Sunday, 22 July 2018

మూకోన్మాదులు నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలుస్తారు.


హైదరాబాద్
23 జూలై 2018
మతవిశ్వాసులు శ్రీరాముడినీ, శ్రీ కృష్ణుడినీ కొలుస్తారు.
మూకోన్మాదులు నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలుస్తారు.

మిత్రులు దివికుమార్ గారికి, 
రామాయణం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న వివాదం మీద మీ రెండు కరపత్రాలు అందాయి. వాటిని నాకు పంపించినందుకు ధన్యవాదాలు.
ప్రపంచమంతటా 18వ శతాబ్దం ఆరంభం వరకూ  దాదాపు అన్ని దేశాల్లోనూ మతమూ, రాజకీయార్ధిక ప్రయోజనాలు కలిసిపోయే వుండేవి. వాల్టేర్ – రూసోలు రంగ ప్రవేశవేశం చేసి వాటిని విడగొట్టారు. మతం, రాజకీయార్ధికం విడిగా వుండడం ఆధునిక భావనలు గా ఇంత కాలం కొనసాగాయి.
అయితే, గొప్పగా ప్రచారం అయిన ఆధునిక భావనలు సహితం సహజవనరుల్ని శూద్రుల నోరుకొట్టి అగ్రవర్ణాలకో, పెత్తందారీ కూలాలకో కట్టబెట్టడం అనే పాత రాజకీయార్ధిక ప్రయోజనాలనే సాధించాయి. అంతకు మించి జరిగింది ఏమీలేదు. దీనికి, హేతువాదులు, నాస్తికులు వర్గ దృక్పశాన్ని నిరాకరించడం ఒక కారణమయితే, వర్గ దృక్పథంగల కమ్యూనిస్టులు భారత సమాజపు ప్రధాన అస్తిత్వమయిన కులాన్ని గుర్తించ నిరాకరించడం  ఇంకో కారణం. అంచేత ఆధునిక భావనలకు 1980ల వరకు వున్న ప్రజాదరణ, విశ్వాసం, ఆమోదాంశం ఇప్పుడు అంతరించిపోయింది. ఆలోచనాపరులు అందరూ  ముందు ఈ వాస్తవాలని గుర్తించాలి.
రాజ్యం గతంలో 85 కాకుల్ని కొల్లగొట్టి 15 గద్దలకు పెట్టేది. ఇప్పుడు ఆశ అత్యాశ దశను దాటి దురాశ దశకు చేరుకుంది. కొల్లగొట్టి కట్టబెట్టే ధర్మం వుధృతి బాగా పెరిగింది. కాకుల సంఖ్య పెరిగింది. గద్దలు సంఖ్య తగ్గింది. ఆక్స్ ఫాం నివేదిక సారాంశం అదే.  దేశంలోని సహజవనరులన్నింటినీ ఆడానీ – అంబానీ తదితర మెగా కార్పొరేట్లకు  కట్టబెట్టేయడానికి   రాజ్యం సిధ్ధమైంది. అమరావతిలో ‘అన్న భోజనం’ పథకం ఏమిటీ? అందరి సంపదను పెంచుతామని నిర్మిస్తున్న రాజధానిలో  పేదల సంఖ్య పెరుగుతున్నదనడానికి  ఇంతకన్నా రుజువు ఏంకావాలీ?
 దేశ జనాభాలో అత్యధికులుగావుంటున్న అణగారిన సమూహాలు ఈ దౌర్జన్యాన్ని ఒప్పుకోవు. వాళ్లను తట్టుకోవడానికీ ఇంతటి అన్యాయాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి   రాజ్యం మతాన్ని కవచంగా వాడుకొంటోంది. 
ఇక్కడే ఒక ధార్మిక విశేషం వుంది. సామాన్య ప్రజలు విశ్వసించేది మతాన్ని; రాజ్యం కవచంగా వాడుతున్నది మతతత్వాన్ని. మనం మతతత్వాన్ని విమర్శించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పదం తేడా వచ్చినా – రాజ్యంకన్నా ముందు -  సామాన్య ప్రజల మత విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతింటాయి. అంటే, మనం సామాన్య ప్రజల్ని రాజ్యం పక్షాన చేరేటట్టు చేస్తున్నామన్నమాట.
అంబేడ్కర్ హిందూమతాన్ని విమర్శించారు. కంచ ఐలయ్య వంటివారు తాము హిందువులం కాదని ప్రకటించుకున్నారు. దాని అర్ధం సాధారణ దళిత బహుజనులు హిందూమతానికి వ్యతిరేకంగా వున్నారని కాదు. ఆ సామాజికవర్గాల్లో అత్యధికులు ఇప్పటికీ హిందూ మత విశ్వాసులు అనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.
ఇక్కడ విమర్శలో భాషాపరమైన వివాదాలు కొన్నున్నాయి. “గుండేలేని మనిషల్లే నిన్ను కొండాకోనకు వదిలేశాడా?” అనడానికీ “దగుల్బాజీ” అనడానికీ “మీ నాన్నగారున్నారా? అనడానికీ నీ యమ్మ మొగుడు వున్నాడా? అనడానికీ వున్నంత తేడావుంది. ఇలాంటి దురుసు పదాలవల మనం మన సహజ మద్దతుదారుల్ని కోల్పోవడమేగాకుండా, మత విశ్వాసుల్ని మతోన్మాద శిబిరాలకు తరలించిన వాళ్ళమవుతాం.  
నిజానికి ఈరోజు మనం చెయ్యాల్సిన పని హిందూమతాన్ని విమర్శించడంకాదు; మతానికీ మతోన్మాదానికీ మధ్యనవున్న వైరుధ్యాన్ని సాధారణ ప్రజలకు వివరించడం. ఏ మత విశ్వాసులతో అయినా మనకు కలిగే నష్టం ఏమిటీ? ఇబ్బంది వున్నది నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలిచేవారితోనేగానీ, శ్రీరాముడినీ, శ్రీకృష్ణుడినీ కొలిచేవారితో మనకేమిటీ ఇబ్బందీ? 

మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. మతవిస్వాసులు, మూకోన్మాదులు-గోగ్రవాదులు ఒకటి కాదు. మతవిస్వాసులు శ్రీరాముడినీ, శ్రీ కృష్ణుడినీ కొలుస్తారు. మూకోన్మాదులు-గోగ్రవాదులు నరేంద్ర మోదీ, అమిత్ షా లను కొలుస్తారు. అందుకే వాళ్ళు స్వామి అగ్నివేశ్ వంటి ఉదారవాద స్వాముల మీద కుడా దాడులు చేస్తున్నారు. 
దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసులు, బహుజనులు మన దేశంలో అణగారిన సమూహాలు.  అణగారిన సమూహాల మధ్య సహజమైన ఐక్యత వుంటుంది. నా వరకు అయితే కారంచేడు ఉద్యమ కాలం నుండి మొదలయినా ఈ ఐక్యత ముస్లిం ఆలోచనాపరుల వేదిక, బహుజన ప్రతిఘటన వేదిక వరకు కొనసాగింది. ఈ భూమ్మీద ఎక్కడయినా సరే అణిచివేతను ఖండించాలనే ఒక సామాజిక విలువ కూడా ఈ ఐక్యత నుండి ఆవిర్భవించింది. రెండు దశాబ్దాల క్రితం వరకూ ట్రాన్స్ జెండర్స్ బాధల గురించి నాకు తెలీదు.; వాళ్ళ మీద గౌరవనీయమైన భావం కూడా లేదు. అయితే, మత మైనారీటీ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాననే అభిప్రాయం నాలో బలపడేకొద్దీ, మైనారిటీ సెక్స్ మీద కూడా సదభిప్రాయం వుండాలనే ఆలోచన కలుగుతోంది.  
మనలోని మతతత్వాన్ని నిర్మూలించనంత వరకు  సమాజంలో ఇతరుల మతతత్వ నిర్మూలన కూడా జరగదని నాకు క్రమంగా అర్ధం అవుతోంది. అలాగే, మనలోని కులతత్వాన్ని నిర్మూలించనంత వరకు  సమాజంలో కులనిర్మూలన జరగదు. అదే విధంగా, మనలోని పెట్టుబడీదారుడ్ని చంపనంత వరకు బయట పెట్టుబడీదారి సమాజ నిర్మూలన కూడా జరగదు.
ఇక్కడ ఇంకో సూక్ష్మ సామాజిక కోణం వుంది.  భారత మెజార్టీ సామాజికవర్గంలోని భిన్న అంతస్తులు  మతవిమర్శపై తమదైన శైలిలో స్పందిస్తాయి. మొదటిది; ఏ అంతస్తులో వున్నవారైనా సరే మత ఔన్నత్యాన్ని చాటినపుడు అంతస్తులన్నీ గొప్పగా ఆస్వాదిస్తాయి. రెండోది; పై అంతస్తులో వున్నవాళ్ళు ఎవరయినా మతాన్ని విమర్శించినపుడు వాళ్ళు నిరాకరించరు పైగా ఆదరిస్తారు. తమ సమూహం  ప్రజాస్వామికమైనదని చెప్పుకోవడానికి అదొక అవకాశంగా భావిస్తారు. మూడోది,  దిగువ అంతస్తుల్లో వున్నవాళ్ళు మతాన్ని విమర్శించినపుడు పై అంతస్తుల్లో వున్నవాళ్ళు అసౌకర్యంగా భావిస్తారు. నాలుగోది;  ఇతర మతస్తులు  తమ మతాన్ని విమర్శించినపుడు అన్ని అంతస్తులవాళ్ళూ అసహనాన్ని ప్రర్శిస్తారు. అందరూ కలిసి దాడులు చేసినా ఆశ్చర్యం ఏమీలేదు. గుజరాత్ మారణహోమంలో నాలుగు అంతస్తుల హిందూ సమాజం కిరీటధారులు, సూత్రధారులు, పాత్రధారులు, కాల్బలంగా పనిచేయడాన్ని మనం చూశాం. అణగారిన సమూహాల మధ్య వైరుధ్యానికి  గుజరాత్ గాయం సమీప గతంలో గొప్ప ఉదాహరణ.  
అణగారిన సమూహాలన్నీ అణిచివేత అంతస్సూత్రంగా ఏకమవుతూనే తమ విముక్తి కోసం విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తాయి. దళితులు కులనిర్మూలనను కోరుకుంటారు. ముస్లింలు మతసామరస్యాన్ని కోరుకుంటారు. ఎజెండాలోనికి మతసామరస్యం వచ్చాక ఇతరుల దేవుళ్ళను, విశ్వాసాలను ఖండించడం సబబు కాదు. ఈ కారణం వల్లనే ఇటీవలి కత్తి మహేష్ వివాదానికి నేను దూరంగా వున్నాను.

-        డానీ

No comments:

Post a Comment