Monday, 27 April 2020

సంక్షోభం వచ్చినపుడు ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.


సంక్షోభం వచ్చినపుడు
ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.

          మతాంతర వివాహం కనుక  చాలామంది మాది ప్రేమ వివాహం అనుకుంటారు. మాది అరేంజెడ్ మ్యారేజి. పెళ్ళికి ముందు మా మధ్య పెద్దగా పరిచయం కూడ లేదు; రెండు సందర్భాలలో పార్టి మీటుంగుల్లో కలవడం తప్ప. ఇప్పుడిది కొందరికి ఆశ్చర్యంగా వుండొచ్చుగానీ అప్పట్లో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల్లో ఇలాంటివి అనేకం జరిగేవి. ఇప్పటి కొలమానాలు మారిపోయాయిగానీ, ఉద్యమాల్లో పనిచేయడం అప్పట్లో స్త్రీపురుషుల మధ్య ప్రధాన ఆకర్షణ అంశంగా వుండేది. అలా ఉద్యమకారుల్ని పెళ్ళి చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉత్సాహం చూపేవారు.   నేను పనిచేసిన పీపుల్స్ వార్ లో ఈ సాంప్రదాయం కొంచెం ఎక్కువగా వుండేది.

          తన కూతుర్ని పార్టీలో ఇవ్వాలని ఏలూరి భీమయ్య అనుకున్నారు. “డానీకి ఇస్తే బాగుంటుంద”ని కొండపల్లి సీతారాయయ్య  సలహా ఇచ్చారు. సాహిత్యలోకానికి అజ్ఞాత సూర్యుడుగా, ఉద్యమకారులకు మల్లిక్ గా తెలిసిన   నెమలూరి భాస్కరరావు నాకు పెళ్ళి సంబంధం తెచ్చినపుడు “ఓసారి అమ్మాయితో మాట్లాడాక ఓ నిర్ణయానికి వద్దాము” అన్నాను. ఆయన అలాగే మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు.

          ఓ ఆటోమోబైలు కంపెనీలో చిన్న ఉద్యోగం నాది. ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి బ్రెడ్ ఎర్నింగ్ బాధ్యత నాది. ఆ పైన ఉద్యమంలో ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని ఒక ఉత్కంఠ వాతావరణం. పైగా మతం కూడ వేరు. అలాంటి కుటుంబంలో ఇమడాలంటే గొప్ప ఏ అమ్మాయికయినా గొప్ప మానసిక సంసిధ్ధత కావాలి.

          భీమయ్య గారిది కమ్మ సామాజికవర్గం. కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలో మధ్యతరగతి రైతు. మనిషి చాలా నిరాడంబరంగా వుండేవారు. వారి ఏకైక సంతానం అజిత ఔత్సాహిక విద్యార్థి నాయకురాలు. “నాకు ఆర్థిక స్తోమత లేదు. పైగా కష్టాలు, రిస్క్ కూడ వుంటాయి” అన్నాను. అప్పుడు తను డిగ్రీ సెకండియర్ యాన్యూవల్ పరీక్షలు రాస్తోంది.  విద్యార్థినుల్లో వుండే విప్లవ అతి ఉత్సాహపు అమాయికత్వం వల్ల తను నన్ను చేసుకోవాలనుకుంది!.

          సీనియర్ జర్నలిస్టు ఏలూరి రఘుబాబు నన్ను ఒకసారి ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రముఖు ముస్లిం రచయితలు  హిందువులను పెళ్ళి చేసుకున్నారు. ఇదెలా జరిగిందని. నరసాపురంలో మా గురువుగారు, ప్రముఖ నాటక రచయిత యం.జి. రామారావుగారు పెళ్ళి విషయంలో నాకో సలహా ఇచ్చారు. “భార్యకు రెండు లక్షణాలు వుండాలి. మొదటిది; మొగుడి మేధస్సును ఎంతోకొంత అర్థం చేసుకునేంత జ్ఞానం వుండాలి. రెండోది; తన మొగుడికన్నా గొప్పవాడు ఈ లోకంలో మరొకడు లేడనుకునేంత అజ్ఞానం వుండాలి” అని. యంజీఆర్ మాటల్నే నేను రఘుబాబు గారికి చెప్పాను. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో మా తెలుగు రచనల్ని అర్థం చేసుకుని మెచ్చుకునేంత నైపుణ్యంగల ముస్లిం మహిళలు లేరు. తెలుగు సాహిత్యంలో మా నైపుణ్యాన్ని హిందూ స్త్రీలే గుర్తించినట్టున్నారు.

          మా కష్టాలు పెళ్లి రోజునే మొదలయ్యాయి. 1983 మేడే నుండి వారం రోజుల పాటు కృష్ణా వుభయగోదావరి జిల్లాల్లో విద్యార్థి యువజనులకు రాజకీయ శిక్షణా తరగతులున్నాయి. అప్పట్లో ఆ మూడు జిల్లాలకు నేను విరసం, రాడికల్ యూత్ లీగ్ లకు బాధ్యునిగా వున్నాను. కొత్త వారికి చారిత్రక గతితార్కిక భౌతికవాదం ప్రాధమిక పాఠం చెప్పడం నా బాధ్యత.   ఆఫీసులో సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే పెళ్ళి కోసం స్టాఫ్ కు ఏడు రోజులు సెలవు ఇచ్చే సాంప్రదాయం ఒకటి వుండేది. ఆ అవకాశాన్ని వాడుకున్నాను. మే డే రాజకీయ తరగతుల కోసం  ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నాము. ఆ రాజకీయ తరగతులే మా హానీమూన్.

          మా పెద్దబ్బాయి 1985 ఏప్రిల్ 2న పుట్టాడు. కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాము. ఓ బంద్ సందర్భంగా బెజవాడ పోలీసులు నన్ను ముందస్తు అరెస్టు చేసి రోజుకో స్టేషన్లో వుంచారు. పసిపిల్లాడ్ని పక్కింటివాళ్లకు అప్పచెప్పి రోజూ నన్ను వెతుక్కుంటూ పోలీసు స్టేషన్లన్నీ తిరిగేది. ఆ ఏడాది జులై 17న కారంచెడు దురాగతం జరిగింది. వంద రోజుల కొడుకుని వదిలేసి నాలుగు నెలలు ఆ ఉద్యమం లోనికి వెళ్లిపోయాను. మా ఇల్లు నిర్మాణం ఆగిపోయింది. కారంచెడు నిందితులు తన సామాజిక వర్గానికి చెందినవారు. అసలు తను అదేమీ పట్టించుకోలేదు.  కుటుంబానికి జరిగిన ఆర్థిక నష్టంకన్నా అప్పట్లో నాకు వచ్చిన పేరును చూసి తను మురిసిపోయింది. అప్పట్లో మాకు ఒంగోలు సమీపాన చేజర్ల మండలంలో 5 ఎకరాల పట్టా భూమి వుండేది. కారం చెడు ఉద్యమ ఉత్సాహంలో ఆ భూమిని వదిలేశాను. తనేమీ అనలేదు. తను నన్ను ఎప్పుడైనాసరే ఒక సోషల్ యాక్టివిస్టుగా చూడాలనుకుంటుంది.

          చుండూరు ఉద్యమంలో నా పాత్ర స్వల్పం. ఉద్యోగం మానేసి వెళ్ళిపోమ్మని తను ప్రోత్సహించింది.అనివార్య కారణాలవల్ల నాకు కుదరలేదు. బలహీనవర్గాల సమాఖ్య కార్యవర్గంలో నాతోపాటు పనిచేసింది. చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం, వాడరేవు షిప్ బ్రేకింగ్ యూనిట్ వ్యతిరేక పోరాటం, నెల్లూరులో యానాది సంఘాల సమాఖ్య ఏర్పాటు మొదలు అమ్రాబాద్ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన  వరకు అన్నింట్లోనూ తను నా వెంటే వుంది.

          అనేకానేక ఉద్యమాలు, రాజకీయ మలుపులు, అరెస్టులు అలా ఆ ఉత్కంఠ 37 సంవత్సరాలు కొనసాగింది. మేమిద్దరం మాత్రమే ఓ నెల రోజులు ఒకే చోట వుండిపోయిన సందర్భం ఇదొక్కటే. ఆ అవకాశాన్ని కరోనా లాక్ డౌన్ మాకు కల్పించింది.

          నాది ఉద్రేక స్వభావం. అలాంటి భర్తను నాలుగు దశాబ్దాలపాటు భరించడం అంత సులువు కాదు. తనదీ ఉద్రేక స్వభావమే. అంచేత తాలింపు మాడిందనో, కారం ఎక్కువయిందనో, చింతపండు వాడారనో, కరెంటు బిల్లు కట్టకుండా క్యాంపుకు వెళ్ళిపోయాననో, బాత్ రూం స్లిప్పర్స్ తో హాలు లోనికి వచ్చేశాననో ఇలా అనేకానేక కారణాలతో మేమిద్దరం క్రమం తప్పకుండ రోజుకు మూడు పుటలా కోట్లాడుకుంటుంటాం. చీకటిపడగానే కలిసిపోతుంటాం.

          చలసాని ప్రసాద్ మా పెళ్ళి పురోహితుడు. వంద పెళ్ళిళ్ళు చేసిన ఘన చరిత్ర అతనిది. అందులోనూ ఒక విచిత్రం వుంది. ఆయన చేసిన నూరు వివాహాల్లో 99 జంటలు విడిపోయారు. “ఒరే డ్యానీగ్యా! నువ్వూ అజిత కూడ విడిపోతే నా పేరున ఒక  రికార్డు నెలకొంటుంది” అనేవాడు చలసాని.  ఆ వంద జంటల్లో ముందుగా మేమే విడిపోతామని సామాజిక పండితులు నమ్మేవారు. ముస్లింలు అలవోకగా విడాకులు ఇచ్చేస్తారనే ప్రచారమూ బలంగా వుండేది.  మేము ఆ ఊహాగానాలను నిజం కానివ్వలేదు.

          మా ఇద్దరి మధ్య ఒక శ్రమ విభజన వుంది. నేను రచయితను. తను టెక్నీషియను. ప్రింటు మీడియాలో డిటిపి పనులు, ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ప్రోగ్రామింగ్, కెమేరా సెట్టింగ్, లైటింగ్, వీడియో ఎడిటింగ్ తదితర సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ తనకు మంచి నైపుణ్యం వుంది. ఈ విభాగాల్లో నేను తన మీద ఆధారపడతాను. 

          కమ్మ సామాజికవర్గపు స్త్రీలలో ఎక్కువ మందికి ఆర్థిక వ్యవస్థ మీద స్థూలంగా అయినా ఒక  అవగాహన వుంటుంది. అజితకు కూడ అలాంటి నైపుణ్యం  వుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో తనవల్ల ఎప్పుడూ నాకేమీ ఇబ్బంది కలుగకపోగా, నేను ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పుడు తనే సమర్థంగా ఇంటిని నడిపేసేది.  ఇందులో సౌకర్యంతో పాటూ ఒక అసౌకర్యం కూడా వుంటుంది; ఇంట్లో ఇద్దరు యజమానులు వుంటారు!.

          భార్యాభర్తల సంబంధాల్లో అంతిమంగా భార్యలే పీడిత వర్గం. దాంపత్యంలో నేనేమీ విప్లవాత్మక మార్పులు తేలేదుగానీ కొన్ని సంస్కరణలు మాత్రం చేశాను. అజితకు వారసత్వంగా వచ్చిన స్థిర చరాస్తుల్ని నేనేమీ ముట్టుకోలేదు. ఆపైన, నా స్థిర చరాస్తుల్ని ఆమె పేరున రాసి ఇచ్చేశాను. ఇల్లు, కారు, స్కూటరు, బంగారం, నగదు ఏదీ నా పేరున వుంచుకోలేదు. ఆర్థిక వ్యవహారాల నుండి తప్పుకోవడంలో ఒక హాయి వుందనిపిస్తోంది. ఆ కష్టాలేవో తనే పడుతుంది.  నాకు మాత్రం అలెన్ సొలీ బ్రాండుకు తగ్గకుండ డ్రెస్సులు కొనిపెడుతుంది.

          సాధారణ సందర్భాల్లో అజిత కూడ ఒక సాధారణ స్త్రీయేగానీ ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. పన్నెండేళ్ళ క్రితం నేను పనిచేస్తున్న ఓ టీవీ ఆఫీసు నుండి ఫోన్ చేసి “ఇక్కడి వాతావరణం నాకు నచ్చడంలేదు” అన్నాను. “ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేయి. నేనున్నాగా.” అంది.   మరుక్షణం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేశాను.

          పదేళ్ళ క్రితం వరవరరావు ఒక సాహిత్య సభలో నా గురించి చెప్పినట్టు నేను నిరంతర అసమ్మతివర్గం. ప్రత్యర్ధుల్ని ఎలాగూ తెగబడి ఖండిస్తాను. మావాళ్లు అనుకున్నవాళ్ళు తప్పు చేసినా నిర్మొహమాటంగా మందలిస్తాను. అజిత లేకపోతే నేను అలాంటి కొన్ని సాహసాలు చేయగలిగేవాడిని కాదేమో! నాకు నచ్చింది నచ్చిందనీ, నచ్చనిది నచ్చలేదని ధైర్యంగా చెప్పగలిగేవాడిని కాదేమో! నిజసతోదర పొషణార్థమై గడ్డి కరవాల్సిన కాంప్రమైజ్ కావాల్సిన అవసరం నాకు రాలేదు.

థ్యాంక్యూ డార్లింగ్!

27 ఏప్రిల్ 2020 

Thursday, 16 April 2020

Let us draw lessons from Corona


Let us draw lessons from Corona
కరోనా నేర్పుతున్న గుణపాఠాలు
డానీ

వైద్య ఆరోగ్య వ్యవస్థలో కరోన వైరస్ చాలా ప్రమాదకరమైన ముప్పు. దీని పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా వుంటాయి. అయితే ఇదంతా తాత్కాలికమే. మానవజాతికి ముప్పులు కొత్త కాదు, గతంలోనూ వున్నాయి.  వరదలు, ఉప్పెనలు, భూకంపాలు, ఉల్కాపాతాల్ని ఎదుర్కొని మనం నిలబడ్డాం. కరోనాను మనం తప్పకుండా జయించి తీరుతాం. అందులో సందేహంలేదు. అయితే అదే ముగింపుకాదు. ఆ తరువాత సమాజంలో మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా వున్నాయి. ఎదుర్కోవాల్సిన ఉపద్రవాలూ చాలానే వున్నాయి.

ఈరోజు మనం చూస్తున్న ఉపద్రవాలన్నీ 1990ల నాటి నూతన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలని ముందుగా మనం గ్రహించాలి. ఈ మహమ్మారి మూలాలు ప్రపంచ వాణిజ్య కేంద్రం పునాదుల్లో వున్నాయి. ఇది చైనాలో పుట్టిందని కొందరు అంటున్నారు. సరళీకృత ఆర్థిక విధానాన్ని తెలివిగా వాడుకొని గట్టిగా లాభపడిన దేశంలో కరోన వైరస్ పుట్టిందని ఎందుకు అనుకోరూ?   ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మూడు దశాబ్దాల పాప ఫలితం. ప్రకృతితో చెలగాటం ఎప్పుడూ చెల్లదు. మన తప్పిదాలను ప్రకృతి ఎన్నటికీ క్షమించదు. అది ఆగ్రహిస్తుంది. ప్రకృతి ఆగ్రహాన్ని తట్టుకోవడం అంత సులువుకాదు. ప్రపంచ మానవాళీ మొత్తం ఒకసారి మృత్యుముఖంలోనికి వెళ్ళి వస్తోంది. మానవజాతికి కరోనాకన్నా ప్రమాదకరమైన అణుయుధ్ధం, భూతాపం వంటి మరికొన్ని  ఉపద్రవాలు ముంచుకు రాబోతున్నాయి.  మనం ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి సిధ్ధం కావాలి.

 కరోనా సమస్య పరిష్కారం అయ్యాక మన ముందుకు రెండు ప్రత్యామ్నాయాలు వస్తాయి. ప్రభుత్వాలకు నిరంకుశ అధికారాలన్నీ అప్పచెప్పడమా? లేక మానవీయ విలువలతో కూడిన ఒక కొత్త సమాజాన్ని పునర్ నిర్మించడమా? 

కరోన సమస్య తీరే నాటికి దాదాపు అన్ని దేశాల్లోనూ ఆర్ధిక సంక్షోభం చెలరేగుతుంది. ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి  తమకు అపరిమిత అధికారాలు కావాలని ప్రభుత్వాధి నేతలు అడుగుతారు. సామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక ఆదర్శాలున్న రాజ్యాంగాలను అటకెక్కిస్తారు.  కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే  దేశ ఆర్థిక స్థితి మెరుగుపడదంటారు. నిజానికి కరోకా పుట్టడానికి ముందే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం వుంది. ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి భారీగా రాయితీలు ప్రకటించాయి. ఇప్పుడు మందగమన నెపంతోపాటూ ఆర్థిక సంక్షోభం నెపాన్ని కూడ కరోనా మీద గెటివేసే అవకాశం పాలకులకు దక్కుతుంది. 

ఇలాంటి సంక్షుభిత సందర్భంలో  దురదృష్టావశాత్తు వదరుబోతులు, ముధ్ధోన్మాదులు, వివక్షవాదులు, సమానత్వ వ్యతిరేకులు అనేక దేశాల్లో పాలకులుగా వున్నారు. డోనాల్డ్ ట్రంప్ దీనికి పెద్ద ఉదాహరణ.

అమెరిక ఆర్థిక సామర్థ్యమేగాక సైనిక పాటవం కూడ చాలా పెద్దది. క్యూబా, ఇరాన్ ల మీద అమెరిక అనేక ఆంక్షల్ని విధించింది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బలహీనపరచడానికి అనేక కుట్రలు పన్నింది.   అనేక యూరప్ దేశాలు సహితం అమెరిక బాటలోనే నడిచాయి. క్రూడాయిల్ ధరను ఇరాన్ తగ్గించినా అమెరికాకు భయపడి అనేక దేశాలు కొనలేదు. అలా కొనని దేశాల్లో భారత్‍ కూడ ఒకటి.

ఈ కష్టకాలంలో ఏ దేశమూ మరో దేశాన్ని ఆదుకునే స్థితిలో లేవు. కానీ యూరోప్ దేశాల్లో కరోన సోకిన వారికి వైద్య సేవలు అందించడానికి క్యూబా తన వైద్య బృందాల్ని పంపించింది. చాత్రిత్రక అపహాస్యం అంటే ఇదే. ఇప్పుడయినా యూరోపియన్ యూనియన్ సిగ్గుపడాలి.

కరోనా మానవాళిని వెంటాడడం మొదలయ్యాక సహంజంగానే మనలో ఒక పాపభీతి కలిగితీరాలి. మనిషి అత్యాశతో ప్రకృతితో చెలగాటమాడాడు. ప్రకృతిని విచక్షణా రహితంగా విధ్వంసం చేశాడు.  ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసింది.  మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. అతిశయించిన అత్యాశతో మనం నిర్మించుకున్న  ప్రపంచం ఎలాంటి ఫలితాలను ఇస్తున్నదో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మనం ఎలాంటి ప్రపంచాన్ని కోరుకోవాలి? ఎలాంటి ప్రపంచాన్ని కోరుకోకూడదు? అనే విచక్షణ మనకు ఇప్పుడయినా రావాలి.

ఆర్థిక రంగంలో చేపట్టిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG)  విధానాలు సామాజిక సాంస్కృతిక రంగాల్లో గతంలో వుత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించలేకపోగా వాటిని భారీగా పెంచాయి.

సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) 2003లో వచ్చింది. 2015లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వచ్చింది.  రెండు పెనుముప్పులు వచ్చినపుడు మూడోది వస్తుందని మనం గుర్తించి వాక్సిన్ తో సిధ్ధంగా వుండాల్సింది. ఓ మనిషికి రెండుసార్లు కుక్కకరిస్తే మూడోసారి కూడా కరుస్తుందని జాగ్రత్త పడాలి. అలా జాగ్రతత పడకపోతే అతనికి పిచ్చిపట్టిందని మనం అనుకోవచ్చు. మానవాళికి అలాంటి పిచ్చి పట్టింది. కరోన మూడవ అవతారం ఎత్తుతుందని మనం గుర్తించనేలేదు. మన ప్రాధాన్యాలు  వేరేగా వున్నాయి. మన చూపు వేరే  చోటవుంది.

మన ఫార్మా కంపెనీల ప్రాధాన్యతలు వేరు. వాటి పని మానవ జాతిని రోగాల నుండి కాపాడడంకాదు; అత్యధిక లాభాలను మూటగట్టుకోవడం. అంటువ్యాధులకు మందులు కనిపెడితే వాటిని ప్రభుత్వం గంపగుత్తగా కొని  సామూహికంగా వాడుతుంది కనుక పెద్దగా లాభాలు రావు. వ్యక్తులకు, ప్రధానంగా స్థితిమంతులకు సాధారణంగా వచ్చే జబ్బులకు మందులు కనిపెడితే మంచి ధరకు అమ్ముకోవచ్చు లాభాలు పిండుకోవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యమని  గతంలో అనుకునేవారు. ఆరోజులు పోయాయి. ఇప్పుడు మహాభాగ్యమే ఆరోగ్యం. అదొక విలాస సరుకు.

మనకు మూడు చేపల నీతి కథ తెలుసు. ముందుగా జాగ్రత్త పడిన చేప. ప్రమాదం ముంచుకు వస్తున్నపుడు మేల్కొన్న చేప. ప్రమాదం వచ్చాక బెంబేలుపడిపోయిన చేప.

కరోన వైరస్ గురించి 2019 అక్టోబరులోనే పుకార్లు వచ్చాయి. డిసెంబరులో చైనా స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. నీతి కథలోని మొదటి చేపలా దక్షణ కొరియా, తైవాన్ తదితర దేశాలు జాగ్రత్త పడ్డాయి. రెండవ చేపలా కొన్ని యూరప్ దేశాలు కొంచెం లేటుగా కళ్ళు తెరిచాయి. ఇక చివరి వరకు నిద్ర పోయిన దేశాలు  అమెరిక, యూకే. యూకే ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన దేశం. అమెరిక ఇప్పుడు ప్రపంచాన్ని శాశిస్తున్న దేశం. అయితేనేం ఆ రెండు దేశాలు నిర్లక్ష్యానికి ఫలితంగా ఇప్పుడు కరోన కోరల్లో గిలగిల లాడుతున్నాయి.

కరోన ఒక విపత్తే అయినప్పటికీ అందులోనూ ఒక సానుకూల కోణం వుంది. మన వ్యవస్థలో, మన ఆశల్లో, ఆశయాల్లో, మన ప్రాధాన్యతల్లో వున్న అనేక లోపాలను అది  బయటికి తెచ్చింది అంటున్నారు అమెరిక రాజకీయ విశ్లేషకులు, భాషాశాస్త్రవేత్త నోవోమ్ చోమ్స్కీ.  యూఎస్ లో కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం ఆయన ఆరిజోనా రాష్ట్రంలో స్వీయ – ఒంటరితనంలో వుంటున్నారు. మన సామాజిక ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చాలి  అంటున్నారు చోమ్స్కీ. 

కరోనా మనకు ఒక హెచ్చరిక చేసింది. దీన్ని గుణపాఠంలా తీసుకోవాలి. మన వ్యవస్థల్లోని అంతర్గత లోపాల్ని తప్పుల్ని సరిచేసుకోవాలి. లేకుంటే ఇంతకన్నా పెద్ద ఉపద్రవాల్లో మానవాళి కూరుకుపోవాల్సి వస్తుంది.

సామాజిక దూరం అనేది ఇప్పుడు కొత్త ఆరోగ్య సూత్రంగా ప్రచారం చేస్తున్నారు. మనుషుల మధ్య అంతరం అనేక శతాబ్దాలుగా  కొనసాగుతూ వస్తున్నది. ఒక కులంవాళ్ళు మరో కులంవారిని దూరంగా వుంచుతారు. ఒక తెగవారు మరో తెగని దూరంగా వుంచుతారు. ఒక మత సమూహం మరో మత సమూహాన్ని దూరంగా వుంచుతుంది. ఒక భాషవారు మరో భాష వారిని దూరంగా వుంచుతారు. ఒక దేశంవారు మరో దేశం వారిని దూరంగా వుంచుతారు. సమీప గతంలో మనుషులు కలిసి బతికిందెప్పుడూ?  మనమంతా సమానులం అనుకుని కలిసి బతికిన కాలం ఎవరికయినా గుర్తుందా?

కరోనా ఎవ్వర్నీ వదలలేదు. చైనానూ వదలలేదు అమెరికానూ వదలలేదు. ఇండియానూ వదలలేదు పాకిస్తాన్ నూ వదలలేదు. సిరియా శరణార్ధుల్నీ వదలలేదు యూరోపియన్ దేశాల్నీ వదలలేదు. రోహింగ్యాలనూ వదలలేదు; బర్మీయుల్నీ వదలలేదు.  ఇంతకు ముందు ఈ దూరాలు సమూహాల స్థాయిలో వుండేవి. ఇప్పుడు కరోనా దాన్ని వ్యక్తుల స్థాయికి తెచ్చింది. కొడుకును తాకడానికి తండ్రి, భర్తను తాకడానికి భార్య, మనిషిని తాకడానికి మనిషి  భయపడుతున్న కాలం లోనికి మనం ప్రవేశించాం.

మారుద్దాం. ఈ లోకాన్ని మారుద్దాం. మనిషిని మనిషి ప్రేమించే లోకాన్ని సృష్టిద్దాం. కరోనా గుర్తు చేస్తున్న గుణపాఠం అదే.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, మొబైల్ 9010757776)

రచన : 12 ఏప్రిల్  2020
ప్రచురణ : ఆంధ్రజ్యోతి (ఆంధ్రప్రదేశ్)  16 ఏప్రిల్  2020



Friday, 10 April 2020

Corona and its Background

Corona and its Background



కరోనా : కొంచెంముందూ కొంచెం వెనుక
 డానీ
          శత్రుదేశాల మీద దాడికి అణుబాంబులు సిధ్ధం చేసుకుంటారుగానీ గట్టిగా జలుబుచేస్తే చాలు మనుషుల దగ్గర  మందు వుండదని కరోన గుర్తు చేసింది.

కరోన జన్మస్థలం చైనాలోని వూహాన్ నగరం. అక్కడి  సీఫుడ్హోల్సేల్మార్కెట్పరిసరాల్లో న్యుమోనియా లాంటి వ్యాధి వ్యాపిస్తోందని చైనా ప్రభుత్వం గత ఏడాది డిసెంఅబ్రు 31న ప్రకటించింది. మరుసటి రోజునే అంటే... జనవరి 1 తేదీన సీఫుడ్మార్కెట్ను మూసేసింది. నిజానికి అప్పటికి రెండు నెలలు ముందే కొవిడ్ -19 అక్కడ పుట్టింది.

ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో చైనాది రెండవస్థానం. దానికి ముప్పు వచ్చిందంటే మొదటి పదిహేను స్థానాల్లో వున్న  అమెరిక, జపాన్, జర్మనీ, యుకే, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, బ్రెజిల్, కెనడా, రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, స్పెయిన్, మెక్సికో దేశాలకు ముప్పు వచ్చినట్టే. తూర్పు ఆసియా దేశమైన చైనాలో మహమ్మారి పుట్టిందని తెలియగానే ఆ ప్రాంతంలోని దక్షణ కొరియా, జపాన్ వంటి దేశాలు రాబోయే వైరస్ వ్యాప్తిని తట్టుకోవడానికి ముందస్తు చర్యలు చేపట్టాయి. ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, సింగపూర్ కూడా వైరస్ పై వార్ కు సిధ్ధపడ్డాయి. మరోవైపు అమెరిక, ఇటలీలతోసహా అనేక దేశాలు రాష్ట్రాల అధినేతలు అనేకులు  కరోనాను అవహేళన చేశారు. జ్వరం, తలనొప్పి, నిమోనియాలకు వాడే పారాసిటమాల్ తదితర ‘ఓవర్ ద కౌంటర్’ (ఓటిసి) టాబ్లెట్స్ తో కరోనాను తరిమి కొట్టవచ్చని తేలిగ్గా తీసిపడేశారు. వేసవి వస్తే కరోనా నిలవదని రోనాల్డ్ ట్రంప్ హేళన చేశారు. తమ దేశం అతి త్వరలో కరోనా వాక్సిన్ ను విడుదల చేస్తుందన్నారు.

జనాభాలోనూ ఆర్థిక రంగంలోనూ చైనాతో పోటీ పడుతున్న  దక్షణాసియా దేశమైన  భారత్ తనకు పొరుగుదేశం నుండి కోవిడ్ ముప్పువుందని ముందుగానే గమనించి వుండాల్సింది కానీ అలా జరగలేదు. కోవిడ్ విశ్వమారిలా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన తరువాత కూడ ఇరవై రోజులకుగానీ మన ప్రభుత్వం మేల్కొనలేదు. పైగా, మార్చి 13న దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని ప్రకటించి దేశప్రజలకు తప్పుడు సంకేతాన్ని ఇచ్చింది.

వేగంగా దూసుకుని వస్తున్న ఒక మహమ్మారిని సకాలంలో గుర్తించ నిరాకరించిన కారణంగా మార్చి నెలాఖరుకు ప్రపంచ వ్యాప్తంగా  కొవిడ్ – 19 సోకినవారి సంఖ్య పది లక్షలు దాటింది. మృతుల సంఖ్య 50 వేలు దాటింది. వారం రోజుల్లో సోకినవారి సంఖ్య పదిహేను లక్షలు దాటేశాయి, మృతుల సంఖ్య 90 వేలకు చేరుకుంది. దాన్ని బట్టి కరోనా వ్యాప్తి వేగాన్ని అంచనా వేయవచ్చు. ఈ గణాంకాలన్నీ ఆరోగ్య పరీక్షల అనంతరం రోగ నిర్ధారణ అయిన కేసులకు సంబంధించినవి మాత్రమే. తమకు వైరస్ సోకిన విషయం తెలియనివాళ్ళు, శరీరంలో వ్యాధి లక్షణాలు ఇంకా బయటపడని వాళ్ళు ఎందరున్నారో వాళ్ల ద్వార ఇంకెందరికి ఇది సోకుతూ పోతున్నదో ఊహించుకోవలసిందే.

            కోవిడ్ – 19 వ్యాప్తిలో మూడు  దశలుంటాయి. మొదటి దశ; విదేశాల నుండి దిగుమతి కావడం. రెండవ దశ, విదేశాల నుండి వచ్చినవారి ద్వార వారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తదితర సన్నిహిత సమూహానికి సోకడం. మూడవ దశ; మొత్తం సమాజంలో విజృంభించడం. విదేశాలకు వెళ్ళకపోయినా, పాజిటివ్ వ్యక్తులతో సంబంధాలు లేకపోయినా అసలు ఎవరి ద్వార సంక్రమించిందో తెలియకుండానే వైరస్ సోకే చెందే దశ ఇది. దీనినే Community Transmission అంటారు. కరోనా వైరస్ సోకే అవకాశాలున్న వారిని రెండవ  దశ వరకు గుర్తించడం కష్టమేగానీ అసాధ్యం మాత్రం కాదు. భారత్ వంటి అత్యధిక జనాభా గలిగిన దేశంలో మూడవ దశలో వైరస్ సోకే వారి సంఖ్యను అంచనా వేయడం  వైద్య ఆరోగ్యరంగ నిపుణులకు సహితం అసాధ్యం.

            నిత్యం దాదాపుగా 25 వేల మంది ప్రయాణీకులు విదేశాల నుండి భారత దేశానికి  వస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, నెలల్లో అలా 6 లక్షల మంది వచ్చి వుంటారు. మార్చి 16న విదేశాల నుండి వచ్చే వారి మీద  నిషేధం విధించే వరకు ఇంకో లక్ష మంది వచ్చి వుంటారు. ఈ ఏడు లక్షల మంది భారత దేశానికి సంబంధించి కోవిడ్ – 19 మొదటి దశకు చెందిన అనుమానితులు.  వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ వున్నారూ? వీరి ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? వీరితో సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య ఎంత? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? అనే అంశాల మీద ఒక్కర్ని కూడ మినహాయించకుండ సమగ్ర సర్వే జరగాలి. ఈ సర్వే జనగణన, ఎన్ పిఆర్, సిఏఏ, ఎన్ ఆర్సీలకన్నా ప్రాణప్రదమైనది. ఎవరెన్ని అభ్యంతరాలు చెప్పినా ఎన్నార్సీసర్వే జరిపితీరుతాం అని ఒకటికి పదిసార్లు నొక్కి చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడు లక్షల మంది ఆరోగ్య స్థితి మీద సకాలంలో  సర్వే జరపాలన్న అంశాన్ని ఉపేక్షించింది. ఏ ప్రభుత్వంలో అయినా సరే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం అయిపోయినపుడు సామాజిక ప్రయోజనాలు నిర్లక్ష్యానికి గురయిపోతాయి.

            నిజానికి భారత ప్రజలు అద్భుతమైన సివిక్‍ సెన్స్ గలవారు. ప్రధాని జనతా కర్ ఫ్యూ పాటించమంటే పాటించారు. తాలీ ఔర్ థాలీ కార్యక్రమం ఇస్తే తలూపారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. కంచాలు మీద చెంచాలతో వాయించమంటే వాయించారు.  లాక్ డౌన్ ప్రకటించి మూడు వారాలపాటు ఇళ్ళలో సెల్ఫ్ ఐసోలేషన్ పాటించమంటే పాటిస్తున్నారు. ఏప్రిల్ 5 రాత్రి దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించమంటే వెలిగించారు. కరోనాను తరిమి కొట్టడానికి ప్రభుత్వం ఇంక ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా పాటించడానికి ప్రజలు సిధ్ధంగా వున్నారు. సరైన కార్యక్రమాన్ని ఇవ్వకపోతే అది పాలకుల తప్పిదం అవుతుందిగానీ; ప్రజలది మాత్రంకాదు. 

            ఒక అంచనా ప్రకారం ఈ వైరస్  ఒకరి నుండి మరొకరికి సగటున 17 మందికి సోకుతుంది (ట). ఈ లెఖ్ఖ ప్రకారం మొదటి దశలోని 7 లక్షల మంది అనుమానితులు  రెండవ దశలో ఒక కోటి 19 లక్షల మంది అవుతారు. మూడవ దశలో అనుమానితుల సంఖ్య దాదాపు 20 కోట్లకు చేరుకుంటుంది. ఇదొక గరిష్ట ఊహాగానం (Hypothesis) మాత్రమే. ఎందుకంటే మొదటి ధశలో  విదేశాల నుండి వచ్చినవారు అందరూ వైరస్ తో వుండరు. ఎంతమంది వైరస్ తో వచ్చారు అన్నది కూడ పరీక్షలు చేసి తేల్చాల్సిన అంశం. ఈ అంకెలు ఎవర్నీ భయపెట్టడానికికాదు; మహమ్మారిని ఎదుర్కోవడానికి మన సంసిధ్ధత ఏ స్థాయిలో వుండాలో చెప్పడానికి మాత్రమే. ముంచుకు వస్తున్న ఇంతటి మహా ఉపద్రవాన్ని మనం తక్కువగా అంచనా వేసి వేరే పనుల్లో మునిగిపోయాం. మనం అంటే ప్రజలు పాలకులు కూడ.

కేరళలో తొలి కరోన కేసు నమోదయిందని భారత ప్రభుత్వం జనవరి 30న  ధృవీకరించింది. ఆరోజు నుండే  భారత దేశానికి వస్తున్న విదేశీయుల్నీ,  స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయుల్నీ ఎయిర్ పోర్టులనుండే 14 రోజుల క్వారంటైన్ కు పంపించే కార్యక్రమాన్ని మొదలెట్టివుంటే ఈ వైరస్ ను మొగ్గలోనే తుంచేసే అవకాశం వుండేది.  కానీ, భారత ప్రభుత్వ దృష్టి అంతా అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన మీదే వుంది. మరో వైపు ట్రంపు కూడ భారత పర్యటనకు ఉవ్విళ్ళూరారు. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ లో  అమెరిక అధ్యక్షుని రోడ్ షోకు అట్టహాసంగా అక్షరాల కోటి మందిని సమీకరించడానికి సన్నాహాలు చేశారు. పది మిలియన్ల భారతీయులు తనను చూడడానికి వస్తున్నారని ట్రంప్ స్వయంగా గొప్పగా చెప్పుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) సహితం అమెరిక మీద మొగమాటంతో ట్రంప్ భారత పర్యటన ముగిసే వరకు  కరోన వైరస్ మీద హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటనను వాయిదా వేసింది. డోనాల్డ్ ట్రంప్ ఇండియా వచ్చి యుధ్ధవిమానాలు అమ్ముకోవాలని ఆతృతపడ్డాడేతప్ప; అప్పుడే హైడ్రాక్సి క్లోరోక్విన్  మాత్రలు కొనుక్కోవాలనుకోలేదు

 కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా మార్చి 20న ప్రకటించింది. ఆ రోజు మన ప్రధాని దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మార్చి 22న జనతా కర్ ఫ్యూ నిర్వహించాలని కోరారు. సామాజిక దూరాన్ని పాటించాలనే నియమం కూడ ఆరోజునే మొదటిసారిగా ఎజెండా లోనికి వచ్చింది. లాక్ డౌన్ నియమాలు మార్చి 25 నుండి అమల్లోనికి వచ్చాయి.

            ఏ సమాజంలో అయినా సాంప్రదాయాలు సామాజిక విలువలు ఏర్పడడానికి కొన్ని శతాబ్దాలు పడతాయి. మన దేశంలో సాంప్రదాయాలు మారిపోవడానికి ఒక్క నెల చాలు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో అమెరికా అధ్యక్షుడ్ని భారత ప్రధాని డజనుసార్లు ఆలింగనం చేసుకోవడం ఒక గొప్ప విలువగా ప్రచారం అయ్యింది. ఒక అభివృధ్ధి చెందుతున్న దేశం ఒక అగ్రరాజ్యం పై సాధించిన నైతిక విజయంగా దాన్ని భావించారు. సరిగ్గా నెల తిరక్కుండానే మార్చి 20న ‘సామాజిక దూరం కొత్త విలువగా మారిపోయింది. ఇప్పుడు మనుషుల మధ్య నాలుగు అడుగుల దూరాన్ని పాటించడం కొత్త  ఆరోగ్య సంస్కారం అయిపోయింది.  

            ప్రధాని ప్రకటించడానికి ముందేగాక ప్రకటించిన తరువాత కూడ సామాజిక దూరం నియమం విస్తారంగా వుల్లంఘనకు గురయ్యింది; గురవుతోంది. అవసరమైన ఏర్పాట్లు చేయకుండ, అందుబాటులో ఆహారాన్ని ఏర్పాటు చేయకుండా హఠాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల కొన్ని కోట్ల మంది ప్రజలు ఇళ్ళలోనో రోడ్ల మీదనో ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలిని తట్టుకోలేనివారు గుంపులుగా రోడ్ల మీదకు వస్తున్నారు. కొందరు ఇళ్ళలోనే మగ్గిపోతున్నారు. మరి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ లాజిస్టిక్ లోపాలకు కారకులు ఎవరూ?

            ప్రస్తుతం ప్రపంచాన్ని సోకుతున్న కరోన వైరస్ కొత్తది.  2003 నాటి  సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS), 2015 నాటి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS)  కన్నా ఇది భిన్నమైనది. అందుకే దీన్ని కొత్త (నావెల్) కరోనా వైరస్ లేదా కోవిడ్ -19 అంటున్నారు.  కోవిడ్ -19కు ఇప్పటి వరకు కచ్చితమైన మందు లేదు ఒక నిర్దిష్ట చికిత్సావిధానం కూడ లేదు. ఇంకా మందునే కనుగొనలేనప్పుడు టీకా (వ్యాక్సిన్) ను కనుగొనడానికి చాలా సమయం పట్టవచ్చు. దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నెప్పులు, నిమోనియా, సిఓపిడి, మలేరియ తదితర వ్యాధులకు ఇప్పటి వరకు వాడుతున్న మందుల్నే కరోనాకు వాడుతున్నారు. కరోన ప్రధానంగా ఊపిరితిత్తుల వ్యాధి కనుక రోగులకు వెంటిలేటర్లు వాడాల్సివుంటుంది. దానితో  ప్రపంచ వ్యాప్తంగా వెంటిలేటర్లు, సాధారణ మాస్కులు, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు, పర్సనల్ ప్రొటేక్షన్ ఎక్విప్ మెంట్ (PPE) వగయిరాలకు  చాలా పెద్ద గిరాకీ ఏర్పడింది. అనేక చోట్ల పిపిఇలు, మాస్కులు  అందుబాటులోలేక  డాక్టర్లు, పారా మెడికల్ స్టాఫ్, పారిశుధ్య కార్మికులు తమ విధుల్ని నిర్వహించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఏ దశకు చేరిందంటే మందులు, వైద్య పరికరాల కోసం  దేశాలే ఏకంగా హైజాకర్లుగా మారిపోతున్నాయి.

చైనా లోని షాంఘై విమాశ్రయం నుండి ఏప్రిల్ 2న ఎన్-95 మాస్కులతో ఫ్రాన్స్ కు బయలుదేరబోతున్న కార్గో విమానంలోని మొత్తం సరుకును  అమెరిక అక్కడికక్కడే మూడు రెట్లు అధిక ధర చెల్లించి ఎత్తుకు పోయింది. దేశంలో మెడికల్ కిట్స్‍ కు ఇంతటి కొరత వున్న సమయంలో  ఏప్రిల్ 5న కొచ్చి ఏయిర్ పోర్టు నుండి 90 టన్నుల మాస్కులు, సర్జికల్ గ్లౌజులు,  పిపిఇ లతో ఒక కార్గో విమానం సెర్జియా రాజధాని బెల్గ్రేడ్ కు బయలుదేరి వెళ్ళడం మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. అంతకు ముందు మార్చి 29న కూడ మరో విమానంలో 35 లక్షల జతల సెర్జికల్ గ్లౌజులు కొచ్చి ఏయిర్ పోర్టు నుండి ఎగుమతి అయ్యాయి. ఏమిటీ దీనిర్ధం? 

రచన : 4 ఏప్రిల్  2020
ప్రచురణ :   ఫేస్ బుక్.  6 ఏప్రిల్ 2020

Monday, 6 April 2020

Coronalogy and Communal Virology


Coronalogy and Communal Virology
కరోనాలజీ! కమ్యూనల్ వైరాలజీ

డానీ           

            ఒక అననుకూల వాతావరణంలో అమాయకత్వంతోనో, అతి విశ్వాసంతోనో, మూఢనమ్మకంతోనో తబ్లిఘీ జమాత్ వ్యవహరించిన తీరు మొత్తం భారత ముస్లిం సమాజాన్ని బోనులో నిలబెట్టింది. ఈ నింద త్వరలోనే తొలగిపోవచ్చని ఆశిద్దాం. దాని దుష్ప్రభావం చాలా కాలం కొనసాగుతుంది. ఎందుకంటే మనుషుల్లో ఏర్పడిన దురభిప్రాయాలు వెంటనే మాసిపోవు.

కరోనా సొకినవారిని  ‘బాధితులు’ అనరాదనీ వారిని ‘చికిత్సలో ఉన్న వారు’ అని మాత్రమే పేర్కొనాలనీ అని కేంద్ర ప్రభుత్వం పౌరులకు పలు సూచనలు జారీ చేసింది. అలాగే కరోనా వ్యాప్తి విషయంలో “మతాలు, ప్రాంతాల ముద్రలు రుద్దకూడదు” అని హెచ్చరించింది. అయినప్పటికీ మనదేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించిన వార్తల్లో నిజాముద్దీన్ మర్కజ్ పేరు తరచుగా వినపడుతూనే వుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బిజెపి సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మర్కజ్ ను సందర్శించి వచ్చినవారు వివిధ రాష్ట్రాలలో  “మానవ బాంబులు”గా మారారని తాజాగా ఆరోపించారు.  

ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికీ ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరి తప్పు ఎంతో తేల్చడానికి కరోన వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఘన చరిత్రను ఒక వరుస క్రమంలో అర్థం చేసుకోవాల్సి వుంది.  Corona Chronology = Coronology. అన్నట్టు, క్రొనోలాజీ అనేది మన కేంద్ర హోంమంత్రికి చాలా ఇష్టమైన పదం. వారు గతంలో సిఏఏ, సెన్సెస్, ఎన్ పిఆర్, ఎన్ ఆర్సీల క్రొనోలాజీని విపులంగా వివరించియున్నారు.   

సాధారణంగా అధికారంలో వున్న సామాజికవర్గాలకు తమ తప్పుల్ని చాకచక్యంగా ఇతర సామాజికవర్గాల మీద నెట్టివేసే సౌకర్యం వుంటుంది.  శిక్షాస్మృతి రూపకల్పనలోనే ఇలాంటి వెసులుబాటును పొందుపరుస్తారు. ఎప్పుడూ ఏ కేసులోనూ నేరస్తులు అందరూ దొరకరు. దొరికిన వాళ్ళను మాత్రమే  శిక్షిస్తారు. శిక్షించేవాళ్ళలోనూ నేరస్తులు వుంటారు. అలా ఇప్పుడు తబ్లిఘీ జమాత్ పేరు వెలుగులోనికి వచ్చింది. తబ్లిఘీ జమాత్ ఒక తప్పు చేసిందంటే మిగిలిన వాళ్ళు ఎవరూ తప్పులు చేయలేదని కాదు.  కొందరి తప్పులు కనిపిస్తాయి కొందరివి కన్బిపించవు. అంతే. చట్టాన్ని అమలు చేసేవాళ్ళు ఏ కేసును ఎందుకు బయటపెడతారు, ఏ కేసును ఎందుకు దాచి పెడతారు అనేది అదో పెద్ద సామాజిక, సాంస్కృతిక తాత్విక చర్చ.

తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ కార్యాలయం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గా సమీపంలోని మర్కజ్ లో వుంది. దీనిని నిజాముద్దీన్ మర్కజ్ అంటారుగానీ హజ్రత్ నిజాముద్దీన్ దర్గాతో దీనికి ఎలాంటి సంబంధమూలేదు. మర్కజ్  ప్రస్తుత అధినేత మౌలాన ముహమ్మద్ సాద్ కంధాల్వీ. మర్కజ్ అంటేనే సమావేశ మందిరం అని అర్థం.            సాధారణ దినాల్లో మర్కజ్ ప్రాంగణంలో కొన్ని వందల మంది వుంటారు. కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రాంగణంలో వేల మంది వుంటారు. పది వేల మంది ఒక్కసారిగా సమావేశం కావడానికి అవసరమైన సౌకర్యాలు అక్కడ వుంటాయి. అనేక దేశాలకు విస్తరించిన సంస్థ కనుక నిత్యం మర్కజ్ కు వచ్చే వారిలో  విదేశీయులు సహితం పెద్ద సంఖ్యలో వుంటారు. తబ్లిఘీ జమాత్ ప్రపంచ వ్యాప్తంగా  వివిధ నగరాల్లో లక్షల మందితో ఇజ్తెమాలు నిర్వహిస్తూ వుంటుంది.  మర్కజ్ లో మార్చి రెండవ వారంలో నిర్వహించిన అంతర్జాతీయ విసృత కార్యవర్గ సమావేశం ఇప్పుడు ఒక పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వివాదంలో మర్కజ్ పాత్ర మంచి చెడుల్ని  తేల్చడానికి మన దగ్గర నాలుగు రకాల ఇన్ పుట్స్ వున్నాయి. మొదటిది, జరిగిన సంఘటనలు. రెండవది; తన చర్యల్ని  సమర్థించుకోవడానికి మర్కజ్ చేస్తున్న వాదనలు. మూడవది; సంఘీయులు  మర్కస్ మీద చేస్తున్న ఆరోపణలు. నాలుగవది; ముస్లిం సమాజంలోని ఇతర జమాత్ లు, ప్రముఖుల స్పందన . ఈ నాలుగు ఇన్ పుట్స్ ను విశ్లేషిస్తే ఆలోచనాపరులు ఈ అంశం మీద తీసుకోవాల్సిన విధానం స్పష్టం అవుతుంది.

జరిగిన సంఘటనలు కరోనాలజీ.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి మధ్యలో కరోన వైరస్ గురించి ప్రపంచాన్ని హెచ్చరించింది. భారత ప్రభుత్వం మనదేశంలోనికి కరోన ప్రవేశించినట్టు జనవరి 30న తొలిసారిగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్చి 11న  కరోనాను విశ్వమారిగా ప్రకటించింది. మార్చి 13న భారత ప్రభుత్వం కరోనా వ్యాప్తి గురించి ఆందోళన వ్యక్తం చేసింది. అయితే,  దేశంలో ఇంకా హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి లేదని పేర్కొంది. అదే రోజు ఢిల్లీ ప్రభుత్వం దేశరాజధాని నగర ప్రాంతంలో 200 మందికి మించి సభలు, సదస్సులు, సమావేశాలు, గూమిగూడడాలు చేయరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరునాడు ఈ సంఖ్యను 50కు కుదిస్తూ మరో ఉత్తర్వును జారీ చేసింది. తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ విస్తృత కార్యవర్గ సమావేశం మార్చి 13 నుండి 15 వరకు ఢిల్లీలో జరిగాయి. దేశ విదేశాల నుండి వచ్చిన దాదాపు మూడున్నర వేల మంది మూడు రోజులూ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. వీరిలో విదేశీయులు పెద్ద సంఖ్యలో వున్నారు.  మలేసియా, ఇండోనేషియా నుండి కూడ ప్రతినిధులు ఈ సమావేశానికి వచ్చారు.

తబ్లిగ్ జమాత్ ఫిబ్రవరి చివర్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఒక పెద్ద సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ -19ని విశ్వమారి (పాండమిక్) గా ప్రకటించిన మార్చి 1 నాడే ఆ సమావేశాలు ముగిశాయి. అప్పటికే మలేసియా, ఇండోనేషియా దేశాలు కరోనా హాట్ స్పాట్ గా వున్నాయి.

మార్చి 20న భారత ప్రధాని ప్రజల ముందుకు వచ్చి కరోనా వ్యాప్తి తీవ్రత గురించి మాట్లాడారు. మార్చి 22న జనతా కర్ ఫ్యూను పాటించాలని కోరారు. అదే రోజు సామాజిక దూరం పాటించాలని  ఆదేశించారు. మార్చి 22 జనతా కర్ ఫ్యూ అద్భుతంగా విజయవతం అయింది. మార్చి 25 నుండి దేశవ్యాప్త లాక్ డౌన్ అమల్లోనికి వచ్చింది.

మర్కజ్ సమావేశం తరువాత స్వదేశీయులు తమతమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళిపోయారు. విదేశీయుల్లో కొందరు దేశంలో లోని అనేక పట్టణాల్లో జరుగుతున్న ధార్మిక సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్ళారు.  

మలేసియా నుండి ఢిల్లీ మర్కజ్ కు వచ్చిన పది మంది యాత్రికులు అక్కడి నుండి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ లో ఖాజీపేట్ మీదుగా  కరీంనగర్ కు వచ్చి ధార్మిక సమావేశాల్లో పాల్గొన్నారు. మార్చి 21న వారికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో కరోనాకు మర్కజ్ లింకు మొదటిసారి వెలుగు లోనికి వచ్చింది. దానితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అప్రమత్తం అయ్యాయి.

కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్ 6 సాయంత్రానికి దేశంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 4067. వీరిలో నిజాముద్దీన్ మర్కజ్ తో అనుబంధం వున్నవారి సంఖ్య 1445; అంటే 35.52 శాతం. ఉత్తరప్రదేశ్ లో కరోన చికిత్సలో వున్నవారిలో 50 శాతం మందికి మర్కజ్ తో లింకు వుందని తేలింది.  

మర్కజ్ తో పాటుగా వివిధ రాష్ట్రాల్లో వీరు పాల్గొన్న సభలు సమావేశాల్లోనూ,  ప్రయాణాల్లోనూ వీరితో సంపర్కంలోనికి వచ్చినట్టు తేలిన వారు 25 వేల మంది. వీరందరినీ క్వారంటైన్ కు పంపించారు.  ఇంకా సర్వే పూర్తి కాలేదు గాబట్టి మర్కజ్ తో ప్రత్యక్ష లింకు వున్నవారి సంఖ్య, వారితో సంపంర్కంలోనికి వచ్చినవారి సంఖ్య కూడా సమీప భవిష్యత్తులో పెరగవచ్చు. 

మార్చి 15 సాయంత్రానికే అంతర్జాతీయ సమావేశం ముగిసింది. ఆరోజే ప్రతినిధులు తమతమ రాష్ట్రాలకు తిరుగుప్రయాణమయ్యారు. విదేశీ ప్రతినిధులు కూడ ధార్మిక సమావేశాల్లో పాల్గొనడానికి వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కూడ మర్కజ్ ను మూయలేదు. లాక్ డౌన్ అమల్లోనికి వచ్చే వరకు మర్కజ్ లో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగాయి. 

హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ముఖేష్ వాలియా మార్చి 24న మర్కజ్ నిర్వాహకుల్ని పిలిచి తక్షణం ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని ఆదేశించారు.  డిఫెన్స్ కాలనీ సబ్ డివిజనల్ మెజెస్ట్రేట్ రెండు మూడుసార్లు మర్కజ్ ను సందర్శించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. తాను వెళ్ళినపుడు మర్కజ్ లో 13 వందలకు మించి సభ్యులు వున్నారనీ, వాళ్లు సామాజిక దూరాన్ని పాటించడంలేదనీ, మాస్కులు ధరించడంలేదనీ, ఆ ప్రాంగణంలో చేతుల్ని కడుక్కోవడానికి శానిటైజర్లు లేవని ఆ నివేదికలో పేర్కొన్నారు.
                                             
కేంద్ర హోమంత్రి అమిత్ షా  ఆదేశాల మేరకు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవాల్ మార్చి 28 అర్థరాత్రి  స్వయంగా మర్కజ్ కు వెళ్ళి తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ ఆమీర్ మౌలనా ముహమ్మద్ సాద్ కథాల్వీతో చర్చించారు. ఆ సమయంలో మర్కజ్ లో 2,361 మంది వున్నారు. వీరిలో కరోనా సోకినవారు 617 మంది. అంటే ప్రతి నలుగురికి ఒకరుకన్నా ఎక్కువ (26.13 శాతం). వీరిని చికిత్స కోసం హాస్పిటల్ కు పంపించారు. మిగిలిన వారిని  క్వారంటైన్ కు పంపించారు.  ఆ తరువాత మౌలాన సాద్ కనిపించకుండా అజ్ఞాతానికి వెళ్ళిపోయారు.  మౌలాన స్వీయ ఐసోలేషన్ లో వున్నారనీ 14 రోజుల గడువు తరువాత వారు కేసు దర్యాప్తు సంస్థల ముందుకు వస్తారని మర్కజ్ న్యాయవాది తౌసీఫ్ ఖాన్ మీడియాకు తెలిపారు.  మార్చి నెలలో మర్కజ్ ను సందర్శించిన 2,083 మంది విదేశీ సభ్యుల్లో 1750 మందిని బ్లాక్ లిస్టులో పెట్టినట్టు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ ప్రకటించారు.              

‘లాక్ డౌన్, ‘సామాజిక దూరంఆదేశాలను వీసా నియమ నిబంధనల్ని ఉల్లంఘించడమేగాక దేశంలో కరోన వ్యాప్తికి దోహదపడిందన్నది మర్కజ్ మీద ఇప్పుడున్న ప్రధాన ఆరోపణ. మౌలాన సాద్, ముఫ్తి సెహజాద్ లతోపాటూ మరో ఐదుగురిపై మార్చి 31న కేసి నమోదు చేశారు. భారత శిక్షాస్మృతి లోని అనేక సెక్షన్లతోపాటూ  అంటువ్యాధుల నిర్మూలనా చట్ట- 1897 కింద ఈ కేసులు నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను నిందితులు ఉద్దేశ్యపూర్వకంగా వుల్లంఘించారని ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు.

దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లి వచ్చిన వారికి సోకిన కరోనా కేసులు కూడా ఇప్పుడు క్రమంగా బయటికి వస్తున్నాయి. ఇటీవల ఉత్తరాఖండ్ లోని రుషికేష్ కు వెళ్ళి వచ్చిన దంపతులు మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో కరోనా పాజిటివ్ గా తేలారు.  అలాగే మర్కజ్ తో సంబంధం లేకుండా విదేశాల నుండి దిగుమతి అయిన కేసులు కూడా పెద్ద సంఖ్యలో వెలుగులోనికి వస్తున్నాయి. మధ్యప్రదేశ్ కే చెందిన మొరెనా జిల్లాలో సురేష్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు మొత్తం పదకొండు మందీ కరోనా పాజిటివ్ అని తేలారు. తన తల్లి అంత్య క్రియలకు దుబాయి నుండి వచ్చిన సురేష్ గ్రామంలో 15 వందల మందికి దశదిన కర్మ భోజనాలు పెట్టాడు. ఇప్పుడు ఆ 15 వందల మందితో పాటు వాళ్లు కలిసిన ఇతరుల్ని కూడ గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.  ఇది ఇప్పుడు మర్కజ్ అంతటి కేసు.

తన చర్యల్ని  సమర్థించుకోవడానికి మర్కజ్ చేస్తున్న వాదనలు

“అంతర్జాతీయ విస్తృత కార్యవర్గ సమావేశం  తేదీల నిర్ణయం ఆరు నెలలు ముందుగానే జరిగిపోయింది. అప్పటికి ప్రపంచంలో ఎక్కడా కరోనా వైరస్ వునికి లేదు. విదేశీ ప్రతినిధులు కూడ ఢిల్లీ చేరుకున్నాక సమావేశాన్ని వాయిదా వేయడం సాధ్యంకాదు. విదేశీ ప్రతినిధులు వచ్చినపుడు విమానాశ్రయాల్లో ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు. వాళ్ళను 14 రోజుల క్వారంటైన్ కు పంపలేదు. దాని అర్థం మర్కజ్ సమావేశానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టే. ఢిల్లీలో సమావేశాలు మొదలయిన మార్చి 13నే కేంద్ర ఆరోగ్య శాఖ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని చేసిన ప్రకటన మాకు నమ్మకాన్ని కలిగించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కీడ్రల మీద ఆంక్షలు విధించారుగానీ, ధార్మిక సమావేశాల మీద ఆంక్షలు లేవు. రైళ్ళు, బస్సులు, విమానాల రాకపోకలు రద్దు కావడంతో  విదేశీ ప్రతినిధులేగాక స్వదేశీ ప్రతినిధులు సహితం ఎటూ కదల్లేక మర్కజ్ లో ఇరుక్కున్నారు. ముందు జనతా కర్ ఫ్యూను ఆ తరువాత లాక్ డౌన్ ను ప్రకటించారు. లాక్ డౌన్ కాలంలో ఎక్కడివాళ్ళు అక్కడే వుండిపోవాలని సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు అప్పటికి మర్కజ్ లో వున్నవారు అక్కడే వుండిపోయారు.

తబ్లిఘీయులు దైనందిక జీవితంలో, ఆహారపు అలవాట్లలో శుచి శుభ్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కరోనాకు విరుగుడు నమాజ్. నిజానికి ఐదు పూటల నమాజ్ చదివేవారివల్లనే దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది.

తబ్లీక్ జమాత్ మర్కజ్ కు ప్రతి రోజు 2, 3 వేలమంది  వచ్చిపోతుంటారు. అది నిరంతర ప్రక్రియ. ప్రధాని ఏమాత్రం ముందుగా చెప్పకుండా లాక్ డౌన్ ప్రకటించారు. దానితో అంతమంది అక్కడ చిక్కుకున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మేము మోసపోయాం.  ఇది ప్రభుత్వ చేసిన తప్పు. మర్కజ్ ఎలాంటి తప్పు చేయలేదు.

రోగుల వ్యక్తిగత సమాచార గోప్యత చట్టాన్ని ప్రభుత్వం విచ్చలవిడిగా వుల్లంఘిస్తోంది. మర్కజ్ కు వెళ్ళిన వారి వివరాలను మీడియాలో ప్రకటిస్తున్నారు. పోలీసులు వారి ఇళ్ళకు వెళ్ళి అందరి సమక్షంలో బయటికి లాక్కొనివచ్చి  క్వారంటైన్ కు తరలిస్తున్నారు.


“మేము కరోనాను ఇతర మత సమూహాల్లో వ్యాప్తి చేయదలిస్తే మసీదులకు ఎందుకు వెళుతాము?, మా కుటుంబ సభ్యులతోనే ఎందుకు నివసిస్తామూ? మర్కజ్ వల్ల కరోనా సోకినవారు నూటికి నూరు శాతం ముస్లింలే ”  “కరోనా సోకి మేము కుంగిపోతుంటే బాధితుల్నే దోషులు అనడం మానవత్వమేనా?”

మర్కజ్ నుండి వచ్చిన వారు స్వఛందంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని ముస్లిం ఆలోచనాపరులు కూడా మీడియాలో పిలుపులు ఇచ్చారు. కరోనా మీద ఒక సామాజిక జాడ్యం (సోషల్ టాబూ) కొనసాగుతూ వుందని వారు గ్రహించ లేకపోతున్నారు. కరోనా సోకిందని తెలిస్తే పరిసరాలవాళ్ళు వాళ్ళతో బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయిస్తున్నారు. అసలు కరోనా సోకినవారికి వైద్యం చేస్తున్న డాక్టర్లు, నర్సుల్ని కూడ అనేక చోట్ల సామాజికంగా వెలి వేస్తున్నారు. ఇక  ముస్లీంలకు కరోనా సోకిందని తెలిస్తే మూకోన్మాదులు ఊరుకుంటారా?  ఢిల్లీ సమీపంలోని బవానా గ్రామంలో మర్కజ్ కు వెళ్ళి వచ్చిన మెహబూబ్ అలీ అనే యువకుడిని కరోనా అనుమానంతో మూకోన్మాదులు దాడి చేసి హత్య చేశారు.   

మర్కజ్ మీద సంఘీయుల ఆరోపణలు.
తెలంగాణలోని కరీంనగర్ లో  కరోనా కేసు బయటపడినప్పుడే మర్కజ్ లింకు వెలుగులోనికి వచ్చింది. భారత ముస్లిం సమాజంలో అనేక జమాతుల్లో తబ్లిఘీ ఒకటి. అసలు ఏ జమాతుల్లోనూ వుండనివారు కూడా చాలా పెద్ద సంఖ్యలో వుంటారు.    మర్కజ్ తో పాటూ మొత్తం భారత ముస్లిం సమాజాన్ని అనుమానించే, నిందించే, నిలబెట్టే ట్రోలింగ్ అప్పటి నుండే సోషల్ మీడియాలో మొదలయింది. ‘కరోనా హాట్ స్పాట్’ ‘వైరస్ ఉగ్రవాదం’, ‘తాలిబాన్ వైరస్’, ‘వైరస్ జిహాద్ వంటి తీవ్ర నిందలు వైరల్ గా మారిపోయాయి.

మార్చి 21న 332 మాత్రమే వున్న కరోనా కేసులు మార్చి 28న వెయ్యికి చేరుకున్నాయి. అప్పటికే వైరస్ 18 రాష్ట్రాలకు వ్యాపించింది. అనేక చోట్ల కరోన లింకు కనిపించింది. 

ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టివి మార్చి 31 రాత్రి ‘ద డిబేట్’ కార్యక్రమంలో ‘మర్కజ్ కోవిడ్ స్ప్రెడ్’  హాష్ టాగ్ తో చర్చ నడిపింది.  మర్కజ్ “ఉద్దేశ పూర్వకంగా”, “బాహాటంగా”, “ప్రణాళికా బధ్ధంగా”  దేశంలో కరోనా వ్యాప్తికి “కుట్ర” చేసి “దేశద్రోహం”కు పాల్పడిందని ఆర్నాబ్ గోస్వామి స్వయంగా ఆరోపించారు. “ఢిల్లీ సమావేశానికి వచ్చిన విదేశీయులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోకుండా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళారూ? అసలు విజిటింగ్ వీసాల మీద దేశానికి వచ్చిన వారు చట్ట వ్యతిరేకంగా మతప్రచారంలో ఎందుకు పాల్గొన్నారూ?” వంటి ప్రశ్నల్ని మీడియా లేవనెత్తింది.

ఆ తరువాత ప్రాంతీయ, స్థానిక మీడియాలు కూడా ఓ మూడు రోజులు అదే మార్గంలో నడిచాయి.

ఈ సందర్భంలో రెండు మూడు ఫేక్ వీడియోలు సహితం  రంగప్రవేశం చేశాయి. ఒక దాంట్లో ముస్లీములు చాలా వేగంగా ఊపిరీ పీల్చి వదులుతున్నారు. మరో దాంట్లో ఎంగిలి కంచాల్లో మిగిన అన్నాన్ని ముస్లిం యువకులు తింటున్నారు. మర్కజ్ లో ముస్లింలు మానవ బాంబుల్లా కరోనా వైరస్ ను స్వఛ్ఛందంగా ఒకరికొకరు అంటించుకుని వివిధ రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపింజేశారనడానికి సాక్ష్యంగా  ఈ వీడియోలు ప్రసారం అయ్యాయి.

మర్కజ్ నిర్వాహకులు ఇప్పటికీ పశ్ఛాత్తప పడుతున్నట్టు కనిపించడంలేదు. వాళ్ళు ఈ దేశపు ప్రతి చట్టాన్నీ వుల్లంఘించారు. దేశం ఆచరిస్తున్న లాక్ డౌన్ మీద వాళ్ళు ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. తమకు సాధ్యమయినన్ని పధ్ధతుల్లో లాక్ డౌన్ ను వ్యతిరేకించాలనీ, దాన్ని విఫలం చేయాలి” అని తబ్లిఘీ జమాత్ నేత మౌలానా ముహమ్మద్ సాద్ తన అనుచరులకు పిలుపు ఇచ్చారని ఆర్నబ్ గోస్వామి తీవ్రంగా విరుచుకుపడ్డారు.

             “మనం నమాజ్ ను నిర్లక్ష్యం చేస్తుంన్నందుకు అల్లా ఆగ్రహించి మనల్ని శిక్షించడానికి రోగాలు, వైరస్ లను పంపిస్తాడు “ప్రళయం ముంచుకు వస్తున్నపుడు ఆపత్కాలంలో మనం చేయాల్సిన గొప్ప పని మసీదుల్లో చేరి నమాజ్ ఆచరించడమే” ”నమాజ్ ను వదలండి, పదిమంది కలవకండి, కలిసిమెలసి వుండకండి అని డాక్టర్లు చెప్పే మాటల్ని వినకండి”  “ఒకవేళ మనం చనిపోవడం అనివార్యం అయితే దానికి మసీదుకన్నా పవిత్ర స్థలం ఇంకేదీ వుండదు” “అందువల్ల మసీదును, నమాజ్ ను వదలకండి” వంటి ప్రవచనాలున్న కొన్ని ఆడియో క్లిప్పులు మౌలాన సాద్ పేరిట ప్రచారంలోనికి వచ్చాయి. ఇవి మౌలాన సాద్  ప్రవచనాలేనా? కరోనాను దృష్టిలో పెట్టుకుని మొన్నటి ఢిల్లీ సమావేశంలో వారు అలా ప్రవచించారా? అసలది అది వారి గొంతుయేనా?   అనే అంశాలు ఇంకా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ ఈ వీడియోలు సమాజంలో ముస్లిం వ్యతిరేకతను, ద్వేషాన్నీ విపరీతంగా రెచ్చగొట్టాయి.

ఇతర జమాత్ లు, ప్రముఖుల స్పందన
“పాత వీడియోలను ఇప్పటి వైరస్ నేపథ్యంలో సందర్భాన్ని మార్చి ప్రవేశ పెట్టడంతో చాలా పెద్ద అపార్థం చోటుచేసుకుంది.  ఆ రెండు వీడియోలు ఇప్పుడు మర్కజ్ లో తీసినవి కావు.  అవి పదేళ్ళు పాతవి.  అసలవి భారతదేశంలో చిత్రించినవి కావు.  అవి ఫేక్ వీడియోల్లని ఇప్పటికే కొన్ని ఛానళ్ళు నిరూపించాయి”.

“అన్నం దైవ స్వరూపం కనుక కంచంలో ఒక్క మెతుకును కూడ వదలకుండ తినాలని ముస్లింలు భావిస్తారు. కొందరైతే భోజనం ముగిశాక కంచంలో కొద్దిగా నీరు పోసి దాన్ని రసంగా తాగేస్తారు. ఇంకొంచెం చాదస్తం వున్నవాళ్లు పక్కవాళ్ళ కంచంలో మిగిలిన ఎంగిలి మెతుకుల్ని కూడ తింటారు. తద్వార ఆహార పవిత్రతను పాటించినట్టు భావిస్తారు. ఇలాంటి సాంప్రదాయం మదరసాల్లోనూ, షియా ముస్లిం సమాజంలోని దావూదీ భోరా  తెగల్లోనూ ఎక్కువగా కొనసాగుతోంది. ఆహార వృధాను కట్టడి చేయడానికి ముస్లిం సమాజంలో ‘దానా కమిటీలు సహితం వుంటాయి. దానా అంటే అన్నం మెతుకులు. దావూదీ భోరాల దానా కమిటీలు చేస్తున్న కృషిని సాక్షాత్తు భారత ప్రధాని రెండేళ్ళ క్రితమే గొప్పగా మెచ్చుకున్నారు. ముస్లిం సూఫీ సమూహాల్లో ప్రాణాయామం వంటి ఆసనాలు కూడా వుంటాయి”. 

“మర్కజ్ అధినేత మౌలానా ముహమ్మద్ సాద్ చర్య “నేరపూరిత అజ్ఞానం”; లేదా “అజ్ఞానంతో చేసిన నేరం” (Criminal Ignorance)” అన్నారు   ముస్లిం స్కాలర్ సయ్యద్ అహమద్ ఉల్ హుస్సైనీ సయీదుల్ ఖాదరి,

“అంటు వ్యాధి ప్రబలిన ప్రాంతానికి వెళ్ళరాదు. అంటు వ్యాధి సోకిన వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళరాదు. అంటు వ్యాధులు ప్రబలడానికి మీరు కారకులు కావద్దు” అని ప్రవక్త ముహమ్మద్  ఆదేశాలు (హదీస్) చాలా స్పష్టంగా వున్నాయి. మర్కజ్ నిర్ణయం  ప్రవక్త ముహమ్మద్  ఆదేశాలాకు విరుధ్ధం” అన్నారాయన.  

“కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 20 నాటికే అజ్మీర్ లోని హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ ఛిష్టీ వారి దర్గను మూసివేశారు. ఢిల్లీలో మర్కజ్ పక్కనే వున్న ఖ్వాజా హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వారి దర్గను మూసివేశారు. హైదరాబాద్ తో సహా దేశంలోవున్న దర్గాలన్నీ మూసి వేశారు” అని గుర్తు చేశారాయన.

ముస్లింలకు మక్కాలోని మజ్దిద్- అల్- హర్మ్, మదీనాలోని మజ్దిద్- అల్- నబవి అతి పవిత్రమైనవి.  మక్కా, మదీన మసీదుల్లో శుక్రవారం నమాజులతో సహా అన్ని నమాజుల్ని మార్చి 20న రద్దు చేసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. అంతకు మూడు రోజుల ముందే దేశంలోని అన్నీ మసీదుల్లో అన్ని నమాజుల్నీ రద్దు చేసింది. మక్కా, మదీన మసీదుల్నే మూసివేసినపుడు మౌలాన సాద్ మర్కజ్ కార్యకలాపాలను సాగించడంపట్ల పలువురు ముస్లిం ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.  

మరో ముస్లిం పెద్ద మొహమ్మద్ ఆలం మౌలాన సాద్ తీరు మీద తీవ్ర అసంతృ]ప్తిని వ్యక్తం చేశారు. “మౌలానా సాద్ కు అన్ని విషయాలూ తెలుసు. ప్రపంచంలోనేగాక దేశంలోనూ కరోన వైరస్ ప్రబలుతున్నదని తెలుసు. అయితే, మొండివైఖరితో వారు అమాయకపు తబ్లిఘీ జమాత్  సభ్యుల్ని కరోనా కోరల్లోనికి నెట్టేశారు. మౌలానా సాద్ తాను ప్రపంచ ముస్లింలకు ఆమిర్(అగ్రనేత)నని భావిస్తుంటారు. మర్కజ్ ను మక్కా, మదీనాల తరువాత అంతటి పవిత్ర స్థలంగా పేర్కొంటుంటారు. అలాంటిది కరోనా గురించి అంత అజ్ఞానంతో ఎలా వ్యవహరించారో అర్థంకాదు”  అన్నారాయన.

మౌలాన ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటి ఛాన్సలర్ జఫర్ సరేష్ వాలా మర్కజ్ తీరును తప్పుపట్టారు. తాను మౌలానా ముహమ్మద్ సాద్ ను కలిసి వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడం శ్రేయస్కరం కాదనీ, దాన్ని  రద్దు చేయాలని కోరినా తన మాటను పెడచెవిన పెట్టారని జఫర్ ప్రకటించారు.

ఢిల్లీలోనే కేంద్ర కార్యాలయం వున్న షురా -ఏ -జమాత్  కరోన వ్యాప్తి నేపథ్యంలో  తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. ఆ సంస్థ నేతలు మౌలాన జహీరుల్ హుస్సేన్, మౌలాన ఇబ్రాహీం, మౌలాన అహమద్ సంయుక్తంగా తబ్లిఘి జమాత్ కు కూడ ఇలాంటి సూచన చేశారు. వాళ్ల మాటల్ని కూడా మౌలాన సాద్ వినలేదు.

షియా ముస్లిం సంఘాలన్నీ మర్కజ్ ను తీవ్రవాద సంస్థగా పేర్కొని దాని  తీరు మీద తీవ్రంగా విరుచుకుపడ్డాయి. షియా వక్ఫ్ బోర్డు చీఫ్ వాసిమ్ రిజ్వీ, ఉత్త్రప్రదేశ్ మంత్రి మొహసిన్ రజా తబ్లిఘీ జమాత్ ను నిషేధించాలని కోరాయి. తబ్లిఘీ జమాత్  దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడిందని వారు ఆరోపించారు.

కాంగ్రెస్ మీడియా ప్రతినిధి మీమ్ అఫ్జల్ కూడ మార్చి రెండవవారంలో సమావేశాన్ని కొనసాగించడం శ్రేయస్కరం కాదని మౌలానా సాద్ ను హెచ్చరించారు. వారు అఫజల్ మాటల్ని కూడా తోసిపుచ్చారు. 

“తబ్లిఘీ జమాత్ సరిగ్గా వ్యవహరించలేదు. మలేషియా ప్రతినిధికి వైరస్ సోకినట్టు కరీంనగర్ నుండి వార్తలు వచ్చినా స్పందించలేదు. అయితే,  కొందరు దీన్ని కుట్రగానూ, కరోనా జిహాద్ గానూ చిత్రించడం చాలా దురదృష్టకరం” అన్నారు రాజ్యాంగ నిపుణులు ఫైజాన్ ముస్తఫా.

ఇక్కడ దేశద్రోహ ఆరోపణల్ని ఎదుర్కొంటున్న మర్కజ్ విచిత్రంగా మన శత్రుదేశం  పాకిస్తాన్ లోనూ ఇప్పుడు ఇలాంటి నిందల్నే ఎదుర్కొంటోంది. రాయివిండ్ తో పాటూ సింధ్-హైదరాబాద్, కసూర్ (లాహోర్) నగరాల్లో తబ్లిఘీ జమాత్ కు చెందిన చెరో 50 మంది మతప్రచారకులు కరోనా పాజిటివ్ అని తేలారు. దానితో ఉలిక్కి పడిన పాకిస్తాన్ ప్రభుత్వం ఆ నగరాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. 

జమాత్ ఏ –ఉలేమా హింద్, జమాత్ ఏ ఇస్లామీ హింద్ సహితం మర్కజ్ వ్యవహార శైలి మీద అసహనాన్ని వ్యక్తం చేశాయి.  మర్కజ్ వంకతో మీడియా ద్వార దేశంలో మత ద్వేషాన్ని, ముస్లిం వ్యతిరేకతను వ్యాపింపిచేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను తక్షణం నిలిపివేయాలని కోరుతూ  జమాతే ఉలేమా ఏ హింద్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.  తబ్లిఘీ జమాత్ ద్వార జరిగిన “ఒక దురదృష్టకర సంఘటన”తో మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించడానికీ, వాళ్ళను భూతాలుగా చూపెట్టడానికీ   కొందరు ప్రయత్నిస్తున్నారని జమాతే ఉలేమా ఏ హింద్ లీగల్ సెల్ కార్యదర్శి ఎజాజ్ మగ్బూల్ ఆ పిటీషన్ లో పేర్కొన్నారు.

"నిజామొద్దీన్‌ సభకు వెళ్లి వచ్చిన జమాత్‌ సభ్యులారా! మీ కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వాలు, పోలీసులు, వైద్యులకు సహకరించండి. లేదంటే మొత్తం ముస్లిం సమాజం నింద మోయాల్సి వస్తున్నది. మతం పేరిట ఆధునిక రాజకీయ, సామాజిక, వైద్య విధానాలను, అభివృద్ధిని విస్మరించడాన్ని మేం సమర్థించం. అలా విస్మరిస్తే ఒక్క ఇస్లాం సమాజానికే కాదు, సహ సమాజం అంతటికి హాని చేసినవారవుతారు. దయచేసి అందరూ, ముఖ్యంగా ముస్లింలు రోజువారీ సమాజాన్ని గమనించండి. తెలుసుకోండి. వైద్యులు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికారులు ఇస్తున్న సూచనలను గమనించండి. ప్రభుత్వాదేశాలను, సూచనలను అనుసరించండి. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని అనుసరించండి". 

- ముస్లిం థింకర్స్ డయాస్ 

10 ఏప్రిల్ 2020 ( ఆంధ్రజ్యోతి దినపత్రిక )

"మర్కజ్    ధార్మిక సదస్సులో పాల్గొన్నవారు, వీరితో కలిసిన ముస్లింలు స్వఛ్ఛందంగా ఆయా అధికారుల వద్దకు వెళ్ళి కరోనా పరీక్షల చేయుంచుకుని, డాక్టర్ల సలహాలు పాటించి, ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము" 
- బూర్గుల నర్సింగరావు 
మరియూ 130 మంది కవులు కళాకారులు ఆలోచనాపరులు సామాజికకార్యకర్తలు. 
16 ఏప్రిల్ 2020 ( ఆంధ్రజ్యోతి దినపత్రిక ) 


  "(మర్కజ్)వారు అజ్ఞానంతోనో లేక పరిస్థితుల వల్లో చేసిన దాన్ని ఉద్దేశ పూర్వకంగా చేశారని లేక కుట్ర పూరితంగా చేశారని అంటే ఎలా నమ్మటం?" 
ఎ. సునీత  (ఆంధ్రజ్యోతి 19 ఏప్రిల్ 2020)

మర్కజ్ సమావేశం మార్చి 15న ముగిసింది. ఆ రెండు బృందాలు నెల తరువాత కూడ  ప్రత్యేకించి మర్కజ్ ధార్మిక సదస్సులో పాల్గొన్నవారికి అలాంటి సూచన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది?. 


ఈ పరిణామాల నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు
విదేశీ పర్యటనల నుండి తిరిగి వచ్చిన స్వదేశీయుల వల్లనూ, మనదేశంలో పర్యటించడానికి వచ్చిన విదేశీయులవల్లనూ  భారతదేశం లోనికి   కరోనా ప్రవేశించింది. మన దేశంలో పర్యటించడానికి వచ్చిన విదేశీయుల్లో  ఒక బృందం మర్కజ్ సమావేశాల్లో పాల్గొన్నది. ఇప్పుడు పాలక యంత్రాంగ దృష్టి అంతా మర్కజ్ పాయ మీదనే వుంది. దానివల్ల పాలకులకు ఒక రాజకీయ ప్రయోజనం వుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మిగిలిన పాయల్ని నిర్లక్ష్యం చేస్తే సమీప భవిష్యత్తులో అవి మర్కజ్ ను మించిన విధ్వంసాన్ని సృష్టించవచ్చు.  అజ్ఞానం, అహంభావాలతో మర్కజ్ వ్యవహరించినతీరు ప్రత్యర్ధులు  ఒక కుట్ర సిధ్ధాంతాన్ని రూపొందించి ప్రచారం చేయడానికి దోహదపడింది. 

ముస్లింలలో సున్నీ, షియా, సూఫీ తదితర కొన్ని తెగలున్నాయి.  ప్రతి తెగల్లోనూవీటిల్లోనూ ఉపతెగలున్నాయి. ఈ తెగలు ఉపతెగల్లో కొన్ని జమాత్ లున్నాయి. అసలు ఏ జమాత్ ల లోనూ వుండని ముస్లిం సమూహాలు కూడ పెద్ద సంఖ్యలో వున్నాయి. తబ్లిఘీ జమాత్ అజ్ఞానం అహంభావం ఇప్పుడు మొత్తం భారత  ముస్లిం సమాజానికి శాపంగా మారింది.  

మర్కజ్ మీద  మొదట్లో నేను వ్యక్తం చేసిన అభిప్రాయామే ఇప్పుడు ఎక్కువ మందిలో బలపడుతున్నట్టుంది



మతవిశ్వాసాలకూ వర్తమాన సమాజ అవసరాలకు మధ్య ఎప్పుడూ ఒక వైరుధ్యం వుంటుంది. వర్తమాన సమాజ అవసరాలకు అనుగుణంగా మతవిశ్వాసాలను పరిష్కరించే వారిని ఆధునికులు అంటారు. తద్విరుధ్ధంగా వుండేవారిని ఛాందసులు అంటారు. తబ్లిఘీ జమాత్ అనుయాయులు మరీ అమాయకులనీ, వాళ్ళకు ‘దీన్ దారీ (పరలోక) ధ్యాసే తప్ప ‘దునియాదారీ (ఇహలోక) స్పృహ వుండదని వారి మీద  చాలామంది జాలి పడుతుంటారు. ఏమాత్రం ఇహలోక స్పృహ లేని తబ్లిఘీ జమాత్ ప్రపంచాన్ని ముంచుకుని వస్తున్న కరోనా మహమ్మారిని తన సహజ నిర్లిప్త ధోరణిలో  పట్టించుకోలేదు.  అదే ఇప్పుడు వారికి శాపంగా మారింది.

ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ యంత్రాంగం, వైద్య ఆరోగ్య విభాగాల దృష్టి మొత్తం మర్కజ్ కు వెళ్ళి వచ్చిన వాళ్ళ మీద వుంది. కరోన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడ వాళ్ళ మీదే జరుగుతున్నాయి కనుక  పాజిటివ్ కేసులు కూడా సహజంగానే వాళ్ళ నుండే వుంటున్నాయి. రేపు ఇతర సమూహాల మీద కూడ వ్యాధి నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా జరపాల్సి వుంటుంది. అప్పుడు వెలువడే ఫలితాలతో ఇప్పటి సమీకరణలు  మారవచ్చు. మర్కజ్ లింకులో ప్రబలిన కేసుల శాతం అప్పుడు చాలా వరకు తగ్గిపోవచ్చు. నాలుగు రోజుల్లోనే  మర్కజ్ లింకుల శాతం 36 శాతం నుండి 21 శాతానికి పడిపోయింది. వచ్చే వారం ఇది 10 శాతం కన్నా తక్కువకు పడిపోవచ్చు. అప్పుడు ఇప్పటి ఆరోపణలకు తావు వుండదు. 

మర్కజ్ లో  అంతర్జాతీయ విసృత కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న రోజుల్లోనే ఢిల్లీలోనే మార్చి 14న అఖిల భారత హిందూ మహాసభ అధ్యక్షులు స్వామి చక్రపాణి మహారాజ్ ‘గోమూత్ర సేవన విందు నిర్వహించారు. “విష్ణుమూర్తి కొత్త అవతారం కరోనఅనీ, “లోకంలో మాంసాహారుల్ని శిక్షించడానికి శ్రీనరసింహస్వామి కరోనా వైరస్ అవతారం ఎత్తారు అనీ, “దానివల్ల శాఖాహారులకు ముప్పులేదు అని గోమూత్ర సేవన విందులో స్వామీ చక్రపాణి మహారాజ్ ప్రవచించారు.  

నిజానికి మతసమూహాలు అన్నింటిలోనూ ధార్మిక గురువుల ప్రవచనాలన్నీ ఇహలోక ఆకర్షణల్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి చేరమనే చెపుతాయి. కబీర్, అన్నమయ్య, రామదాసు వగయిరా భక్తుల  కీర్తనల్ని గమనించండి. కీర్తన ఎవరిదైనా కంటెంట్ ఒక్కటే. దేవుడ్ని శరణుకోరితే సమస్యలన్నీ పోతాయి అనేది వాటి సారాంశం. ఇలాంటి ప్రవచనాలను నేరుగా సైన్సుతో ముడిపెట్టే సాహసం ఎవరూ చేయకూడదు.   మౌలానా సాద్ ఆ పొరపాటు చేశారు.

మర్కజ్ ను వాళ్ళు ముందే ఖాళీ చేసి వుండాల్సింది. మరీ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవాల్  మార్చి 28 అర్ధరాత్రి వచ్చి బలవంతంగా మర్కజ్ ను ఖాళీ చేయించే వరకు పరిస్థితిని తెచ్చుకోకుండ వుండాల్సింది.

చైనా కరోన వేరు ఇండియా కరోన వేరు. ఇండియా కరోనకు మతతత్వము అనే మరో వైరస్  తోడయ్యింది. మెజారిటీ సమూహం తెలిసి చేసినా అది తప్పు కాదు. మైనారిటీ సమూహం తెలియక చేసినా అది తప్పే అవుతుంది! అది ఇప్పుడు సాంప్రదాయం. తప్పులు అందరూ చేయవచ్చుగాక; భారత ముస్లింలు తప్పు చేస్తే ఎలా? ముడు వారాలు లాక్ డౌన్ లో వుంటే కరోన వైరస్ ను తరిమి కొట్టవచ్చేమోగానీ మతతత్వవైరస్ ను తరిమికొట్టడం అంత ఈజీ కాదు.

భారత ఆర్థిక వ్యవస్థ కొంతకాలంగా మందగమనంలో వుంది.  మార్చి 31తో 2019-20 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. సాలీన జీడిపి గ్రోత్ రేట్ రెండు మూడు శాతం కన్నా తక్కువే వుంటుందని నిపుణులు కొంతకాలంగా అంటున్నారు. కరోనా వైరస్ ముందుకు దూసుకు రావడంతో ఆర్థిక వ్యవస్థ మీద చర్చ వెనక్కిపోయి ప్రభుత్వానికి ఒక వెసులుబాటును కలిగింది. ఇప్పుడు కరోన వైరస్ నెపాన్ని మోపడానికి కూడ ఒక బలిపశువు అవసరం అయ్యింది. ఈ పరిణామాలు అర్థంకాని  మర్కజ్ తనంత తానే వెళ్ళి బలిపీఠం మీద తలపెట్టింది.

220 దేశాల్లో శాఖలున్నాయని చెప్పుకునే తబ్లిగ్ జమాత్ మార్చి 1 నాడే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను పాటించి వుండాల్సింది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్  ఆదేశం (హదీసు) ప్రకారం తన కార్యక్రమాలన్నింటినీ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించివుంటే ఈరోజు ఆ తబ్లిగ్ జమాత్ మాత్రమేగాక మొత్తం ముస్లిం సమాజం అందరి మన్ననలను పొందుతూ వుండేది.

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో శాంతిభద్రతల విభాగం కేంద్ర హోంశాఖ ఆధీనంలో వుంటాయి.  బిజేపి అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూ గా కొనసాగుతున్న అమిత్ షాయే ఆ శాఖకు మంత్రి. పైగా మర్కజ్ కు కూతవేటు దూరంలో నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ వుంటుంది. హోంశాఖకు తెలియకుండ విదేశీయులు మనదేశంలోనికి ప్రవేశించలేరు. వీసాల నాడే ఎవరు ఎప్పుడు మనదేశంలోనికి వస్తున్నారన్నది తెలిసిపోతుంది. స్థానిక స్పెషల్ బ్రాంచ్, రాష్ట్ర ఇంటెలిజెన్స్,  కేంద్ర ఇంటెలిజెన్స్ లతోపాటూ జాతీయ భద్రత వ్యవహారాల సలహాదారు (NIA) వరకు అన్ని విభాగాలూ విదేశీ పర్యాటకుల కదలికల మీద నిఘావేసి వుంచుతారు. ఇంతటి సమాచారం వున్నప్పుడు కరోనా ముప్పు నేపథ్యంలో ఈ విభాగాలు   మర్కజ్ సమావేశాన్ని మార్చి 13నే అడ్డుకోవచ్చు. వాళ్లు ఉదాసీనత కారణంగా ఆ విషయాన్ని పట్టించుకోలేదా? లేక ఉద్దేశ్య పూర్వకంగానే ఒక కుట్ర పూరితంగా సమావేశాన్ని జరపనిచ్చారా?  కరోన సాంఘీక దూరాన్ని  ముస్లింల సాంఘీక బహిష్కరణగా మార్చదలిచారా? అనేవి సమంజసమైన సందేహలే. అలాగే మౌలానా సాద్ ఉదాసీనతతో ఈ కుట్రను గమనించలేకపోయారా? లేక మొండివైఖరితో వ్యవహరించారా? లేదా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అంటున్నన్నట్టు మర్కజ్, కేంద్ర హోంశాఖల మధ్య అపవిత్ర సంబంధాలు ఏమైనా వున్నాయా? అనేవి కూడ గమనించాల్సిన అంశాలే.  




నాయకునికి వుండాల్సిన లక్షణం అమాయికత్వం మూఢవిశ్వాసం కాదు; ముందుచూపు. మర్కజ్ నిర్వాహకుల్లో ఏ దశలోనూ అలాంటి ముందు చూపు కనిపించలేదు. తమను కొందరు ఒక వలలో బంధిస్తున్నారనే స్పృహ లేకపోవడం న్యాయం కాదు.  కొన్ని చారిత్రక సందర్భాల్లో ముప్పును గుర్తించకపోవడం కూడ చారిత్రక తప్పిదమే. తబ్లిగ్ జమాత్ ముందుగా తాను నష్టపోయి తరువాత భారత ముస్లిం సమాజానికి కూడ భారీ నష్టాన్ని కలుగజేసింది.

హిందూత్వ ఎజెండా వున్న రాజకీయ పార్టీ కేంద్రంతో సహా అనేక రాష్ట్రాల్లో అధికారంలో వున్నప్పుడు, ప్రధాన స్రవంతి మీడియా మెజారిటీ మతవాదాన్ని బాహాటంగా ప్రోత్సహిస్తున్నపుడు, మైనార్టీలవల్ల ఒక్క తప్పు జరిగినా వంద తప్పుల్ని సృష్టించి  ట్రోల్ చేయడాని సోషల్ మీడియా సిధ్ధంగా వుంటుంది. ఇలాంటి సందర్భాల్లో అల్పసంఖ్యాక సమూహాల ధార్మిక గురువులు మరింత జాగరూకతతో వ్యవహరించాలి.

           సిఏఏ, ఎన్ పిఆర్, ఎన్నార్సీలకు  వ్యతిరేకంగా షాహీన్ బాగ్ పేరిట ఆరంభమయిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఏపుగా విస్తరించింది. లౌకికవాదులు, సామ్యవాదులు, మానవతావాదులు, మతసామరస్య వాదుల నుండే గాక సాధారణ హిందూ సమాజం నుండి కూడ ముస్లిం సమాజానికి అద్భుతమైన సంఘీభావం సోదరభావం సమకూరింది. చరిత్రలో నాయకుడు లేకుండ సాగిన ఒక మహత్తర సామాజిక ఉద్యమం ఇది. ఫిబ్రవరి రెండవ వారంలో ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన  తరువాత కేంద్ర ప్రభుత్వానికి  షాహీన్ బాగ్ ఉద్యమం సెగ తగిలింది. ఎన్నార్సీ మీద ఒకడుగు వెనక్కు వేస్తున్న సంకేతాలు కూడ వెలువడ్డాయి. ఇప్పుడు అదంతా మర్కజ్ వివాదంలో కొట్టుకు పోయింది. ఇప్పుడు ముస్లిం సమాజం ఎన్నార్సీని రద్దు చేయమని కోరడం ఆపి కరోనా వైరస్ వ్యాప్తికి తాను కారణంకాదని నిరూపించుకోవాల్సిన ఆత్మరక్షణలో పడిపోయింది. మర్కజ్ చేసిన అనాలోచిత చర్య ఫలితంగా షాహీన్ బాగ్ ఉద్యమానికీ తద్వార భారత ముస్లిం సమాజానికి నైతికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది.

            మనదేశంలో ముస్లింలు అసహాయ లోకువ సమాజం.  ఎక్కడ ఏ తప్పు జరిగినా లోకం ముందుగా ముస్లింల వైపు చూసే వాతావరణం కొనసాగుతూవుంది. లోకంలో తమ మీద కొనసాగుతున్న అపోహల్ని తొలగించడానికీ, ఆమోదాంశాన్ని పొందడానికి ముస్లింలు ప్రత్యేకంగా కృషి చేయాలి. అంతే తప్ప కొత్త విమర్శలకు, నిందలకు, అపోహలకు అవకాశం ఇచ్చేలా ఎన్నడూ వ్యవహరించకూడదు.

మతంకన్నా సమాజం గొప్పది. సమాజ శ్రేయస్సు తరువాతే మత విశ్వాసాలు వుండాలి. భారత ముస్లిం సమాజానికి మర్కజ్ ఏకైక ప్రతినిధి ఏమీకాదు. దేశంలో అనేక జమాతులున్నాయి. అసలు ఏ జమాత్ లోనూ లేను ముస్లింలూ వున్నారు. తన అనాలోచిత  చర్యలవల్ల భారత ముస్లిం సమాజం  మొత్తాన్ని నైతిక సంక్షోభంలో పడేసినట్లు మర్కజ్ గుర్తిస్తున్న దాఖలాలు ఇప్పటికీ కనిపించడంలేదు.

ఎవరయినాసరే ముందు కరోనా వైరస్ ను గుర్తిస్తే తొలుత  మందును ఆ పిదప టీకాను కూడ కనుగొనవచ్చు. అసలు వైరస్ నే గుర్తించనివాళ్ళకు ఇబ్బందులు తప్పవు. మర్కజ్ అనాలోచిత చర్య కూడ అంతే. జరిగిన తప్పును ముందు  గుర్తిస్తే దానికి పరిష్కారాలు, నష్టనివారణోపాయాల్ని కనుగొనడం కష్టం ఏమీ కాదు. ఇప్పుడు  తబ్లిఘీ జమాత్ మాత్రమే కాకుండ మొత్తం భారత ముస్లిం సమాజం ఇతర మత సమూహాల నుండి గుడ్ విల్ బిల్డింగ్ కోసం కృషి చేయాలి.

రచన : 4 ఏప్రిల్  2020
ప్రచురణ :   ఫేస్ బుక్.  6 ఏప్రిల్ 2020