Monday, 28 May 2018

Iftar and the Unity of Muslims and Dalits


దళితులతో ముస్లింల ఇఫ్తార్ !

ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) ఇప్పుడొక సాంఘీక శక్తి.  ఏడాది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  ‘అణగారిన సమూహాల ఆత్మగౌరవ సదస్సులు’ నిర్వహిస్తున్న ఎంటీఎఫ్,  మే 15నాటి కాకినాడ సదస్సులో ముస్లింలు దళితులు కలిసి ఇఫ్తార్ విందులు జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఇలాంటి పిలుపుల్ని దిగువ స్థాయి శ్రేణులు అర్ధం చేసుకుని ఆచరించడానికి సహజంగానే కొంత సమయం పడుతుంది. అయితే, ఎంటీఎఫ్ నిర్వాహకులు ఊహించినదానికన్నా  వేగంగా ఈ పిలుపు వుభయ సామాజిక శ్రేణుల్లోనికి చొచ్చుకునిపోయింది. ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ జోసెఫ్ థామస్ కౌటో ఆందోళన వ్యక్తం చేసినట్టు దేశంలో ఒక ‘సంక్షుభిత వాతావరణం’ కమ్ముకుని వుండడం కూడా ఈ వేగానికి  కారణం కావచ్చు.  కష్టకాలంలో మనుషులు ఏకం అవుతారు!.

సుర్యోదయానికి ముందే ఆరంభించి సూర్యాస్తమయం ముగిసే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కఠిన  ఉపవాసం చేసే ముస్లింలు ప్రతిరోజూ లాంఛనంగా తమ దీక్షను విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. ఎండలు మండిపోతున్న ఈ ఏడాది ఉపవాస దీక్షా సమయం  ఏకంగా 17 గంటలు.  ఉపవాస దీక్ష చేసేవారికి తొలి ఆహారాన్ని అందించడం గొప్ప పుణ్యకార్యంగా ముస్లింలు భావిస్తారు. దీక్ష విరమణ్స చేస్తున్న వారికి (అన్నార్తులకు) తమ శక్తి మేరకు ఒక పండునో, పలహారాన్నో ప్రేమతో అందిస్తారు.

ముస్లిమేతరులు సహితం ఇఫ్తార్ విందులు నిర్వహించే సాంప్రదాయం చాలా కాలంగా వుంది. గవర్నర్లు, ముఖ్యమంత్రులు వున్నతాధికారులు మొదలు కొన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, వృత్తిసంఘాలు, వాణిజ్యసంఘాలు కూడా ఇఫ్తార్ విందులు నిర్వహించి మతసామరస్యాన్ని చాటుకుంటుంటాయి. ముస్లింలు దళితులతో కలిసి ఇఫ్తార్ విందులు జరుపుకోవాలనేది సామాజికంగా ఒక కొత్త ఆలోచన.

ఎంటీఎఫ్ పిలుపుకు ముందుగా స్పందించింది కాకినాడ రేచర్లపేటకు చెందిన షెడ్యూల్డ్ కాస్ట్స్ సమాజం. అక్కడి దళిత బహుజన మిత్రులు నగరంలోని ముస్లింలకు ఇఫ్తార్  విందు ఇవ్వడమేగాక, నమాజ్ కూడా నిర్వహించారు. ఆ ప్రేరణతో హిందూపురంలో దళిత, బహుజన, ముస్లింలు ఇఫార్ విందులు నిర్వహించారు. గుంటూరులోనూ అలాంటి సన్నాహాలు సాగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది.  సాలార్ జంగ్ మ్యూజియం పక్కన వుండే మినార్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో   రెయిన్ బో షాపింగ్ ఫెస్టివల్ నిర్వాహకులు  రంజాన్ నెల ముఫ్ఫయి రోజులూ ఇఫ్తార్ విందు జరుపుతుంటారు. వీటికి అతిథిగా మే 22న ప్రముఖ దళిత నాయకురాలు, రచయిత్రి అరుణ గోగులమండను ఆహ్వానించారు.

సంకుచిత  స్వభావం కలిగినవారు అన్ని రంగాల్లోనూ వుంటారు; రాజకీయాల్లో కొంచెం ఎక్కువగా వుంటారు. వాళ్ళు ఇప్పుడు  ముస్లిం దళిత ఐక్యతను ఒక సంకుచిత  రాజకీయ అవకాశవాదంగా చిత్రించే వీలు లేకపోలేదు. ఇప్పుడు జరుగుతున్నది ముస్లిం దళిత ఐక్యతల పునరుధ్ధరణ మాత్రమే. నిజానికి ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) కాలంలోనే ఇలాంటి ఐక్యతకు  పునాదులు పడ్డాయి. తొలి మసీదును నిర్మించి తొలి అజా (నమాజ్ కు పిలుపు) ఇచ్చే  మహత్తర అవకాశాన్ని నల్లజాతీయులకు చెందిన పూర్వబానిస అయిన హజ్రత్ బిలాల్ గారికి ఇచ్చినపుడే, ప్రవక్త ముహమ్మద్, ఒక సాంఘీక విప్లవానికి నాందీ పలికారు. ఆ సాంప్రదాయమే ప్రపంచ వ్యాప్తంగా అన్నార్తుల్ని, అణగారిన సమూహాలనీ ఇస్లాంకు దగ్గర చేసింది; చేస్తున్నది. 

కార్ల్ మార్క్స్ 1848లో “శ్రామికులకు రాజ్యాధికారం కావాలి” అని ప్రకటించాడు. సరిగ్గా అదే సంవత్సరం భారత దేశంలో జ్యోతిరావ్   గోవిందరావ్ ఫూలే “శ్రామిక కులాలకు రాజ్యాధికారం కావాలి” అని ప్రకటించాడు. ఆ ఏడాది అణగారిన కులాల బాలికల కోసం స్వగ్రామంలో ఒక చిన్న పాఠశాలను ఏర్పాటు చేసినందుకు ఫూలేను సొంత కులస్తులే వెలివేశారు. అప్పుడు మహాత్మా ఫూలేను  ఆదుకున్నది, ఆశ్రయం ఇచ్చిందీ, స్కూలు పెట్టుకోవడానికి తమ ఇంటిని ఇచ్చింది, ఫూలే జీవిత భాగస్వామి సావిత్రీ బాయి ఫూలేతో కలిసి పాఠశాల నడిపిందీ మియా ఉస్మాన్ షేక్, ఫాతిమా షేక్ అనే ముస్లిం అన్నాచెల్లెలు.  భారత దేశపు  ఆధునిక విద్యారంగంలో తొలితరం ముస్లిం అధ్యాపకురాళ్ళలో ఫాతిమా షేక్ ప్రముఖులు. ఆవిధంగా,  ఆధునిక భారత సామాజిక ఉద్యమాల తొలి అధ్యాయంలోనే  ముస్లింలకు నిండుగా ఒక పేజీ వుంది!.

దళిత మహానేత బీఆర్ అంబేడ్కర్ కు 1920లలో లండన్ లో బారిస్టర్ చదువు కోసం ఆర్ధిక సహాయాన్ని అందించిన సంఘసంస్కర్త కొల్హాపూర్ సాహు మహారాజ్ కు కూడా ఒక ముస్లిం అనుబంధం వుంది. అతని పూర్వికుడైన ఛత్రపతి సాహూ (శివాజీ మనవడు) 1680-90లలో  మొఘల్ దర్బారులో  చక్రవర్తి ఔరంగజేబ్, అతని కుమార్తె జీనత్ ఉన్నీసాల  ఒళ్ళో  ఒక దత్తపుత్రునిగా  పెరిగినవాడే. (అవును. మీరు విన్నది నిజం!).

అప్పటి వైశ్రాయి లార్డ్ ఇర్విన్ తో ముహమ్మద్ ఆలీ జిన్నాకు వున్న సాన్నిహిత్యాన్ని దౌత్యంగా మార్చిన ఫలితంగానే  బ్రిటీష్ ప్రధానమంత్రి రామ్సే మెక్ డోనాల్డ్ 1929లో రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలెట్టాడు. అణగారిన సమూహాలకు ప్రత్యేక రాజకీయ హక్కులు కావాలని, ఆ సమావేశాల్లో, అంబేడ్కర్ కోరినపుడు (మహాత్మాగాంధీజీ నాయకత్వంలోని)  కాంగ్రెస్‍ ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లిం లీగ్ నాయకులైన సర్ ఆగా ఖాన్ - 3, ముహమ్మద్ ఆలీ జిన్నా ఇద్దరూ  అంబేడ్కర్ కు  గట్టి మద్దతుగా నిలిచారు.

భారత రాజ్యంగ రూపకల్పన బాధ్యతను అంబేడ్కర్ కు మహాత్మా గాంధీయో,  జవహర్ లాల్ నెహ్రూయో  అప్పగించారని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు. నిజానికి అంబేడ్కర్ కు రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశాన్ని కల్పించింది  జిన్నాయే అంటే అతిశయోక్తికాదు. “దళితులు హిందువులుకారు” అని అంబేడ్కర్ ఇచ్చిన పిలుపు కాంగ్రెస్‍ అగ్రనేతలకు రుచించేదికాదు. అది రాజకీయ వైరంగా మారింది. 1946 మార్చి నాటి బొంబాయి  ప్రావెన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో అంబేడ్కర్ నూ, ఆయన పార్టి షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్ సి ఎఫ్)నూ పనిగట్టుకుని చిత్తుగా ఓడించింది కాంగ్రెస్‍. దానితో అంబేడ్కర్ కు రాజ్యాంగ పరిషత్ లోనికి ప్రవేశించే మార్గమే లేకుండాపోయింది.

సరిగ్గా అప్పుడు జిన్నా రంగప్రవేశం చేశారు. ముస్లిం లీగ్ ఆధీనంలోవున్న  తూర్పు బెంగాల్ లోని జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న  తమ పార్టీ అభ్యర్ధి చేత రాజీనామ చేయించారు.  అక్కడి నుండి అంబేడ్కర్ ను  గెలిపించి భారత రాజ్యాంగ పరిషత్తుకు పంపించారు. తన జీవిత కాలం మొత్తంలో అంబేడ్కర్ ఎన్నికల్లో గెలిచిన సందర్భం అదొక్కటే.

అంబేడ్కర్ ను రాజ్యాంగ పరిషత్తుకు పంపించడం  కోసం జెస్సోర్ – ఖుల్నా నియోజకవర్గ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ కూడా ప్రముఖ దళిత నేత. జిన్నా అనుసరించిన మతసామరస్య విధానాలకు ఆయన వీరాభిమాని. పెత్తందారీ కులాల నాయకత్వంలో 1946లో బెంగాల్ లో చెలరేగిన మతకల్లోలాల్లో దళితులు పాల్గొనరాదంటూ మండల్  ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. పాకిస్తాన్ ఏర్పడ్డాక జిన్నా తోపాటూ అక్కడికి వెళ్ళిపోయారు. జిన్నా ఆయన్ను ప్రభుత్వంలో నెంబర్-టూ గా  మార్చారు. భారత ప్రభుత్వంలో అంబేడ్కర్ నిర్వర్తించిన కీలక బాధ్యతలన్నింటీనీ జోగేంద్ర నాధ్ మండల్ పాకిస్తాన్ ప్రభుత్వంలో నిర్వర్తించారు. పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు ఛైర్మన్ గా, న్యాయ, కార్మిక శాఖల మంత్రిగా  పనిచేశారు. కామన్ వెల్త్, కాశ్మీర్ వ్యవహారాలు కూడా జోగేంద్ర నాధ్ మండల్ ఆధీనంలోనే వుండేవి.

“విప్లవం వర్ధిల్లాలి”, “సంపూర్ణ స్వాతంత్రం” వంటి  నినాదాలు భారత జాతియోద్యమ చరిత్రను మహత్తర మలుపు తిప్పినట్టు అందరికీ తెలుసు.  వీటిని రూపొందించిన సుప్రసిధ్ధ ఉర్దూ కవి, జాతియోద్యమ నాయకుడు  మౌలానా హస్రత్  మొహానీ గురించి మాత్రం ఈ తరంలో చాలా మందికి తెలిసివుండకపోవచ్చు.  దళిత్-ముస్లిం ఇఫ్తార్  సాంప్రదాయాన్ని మొదలు పెట్టింది ఆయనే. అంబేడ్కర్ చేతితో ఇచ్చిన నీళ్ళను ముట్టుకోవడానికి కూడా జాతీయోద్యమ మహానాయకులు సహితం వెనుకాడుతున్న కాలం అది. అప్పుడు మౌలానా హస్రత్  మొహానీ ఇఫ్తార్ విందుకు అంబేడ్కర్ ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి ఒకే పళ్ళెంలో ఆయనతో కలిసి భోజనం ఆరగించారు. ఇప్పుడు కొనసాగాల్సింది ఆ సాంప్రదాయమే.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైల్ – 9010757776


రచన : హైదరాబాద్, 23-5-2018
ప్రచురణ :  ఆంధ్రజ్యోతి డైలీ, 30-5-2018
http://www.andhrajyothy.com/artical?SID=585505

2 comments: