Monday, 17 February 2020

ఆరు రంగుల శిశిరానంతర గీతం



ఆరు రంగుల శిశిరానంతర గీతం
ఉషా యస్ డానీ

కలలు వేరు; భవిష్యత్తు వేరు.

          అచ్చంగా కలలే భవిష్యత్తును నిర్మించవు.  కాకుంటే కలలు వర్తమానంలో కొంచెం కదలికను సృష్టిస్తాయి. ఆ కదలికలు బహుశ భవిష్యత్తు కావచ్చు. అందుకేనేమో “కలలు కననివాడు విప్లవకారుడు కాలేడు” అంటారు. కలలు కనలేని కవులూ అంతే!.

          కలలు కనలేని వారికి కలలు పగలడమూ తెలీదు.  కలలు పగలడం తెలీని వారికి కొత్త కలల్ని కనడమూ తెలీదు. వాళ్ళు “పీడ కలలకు భయపడి నిద్ర నటిస్తారు”. కలలు సృష్టించే కదలికలు భవిష్యత్తును రూపకల్పన చేసినట్టే, కలలు కనే కవుల కవిత్వమూ భవిష్యత్తుకు బాటలేయవచ్చు. అప్పుడు సాహిత్యం రేపటి రాజ్యాంగం అవుతుంది. సాహిత్యకారులు రేపటి రాజ్యాంగ నిర్మాతలు అవుతారు.

          బహుశ, తరచుగా కలలు ఒలికిపోతుంటాయి. పగిలి, చితికిపోతుంటాయి. వేళ్ల సందుల్లోంచి జలజలా జారిపోయిన కలల్ని దోసిల్లార ఎత్తుకు తాగి జాతికి మరోమారు ‘స్వప్న హరితాన్ని’ ప్రసాదించడం స్వాప్నికులకు కవులకు మాత్రమే సాధ్యమయ్యే విషయం. అనుమానం వున్నవాళ్ళు ‘క్రితం తరువాత’ విరబూసిన ఆరు రంగుల “ఆకాశ స్వప్నాన్ని’ దర్శించాల్సి వుంటుంది. అక్కడో ‘శిశిరానంతర గీతం’ వినిపిస్తుంది. ప్రపంచ పటంపై వక్రరేఖలు కాలం చేస్తున్న దృశ్యం సాక్షాత్కరిస్తుంది.

          వీళ్ళు ఆరుగురు. స్వాప్నికులు. కల పూసిన చోట ఇప్పుడు వెన్నుపూసలు వేలం వేస్తున్నారని కలత చెందిన వారు. నిహిలిస్టులు అందామా? అనడం సులువే! అప్పుడు “కలల్ని బిందువు బిందువుగా కరగదీసిన’ వాళ్ల కోసం కూడ ఓ పదాన్ని సృష్టించాలి. వీళ్ళు ‘పడమటి ఆత్మహత్య’ను ప్రశ్నిస్తున్నారు. సమాధానం కావాలిప్పుడు. ‘కల విఫలమయ్యాక మిగిలిన కొస కాంతి మీంచి’ అడుగులు వెతుక్కుంటున్నారు వీళ్ళు. ‘జీవన శిధిలాల మధ్య కాలం గబ్బిలంలా వేళ్ళాడకూడదని’ కోరుకుంటున్నవాళ్లను ఆపడం న్యాయం కాదు.

          వీళ్ళు ఆరుగురు. రాజకీయులు. అచ్చమైన కవిత్వం నోటెంట పచ్చి రాజకీయాల్ని పలికించ గలవారు. క్రెమ్లిన్ స్థాణు చలనాలు, తీన్ మేన్ స్క్వేర్ చిన్నారి పాద ముద్రలు, మండేల విడుదల, గద్దర్ శబ్ద వ్యాకరణం ….. ఒక్కటేమిటీ? మొత్తం గత శతాబ్దాన్ని కవితా వస్తువుగా స్వీకరించిన వాళ్ళు.

          వీళ్ళు అరుగురు. కవులు. ఏమి చెప్పినా కవిత్వంగా మాత్రమే చెప్పాలని ఒట్టేసినవాళ్ళు. చివరికి కాలాన్నయినా సరే వాన మొగ్గల్లో, ధాన్యాక్షరాల్లో, జనన మరణ రసాయన ద్రవాల్లో, ప్రశాంత ముని వాకిట ఆమ్ల దీపాల సందడిలో కొలవ గలిగిన వాళ్ళు. ‘సిధ్ధాంతాలు ఏవైనా  సంస్థాగతాలు ఏవైనా’ రాజకీయాల్లో ఎండమావిగా మారిన ‘షడ్రుచి పాకాని’కి కవిత్వంలోనైనా కాసింత నీడ కల్పించాలనుకుంటున్న వాళ్ళు. 

          బెర్లిన్ గోడ పగుళ్ళు బారేక ఆత్మవిమర్శ పర్వంతో మొదలయిన ఈ సంయుక్త కవిత ఆరంభావస్థను పడక తప్పలేదు. గొంతు కలపడం కొత్త కదా!  శృతి కుదరొద్దూ! శ్రామికులకు రాజ్యాధికారం దక్కేంత వరకూ బూటకపు ఎన్ కౌంటర్ హత్యలు తధ్ధర్మ క్రియే! ఎవరూ? ఎవర్నీ? అనే ప్రస్తావనే లేకుండ ‘ఈ మధ్యనే భవిష్యత్తులో మరలా హత్యలు జరుగుతాయి/ రేపు గతంలో వందల హత్యలు జరుగుతాయి’ అంటూ ఉద్యమాన్ని ప్రేమార చేతుల్లోనికి ఎత్తుకున్న పంక్తులు సహితం పొందిక కుదరక కలుక్కు మనిపించాయి. ‘సాధారణ నాందీ వాచకాన్నే అసాధారణంగా అంతమొందిద్దాం’ ‘ఖైసర్, సెసెస్క్యూల చెరచాలనాల్లో నివేదించుకుందాం’ ‘నిద్రా ముద్రిత రిక్త హస్త రేఖా విన్యాసాలు’ వంటివి భాషా విన్యాసాలుగా మిగిలిపోవచ్చేమోగానీ కవితకు వాటివల్ల ఒనగూడే మేలేమీ లేదు.

          ‘ఇప్పటికైనా ఈ చెట్టును ఇక్కడి నుండి మోసుకు పోదాం’ అంటూ బాధ్యతను గురించినవాళ్ళు, చెట్టును ‘ఏమీ లేనితనాన్ని మోస్తున్న ఏదో వున్నతనంగా’, చెట్టు గతాన్ని ‘ఒకానొక నిష్ఫలిత యాగంగా’ చిత్రించడం నిక్కచ్చిగా బాధ్యతా రాహిత్యం. పోనీ దాన్ని కవితావేశంగా సరిపెట్టుకుందామా!  అందుకు పరిహారం ఏమంటే ‘మరెక్కడయినా నీడలతో గూడు కట్టుకుందాం / ఊరేగింపు ముఖ చిత్రం మీద మొక్క మొక్కను  అంటు కట్టుకుందాం’ అనడమే.

          ఎట్లాగూ రాజకీయాల్లోనికి వచ్చేశాం కనుక ‘కాస్సేపు వాతావరణం మీద సాన్నిహిత్య విమర్శ రాద్దాం’. “వర్షం … వర్షం … క్లిక్” వద్దు మాట మార్చవద్దు.
బాధంతా ఒక్కటే ఘనీభవించిన ఓల్గా, యాంగ్సీలకు పట్టిన గతి  గోదావరికి పట్టరాదనే. ముందే ‘మనం కాసేపు వివరంగా మాట్లాడుకుందాం’. ‘లెనిన్ తపస్సు స్టాలిన్ సేద్యం’లో ఎక్కడో ఓ మూల కాసింత లోపం వుందేమోనంటే మనం మాత్రం ఎందుకు భుజాలు తడుముకోవాలీ! నదీ గర్భంలో మంచు గడ్డలు పేరుకుంటున్నాయేమో! వాటి జన్మ రహాస్యాన్ని ఛేధించడానికి మనం నరసాపురం నుండి నిజామాబాద్ మీదుగా నాసికా త్రయంబకం వెళ్ళాలి.

నీ వేలి కొస మీంచే సూర్యోదయం జరుగుతుందని నువ్వు నమ్మినంత ప్రగాఢంగానే తన వేలి కొస మీంచే  సూర్యోదయం జరుగుతుందని నిన్న నువ్వు చంపినవాడు సహితం నమ్మేడు!. మిత్రులంటే అనుచరులేనా? సహచరుల మాటేమిటీ? ‘విబేధం వేరు; విద్వేషం వేరు’. విభేధించిన వారంతా శత్రువులేనా?

పోల్ పాట్, సెసెస్క్యూ, డెంగ్ జీయావో పెంగ్ ల ‘మరణాన్ని’ చూసేక వాళ్ళ అంశ ఇక్కడెక్కడైన మొలకెత్తి పెరుగుతున్నదేమోనని అనుమానం రావడం సబబే!  తప్పు పట్టాల్సింది అలాంటి అనుమానం రాకుంటేనే!

వాక్యం ఎవరిదైతే నేం? సహపంక్తిలో ఆరగిస్తూ  ఏ పంక్తి ఎవరిదని బేరీజు వేయడం సబబు కాదు. ‘ఒక దుస్వప్న వినాశనం కోసం ఆయుధం మొన మీద ముక్కుకు పదును చెక్కుతున్న పావురమంటే నియంతకు భయం’. ప్రజల కేం! ఆనందంగా హత్తుకో వచ్చు.  

రచన : 22 జూన్ 1990
ప్రచురణ : ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక, 29 జూన్  1990


‘క్రితం తర్వాత’ (సంయుక్త కవిత)

అఫ్సర్, కే నరసింహా చారి, కృష్ణుడు, నీలిమా గోపీచంద్, ప్రసేన్, త్రిపురనేని శ్రీనివాస్.
కవిత్వం ప్రచురణలు, 8 పేజీలు, వెల రెండు రూపాయలు

ప్రతులకు :  త్రిపురనేని శ్రీనివాస్, 40-5/6-10, ఇజ్రాయిల్ పేట, బందర్ రోడ్, విజయవాడ – 520010


No comments:

Post a Comment