Sunday, 22 July 2018

Muslim Women Marriage Rights Bill is for political mileage


Muslim Women Marriage Rights Bill is for political mileage

రాజకీయ ప్రయోజనం కోసమే ముస్లిం మహిళా బిల్లు

యం ఖాన్ యజ్దానీ (డానీ)

       పాములు కప్పల్ని మింగేసినట్టు, గద్దలు పిచ్చుకల్ని ఎత్తుకుని పోయినట్టు, సమాజంలో మెజారిటీలు మైనార్టీలను కబళించాలని చూస్తారుప్రాణాలు తీయడానికి సిధ్ధమైన పాములు, గద్దలు మౌనంగావుంటే, ప్రాణాపాయంలో చిక్కుకున్న కప్పలు, పిచ్చుకలు అరుస్తుంటాయి. కానీ, మన సమాజంలో అందుకు విరుధ్ధంగా జరుగుతోంది. అణిచివేస్తున్న మతతత్వశక్తులే గొంతు పెంచి అరుస్తున్నాయి. ప్రాణభయంతో గిజగిజలాడుతున్న మైనార్టీలే నోరు తెరవడానికి భయపడి మౌనంగా విలపిస్తున్నాయి.
       మైనార్టీలను అణిచివేయడానికి మతతత్వశక్తులు కొత్తగా సృష్టించిన ఆయుధంముస్లిం మహిళల (వివాహ హక్కులపరిరక్షణ) బిల్లు – 2017’.  గత ఏడాది డిసెంబరులో లోక్ సభ ఆమోదం పొందిన   వివాదాస్పద  బిల్లు ఇప్పుడు రాజ్యసభ లోకి ప్రవేశించింది. ప్రధానిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం జాతీయ రాజకీయాల్లో సృష్టిస్తున్న హోరులో ముస్లిం సమాజపు ఆర్తనాదాలు అణిచివేతకు గురవుతున్నాయి. ఎవరికీ వినిపించడం లేదు
            ముస్లిం సాంప్రదాయంలో వివాహమైనా, విడాకులైనా ఒకే రీతిలో జరుగుతాయి. వివాహ సమయంలో దాంపత్య అనుబంధం మీద వాళ్ళు  మూడుసార్లుఖుబూల్’ (అంగీకారం) చెపుతారు. దంపతులు విడిపోవాలనుకున్నప్పుడు సరిగ్గా అలాగే మూడుసార్లు విడాకులు చెపుతారు. దీనినే ట్రిపుల్ తలాఖ్ అంటారు. విడాకుల్ని భర్త ప్రతిపాదిస్తే తలాక్ అంటారు; భార్య ప్రతిపాదిస్తే ఖులా అంటారు. సాధారణంగా విడాకుల ప్రక్రియకు కనీసం  మూడు  నెలలు పడుతుందిఅది కొన్ని సందర్భాల్లో ఒక ఏడాదికి పైగా కొనసాగుతుంది.
            సైబర్ యుగంలో వేగం ఎక్కువ. విడాకుల కోసం సుదీర్ఘకాలం వేచి చూడలేని కొందరు వాట్సప్, ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్, వీడియో కాన్ఫరెన్స్, మెసెంజర్, ట్విట్టర్ తదితర సమాచార విప్లవ పరికరాల ద్వారా ఒక్క క్షణంలో విడాకులు చెప్పేస్తున్నారు. వీటినే ఇప్పుడు ఇన్ స్టాంట్ (తక్షణ) ట్రిపుల్ తలాక్ అంటున్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన 60 కేసులు గత ఏడాది సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయిసంచలనం సృష్టించిన కేసుల్ని విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది ఆగస్టు 22తక్షణ ట్రిపుల్ తలాక్  చెల్లదు; అది చట్టవిరుధ్ధం (void and illegal)” అని తీర్పు చెప్పింది. అంతేకాక, ఇస్లాం ఆరంభం నుండి కాకుండా మధ్యలో వచ్చిన  దురాచారం ఇస్లాం ధార్మిక సూత్రాలకు వ్యతిరేకమైనదని కూడా తేల్చిచెప్పింది.
       దానితో వివాదం న్యాయంగా ముగిసిపోవాలి. కానీ అలా జరగలేదు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత కూడా దేశంలో తక్షణ ట్రిపుల్ తలాక్ సంఘటనలు కొన్ని జరిగాయనీ, వాటిని అరికట్టడానికి  ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లును రూపొందించాల్సి వచ్చిందని ప్రభుత్వం చెపుతోంది. ఇందులో ఒక తిరకాసు వుంది. సుప్రీం కోర్టు తీర్పుకు ముందు జరిగిన తక్షణ ట్రిపుల్ తలాక్ సంఘటనలే కాక  తరువాత జరిగే అలాంటి సంఘటనలకు  కూడాఅవి చెల్లవుఅనే తీర్పే వర్తిస్తుంది. ఇక కొత్త చట్టం చేయ్సాల్సిన అవసరం ఏముంది?   ప్రశ్నకు ప్రభుత్వం సమాధానాన్ని దాటవేస్తున్నది.
            ప్రభుత్వం రూపొందించిన కొత్త బిల్లులో  తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు మూడేళ్ళ వరకు  కారాగార శిక్షతోపాటు అపరాధ రుసుము విధించే ఒక క్లాజ్ ను చేర్చారు. ఒక సమూహపు సాంస్కృతిక సాంప్రదాయాలను శిక్షించదగ్గ నేరంగా పరిగణించడం ప్రమాదకర పరిణామం.
       సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏమంటే, ఒకవేళ భర్త ఏదో ఆవేశంలో తక్షణ ట్రిపుల్ తలాక్ చెప్పినప్పటికీ అది చెల్లదు. అతను గతంలోలాగే  భార్యకు భర్తగాపిల్లలకు తండ్రిగా కుటుంబ బాధ్యతల్ని కొనసాగించాల్సి వుంటుంది. మరో మాటలో చెప్పాలంటే వాళ్ల దాంపత్య, కుటుంబ జీవితాల మీద తక్షణ ట్రిపుల్ తలాక్ ఎలాంటి ప్రభావాన్ని చూపదు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లు  ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్తను జైలుకు పంపించి, భార్యకు భర్త లేకుండా, పిల్లలకు తండ్రి లేకుండా చేస్తుంది. ఒకవేళ భార్య ఫిర్యాదు చేయకపోయనా సరే  సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయి పోలీసు అధికారి సుమోటోగా  కేసు నమోదు చేసి భర్తను జైలుకు పంపగల మరో కిరాతకమైన క్లాజు కూడా  చట్టంలో వుంది. అంటే భార్య  ఫిర్యాదు చేయకపోయినా, భర్త అసలు ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ చెప్పకపోయినా సరే రాజకీయ ప్రోద్భలంతో గానీ, మతప్రోధ్బలంతో గానీ  పోలీసులే  తప్పుడు కేసులు నమోదు చేసి ముస్లిం భర్తల్ని జైళ్లకు పంపించే అవకాశాన్ని బిల్లు కల్పిస్తుంది. ఇంతటిదుర్మార్గమైన చట్టం  ఇటలీ, జర్మనీల్లో  ఫాసిస్టు, నాజీల పాలనలోనూ లేదు.
       త్రిపుల్ తలాక్ కూ, ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ కూ తేడా లేని విధంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ  దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించడమేగాక, ముస్లిం సమాజాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారుఇలాంటి చర్యలు ప్రధాని పదవి ప్రతిష్టను దిగజార్చడమే తప్ప మరేదీ కాదు. ఎక్కడో ఒకసారి, ఎవరో మూర్ఖులయిన భర్తలు  చెప్పే ఇన్ స్టాంట్ ట్రిపుల్ తలాక్ ను ముస్లిం సమాజంలో సార్వజనీన విషయంగా సాక్షాత్తు దేశ ప్రధాని తప్పుడు ప్రచారం చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి.
       తాము మహిళల అభ్యున్నతి కోసం, సాధికారత కోసం కృషి చేస్తుంటే విపక్ష పార్టిలు మహిళల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆరంభానికి ముందు ప్రధాని మోదీ ఆజమ్ గడ్ సభలో అన్నారు. కాంగ్రెస్ ను సందర్భంగా వారుముస్లిం పురుషుల పార్టిఅని ఎత్తిపొడిచారు. తమది ముస్లిం మహిళల కోసం నిలబడే పార్టి అని చెప్పుకొచ్చారు. నిజానికి ఇదొక బూటకపు ప్రకటన. ఒక క్రూరమైన మైండ్ గేమ్. నిజానికి సాధారణ ముస్లిం మహిళలే కాకుండా తక్షణ ట్రిపుల్ తలాక్ బాధితులయిన మహిళలు కూడా బిజెపి పక్షానలేరుముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు - 2017 ద్వార  ముస్లిం యువకుల్ని జైళ్ళకు పంపాలని  కేంద్ర ప్రభుత్వం ఉవ్విళ్ళూరుతున్నదనీ, తమ మీద బిజెపి  కపట ప్రేమను ఒలకబోస్తున్నదనీ   ముస్లిం మహిళలకు కూడా స్పష్టంగా తెలుసు.
       బిజెపి లక్ష్యం తక్షణ ట్రిపుల్ తలాక్ బాధితులయిన మహిళల్ని ఆదుకోవడం కాదు. చట్టం ద్వారా బాధిత సమూహానికి ( కేసులో ముస్లిం మహిళలకు) ఒనగూడే  ఒక్క ప్రయోజనాన్ని కూడా పార్టి చెప్పలేకపోతున్నది. బాధిత సమూహానికి మేలు చేయనపుడు అసలు కొత్త చట్టం చేయడం దేనికీ? పురుషుని జీవితంలో స్త్రీలంటే కేవలం భార్యమాత్రమే  కాదు. ట్రిపుల్ తలాఖ్ చెప్పాడనే నెపం మీద కుటుంబంలో నుండి యువకుడ్ని జైలుకు పంపించేస్తే అతని భార్య మాత్రమేకాదు, అతని మీద ఆధారపడిన తల్లిదండ్రులు, అక్కాచెళ్ళెల్లు సహితం వీధిన పడతారు. విడాకుల అన్యాయానికి గురైన స్త్రీలను కాపాడుతామనే నెపంతో ముస్లిం కుటుంబాలను మొత్తంగా అణిచివేయడం చట్టం వెనుకనున్న కుట్ర.
       భారత ముస్లింల ఆర్ధిక వ్యవస్థతోపాటూ వాళ్ళ  కుటుంబ వ్యవస్థను  సహితం తాను విఛ్ఛిన్నం చేసేస్తున్నట్టు సమాజంలోనికి గట్టి సంకేతాలను పంపాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. ఆరెస్సెస్-బీజేపి అభిమానులయిన మతతత్వవాదుల్ని అలా సంతృప్తి పరిచినంత కాలం తన ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా వుంటుందని వారు ఆశిస్తున్నారు.
       ట్రిపుల్ తలాక్ ను నిరోధించడానికి ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని  సుప్రీంకోర్టు కోరలేదు. కానీ, ముస్లింలు, దళితులకు ప్రాణసంకటంగా మారిన మూకోన్మాదాన్ని (mob lynching)  అరికట్టడానికి తక్షణం కఠిన చట్టాలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం సుప్రీకోర్టు ఆదేశాలను  పట్టించుకునే  స్థితిలో లేదు. తానే ముస్లింల మీద మూకోన్మాదంతో విరుచుకు పడుతోంది.
       స్వాతంత్ర్యానంతర భారత దేశపు ముస్లిం సమాజంలో అత్యధికుల ఆర్ధిక, సాంస్కృతిక పరిస్థితి యస్సీలు, యస్టీలకన్నా హీనంగా వుందని జస్టిస్ రాజిందర్ సచార్ కమిటి నివేదిక పేర్కొంది. కటిక పేదరికం కారణంగా ఆడపిల్లలను ఏదో ఒక విధంగా పెళ్ళిచేసి బాధ్యతలు నెరవేర్చేశామనుకునే దయనీయ స్థితిలో ముస్లిం సమాజం వుంది. వారి మీద దయ చూపాల్సిన తరుణంలో, పగతీర్చుకోవడానికి నేరుగా కేంద్ర ప్రభుత్వమే సిధ్ధమయింది.
       నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముస్లిం ఆడపిల్లల్ని ఆదుకోవాలనే చిత్తశుధ్ధి నిజంగా వుంటే నిర్బంధ విద్య, పెండ్లి కానుకలువితంతు స్త్రీల భృతి వంటి పధకాలను రూపొందించవచ్చు. కానీ, కేంద్ర ప్రభుత్వం పని చేయడం లేదు. దేశ జనాభాలో 14 శాతం వున్న ముస్లింల సంక్షేమానికి  జాతీయ బడ్జెట్ లో ఒక్క శాతం నిధులు కూడా కేటాయించడం లేదు. మరోవైపు ముస్లిం మహిళల మీద కపట ప్రేమను ఒలకబోస్తున్నది.
       ప్రధానమంత్రికి నిజంగానే  దేశంలోని మహిళల మీద అంత ప్రేమ వుంటే వారు నెరవేర్చాల్సిన చారిత్రక బాధ్యతలు ఇంకా అనేకం వున్నాయిమహిళా సాధికార (రిజర్వేషన్ల) బిల్లును లోక్ సభలో ఆమోదించాలి. 2010 మార్చి నెలలో రాజ్య సభ ఆమోదం పొందిన  బిల్లు అప్పటి నుండి లోక్ సభ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది.
       దేశప్రజల్ని మతప్రాతిపదిక మీద చీల్చి ముస్లిం వ్యతిరేకతను ప్రచారం చేసిన మతతత్వశక్తులు రాజకీయ లబ్దిపొంది కేంద్ర ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న విషయం మనందరికీ తెలుసుఇప్పుడు ముస్లిం సమాజాన్ని లింగ ప్రాతిపదిక మీద చీల్చేసినట్టు సంకేతాలిచ్చి 2019 ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవి  కుట్రలు చేస్తున్నాయి.
       ఏదో ఒక ధార్మిక అంశాన్ని వివాదంగా మార్చి ముస్లిం సమాజాన్ని బోనులో నిలబెట్టి రాజకీయ లబ్దిపొందాలని మతతత్వశక్తులు తరచూ ప్రయత్నిస్తుంటాయి. అభివృధ్ధిమంత్రం పనిచేయనపుడు మతతత్వశక్తులు ప్రయోగించే చివరి ఆయుధం పరమత ద్వేషాన్ని రెచ్చగొట్టడం. మోదీ ఇప్పుడు పనే చేస్తున్నారు. అలా వారు ఇప్పుడు ట్రిపుల్ తలాఖ్ ను జాతీయ  సమస్యగా మార్చారు.
       ఈ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు కాంగ్రెస్, వామపక్ష తదితర పార్టీలు  ఇప్పటికే ప్రకటించాయి. బిజెపితో తెగతెంపులు చేసుకున్నామని చెపుతున్న టిడిపి, బిజెపీతో జత కట్టేదిలేదని చెపుతున్న వైసిపి తమ నిజాయితీని నిరూపించుకోవాలంటే తమ రాజ్యసభ సభ్యుల ద్వార బిల్లును పెద్దల సభలో అడ్డుకోవాలిమతతత్వశక్తుల మీద వ్యతిరేకతకూ, మతసామరస్య విలువల మీద అభిమానాన్ని చాటుకోవడానికి  రాజకీయ పార్టీలకు కేసు ఒక  గీటురాయి.

(రచయిత ముస్లిం ఆలోచనాపరుల వేదిక కన్వీనర్)
మొబైలు  :  9010757776

హైదరాబాద్  20 జూలై 2018

ప్రచురణ :  ఆంధ్రజ్యోతి దినపత్రిక, 22 జులై 2018

2 comments:

  1. really wonder sir. i didn't know the fact sill ur article read. the explanation is very clear. i have got clarity about bill.

    ReplyDelete