Thursday 16 April 2020

Let us draw lessons from Corona


Let us draw lessons from Corona
కరోనా నేర్పుతున్న గుణపాఠాలు
డానీ

వైద్య ఆరోగ్య వ్యవస్థలో కరోన వైరస్ చాలా ప్రమాదకరమైన ముప్పు. దీని పర్యవసానాలు కూడా చాలా తీవ్రంగా వుంటాయి. అయితే ఇదంతా తాత్కాలికమే. మానవజాతికి ముప్పులు కొత్త కాదు, గతంలోనూ వున్నాయి.  వరదలు, ఉప్పెనలు, భూకంపాలు, ఉల్కాపాతాల్ని ఎదుర్కొని మనం నిలబడ్డాం. కరోనాను మనం తప్పకుండా జయించి తీరుతాం. అందులో సందేహంలేదు. అయితే అదే ముగింపుకాదు. ఆ తరువాత సమాజంలో మనం పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చాలా వున్నాయి. ఎదుర్కోవాల్సిన ఉపద్రవాలూ చాలానే వున్నాయి.

ఈరోజు మనం చూస్తున్న ఉపద్రవాలన్నీ 1990ల నాటి నూతన సరళీకృత ఆర్థిక విధానాల ఫలితాలని ముందుగా మనం గ్రహించాలి. ఈ మహమ్మారి మూలాలు ప్రపంచ వాణిజ్య కేంద్రం పునాదుల్లో వున్నాయి. ఇది చైనాలో పుట్టిందని కొందరు అంటున్నారు. సరళీకృత ఆర్థిక విధానాన్ని తెలివిగా వాడుకొని గట్టిగా లాభపడిన దేశంలో కరోన వైరస్ పుట్టిందని ఎందుకు అనుకోరూ?   ఇప్పుడు మనం అనుభవిస్తున్నది మూడు దశాబ్దాల పాప ఫలితం. ప్రకృతితో చెలగాటం ఎప్పుడూ చెల్లదు. మన తప్పిదాలను ప్రకృతి ఎన్నటికీ క్షమించదు. అది ఆగ్రహిస్తుంది. ప్రకృతి ఆగ్రహాన్ని తట్టుకోవడం అంత సులువుకాదు. ప్రపంచ మానవాళీ మొత్తం ఒకసారి మృత్యుముఖంలోనికి వెళ్ళి వస్తోంది. మానవజాతికి కరోనాకన్నా ప్రమాదకరమైన అణుయుధ్ధం, భూతాపం వంటి మరికొన్ని  ఉపద్రవాలు ముంచుకు రాబోతున్నాయి.  మనం ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి సిధ్ధం కావాలి.

 కరోనా సమస్య పరిష్కారం అయ్యాక మన ముందుకు రెండు ప్రత్యామ్నాయాలు వస్తాయి. ప్రభుత్వాలకు నిరంకుశ అధికారాలన్నీ అప్పచెప్పడమా? లేక మానవీయ విలువలతో కూడిన ఒక కొత్త సమాజాన్ని పునర్ నిర్మించడమా? 

కరోన సమస్య తీరే నాటికి దాదాపు అన్ని దేశాల్లోనూ ఆర్ధిక సంక్షోభం చెలరేగుతుంది. ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కడానికి  తమకు అపరిమిత అధికారాలు కావాలని ప్రభుత్వాధి నేతలు అడుగుతారు. సామరస్య, సామ్యవాద, ప్రజాస్వామిక ఆదర్శాలున్న రాజ్యాంగాలను అటకెక్కిస్తారు.  కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే  దేశ ఆర్థిక స్థితి మెరుగుపడదంటారు. నిజానికి కరోకా పుట్టడానికి ముందే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం వుంది. ప్రభుత్వాలు కార్పొరేట్ రంగానికి భారీగా రాయితీలు ప్రకటించాయి. ఇప్పుడు మందగమన నెపంతోపాటూ ఆర్థిక సంక్షోభం నెపాన్ని కూడ కరోనా మీద గెటివేసే అవకాశం పాలకులకు దక్కుతుంది. 

ఇలాంటి సంక్షుభిత సందర్భంలో  దురదృష్టావశాత్తు వదరుబోతులు, ముధ్ధోన్మాదులు, వివక్షవాదులు, సమానత్వ వ్యతిరేకులు అనేక దేశాల్లో పాలకులుగా వున్నారు. డోనాల్డ్ ట్రంప్ దీనికి పెద్ద ఉదాహరణ.

అమెరిక ఆర్థిక సామర్థ్యమేగాక సైనిక పాటవం కూడ చాలా పెద్దది. క్యూబా, ఇరాన్ ల మీద అమెరిక అనేక ఆంక్షల్ని విధించింది. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని బలహీనపరచడానికి అనేక కుట్రలు పన్నింది.   అనేక యూరప్ దేశాలు సహితం అమెరిక బాటలోనే నడిచాయి. క్రూడాయిల్ ధరను ఇరాన్ తగ్గించినా అమెరికాకు భయపడి అనేక దేశాలు కొనలేదు. అలా కొనని దేశాల్లో భారత్‍ కూడ ఒకటి.

ఈ కష్టకాలంలో ఏ దేశమూ మరో దేశాన్ని ఆదుకునే స్థితిలో లేవు. కానీ యూరోప్ దేశాల్లో కరోన సోకిన వారికి వైద్య సేవలు అందించడానికి క్యూబా తన వైద్య బృందాల్ని పంపించింది. చాత్రిత్రక అపహాస్యం అంటే ఇదే. ఇప్పుడయినా యూరోపియన్ యూనియన్ సిగ్గుపడాలి.

కరోనా మానవాళిని వెంటాడడం మొదలయ్యాక సహంజంగానే మనలో ఒక పాపభీతి కలిగితీరాలి. మనిషి అత్యాశతో ప్రకృతితో చెలగాటమాడాడు. ప్రకృతిని విచక్షణా రహితంగా విధ్వంసం చేశాడు.  ఇప్పుడు ప్రకృతి కన్నెర్ర చేసింది.  మనిషి బెంబేలెత్తిపోతున్నాడు. అతిశయించిన అత్యాశతో మనం నిర్మించుకున్న  ప్రపంచం ఎలాంటి ఫలితాలను ఇస్తున్నదో ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మనం ఎలాంటి ప్రపంచాన్ని కోరుకోవాలి? ఎలాంటి ప్రపంచాన్ని కోరుకోకూడదు? అనే విచక్షణ మనకు ఇప్పుడయినా రావాలి.

ఆర్థిక రంగంలో చేపట్టిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (LPG)  విధానాలు సామాజిక సాంస్కృతిక రంగాల్లో గతంలో వుత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించలేకపోగా వాటిని భారీగా పెంచాయి.

సీవియర్ ఆక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (SARS) 2003లో వచ్చింది. 2015లో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) వచ్చింది.  రెండు పెనుముప్పులు వచ్చినపుడు మూడోది వస్తుందని మనం గుర్తించి వాక్సిన్ తో సిధ్ధంగా వుండాల్సింది. ఓ మనిషికి రెండుసార్లు కుక్కకరిస్తే మూడోసారి కూడా కరుస్తుందని జాగ్రత్త పడాలి. అలా జాగ్రతత పడకపోతే అతనికి పిచ్చిపట్టిందని మనం అనుకోవచ్చు. మానవాళికి అలాంటి పిచ్చి పట్టింది. కరోన మూడవ అవతారం ఎత్తుతుందని మనం గుర్తించనేలేదు. మన ప్రాధాన్యాలు  వేరేగా వున్నాయి. మన చూపు వేరే  చోటవుంది.

మన ఫార్మా కంపెనీల ప్రాధాన్యతలు వేరు. వాటి పని మానవ జాతిని రోగాల నుండి కాపాడడంకాదు; అత్యధిక లాభాలను మూటగట్టుకోవడం. అంటువ్యాధులకు మందులు కనిపెడితే వాటిని ప్రభుత్వం గంపగుత్తగా కొని  సామూహికంగా వాడుతుంది కనుక పెద్దగా లాభాలు రావు. వ్యక్తులకు, ప్రధానంగా స్థితిమంతులకు సాధారణంగా వచ్చే జబ్బులకు మందులు కనిపెడితే మంచి ధరకు అమ్ముకోవచ్చు లాభాలు పిండుకోవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యమని  గతంలో అనుకునేవారు. ఆరోజులు పోయాయి. ఇప్పుడు మహాభాగ్యమే ఆరోగ్యం. అదొక విలాస సరుకు.

మనకు మూడు చేపల నీతి కథ తెలుసు. ముందుగా జాగ్రత్త పడిన చేప. ప్రమాదం ముంచుకు వస్తున్నపుడు మేల్కొన్న చేప. ప్రమాదం వచ్చాక బెంబేలుపడిపోయిన చేప.

కరోన వైరస్ గురించి 2019 అక్టోబరులోనే పుకార్లు వచ్చాయి. డిసెంబరులో చైనా స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపింది. నీతి కథలోని మొదటి చేపలా దక్షణ కొరియా, తైవాన్ తదితర దేశాలు జాగ్రత్త పడ్డాయి. రెండవ చేపలా కొన్ని యూరప్ దేశాలు కొంచెం లేటుగా కళ్ళు తెరిచాయి. ఇక చివరి వరకు నిద్ర పోయిన దేశాలు  అమెరిక, యూకే. యూకే ఒకప్పుడు ప్రపంచాన్ని పాలించిన దేశం. అమెరిక ఇప్పుడు ప్రపంచాన్ని శాశిస్తున్న దేశం. అయితేనేం ఆ రెండు దేశాలు నిర్లక్ష్యానికి ఫలితంగా ఇప్పుడు కరోన కోరల్లో గిలగిల లాడుతున్నాయి.

కరోన ఒక విపత్తే అయినప్పటికీ అందులోనూ ఒక సానుకూల కోణం వుంది. మన వ్యవస్థలో, మన ఆశల్లో, ఆశయాల్లో, మన ప్రాధాన్యతల్లో వున్న అనేక లోపాలను అది  బయటికి తెచ్చింది అంటున్నారు అమెరిక రాజకీయ విశ్లేషకులు, భాషాశాస్త్రవేత్త నోవోమ్ చోమ్స్కీ.  యూఎస్ లో కరోనా వ్యాప్తి కారణంగా ప్రస్తుతం ఆయన ఆరిజోనా రాష్ట్రంలో స్వీయ – ఒంటరితనంలో వుంటున్నారు. మన సామాజిక ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చాలి  అంటున్నారు చోమ్స్కీ. 

కరోనా మనకు ఒక హెచ్చరిక చేసింది. దీన్ని గుణపాఠంలా తీసుకోవాలి. మన వ్యవస్థల్లోని అంతర్గత లోపాల్ని తప్పుల్ని సరిచేసుకోవాలి. లేకుంటే ఇంతకన్నా పెద్ద ఉపద్రవాల్లో మానవాళి కూరుకుపోవాల్సి వస్తుంది.

సామాజిక దూరం అనేది ఇప్పుడు కొత్త ఆరోగ్య సూత్రంగా ప్రచారం చేస్తున్నారు. మనుషుల మధ్య అంతరం అనేక శతాబ్దాలుగా  కొనసాగుతూ వస్తున్నది. ఒక కులంవాళ్ళు మరో కులంవారిని దూరంగా వుంచుతారు. ఒక తెగవారు మరో తెగని దూరంగా వుంచుతారు. ఒక మత సమూహం మరో మత సమూహాన్ని దూరంగా వుంచుతుంది. ఒక భాషవారు మరో భాష వారిని దూరంగా వుంచుతారు. ఒక దేశంవారు మరో దేశం వారిని దూరంగా వుంచుతారు. సమీప గతంలో మనుషులు కలిసి బతికిందెప్పుడూ?  మనమంతా సమానులం అనుకుని కలిసి బతికిన కాలం ఎవరికయినా గుర్తుందా?

కరోనా ఎవ్వర్నీ వదలలేదు. చైనానూ వదలలేదు అమెరికానూ వదలలేదు. ఇండియానూ వదలలేదు పాకిస్తాన్ నూ వదలలేదు. సిరియా శరణార్ధుల్నీ వదలలేదు యూరోపియన్ దేశాల్నీ వదలలేదు. రోహింగ్యాలనూ వదలలేదు; బర్మీయుల్నీ వదలలేదు.  ఇంతకు ముందు ఈ దూరాలు సమూహాల స్థాయిలో వుండేవి. ఇప్పుడు కరోనా దాన్ని వ్యక్తుల స్థాయికి తెచ్చింది. కొడుకును తాకడానికి తండ్రి, భర్తను తాకడానికి భార్య, మనిషిని తాకడానికి మనిషి  భయపడుతున్న కాలం లోనికి మనం ప్రవేశించాం.

మారుద్దాం. ఈ లోకాన్ని మారుద్దాం. మనిషిని మనిషి ప్రేమించే లోకాన్ని సృష్టిద్దాం. కరోనా గుర్తు చేస్తున్న గుణపాఠం అదే.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, మొబైల్ 9010757776)

రచన : 12 ఏప్రిల్  2020
ప్రచురణ : ఆంధ్రజ్యోతి (ఆంధ్రప్రదేశ్)  16 ఏప్రిల్  2020



No comments:

Post a Comment