Friday 28 February 2020

మనువాద ఫాసిజం ముసుగులు తీసే సైరన్ మోత - చల్లపల్లి స్వరూపరాణి


మనువాద ఫాసిజం ముసుగులు తీసే సైరన్ మోత
- చల్లపల్లి స్వరూపరాణి

ఇప్పుడు భారత దేశానికి పట్టిన రెండు ముఖ్యమైన చీడ పురుగులు ‘ఫాసిజం’, ‘మనువాదం’. ఈ దేశపు కుల వర్గ సమాజంలో ఈ రెండు దుష్ట శక్తులు ప్రజల జీవితాలతో పరాచకాలాడుతూ అణగారిన కులాలు, ఆదివాసులు, మతపరమైన ముస్లింలు, క్రిస్టియన్లు, స్త్రీలపై పాశవిక దాడులకు పాల్పడుతూ వారిని తీవ్రమైన అభద్రతా భావానికి గురిచేస్తున్నాయి. వారు తినే తిండి పైన, కట్టే బట్టపైన, మొక్కే దైవం పైన ఆంక్షలు విధిస్తూ ఆవు లాంటి ఒక జంతువుకిచ్చిన విలువ కూడా వారికి లేకుండా వారి వ్యక్తిగత స్వేచ్చను హరిస్తున్నాయి. గతకాలంలో ఎందరో శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు కష్టపడి శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధించిన అభివృద్ధిని, ఆవిష్కరణలను కించపరుస్తూ పుష్పక విమానాలు, టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించడం వంటివి అన్నీ పురాణాల కాలంలోనే ఉన్నాయనీ, ఆవు మూత్రం సకల రోగ నివారిణి అని చెప్పుకొస్తూ, శాఖాహారాన్ని కీర్తిస్తూ, అసంఖ్యాక ప్రజల ఆహారపు అలవాట్లను అవమానించడంతో పాటు దళితులూ, ముస్లింలూ తమ ‘గోమాత’ను చంపి తింటున్నారనే నెపంతో వారి పై దాడి చేసి చంపడం, విచక్షణా రహితంగా కొట్టడం వర్తమాన కాలంలో తరచుగా చూస్తున్నాం.
వీరికి మరొక ప్రధాన శత్రువు స్త్రీ స్వేచ్చ. స్త్రీల మీద రకరకాల ఆంక్షలు, వారికి ‘శీల పరీక్షలు’, బడిలోకి గుడిలోకి రానీయయకుండా అడ్డుకోవడంతో పాటు పసిపిల్లలను, స్త్రీలను రేప్ చేసేవారికి పదవులిచ్చి గౌరవించడం, బాధిత స్త్రీలకు సహకరించేవారిని హింసించడం, బాధితులపై తిరిగి కేసులు పెట్టి వేధించడం వంటివి లెక్కలేనన్ని జరుగుతున్నాయి. మరోవైపు ముస్లిములపై ద్వేష భావాన్ని వ్యాప్తి చెయ్యడం, వారిని పుట్టుకతో నేరస్తులుగా ప్రచారం చేసి వారిని, క్రైస్తవులను ‘ఇతరులు’ గా వేరుచేసి ప్రజలమధ్య మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం మనువాద ఫాసిజం లోని ప్రధానమైన కోణం.
అంతేకాదు మనువాద రాజ్యాధినేతలు గత చరిత్రలో భీమా కోరేగావ్ యుద్ధంలో బ్రాహ్మణవాదంపై తిరుగుబాటు చేసిన మహార్ వీరులను స్మరించుకోవడాన్నికూడా తట్టుకోలేనంత అసహనానికి గురై అక్కడ గుమికూడిన వారిపై అక్రమంగా కేసులు బనాయించింది. భారతదేశ చరిత్ర అంతా బ్రాహ్మణ వాదానికి, బౌద్ధానికి మధ్య జరిగిన పోరాటంగా అంబేద్కర్ వ్యాఖ్యానిస్తే మతతత్వవాదులు అదేదో ముస్లింలకు, హిందువులకూ మధ్య జరిగిన పోరుగా వక్రీకరించడంతోపాటు చరిత్రలో ముస్లిములపై యుద్ధం చేసిన వారిని దేశ భక్తులుగా కీర్తిస్తారు. గత పార్లమెంటు ఎన్నికలను మూడవ పానిపట్టు యుద్ధంతో పోల్చడం ప్రజల్లో మతవిద్వేషాలను రెచ్చగొట్టి జనం మధ్య అడ్డుగోడలు నిర్మించడమే. అంతేకాదు స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు ప్రాతిపదికగా వారి జాతి, మతం, లింగ భేదాలతో సంబంధం లేకుండా దేశంలో పుట్టిన పౌరులందరికీ సమానమైన ప్రాధమిక హక్కులూ, సమ న్యాయం అందించే రాజ్యాంగానికి కన్నాలు వేసి దాని స్పూర్తిని పక్కాదారి పట్టిస్తూ అసమానతలతో కూడిన తమ సొంత ఎజెండాను అమలు పరుస్తున్నారు. సాక్షాతూ సుప్రీంకోర్టును తమ కనుసన్నలలో మసలుకునే కుక్కపిల్లను చెయ్యడానికి రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. దేశాన్ని కార్పోరేట్ దొరలకు అప్పనంగా రాసిచ్చి వారి ప్రయోజనాలు కాపాడడం కోసం పనిచేస్తున్నారు.
ఇప్పుడు ఫాసిజం, మనువాదం రూపాలు మార్చుకుంటూ చాపకింద నీరులా పాకుతున్నాయి. ప్రజలకు ప్రధాన శత్రువులైన ఫాసిస్ట్, మనువాద ఆధునిక పోకడలను సరైన సందర్భంలో ఎత్తిచూపుతూ సీనియర్ జర్నలిస్ట్, రచయిత, ఉద్యమకారుడు ఉషా యస్. డానీ తీసుకొచ్చిన పుస్తకం ‘నయా ఫాసిజం, నయా మనుస్మృతి’ ఆయన వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాలూ, సభలలో చేసిన ఉపన్యాసాల నోట్సుల సంపుటి ఇది. ఈ పుస్తకం నడుస్తున్న దుష్టకాలానికి అవసరమైన చర్చని ముందుకు తీసుకొచ్చింది.
‘ఫాసిజం’, ‘నాజిజం’ అనేవి హిట్లర్, ముస్సోలినీలతోనే అంతం కాలేదని ఫాసిజం అంటే ముస్సోలినీలాగా లిబియా మీదనో, హిట్లర్ లాగా ఆస్ట్రియా, పోలెండ్ ల మీదనో సైనిక దాడి చెయ్యడంలాంటిది మాత్రమే కాదు, నిరంకుశ అప్రజాస్వామిక వైఖరితో ప్రజల స్వేచ్చను హరించడం కూడా ఫాసిజమేనని డానీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటిదని చెప్పే మనుస్మృతి గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం ఎందుకు? అనేవారికి డానీ ఈ పుస్తకంలో మంచి సమాధానం ఇచ్చారు. మనుస్మృతి ఒకవైపు యజమాని కులాలకు అపరిమితమైన అధికారాలు ఇవ్వాలంటుంది. మరోవైపు శ్రామిక కులాల్ని సాంసృతిక, ఆర్ధిక రంగాలలో తీవ్రంగా అణచివేయాలంటుంది. రెండువేల సంవత్సరాలుగా ఇది రూపంలో కొన్ని మార్పులు చేసుకున్నప్పటికీ సారంలో అదేవిధంగా కొనసాగడాన్ని ఆయన అనేక సంఘటనల ఆధారాలతో వివరించారు. గతంలో మనువాదం బ్రాహ్మణుడిని ‘సూపర్ మాన్ ‘ ని చేసి అందరూ అతనికి అనుకూలంగా మసలుకుంటూ ముఖ్యంగా శూద్రులు వారికి సేవలు చేస్తూ అణిగి మణిగి ఉండాలని సూచిస్తే నయా మనువాదం బ్రాహ్మణేతరులలో కూడా ‘ సూపర్ మాన్’లను తయారు చేసి జనం మీదకు సవారీకి పంపుతుందని, వారే కార్పోరేట్ దొరలని డానీ పేర్కొన్నారు. సాంప్రదాయ మనువాదం బ్రాహ్మణులు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని చెబితే, నయా మనువాదం కార్పొరేట్లు బాగుంటే దేశం శక్తివంతంగా ఉంటుందని బుకాయిస్తుంది అంటూ ముసుగులు తొలగిన మనువాదాన్ని రచయిత డానీ ఎత్తి చూపారు.
ఫాసిజం, మనువాదాల మధ్య పరస్పర అనుబంధం ఉంటుంది. ఈ రెండింటి లక్ష్యం ప్రజల మధ్య అసమానతలు పెంచి పోషించి వారిని తమకు బానిసలుగా మార్చుకోవడం. సంప్రదాయ మనువాదం శూద్రులకు ఆదాయ వనరులు ఉండకూడదని, వారు పైవారికి సేవ చేసి వారి దయాదాక్షిణ్యాల మీద బతుకు ఈడ్చుకుంటూ ఉండాలి అని అంటే నయా మనువాదం ధనవంతులను మరింత ధనవంతులుగా చేసి పేదవారిని మరింత పేదరికంలోకి నెట్టివేసే పధకాలు పన్నుతుంది.
నాజీ నియంత హిట్లర్ యూదులను అణచివేస్తే ఈనాటి ఫాసిస్ట్ పాలకులు ముస్లింలను, క్రైస్తవులను శత్రువులుగా భావించడమేకాక దళితులు, ఆదివాసీలను, స్త్రీలను మరింత బానిసత్వంలోకి నెట్టివేస్తుంది. ఫాసిజంలాగే మనువాదం కూడా సమాజాన్ని ‘లోపలివారు’, ‘బైటవారు’ లేదా ‘ఇతరులు’ అనే గ్రూపులుగా విడగొట్టి లోపలివారు సుఖంగా ఉండాలంటే బైటివారిని కష్టపెట్టి, హింసించాలి అనే సూత్రం మీద పనిచేస్తుంది. మనువాదానికీ, ఫాసిజానికీ మధ్య ఉన్న సంబంధాన్ని అంబేద్కర్ వివరంగా చర్చించాడు. ఫాసిజాన్ని ప్రజా ఉద్యమాలు, మనువాదాన్ని రాజ్యాంగం ఓడించాయి కాబట్టి అవి ఇప్పుడు సరికొత్త వేషధారణతో ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చెయ్యడానికి వస్తున్నాయని, వాటి దొంగ వేషాలను ప్రజలు గుర్తించకపోతే జరిగే నష్టం గతంలో కంటే తీవ్రంగా ఉంటుందని డానీ ఈ పుస్తకంలో హెచ్చరించారు.
సంప్రదాయ మనుస్మృతి శూద్రులకు విద్యను నిరాకరిస్తే నయా మనుస్మృతి పైకి వారికి విద్యను నిరాకరించినట్టు ఉండకుండా వారికి ఉచితంగా విద్యనందించే ప్రభుత్వ స్కూళ్ళను, విద్యాలయాలను బలహీనపరిచి పరోక్షంగా వారికి విద్యను దూరం చేస్తుంది. విశ్వవిద్యాలయాలను నాశనం చేసి అక్కడ చదివే విద్యార్ధులలో ముఖ్యంగా అణగారిన కులాలు, మైనారిటీ లను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆడపిల్లల హాస్టల్స్ మీద దాడులు చేసి వారు చదువు మానేసి ఇంటికెళ్ళి పెళ్లి చేసుకునేలా పరోక్షంగా దోహదం చేస్తుంది.

మనుస్మృతి, ఫాసిజం అనేవి కేవలం సామాజిక సాంస్కృతిక అంశాలు అనుకుంటే పొరబాటే! అవి రాజకీయ, ఆర్ధిక అంశాలని గుర్తించడం నేటి అవసరం. సంప్రదాయ మనుస్మృతి ఆస్తిని సంపాదించే సామర్ధ్యం ఉన్నప్పటికీ సూద్రుడు ఆస్తిని పొందకూడదని నిర్దేశిస్తుంది. అయితే ముసుగు తొడుక్కున్న నయా మనువాదం బలహీన వర్గాలకు ఆర్ధిక వనరులు సమకూడిన సందర్భాలలో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. వారు సంపదను పొందడాన్ని సహించలేక వారిపై దాడులకు పాల్పడుతుంది. అలాగే ముస్లింలు సంపన్నులుగా ఉండే నగరాలలో మత కల్లోలాలు సృష్టించి వారి సంపదను పెరగకుండా నియంత్రిస్తుంది. మనుస్మృతి ఏ రూపంలో ఉన్నా శ్రామిక కులాలు స్వేచ్చగా జీవించడానికి, తద్వారా అధికారంలో న్యాయమైన భాగాన్ని పొందడానికి అవకాశాలు లేకుండా చేస్తుంది.
ఫాసిజం గ్రామాలలో, పట్టణాలలో వేరు వేరుగా వ్యక్తమవుతుంది. గ్రామాల వ్యవసాయాధారిత ఆర్ధిక వ్యవస్థలో భూమి మీద హక్కులుండే రైతులు అగ్రకులాలవారే అయ్యి ఉంటారు. వ్యవసాయ కూలీలు సహజంగా కింది కులాలవారై ఉంటారు. వ్యవసాయ కూలీలను కట్టు బానిసలుగా మారిస్తే గానీ వ్యవసాయం, గ్రామాలు పూర్వ వైభవాన్ని పొందలేవని వ్యవసాయదారులు భావిస్తారు. వారు స్వేచ్చ, సమానత్వం అనే భావనలను ఇష్టపడరు. రాజ్యాంగం దళితులకు, మైనారిటీలకు, స్త్రీలకు సమానత్వాన్నిస్తే వారు మాట వినరని, గతకాలపు సంప్రదాయపు వ్యవస్థ చిన్నా భిన్నం అవుతుందని అనుకోవడం గ్రామీణ మనువాద ఫాసిజం అని రచయిత అంటారు. అలాగే పట్టణాలలో అగ్రకుల సంపన్న వర్గం విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు, సంక్షేమ పధకాలు రావడాన్ని ఈసడించుకుంటారని, సంక్షేమ పధకాల వల్ల ఆయా రంగాలలో నాణ్యత పడిపోతుందని వాపోవడం పట్టణాలలో వ్యక్తమయ్యే ఫాసిస్ట్ మనువాద కోణమని డానీ ఈ పుస్తకంలో విశ్లేషించారు.
మతం, మతతత్వం రెండూ ఒకటి కాదని, ప్రజల విశ్వాసాలు మతం అయితే ఇతర మతాలను ద్వేషించడం మతతత్వం అని చాలావరకు ఈ రెండింటిని ఒకే విధంగా పరిగణించడంపైన ఆయన అభ్యంతరం వ్యక్తపరిచారు.
అలాగే మెజారిటీ మతస్తులైన హిందువులు కూడా ప్రస్తుత పరిస్తితిలో బాధితులే అని రాముడిని, కృష్ణుడిని కొలిచేవారు మోడీ, అమిత్ షాలను కొలిచేవారు ఒకరు కాదని సైద్ధాంతిక పరమైన గందరగోళం నుంచి ప్రజలు బైటపడాలని డానీ సూచిస్తారు. కార్పోరేట్ దొరల దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన మనువాద పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి వారి ప్రయోజనాలను కాపాడే పనిలో తమ పదవీ కాలాన్నంతా వినియోగించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చెయ్యడమేనని రచయిత డానీ అంటారు.

ఈ పుస్తకంలో ఆయన ప్రజా ఉద్యమాలలో దొర్లే తప్పులను ఎత్తిచూపిస్తూ సున్నితమైన విమర్శ చెయ్యడం గమనిస్తాం. ఈ దేశంలో మార్క్సిస్టులు ఎంతసేపటికీ ఆర్ధిక వాదం తప్ప భారత సమాజంలో అన్ని అసమానతలకు కారణమైన కులాన్ని, మతాన్ని నిర్లక్ష్యం చెయ్యడం, అలాగే అంబేడ్కర్ వాదులు కుల వివక్షపై దృష్టి పెట్టినంతగా వర్గ పరమైన పోరాటాలు చెయ్యకపోవడం వలన ఈనాడు మనువాద ఫాసిజం ఈ రూపాలు తీసుకుందని రచయిత కంప్లైంట్. అంతేకాక నాస్తికవాదులు, హేతువాదులు మాకు కులమతాలు లేవు, వాటి గురించి ఆలోచించనవసరం లేదు అనే ధోరణితో వ్యవహరించడం కూడా బ్రాహ్మణవాదం పెట్రేగిపోవడానికి మరొక ముఖ్య కారణం అని ఈ పుస్తకంలో డానీ విమర్శించారు. కుల మత సమస్యల్ని పట్టించుకోనక్కర్లేదు అనడం మార్క్సిస్ట్ దృక్పధానికి పూర్తిగా వ్యతిరేకమని, అలాగే అంబేడ్కర్ భారత సమాజానికి సంబంధించిన అన్ని రకాల రుగ్మతలపై పోరాడితే ఆయన వారసులమని చెప్పుకునేవారు ఆయన సిద్ధాంతాన్ని కేవలం కుల సమస్యకి పరిమితం చెయ్యడం వలన వారు బ్రాహ్మణ వాదంలోని మిగిలిన కోణాల్ని ఎదుర్కోలేకపోయారని, దాని ఫలితమే ఇప్పుడు మనుషుల్ని జంతువుల కంటే హీనంగా పరిగణించే నయా మనువాద ధోరణి అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా లౌకిక ప్రజాతంత్ర ఉద్యమాలన్నీ ఒకతాటిమీదకి రావాల్సిన అవసరాన్ని డానీ ఈ వ్యాసాలలో గుర్తుచేశారు.
ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు అన్నీ సమాకాలీన సామాజిక, ఆర్ధిక, రాజకీయ చిత్రపటాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తాయి. ఈ పుస్తకం బ్రాహ్మణ వాదంపై పోరాడే శక్తులకు సైద్ధాంతికంగా ఒక మంచి తోడ్పాటునిస్తుంది. సరికొత్త ముసుగులు ధరించి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నయా ఫాసిజం, నయా మనుస్మృతి అసలు రూపాన్ని పసిగట్టకపోతే దళిత, ఆదివాసీ, మైనారిటీ వర్గాలు మరింత బానిసత్వంలోకి వెళ్ళే ప్రమాదం ఉందనే సైరన్ మోత ఈ పుస్తకం లోని ప్రతి పేజీలో వినిపిస్తుంది.
సందర్భానికి అవసరమైన ‘నయా ఫాసిజం, నయా మనుస్మృతి’ వ్యాస సంపుటి రచయిత ఉషా యస్. డానీ గారికీ, ఆయనతో ఉద్యమ భాగస్వాములుగా ఉండడమే కాక ఈ పుస్తక ప్రచురణ బాధ్యతలు తీసుకున్న సామాజిక పరివర్తన కేంద్రానికి అభినందనలు.
విజయవాడ
27 ఫిబ్రవరి 2020

No comments:

Post a Comment