Common Minimum Programme of Oppressed
Classes?
అణగారిన సమూహాల
కనీస ఉమ్మడి కార్యక్రమం
ఏమిటీ?
సందర్భం
: బహుజన
సాహిత్య, సాంస్కృతిక కచ్చీరు, గుంటూరు
సమయం
: 8, 9 జూన్ 2019
నిర్వహణ : గుంటూరు లక్ష్మీ నరసయ్య
సమర్పణ : ఉషా యస్
డానీ
Talking points
(8th June
2019 Evening
Session)
తొలి
పలుకులు
సభాధ్యక్షులు
(వేముల ఎల్లయ్య) గారికీ, బహుజన సాహిత్య సాంస్కృతిక కచ్చీరులో పాల్గొంటున్న ప్రతినిధులకు
ఉద్యమ వందనాలు.
అణగారిన
సమూహాల అభ్యున్నతికి సమాజంలో అడ్దంకిగావున్న సమస్యల్నీ, మేధోరంగంలో ఎదురవుతున్న చిక్కుముడుల్నీ
పరిష్కరించడానికి నా చిరకాల మిత్రుడు, ఆలోచనాపరుడు గుంటూరు లక్ష్మీనరసయ్య చేస్తున్న
అద్భుత కృషికి ముందుగా అభినందనలు.
ఒక
చారిత్రాత్మక మేధోమధనంలో నన్ను కూడా భాగస్తుడిని
చేసినందుకు గుంటూరు కచ్చీరు నిర్వాహకులకు ధన్యవాదాలు.
మిత్రులారా!
1.
మనం
నేర్చుకున్నదానిలో నిరంతరం కొంత వదులు కోవాలి. మరికొంత కలుపుకోవాలి. వ్యర్ధాలను విసర్జించకపోతే
మనిషయినా, యంత్రమయినా, సమాజం అయినా అంతరించిపోతాయి. జ్ఞానసముపార్జన (Cognition) క్రమంలో
Learning ఎంత ముఖ్యమో unlearning కూడా అంతే ముఖ్యం.
2.
సాహిత్య.
సాంస్కృతిక పదాలను మనం చాలా పరిమిత అర్ధంలో చూస్తున్నాం. కవిత్వం, కథ, నవలల్ని సాహిత్యం
అంటున్నాం. నృత్యం గానాలను సాంస్కృతికం అంటున్నాం.
బహుజన సాహిత్య సాంస్కృతిక గుంటూరు కచ్చీరుకు థీమ్ గా వాడుతున్న ‘సాంస్కృతిక’ అనే పదానికి
చాలా విస్తృత అర్ధం వుంది.
3.
మార్క్సిస్టులకు
సాంస్కృతిక రంగం అంటే ఉపరితం (Super Structure). ఉత్పత్తిశక్తులు, ఉత్పత్తి సంబంధాలను
మార్క్సిస్టులు పునాది అంటారు. పునాదిని సమర్ధించే, స్థిరీకరించే, కొనసాగించే సమస్త
ఇతర అంశాలను ఉపరితలం అంటారు.
4.
కళాసాహిత్య రంగాలేగాక, మతం, సంస్కృతి, రాజకీయం, చరిత్ర,
చట్టం, న్యాయవ్యవస్థ, నీతిశాస్త్రం, అర్ధశాస్త్రం మొదలైనవన్నీ ఉపరితలంలో వుంటాయి. ఉపరితల
విభాగాలన్నీ మళ్ళీ రెండు శిబిరాలుగా చీలిపోతాయి.
ఒక శిబిరం ఉత్పత్తి సంబంధాలలో పీడకుల్ని సమర్ధిస్తే మరో శిబిరం పీడితుల్ని సమర్దిస్తుంది.
పీడితులు, పీడకుల్లో ఎవరికీ చెందక మధ్యస్తంగా వున్నట్టు కనిపించే ఉపరితల అంశాలు కూడా
కొన్ని వుంటాయి. అలా మధ్యస్తంగా వున్నట్టు
కనిపించే అంశాలు, శాస్త్రాలు పీడకుల ఆధిపత్యాన్ని ఖండించవు, పీడితుల తిరుగుబాట్లను సమర్ధించవు. కనుక
అవి కూడా సారాంశంలో పీడకుల పక్షాన్నే వుంటాయి.
వీటన్నింటినీ రాజ్యం రాజకీయాల ద్వార నియంత్రిస్తూ వుంటుంది. అందుకే సమాజంలోని
ఏరంగంలో అయినా ఎంత చిన్న మార్పు అయినా తేవాలంటే
రాజకీయ చర్య అనివార్యం అవుతుంది.
5.
చైనాలో
1960వ దశాబ్దం చివర్లో సాంస్కృతిక విప్లం కొనసాగింది. దాని అర్ధం వాళ్ళు కళారూపాలను
మాత్రమే సంస్కరించారనికాదు. ఉపరితలానికి సంబంధించిన
సమస్త విభాగాలనూ వాళ్ళు విప్లవీకరించారు. విప్లవం ఒక రాజకీయ చర్య.
6.
భారత
సమాజపు ఉత్పత్తి సంబంధాల్లో కులం పాత్ర కూడ వుందని కార్ల్ మార్క్స్1853లో గుర్తించాడు.
రైల్వేలైన్ల నిర్మాణంతో పారిశ్రామిక విప్లవం ఆరంభమయినప్పటికీ భారత సమాజంలో మౌలిక మార్పులు
రాకుండా కులం అడ్డుకుంటున్నదని కూడ చెప్పాడు. ఆధునిక కాలంలో కుల సమస్యను తొలిసారిగా
చర్చనీయాంశంగా మార్చిన ఘనత బహుశ కార్ల్ మార్క్స్
కు దక్కుతుంది.
7.
మార్క్స్
కులం గురించి చెప్పిన ఓ దశాబ్దం తరువాత జ్యోతిబా ఫూలే రంగప్రవేశం చేసి భారత సమాజాన్ని
బ్రాహ్మణ, అబ్రాహ్మణగా వర్గీకరించాడు. ఫూలే అభిప్రాయంలో బ్రాహ్మణ, క్షత్రీయ, వైశ్య
వర్ణాలు యజమానులు. మిగిలినవారంతా సేవకులు. సేవకవర్గమైన బ్రాహ్మణేతరుల్ని అతను శూద్రులు,
అతిసూద్రులు అన్నాడు.
8.
కులం
అనేది శ్రమ విభజన మాత్రమేకాక శ్రామికుల విభజన కూడా అని బాబాసాహెబ్ అంబేడ్కర్ విశ్లేషించాడు.
The Caste System is not merely a division of labourers which is quite different
from division of labour—it is a hierarchy in which the divisions of labourers
are graded one above the other. In no other country is the division of labour
accompanied by this gradation of labourers.
9.
బాబాసాహెబ్
అంబేడ్కర్ విశ్లేషణ ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి సంబంధాలు సహితం సాంస్కృతిక సంబంధాలే
అవుతాయి.
10. అప్పుడు ఉపరితలం మాత్రమే
కాకుండా. పునాది సహితం చాలా వరకు సాంస్కృతిక రంగం అయిపోయినట్టు లెఖ్ఖ.
11. సాంస్కృతిక విభాగాలు అన్నింటి
మీద ఆధిపత్యం రాజకీయాలకే వుంటుంది కనుక రాజకీయాధికారమే విముక్తి ద్వారం అవుతుంది.
12. “Political power is
the Master Key, which can open all the locks”. అన్నాడు అంబేడ్కర్.
13. మిగతా దేశాల వ్యవహారాన్ని
పక్కన పెట్టినా మన దేశంలో సాహిత్యం, మతం, రాజకీయార్ధిక రంగాలు ఎప్పుడు విడిగాలేవు.
14. మన పురాణాలకు రెండు కర్తవ్యాలు
వుండేవి. తొలి కర్తవ్యం, రాజునీ. రాచరికాన్ని సమర్ధించడం, మలి కర్తవ్యం వైదిక మతాల్ని ప్రచారం చేయడం. మొదటిది రాజకీయం,
రెండోది ధార్మికం; అంటే మతం.
15. జాతియోద్యమంలోనూ రాజకీయం,
ధార్మికం రెండూ కలిసే వున్నాయి. వలస పాలన వ్యతిరేకత రాజకీయం.
వైదీక మత పునరుధ్ధరణ ధార్మికం.
16. వైదీక మత పునరుధ్ధరణలో భాగంగా
జాతియోద్యమంలో కాళీమాతని భరతమాతగా మార్చడంతో
ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, చేదు అనుభవాలు
మనకు తెలుసు.
17. భారత రాజకీయాల మతాంతీకరణ
జాతియోద్యమంలోనే మొదలై నరేంద్ర మోదీ నాయకత్వంలో రెండవ పీష్వాగిరి పాలన ఏర్పడేవరకు సాగింది.
18. ఇటీవలి ఎన్నికల్లో సంఘపరివారం
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి దాని పోల్
మేనేజ్ మెంట్ సామర్ధ్యం ఒక కారణం అయితే సంఘపరివార వ్యతిరేక శక్తుల బలహీనతలు మరో కారణం.
19. సంఘపరివారం అనగానే మనకు
బిజెపి, విశ్వహిందూపరిషత్, భజరంగ్ దళ్ వంటి కొన్ని పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. నిజానికి సంఘపరివారానికి వంద విభాగాలు వున్నాయి. పిల్లల కోసం సరస్వతి శిశుమందిర్ మొదలు సైటిస్టులకు
విజ్ఞాన భారతి వరకు, రాజ్యాంగం నుండి లౌకిక,
సామ్యవాద పదాల్ని తొలగించడానికి ఏర్పడ్డ రాష్ట్రీయ
హిందూ ఆందోళన్ మొదలు, ముస్లిం రాష్ట్రీయ మంచ్ వరకు, ఆదివాసులకు వనవాసి కళ్యాణ్ మొదలు అంధులకు సక్షమా వరకు ప్రతి
పనికీ ఒక్కో అనుబంధ సంస్థ సంఘపరివారంకు వుంటుంది.
20. సంఘపరివారంలో వంద అనుబంధ సంస్థలు వంద శరీరాలు రెండు
వందల చేతులు రెండు వందల కాళ్ళతో విస్తృతంగా వ్యాపించి వున్నప్పటికీ అవన్నీ ఒకే మెదడు
ఒకే లక్ష్యంతో పనిచేస్తుంటాయి. ఈ సంస్థలు అన్నింటి లక్ష్యం ఒక్కటే బిజెపిని అధికారంలోనికి
తేవడం. దాని అధికారాన్ని నిరంతరం కొనసాగించడం.
21. రాజకీయాధికారం, రాజ్యాధికారాల
విషయంలో సంఘపరివారం చాలా స్పష్టంగా వుంటుంది.
దాన్ని సాధించే విషయంలో గొప్ప అంకితభావంతో పనిచేస్తుంది.
22. రాజకీయాధికారంతోపాటూ రాజ్యాధికారాన్ని
కూడ హస్తగతం చేసుకున్న సంఘపరివారం మనవాద జాతిని బలోపేతం చేస్తుంది. అంటే స్వీయసమాజంలో
ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అది కృషి చేస్తుందని కాదు. అలా చేస్తే అది సామ్యవాది అయిపోతుంది. సామ్యవాదాన్నీ, ముస్లిలను సంఘపరివారం ప్రధాన శత్రువులుగా
భావిస్తుంది.
అణగారిన సమూహాల
కనీస ఉమ్మడి కార్యక్రమం
ఏమిటీ? - 2
ఉషా యస్ డానీ
23. దేషంలోని సహజ సంపదల్ని సంఘపరివారం
తనకు ఇష్టమైన కొన్ని కార్పొరేట్లకు కట్టబేడుతుంది. ఆ కార్పొరేట్ల అభివృధ్ధే దేశాభివృధ్ధిగానూ, జాతిని బలోపేతం చేసేదిగానూ ప్రచారం
చేస్తుంది. ఈ వ్యవహారం ఏ స్థాయికి వెళుతుందంటే చివరకు దేశరక్షణ బాధ్యతను సహితం సదరు
కార్పొరేట్లకు అప్పచెపుతుంది.
24. కాకుల్ని కొట్టి గద్దలకు
పెట్టే పనుల్ని సామాన్య హిందువులు సహితం వ్యతిరేకిస్తారు. వాళ్ళ నిరసనల్ని, కోపాన్నీ,
ఆవేశాన్నీ మతఅల్పసంఖ్యాక సమూహాల మీదకు నెట్టడం సంఘపరివారానికి పుట్టుకతో అబ్బిన విద్య.
25. సంఘపరివార వ్యతిరేక శక్తులకు ఇన్ని విభాగాలు వుండవు. ఓ రాజకీయ పార్టీతోపాటూ ఓ
యువజన సంఘం, ఓ కార్మిక సంఘం ఓ విద్యార్థి సంఘం వంటి రెండు మూడు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్
మాత్రమే వుంటాయి.
26. ఆ రెండు మూడు అనుబంధ సంఘాలు
కూడ ఏక లక్ష్యంతో పని చేయవు. వాళ్ళ నాయకుల మధ్య ప్రగాఢ ఐక్యత కూడా వుండదు. ప్రధాన ప్రత్యర్ధిని ఐక్యంగా ఎదిర్కోవాల్సిన సమయంలో
వాళ్లంతా అంతర్గత కుమ్ములాటలో కూరుకుపోతుంటారు.
27. లోక్ సభ ఎన్నికల్లో సాధారణంగా
ప్రధానమంత్రి తన పథకాల ఘనతను గుర్తు చేసి వాటి విజయాలను వివరించి మళ్ళీ తనను గెలిపించమని
కోరుతారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకోవడానికి అలా విజయవంతమైన ఒక్క పథకం
కూడా లేదు.
28. నరేంద్ర మోది విదేశీ బ్యాంకుల్లోని
భారత నల్ల ధనాన్ని వెనక్కు తెస్తానన్నారు. ఆ డబ్బును పంచితే దేశంలో ప్రతి ఒక్కరికీ
15 లక్షల రూపాయలు ఉచితంగా వస్తాయని లెఖ్ఖలుగట్టి చెప్పారు. పెదనోట్లను రద్దు చేస్తే దేశంలోని నల్లధనం మొత్తం
బయటికి వస్తుందన్నారు. ఆ డబ్బుతో ప్రజలకు సకల సౌకర్యాలు ఉచితంగా కల్పించవచ్చన్నారు.
స్వఛ్ఛ భారత్ అన్నారు. మేక్ ఇన్ ఇండియా అన్నారు.
జిడిపి గ్రోత్ రేటు పెంచుతామన్నారు. ఇంకేవో ఇంకేవో అన్నారు. వాటిల్లో ఒక్కటీ విజయవంతం
కాలేదు.
29. నరేంద్ర మోదీ ప్రభుత్వం
గతంలో ఎన్నడూ లేనంతగా సహజవనరుల్ని, ప్రజాధనాన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు అడ్డంగా
కట్టిపెట్టింది.
30. గొప్పగా చెప్పుకోవడానికి
నరేంద్రమోదీ దగ్గర ఒక్క ప్రాజెక్టు కూడా లేదు గాబట్టి, జనం ఆయనకు ఓటు వేయరని విపక్షాలు
ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేశాయి. విజయం కోసం తాము చేయాల్సిన పనులు చేయకుండా చేయరాని
పనులన్నీ చేశాయి. అధికారంలోనికి వచ్చేశామనే భ్రమకు గురయ్యి ‘కాబోయే’ ప్రధాని పదవికి పోటీలు పడ్డాయి.
ప్రజాస్వామ్య సంక్షోభ సమయంలో ఇదొక విషాదకర ప్రహసనం.
31. ప్రెజెక్టుల పేరు చెపితే
తమకు ఓట్లు రావని నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయానికి ముందుగానే స్పష్టంగా తెలుసు. ముందుచూపు
తోనే ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ-అమిత్ షా ద్వయం ఎక్కడా ప్రాజెక్టుల ప్రస్తావన
తేలేదు.
32. వాళ్ళు బాహాటంగా మత ప్రాతిపదిక
మీద ఓట్లు అడిగారు. మబ్బుల చాటున యుధ్ధ విమానాలను దాచి పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్
వ్యూహాన్ని రచించినట్టు పిట్టకథలు చెప్పారు.
33. ఇది ‘సోషల్ మీడియా సింహాల’ తరం. కుత్రిమ దేశ భక్తి , పరమత ద్వేషాలతో
రెచ్చగొడితే కొత్త తరం భావోద్వేగాలు, ఈగో/అహం అన్నీ సంతృప్తి చెందుతాయి. ఈ విషయం నరేంద్ర
మోదీ-అమిత్ షా ద్వయానికి, సంఘపరివారం వ్యూహకర్తలకు బాగా తెలుసు. వాళ్ళు ఆ పనే చేశారు.
వాళ్ళు ఆశించినట్టే జనం ఓట్లేశారు. సంఘపరివారానికి నిజాయితీగా దేశభక్తి వుంటే మన దేశ
ఆర్ధికవ్యవస్థను దోచేస్తున్న సామ్రాజ్యవాదంతో అది ఘర్షించి వుండేది. అలా జరక్కపోగా
సంఘపరివారం సామ్రాజ్యవాదులతో నిత్యం సన్నిహితంగా వుంటోంది. కీలక సందర్భాలలో లొంగిపోతూ వుంది. ఇరాన్ దేశం కారుచౌకగా పెట్రోలు అమ్ముతామన్నా కొనవద్దని
అమెరికా ఆదేశిస్తే యస్సార్ అంటూనే తామే గొప్ప దేశభక్తులమని ప్రచారం చేసుకోవడంలో నరేంద్ర
మోదీ సఫలమయ్యారు.
34. 2019 ఎన్నికలు మూడవ పానిపట్టు
యుధ్ధమని అమిత్ షా ఓ నాలుగు నెలల ముందే వ్యూహాత్మకంగా ప్రకటించారు. అంటే, మధ్యయుగాల
మతయుధ్ధమని వారు బాహాటంగా చెప్పారు.
35. భారత దేశంలో మత ప్రాతిపదికన
ఎన్నికలు జరపగలిగితే విజయం హిందూమత సమూహాన్ని వరిస్తుందని 1951లో భారతీయ జన సంఘ్ ను
నెలకొల్పినపుడే శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఊహించారు. దాదాపు ఏడు దశాబ్దాల తరువాత వారి
కల సాకారం అయింది.
36. సంఘపరివారాన్ని విమర్శించేవాళ్ళు
సహజంగానే హిందూత్వని విమర్శిస్తారు. హిందూత్వ అంటే హిందూ రాజకీయ ఆర్ధిక అధికారం. హిందూమత
విశ్వాసులు, మనువాదులు వేరు వేరు. ఒకటి భక్తి; మరొకటి స్మృతి.
37. మనువాద వ్యతిరేకులు, పీష్వారాజ్యాన్ని
కూలదోయాలనుకున్న వారు హిందూత్వను విమర్శించినపుడు సామాన్య హిందువులు సహితం అపార్ధం
చేసుకుంటారు. వాళ్ళు తమనే విమర్శిస్తున్నారని అపార్ధం చేసుకుంటారు.
38. భారత సమాజంలో కులం ప్రతి
ఒక్కరి ఉనికి; అస్తిత్వం. కులం, మతం కొనసాగుతాయి. ఇంకో రెండు వందల ఏళ్ళు వీటికి ధోకా
లేదు. సమాజంలో నశించాల్సింది కులోన్మాదం, మతోన్మాదం, ఉగ్రవాదాలు మాత్రమే. సామాన్య హిందూ
విశ్వాసుల మనోభావాలను రాజకీయ ఆర్ధిక ప్రయోజనం లేకుండా అకారణంగా గాయపరచడం ఘోరమైన తప్పు.
ఈసారి లోక్ సభ ఎన్నికల రాజకీయాల్లో అదే జరిగింది. విభిన్న రాజకీయ పార్టీల మధ్య వుండే
ఘర్షణ తరచుగా మత విశ్వాసుల మధ్య ఘర్షణగా కనిపిస్తుంటుంది. నిజానికి విభిన్న మతాల విశ్వాసుల
మధ్య ఐక్యత వుంటుంది. Unity of bilievers!.
39. ముస్లిం సమాజంలోనూ ఇలాగే
జరుగుతోంది. ఇస్లామిస్ట్ వేరు ఇస్లామిక్ వేరు.
ఎవరయినా ఇస్లామిస్ట్ ధోరణిని విమర్శిస్తే
తేడా తెలీక కొందరు సామాన్య ముస్లింలు కూడ బాధ
పడతారు. ఇతర సమూహాలు కూడ ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని విమర్శించాల్సిన సందర్భాల్లో ముస్లీంలను
సహితం విమర్శిస్తుంటారు. అహింసే పరమ ధర్మం అని ప్రకటించిన బౌధ్ధంతో సహా ఇప్పుడు అన్ని మత సమూహాల్లోనూ ఉగ్రవాదం ఉనికిలోవుందన్న అంశాన్ని మనం తరచూ మరచిపోతున్నాం.
40. మనువాద వ్యతిరేకుల అతిఆత్మవిశ్వాస,
అతిఉత్సాహ వ్యూహాలు వాళ్ళకు విజయాన్ని అందించకపోగా, ప్రత్యర్ధి శిబిరాన్ని మరింత బలోపేతం
చేశాయి. మనువాద వ్యతిరేకుల తప్పుల కారణంగా, మనువాదుల విజయం అనివార్యం అయింది. Sanghaparivar
is deemed to win.
41. మనువాద వ్యతిరేకులు ఏ సందర్భంలో
అయినా సరే హిందూ, హిందూత్వ పదాలను నిందార్ధంలో వాడకపోవడమే శ్రేయస్కరం. బ్రాహ్మణవాదులు
అనే ప్రయోగాన్ని కూడా మనం మానేయ్యాలి. మనం ఒక వ్యవస్థ మీద విసిరే బాణం గురితప్పి ఇంకో
అర్ధంలో ఒక కులానికి తగులుతోంది. ఇందులో లాభంకన్నా నష్టం ఎక్కువగా వుంటోంది.
42. మార్క్స్ ను అభిమానించేవాళ్ళను
మార్క్స్ వాదులు అంటున్నట్టు, మనుస్మృతిని అభిమానించేవాళ్ళను మనువాదులు అంటే సరిపోతుంది.
లౌకికతత్వాన్ని అభిమానించేవాళ్ళను లౌకిక వాదులు అనీ, హేతువును ప్రమాణికంగా భావించేవారిని
హేతువాదులని మనం అంటున్నాం కదా!
43. మనువాదుల ఎన్నికల వ్యూహం చాలా స్పష్టం. మొత్తం ఓటర్లను మత ప్రాతిపదిక మీద హిందూ-హిందూయేతర శిబిరాలుగా చీల్చాలి.
ముస్లింలు, కమ్యూనిస్టులు, హేతువాదులు, నాస్తికులు, ఉదారవాదులు, మతసామరస్యవాదులు, పౌర-మానవ హక్కులవాదుల్లో
ఎక్కువమంది, హిందూయేతరులుగా వుంటారు. వాళ్ళతోపాటు అంబేడ్కరిస్టులు, క్రైస్తవుల్లో ఒక భాగం కూడా హిందూయేతరులుగా
వుంటారు. అంతిమంగా, ఓటర్లను మత ప్రాతిపదిక
మీద చీలిస్తే హిందూ శిబిరంలో 70 శాతం హిందూయేతర
శిబిరంలో 30 శాతం మాత్రమే వుంటారు.
కనీస
ఉమ్మడి కార్యక్రమం ఏమిటీ? - 3
ఉషా యస్ డానీ
44.
డెభ్భయి శాతం ఓటర్లతో వుండే హిందూ శిబిరంలో ‘సాఫ్ట్ హిందూ’ కాంగ్రెస్ కన్నా ‘హార్డ్ హిందూ’
బిజెపికే కచ్చితంగా మద్దతు ఎక్కువగా వుంటుంది.
అప్పుడు సహజంగానే మనువాదుల విజయం సులువు
అవుతుంది. మనువాదుల విజయం, హిందూయేతరుల ఓటమి ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే ఖాయం
అయిపోతోంది.
45.
సాంస్కృతిక
జాతీయవాదం మనువాదుల ప్రధాన అస్త్రం. ఇతరుల్ని వాళ్ళు జాతివ్యతిరేకులుగా చిత్రించి తమ
శిబిరాన్ని బలోపేతం చేసుకుంటారు. జాతీయవాదానికీ దేశభక్తికీ మధ్యనున్న గుణాత్మక తేడాను
గమనించడం వాటిని సామాన్య ప్రజలకు వివరించడం చాలా అవసరం.
46. అణగారిన సమూహాల ఎన్నికల
పోస్ట్ మార్టం నివేదిక ప్రతిసారీ ఒకేలా వుంటుంది. మనువాదులు ఎన్ని అక్రమాలు చేసి, ఎన్ని
అబధ్ధాలు చెప్పి గెలిచారో, మనువాద వ్యతిరేకులు అమాయికంగా ఎన్ని రకాలుగా మోసపోయి ఓడిపోయారో
చెప్పుకుంటాం. ఇలాంటి విలాపాలవల్ల ఒరిగేది ఏమీ వుండదు. కానీ చెయ్యాల్సింది ఏమిటీ? మార్చాల్సింది
ఏమిటీ? మనువాద వ్యతిరేకులు ఎలా గెలుస్తారో మనువాదుల్ని ఎలా ఓడిస్తారో చెప్పగలగాలి. అదొక్కటే కావాలిప్పుడు. బాఖీ సబ్ బఖ్వాస్!
47.
ఎన్నికల్లో
పోలింగ్ కు రెండు మూడు రోజుల ముందు ఒక గుణాత్మక మార్పు జరుగుతుంది. సిధ్ధాంతాలు సాంప్రదాయాలను
పక్కన పెట్టి గెలుపు గుర్రం వైపుకు ఒక 10-15 శాతం ఓటర్ల మద్దతు హఠాత్తుగా పెరిగిపోతుంది.
పెట్రోలు ప్యానిక్ బయ్యింగ్ లా పోలింగ్ రోజు క్రేజీ ఓటింగ్ జరుగుతుంది.
48.
బిజేపి
కఛ్ఛితంగా గెలుస్తున్నదని గట్టిగా ప్రచారం కావడంతో జ్రేజీ ఓటింగ్ జరిగింది. పార్టీ
అభిమానాలు, సిధ్ధాంత అభిమానాలు, మతవిశ్వాసాలు, అభ్యర్ధి అభిమానాలకు విరుధ్ధంగానూ క్రేజీ
ఓటింగ్ సాగుతుంది. ప్రధాన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ ఓట్లే కాకుండ సంఘపరివారాన్ని
సూత్రరీత్యా వ్యతిరేకించే కమ్యూనిస్టు, ముస్లిం ఓటర్లు సహితం ఈసారి చీలిపోయి క్రేజీ
ఓటింగ్ కు పాల్పడ్డారు. బిజెపి ఘన విజయానికి కారణం ఇదే.
49. ఇప్పటికే ముస్లిం సమాజంలోని
షియా, సూఫీ తెగల్ని మనువాదులు తమ వైపుకు లాక్కొంటున్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్ ను శిక్షించదగ్గ నేరంగా పరిగణించే చట్టాన్ని తెస్తున్నామనే
వంకతో సున్నీ తెగలోని స్త్రీలనూ తమవైపు ఆకర్షించే పనిలోనూ వాళ్ళున్నారు. తక్షణ ట్రిపుల్
తలాక్ చెప్పిన ముస్లిం భర్తలు, ఈ ఆధునిక అమానుష సాంప్రదాయాన్ని సకాలంలో ఖండించని ముస్లిం
మత పెద్దలు సహితం ఇలాంటి పరిస్థితి రావడానికి
ఒక కారణం అనేది కాదనలేని వాస్తవం.
50. ముస్లింలు, కమ్యూనిస్టులు,
క్రైస్తవులు, ఎస్సీలు బిజేపీని బలపరచరు అనేది ఒక పాత ఆలోచన (narrative). శతృవు మరీ
బలవంతుడిగా కనిపించినపుడు ప్రజలు భయం వల్లనో. భద్రతను కోరుకునో, దుమ్ముగుండంలో కొట్టుకుపోయో
శతృశిబిరంలో పడతారు. కిడ్నాప్ అయిన అమ్మాయి కిడ్నాపర్నే ప్రేమించడాన్ని మనం కొన్ని
సినిమాల్లో చూస్తున్నాంకదా! ఇదీ అలాంటిదే.
51. Zygmunt Bauman అన్నట్టు
Liquid Modernity కాలంలో నిన్నటి వరకు ద్వేషించి
తరిమికొట్టిన వాటినే ఈరోజు మనం ప్రేమించి దగ్గరకు తీసుకుంటాము. ఆంధ్రా ప్రాంతపు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా
ఉద్యమించి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు బయటి పెట్టుబడుల కోసం ఎదురు
చూస్తున్నది.
52.
మనువాదుల్ని
ఎదుర్కోవడానికి అణగారిన సమూహాలు మార్క్ సిస్టులుగానో, నాస్తికులుగానో అంబేడ్కర్ ఆచరించినట్టు బౌధ్ధులుగానో మారాల్సివుంటుందా?
వాళ్ళు హేతువాదులుగా మారితీరాలనే వింత ప్రతిపాదనలు కూడ మనువాద వ్యతిరేక శిబిరంలో వినిపిస్తున్నాయి.
53. అణగారిన సమూహాల విముక్తికి
నాస్తికత్వమో, హేతువాదమో ప్రాతిపదిక కావాల్సిన పనిలేదు. నాస్తికులు, హేతువాదులు ధార్మికరంగంలో
దేవుని ఉనికిని మాత్రమే నిరాకరిస్తారు. కానీ ఆర్ధికరంగంలో పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల్ని
నిరాకరించరు. “Reason alone, without passion to fight
against injustice was sterile (వ్యంధత్వం) అని సాక్షాత్తు హేతువాద
ఆద్యుడు Rousseau యే చెప్పాడు.
54. ముస్లింలు, క్రైస్తవులు
మాత్రమేగాక మత విశ్వాసాలున్న ఎస్ సిలు బిసిలు
కూడ నాస్తిక హేతువాదాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. తమ మత అస్తిత్వాన్ని మనువాదుల నుండి
ముప్పు వున్న కారణంగా మైనారిటీలు మనువాద వ్యతిరేకుల
శిబిరంలోనికి చేరుతారు. మరో వైపు, మనువాద వ్యతిరేకులు సహితం మైనారిటీలను తమ మతాలను
వదులుకోవాలని షరతు విధిస్తే వాళ్ళు ఊరుకుంటారా?
మైనారిటీ మత సమూహాల విషయంలో మనువాదులకూ, మనువాద వ్యతిరేకులకు మధ్య తేడా లేదని
విమర్శిస్తారు. అలాంటి కొత్త వివాదాన్ని కొని తెచ్చుకోవడం మనకు అవసరమా?
55.
యుధ్ధంలో
గెలవడానికి రెండే కారణాలుంటాయి. మన శక్తియుక్తుల్ని నూటికి నూరు శాతం ప్రయోగించాలి.
ప్రత్యర్ధి శక్తియుక్తుల్నినిర్వీర్యం చేయాలి.
యుధ్ధ సమయంలో కొత్త మిత్రుల్ని సృష్టించుకుంటే విజయావకాశాలు పెరుగుతాయి. యుధ్ధ సమయంలో
కొత్త శతృవుల్ని సృష్టించుకుంటే ఓటమి అవకాశాలు పెరుగుతాయి. మనం మనువాదాన్ని ఓడించాలంటే మనువాదుల్ని వ్యతిరేకించే సమూహాలన్నింటినీ
పెద్ద ఎత్తున సమీకరించాలి.
56.
అణగారిన
సమూహాలు ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లలో వాళ్ళ వాటా 60 శాతం కన్నా ఎక్కువగా వుండాలి.
మనువాదుల్ని అల్పసంఖ్యాకులుగా మార్చి, తాము అధికసంఖ్యాకులుగా మారాలనే వ్యూహం జ్యోతిబా
ఫూలేకు వుందనిపిస్తోంది. అందుకే ఆయన ఇవ్వాల్టీ
ఎస్ సి, ఎస్ టి, మైనారిటీలతో శూద్ర వర్ణాన్ని కూడా కలిపాడు. శూద్ర-అతిశూద్ర అన్నాడు.
57.
మనువాదుల్ని
అల్పసంఖ్యాకులుగా మార్చాలనే ఒక పటిష్ట వ్యూహం బాబాసాహెబ్ అంబేడ్కర్ లో కనిపించలేదు.
రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన కొత్తలోనే బిసిలు దాని మీద తిరగబడ్డారు. పెరియార్ రామసామి
నాయకర్ ఏకంగా భారత రాజ్యాంగ ప్రతుల్ని నడివీధుల్లో తగలబెట్టారు.
58.
అయితే,
1984లో బాబాసాహెబ్ అంబేడ్కర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీని ఆరంభించిన
కాన్షీరామ్ కు మనువాదుల్ని అల్పసంఖ్యాకులుగా మార్చాలనే వ్యూహం వుంది. “మనం 85 శాతం
వాళ్ళు 15 శాతం” అనేవారు ఆయన. మాయావతి కథ వేరు. కాన్సీరామ్ నిర్మాత; మాయవతి ఆస్వాదిత!.
59.
మనువాదుల
మీద సాగే పోరులో ఒక దశలో నాస్తికులు హేతువాదులు కూడా వచ్చి చేరుతారు. అంతమందిని సమీకరిస్తే
తప్ప అణగారిన సమూహాలకు రాజకీయ అధికారం వచ్చే అవకాశాలు మెరుగుపడవు.
60. అలా సమీకరించాలంటే చాలా
తగ్గాలి, ఎంతో సంయమనాన్ని పాటించాలి. గత జ్ఞానాన్ని వదులుకోవాలి. కొత్త జ్ఞానాన్ని
అలవరచుకోవాలి. ఈ క్రమంలో అన్నింటికన్నా కష్టమైన పని సమాజవాస్తవాన్ని అవసరాలనీ గుర్తించి వాటికి అనుగుణంగా మనల్ని మనం సవరించుకోవడం.
61.
రాజకీయ,
సాంఘీక, ఆర్ధిక సంస్కరణల్లో దేన్ని ముందు చేపట్టాలి దేన్ని చివర్లో పూర్తి చేయాలి అనే
విషయంపై తీవ్ర భిన్నాభిప్రాయాలున్నాయి. అణగారిన సమూహాలకు రాజకీయ అధికారం తొలి లక్ష్యం.
మలి లక్ష్యం రాజ్యాధికారం. అంతిమ లక్ష్యం సాంఘీక
సమానత్వం.
కనీస ఉమ్మడి కార్యక్రమం
ఏమిటీ? - 4
ఉషా యస్ డానీ
62. సవర్ణుల్లోనూ వ్యవసాయ కులాల
సమూహాల్లోనూ కుల వ్యవస్థను వ్యతిరేకించేవాళ్ళుఅస్సలే
వుండరని అనలేం. అలాగే, ఎస్ సీలు, బిసీలు అందర్నీ అంబేడ్కరిస్టులేనని తీర్మానించలేం.
63. అలా దేశంలోని అన్ని మతాలు,
అన్ని కులాలు, అన్ని తెగల నుండేగాక అగ్రవర్ణాల నుండి కూడ మనువాద వ్యతిరేకుల్ని సమీకరించడం
ఒక అవసరం.
64. మనువాద వ్యతిరేకుల్లో అంబేడ్కరిస్టులు
వుంటారు మార్క్సిస్టులూ వుంటారు. భక్తులు వుంటారూ. నాస్తికులు, హేతువాదులూ వుంటారు.
వీళ్లంతా మనువాద వ్యతిరేకులుగా ఐక్యతను పాటిస్తారా? లేక పరస్పర విరుధ్ధ సిధ్ధాంతాలతో
ఘర్షణ పడతారా? ఇది చాలా ఇబ్బందికర అంశం.
65.
కొందరు
అంబేడ్కరిస్టులు మనువాదులతో కలవడానికి కూడ సిధ్ధపడుతున్నారు (రామ్ విలాస్ పాశ్వాన్,
రామదాస్ అథవాలే) గానీ మార్క్సిస్టులతో కలవడానికి మాత్రం ససేమిర అంటున్నారు.
66. మరికొందరు అంబేడ్కరిస్టులు
అసలు సోషలిజం అంటే చాలు మండిపోతున్నారు. అది
భారత రాజ్యాంగపు మూడు ఆదర్శాల్లో ఒకటి అని గుర్తు చేసినా ఒప్పుకోవడంలేదు. వాళ్ళు సామ్యవాద
ఆదర్శాలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, వాళ్ళే భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ అంటున్నారు.
ఇదొక ద్వంద్వం.
67. అంచేత మనువాద వ్యతిరేక సిధ్ధంతాల
ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఏకమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎందుకంటే
మనువాదాన్ని వ్యతిరేకించేవారు ఒక్కొక్కరు ఒక్కో కుంపటి పెట్టుకున్నారు.
68. ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీలను
ఏకం చేస్తే సంఖ్య రీత్య బహుజనులు అవుతారనేది కాన్షీరామ్ ఫార్మూలా. ఈ ఫార్మూలా అప్పట్లో
కొన్ని సానుకూల ఫలితాలను కూడ ఇచ్చింది. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.
69. ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీలు
సామాజికంగా అణగారిన సమూహాలు కాబట్టి వీరి మధ్య ఐక్యతకు ఒక బలమైన పునాది వుంది.
70. అయితే, ఎస్ సి, ఎస్ టి,
బిసి, మైనారిటీలు లక్ష్యాలు ఒకటి కాదు. పరస్పరం విరుధ్ధమైనవి. అంచేత వీరి మధ్య అంతే
స్థాయిలో ఘర్షణ కూడ వుంది.
71. కేవలం ఐక్యతను మాత్రమే పరిగణించడం
ఎంత తప్పో కేవలం ఘర్షణను మాత్రమే పరిగణనలోనికి తీసుకోవడం కూడ అంతే తప్పు.
72.
“నేను హిందువుగా పుట్టాను గానీ హిందువుగా చనిపోను’’
అని బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్నారు. దీని అర్ధం ఏమిటీ? మహర్లు (ఎస్సీలు) అందరూ హిందువులు
అని ప్రకటించడమేగా! అదీగాక, హిందూ కోడ్ బిల్లు మీద చర్చ సందర్భంగానూ ఇస్లాం,
పార్సీ, క్రైస్తవం, యూదు మతాలను స్వీకరించని భారతీయులంతా ధార్మికంగా హిందువులు అని
అంబేడ్కర్ నిర్వచించారు. అంతే గాక శిక్కు, జైన, బౌధ్ధ మత సమూహాలను హిందూ సమాజంలో అంతర్భాగంగా
పేర్కొన్నారు. చనిపోవడానికి ఆరు వారాలు ముందు అంబేడ్కర్ బౌధ్ధాన్నీ స్వీకరించడం కూడ
వారి నిర్వచనం ప్రకారం హిందూమతం నుండి హిందూ మతానికి మారడం గా భావించవచ్చు.
73. కార్ల్ మార్క్స్ తన అనుయాయులకు
వర్గనిర్మూలన కార్యక్రమాన్ని సూచించినట్టు బాబాసాహెబ్ అంబేడ్కర్ తన అనుయాయులకు కులనిర్మూలన
కార్యక్రమాన్ని ఆదేశించారు.
74.
బిసిల
కార్యక్రమం కూడా సూత్రప్రకారం కులనిర్మూలనే. అయితే, బిసీలలో అత్యధిక భాగం ఇప్పుడు తాము
హిందువులమని ప్రకటించు కోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వారు అక్కడితో ఆగడంలేదు. మనువాదులకు
ఈరోజు కాల్బలంగా వుంటున్నది బిసీలే. “హిందూమతానికి కొత్త రక్షకులు మీరే” అంటే బిసీల్లో
కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నది.
75.
వర్గవ్యవస్థలో మధ్యతరగతివర్గం, కులవ్యవస్థలో వెనుకబడిన
కులాలు కలుషితం అయిపోయి పాలక వర్గాలతోనో, పాలక కులాలతోనో భావ సారూప్యతను పొందినపుడు
సామాజిక మార్పుకు పెద్ద ముప్పు ఏర్పడుతుంది.
76.
దళిత,
బహుజన, శూద్ర, అతిశూద్ర పదాల్ని ఇప్పుడు పునర్ నిర్వచించుకోవాలి. ఈ పదాలకు అతివిస్తృత
అర్ధాలు వున్నాయి. అతిసంకుచిత అర్ధాలు వున్నాయి. దళిత మహా సభ ఆవిర్భవించినపుడు దాన్ని
ఎస్ సి, ఎస్ టి, బిసి, మైనారిటీల వేదిక అనేవారు. ఆ తరువాత అది అలా లేదు. బహుజన పదం
కూడ అలాంటి సంకుచిత అర్ధాన్ని సంతరించుకుంది. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీలో బహుజనులు
అంటే ఎస్సీలే. సమాజ్ వాది పార్టీలో బహుజనులు అంటే బిసీలే.
77. భారత ముస్లిం సమాజంలోనూ
కులపోకడలు వున్నాయిగానీ వాటికి ధార్మిక సమర్ధనలేదు కనుక వారికి కులనిర్మూలన దళితులు,
బిసిలకు వున్నంత ప్రధాన సమస్యకాదు.
78.
పెట్టుబడీదారీ
వ్యవస్థను కార్ల్ మార్క్స్ ఎక్స్ – రే తీసిచూపిస్తే, కులవ్య వస్థను బాబాసాహెబ్ అంబేడ్కర్
ఎంఆర్ ఐ MRI (Magnetic resonance imaging) స్కానింగ్ చేసి చూపించాడు.
79.
నేను
ముస్లీం థింకర్స్ ఫోరం కన్వీనర్ గా వుంటున్నాను గాబట్టి ప్రతి సామాజిక పరిణామంలోనూ
ముస్లింల ప్రయోజనాలను కూడ చూడడం నాకు అదనపు బాధ్యతగా వుంటుంది. ముస్లింలకు ప్రవక్త
ముహమ్మద్ తొలి సంఘ సంస్కర్త. ఆధునిక సంఘ సంస్కర్తల్లో అంబేడ్కర్ సామాజిక దృక్పధాన్ని ప్రశంసించినంతగా
అంబేడ్కర్ రాజకీయ విధానాలను ముస్లింలు ప్రశంసించలేరు. ముస్లింలకు అంబేడ్కర్ కన్నా జోతిబా
ఫూలే, రామసామి నాయకర్ ఎక్కువ సన్నిహితులుగా కనిపిస్తారు.
80.
భారత
క్రైస్తవులు సహితం మతసామరస్యాన్నే కోరుకుంటున్నారు. భారత ముస్లింలకు, క్రైస్తవులకు
ఒక ప్రత్యేకత వుంది. ఆ రెండు మత సమూహాలు మైనారిటీలుగా వున్న దేశం భారత్ మాత్రమే.
81.
దళితులు
ముస్లింల మధ్యనే ప్రస్తుతం కొంచెం మెరుగైన అనుబంధం ఐక్యత కనిపిస్తున్నది. దళితుల్లో
ఎక్కువ మంది క్రైస్తవ ప్రభావంలో వుండడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. కొన్ని ప్రత్యేక
సందర్భాల్లో ఇద్దరి మధ్య ‘మైనారిటీ’ అనే అంశ పనిచేస్తున్నది. “జైభీమ్! జై మీమ్!” నినాదానికి
ఆదరణ పెరుగుతోంది. ఇక్కడ మీమ్ అంటే ముస్లిం
అని ఒక అర్ధం, ప్రవక్త ముహమ్మద్ అనేది ఇంకో
అర్ధం. ముస్లింలకు సంబంధించినంత వరకు అంబేడ్కర్ తో ఐక్యత ఘర్షణ రెండూ వుంటాయి.
82. భారత ముస్లింల సామాజిక జీవన
లక్ష్యం మతసామరస్యం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముస్లింలకూ హిందూ సవర్ణులు, వ్యవసాయ
కులాల మధ్య సామరస్యం. హిందూ సమాజపు ప్రధాన దేవుళ్ళు అయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుల్ని
అంబేడ్కర్ అవహేళన చేసినట్టు తామూ విమర్శించాలని ముస్లింలు ఎన్నడూ అనుకోరు.
83.
ఆదివాసులు
అసలు ఎక్కడా మిగిలిన అణగారిన సమూహాలతో కలిసి రావడంలేదు. ఆదివాసుల ప్రధాన సమస్య మైదానవాసులతోనే.
వాళ్లు మైదాన ప్రాంతపు విద్యాధిక మధ్యతరగతివర్గాన్ని చూసి సహజంగానే భయపడుతున్నారు.
ఒక వేళ ఎవరయినా గిరిజనులు మనతో కలిసి వస్తున్నారంటే వాళ్ళు అడవి ఆదివాసులుకాదు; అర్బన్ ఆదివాసులు. ఈ పరిణామాల్ని మనం గుర్తు పెట్టుకోవాలి.
84. ఒక్కొక్క అణగారిన సమూహానికి
ఒక్కొక్క సుదీర్ఘ భవిష్యత్తు లక్ష్యం వున్నప్పుడు అవి సమిష్టిగా సుదీర్ఘ భవిష్యత్తు
లక్ష్యాలను ఎలాగూ ఏర్పరచుకోలేవు. తక్షణ లక్ష్యాల సాధన కోసం అయినా అవి ఒక ఉమ్మడి కనీస
కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి.
85. కమ్యూనిస్టు పార్టీలకు ఆంధ్రప్రదేశ్
లో కమ్మా రెడ్డి కులాలే నాయకత్వం వహించాయి. వామపక్ష పార్టీల వైఫల్యానికి అందులోని సవర్ణ,
వ్యవసాయ కులాల నాయకుల అవగాహన పరిమితి కూడా ఒక కారణం.కమ్యూనిస్టు పార్టీల్లో కమ్మా రెడ్డి
కులాల వాళ్ళు కష్టపడ్డారు, నష్టపడ్డారు, చనిపోయారు,
లాభపడ్డారు.
అణగారిన సమూహాల
కనీస ఉమ్మడి కార్యక్రమం
ఏమిటీ? - 5
ఉషా యస్ డానీ
86. కమ్యూనిజం తమకు ఇంక పనికి
రాదు అనుకున్నప్పుడు వాళ్ళు కమ్యూనిస్టు పార్టీలను వదిలి వ్యాపారాల్లోనికి, వేరే రాజకీయ
పార్టీల్లోనికి పోయారు. ఇప్పుడు వాళ్ళ సంతతిలో
కొందరు నయా మనువాదులుగా మారే పనిలో వున్నారు. అయితే, అణగారిన సమూహాలకు అపకారం తలపెట్టడానికే కమ్యూనిస్టు పార్టీలు పనిచేశాయి
అనడం సరికాదు.
87. భారత దేశం కులవర్గ సమాజం. కులం దీని ప్రత్యేక స్వభావం. వర్గం దీని
విశ్వజనీన స్వభావం. భారత సమాజంలో మార్పుతేవాలంటే కుల స్వభావం మీద, వర్గ స్వభావం మీద
ఒకేసారి ఉమ్మడిగా పోరాటం చేయాలి. కానీ అలా జరగడంలేదు వర్గ నిర్మూలనవాదులు, కులనిర్మూలనవాదులు
చెరోవైపు నుండి ఉద్యమిస్తున్నారు. ఆ ఉద్యమాలైనా ఇప్పుడు వాళ్ళ ప్రకటిత లక్ష్యాల కోసం సాగడంలేదు.
వర్గ నిర్మూలనవాదులు, కులనిర్మూలనవాదులు ఒకరి నొకరు ప్రధాన శతృవు అనుకుంటున్నారు. మిత్రవైరుధ్యాలు
శత్రువైరుధ్యాలుగా మారిపోయాక మార్క్సిస్టులు
వర్గనిర్మూలన కార్యక్రమాన్ని చేయడంలేదు, అంబేడ్కరిస్టులు కులనిర్మూలన కార్యక్రమాన్ని
చేయడంలేదు. కులనిర్మూలన కోసం కులాంతర వివాహాలు విస్తృతంగా జరపాలని అంబేడ్కర్ రూపొందించిన కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు
చాలా విస్తృతంగా సాగించారు. నిజానికి ఈ విషయంలో అంబేడ్కరిస్టులే వెనుకపడ్డారు. అంబేడ్కరిస్టులకు
ఇతర కులాలతో సామరస్యం మాట అటుంచి అంతర్గతంగా కుల కొట్లాటల్లో కూరుకుపోతున్నారు.
88. దేశ ప్రజల అభ్యున్నతికి
అంబేడ్కర్ సూచించిన దారి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఉద్యమ కమ్యూనిస్టులకు ఆ దారి మీద
నమ్మకం లేదు. నక్సల్ బరీ గిరిజనుల సాయుధ పోరాటం కాలం నుండే విప్లవ కమ్యూనిస్టులకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం
లేదు.
89. పార్లమెంటరీ పంథాను నమ్ముకున్న
వామపక్షాలు అక్కడా తమ లక్ ష్యాలను సాకారం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వామపక్షాలను
ఇప్పుడు శ్రామికులూ నమ్మడం లేదు; వాళ్ళు నమ్ముకున్న పార్లమెంటరీ పార్టీలూ నమ్మడంలేదు.
సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న విప్లవ కమ్యూనిస్టులు సహితం తీవ్ర సైధ్ధాంతిక సంక్షోభంలో
పడిపోయి కొట్టుమిట్టాడుతున్నారు. ప్రజలతో అనుసంధానం కావడం కూడ వాళ్ళకిప్పుడు అర్థం
కావడంలేదు. వాళ్ళ పాత కార్యక్రమం అయిన నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ఎలా కొనసాగించాలో
మావోయిస్టులకే అర్థం కావడం లేదు.
90. అంబేడ్కరిస్టులు, సామ్యవాదులు
కలిసో విడిగానో దేశంలో ఒక ఉదారవాద ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పరచినా ఈ దశలో భారత
రాజకీయాల్లో ఒక మహత్తర విషయం అవుతుందని విప్లవ కమ్యూనిస్టులు సహితం భావిస్తున్నారు. అయితే అది మాయావతి
తరహాలో అవకాశవాదంతో మనువాదుల చంకనెక్కే పధ్ధతిలో వుండరాదనేది వాళ్ళ భావన.
91. శూద్రులూ, అతి శూద్రులు
1964లోనే వామపక్షాల నుండి కొంత వరకు బయటికి వచ్చేశారు. 1985 తరువాత నక్సలైట్ల నుండి
ఎక్కువ మంది బయటికి వచ్చేశారు. కమ్యూనిస్టుల ‘బారి’ నుండి బయట పడ్డాక శూద్రులూ, అతి
శూద్రులు అంబేడ్కరిస్టు మార్గంలో చేపట్టిన కార్యక్రమం ఏమిటీ? మనువాద సిధ్ధాంతంతో అధికారంలోవున్న బిజెపిని మనువాద
వ్యతిరేక సిధ్ధాంతంతో బలంగా ఎదుర్కోగలిగిన పార్టి
ఈ ఎన్నికల్లో దేశంలో ఎక్కడైనా వుందా?
92. కమ్యూనిస్టులు, అంబేడ్కరిస్టులు
అణగారిన సమూహాల అభ్యున్నతి కోసం కన్నా పాలకవర్గాలు, పాలక కులాల తగవుల్ని పరిష్కరించడంలో
తెగ ఉత్సాహం చూపుతారు. ఏన్టీఆర్ హయాంలో
1984 నాటి ఆగస్టు విప్లవం, తెలంగాణ మలిదశ ఉద్యమం దీనికి గొప్ప ఉదాహరణలు.
93. విద్యా, ఉద్యోగ, చట్టసభల్లో
ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ 1950 నుండే వుంది. ఆపైన, అంబేడ్కర్
సూచించిన పార్లమెంటరీ ప్రజాస్వామిక మార్గంలో పీడిత ప్రజలు రాజకీయాధికారాన్నీ, రాజ్యాధికారాన్ని
సాధించడానికీ, కులరహిత సమాజాన్ని నిర్మించడానికీ 1950 నుండి ఇప్పటి వరకు అంబేడ్కరిస్టులు
రూపొందించిన కార్యక్రమం ఏదైనా వుందా? అని అడిగితే లేదనేదే సమాధానం.
94. అంబేడ్కర్ 'కుల నిర్మూలన' గురించి కాకుండా ‘వర్ణనిర్మూలన' గురించి మాత్రమే చెప్పాడనే వాదమూ ఒకటుంది. అది నిజమే
అనుకున్నా ఇప్పుడు వర్ణ కార్యక్రమం అయినా వుందా? దాన్ని చేపట్టిన అంబేడ్కరిస్టు సంస్థ
ఏదైనా వుందా? మార్క్స్ నో అంబేడ్కర్ నో విమర్శించే కార్యక్రమం నాకు లేదు. మార్క్సిస్టులు అంబేడ్కరిస్టుల ఇప్పటి కార్యక్రమం ఏమిటో తెలుసు కోవాలనేదే నా ఆసక్తి
95. అణగారిన సమూహాల్లో ప్రస్తుతం
జరుగుతున్నదంతా ఒక రకం ఓదార్పు యాత్రలు మాత్రమే. ఎక్కడయినా ఎస్ సి, ఎస్ టి, బిసి,
మైనారిటీల మీద దాడులు జరిగితే అణగారిన సమూహాల ప్రతినిధులు కొందరు వెళ్ళి పరామర్శించి వస్తున్నారు. బాధితులకు మద్దతుగా
ఓ సభో సమావేశమో నిర్వహిస్తున్నారు. ఓ వ్యాసం రాసి పత్రికల్లో ప్రచురిస్తున్నారు. పౌరహక్కులు,
మానవ హక్కుల పరిరక్షణ చర్యలకు మించి ఎవరూ ఏమీ చేయడం లేదు. అణగారిన సమూహాలని పరామర్శించే
క్రీయాశీలురు తెలుగు రాష్ట్రాల్లో ఒక డజను మంది కూడ లేరు. మిగిలిన వాళ్లంతా సోషల్ మీడియా సింహాలు.
96. అణగారిన సమూహాల్లో రెండు
దృక్పధాలు వుంటాయి. అణిచివేతను భరించలేని వాళ్ళు, అణచివేత నుండి బయటపడాలనే బలమైన కోరిక
వున్నవాళ్ళు మనువాదులతో భీకర పోరాటానికి సిధ్ధపడతారు. వున్న వ్యవస్థ సౌకర్యవంతంగానే
వుందని భావించేవాళ్ళు, అణచివేత నుండి బయటపడాలనే బలమైన కోరిక లేనివాళ్ళు తమ పోరాటాన్ని సాటి అణగారిని సమూహాల
మీదికి మళ్ళిస్తారు.
97. సామాజిక మాధ్యమాల్లో స్వయం
ప్రకటిత అంబేడ్కరిస్టులు అనేకులు కనిపిస్తారు. వీరు నిత్యం కమ్యూనిస్టుల మీద వీరోచిత
పోరాటంలో నిమగ్నమై వుంటారు. వీరి వాల్ లోనికి
వెళ్ళి చూస్తే మనువాదుల మీద సైధ్ధాంతిక పోరాటాన్ని ఆపేస్తున్నారని సులువుగానే అర్ధం
అవుతుంది. వీరు మనువాదుల
మీద ఓ పది శాతం పోస్టులు పెడితే కమ్యూనిస్టుల మీద 90 శాతం పోస్టులు పెడుతారు. వీరి
ఉద్దేశ్యంలో మనువాదులకన్నా మార్క్సిస్టులు ప్రథాన శత్రువులు. మార్క్సిస్టులు,
అంబేడ్కరిస్టుల కలయికకు వీరే ప్రధాన అడ్డంకి.
98. కొందరు అంబేడ్కరిస్టులు
ఇప్పుడు కమ్యూనిస్టుల మీద ఒక పరంపరగా చేస్తున్న విమర్శలు యాదృఛ్ఛికం కాదనే వాదనలు కూడా
వినిపిస్తున్నాయి. కమ్యూనిస్టు పార్టీలను నిర్వీర్యం చేయడం వెనుక పెట్టుబడీదారీ సమాజపు ప్రయోజనాలు సహితం వున్నాయన్నది
స్పష్టం. ఇప్పుడు అకారణంగానే కమ్యూనిస్టుల
మీద దాడి చేస్తున్న అంబేడ్కరిస్టుల్ని వెనుక నుండి నడుపుతున్న శక్తులెవరో తెలుసుకోవడం కూడ ఒక ఆసక్తికర అంశం.
99. అణగారిన సమూహాలు తమ సుదీర్ఘ
అంతిమ లక్ష్యాల సాధన విషయం ఎలావున్నా, ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా తక్షణ, సమీప ప్రయోజనాల సాధన కోసం అయినా ఒక ఉమ్మడి కనీస కార్యక్రమాన్ని
(Common Minimum Programme) సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి కనీస కార్యక్రమం
కూడ లేకుండా మనలో చాలా మంది నేల విడిచిన సాము చేస్తున్నారు.
100.తక్షణం మనం ఉమ్మడి కనీస
కార్యక్రమాన్ని రూపొందించుకోలేకపోతే అణగారిన సమూహాలు ఎక్కువ కాలం సమిష్టిగానూ పనిచేయలేవు;
విడిగానూ పనిచేయలేవు. ఆ ప్రమాదాన్ని ఈ కచ్చీరు గుర్తించాలి. ఊసా. జిలుకర శ్రీనివాస్,
దుర్గం సుబ్బారావు, సూరేపల్లి సుజాత, నూకతోటి రవికుమార్, పసునూరి రవీందర్ వంటి సీరియస్
ఆలోచనాపరులతో ఒక మేధోమధన సదస్సు నిర్వహించాలి. నిజానికి అలాంటి ఆలోచనాపరులు రెండు తెలుగు
రాష్ట్రాల్లో ఓ ముఫ్ఫై, నలభై మంది మాత్రమే వుంటారు. వాళ్ళను ఒక చోట కూర్చోబెట్టి “అణగారిన
సమూహాల ఉమ్మడి కనీస కార్యక్రమం” ను రూపొందించాలి. ఈ బాధ్యతను గుంటూరు లక్ష్మీ నరసయ్యే
స్వీకరించాలని నేను కోరుతున్నాను. నేను ఎలాగూ మీతో వుంటాను. ధన్యవాదాలు.
ముగింపు
/ విరమణ
ఈ
సదస్సులో వున్న అణగారిన సమూహాల ఆలోచనాపరులు, బయటవున్న అణగారిన సమూహాల ఆలోచనాపరులు నా అభిప్రాయాలు, ప్రతిపాదనల మీద విస్తృతంగా చర్చించాలని మనవి చేస్తున్నాను.
మిత్రులారా!
నా
ఉపన్యాసాన్ని వంద పాయింట్లుగా రాసుకున్నాను. మీ సూచనలు, సలహాలు, విమర్శల్ని పాయింట్ల
వారీగా వ్యక్తం చేయగలరు.
మీ
డానీ
మిత్రులారా
! నా ప్రపాదనల్ని చదివి మీ అభిప్రాయాలను తప్పక
నా బ్లాగ్ లో రాయగలరు.
నా
చిరునామ :
Danny
#
401, Saeban Appts.
Vijaya
Bank Street
Road
No. 12, Banjara Hills
Hyderabad
- 500034
Mobile- 9010757776
చాలా వరకు మీ ఆలోచనలు సహేతుకంగానే ఉన్నాయి.సంఘ పరివార్ ను ఎదుర్కొంటానికి బహుజనులు, వామపక్ష వాదులు ఇంకా కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలు ఒక ఫ్రంట్ గా ఏర్పడాలి. కాంగ్రెస్ లేకపోతే విపక్షం శక్తి చాలదు. అయినా కూడా ఇన్ని విరుద్దాల మధ్య ,ఇప్పటి లో మనువాదుల కు పోటీ లేదు. ముస్లిం, క్రైస్తవులలో ఉదారవాదులు ఇంకా బిగ్గరగా వినపడాలి.
ReplyDeleteVery honest introspection.
ReplyDeleteBiggest challenge is, achieving consensus among Anti-BJP thinkers (not politicians), in agreeing with all the above 100 points.
Thank you very much for supporting me me.
Delete