సంఘ్ పరివార్ కి సర్కార్ ఫిర్ కభీ నహీ !!
డానీ
ఆంధ్రప్రదేశ్
ముస్లింలు 2019లో ఎవరికి ఓటేస్తారు? అనేది రాజకీయ పరిశీలకులకు ఎంతటి ఆసక్తికర ప్రశ్నో,
ఎవరికి ఓటేయాలి? అనేది ముస్లింలకు కూడా అంతే అంతుపట్టని సంధిగ్ధం.
భారత ముస్లింల
రాజకీయ వ్యవహార శైలి భిన్నమైనది. మిగిలిన సామాజికవర్గాల్లా వాళ్ళు కూడా ఆర్ధిక ప్రయోజనాలను
కోరుకుంటారు. అయితే, సామాజిక ప్రశాంతతకు ఆర్ధిక ప్రయోజనాలకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఇది తెలియనివాళ్ళు ముస్లింలు ధార్మిక (మతపరమైన) అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని
తరచూ అపార్ధం చేసుకుంటుంటారు.
ఏపి ముస్లింలు 2004, 2009 ఎన్నికల్లో భారత జాతీయ
కాంగ్రెస్ కు మద్దతిచ్చారు. అది బిజెపి ఆధ్వర్యంలోని ఎన్ డిఏ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందనే
ప్రధాన కారణంతోనూ, విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు
కల్పిస్తుందనే ద్వితీయ కారణంతోనూ 2004 లో వాళ్ళు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. అలాగే
ఎన్ డిఏ ప్రభుత్వాన్ని గద్దె దించిందనే ప్రధాన కృతజ్ఞతతోనూ, విద్యా ఉపాధి రంగాల్లో
రిజర్వేషన్లు కల్పించిందనే ద్వితీయ కృతజ్ఞతతోనూ 2009లో
వాళ్ళు కాంగ్రెస్ కు మద్దతిచ్చారు.
కొందరు అంగీకరించకపోవచ్చుగానీ
రాష్ట్ర ప్రజల్లో వైయస్ రాజశేఖర రెడ్డి గ్రాఫ్ 2009 ఎన్నికల నాటికే క్రమంగా పడిపోతూ
వుంది. “ప్రజలు మాకు పాస్ మార్కులు మాత్రమే ఇచ్చారు” అని స్వయంగా వైయస్సే అన్న సందర్భాలున్నాయి.
ఒక విధంగా ముస్లింల గట్టి మద్దతు కారణంగానే వైయస్ ప్రభుత్వం
2009లో గట్టెక్కింది అనంటే అతిశయోక్తికాదు.
వైయస్ మరణానంతరం
చంద్రబాబు 2012లో ముస్లిం సాధికారత పథకాన్ని ప్రకటించారు. దానితో ముస్లిం సామాజికవర్గంలోని ఒక భాగం తెలుగు దేశం పార్టి వైపు మళ్ళీ మొగ్గు చూపింది.
అయితే, చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది.
మరోవైపు, ముస్లింలలో ఎక్కువ మంది అభిమానిస్తున్న కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో నవ్యాంధ్రాలో
కనీస పోటీ ఇవ్వగలిగే స్థితిలో కూడా లేదు. వైయస్
కు వారసునిగా వచ్చిన జగన్ అప్పుడు వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా కనిపించారు. కానీ, రాజకీయాల్లో
జగన్ ద్వంద్వ వైఖరి కారణంగా అది కూడా సజావుగా సాగలేదు.
మద్దతు ఇచ్చే
అంశం మీద ముస్లిం ప్రతినిధులు వైయస్సార్ సిపి తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఏపీలో ఎన్నికల
ప్రచారం చివరి ఘడియ అయిన మే 4 సాయంత్రం 4 గంటల వరకూ హైదరాబాద్ జూబిలీ హిల్స్ రోడ్ నెంబర్
45 లోని వైయస్సార్ సిపి కార్యాలయంలో ఆ చర్చలు సాగాయి. జగన్ ప్రతినిధిగా ఆర్థిక నిపుణులు డి.ఏ. సోమయాజులు
ఆ చర్చల్లో పాల్గొన్నారు. “ఎన్నికల అనంతరం
ఎన్ డీఏ లో చేరబోన”ని జగన్ స్పష్టంగా ఒక్క ప్రకటన చేస్తే చాలు అనేది ముస్లిం ప్రతినిధుల
డిమాండ్. ‘కోవా’ స్వఛ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో వెళ్ళిన ఆ ప్రతినిధుల బృందంలో ఈ వ్యాసకర్త
కూడా ఒకరు. ముస్లింల కనీస డిమాండ్ ను కూడా జగన్ ప్రతినిధి అంగీకరించలేదు. ఎన్నికల
తరువాత తాము మోదీకి దూరంగా వుండలేమని వారు చాలా స్పష్టంగా చెప్పారు.
జగన్ కు ఇటీవల
నరేంద్ర మోదీజీ మీద రాజకీయ ప్రేమ పుట్టిందని చాలామంది అనుకుంటుంటారు. నిజానికి వారు 2014లోనే
మోదీజీ మీద మనసు పారేసుకున్నారు. జాతీయ రాజకీయ దృక్పధాల్లో రాజశేఖర రెడ్డికీ, జగన్
కూ పొంతనలేదు. రాజశేఖర రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పక్షం అయితే, జగన్ భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేక పక్షం.
వైయస్సార్
సిపీతో చర్చలు విఫలం కావడంతో 2014 ఎన్నికల్లో ఏపి ముస్లిం పెద్దలు తమ స్వీయ సమాజం ఎవరికి
ఓటేయ్యాలి అనే విషయంలో స్పష్టంగా ఒక పిలుపును
ఇవ్వలేక పోయారు. ఓటింగును ముస్లింల ‘ఆత్మ ప్రబోధానికి’ వదిలివేశారు. దానితో ఏపీలో ముస్లిం ఓట్లు చీలిపోయాయి. ముస్లిం
ఓట్లలో ఎక్కువ భాగం జగన్ కు పడ్డాయన్నది ఎంత వాస్తవమో టిడిపికి పడిన ముస్లిం ఓట్లు
తక్కువేమీ కాదన్నది కూడా అంతే వాస్తవం. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని విజయవాడ
పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం ఓటింగ్ సరళిని విశ్లేషిస్తే ఈ విషయం సులువుగానే అర్ధం అవుతుంది. అక్కడి ముస్లింలలో అత్యధికులు అసెంబ్లీ ఓట్లను వైసిపికి,
లోక్ సభ ఓట్లను టీడీపికి వేశారు.
దేశంలో ఒక
భయానక అసహన వాతావరణం, మూకోన్మాదం చెలరేగుతున్న సమయంలో 2019 ఎన్నికలు వస్తున్నాయి. బిజెపితో
తగువు పెట్టుకుని కష్టాలను కొని తెచ్చుకోవడంకన్నా ఆ పార్టీలోనే చేరిపోతే మేలని భావించే
వాళ్ళు సహితం ముస్లింలలో కొందరు వుంటారు. అయితే,
ముస్లిం సమాజంలోని అత్యధికులు మాత్రం సంఘపరివారాన్ని అదుపుచేసే రాజకీయ కూటమి కోసం నిరంతరం
అన్వేషిస్తూనే వుంటారు. ఇలాంటి నేపథ్యంలో, భారత జాతీయ కాంగ్రెస్సే తిరిగి తిరిగి ముస్లింలకు
తప్పని అనుబంధంగా కనిపిస్తూ వుంటుంది. సంస్థాగతంగానూ, విధానపరంగానూ కాంగ్రెస్ లో అనేక
లోపాలు వుండవచ్చు. అది వేరే కథ.
ముస్లింలు
కాంగ్రెస్ వైపుకు మొగ్గు చూపుతారని బిజెపి-సంఘపరివారానికి కూడా తెలుసు. వాళ్లు దానికి
విరుగుడును కనిపెట్టి సిధ్ధంగానే వున్నారు. అందులో కీలకమైనది ముస్లింలకు ఓటు వేసే అవకాశం
లేకుండా చేయడం; ఎన్నికల జాబితా నుండి ముస్లిం
ఓటర్లను తగ్గించడం; వీలయితే మొత్తంగా తొలగించడం. ఎన్నికల సంఘం ద్వార ఆ పనుల్ని వాళ్ళు
సులువుగా చేయగలరు. ప్రజాస్వామిక వ్యవస్ద్థల్ని భ్రష్టు పట్టించడంలో మోదీజీ-అమిత్ షాజీ
జంటకు మరొకరు సాటిరారు.
ఒక అంచనా ప్రకారంలో
ఏపీలో అర్హులైన దాదాపు 4 కోట్ల మంది ఓటర్లలో
34 - 36 లక్షల మంది ముస్లింలు వుండాలి. గుంటూరుకు చెందిన ఐఐటియన్ షేక్ హుస్సైనీ
విభిన్న లాగరిథమ్స్ ను ఉపయోగించి ప్రస్తుత జాబితాలో 16-17 లక్షల మంది ముస్లింలులకు
మాత్రమే ఓట్లు వున్నాయని తేల్చారు. అంటే, అర్హులైన
ముస్లిం ఓటర్లలో సగంకన్నా తక్కువ మందికి మాత్రమే ఇప్పుడు ఓట్లున్నట్టు లెఖ్ఖ.
ఒక సామాజికవర్గానికి
ఓటర్ల లిస్టులో చోటు దక్కకపోతే రెండు రకాల నష్టాలు జరుగుతాయి. మొదటిది; వాళ్ళు ఓటు
హక్కును కోల్పోతారు. రెండోది; ఓటర్ల లిస్టులో పెద్ద సంఖ్యలో లేని సామాజికవర్గాల సంక్షేమాన్ని
రాజకీయ పార్టిలు పట్టించుకోవు. దాదాపు నలభై లక్షల మంది ఓటర్లను కలిసి వాళ్ళలో దాదాపు
ఇరవై లక్షల మందిని కొత్తగా జాబితాలో నమోదు చేయడం చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఇంతటి శక్తి ఇప్పటి ఏపి ముస్లిం సేవా సంస్థలు వేటికీ
లేదు. ఎన్నికల సంఘమే దానికి పూనుకోవాలి. లేకుంటే ఏదైనా ప్రధాన రాజకీయ పార్టీ ఆ భారాన్ని
మోయాలి. ముస్లిం ఓట్లలో అత్యధిక భాగం బిజేపికి వ్యతిరేకంగా పడేవే కనుక ఆ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోదలిచిన రాజకీయ పార్టిలు ముస్లిం ఓటర్ల నమోదుకు పూనుకోవాలి.
ఓటర్ల నమోదు
తరువాత కీలక ప్రశ్న ఓటింగుకు సంబంధించింది. ఏపి ఎన్నికల బరిలో ఎన్ని రాజకీయ పార్టీలున్నా గ్రాండ్
ఫినాలే చంద్రబాబు, జగన్ ల మధ్యనే వుంటుందని ఈపాటికే తేలిపోయింది. వాళ్ళిద్దరిలో ఎవరు
యూపియే, ఎవరు ఎన్డీయే అనేది తేల్చడమే ఇప్పుడు ముస్లిం సెఫాలజిస్టులు (Psyphologists)
తేల్చాల్సిన అంశం.
మతతత్వశక్తులతో
కలవను వంటి పొడిపొడి ప్రకటనలు అప్పుడప్పుడు
చేస్తున్నప్పటికీ మోదీజీతో ఒక సాఫ్ట్ కార్నర్ ను జగన్ అట్టే పెట్టుకుంటూ వస్తున్నారు.
వంచనపై గర్జన గుంటూరు సభలో వైసిపీ నాయకులు
మోదీజీ మీద కొంత గొంతు పెంచి మాట్లాడారుగానీ అదొక యాధృఛిక సంఘటనగానే మిగిలిపోయింది.
తనకు పేటెంటు హక్కులున్నాయని అంటున్న ప్రత్యేక తరహా హోదా సాధన ఉద్యమం ఒకవేళ విజయవంతమైనా దానివల్ల ముస్లింలకు ఒనగూడే ప్రయోజనాలు
కూడా ఏమీలేవు. మాబ్ లించింగ్, గోగ్రవాదం, విడాకుల్ని నేరంగా పరిగణించే ఆర్డినెన్సు,
జాతీయ పౌరసత్వ నమోదు, రాజ్యాంగంలో లౌకిక ఆదర్శాల పరిరక్షణ, వక్ఫ్ భూముల పరిరక్షణ, విద్యా
ఉపాధిరంగాల్లో జనాభా దామాషా ఆధారిత రిజర్వేషన్లు మొదలైనవి ముస్లింలకు కీలక అంశాలు. వీటి మీద మాట్లాడకపోగా
ముస్లింలు తనను వదిలి ఎక్కడికీ పోలేరు అనే ధోరణిలో జగన్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు, జగన్ శిబిరంలో గత ఎన్నికలలో డిఏ సోమయాజులు
నిర్వహించిన మోదీజీ అనుకూల పాత్రను ఇప్పుడు వైసిపి జాతీయ కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి
నిర్వహిస్తున్నారు.
మరోవైపు,
నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబు సహితం ముస్లింల సంక్షేమానికి చేసిందేమీలేదు. ముస్లింలకు
మంత్రి పదవి ఇచ్చినా, మరో విభాగాల్లో ప్రోత్సహించినా ఢిల్లీలో నరేంద్రమోదీ మనోభావాలు
దెబ్బతింటాయని వారు వెనుకాడే వారు. కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు రాకుంటే ఆంధ్రప్రదేశ్
మనుగడ కష్టం కనుక ప్రధాని నొచ్చుకోకుండా మసులుకోవడం తనకు తప్పదనేవారు. మరోమాటల్లో చెప్పాలంటే,
నవ్యాంధ్రప్రదేశ్ అభివృధ్ధి కోసం ముస్లింలు
త్యాగాలు చేయకతప్పదనేది వారి అభిప్రాయంగా వుండేది.
నరేంద్ర
మోదీ ఐదవ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన తరువాత చంద్రబాబు వ్యవహార శైలి మారింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం క్రమంగా వారు మోదీకి వ్యతిరేకంగా స్వరం పెంచారు. దేశంలో ప్రస్తుతం
నరేంద్ర మోదీ-అమిత్ షాలను ముఖాముఖీగా ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రులు నలుగురు; మమతా బెనర్జీ, కేజ్రివాల్,
పినరయి విజయన్, చంద్రబాబు. వీరిలో చంద్రబాబు ఇప్పుడు మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. గుంటూరులో ముస్లింల
సదస్సును నిర్వహించి వారు కేంద్రానికి స్పష్టమైన సంకేతాన్నే పంపించారు.
కాంగ్రెస్
తో చంద్రబాబు జత కూడవచ్చని కొంత కాలంగా సాగుతున్న
ఊహాగానాలకు రాహుల్ గాంధీ – చంద్రబాబు గురువారం ఢిల్లీలో ఒక స్పష్టత ఇచ్చారు. “మోదీ హయాంలో కుప్పకూలిపోతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు, దేశాన్ని రక్షించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాం”
అని ఒక
సంయుక్త ప్రకటన చేశారు. ఈ రెండు పార్టిలతోపాటూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, ఎన్సీపీ , జేఎంఎం,
సీపీఐ, సీపీఎం, తృణమూల్ కాంగ్రెస, జేడీఎస్, ఎన్సీ,
లోక్దళ్,. పీడీపీ ఇప్పటికే ఐక్య ప్రజాస్వామిక
కూటమిలో చేరాయి. గతంలో యున్సైటెడ్ ఫ్రంట్, ఏన్డీఏలకు కన్వీనర్ గా పనిచేసిన చంద్రబాబు
ఇప్పుడు యూపియే కు కూడా కన్వీనర్ గా మారినా
ఆశ్చర్య పడాల్సింది ఏమీలేదు.
మోదీ నిరంకుశ
విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనే కఠిన నిర్ణయం తీసుకుంటే తప్ప జగన్ ఇప్పుడు యూపియేలో
చేరే అవకాశాలు లేవు. వైసిపి ఇప్పుడు ఎన్డీయేలో చేరవచ్చు లేదా మూడో ఫ్రంట్ లో చేరవచ్చు. మూడో ఫ్రంట్ అనేది మోదీజీ
టీం –బీ మాత్రమే అని ఇప్పటికే తేలిపోయింది.
కాంగ్రెస్
తో చంద్రబాబు చేతులు కలపడం భారత రాజకీయాల్లో ఎంతటి దిగ్బ్రాంతికర పరిణామమో ఏపి ముస్లింలు
చంద్రబాబును పూర్తిగా సమర్ధిస్తారా? అనేది కూడా అంతటి దిగ్బ్రాంతికర సందేహమే. ఏపీలోని
కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం టిడిపిని ప్రత్యర్ధిగానూ, వైసిపిని దారితప్పిన సోదరునిగానూ భావిస్తున్నారు. అలాగే, ఇప్పటికిప్పుడు చంద్రబాబును
సమర్ధించడానికి చాలామంది ముస్లింలు కూడా సుముఖంగా లేరు. కానీ, ఎన్నికలు దగ్గరపడేకొద్దీ
కాంగ్రెస్ ప్లస్ టిడిపి అనేది ముస్లింలకు క్రమంగా ఆమోదయోగ్యమైన రాజకీయ ఫార్మూలా అవుతుంది.
యూపిఏలో చంద్రబాబు క్రియాశీలంగా మారేకొద్దీ ఇప్పటి దిగ్భ్రాంతి
ఒక సాధారణ విషయంగా మారిపోతుంది. ఎన్నికల సంఘం అన్యాయానికి బలైన ముస్లింలను ఓటర్ల జాబితాలో చేర్చే బాధ్యతను
న్రవేర్చగలిగితే ముస్లింల వైపు నుండి టిడిపికి అది బోనస్ అవుతుంది. ఎందుకంటే
రాజకీయాల్లో ఎన్నడూ పాత తేదీలు, పాత పేజీలు వుండవు. వుండేదల్లా భవిష్యత్తే. ఎవ్రి డే
ఈజ్ ఎ ఫ్రెష్ బిగినింగ్.
ముస్లిం
రాజకీయ చైతన్యం ఓ రెండు మంత్రి పదవుల కోసమో కాదు.
ఓ డజను ఎమ్మెల్యే స్థానాలకోసమో, అరడజను కార్పొరేషన్ల కోసమో అసలు కాదు. ఇది ముస్లింల
ఆత్మగౌరవ పోరాటం. వునికిని చాటుకునే ఆరాటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్షాన కేంద్ర ప్రభుత్వంతో
పోరాడే ఒక చారిత్రక బాధ్యతను పంచుకోవడానికి
ముస్లింలు సిధ్ధం కావాలి. చరిత్ర విసిరిన సవాలుకు సమాధానం ఇవ్వడానికి ఢిల్లీలో జాతీయ విపక్షాలు కదులుతున్నాయి. ఇది ఆరంభంలో రాష్ట్ర
శ్రేయస్సు కోసం పోరాటం. అంతిమంగా దేశ భవిష్యత్తు కోసం పోరాటం. మోదీని తప్పించడమే నేటి
ప్రజాస్వామ్య కర్తవ్యం. సంఘ్ పరివార్ కి సర్కార్ ఫిర్ కభీ నహీ !
(రచయిత సమాజ విశ్లేషకులు) మొబైల్ – 9010757776
రచన : 2 నవంబరు
2019
ప్రచురణ : మనతెలంగాణ
4 నవంబరు 2019
No comments:
Post a Comment