Can Justice be Done to Rohingyas?
రోహింగ్యాలకు న్యాయం జరిగేనా?
- - డానీ
ప్రవేశిక
మయన్మార్, బంగ్లాదేశ్, ఇండియా, దేశాలనేకాక ఐక్యరాజ్య సమితిని సహితం కుదిపేస్తున్న
అంశం రోహింగ్యాలు. రోహింగ్యాలు తమ దేశ పౌరులు కాదని మయన్మార్ ప్రభుత్వం అంటున్నది.
రోహింగ్యాలు చొరబాటుదార్లని భారత ప్రభుత్వం అంటున్నది. ఇంతకీ ఎవరీ రోహింగ్యాలు?. రోహింగ్యాల చరిత్ర గురించి
పది అంశాలు.
1.
రోహింగ్యాలు మయన్మార్ పశ్చిమ దిక్కున, రఖైన్ రాష్ట్రంలో బంగాళాఖాతం తీరప్రాంత ప్రజలు. 2016 అంచనా ప్రకారం వీరి జనాభా పది
లక్షలు.
తీర ప్రాంత ప్రజలు కనుక చేపల వేట, వ్యవసాయం వీరి ప్రధాన జీవనాధారం.
2.
రఖైన్ అనేది పాళీభాష పదం రక్షపుర నుండి పుట్టింది. రోహింగ్యాలు ఇండో-ఆర్యన్ తెగకు చెందినవారని
నృశాస్త్రవేత్తలు చెపుతుంటారు. పాళీ భాష అనుబంధం ద్వార ఇప్పటి బీహార్, ఝార్ఖండ్ ప్రాంతం నుండి వీళ్ళు
అక్కడికి వెళ్ళారని ఒక సిధ్ధాంతం వుంది.
3.
రఖైన్ రాష్ట్రంలో కలదాన్, మాయూ, లే మ్రో నదులు సముద్రంలో కలిసే
ప్రాంతంలో రోహింగ్యాలు ఎనిమిదవ శతాబ్దం నుండి నివశిస్తున్నట్టు చారిత్రక
ఆధారాలున్నాయి.
4.
మయన్మార్ ను గతంలో
బర్మా అన్నట్టు రఖైన్ రాష్ట్రాన్ని గతంలో అరకాన్ అనేవారు. అరకాన్ రాజులు 7వ శతాబ్దంలో ఉత్తరాన ఇప్పటి
బంగ్లాదేశ్ వరకు విస్తరించి పాలించారు. తాము అరకాన్ మూలవాసులమని రోహింగ్యాలు
ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. పదవ శతాబ్దంలో తంజావూరును
రాజధానిగా చేసుకుని పాలించిన చోళ రాజులు తమ రాజ్యాన్ని బర్మా వరకు విస్తరించారు.
అప్పటి చోళ రాజ్యంలో అరకాన్ కూడా వుంది. రఖైన్ ప్రాంతం భారత
ఉపఖండానికీ, ఆగ్నేయాసియాకూ మధ్య చాలా కాలం స్వతంత్ర దేశంగా కొనసాగింది.
5.
రఖైన్ రాష్ట్ర రాజధాని సిట్వే పెద్ద రేవు పట్టణం. కలదాన్, మాయూ, లే మ్రో నదులు బంగాళా ఖాతంలో కలిసే చోటూ ఇదే. సిట్వే అంటే బర్మీస్ భాషలో యుధ్ధభూమి అని అర్ధం. 15వ శతాబ్దం ఆరంభం నుండి 18వ శతాబ్దం చివరి వరకు దాదాపు
నాలుగు వందల సంవత్సరాలు ఇప్పటి బర్మాలోని
రఖైన్ ప్రాంతం, ఇప్పటి బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ప్రాంతం కలిసి మ్రావుక్- ఊ అనే రాజ్యంగా వుండేవి. బర్మారాజు బోద్వపాయ 1784లో మ్రావుక్-ఊ రాజ్యంపై దండెత్తి
ఆక్రమించుకున్నాడు. అయితే, ఆ విజయం అతనికి అంత సులువుగా దక్కలేదు. రఖైన్ రక్షణ దళాలు కలదాన్ నది ముఖద్వారం వద్ద బర్మా సైన్యాలను ఎదుర్కొని
భీకర పోరాటం చేసి దాదాపు ఓడించినంత పనిచేశాయి. రఖైన్ రక్షణ దళాల పోరాట పటిమ
తూర్పు బర్మా వాసుల మీద చెరగని ముద్ర వేసింది. రఖైన్ ప్రాంతాన్ని తమ రాజ్యంలో
కలుపుకున్నప్పటికీ అక్కడి రోహింగ్యాలను తూర్పు బర్మా వాసులు “బెంగాలీలు” అని తిట్టు అర్ధంలో వాడుతుంటారు. బంగాళాఖాతం తీరాన బెంగాలీ అనేది
తిట్టుగా మారడం ఒక వైచిత్రి! కొందరు వాళ్లని అరకనీ-ఇండియన్స్ అంటారు.
6.
ప్రపంచంలో ఏ
నగరానికీ లేనట్టు బంగ్లాదేశ్ లోని చిటగాంగ్ రేవు నగరానికి ఓ డజనుపేర్లు వుంటాయి. దానిని బట్టి ఎప్పుడెప్పుడు ఏఏ సామ్రాజ్యాలు ఎటు నుండి ఎటుకు విస్తరించాయో
అర్ధం చేసుకోవచ్చు. చిట్టగాంగ్
కు ఆనుకుని రఖైన్ రాష్ట్రం తీరప్రాంతం వుంటుంది. చిటగాంగ్
ఎదుర్కొన్న చారిత్రక సంక్షోభాలన్నింటినీ రోహింగ్యాలు ఎదుర్కొన్నారు.
7.
మతపరంగా రోహింగ్యాల్లో అత్యధికులు ఇస్లాం మతాన్ని
స్వీకరించినప్పటికీ వాళ్ళల్లో హిందువులు, క్రైస్తవులు కూడా వున్నారు. వీలయితే వాళ్ళు బౌధ్ధమతాన్ని కూడా
స్వీకరించేవారేమోగానీ, మయన్మార్ బౌధ్ధ గురువులు వాళ్ళకు పూర్తి వ్యతిరేకంగా
వున్నారు. రోహింగ్యా
అనగా ‘దైవ కృప గలిగిన వారు’ అనే అర్ధం కుడా
వుంది. రహమ్ అంటే
పర్షియన్ భాషలో దయ అని అర్ధం.
8
రెండవ
ప్రపంచ యుధ్ద కాలంలో మిత్రపక్షాల బర్మా క్యాంపెయిన్ యుధ్ధవిమాన స్థావరం చిట్టగాంగ్
లోనే వుండేది. అగ్నేయాసియా దేశాల్లో చమురు సహజవావువుల (హైడ్రో కార్బన్స్) నిక్షేపాలు అత్యధికంగా వున్న దేశం
బర్మా. 1795లోనే మ్యాగ్ వే రాష్ట్రంలోని ఏనాన్ గ్యావుంగ్ పట్టణం పరిసరాల్లో భారీ చమురు
నిక్షేపాలు బయటపడ్డాయి. 1853లో బర్మా చమురు ఎగుమతిని ఆరంభించింది. మ్యాగ్ వే రాష్ట్ర చమురు సిట్వే
ఓడరేవుకు చేరాలంటే రఖైన్ రాష్ట్రం మీదుగానే రవాణా జరగాలి. అదే అతి దగ్గరి భూమార్గం. బర్మాకు 1948లో స్వాతంత్రం వచ్చే నాటికి రఖైన్ ప్రాంతం
వ్యూహాత్మకంగా కీలకంగా మారింది. ఆ ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా
వుంచాలన్న స్థానికుల కోరికను బర్మా నాయకులు ఒప్పుకోలేదు.
9.
1970వ దశకంలో ప్రపంచ మార్కెట్ లో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 1973లొ 20 డాలర్లున్న చమురు
ధర 1974లో ఒక్క సారిగా 50 డాలర్లకు పెరిగింది. 1980 ఏప్రిల లొ 120 డాలర్లకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో బర్మాలో కొత్త చమురు నిక్షేపాల
కోసం అన్వేషణ మొదలయింది. మయన్మార్ లోని కలదాన్, మాయూ, లే మ్రో నదుల బేసిన్లో అపార చమురు, సహజవాయువు నిక్షేపాలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకోవడానికి అంతర్జాతీయం చమురు కంపెనీ
(ఐవోసీ)లు మయన్మార్ లో వాలిపోయాయి. ఇక అభివృధ్ధి పేరిట సిట్వే
ప్రాంతంలో భారీ విధ్వంసమే సాగింది. సిట్వే ప్రాంతం నుండి రోహింగ్యాలను తొలగించి ఆ భూముల్ని
అంతర్జాతీయ చమురు కంపెనీలకు ధారాదత్తం చేయయాలని మయన్మార్ సైనిక నియంతృత్త్వ ప్రభుత్వం తలపెట్టింది. దానికోసం అనేక కుట్రలు పన్నింది. 1982లో ఏకంగా రోహింగ్యాల
పౌరసత్వాన్ని రద్దుచేస్తూ చట్టాన్ని మార్చేసింది.
బర్మా ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ చట్టం 1935లో అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో ప్రవేశపెట్టిన నూరెంబర్గ్ చట్టం వంటిది. ఈ చట్టం 135 స్థానిక పురాతన తెగలను పౌరులుగా
గుర్తించి రోహింగ్యాలను వదిలివేసింది. అప్పటి వరకు రోహింగ్యాలు రాష్ట్ర శాసన సభలకు, పార్లమెంటుకు కూడా పోటీ చేసి
గెలిచిన సందర్భాలున్నాయి. వాళ్ళలో కొందరు మంత్రి పదవుల్ని కూడా నిర్వర్తించారు. పౌరసత్వాన్ని నిరాకరించడం అంటే
రోహింగ్యాలకు భూమి మీద యాజమాన్య హక్కు లేకుండా చేయడమే. అంతేగాక వాళ్ళు ఇతర తెగల్ని
పెళ్ళి చేసుకోరాదనీ, స్వంత తెగలో పెళ్ళి చేసుకోవడానికైనా, పిల్లల్నికనడానికైనా, చదువుకోవడానికైనా, పనిలో
చేరాలనుకున్నా తప్పనిసరిగా ప్రభుత్వ
అనుమతి తీసుకోవాలనీ అమానుష నిబంధనలు విధించింది. మరోమాటల్లో చెప్పాలంటే బర్మా పౌరసత్వ చట్టం దేశంలో ఒక జాతి నిర్మూలనకు నాందీ పలికింది.
10.
మయన్మార్ లో సైనిక పాలనను
వ్యతిరేకించి, సుదీర్ఘ కాలం నిర్బంధంలో గడిపిన అంగ్ సాన్
స్యూ కీ ఒక దశలో ప్రజాస్వామిక ప్రవక్తలా కనిపించారు. ఆమెను 1991లో నోబెల్ శాంతి బహుమతి కూడా
వరించింది.
మయన్మార్ సైనిక ప్రభుత్వం 2008లో ఆమోదించిన మూడవ రాజ్యాంగంలో విదేశీయుల్ని
పెళ్ళి చేసుకున్నవాళ్ళుగానీ, విదేశీ సంతానం కలిగివున్నవారూగానీ రాజ్యాంగ పదవుల్ని
చేపట్టరాదని ఒక షరతు పెట్టింది. అప్పట్లో
ప్రతిపక్షనేత్రిగా వున్న అంగ్ సాన్ స్యూ కీ భవిష్యత్తులో ఎన్నికల ద్వార అధికారాన్ని
చేపట్టకుండా కట్టడి చేయడం కోసం పెట్టిన క్లాజు అది. సు కీ బ్రిటీష్ చరిత్రకారుడు
మైఖేల్ వి ఆరిస్ ను 1972లో వివాహమాడారు. ఆమె పిల్లలు బ్రిటీష్ పౌరులుగా పెరిగారు. రాజ్యాంగంలోని ఈ క్లాజ్ ను
సహజంగానే సూ కీ తీవ్రంగా వ్యతిరేకించారు. రాజ్యాంగానికి
సవరణలు తెస్తాననీ, రోహింగ్యాల పౌరసత్వాన్ని పునరుధ్ధరిస్తాననీ సూ కీ అప్పట్లొ ప్రచారం చేశారు.
2012 ఉప ఎన్నికల్లో సూ కీ నాయకత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ ఎల్ డి) పార్లమెంటులో ప్రవేశించింది.
2015 సాధారణ ఎన్నికల్లో ఎన్ ఎల్ డి 86 శాతం సీట్లను కైవశం చేసుకుని
తిరుగులేని విజయాన్ని సాధించింది. రాజ్యాంగం ప్రకారం ఆమె ప్రధాని పదవిని చేపట్టే అవకాశం
లేకపోవడంతో స్టేట్ కౌన్సిలర్ అనే తత్సమాన పదవి ఒకదాన్ని కొత్తగా
సృష్టించి ప్రభుత్వాధినేత్రిగా పరిపాలన
చేపట్టారు.
గతంలో సూ కీ చెప్పిన ప్రజాస్వామిక విలువలు, శాంతి భాష్యాలు అన్నీ గాలికి
ఎగిరిపోయాయి. పదవి మహాత్యమో ఏమిటోగానీ సూ కీ యూనిఫాంలేని నియంతగా
మారిపోయారు. ఐవోసీల వత్తిడికి లొంగి రోహింగ్యాల పౌరసత్త్వాన్ని
పునరుధ్ధరించే పనిని పక్కన పడేయడమేగాక
ఏకంగా వాళ్ళ జాతినిర్మూలన యాగాన్ని తలపెట్టారు. ఆ విషయం బయటి దేశాలకు తెలియకూడదనే
తలంపుతో రోహింగ్యాలను దేశ సరిహద్దులు దాటక ముందే చంపి భూమిలో పూడ్చివేయడానికి
సైన్యానికి సకల అధికారాలు ఇచ్చారు. వాయువ్య
మయన్మార్ లో రోహింగ్యాలుండే బుథిదావుంగ్, రథిదావుంగ్, మావుంగ్ దా మండలాల్లో జనావాసాలపై
అంగ్ సాన్ స్యూ కీ ఏకంగా రాకెట్
లాంచర్లను ప్రయోగిస్తున్నది.
ఇతరదేశాలకు వెళ్ళి అక్కడి భద్రతాదళాల చేతుల్లో చావడంకన్నా
స్వదేశంలో స్వదేశీ సైనికుల చేతుల్లోనే చనిపోవడం మేలని రోహింగ్యా శరణార్ధులు
భావిస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి శరణార్ధుల సంస్థ అధికార ప్రతినిధి ఆంద్రూస్ మెహసిక్
ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రోహింగ్యాలు మాతృభూమి ఒడిలో బతకాలనుకున్నారు. సూ కీ రోహింగ్యాలకు మాతృభూమి
ఒడిలోనే మృత్యువును ప్రసాదిస్తున్నారు! ఇప్పుడు రోహింగ్యాలు కూడా మాతృభూమి ఒడిలోనే చనిపోవాలను కుంటున్నారు.
ముగింపు
మనం తరచూ నృశాస్త్ర కీలక సూత్రం ఒకదాన్ని మరిచిపోతుంటాం. ఈ భూమ్మీద తొలిమానవుడు ఎక్కడో
ఒకచోట పుట్టి వుంటాడు. అక్కడి నుండి మానవజాతి అన్నివైపులకూ విస్తరించి వుంటుంది. విస్తరించడం అంటే వలసపోవడడమే. సమాజశాస్త్రంలో దీన్ని అడ్డ చలనం (Horizantal
Mobility) అంటారు. 28 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు ఇప్పటి ఆఫ్రికాఖండపు
ఇథియోపియా ప్రాంతంలో ఆవిర్భవించి వుంటాడని ఒక అంచన వుండేది. డెభ్భయి లక్షల
సంవత్సరాల క్రితం ఇప్పటి యూరప్ లోని బల్గేరియా, గ్రీస్ ప్రాంతంలో తొలి మానవుడు
సంచరించాడని ఇటీవల కొత్తగా కనుగొన్నారు. సంవత్సరాల విషయంలో తేడాలున్నా ఒకటి మాత్రం వాస్తవం; ఇప్పుడు ప్రపంచంలోని అన్ని
దేశాల్లోనూ నివశిస్తున్నది వలసవచ్చినవారే. ఎవరు ముందు వచ్చారు? ఎవరు తరువాత వచ్చారు? అనేది ఒక్కటే తేడా. ముందు వచ్చినవాళ్ళు తరువాత
వచ్చినవాళ్ళను పరాయివాళ్ళు అంటారు. అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న జాతి ఘర్షణలకు
మూలం.
(రచయిత సమాజ విశ్లేషకులు)
మొబైల్ 9010757776
హైదరాబాద్
23 అక్టోబరు 2016
ప్రచురణ :
ఆంధ్రజ్యోతి దినపత్రిక , 26 అక్టోబరు 2016
No comments:
Post a Comment