గుజరాత్ ‘పద్మ’
వ్యూహం
- - డానీ
సంజయ్ లీలా భన్సాలీ కొత్త సినిమా ‘పద్మావతి’ మీద
ఉవ్వెత్తున
చెలరేగిన
వివాదం చల్లారుతోంది. ఈ చిత్రం సింగిల్ కట్ కూడా లేకుండా నవంబరు 22న బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫిల్మ్స్ క్లాసిఫికేషన్ సెన్సార్ సర్టిఫికేట్ పొంది డిసెంబరు 1న లండన్ లో విడుదలకు సిధ్ధం అయింది. మనదేశంలో విడుదలవ్వడానికున్న అడ్దంకులు కూడా క్రమంగా తొలిగిపోతున్నాయి. ‘పద్మావతి’ సినిమాపై విమర్శలు, బెదిరింపులు, హెచ్చరికల హోరు తగ్గాక రెండు చేదు వాస్తవాలు మన ముందు నిలుస్తాయి. మొదటిది; సంఘ్
పరివారం శూన్యం నుండి కూడా ఒక జాతీయ వివాదాన్ని సృషించగలదనీ, రెండోది; ప్రతి అంశాన్నీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా మలుచుకోగలదు అని.
సంఘ్ పరివారానికి ఒక చిత్రమైన గుణం వుంది. అది కావ్యాన్ని వాస్తవం అంటుంది; వాస్తవాన్ని కావ్యం అంటుంది. ముస్లిం పాలకులకు సంబంధించి ఏ సానుకూల అంశాన్ని చెప్పినా దాన్ని ఒక కావ్యం (కల్పితగాధ) అంటూ అది కొట్టి పడేస్తుంది. కథ తనకు అనుకూలంగా వుంటే మాత్రం అనేక కావ్యాల్ని అది వాస్తవ చరిత్ర అంటుంది.
సూఫీ కవి మాలిక్ ముహమ్మద్ జయాసీ
16వ శతాబ్దంలో అవధీ భాషలో ‘పద్మావత్’ అనే కావ్యాన్ని రాశాడు. కావ్యం అంటే కల్పితగాధ అనే అర్ధం దీనికి సరిగ్గా సరిపోతుంది. 14వ శతాబ్దపు ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి వాస్తవ పాత్ర, మేవార్ రాజ్యం. చితోర్ ఘడ్ కోట వంటి వాస్తవ ప్రదేశాలతోపాటూ మేవార్ మహారాణి పద్మావతి (పద్మిని) అనే కల్పిత పాత్ర చుట్టూ అల్లిన కథ యిది. పద్మావతి అందచందాల గురించి విన్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను ఎలాగయినా సరే పొందాలని మేవార్ రాజ్యం మీదికి దందయాత్రకు వస్తాడు. పన్నాగాలతో పద్మావతి భర్తను చంపేస్తాడు. అయినా పద్మావతి అతనికి దక్కదు. యుధ్ధరంగంలో భర్త
చనిపొయాడన్న వార్త తెలియగానే పద్మావతి ఆత్మాహుతి చేసుకుంటుంది.
పద్మావతి పాత్ర మరికొన్ని కావ్యాల్లోనూ కనిపిస్తుంది. ఆమె తల్లిదండ్రుల పేర్లు, భర్త పేరు ఒక్కో కావ్యంలో ఒక్కోలా వున్నాయి. అయితే ఈ కావ్యాలు అన్నింటిలోనూ వున్న ఒక సామాన్యాంశం ఏమంటే అల్లావుద్దీన్ ఎన్నడూ పద్మావతిని ప్రత్యక్షంగా చూడలేదు. ఆమె ప్రతిబింబాన్ని ఒకసారి అద్దంలో చూశాడని కొన్నింట్లో వున్నప్పటికీ పరపురుషుడికి అలా కనిపించడం కూడా ఇష్టంలేని పద్మావతి ఆ అద్దాన్ని పగలగొట్టేసిందని మరి కొన్ని కావ్యాల్లో వుంది. ముస్లిం చక్రవర్తులకు పరస్త్రీ వ్యామోహం ఎక్కువనీ, హిందూ స్త్రీలకు ప్రాణంకన్నా శీలం ఎక్కువని చెప్పే కథ ఇది.
కథలోవున్న ‘లవ్ జిహాద్’ వంటి అంశ హిందూత్వ ప్రచారానికి అనుకూలంగా వున్నప్పుడు సంఘ్ పరివారం అభ్యంతంరం పెట్టడం దేనికీ? అనే సమంజసమైన సందేహం ఎవరికైనా రావచ్చు. పద్మావతి
సినిమా గుజరాత్ ఎన్నికలకు ముందే వచ్చి వుంటే సంఘ్ పరివారం దాన్ని భుజాల మీద మోసి వుండేది.
ఎన్నికల తరువాత వస్తున్నది గాబట్టి దాన్నో
వివాదంగా మారుస్తోంది.
హిందూ సమాజానికి భౌతికంగాగానీ, సాంస్కృతికంగాగానీ ముప్పు వచ్చినపుడు కాపాడగలిగేది తాను మాత్రమే అని అనుక్షణం చెప్పుకోవడం సంఘ్ పరివారానికి అవసరం. ముప్పు ముంచుకు వస్తున్నదనే వంకతో హిందూ సమూహాలని సమైక్యంగా తన శిబిరంలో వుంచి నమ్మకమైన ఓటు బ్యాంకును ఏర్పరచుకోవాలనేది దాని వ్యూహం. దానికోసం అది తరచూ ఒక శత్రువును తానే కల్పించి ప్రచారంలో పెడుతుంది. ఏదేశంలో అయినా అధిసంఖ్యాక సమూహం అల్పసంఖ్యాక సమూహాన్ని అణిచివేస్తుంటుంది. మన దేశంలో సంఘ్ పరివారం దీనికి విరుధ్ధమైన వాదనని ప్రచారంలో పెడుతుంటుంది. అల్పసంఖ్యాక సమూహం వల్లనే అధిసంఖ్యాక సమూహానికి ముప్పు వుందని అంటుంది. ఇలాంటి బూటకపు ప్రచారం నుండే అధిక సంఖ్యాక సమూహ ఉగ్రవాదం పుడుతుంది.
కథ ప్రకారం వాళ్ళిద్దరు ఒక్కసారి కూడా తారసపడనప్పటికీ, అల్లావుద్దీన్ వూహల్లో పద్మావతితో యుగళ గీతం ఒకదాన్ని సినిమాలో పెడుతున్నారని ప్రచారం మొదలయ్యింది. దానితో, షూటింగ్ మొదలయిన రోజే వివాదం రాజుకుంది. శ్రీ కర్నీ రాజ్ పుత్ సేన రంగ ప్రవేశం చేసి పద్మావతి షూటింగ్ ను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. మొదట్లో క్షత్రీయ స్వచ్చంద సంస్థల వ్యవహారంగా కనిపించిన ఈ వివాదం గుజరాత్ ఎన్నికలు సమీపించడంతో బాహాటంగా రాజకీయ రూపం సంతరించుకుంది. పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్
లీలా భన్సాలీ,
నాయిక
దీపిక పదుకొనేల తలలు నరికిన వాళ్ళకు పది కోట్ల రూపాయల బహుమానం ఇస్తానని హర్యాణ బీజేపి అధికార ప్రతినిధి సూరజ్ పాల్ ఆమూ ప్రకటించారు. ఇప్పటి వరకు ఇస్లాం మతగురువులే ఆటవిక ఫత్వాలను జారీ చేస్తారనే ప్రచారం వుండేది. ఇప్పుడు హిందూ పెద్దలు సహితం అంతకన్నా పెద్ద ఫత్వాలు జారీ చేస్తారని ప్రపంచానికి తెలిసింది.
సాధ్యమయినన్ని విధాలా, సాధ్యం కానన్నివిధాలా ఈ సినిమాను ముస్లింలతో ముడిపెట్టేశారు. ముంబాయి డాన్ దావూద్ ఇబ్రాహీం దీనికి తెరవెనుక నిర్మాత అని మరో ప్రచారం సాగించారు. దావూద్ ఇబ్రాహీం దుబాయ్ లో కూర్చొని భారత దేశం లోనికి వందల కోట్ల రూపాయలు రహాస్యంగా పంపిస్తున్నాడంటే అది నరేంద్ర మోదీ పాలన చేతగానితనానికి రుజువు అవుతుందన్న ఇంగితం కూడా వీళ్ళకు లేకుండా పోయింది!.
మన చరిత్రను వలస పాలకులు రాశారని ఒకపక్క విమర్శిస్తూనే దానినే ప్రామాణికంగా తీసుకోవడం ఏం విలువా? పద్మినీ-అల్లావుద్దీన్ కథ సినిమాగా రావడం ఇదేమీ మొదటిసారి కాదు. 1930లలో ఇది తొలిసారి ‘కామోనార్ ఆగున్’ పేరుతో మూకీ సినిమాగా వచ్చింది. 1963లో చిత్తూరురాణి పద్మినీ పేరుతో తమిళంలో నిర్మించిన సినిమాలో వైజయంతిమాల, శివాజీ గణేశన్ నటించారు. 1964లో మహారాణి పద్మినీ పేరుతో నిర్మించిన హిందీ సినిమాలో అనిత గుహ, సజ్జన్, జైరాజ్ నటించారు.
1980లలో శ్యామ్ బెనగల్ నిర్మించిన దూరదర్శన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్
26వ ఎపిసోడ్ లో పద్మినీ-అల్లావుద్దీన్ ల కథ వుంటుంది. 2009లో సోనీ టీవీ చిత్తూర్ కి రాణి పద్మినీ కా జోహూర్ అనే సీరియల్ ను ప్రసారం చేసింది.
1960ల నాటి తెలుగు పాఠ్యపుస్తకాల్లో పద్మినీ-అల్లావుద్దీన్ కథ వుండేది. అప్పుడెప్పుడూ లేని వివాదం ఇప్పుడు ఎందుకు రాజుకుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం కనిపిస్తోంది. అదేమంటే అప్పుడు గుజరాత్ ఎన్నికలు లేవు!.
ఎన్నికలకు ముందు అధికార ప్రతిపక్షాలు రెండు రకాల ప్రచారాన్ని సాగిస్తాయి. తమను గెలిపిస్తే చేపట్టబోయే పథకాలు, సంస్కరణల్ని ప్రతిపక్షాలు చెప్పుకుంటాయి. తాము పాలనలో చేపట్టిన పథకాలు, సంస్కరణల్ని అధికారపక్షాలు చెప్పుకుంటాయి. అలా చెప్పుకోదగ్గ పథకాలు, సంస్కరణలు అధికారపక్షం దగ్గర లేనపుడు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి గద్దెను కాపాడుకోవాలనుకుంటాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దు, జీయస్టీ పథకాలను సామాన్యప్రజలు మెచ్చుకునే స్థితిలో లేరు. మోదీ అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలపై అధికార పార్టీలోనే
తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటప్పుడు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చ గొట్టడంతప్ప మరో మార్గం లేదని మోదీ శిబిరం భావిస్తోంది.
సంఘ్ పరివారం దృక్పథంలోనే ఎప్పుడూ అలాంటి ద్వంద్వత్త్వం వుంటుంది. రోజుకో మాట మారుస్తుంది. భారతదేశం పేరును హిందూదేశంగా మార్చాలని కొన్ని రోజులు అది ఆందోళనలు చేస్తుంది. దానితో, అంబేడ్కరిస్టులు హిందూత్వ మీద దాడి మొదలెడతారు. దానితో అది విచిత్రంగా అసలు హిందూమతం అనేదేలేదనీ అది పర్షియన్లు పెట్టిన తిట్టు పేరు అని ప్రకటిస్తుంది. తమది కులాలు లేని వైదీకులం అంటుంది. హర్యాణ, రాజస్థాన్ లలో పరువు హత్యల్ని వెనకేసుకు వస్తూనే వుంటుంది. ఒకరోజు చాతుర్వర్ణ వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెపుతుంది. మరునాడు దళితులు, ఆదివాసుల్ని హిందువులేనంటూ కలుపుకుంటుంది. దళితులనే పేరు కమ్యూనిస్టులు పెట్టారని నిందిస్తుంది. ఒకరోజు ఈ దేశంలో పుట్టినవారందరూ హిందువులే అని ప్రకటిస్తుంది. మరునాడే, ముస్లింలు, క్రైస్తవుల్ని పరాయివాళ్ళు అంటుంది. వాళ్ళు హిందూవులుగానైనా మారాలి లేకుంటే వేరే దేశానికి పోనైనా పోవాలి అంటుంది. అరెస్సెస్ కేంద్ర కార్యాలయంలో ఏకంగా యాభై యేళ్ళు త్రివర్ణ పతాకాన్ని ఎగురేయకుండా వుంటుంది. సినిమాహాళ్ళలో త్రివర్ణపతాకం ఎగురుతుంటే లేచి నిలబడనివాళ్ళని దేశద్రోహులు అంటుంది. త్రివర్ణ పతాకాన్ని తీవ్రంగా విమర్శించిన సంస్థ కూడా ఆరెస్సెస్సే. ఏమరుపాటున ఏ ముస్లిం వల్లనో త్రివర్ణపతాక గౌరవానికి భంగంకలిగితే దాన్నీ దేశద్రోహమంత నేరంగా చిత్రించేదీ ఇదే. ముక్కోటి దేవతల్లో ఎవరినయినా పూజింవ్చుకునే స్వేచ్చ హిందూమతంలో వుందని గుర్తుచేస్తూ అదే ధార్మిక ప్రజాస్వామ్యం అని చెప్పేదీ ఇదే. ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనేవి విదేశీ భావనలు అని ద్వేషించేదీ ఇదే. ఎప్పటికి ఏది అవసరం అనుకుంటే అప్పుడు అది ఉంది అని చెప్పడానికి రెడీమేడ్ ఆధారాలు ఏ మతంలో కన్నా అధికంగా హిందూమతంలో ఉన్నాయి. ఇన్ని మాటలు ఎందుకు మారుస్తోందని ఎవరికయినా సందేహం రావచ్చు. హిందూ ఓటు బ్యాంకును పదిలంగా వుంచడానికి ఎన్ని మాటలు మార్చిన తప్పుకాదనే తత్త్వం దానిది.
ఇటీవల ఒక రెస్టారెంట్ లో ఒక విచిత్ర సంభాషణ విన్నాను. ముస్లిం రాజుల దాడులవల్లనే హిందూ
సమాజంలో సతీసహగమనాలు మొదలయ్యాయని ఒకతను గట్టిగా వాదిస్తున్నాడు. పద్మావతి కథ అతనికి అలా ఉపయోగపడింది!.
మహాభారతం వంటి పురాణ కాలంలోనే సతీసహగమన ఆచారం వుందికదా!.
అంతకన్నా
ముందే ముస్లింలు భారత ఉపఖండంలో వున్నారా? అని అడుగుదా మనుకున్నాను. కుదరలేదు.
గుజరాత్ ఎన్నికలు ముగియగానే పద్మావతి వివాదం ముగిసిపోతుంది. ఇప్పుడు రోడ్ల మీదికొచ్చి తలలు తీస్తామంటున్నవారు సహితం టిక్కెట్టుకొని సినిమా చూసి తరిస్తారు!. ఆతరువాత సంఘ పరివారం ఈ వివాదాన్ని వదిలేసి ఇంకో వివాదాన్ని పట్టుకుంటుంది.
వివాద సాంప్రదాయం
కొనసాగుతుంది!.
(రచయిత సమాజ విశ్లేషకులు)
24 నవంబరు 2017
పద్మావత్‌పై కర్ణిసేన ప్రశంసలు!
ReplyDeleteUpdated : 03-Feb-2018 : 12:16
నిన్నటివరకు `పద్మావత్`ను తీసిన సంజయ్ లీలా భన్సాలీని, నటించిన దీపికా పదుకొనేలను చంపేస్తామని బెదిరించిన కర్ణిసేన ఆందోళనకారులు యూటర్న్ తీసుకున్నారు. `పద్మావత్` సినిమా విడుదలైతే ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించిన వారు..ఆ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. శుక్రవారంనాడు ఈ సినిమాను ముంబైలో కొంతమంది కర్ణిసేన సైనికులు చూశారు. అనంతరం ఈ సినిమాపై తమ ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ప్రకటించారు.
`సినిమాలో రాణి పద్మినీ, అల్లావుద్దీన్ ఖిల్జీల మధ్య అభ్యంతరకర సన్నివేశాలేం లేవు. నిజానికి ఈ సినిమాలో రాజ్‌పుత్‌ల చరిత్రను చాలా గొప్పగా చూపించారు. `పద్మావత్` చూశాక ప్రతీ రాజ్‌పుత్ గర్వపడతాడు. అందుకే ఆందోళనలను విరమిస్తున్నాం. రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఈ సినిమా విడుదలకు సహాయపడతామ`ని కర్ణిసేన ముంబై అధ్యక్షుడు యోగేంద్ర కటార్ మీడియాకు వెల్లడించారు.