Wednesday, 6 May 2020

From Markaz to Palghar Lynching


From Markaz to Palghar Lynching
మర్కజ్ నుండి పాల్ఘార్ వరకు

డానీ

            కరోనా వైరస్ జాతి, కుల, మతాల్ని చూడదని భారత ప్రధాని నరేంద్ర మోదీజీ ఏప్రిల్ 19న గుర్తు చేశారు. కరోనా సొకినవారిని  ‘బాధితులు’ అనరాదనీ వారిని ‘కరోనా సోకినవారు‘ ‘చికిత్సలో ఉన్నవారు’ అని మాత్రమే పేర్కొనాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి విషయంలో “మతాలు, ప్రాంతాల” ముద్రలు రుద్దకూడదని కూడ హెచ్చరించింది. అంతకు ముందే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి కూడ ఇలాంటి హెచ్చరికలే చేశాయి. కానీ అప్పటికే భారత దేశంలో కరోనాకు మతతత్వం గట్టిగా సోకేసింది.  అంతకు ముందే దేశంలో కొనసాగుతుండిన ఆర్ధిక మందగమనం కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక మాద్యంగా మారినట్టు అంతకు ముందే దేశంలో కొనసాగుతున్న ఇస్లామో ఫోబియా కరోనా వైరస్ కాలంలో మరింతగా విజృంభించింది.

            కరోనా మతతత్వానికి ఆజ్యంపోసింది సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ. ప్రపంచ ఆరోగ్య సంస్థ జనవరి మధ్యలోనే కరోనా ప్రమాదాన్ని గురించి హెచ్చరించింది. మార్చి 11న కోవిడ్-19ను విశ్వమారిగా ప్రకటించింది. కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ లేదని ప్రకటించి దేశ ప్రజలకు మార్చి 13న ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చారు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవాల్ మార్చి 29న  ఢిల్లీ నిజాముద్దీన్ లోని తబ్లిఘీ జమాత్ అంతర్జాతీయ కార్యాలయం (మర్కజ్)ను ఖాళీ చేయించిన తరువాత లవ్ అగర్వాల్ కొత్త వివాదానికి తెరలేపారు.  వారు ప్రతిరోజూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కరోనా సోకిన వారి వివరాలు చెప్పే సమయంలో మర్కజ్ తో లింకులున్న కేసుల్ని ప్రత్యేకంగా పేర్కొనడం మొదలెట్టారు. ఇది వైద్య ఆరోగ్య నైతిక ప్రమాణాలకు వ్యతిరేకం మాత్రమేకాదు చట్ట విరుధ్ధం కూడ.

            ఆ మాత్రం ఉప్పు అందితే చాలు సామాజిక మాధ్యమాల ట్రోలర్స్ (Trollers) రెచ్చిపోతారు. ఇది సత్యానంతర (Post-truth) కాలం కనుక వాస్తవాలకన్నా నకిలీ వార్తలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. వాస్తవవాస్తవాలతో  సంబంధం లేకుండ చేతికి అందిన పది రాళ్లను వేగంగా విసరడమే దినచర్యగా మార్చుకున్న సామాజిక మాధ్యమాల వీరులకు చేతినిండా పని దొరికింది. నకిలీ వీడియోలు, సంబంధంలేని వీడియోలు, మార్పులు చేసిన (doctored) వీడియోలు, అసందర్భ ఆడియోలు రంగప్రవేశం చేసి వైరల్ గా మారి వాతావరణాన్ని మతోన్మాదంతో కలుషితం చేసేశాయి.
                       

          ప్రపంచాన్ని కరోన వైరస్ కమ్ముకుంటున్న వేళ మర్కజ్ ఆమిర్ (అధినేత) మౌలనా ముహమ్మద్ సాద్ కాంధ్లావి  మార్చి13-15 తేదీల్లో  ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు అనేకులు పాల్గొన్నారు. మర్కజ్ లో జరిగిన ఈ సమావేశానికి అవసరమైన అన్ని అనుమతుల్నీ ముందుగానే తీసుకున్నారు. తీరా విదేశీ ప్రతినిధులు భారతదేశం చేరుకుని మర్కజ్ లో సమావేశం ఆరంభమయ్యాక ఢిల్లీ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నిరోధానికి రాజధాని నగరంలో అనేక నిషేధాజ్ఞాల్ని ప్రకటించింది. సాంకేతికంగా తమ తప్పు ఏమీలేదని మర్కజ్ భావించవచ్చు. కానీ, ప్రపంచం రోగగ్రస్తంగా మారుతున్నప్పుడు బాధ్యతగల ధార్మిక సంస్థలకు సామాజిక బాధ్యత, నైతిక బాధ్యత కూడ ముఖ్యమే.

దేశంలోనికి విదేశీ పర్యాటకుల రాకపోకల వ్యవహారం మొత్తం కేంద్ర హోంశాఖ కనుసన్నల్లో వుంటుంది. ఢిల్లీ పోలీసు వ్యవస్థ కూడ కేంద్ర హోంశాఖ ఆధీనంలోనే వుంటుంది. మర్కజ్ గోడను ఆనుకునే నిజాముద్దీన్ పోలీసు స్టేషన్ వుంటుంది. అయినా ఈ సమావేశాన్ని పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. అమాయికత్వంతోనో, అజ్ఞానంతోనో, తగిన సమాచారంలేకనో, అతివిశ్వాసంతోనో, మూఢత్వంతోనో మౌలనా ముహమ్మద్ సాద్ ఒక తప్పుచేశారు. సయ్యద్ అహమద్ ఉల్ హుస్సైనీ సయీదుల్ ఖాదరి వంటి ముస్లిం స్కాలర్లు చెప్పినట్టు మౌలానా ముహమ్మద్ సాద్ చర్య “నేరపూరిత అజ్ఞానం” (Criminal Ignorance) అయితే; రాజ్ దీప్ సర్దేశాయి వంటి సీనియర్ జర్నలిస్టులు చెపుతున్నట్టు తబ్లీఘీల సమావేశాన్ని నిరోధించడంలో ఢిల్లీ పోలీసుల వైఫల్యం కూడ “నేరపూరితమైన నిర్లక్ష్యం” (criminal negligence). రెండు వైపులా తప్పు జరిగినప్పుడు ఒక వైపు జరిగిన తప్పునే ఎత్తి చూపడాన్ని ఏమనాలీ? ఇది మతతత్వంకాక మరేమిటీ?

 

            ఏప్రిల్ 6న లవ్ అగర్వాల్ ప్రకటించిన గంణాంకాల ప్రకారం దేశంలో కరోనా సోకినవారు 4,281 మంది అయితే వారిలో మర్కజ్ లింకు వున్న వారు 1,445 మంది. అంటే 33.75 శాతం. ఏప్రిల్ 18 గణాంకాల ప్రకారం కరోనా సోకినవారు 14,378 మంది అయితే మర్కజ్ లింకు 4,291. అంటే మర్కజ్ శాతం 33.75 నుండి 29.84 కు తగ్గింది.  ఇక్కడ లవ్ అగర్వాల్ తెలివిగా దాటవేసిన విషయం ఒకటుంది. 29 శాతం  ఒక మత సంస్థకు చెందిన వారని ప్రకటించారుగానీ మిగిలిన 71 శాతం ఏ మత సంస్థకు చెందినవారో వారు ప్రకటించలేదు. వారు చెప్పక పోయినా ఆ సమూహాన్ని ఊహించడం పెద్ద కష్టం ఏమీకాదు. ఆ తరువాత మర్కజ్ లెఖ్ఖలు చెప్పడం వారు మానేశారు. అది కూడ ఒక తెలివే. ఇతర లింకుల్లో కరోనా సోకినవారి వివరాలు బయటికి వచ్చే కొద్దీ మర్కజ్ లింకు శాతం తగ్గుతూ వుంటుంది.

 

            ముస్లిం సమాజంలో సున్నీ, షియా, సూఫీ, నూర్ భాషా, ఆష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్  వంటి కొన్ని  తెగలు వుంటాయి. ఆ పైన ఓ పది  జమాత్ లు వుంటాయి. అలాంటి జమాతుల్లో తబ్లిఘీ ఒకటి. అసలు ఏ జమాత్ లోనూ వుండనివారు కూడ అనేకులు వుంటారు.  మొత్తం భారత ముస్లిం సమాజంలో తబ్లిఘీ అనేది ఒక చిన్న భాగం మాత్రమే అని చెప్పడానికే ఈ వివరణ. 

 

            అసదుద్దీన్ ఒవైసీ వంటి ముస్లిం రాజకీయ  ప్రతినిధులు మొదలుకొని ముస్లిం ఆలోచనాపరులు, మౌల్వీలు, ముఫ్తీలు  అనేకులు  కరోనా వ్యాప్తి నిరోధానికి స్వీయసమాజానికి అనేక సూచనలు చేశారు. వైద్యులతో సహకరించాలనీ, క్వారంటైన్, ఐసోలేషన్, ఫిజికల్ డిస్టాన్స్ సురక్షిత దూరం  నియమాలు పాటించాలనీ శుక్రవారం ప్రత్యేక ప్రార్ధనలు, రంజాన్ మాస నమాజులు, ఇఫ్తార్లు, తరావ్హీలు ఇంట్లోనే సాగించాలనీ అక్కడా భౌతిక దూరాన్ని పాటించాలని ముస్లిం ధార్మిక సంస్థలు ఫత్వాలు జారీ చేశాయి. ఇస్లాం పవిత్ర స్థలాలైన మక్కా, మదీనా మసీదుల్లోనూ భక్తులు గుమిగూడడాన్ని నిషేధించారు. ఈ వాస్తవాలు ప్రధాన స్రవంతి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వైరల్ కాలేదు!. కొద్దిమంది చేసిన తప్పుకు దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను శిక్షించాల్సిందే అన్నట్టుగా మూకోన్మాదం చెలరేగిపోయింది.

 

            భారత ముస్లిం సమాజంలో  అత్యధికులు వృత్తిదారులు, చిరువ్యాపారులు, స్వయం ఉపాధిదారులు. లాక్ డౌన్ కాలంలో ‘సోషల్ డిస్టాన్స్’ అనేది వీళ్ళ మీద సోషల్ బాయ్ కాట్ గా మారింది. రైతుబజార్లలో ముస్లిం దుకాణదారుల వద్ద కూరగాయలు ఎవరూ కొనడంలేదు. వీధుల్లో  ముస్లిం  తోపుడుబండ్ల వారి వద్ద పండ్లు కొనడంలేదు. డెలివరీ బాయ్స్ ముస్లింలు అయితే ఫ్లాట్ యజమానులు తిప్పి పంపించేస్తున్నారు. అద్దెకు వుంటున్న ముస్లింలను ఇళ్ళు క్హాలీ చేయమంటున్నారు. రేపు లాక్ డౌన్ ముగిసిన తరువాత ముస్లింల షో రూములు సహితం ఈ ఆర్థిక వెలివేతకు  గురికాబోతున్నాయి. కష్టమర్ల మెప్పుకోలు కోసం ప్రైవేటు వాణిజ్య సంస్థలు ముస్లింలను రిక్రూట్ చేసుకోకపోవచ్చు. వున్న ముస్లిం సిబ్బందిని తొలగించవచ్చు. దేశంలో మొత్తం ముస్లింల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతున్నది!.

 

            లౌకికవాదం ఇతరులకు ఒక ఆప్షన్ మాత్రమే. అది ముస్లింలకు ప్రాణావసరం. మూకోన్మాదం క్రమంగా లౌకికవాదాన్ని మింగేస్తుంది. ఇప్పుడు మతసామరస్యవాదులుగా కొనసాగుతున్నవారి అంతరాంతరాలలో కొనసాగుతున్న మతతత్వాన్ని మూకోన్మాదం వెలికి తీస్తుంది. పోలీసు, న్యాయవ్యవస్థల్లోనూ ఇంకిపోయిన మతోన్మాదం మూకోన్మాదులతో ఉదారంగా వ్యవహరిస్తుంది. వాళ్ళను శిక్షించకుండ వదిలేసి, లీగల్ ఇంప్యూనిటీని ఇస్తుంది. మూకోన్మాదాన్ని మొగ్గలోనే తుంచివేయాలి.  లేకపోతే కొందరికి అదొక వ్యసనంగా మారిపోతుంది. ఈరోజు ముస్లింల మీద మూకోన్మాద దాడులు  చేస్తున్నవాళ్ళురేపు హిందువుల మీద కూడ దాడులు చేస్తారు. ఈరోజు ఆకుపచ్చ రంగు మీద కసిగా వున్నవాళ్ళు రేపు కాషాయ రంగును సహితం వదలరు. ఈ పరిణామాలు అప్పుడే అనేక చోట్ల పొడచూపుతున్నాయి.  మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సాధువుల మీద సాగిన మూకోన్మాద హత్య దీనికి తాజా ఉదాహరణ. రెండు రోజుల తరువాత ఉత్తర ప్రదేశ్ బులంద్ షహర్ జిల్లాలో ఓ శివాలంయంలో ఇద్దరు సాధువుల్ని ఒకడు హత్య చేశాడు.

 

          సూరత్ కు చెందిన గురుశ్రీ మహంత్ రాంగిరిజీ ఏప్రిల్ 16న చనిపోయారు. వారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి మహారాష్ట్రలోని జునా ఆఖారా కు చెందిన ఇద్దరు సాధువులు చిక్నే మహరాజ్  కల్పవృక్షగిరి, మహరాజ్ సుశీల్ గిరి కారులో సూరత్ కు బయలు దేరారు. అవయవాల అమ్మకం కోసం పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరుగుతున్నాయని పాల్ఘార్ జిల్లాలో కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. లాక్ డౌన్ కాలంలో రాత్రి 10 గంటలకు పాల్ఘార్ జిల్లా గడ్చించాలే గ్రామం మీదుగా పోతున్న ఆ ఇద్దరు సాధువుల  కారును స్థానికులు అడ్డుకున్నారు. పిల్లల్ని ఎత్తుకుపోవడానికి వచ్చారనే అనుమానంతో వాళ్ళ మీద కర్రలతో దాడి చేశారు. సంఘటనా స్థలంలో వున్న పోలీసులు సహితం ఉన్మాదులకు సహకరించినట్టు వీడియోలు వచ్చాయి.  ఈ మూకోన్మాద దాడిలో ఇద్దరు సాధువులతోపాటూ కారు డ్రైవరు కూడ చనిపోయాడు.  

మహారాష్ట్రలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న బిజేపి ఈ సంఘటనను హిందువుల మీద ముస్లింలు చేసిన దాడిగా చిత్రించడానికి ప్రయత్నించింది. ట్రోలింగ్ వీరులు సోషల్ మీడియాలో అలాంటి ప్రచారాన్ని ఉధృతం చేశారు. లాక్ డౌన్ లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ‘‘మహారాష్ట్రలో ఇద్దరు సాధువులను కొందరు విచక్షణరహితంగా కొట్టి చంపేసినా ఇప్పటి వరకూ లిబరల్స్ ఎవరూ కనీసం నోరు మెదపలేదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏమయ్యాతి? మన మానవహక్కుల వీరులు ఎందుకు ఆక్రోశం వ్యక్తం చేయడం లేదు’’  అని  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా  వెటకారంగా  ట్వీట్ చేశారు.  సరిగ్గా ఇలాంటి అవకాశాల కోసమే ఎదురుచూసే రిపబ్లిక్ టివీ అధినేత అర్ణబ్ గోస్వామి ఏప్రిల్ 20న  అలవాటు ప్రకారం (కిలో గుంటూరు కారం బొక్కి) ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధావ్ థాక్రే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీల మీద విమర్శల వర్షం కురిపించారు. “ఇద్దరు హిందూ సాధువుల్ని బహిరంగంగా హత్య చేశారు. ఈ దేశంలో 80 శాతంకన్నా ఎక్కువ జనాభా హిందువులది. సనాతనులది. ఈ దేశంలో హిందువుగా పుట్టడం ఒక నేరంగా మారిపోయిందా?  దీన్ని నా దేశం అంగీకరించదు. ఇది నాదేశం”. మహారాష్ట్రలోని “సోనియా –సేనా ప్రభుత్వం నాలుగురోజులు ఈ ఘోరాన్ని దేశ ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచివుంచిందీ?” అని గర్జించారు.

ఈ కేసులో పాల్ఘార్ పోలీసులు 101 మందిని అరెస్టు చేశారు. విధినిర్వహణలో  ఉదాసీనంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధావ్ థాక్రే, హోం మంత్రి  అనిల్ దేశ్ ముఖ్  విడివిడిగా నిందితుల జాబితాను విడుదల చేశారు. నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారేననీ వారిలో ముస్లింలు ఒక్కరూ లేరని స్పష్టం చేశారు.  

మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్ సంఘటనల్లో మతకోణం లేదని పోలీసులు ప్రకటించబట్టి వాతావరణం చల్లబడిందిగానీ లేకుంటే లాక్ డౌన్ లోనూ మతకల్లోలాలు చెలరేగేంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.  థ్యాంక్ గాండ్!

విచిత్రం ఏమంటే, మీడియాలో మర్కజ్ వివాదాన్ని రెచ్చగొట్టింది అర్ణబ్ గోస్వామి యే. రిపబ్లిక్ టివి మార్చి 31 రాత్రి ‘ద డిబేట్’ కార్యక్రమంలో ‘మర్కజ్ కోవిడ్ స్ప్రెడ్’  హాష్ టాగ్ తో చర్చను నడిపింది.  మర్కజ్ “ఉద్దేశ పూర్వకంగా”, “బాహాటంగా”, “ప్రణాళికా బధ్ధంగా”  దేశంలో కరోనా వ్యాప్తికి “కుట్ర” చేసి “దేశద్రోహం”కు పాల్పడిందని ఆర్నాబ్ గోస్వామి ఆరోపించారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మూకోన్మాదాన్ని రెచ్చగొడతాయనీ, దానికి ముస్లింలే కాకుండా హిందువులు సహితం బలవుతారని అర్ణబ్ గోస్వామి అప్పుడు ఊహించి వుండరు. 

(రచయిత సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు. మొబైల్ 9010757776)

రచన : 25 ఏప్రిల్ 2020
ప్రచురణ :

No comments:

Post a Comment