Friday, 28 February 2020

Attack on the Secular Constitution of India


Attack on the Secular Constitution of India


మతసామరస్య భారత రాజ్యాంగంపై దాడి
డానీ     


          భారత ప్రజల్ని ఇప్పుడు నాలుగు భూతాలు వెంటాడుతున్నాయి; CAA, Census, NPR, NRC. భూతాలు, దెయ్యాలు కామరూపులు. అవేమీ మనకు నిజరూపంలో కనిపించవు. మనుషుల్ని ఆకర్షించే రూపంలో మాత్రమే కనిపిస్తాయి. జానపద కథానాయకుల్ని పిశాచాలు అందమైన అమ్మాయిల రూపంలో కనిపించి సమ్మోహన అస్త్రాలు ప్రయోగించి ఆకర్షించి పీడించేవని మనంచందమామకథల్లో చదివాం.   నాలుగు భూతాలు  కూడ తొలి పరిచయంలో చాలా మందికి చాలా గొప్పగా కనిపిస్తాయి.  అవి భూతాలని తేల్చడానికి  తెలుసుకోవడానికీ కొంచెం సమయం పడుతుంది.

కొందరు భూతాలను చూసీ చూడగానే గుర్తు పడతారు. రానున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగడతారు. ఇతరులకు కనువిప్పు కలిగించడానికి ఉపక్రమిస్తారు.  అలా నాలుగు భూతాల్ని వదిలించడానికి నడుం బిగించిన నిరాయుధ మహిళల్నే ఇప్పుడుషాహీన్ బాగ్అంటున్నారు.

          శిలువను చూపిస్తే,  ఖురాన్ లోని కొన్ని ఆయతుల్ని పఠిస్తే,  హనుమాన్ చాలీసా చదివితే, సాతాను, జిన్నాతులు, దెయ్యాలు పారిపోతాయని క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు నమ్ముతారు. ఇప్పుడు నాలుగు భూతాలను తరిమికొట్టడానికి కూడ ఒక గ్రంధం వుంది. దాని పేరు భారత మతసామరస్య రాజ్యాంగం. పెద్దపెద్ద బల్లెంలు, భారీ ఖడ్గాలో, తుపాకులు బుల్లెట్లో చేతబూని భూతాలతో పోరాడాల్సిన అవసరమే లేదు. హింస, రక్తపాతం అనే మాటలే అక్కరలేదు. ఒక చేత్తో రాజ్యాంగాన్నీ, మరో చేత్తో త్రివర్ణ పతాకాన్నీ, ఒళ్ళో మహాత్మా గాంధీజీ, బాబా సాహెబ్ అంబేడ్కర్ ఫొటోలు పెట్టుకుని అహింస పధ్ధతుల్లో రోడ్డు మీద కూర్చుంటే చాలు. రాజ్యాంగంలోని అనేకానేక అధీకరణలు, అనుబంధాలు, షెడ్యూళ్లను కంఠతా పట్టాల్సిన పని కూడ లేదు. ప్రవేశికలోనిన్యాయంస్వేఛ్ఛా-సమానత్వం-సోదరభావంఅనే నాలుగు మంత్రాలను పఠిస్తే చాలు నాలుగు భూతాలు నిలువెల్లా భయంతో వణికి పారిపోతాయి.

స్వేఛ్ఛను హిందీలో ఆజాదీ అంటారు. ఇప్పుడీ భూతాలు భయపడి ఛస్తున్నది ఆజాదీపదానికే. అజాదీ పదాన్ని భారత ప్రజలు ఉఛ్ఛరించరాదనీ, అజాదీ కోరేవాళ్ళు పొరుగు దేశం పాకిస్తాన్ కు వెళ్ళిపోవాలని భూతాలు ఫర్మానాలు జారీ చేస్తున్నాయి. లేకుంటే, దేశంలోని  స్వేఛ్ఛా ప్రియులందర్నీ కట్టకట్టి తామే ఖబరస్తాన్ లకు పంపించేస్తామని  పోలీసులు, టీవీ కెమేరాల సాక్షిగా భూతాలు చాలా గట్టిగానే హెచ్చరిస్తున్నాయి. చాలామంది గమనించని విషయం ఏమంటే పొరుగునవున్న పాకిస్తాన్ లోనూ ఇంతకన్నా పెద్ద భూతాలు నివాసం వుంటున్నాయి. అవీ అక్కడ అజాదీ పదాన్ని ఏనాడో నిషేధించి పడేశాయి.  

ఇప్పుడు షాహీన్ బాగ్ అంటే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యాణ రాష్ట్రాలను కలిపే రోడ్ల కూడలిలో ఎర్పడ్డ దీక్షా శిబిరం మాత్రమే కాదు.  ఇప్పుడు షాహీన్ బాగ్ అంటే  భారత రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం. అది ఇప్పుడు ఢిల్లీకి పరిమితమై లేదు. దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో ఇప్పుడు వెయ్యికి పైగా షాహీన్ బాగ్ లు వెలిశాయి. ఇది పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన అన్నది ప్రభుత్వ భాష. మతసామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక  రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం అనేది ప్రజల భాష. చరిత్రలో ఎప్పుడయినా సరే ప్రభుత్వ భాష వేరు; ప్రజల భాష వేరు.

మతసామరస్య రాజ్యాంగాన్ని కాపాడుదాం” “అహింసా మార్గంలో నడుద్దాం” “భారతదేశాన్ని రక్షించుకుందాంఅని నినదించే ఆందోళనకారుల్ని దేశద్రోహులు వాళ్లు తుపాకీగుండ్లతో కాల్చండి నా కొడుకుల్ని” (దేశ్ కే గద్దారో .... గోలీ మారో సాలో కో )   అనడం ఏం న్యాయం?  భూతాలు ఎంచుకున్న మార్గం ఏమిటో? అవి నిర్మించదలచిన రాజ్యం ఏమిటో? సులువుగానే అర్థం అవుతోంది.  త్రివర్ణపతాకాన్ని పట్టుకుని, రాజ్యాంగాన్ని హత్తుకుని, గాంధీ అంబేడ్కర్ లను ఆశ్రయించినవారిని దేశద్రోహులు అనడమేగాక  నడిరోడ్డు మీద కత్తులు కటార్లు ఇనప రాడ్లతో చావబాదడమేగాక మృత్యుముఖంలో పెనుగులాడుతున్న వారిని జాతీయగీతాన్ని ఆలపించమనడం ద్వార వీళ్ళు ఏం నిరూపించదలిచారూ? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ వుంటుందా?

అభిమానులు ఉక్కు మనిషిగా చెప్పుకునే భారత తొలి హోం మంత్రి  సర్దార్ వల్లభ్ భాయి పటేల్ ఆనాడు ఏం చేశారో మనకు అంతగా తెలీదుగానీ, నయాభారత  ఉక్కుమనిషిగా పేరు పొందాలని ఉవ్విళ్ళూరుతున్న అమిత్ షా ఇప్పుడు ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. ‘గుజరాత్ మోడల్లో  భారతదేశాన్ని అభివృధ్ధి చేస్తామనంటే చాలామంది నమ్మి నరేంద్ర మోదీజీకి అధికారాన్ని అప్పచెప్పారు. గుజరాత్ అభివృధ్ధి అంటే ఏమిటో నిజానికి ఇతర రాష్ట్రాల్లో  చాలామందికి తెలీదు. అమెరికా అధ్యక్షుని కళ్ళల్లో కనపడకుండ ఎత్తైన గోడలు కట్టి దాచాల్సినంత పేదరికం  అహమ్మదాబాద్ లో ఇప్పటికీ తాండవిస్తున్నదని వారమే దేశప్రజలు అందరికీ తెలిసింది. నరేంద్ర మోదిజీ పుష్కర కాలానికి పైగా పాలించిన గుజరాత్ ఆర్థిక రాజధాని నగరంలోనే ఇంతటి పేదరికం వుంటే రాష్ట్రంలోని మిగిలిన నగరాలు, పట్టణాల్లో ఇంకెంతటి పేదరికం కొనసాగుతూ వుందో ఊహించుకోవచ్చు.

నరేంద్ర మోదీ- అమిత్ షా ద్వయం అబధ్ధాలు, మాయ మాటలు చెప్పి, బూటకపు వాగ్దానాలు చేసి రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది.  రెండుసార్లు కుక్క కాటుకు గురయినవాడు మూడోసారి కూడ కరుస్తుందని గుర్తించకపోతే అతనికి పిచ్చెక్కేసినట్టే అనే  సామెత భారత ప్రజలకు బాగానే తెలుసు. తమకు మూడో అవకాశం దక్కకపోవచ్చని మోదీజీ-అమిత్ జీ లకు కూడా గట్టి అనుమానంగా వుంది. ప్రజల్ని మత ప్రాతిపదికన చీల్చి మెజారిటీ మతసమూహాన్ని ఆకర్షించగలిగితే అధికారం దక్కే అవకాశాల్ని పెంచుకోవచ్చనేది కమలనాధులకు పుట్టుకతో  అబ్బిన జ్ఞానం. మూడోసారి గట్టెక్కడానికి వాళ్ళిద్దరు ఇప్పటి నుండే గుజరాత్ ఫార్మూలాను దేశంలో  ప్రవేశపెడుతున్నారు. ఇప్పుడు మనం ఢిల్లీ అల్లర్లలో  చూస్తున్నది 2002 గుజరాత్ మారణకాండకు సీక్వల్ గా వచ్చిన హారర్ సినిమానే. దాని నిర్మాత దర్శకులు, కిరీటధారులు, సూత్రధారులు వాళ్ళే.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నగరంలోనే వున్నా వాళ్ళేమీ వెనుకంజ వేయలేదు. ట్రంప్  ఆయుధాలు అమ్ముకోవడానికి   ఇండియాకు వచ్చాడు. గుజరాత్ మోడల్ పాత్రధారులు ఆయుధాలను ప్రయోగించడానికి రోడ్ల మీదకు వచ్చారు. ఇద్దరి మెదళ్ళలో ఆయుధాలే నాట్యం చేస్తున్నపుడు వాళ్ల మధ్య ఘర్షణ వుండదు; ఐక్యతే వుంటుంది. యూనిటీ ఆఫ్ వెపన్స్!

ఢిల్లీ ప్రజలు; ముఖ్యంగా, శిక్కు సామాజికవర్గం మహోన్నతులు. శిక్కు, హిందూ సమూహాలు ఆదుకోకుంటే, దేశ రాజధాని నగర వీధుల్లో ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీస్తున్నవారి కోసం గురుద్వారాల ద్వారాలు తెరుచుకోకపోతే ఈపాటికి ఢిల్లీ మృతుల సంఖ్య గుజరాత్ అల్లర్ల మృతుల సంఖ్యను దాటేసి వుండేది. “1984ను పునరావృతం కానివ్వంఢిల్లీని మరో గుజరాత్ గా మారనివ్వంఅని నినదించిన ఢిల్లీ ప్రజలకు శిరస్సు వంచి సలాం చేయాలి

ప్రజాస్వామ్యాన్ని ఎంత గొప్పగా వర్ణించినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవహారం భరించలేనంత నీచమైనది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారనేది ఒక ఆదర్శం మాత్రమే. నిజానికి ప్రభుత్వాన్ని ఓటర్లు ఎన్నుకుంటారు. అందులోనూ మెజారిటీ ఓటర్లు  మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మైనారిటీ ఓటర్లు ప్రతిపక్షంగా వుండిపోతారు. ఎన్నికల నిర్వహణ బాధ్యత ప్రభుత్వానిదే కనుక అప్పటికి అధికారంలో వున్న పార్టీయే ఎన్నికల్ని నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు వున్న ఒక చెడు సాంప్రదాయం ఏమంటే విపక్ష మద్దతుదార్లను వీలయినన్ని చోట్ల ఓటర్ల జాబితా నుండి తొలగించడం. ఇది అంత సులువు కాదు. కుట్ర పోలింగు రోజు బయట పడిపోతుంది. అప్పుడు ప్రభుత్వంతో పాటు అధికార పార్టి కూడ అనేక  విమర్శల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఇప్పుడు వాళ్లు కనిపెట్టిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏమంటే విపక్ష సమూహాలను ఏకంగా  పౌరసత్వం నుండి తొలగించడం!. పౌరసత్వమే లేనివాళ్ళు ఓటు హక్కును వాడుకోలేరుగా!

విపక్ష సమూహాలు అనేక దొంతరల్లో వుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకం రాగద్వేషాలు వుంటాయి. మిగిలినవాళ్ళను భయపెట్టో బుజ్జగించో దారికి తెచ్చుకునే అవకాశాలు కొంత వుండవచ్చు. కానీ, సంఘపరివారానికి మాత్రం లొంగని  మొండి ఘటాలు ముస్లింలు. ముస్లిం సమూహంలో కొందరి పౌరసత్వాన్నైనా తొలగిస్తేనేగానీ వాళ్ళల్లో మిగిలిన వాళ్ళు దారికి రారు.  ఇప్పుడు CAA, Census, NPR, NRC పేరిట సాగుతున్న  కసరత్తుల  ప్రధాన లక్ష్యం ముస్లింలను లొంగదీయడమే!

జనాభా లెఖ్ఖలు (Census)జాతీయ జనాభా పట్టిక (NPR - National Population Register), జాతీయ పౌరుల పట్టిక  (NRC - National Register of Citizens) పౌరసత్వ సవరణ చట్టం (CAA - Citizenship Amendment Act) గురించి సందర్భంలో కొన్ని మౌలిక అంశాలు మన దృష్టిలో వుండడం మంచిది. వీటిల్లో మొదటి రెండు జనాభాకు సంబంధించినవి. మిగిలిన రెండు పౌరసత్వానికి సంబంధించినవి. జనాభా లెఖ్ఖలు సమూహాల స్థితిగతుల్ని  మాత్రమే పరిగణనలోనికి తీసుకుంటాయి. పౌరసత్వం అనేది వ్యక్తుల ప్రత్యేకతల్ని పరిగణనలోనికి తీసుకుంటుంది. ఇది న్యాయపరమైన వ్యవహారం. నాలుగింటినీ జాతీయ స్థాయిలో కేంద్ర హోంశాఖ ఆధీనంలోని రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా పర్యవేక్షిస్తారు. రాష్ట్రాల స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్  సెన్సస్ ఆపరేషన్స్ నిర్వహిస్తారు. మనదేశంలో ప్రస్తుతం 33 డైరెక్టరేట్ ఆఫ్  సెన్సస్ ఆపరేషన్స్ వున్నాయి.

ఇతర దేశాల నుండి అనేక కారణాలతో అనేక మంది మన దేశం లోనికి వస్తుంటారు. వారిలో టూరిస్టులు, శరణార్ధులు మాత్రమే గాక  చొరబాటుదార్లు కూడా వుంటారు. టూరిస్టులు ఎలాగూ వెనక్కి పోతారు. శరణార్ధుల్ని దయదలిచి దేశ పౌరసత్వం ఇవ్వవచ్చు.  చొరబాటుదారుల్ని వాళ్ళ దేశాలకు వెనక్కి పంపవచ్చు. ఒకవేళ చొరబాటుదార్లలో కొందరు టెర్రరిస్టు చర్యలకు పాల్పడితే వాళ్ళను పట్టుకుని చట్టం ప్రకారం శిక్షించనూ వచ్చు. నాలుగు సమూహాలను గుర్తించడానికీ, వాళ్ళ కదలికల మీద నిఘా వుంచడానికీ, చట్టాన్ని అతిక్రమించినవాళ్ళను  శిక్షించడానికి మనకు అనేక వ్యవస్థలు వున్నాయి. వాటితో సమర్ధంగా పనిచేయించాలి. కానీ అలా జరగడంలేదు. ఏదో ఒక వంకతో కక్ష సాధింపుగా ముస్లింలను వేధించడమే పనిగా భారత ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.

భారత దేశానికి వచ్చే శరణార్ధులందరూ ముస్లిమేతరులనీ చొరబాటుదార్లు అందరూ ముస్లిములు అనే ఒక నేరేటివ్ ను ప్రచారంలో పెడుతున్నారు. ఇది తప్పు. శరణార్ధుల్లోనూ ముస్లింలు వుంటారు. పాకిస్తాన్ లో అనేక రకాల ముస్లిం తెగల మీద  తీవ్ర అణిచివేత కొనసాగుతుంటుంది. అక్కడి సామ్యవాదుల మీద తీవ్ర నిర్భంధం వుంటుంది. అలాగే చొరబాటుదారుల్లోనూ ముస్లిమేతరులు కూడ వుంటారు. టెర్రరిస్టులందరూ ముస్లింలే అనే నేరేటివ్ కూడ సరికాదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా టెర్రరిస్టులు లేని మత సమూహం ఒక్కటీ లేదు. అహింసో పరమ ధర్మం అనే బౌధ్ధ సమూహాల్లో  సహితం టెర్రరిస్టులు వున్న కాలం ఇది.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి శరణార్ధులుగా వచ్చే ముస్లిమేతరులకు మానవతా దృక్పథంతో భారత పౌరసత్వం ఇవ్వడానికే  పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించినట్టు కేంద్ర ప్రభుత్వం   చెపుతోంది. మరోవైపు, తమ పౌరసత్వాన్ని తొలగించడానికి చట్టాన్ని వాడబోతున్నారని ముస్లిం సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే ఇప్పటి వివాదానికి భూమిక. భారత ముస్లిం సమాజం లేవనెత్తుతున్న అభ్యంతరం అంత తేలిగ్గా కొట్టిపడేయ దగిందేమీ కాదు.

పౌరసత్వ సవరణ చట్టంలోని  మత కోణాన్ని ఎవరయినా ప్రశ్నిస్తే అంతర్గత సమస్యను అంతర్జాతీయ వేదికల మీదికి తీసుకుపోతున్నారని హోంమంత్రి గడుసుగా నిందలేస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టంలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను పేర్కొన్నప్పుడే అది అంతర్జాతీయ వ్యవహారంగా మారిపోయింది. చట్టంలో పొరుగు దేశాలయిన నేపాల్, భూటాన్, మయన్మార్, శ్రీలంకలను పేర్కొనకపోవడంతో  అది మరింత జటిలంగా మారింది. ఇప్పుడిది ఏమాత్రం అంతర్గత వ్యవహారం కాదు.  అలా కాకుండా, భారత దేశానికి శరణార్ధులుగా వచ్చే వారికి మానవతా దృక్పథంతో పౌరసత్వం ఇస్తామంటే సమస్య వుండేది కాదు. అది అంతర్గత వ్యవహారంగానూ వుండేది. సమస్యను ఇంత సులువుగా సూటిగా పరిష్కరించడం కేంద్ర ప్రభుత్వానికి  ఇష్టంగా లేదు. పైగా సిఏఏ, ఎన్ ఆర్సీల పేరిట హోం మంత్రి తరచూ చేసిన హెచ్చరికలు బలహీనవర్గాల్ని మరింత అభద్రతా భావానికి గురిచేశాయి. ముస్లింలను తీవ్ర అభద్రతా భావానికి గురి చేయడానికే అమిత్ షా అలాంటి ప్రచారం సాగించారనిపించడం తప్పేమీ కాదు.  

జానపద కథ ఒకటి సందర్భంగా గుర్తుకు వస్తున్నది. పూర్వం దిబ్బ రాజ్యంలో దొంగలుపడి దోచుకుపోయారు. దొంగల్ని పట్టుకోవడంలో దిబ్బ రాజ్యం నిఘా విభాగం విఫలం అయింది. స్వతహాగానే కపటి అయిన దిబ్బ రాజుకు సహజంగానే ఒక కపట ఆలోచన వచ్చింది. దేశ ప్రజలందరు ఒక్కొక్కరుగా రాజాస్థానికి వచ్చి తాము దొంగలం కాదని నిరూపించుకోవాలని ఒక ఫర్మానా జారీచేశాడు. నరేంద్ర మోదీజీ-అనిత్ షా జీ NRC పేరుతో ఇప్పుడు జానపద కథలోని దిబ్బరాజును మరిపిస్తున్నారు. తాము భారత పౌరులమని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు దేశంలో నివశిస్తున్న ప్రతి ప్రతి ఒక్కరి మీద పడింది.

సాంప్రదాయ మనుధర్మశాస్త్రం శూద్రుల్ని లోపలి బానిసలుగానూ దళితులు ఆదివాసుల్ని బయటి బానిసలుగానూ  భావించేది. ఆరెస్సెస్ ఆవిర్భవించినపుడు ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల్ని తన శత్రువులుగా  ప్రకటించుకుంది. ఇప్పుడు నయా మనువాదం అంటే పది అంశాలు; ముస్లిం, శిక్కు, క్రైస్తవ, దళిత, బహుజన, ఆదివాసి, మహిళ, శ్రామికవర్గాల  వ్యతిరేకత; హిందీ ఆభిజాత్యం; ఉత్తరాది ఆధిపత్యం.

కేంద్రంలో రెండవసారి అధికారాన్ని చేపట్టిన తొలిరోజు నుండే  మోదీజీ-అమిత్ జీ ద్వయం మూడవసారి ఎన్నిక కావడానికి సన్నాహాలు మొదలెట్టేసింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజే ఇన్స్టాంట్ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఆగస్టు మొదటి వారంలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరచి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. బాబ్రీ మసీదు- రామమందిరం భూమి వివాదంపై సుప్రీంకోర్టు నుండి తనకు అనుకూలమైన తీర్పును వెలువరించుకుంది!. ఆపైన, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లు పేరిట భారత రాజ్యాంగ ఆదర్శాలకు తూట్లు పొడిచే ప్రయత్నాలు మొదలెట్టింది.

ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ముస్లిం సమాజం సహించింది. ఆర్టికల్ 370 రద్దు మీద ఊరక వుండిపోయింది. బాబ్రీ మసీదుపై తీర్పునూ మౌనంగా అంగీకరించింది. తమకు తీవ్ర అభ్యంతరాలున్నాప్పటికీ మూడు సందర్భాలలోనూ ముస్లిం సమాజం ఎంతో సహనం వహించింది. సంయమనంతో వ్యవహరించింది. అయినా కేంద్ర ప్రభుత్వ దూకుడు ఆగలేదు. అది మతసామరస్య రాజ్యాంగం జోలికి వచ్చింది. అప్పుడు ముస్లిం సమాజం నోరు తెరిచింది. నల్లని బుర్ఖాల్లో చైతన్య హీనంగా జీవితాలను గడుపుతుంటారనే విమర్శకు తరచూ గురయ్యే ముస్లిం మహిళలు ఇప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇది ఎవ్వరూ ఊహించని  మార్పు. ఒక సాంస్కృతిక విప్లవం.  

NRC, NPR, Census, CAA  నాలుగింటినీ దేశ ప్రజలు శిరసావహించ వలసిందేననీ ప్రధాని మోదీజీ అంటున్నారు. వారికన్నా పెద్ద గొంతుతో హోంమంత్రి అనిత్ షా హెచ్చరిస్తున్నారు. తమను గెలిపిస్తే రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని ఎలా అణిచివేయబోతున్నారో, ‘షాహీన్ బాగ్లను ఎలా ధ్వంసం  చేయబోతున్నారో అమిత్ షా మాత్రమేగాక వారి పార్టీ ప్రముఖులు అనురాగ్ ఠాకూర్,   ప్రవేశ్ వర్మ, అభయ్ వర్మ, కపిల్ మిశ్ర ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాలా విపులంగా చెప్పారు. తమను ఓడిస్తే ఏమవుతుందో ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ అల్లర్లలో చేసి చూపిస్తున్నారు.

సాక్షాత్తు హోం మంత్రి కనుసన్నల్లో మారణకాండ సాగుతున్నదని తెలిసినపుడు పొలీసులు వీలయితే తామూ కొంత ఆజ్యంపోస్తారు; లేకుంటే మౌన ప్రేక్షకుల్లా వుండిపోతారు. వాళ్ళకు మూడో మార్గం లేదుగా!. ఇప్పుడు అదే జరుగుతోంది. ఢిల్లీ అల్లర్లను కవరేజ్ చేయడానికి వెళ్ళిన మీడియా ప్రతిధుల్ని మూకోన్మాదులు శీల పరీక్ష చేసిన తీరు సభ్య ప్రపంచాన్ని కంపించి వేసింది. మీడియా రిపోర్టర్లు,  కెమెరామెన్లను మూకోన్మాదులు ఆఫీసు గుర్తింపు కార్డులో, సమాచార ప్రసార శాఖ ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డులో చూపించమని అడుగలేదు. నడిరోడ్డు మీద తమ మతాన్ని నిరూపించుకోమన్నారు.

ముస్లిం సమాజానికి చెందిన పాత్రికేయుల్ని ప్రధాని మోదీజీ చెప్పినట్టు వాళ్ళ వేషధారణను బట్టి సులువుగా గుర్తు పట్ట వచ్చు.  హిందూ సమాజానికి చెందిన పాత్రికేయులు తమ మతాన్ని నిరూపించుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు బొట్లు - తిలకం  చూపించారు. కొందరు రుద్రాక్ష మాలలు చూపించారు.  అవి రెండూ లేని పురుష పాత్రికేయుల్ని మూకోన్మాదులు లాగులు విప్పి (మర్మాంగాలను)  చూపమన్నారు. దాడుల సమయంలో ముస్లిం మైనార్టీల ఇళ్ళను అల్లరిమూకలు సులువుగా  గుర్తించడానికి వీలుగా వారం రోజుల ముందే ప్రత్యేక గుర్తింపులు గీశారట. పరిస్థితి స్థాయికి వచ్చాక దాన్ని నయా ఫాసిజం అనకపోతే మన మెదళ్ళలో ఏదో లోపం వున్నట్టే!

. ఇప్పుడు కొందరు NRC, NPR, Census, CAA మధ్య తరతమ బేధాల్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. CAA  అనేది విదేశస్తుల కోసం చేసిన చట్టం అంటూ  దాన్ని స్వదేశీయులు  అభ్యతరం పెట్టకూడదనేది ఒక హుకూం. NRC  ని వ్యతిరేకిస్తే ఒక అర్థం వుందేమోగానీ గంగిగోవుల వంటి అమాయకపు NPR,  జనాభా లెఖ్ఖల్ని విమర్శించడం ఏమిటీ? అని వీళ్ళు చాలా గడుసుగా అడుగుతున్నారు. వీళ్లు దాస్తున్న అంశం ఏమంటే,  ఒకసారి NRC  రంగప్రవేశం చేశాక  CAA, NPR, Censusలు స్వతంత్రంగా వుండలేవు. NRC అంశ అన్నింట్లోనూ చేరిపోతుంది. ఇప్పటి జనాభా లెఖ్ఖల  రికార్డులు, ఫీల్డులు, రిపోర్టులు 2011 నాటివి కావు, ఇప్పటి NPR రికార్డులు, ఫీల్డులు, రిపోర్టులు 2010 నాటివి కావు. రెండింటిలోనూ పౌరసత్వానికి సంబంధించిన అంశాలను చేర్చేశారు. ఇప్పుడు NRC, NPR, Census, CAA లలో పేరుతో సర్వే నిర్వహించినా అది పౌరసత్వ నిరూపణగా మారిపోతుంది.  

అస్సాం రాష్ట్రంలో బెంగాలీల వలసలు పెరిగిపోతున్నాయని స్థానికులు నాలుగు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. వలసల మూలంగా సామాజిక సమీకరణలు మారిపోయి తమ అస్థిత్వానికీ, అస్సామీ భాషకు ముప్పు వస్తుందని వాళ్ళు భయపడేవారు. అంశం మీద ఉద్యమించిన విధ్యార్ధి సంఘం (AASU) అస్సాంలో కొన్నాళ్లు అధికారాన్ని కూడ చేపట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆస్సాంలో NRC  నిర్వహించాలని సుప్రీ కోర్టు ఆదేశించింది. 2018 జులై చివర్లో విడుదల చేసిన తొలి విడత పౌరసత్వ జాబితాలో 40 లక్షల మందికి స్థానం దక్కలేదు. సర్వేను కాంగ్రెస్ వ్యతిరేకించింది. బిజెపి జాతీయ అధ్యక్షునిగా వున్న అమిత్ షా బంగ్లాదేశీయుల్ని కాంగ్రెస్ సమర్ధిస్తున్నదని విరుచుకుపడ్డారు. పైగా దేశమంతటా ఎన్నార్సీని అమలుపరుస్తామని కొత్త హెచ్చరికలు చేశారు.  

అస్సాం జనాభా 3.5 కోట్ల మంది. రాష్ట్రంలో ఎన్నార్సీ నిర్వహిస్తే తుది జాబితాలో 19,27,661 మంది పౌరసత్వాన్ని కోల్పోయారు. వీరిలో 4,09,542 మంది ముస్లింలు. 15,18,119 మంది ముస్లిమేతరులు. వీళ్ళంతా బెంగాలీ మాట్లాడేవారు. బెంగాలీ మాట్లాడేవారందరినీ బంగ్లాదేశీయులు అని తీర్మానించడం చారిత్రక తప్పిదం. వాళ్లు పశ్చిమ బెంగాల్ నుండి వలస వచ్చిన వాళ్లు కూడా కావచ్చు.

అస్సాం జనాభాలో ఎన్నార్సిలో స్థానం పొందని వారు  5.837 శాతం. అస్సాం ప్రాతిపదికగా ఎన్నాస్రీని మొత్తం భారత దేశంలో అమలు చేస్తే 136.91 కోట్ల జనాభాలో 5.837 శాతం అంటే 7.43 కోట్ల మంది అవుతారు. ఒకవేళ వలసల సమస్య అస్సాంలో వున్నంతగా ఇతర రాష్ట్రాల్లో వుండకపోవచ్చు అనుకున్నా, అందులో సగం మాత్రమే వుంటుంది అనుకున్నా దేశంలో 3 నుండి 4 కోట్ల  మంది ఎన్నార్సీకి అర్హతలు కోల్పోతారు. వీరిలో కోటి మంది ముస్లింలు అని తేలినా. మిగిలిన 3 కోట్లమంది ముస్లిమేతరులే వుంటారు. తమ గురించి తగిన రికార్డులు లేని, పేద, నిరక్షరాశ్యులు సహితం ఎన్నార్సికి బాధితులుగా మారిపోతారు. వీరిలో అత్యధికులు ఎస్టి, ఎస్సీ, బిసి, నిరుపేద వర్గాలకు చెందినవారే వుంటారు. ఇదీ అసలు ప్రమాదం.

తుది జాబితాలో స్థానం కోల్పోవడం అంటే దేశం లేని మనుషులు (Stateless people)గా మారిపొవడమే. పౌరులే కానప్పుడు వాళ్లు పౌర హక్కుల్ని కూడ కోల్పోతారు. వాళ్ల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పెన్షన్ కార్డులు, బ్యాంకు కార్డులు రద్దు కావడమే గాక ఇల్లు వాకిలి పొలం పుట్ర వ్యాపారాలు తదితర ఆస్తి హక్కులన్నీ రద్దయిపోతాయి. వాళ్లు దాదాపు సంతలో పశువులతో సమానంగా, బానిస యుగపు జీవులుగా  మారిపోతారు. వీళ్ళను డిటెన్షన్ సెంటర్లు అనబడే నవతరం జైళ్లకు పంపిస్తారు. దేశపౌరులు కాదు కనుక వీరికి జైళ్ళల్లో కూడ పౌరహక్కులు వుండవు. వీరికి విధించే జైలు శిక్షకు కాలపరిమితి వుండదు. వీళ్లంతా జైళ్ళలో చనిపోవాల్సిందే.

సయ్యద్ అన్వరా తైమూర్  1980-81 మధ్య కాలంలో ఓ ఏడు నెలలు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1972 నుండి 1996 మధ్య కాలంలో వారు నాలుగుసార్లు  శాసనసభకు ఎన్నికయ్యారు. 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె పేరు ఇప్పుడు ఎన్నార్సీలో చేరలేదు. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1974-77 మధ్యకాలంలో  భారత ఐదవ రాష్ట్రపతిగా పనిచేశారు.  ఆయన మేనల్లుడి పేరు ఎన్నార్సీలో నమోదు కాలేదు.  కార్గిల్ యుధ్ధంలో భారత సైన్యాధికారిగా పనిచేసిన ముహమ్మద్ సనావుల్లా పేరు కూడ ఎన్నార్సీలో నమోదు కాలేదు. సెలబ్రెటీలకే గతి లేకపోతే ఇక సామాన్యుల సంగతిఏమిటీ? దానిని బట్టి ఎన్నార్సీ పేరిట ముంచుకు వస్తున్న భారీ ఉపద్రవాన్ని ఊహించుకోవచ్చు

అనాదిగా దేశంలో వుంటున్న అనేక మంది ముస్లింలను అస్సాంలో డిటెన్షన్ సెంటర్లకు పంపడానికి సమస్త సన్నాహాలు చేస్తూనే, భారత ముస్లింలు ఒక్కరు కూడ   పౌరసత్వాన్ని కోల్పోరని బుకాయించడాన్ని ఏమనాలీ? ప్రధాని అయితే ఏకంగా దేశంలో డిటెన్షన్ సెంటర్లే లేవని డిసెంబరు 22న ప్రకటించారు. నిజానికి అస్సాంలోని గోల్పార వద్ద డిటెన్షన్  సెంటర్ నిర్మాణానికి  కేంద్ర ప్రభుత్వం 46 కోట్ల రూపాయలు కేటాయించింది. అస్సాంలోని వివిధ జైళ్ళలో 6 డిటెన్షన్ సెంటర్లను నెలకొల్పినట్టు ఆ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ అంటున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా వుండగా మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబాయిలోని నేరుల వద్ద మూడెకరాల స్థలంలో డిటెన్షన్ సెంటరు నిర్మించారు. యడ్యూరప్ప నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సమీపాన సొండేకొప్ప, నేలమంగళల వద్ద డిటెన్షన్ సెంటర్లను నెలకొల్పారు.  బిసి విద్యార్ధుల హాస్టళ్ళు కొన్నింటిని డిటెన్షన్ సెంటర్లుగా మార్చే ప్రయత్నాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం వుంది. 

NRCలో పౌరసత్వన్ని నిరూపించుకోలేక డిటెన్షన్ సెంటర్లకు పోవాల్సిన వారిలో ముస్లింలను మినహాయించి ముస్లిమేతరుల పౌరసత్వాన్ని క్రమబద్దీకరించే అవకాశాలున్నట్లు కేంద్ర హోంశాఖ సంకేతాలను ఇస్తున్నది.  ముస్లిమేతరులు అంటే ఆదివాసులు, ఎస్సీలు, బీసీలు, క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు, హిందూ నిరుపేదలు అనుకోవాలి. వీళ్ళ పౌరసత్వాన్ని క్రమబద్దీకరీంచేందుకే CAAను తెచ్చారని బలంగా ప్రచారం జరుగుతోంది.

NRCలో పౌరసత్వన్ని నిరూపించుకోలేని ముస్లీంలను ఎలాగూ డిటెన్షన్ సెంటర్లకు పంపిస్తారు. ముస్లిమేతరుల పౌరసత్వాన్ని క్రమబద్దీకరించే ప్రక్రియ కూడ అంత సులువుగా సూటిగా వుండదు. వారి మీద అనేక షరతులు, నిబంధనలు పెడతారు.. భవిష్యత్తులో రిజర్వేషన్లను కోరబోమనీ, ఉద్దీపన చర్యలు, సంక్షేమ పథకాలను అడగబోమనేగాక హిందూమతానికే కట్టుబడి వుంటామనీ, కమ్యూనిజం, సోషలిజం వైపు కన్నెత్తి కూడా చూడబోమనీ, దేశంలో పౌరసత్వాన్ని కలిగివున్న  ముస్లిం సమూహాలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తూ వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానియ్యము అని రాతపూర్వక హామీలను సహితం తీసుకుంటారు.  డిటెన్షన్ క్యాంపుల్లో దయనీయంగా చనిపోవడంకన్నా హోంశాఖ విధించిన నిబంధనలకు లొంగి ప్రాణాలను దక్కించుకుంటే చాలని భావించే పరిస్థితిని కల్పిస్తారు.

డిటెన్షన్ సెంటర్లలో తమ పౌరులు వుంటే వాళ్ళను వెనక్కి తెచ్చుకుంటామని బంగ్లాదేశ్ ఇప్పటికే స్పష్టం చేసింది.  వడబోతలో చివర్న మిగిలే భారత ముస్లింలను ఏం చేస్తారనేది సమంజసమైన సందేహమే. వాళ్ళను కఛ్చితంగా డిటేన్షన్ సెంటర్లకే పంపిస్తారా? లేక కొన్ని షరతులతో దేశంలో వుండనిస్తారా? అనే అంశం మీద ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.  ‘ముస్లిం సంతుష్టీకరణ’ను తీవ్రంగా విమర్శించే లాల్ కిషన్ అడవాణిజీ  1990లలో రథయాత్ర సందర్భంగా ఒక మాట అనేవారు. భారత దేశంలో ముస్లింలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవచ్చు, రోగాలొస్తే సర్కాదు దవాఖానాల్లో వైద్యం చేయుంచుకోవచ్చు. అంతే తప్ప, విద్యా, ఉపాధి, చట్ట సభల్లో  ప్రాతినిధ్యం, మైనారిటీలకు ప్రత్యేక హోదా వంటివి అడగరాదు అనేవారు. బహుశ అలాంటి నిబంధనల్ని ఇప్పుడూ పెట్టవచ్చు. ప్రభుత్వ అనుమతి లేకుండ ముస్లింలు ఆస్తిని కూడగట్టరాదనీ, పెళ్ళి చేసుకోరాదనీ,  పిల్లలు కనరాదనీ జనాభాను పెంచరాదనీ మరికొన్ని కొత్త షరతులూ పెట్టవచ్చు. మయన్మార్ లో రోహింగ్యాల మీద ఇలాంటి నిబంధనలే వున్నాయి. ఒక్క ముక్కలొ చెప్పాలంటే ముస్లింలను ర్వితీయశేణి పౌరులు ప్రకటించడానికి ప్రయత్నాలు జరగవచ్చు.

ఇది అంతటితో ఆగదు.   షరతులు, హామీలను క్రమంగా సాధారణ పౌరులైన శిక్కు, క్రైస్తవ, దళిత, బహుజన, ఆదివాసి, మహిళ, శ్రామికవర్గాలకు కూడ వర్తించేస్తారు. మరో మాటల్లో చెప్పాలంటే  దేశంలో మనుస్మృతి మరో మారు వికట్టాహాసం చేస్తూ నాలుగుకాళ్ళ మీద సంచరిస్తుంది. NRC, CAA, NPR, Censusలతో  అలనాటిస్వర్ణయుగంను పునరుధ్ధరించాలని సంఘపరివారం ఆశిస్తున్నది.

ముందుగా ప్రమాదం వచ్చేది తమకే కనుక  మిగిలిన  ప్రజా సమూహాలకన్నా ముస్లింలే ముందుగా  ఆందోళనకు దిగడం చాలా సహజం. ముస్లింల తరువాత శిక్కులు ఉద్యమంలో చురుగ్గా వున్నారు. క్రైస్తవులు సహితం స్పందిస్తున్నారు. నయా మనువాద బాధితుల్లో మిగిలిన సమూహాలు ఒకటొకటిగా రాజ్యాంగ పరిరక్షణ  ఉద్యమంలో కలుస్తారు.

ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు సహితం తమతమ స్థాయిల్లో  లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వుద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇవన్నీ విడివిడిగా సాగుతున్నాయి. పైగా ప్రతి సమూహంలోనూ అనేక సంఘాలు, బృందాలు విడిగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కార్యక్రమాల మధ్య సమన్వయం లేకపోగా కొన్ని పట్టణాల్లో ఆనారోగ్యకర పోటి కూడా కనిపిస్తున్నది.

ST, SC, BC, Minorities, Women, Workers Communists అనే ఆరు శ్రేణుల్ని వాళ్ళ వాళ్ళ ప్రత్యేక  అస్తిత్వాలను గుర్తిస్తూ గౌరవిస్తూ అందర్నీ ఒకే ఉద్యమ వేదిక మీదకు తేవడం నేటి చారిత్రక కర్తవ్యం. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎంత ఆలస్యం అయితే అంతటి అపార నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత, దాని కోసం మతసామరస్య, సామ్యవాద, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన ప్రధాన బాధ్యత ST, SC, BC, Minorities, Women, Workers Communists లదే.

చివరిదయినప్పటికీ ఒక ప్రాణప్రదమైన  అంశం ఏమంటే ఫాసిస్టు పోకడలకు, మతోన్మాదానికి సాధారణ హిందూ సమాజం కూడ వ్యతిరేకమే. పరమ పురుషుడు  రాముడ్ని అడ్డం పెట్టుకుని రాజకీయలబ్ది పొందుతున్న వారితో రాజకీయ పోరాటం చేయాలిగానీ భక్తితో శ్రీరాముడ్ని కొలిచేవారితో మనకేం తగాదా? సాధారణ హిందూ సమాజం మద్దతును మనం ఎంత త్వరగా పొందగలిగితే అంత త్వరగా ఫాసిజం అంతరించి, మతసామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక  సమాజం ఆవిర్భవిస్తుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయుడు, సమాజ విశ్లేషకులు, మొబైల్ 9010757776
రచన: హైదరాబాద్, 28 ఫిబ్రవరి 2020
ప్రచురణ : బహుజన కెరటాలు మాస పత్రిక, మార్చి 2020