Monday, 27 April 2020

సంక్షోభం వచ్చినపుడు ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.


సంక్షోభం వచ్చినపుడు
ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది.

          మతాంతర వివాహం కనుక  చాలామంది మాది ప్రేమ వివాహం అనుకుంటారు. మాది అరేంజెడ్ మ్యారేజి. పెళ్ళికి ముందు మా మధ్య పెద్దగా పరిచయం కూడ లేదు; రెండు సందర్భాలలో పార్టి మీటుంగుల్లో కలవడం తప్ప. ఇప్పుడిది కొందరికి ఆశ్చర్యంగా వుండొచ్చుగానీ అప్పట్లో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల్లో ఇలాంటివి అనేకం జరిగేవి. ఇప్పటి కొలమానాలు మారిపోయాయిగానీ, ఉద్యమాల్లో పనిచేయడం అప్పట్లో స్త్రీపురుషుల మధ్య ప్రధాన ఆకర్షణ అంశంగా వుండేది. అలా ఉద్యమకారుల్ని పెళ్ళి చేసుకోవడానికి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు ఉత్సాహం చూపేవారు.   నేను పనిచేసిన పీపుల్స్ వార్ లో ఈ సాంప్రదాయం కొంచెం ఎక్కువగా వుండేది.

          తన కూతుర్ని పార్టీలో ఇవ్వాలని ఏలూరి భీమయ్య అనుకున్నారు. “డానీకి ఇస్తే బాగుంటుంద”ని కొండపల్లి సీతారాయయ్య  సలహా ఇచ్చారు. సాహిత్యలోకానికి అజ్ఞాత సూర్యుడుగా, ఉద్యమకారులకు మల్లిక్ గా తెలిసిన   నెమలూరి భాస్కరరావు నాకు పెళ్ళి సంబంధం తెచ్చినపుడు “ఓసారి అమ్మాయితో మాట్లాడాక ఓ నిర్ణయానికి వద్దాము” అన్నాను. ఆయన అలాగే మాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేశారు.

          ఓ ఆటోమోబైలు కంపెనీలో చిన్న ఉద్యోగం నాది. ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి బ్రెడ్ ఎర్నింగ్ బాధ్యత నాది. ఆ పైన ఉద్యమంలో ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియని ఒక ఉత్కంఠ వాతావరణం. పైగా మతం కూడ వేరు. అలాంటి కుటుంబంలో ఇమడాలంటే గొప్ప ఏ అమ్మాయికయినా గొప్ప మానసిక సంసిధ్ధత కావాలి.

          భీమయ్య గారిది కమ్మ సామాజికవర్గం. కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలో మధ్యతరగతి రైతు. మనిషి చాలా నిరాడంబరంగా వుండేవారు. వారి ఏకైక సంతానం అజిత ఔత్సాహిక విద్యార్థి నాయకురాలు. “నాకు ఆర్థిక స్తోమత లేదు. పైగా కష్టాలు, రిస్క్ కూడ వుంటాయి” అన్నాను. అప్పుడు తను డిగ్రీ సెకండియర్ యాన్యూవల్ పరీక్షలు రాస్తోంది.  విద్యార్థినుల్లో వుండే విప్లవ అతి ఉత్సాహపు అమాయికత్వం వల్ల తను నన్ను చేసుకోవాలనుకుంది!.

          సీనియర్ జర్నలిస్టు ఏలూరి రఘుబాబు నన్ను ఒకసారి ఓ ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రముఖు ముస్లిం రచయితలు  హిందువులను పెళ్ళి చేసుకున్నారు. ఇదెలా జరిగిందని. నరసాపురంలో మా గురువుగారు, ప్రముఖ నాటక రచయిత యం.జి. రామారావుగారు పెళ్ళి విషయంలో నాకో సలహా ఇచ్చారు. “భార్యకు రెండు లక్షణాలు వుండాలి. మొదటిది; మొగుడి మేధస్సును ఎంతోకొంత అర్థం చేసుకునేంత జ్ఞానం వుండాలి. రెండోది; తన మొగుడికన్నా గొప్పవాడు ఈ లోకంలో మరొకడు లేడనుకునేంత అజ్ఞానం వుండాలి” అని. యంజీఆర్ మాటల్నే నేను రఘుబాబు గారికి చెప్పాను. అప్పట్లో ఆంధ్రా ప్రాంతంలో మా తెలుగు రచనల్ని అర్థం చేసుకుని మెచ్చుకునేంత నైపుణ్యంగల ముస్లిం మహిళలు లేరు. తెలుగు సాహిత్యంలో మా నైపుణ్యాన్ని హిందూ స్త్రీలే గుర్తించినట్టున్నారు.

          మా కష్టాలు పెళ్లి రోజునే మొదలయ్యాయి. 1983 మేడే నుండి వారం రోజుల పాటు కృష్ణా వుభయగోదావరి జిల్లాల్లో విద్యార్థి యువజనులకు రాజకీయ శిక్షణా తరగతులున్నాయి. అప్పట్లో ఆ మూడు జిల్లాలకు నేను విరసం, రాడికల్ యూత్ లీగ్ లకు బాధ్యునిగా వున్నాను. కొత్త వారికి చారిత్రక గతితార్కిక భౌతికవాదం ప్రాధమిక పాఠం చెప్పడం నా బాధ్యత.   ఆఫీసులో సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. అయితే పెళ్ళి కోసం స్టాఫ్ కు ఏడు రోజులు సెలవు ఇచ్చే సాంప్రదాయం ఒకటి వుండేది. ఆ అవకాశాన్ని వాడుకున్నాను. మే డే రాజకీయ తరగతుల కోసం  ఏప్రిల్ 27న పెళ్లి చేసుకున్నాము. ఆ రాజకీయ తరగతులే మా హానీమూన్.

          మా పెద్దబ్బాయి 1985 ఏప్రిల్ 2న పుట్టాడు. కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాము. ఓ బంద్ సందర్భంగా బెజవాడ పోలీసులు నన్ను ముందస్తు అరెస్టు చేసి రోజుకో స్టేషన్లో వుంచారు. పసిపిల్లాడ్ని పక్కింటివాళ్లకు అప్పచెప్పి రోజూ నన్ను వెతుక్కుంటూ పోలీసు స్టేషన్లన్నీ తిరిగేది. ఆ ఏడాది జులై 17న కారంచెడు దురాగతం జరిగింది. వంద రోజుల కొడుకుని వదిలేసి నాలుగు నెలలు ఆ ఉద్యమం లోనికి వెళ్లిపోయాను. మా ఇల్లు నిర్మాణం ఆగిపోయింది. కారంచెడు నిందితులు తన సామాజిక వర్గానికి చెందినవారు. అసలు తను అదేమీ పట్టించుకోలేదు.  కుటుంబానికి జరిగిన ఆర్థిక నష్టంకన్నా అప్పట్లో నాకు వచ్చిన పేరును చూసి తను మురిసిపోయింది. అప్పట్లో మాకు ఒంగోలు సమీపాన చేజర్ల మండలంలో 5 ఎకరాల పట్టా భూమి వుండేది. కారం చెడు ఉద్యమ ఉత్సాహంలో ఆ భూమిని వదిలేశాను. తనేమీ అనలేదు. తను నన్ను ఎప్పుడైనాసరే ఒక సోషల్ యాక్టివిస్టుగా చూడాలనుకుంటుంది.

          చుండూరు ఉద్యమంలో నా పాత్ర స్వల్పం. ఉద్యోగం మానేసి వెళ్ళిపోమ్మని తను ప్రోత్సహించింది.అనివార్య కారణాలవల్ల నాకు కుదరలేదు. బలహీనవర్గాల సమాఖ్య కార్యవర్గంలో నాతోపాటు పనిచేసింది. చినగంజాం ఉప్పు ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటం, వాడరేవు షిప్ బ్రేకింగ్ యూనిట్ వ్యతిరేక పోరాటం, నెల్లూరులో యానాది సంఘాల సమాఖ్య ఏర్పాటు మొదలు అమ్రాబాద్ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన  వరకు అన్నింట్లోనూ తను నా వెంటే వుంది.

          అనేకానేక ఉద్యమాలు, రాజకీయ మలుపులు, అరెస్టులు అలా ఆ ఉత్కంఠ 37 సంవత్సరాలు కొనసాగింది. మేమిద్దరం మాత్రమే ఓ నెల రోజులు ఒకే చోట వుండిపోయిన సందర్భం ఇదొక్కటే. ఆ అవకాశాన్ని కరోనా లాక్ డౌన్ మాకు కల్పించింది.

          నాది ఉద్రేక స్వభావం. అలాంటి భర్తను నాలుగు దశాబ్దాలపాటు భరించడం అంత సులువు కాదు. తనదీ ఉద్రేక స్వభావమే. అంచేత తాలింపు మాడిందనో, కారం ఎక్కువయిందనో, చింతపండు వాడారనో, కరెంటు బిల్లు కట్టకుండా క్యాంపుకు వెళ్ళిపోయాననో, బాత్ రూం స్లిప్పర్స్ తో హాలు లోనికి వచ్చేశాననో ఇలా అనేకానేక కారణాలతో మేమిద్దరం క్రమం తప్పకుండ రోజుకు మూడు పుటలా కోట్లాడుకుంటుంటాం. చీకటిపడగానే కలిసిపోతుంటాం.

          చలసాని ప్రసాద్ మా పెళ్ళి పురోహితుడు. వంద పెళ్ళిళ్ళు చేసిన ఘన చరిత్ర అతనిది. అందులోనూ ఒక విచిత్రం వుంది. ఆయన చేసిన నూరు వివాహాల్లో 99 జంటలు విడిపోయారు. “ఒరే డ్యానీగ్యా! నువ్వూ అజిత కూడ విడిపోతే నా పేరున ఒక  రికార్డు నెలకొంటుంది” అనేవాడు చలసాని.  ఆ వంద జంటల్లో ముందుగా మేమే విడిపోతామని సామాజిక పండితులు నమ్మేవారు. ముస్లింలు అలవోకగా విడాకులు ఇచ్చేస్తారనే ప్రచారమూ బలంగా వుండేది.  మేము ఆ ఊహాగానాలను నిజం కానివ్వలేదు.

          మా ఇద్దరి మధ్య ఒక శ్రమ విభజన వుంది. నేను రచయితను. తను టెక్నీషియను. ప్రింటు మీడియాలో డిటిపి పనులు, ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్ ప్రోగ్రామింగ్, కెమేరా సెట్టింగ్, లైటింగ్, వీడియో ఎడిటింగ్ తదితర సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ తనకు మంచి నైపుణ్యం వుంది. ఈ విభాగాల్లో నేను తన మీద ఆధారపడతాను. 

          కమ్మ సామాజికవర్గపు స్త్రీలలో ఎక్కువ మందికి ఆర్థిక వ్యవస్థ మీద స్థూలంగా అయినా ఒక  అవగాహన వుంటుంది. అజితకు కూడ అలాంటి నైపుణ్యం  వుంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాల్లో తనవల్ల ఎప్పుడూ నాకేమీ ఇబ్బంది కలుగకపోగా, నేను ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పుడు తనే సమర్థంగా ఇంటిని నడిపేసేది.  ఇందులో సౌకర్యంతో పాటూ ఒక అసౌకర్యం కూడా వుంటుంది; ఇంట్లో ఇద్దరు యజమానులు వుంటారు!.

          భార్యాభర్తల సంబంధాల్లో అంతిమంగా భార్యలే పీడిత వర్గం. దాంపత్యంలో నేనేమీ విప్లవాత్మక మార్పులు తేలేదుగానీ కొన్ని సంస్కరణలు మాత్రం చేశాను. అజితకు వారసత్వంగా వచ్చిన స్థిర చరాస్తుల్ని నేనేమీ ముట్టుకోలేదు. ఆపైన, నా స్థిర చరాస్తుల్ని ఆమె పేరున రాసి ఇచ్చేశాను. ఇల్లు, కారు, స్కూటరు, బంగారం, నగదు ఏదీ నా పేరున వుంచుకోలేదు. ఆర్థిక వ్యవహారాల నుండి తప్పుకోవడంలో ఒక హాయి వుందనిపిస్తోంది. ఆ కష్టాలేవో తనే పడుతుంది.  నాకు మాత్రం అలెన్ సొలీ బ్రాండుకు తగ్గకుండ డ్రెస్సులు కొనిపెడుతుంది.

          సాధారణ సందర్భాల్లో అజిత కూడ ఒక సాధారణ స్త్రీయేగానీ ఆర్థిక సంక్షోభం వచ్చినపుడు ఆమె తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. పన్నెండేళ్ళ క్రితం నేను పనిచేస్తున్న ఓ టీవీ ఆఫీసు నుండి ఫోన్ చేసి “ఇక్కడి వాతావరణం నాకు నచ్చడంలేదు” అన్నాను. “ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేయి. నేనున్నాగా.” అంది.   మరుక్షణం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి వచ్చేశాను.

          పదేళ్ళ క్రితం వరవరరావు ఒక సాహిత్య సభలో నా గురించి చెప్పినట్టు నేను నిరంతర అసమ్మతివర్గం. ప్రత్యర్ధుల్ని ఎలాగూ తెగబడి ఖండిస్తాను. మావాళ్లు అనుకున్నవాళ్ళు తప్పు చేసినా నిర్మొహమాటంగా మందలిస్తాను. అజిత లేకపోతే నేను అలాంటి కొన్ని సాహసాలు చేయగలిగేవాడిని కాదేమో! నాకు నచ్చింది నచ్చిందనీ, నచ్చనిది నచ్చలేదని ధైర్యంగా చెప్పగలిగేవాడిని కాదేమో! నిజసతోదర పొషణార్థమై గడ్డి కరవాల్సిన కాంప్రమైజ్ కావాల్సిన అవసరం నాకు రాలేదు.

థ్యాంక్యూ డార్లింగ్!

27 ఏప్రిల్ 2020 

No comments:

Post a Comment