారు. పోలీసు స్టేషన్ ముందు ధర్ణా చేశారు.
దానితో పోలీసులు ఒక మెట్టు దిగివచ్చి అరెస్టు చేస్తామని హామీ ఇచ్చినట్టు కనిపిస్తున్నప్పటికి
దోషుల్ని శిక్షించే వరకు నమ్మడానికిలేదు.
ఇప్పుడు
నవీపేటలో ఒక వింత కథనం బలంగా ప్రచారంలో వుంది. దాని ప్రకారం; బాధితుల సమీప బంధువు ఒకడు బీజేపీలోనే
వుంటున్నాడట. అతని ద్వార బాధితులకు కొంత నగదుతోపాటూ కొంత పొలం రాసిచ్చి యస్సీ యస్టీ
అట్రాసిటీస్ కేసును వెనక్కు తీసుకునేలా పైరవీలు చేస్తున్నాడట నిందితుడు భరత్ రెడ్డి.
ఈ ఆపరేషన్ విజయవంత మయితే, దళితుల మీద అగ్రవర్ణాలు సాగిస్తున్న ఆగడాలను చూపించేందుకు
గ్రామంలో ఒక షార్ట్ ఫిలిం తీశామనిన్నూ, ఆ వీడియో
క్లిప్పింగుల్ని చూసి జనం అపార్ఢం చేసుకున్నారనీన్నూ చెపుతూ ఒక కథనం మన ముందుకు వచ్చే
అవకాశం వుంది! నిందితుడు భరత్ రెడ్డి తలపెట్టిన ఈ ‘మెదడు మార్పిడి’ ఆపరేషన్ కు కూడా
జిల్లా
పోలీసుల సహకారం వుందట.
భరత్
రెడ్డిని అరెస్టు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఇచ్చిన హామీతో నవంబరు 19న ప్రశాంతంగా
వెనుదిరిగిన ఆందోళన కారులు ఈ ‘షార్ట్ ఫిలిం’ కథనంతో అంత ప్రశాంతంగా వుండకపోవచ్చు. అప్పుడు
అభంగపట్నానికి భంగపాటు
తప్పకపోవచ్చు.
(రచయిత
సమాజ విశ్లేషకులు)
హైదరాబాద్
20
నవంబరు 2017
please contact No
ReplyDelete9010757776
ReplyDelete