Muslim programme to confront the ‘Neo Fascism’
డానీ
నయా ఫాసిస్టు నియంతృత్వం మీద
భారత అస్తిత్వ సమూహాల ధిక్కారం
ముస్లిం కార్యక్రమం
1.
మనదేశంలో నయా మనువాద నియంతృత్వం రాజ్యం చేస్తున్నదని
ఇప్పుడు ఎక్కువ మంది గుర్తిస్తున్నారు. పెట్టుబడీదారీ వ్యవస్థకు ఇది వికృత దశ. ఇది కార్పొరేట్ల అత్యాశ తోడైన
సాంస్కృతిక జాతీయవాదం. ఇంగ్లీషులో దీనిని Corporate Communal Dictatorship అనుకోవచ్చు.
2.
దేశవ్యాప్తంగా అనేకానేక నిస్సహాయ (vulnerable) సమూహాలు చాలాకాలంగా దీని ఉక్కుపాదాల కింద నలిగిపోతున్నాయి. సాంస్కృతిక జాతీయవాదం తొలి దాడిని
మతఅల్పసంఖ్యాకవర్గాల మీద చేస్తుంది. కార్పొరేట్
సాంస్కృతిక జాతీయవాదానికి కూడ తొలి బాధితులు మతఅల్పసంఖ్యాకవర్గాలు.ఆ బాధితుల్లోకెల్లా బాధితులు ముస్లింలు.
3.
వర్తమాన భారత సమాజంలో ముస్లింలు శ్రామిక
మత సమూహం. రాజ్య నిర్బంధాన్ని తీవ్రంగా అనుభవిస్తున్న సమూహాల్లో ముస్లింలతో పోల్చదగ్గ
మరో సమూహం ఆదివాసులు.
4.
సమాజంలో పవిత్ర సమూహాలు అంటూ ఏవీ వుండవు.
అన్ని సమూహాల్లోనూ అవాంఛనీయ భావజాలం ఏదో ఒక స్థాయిలో వుంటుంది. అంచేత ఏ సమూహం కూడ సంపూర్ణ
పరిశుధ్ధంగా, ఆదర్శంగా నిజాయితీగా వుండదు. శ్రామికవర్గంలోనూ అన్యవర్గ భావజాలం
వుంటుంది. అనేక అవలక్షణాలుంటాయి. ఎస్టీ, ఎస్సీ, బిసి సమూహాల్లోనూ వ్యక్తిగత
స్థాయిలో ఇలాంటి అవలక్షణాలు అనేకం వుంటాయి. ముస్లిం సమాజం కూడ దీనికి ఏమాత్రం
మినహాయింపుకాదు.
5.
తాము ఒక సమూహంకన్నా తక్కువ అనే ఆత్మన్యూనతా భావం నుండి బయట పడడానికి ప్రతి
సమూహం తాము ఇంకో సమూహంకన్నా మిన్న అనే భావజాలన్ని ఆశ్రయిస్తుంది. విద్యా, ఉపాధి,
చట్ట సభల్లో ప్రాతినిధ్యం తదితర అంశాల్లో ఎస్సీలకన్నా ముస్లింలు వెనుకబడివున్నారని
సచార్ కమిటి నిర్ధారించింది. అయినప్పటికీ సాధారణ ముస్లింలు ఎస్సీల గురించి ‘ధేడ్’,
‘చంబార్’ అని తక్కువచేసి మాట్లాడుకుంటారు. మాదిగ సామాజికవర్గం గురించి మాల
సామాజికవర్గం అలానే అనుకుంటుంది. మాదిగ సామాజికవర్గం తనకన్నా కిందవున్న కులాల
గురించి అలానే అనుకుంటుంది. చివరకు బ్రాహ్మణ సామాజికవర్గాల్లోనూ నియోగుల గురించి
వైదీకులు అలా తక్కువ చేసి మాట్లాడుకుంటారు. ఇది కుల వ్యవస్థ లక్షణం.
6.
హిందూ సమాజం ముస్లింలను మొత్తంగా ఒక
కులంగా చూస్తుంది. ఆకోణంలో చూస్తే మొత్తం ముస్లింలను సాంస్కృతికంగా వెనుకబడిన తరగతులుగా
పరిగణించాలి. ఇది ముస్లింలకు బాహ్యాత్మక సమస్య. అంతర్గతంగా ముస్లిం సమాజంలో కుల సమస్య
లేదనే చెప్పవచ్చు. సయ్యద్, పఠాన్, బేగ్, షేఖ్, షరీఫ్ వగయిరాలు ఇంటి పేర్లు మాత్రమే. ఆ సమూహాల మధ్య కంచం పొత్తువుంది; మంచంపొత్తు వుంది.
నూర్ బాషా, లద్దాఫ్, దూదేకుల తదితర ముస్లిం సమూహాలను పైన చెప్పిన ముస్లీం సమూహాలు చిన్నచూపు
చూడడం వాస్తవం. ఈ తారతమ్యాలకు ఏమాత్రం ధార్మిక సమర్ధనలేదు. అయితే, ఆచరణ వుంది.
7.
గ్రామాల్లో సాధారణంగా హిందూ యజమాని
కులాలు భూస్వాములుగా, హిందూ శ్రామికకులాలు వ్యవసాయ కూలీలుగా వుంటారు. ఇలా ఉత్పత్తి
విధానం ప్రాతిపదికగా కుల రూపంలో సాగే ఆర్థిక దోపిడి భారత ముస్లిం సమాజంలో వుండే అవకాశమేలేదు.
ఇటీవల కొన్ని ధార్మిక సంస్థలు (జమాత్ లు) ముస్లిం సమాజంలోని విభిన్న సామాజికవర్గాల మధ్య సాంస్కృతిక తారతమ్యాలను
రూపుమాపడానికి ప్రత్యేకంగా కృషిచేస్తున్నాయి.
మసీదులు, దర్గాలు, ఈద్గాల నిర్వహణలో నూర్ బాషా, లద్దాఫ్, దూదేకుల్ని కూడ భాగస్వాముల్ని
చేస్తున్నారు. భారత ముస్లింల సమస్య ప్రధానంగా మతపరమైనది. వారిది మెజార్టీ, మైనార్టీ
సమస్య.
8.
మనం ఒక సమూహం పక్షాన నిలబడేది అది అంతర్గతంగా గొప్ప ఆదర్శమైనదని భావించడంవల్ల
కానేకాదు. ఆ సమూహం మీద బయటి నుండి ఒక అణిచివేత సాగుతున్నందుకు, అది అణగారిన
సమూహంగా వుంటున్నందుకు, దాని ఉనికే పెద్ద సంక్షోభంలో పడిపోయినందుకు దాని పక్షాన నిలబడుతాము.
9.
నయా మనువాద నియంతృత్వ సమాజంలో భౌగోళిక జాతీయవాదానికి (Geographical Nationalism), సాంస్కృతిక
జాతీయవాదానికి (Cultural Nationalism) మధ్య ప్రధాన వైరుధ్యం వుంటుంది. ఈ సమాజంలో మార్పు కోరేవాళ్ళు
ముందుగా పరిష్కరించాల్సింది ఈ
వైరుధ్యాన్నే.
10. స్వాతంత్ర్యం వచ్చిన
కొత్తలో భారత రాజకీయార్థికరంగాల్లో భౌగోళిక జాతీయవాదం ముందంజలోనూ సాంస్కృతిక
జాతీయవాదం కొంచెం వెనుకంజలోనూ వుండేవి. కులమతాలు పౌరుల వ్యక్తిగత (ప్రైవేటు) వ్యవహారంగా వుండాలనే ఆలోచనలది
పైచేయిగా వుండేది. దేశప్రజలకు లౌకిక
ప్రజాస్వామిక రాజ్యాంగం ఒక కొత్త మార్గదర్శిగా
నిలిచేది. విద్యా ఉపాధి పరిపాలన రంగాల్లో తగిన ప్రాతినిథ్యం
దక్కని సమూహాలు ఎన్నికల ప్రక్రియ ద్వార ప్రభుత్వాల మీద రాజకీయ వత్తిడి తెచ్చి తమ కోసం
ఉద్దీపనచర్యల్ని సాధించుకోవడానికి అవకాశాలు
వుండేవి.
11. వామపక్షాలు, నక్సలైట్ ఉద్యమాల ప్రభావం కారణంగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లో
ప్రజాసంక్షేమం అనేది ఒక విలువగా కొనసాగేది. ఇందిరాగాంధి భూసంస్కరణలు, గరీబీహటావో, బ్యాంకుల జాతియీకరణ, ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావుల చౌకబియ్యం, జనతావస్త్రాలు పథకాలు అలావచ్చినవే.
12. ప్రస్తుతం సాంస్కృతిక
జాతీయ వాదానికి ప్రధాన రాజకీయ వేదికగా వుంటున్న భారతీయ జనతా పార్టి సహితం తన ఆరంభ దశలో
‘గాంధీయ’ సోషలిజం అని నినదించేది.
13. ఏ చారిత్రక దశలో అయినాసరే
సమాజంలో ఒకే భావజాలం వుండదు. ఒక నిర్ధిష్ట దశలో కొన్ని
భావాలు బలంగావుంటే మరికొన్ని భావాలు బలహీనంగా వుంటాయి. దశ మారినపుడు వీటి ప్రభావాలూ స్థానాలూ మారిపోతాయి. సాధారణంగా మనుషులు తాము నమ్మే భావజాలం ఒక్కటే సమాజంలో
వుంటున్నట్టు ఒక భ్రమకు గురవుతుంటారు. వాళ్ళు ఇతర భావజాలాల ఉనికిని గుర్తించరు.
14. ఏ చారిత్రక దశలో అయినాసరే
ఆధిపత్యంలోవున్న భావజాలమే తన కాలాన్ని శాసిస్తుంది.
15. స్వాతంత్ర్యం వచ్చే నాటికి
కాంగ్రెస్ లోపల గాంధీజీ, పటేల్, కాంగ్రెస్ బయట సావర్కర్, హెగ్డేవార్,
గోల్వాల్కర్ వంటి భిన్న స్రవంతులకు చెందినవారు వున్నప్పటికీ మొత్తమ్మీద 'నెహ్రూ మార్కు సామ్యవాద భావాలు’ బలంగా వుండేవి. అలాకాకుంటే రాజ్యాంగ
సభలో మతసామరస్య, ప్రజాస్వామిక రాజ్యాంగం ఆమోదాన్ని పొందేదికాదు.
16. త్రివర్ణ పతాకంలోని
రంగులకు ఇప్పుడు వేరే అర్థాలు చెపుతున్నారుగానీ, తొలిదశలో అది హిందూ, ముస్లిం,
క్రైస్తవ సమూహాల మతసామరస్య చిహ్నంగా
వుండేది. తరువాతి కాలంలో అశోకచక్రం ద్వార అందులో బౌధ్ధాన్ని కూడ చేర్చారు.
17. మతసామరస్య రాజ్యాంగాన్నేకాకుండ; త్రివర్ణ పతాకాన్ని సహితం వ్యతిరేకించిన వారు ఆనాడూ వున్నారు. వాళ్ళ హృదయాలలో మనువు వుండేవాడు. అప్పుడు ఆ శక్తులు
విన్నర్స్ కాకుండ రన్నర్- అప్ గా మాత్రమే వున్నాయి. ఇప్పుడు ఆ శక్తులు బలపడ్డాయి. చారిత్రక దశ తలకిందులు అయింది.
18. 1990వ దశాబ్దంలో ప్రపంచ రాజకీయార్థికరంగాలు
పెద్ద కుదుపుకు గురయ్యాయి. బౌధ్ధికరంగంలో అప్పటివరకు కొనసాగిన విలువలు
తలకిందులయ్యాయి. తూర్పుయూరప్ లో సామ్యవాదభావాలు బీటలువారాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. వీటి ప్రభావం చాలా వేగంగా భారతదేశం మీద పడింది.
19. 1990 చివర్లో అప్పటి బిజెపి అధ్యక్షులు ఎల్
కే అడ్వాణీ చేపట్టిన రామ్ రథయాత్రను, 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం
ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాన్ని కొత్త చారిత్రక దశకు ఆరంభంగా
భావించవచ్చు.
20. అప్పటి వరకు ప్రైవేటు
వ్యవహారంగావుంటున్న కులమతాలు పబ్లిక్ వ్యవహారంగా మారిపోయాయి. మరోవైపు, పబ్లిక్ రంగంలో
ప్రైవేటైజేషన్ ప్రవేశించింది.
21. సంక్షేమంకన్నా సంస్కృతి
ముఖ్యం అనే వాదాలు బలంగా ముందుకు వచ్చాయి.
22. భౌగోళిక జాతీయవాదాన్ని
సాంస్కృతిక జాతీయవాదం అధిగమించింది. మధ్యయుగాల్లో జరిగినట్టు పరిపాలన విభాగాన్ని మెజారిటీ మతం శాసించడం
మొదలుపెట్టింది.
23. ఆర్థికరంగంలో ‘పేదల నుండి
సంపన్నులకు రక్షణ’(!), సాంస్కృతిక రంగంలో ‘అల్పసంఖ్యాకుల నుండి
అధికసంఖ్యాకులకు రక్షణ’(!) అనే విపరీత ధోరణులు విజృంభించాయి.
24. ప్రజాసంక్షేమం అనే నినాదం
వెనక్కి వెళ్ళిపోయింది; కార్పొరేట్ల సంక్షేమం అనే నినాదం బలంగా
ముందుకు వచ్చింది. మనదిప్పుడు అంబా సాంస్కృతిక విధానం; అంబానీ ఆర్థిక విధానం.
25. 13వ శతాబ్దం ఆరంభం నుండి 19వ శతాబ్దం మధ్యకాలం వరకు
ఢిల్లీని కేంద్రంగా చేసుకుని ముస్లిం సుల్తానులు భారత ఉపఖండాన్ని పాలించారు.
భారతదేశాన్ని వలసగా మార్చుకోవడానికి వచ్చిన ఫ్రెంచి, డచ్చి, బ్రిటీష్ కంపెనీ
సైన్యాలను ఎదుర్కొని భీకరంగా పోరాడిన వాళ్ళలో అత్యధికులు ముస్లిం రాజులే.
26.
1857లో సిపాయిల తిరుగుబాటు విఫలం
అయ్యాక, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా
జాఫర్ ను బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బందీని చేసి రంగూన్ జైలుకు పంపించింది. సర్
సయ్యద్ అహ్మద్ ఖాన్ చెప్పినట్టు ఆ తరువాత భారత ముస్లింల చరిత్ర అంతా “పరాజితుల
ఆక్రందన”గా సాగింది.
27. మధ్యయుగాల్లో
ముస్లిం రాజులు చేసిన తప్పులకు వాళ్ళ సంతతిని కార్పొరేట్ల యుగంలో కఠినంగా
శిక్షిస్తాం అనే వికృత వాదనలు కూడ ఇప్పుడు
వినిపిస్తున్నాయి.
28. నయామనువాద భావజాలంతో
ముస్లింలను నడిరోడ్డు మీద చుట్టుముట్టి నరికి చంపినా తప్పుకాదనే ధోరణి పెరిగింది. దీనికి
లించింగ్, మూకోన్మాదం అనే ముద్దుపేర్లు కూడ వున్నాయి.
29. గత మూడు దశాబ్దాలుగా
మనదేశంలో చెలరేగుతున్న ఈ భావజాలాల్ని రెండు పాయలుగా వర్గీకరించవచ్చు. వీటిల్లో మొదటివి; ముస్లింలను ‘అన్యులు’గా చిత్రిస్తుంటాయి. రెండోవి; ముస్లింలను నిర్లక్ష్యం చేస్తుంటాయి. వాళ్లను అస్సలు పట్టించుకోవు.
30. ఆధునిక రాజకీయ
స్రవంతుల్లో ముస్లిం ఆలోచనాపరులు కాంగ్రెస్ కన్నా కమ్యూనిస్టు పార్టిని ఎక్కువగా నమ్ముకున్నారు. భారత
కమ్యూనిస్టు పార్టి వ్యహస్థాపనలో ముజఫ్ఫర్ అహ్మద్, మౌలాన హస్రత్ మోహానీ, కాజీ నజ్రుల్ ఇస్లాం తదితరులు
కీలక భూమిక నిర్వహించారు. అంతకు ముందే తాష్కెంట్ లో ఏర్పడిన భారత కమ్యూనిస్టు
పార్టీలోనూ ముస్లింలదే కీలకపాత్ర.
31. అభ్యుదయ రచయితల
ఉద్యమంగా పిలిచే అంజుమన్ తరక్కీ పసంద్ ముస్సనఫీన్ – ఏ - హింద్ సభ్యుల జాబితాను చూడండి. ప్రేమ్ చంద్, రాజిందర్
సింగ్ బేడి, అమృతా ప్రీతమ్, కిషన్ చందర్, వంటి ఓ పదిమంది తప్ప మిగిలిన 90 మందీ ముస్లింలే.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి మేధోసరోవరంగా నిలిచిన కామ్రేడ్స్ అసోసియేషన్ లోనూ రాజ్
బహద్దూర్ గౌర్, దేవులపల్లి వేంకటేశ్వర రావు వంటి ఓ నలుగురైదుగురుతప్ప మిగిలిన
వాళ్ళందరూ ముస్లింలే.
32. సామ దాన బేధోపాయాలకన్నా
క్రూరమైన ఉపాయం నిర్లిప్తం. ముస్లింల మీద వామపక్షాలు నిర్లిప్త
ఉపాయాన్ని బలంగా ప్రయోగించాయి. అలా అవి ముస్లింలను
కాంగ్రెస్ కు టోకుగా అప్పచెప్పాయి.
33. ఎన్నోమహత్తర
పోరాటాలు, ఉద్యమాలను నడిపిన కమ్యూనిస్టు నాయకులు కులం మతం దగ్గరికి వచ్చే సరికి
భయంతో వణికిపోయారు. వామపక్షాలు ముస్లింలను అసలు పట్టించుకోక అన్యాయం చేస్తే కాంగ్రెస్ ముస్లింలను పట్టించుకుంటున్నట్టు నటించి
మోసం చేసింది.
34. బిజెపిది ప్రత్యక్ష
సాంస్కృతిక జాతీయవాదం అయితే ఇతర పార్టిలది పరోక్ష సాంస్కృతిక జాతీయవాదం.
35. మన సమాజంలో ‘ప్రగతిశీలురు’గా చెలామణి అవుతున్నవారు సహితం ముస్లిం సామాజికవర్గాలకు చేసిన చేస్తున్న హాని
తక్కువదేమీకాదు. ముస్లింలు మతఛాందసులనీ, అంతర్ముఖ సమూహం అనీ, ఇంట్రావర్ట్ కమ్యూనిటీ అనీ, సామాజిక అంశాల్ని పట్టించుకోరని నిందలేసేవారికి కొదవలేదు.
36. ‘సెక్యూలరిజం-హిందూత్వ
రాజకీయాలు’ అనే ప్రసంగ పాఠంలో వరవరరావు ఒక
గొప్ప అనుభవాన్ని పంచుకున్నారు. “మేము చదువుకునేటప్పుడు హైదరాబాద్ ఉస్మానియా
యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజిలోని ప్రొఫెసర్లంతా ముస్లింలే. అటువంటిది ఇప్పుడక్కడ
ప్రెఫెసర్లు కాదుకదా ఒక స్టూడెంట్ కూడ లేడు”
(తెహ్ జీబ్ పేజీ 158)
37. సాంస్కృతిక జాతీయవాద
రాజ్యం ముస్లింలను సమస్త రంగాల్లోనూ
అణిచివేసిందనే వాస్తవాన్ని కొందరు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఆధునిక విద్య మీద ఆసక్తి లేకపోవడంవల్లే
భారత ముస్లిం సమాజం వెనుకబడిపోయిందనే వాదనల్ని ముందుకు తెస్తున్నారు. ఇది చరిత్రను తలకిందులుగా చిత్రించడం. ఇలాంటి
తలకిందులు ఆలోచనలు కొందరు ముస్లిం ఆలోచనాపరుల్లోనూ మనకు కనిపిస్తుంటాయి.
38. అయితే, ముస్లింల మీద జాలి చూపుతున్న భావజాలాలు కూడ కొన్నున్నాయి. వీటిల్లో కొన్ని; ముస్లింలు తమ మతాన్ని వదులుకోవాలి అంటూ ఒక షరతు విధిస్తున్నాయి. ఇంకొన్ని; ముస్లింలు హిందూమతాన్ని స్వీకరించాలి అంటున్నాయి. లేదా హిందూ మత సమూహానికి ముస్లింలు లొంగివుండాలి అంటున్నాయి. మరికొందరు ఇటీవల ముస్లింలు బౌధ్ధమతాన్ని స్వీకరించాలి అంటున్నారు. వీళ్లు శ్రీలంక, మయన్మార్ ల నుండి కొత్త ఉత్తేజాన్ని
పొందినట్టున్నారు.
39. ఎవరు ఎన్నిరకాలుగా చెప్పినా
వీళ్ళందరి అభిప్రాయం ఒక్కటే; ముస్లింలు ముందు తమ అస్తిత్వాన్ని
కోల్పోవాలి. ఇది వీళ్ళు పెడుతున్న ప్రీ-కండీషన్ !
40. ముస్లింలు ఇస్లాంను
వదులుకోవాలని నయా మనువాదులు చేస్తున్న వాదననే ఈ ప్రగతిశీలురు దొడ్డిదారిన ముందుకు
తెస్తున్నారు.
41. మత అల్పసంఖ్యాకుల
మీద సాంస్కృతిక జాతీయవాదులు సాగిస్తున్న నిర్బంధాన్నే భౌగోళిక జాతీయవాదులూ
ప్రయోగిస్తున్నారు.
42. ఇస్లాంను వదులుకుంటే
ముస్లింలు తమ అస్తిత్వాన్నే కోల్పోతారనే చిన్న లాజిక్ మన ప్రగతిశీలురకు ఇప్పటికీ
అర్థం కావడంలేదు. బహుశ వాళ్ళు అర్థం చేసుకోదలచలేదు. Muslims without Islam may become
something else but not Muslims.
43. కార్పొరేట్ రాజ్యం
ఎలాగూ కార్పొరేట్ల సేవలో తరిస్తుంటుంది. శ్రామికుల సహకారంలేకుండ ఇది సాధ్యం కాదు. శ్రామికులతో కూడ ఒక భావోద్వేగంతో కార్పొరేట్ల
సేవలు చేయించాలంటే దానికి మతం చాలా అవసరం అవుతుంది.
44. సాంస్కృతిక జాతీయవాద
నియంతృత్వం రెండు అంచెల విధానాన్ని పాటిస్తుంది. అది సాంస్కృతిక రంగంలో మైనార్టీ
మతసమూహాలను బూచీలుగా చూపించి మెజార్టీ
మతసమూహాన్ని సమీకరిస్తుంది. ఆర్థికరంగంలో మెజార్టీ మతసమూహపు శ్రామికుల చేత ఒక ఉన్మాదంతో
కార్పొరేట్ల సేవలు చేయిస్తుంది.
45. ప్రస్తుతం ‘బహుజనులు’గా కొనసాగుతున్న ‘బిసి’
సమూహాల్లో భావోద్వేగంతో కూడిన రాజ్యసేవల్ని మనం స్పష్టంగా చూడవచ్చు. సరిగ్గా ఇదే
మతతత్వ నియంతృత్వం ఆశించే ఇహలోక (లౌకిక) ప్రయోజనం.
46. గుజరాత్ అల్లర్ల
సమయంలో హిందూ మత సమాజంలోని అనేక శ్రామిక సమూహాలు ఇలాంటి భావోద్వేగంతోనే నరమేధంలో
పాల్గొని రాజ్య సేవలో తరించాయి.
47. సాంప్రదాయ మతం పరలోక
శాంతిని కోరుకుంటుంది. మతతత్వం ఇహలోకంలో ఒక ఉన్మాదంతో కార్పొరేట్ల సంపదను
పెంచుతుంది. కరోనా కాలంలోనూ భారత కార్పొరేట్లు ప్రపంచ స్థాయి ఐశ్వర్యవంతులుగా
ఆవిర్భవించడాన్ని మనం చూస్తున్నాం.
48.
అయితే, ఈ ఉన్మాదం, బ్రాంతి, చిత్త ప్రవృత్తి, భావోద్రేకాలు ఎక్కువ కాలం వుండవు. ప్రపంచంలో ప్రతిదానికీ ఒక
ముగింపు వున్నట్టు దీనికీ ఒక ముగింపు వుంటుంది.
49. ఇటలి మెజార్టీ
సమూహంలోని శ్రామిక జనంలో 1922లో మొదలయిన ఈ
భ్రాంతి ఇరవై యేళ్ళకు తొలిగిపోయింది. జర్మనీలో ఇది 1934లో మొదలై పదేళ్ళు
మాత్రమే వుంది. భారతదేశంలో ఏడేళ్లుగా కొనసాగుతున్న ఈ భ్రాంతి సమీప భవిష్యత్తులో తొలిగిపోతుంది.
50. మారడం సమాజ లక్షణం.
అయితే అది తనంతట తాను మారదు. సమాజం అంటే మనుషులే కనుక మనుషులే దాన్ని మార్చాల్సి వుంటుంది. Subjective effort. పిల్లలు సహజంగానే పుడతారుగానీ పురుడుపోయడానికి
ఒక మంత్రసాని కూడ కావాలి.
51. సాంస్కృతిక
జాతీయవాదం భౌగోళిక జాతియోద్యమాన్ని గుర్తించదు. హిందూ ముస్లింలు కలిసి బ్రిటీష్ వలస పాలకులకు
వ్యతిరేకంగా పోరాడడం మహత్తర విషయం అని అది ఏమాత్రం అనుకోలేదు. వీర్ సావర్కర్ వంటి
సాంస్కృతిక జాతీయవాదులు కొందరు మొదట్లో బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాల్లో
పాల్గొన్నప్పటికీ తరువాతి కాలంలో
జాతియోద్యమానికి పూర్తిగా దూరంగా వున్నారు.
52. హిందూ మతరాజ్యం కోసం
పోరాడడం మాత్రమే జాతియోద్యమం అని సాంస్కృతిక జాతీయవాదులు బలంగా భావిస్తారు.
దానికోసం వలస పాలకుల సహకారాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు సిధ్ధం. భౌగోళీక
జాతియోద్యమానికి నాయకత్వం వహించినందుకే వాళ్ళకు గాంధీజీ మీద అంతులేని ద్వేషం.
53. ముందుగా ఈ నేరేటివ్
అర్థం కాకపోతే సాంస్కృతిక జాతీయవాదులు అమెరికా, ఇజ్రాయిల్ లతో జట్టుకట్టడానికి
అంతగా ఎందుకు ఆసక్తి చూపుతున్నారో ఎప్పటికీ అర్థం కాదు.
54. మతవిశ్వాసానికీ,
మతతత్వానికీ తేడా మన కాలపు ఆలోచనాపరులు చాలామందికి తెలీదు.
55. మత భావనలు అలౌకికమైనవి. కానీ, మతవాదాలు లేదా మతతత్వాలు లౌకికమైనవి.
56. మతానికి అలౌకిక తపనవుంటే, మతతత్వానికి లౌకిక ప్రయోజనం వుంటుంది.
57. ధార్మిక,
ప్రజాస్వామిక రంగాల్లో ‘లౌకిక’ అనే పదం చాలా కాలంగా ఒక బ్రహ్మపదార్ధంగా కొనసాగుతోంది.
58. రాజకీయార్ధిక
రంగాలలో తన ప్రయోజనాలను నెరవేర్చి పెట్టడానికి అనువుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య
వ్యవస్థను పెట్టుబడీదారీ వ్యవస్థ రూపొందించుకుంది. ప్రజాస్వామ్యం పనితీరుకు లౌకిక
అనే ఒక కొలమానాన్ని పెట్టింది. దైవ ప్రసన్నం
కోసం కాకుండ దేశ ప్రయోజనాల కోసం పార్లమెంటు
పని చేయాలనేది దీని తొలి భావన. దేశ
ప్రయోజనం అంటే పెట్టుబడీదారుల ప్రయోజనం మాత్రమే అనేది దీని మలి భావన.
59. సెక్యూలర్ ఇంగ్లీషు
పదానికి లౌకిక నుండి లౌక్యం వరకు అనేక అర్థాలున్నాయి. మతాతీత, మతరహిత, ఐహిక,
ఇహలోక, ప్రాపంచిక, సర్వమత, మతసామరస్య వగయిరా భావనలన్నీ ఈ వరుసలోనివే. విభిన్న మత
సమూహాలు నివశిస్తున్న దేశంలో రాజ్యానికి మతం వుండరాదనేది దీని ప్రధాన ఆదర్శం.
60. భారత ముస్లింల
నిఘంటువులో లౌకిక అంటే మతసామరస్యం అని
అర్థం.
61. ప్రభుత్వం జనాభా
దామాషాగా మతాన్ని ప్రోత్సహించాలి అనే తప్పుడు అర్థంలో భారతదేశంలో సెక్యూలర్ భావన చాలాకాలం కొనసాగింది. ప్రభుత్వం ముస్లింలకు
శుక్రవారం, క్రైస్తవులకు ఆదివారం కేటాయించేస్తే వారంలో మిగిలిన ఐదు రోజులు హిందువులకు
కేటాయించుకోవచ్చు. దేశ విభజన సందర్భంగానూ ఇలాంటి లౌకిక సూత్రం పనిచేసిందనే వాదనలూ
వున్నాయి. ఓ నాలుగు రాష్ట్రాలు ముస్లింలకు ఇచ్చేస్తే మిగిలిన రాష్ట్రాలు
హిందువులకు కేటాయించడం!.
62. వర్గం సర్వాంతర్యామి.
Omnipresent. వర్గంలేని వ్యవస్థలు వుండవుగాక వుండవు.
కుల, మత, తెగ, లింగ, భాష తదితర వ్యవస్థలు
అన్నింటిలోనూ వర్గం వుంటుంది.
63. “ఇప్పటి వరకు మనకు
తెలిసిన చరిత్ర అంతా వర్గపోరాటాల చరిత్రే” అనే వాక్యంతో ఆరంభం అవుతుంది కమ్యూనిస్టు ప్రణాళిక. మార్క్స్ రచనల్లో మతం అంత ప్రధానమైన అంశం కాదు. పైగా
వర్గ సమాజంలో మతం ఒక సానుకూల కార్యాన్ని
నిర్వహిస్తుందని కూడ అన్నాడు. “దిక్కులేనివారికి ఒక నిట్టూర్పు”, హృదయంలేని సమాజానికి ఒక హృదయం’ అన్నాడు. ఆ
సందర్భంలో మతం ఒక మత్తు; ఒక మందు (ఓపియం) అన్నాడు. పెట్టుబడీదారీ వ్యవస్థలో సమస్త
రంగాలలో వర్గ పోరాటం చేయాలనే కమ్యూనిస్టు
ప్రణాళిక తొలి ఆదేశాన్ని వదిలేసి మతవ్యవస్థతో మాకు పనిలేదనే కమ్యూనిస్టు నాయకుల విజ్ఞతను
నడిరోడ్డు మీద నిలదీయాల్సిందే.
64. పునాది ఉపరితలాలు
విడిగా అస్తిత్వంలో వుండవు. అవి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తూ నిరంతరం ఒక
అన్యోన్య సంబంధంలో వుంటాయి.
65. పునాది అంశాల్లోనేగాక
ఉపరితల అంశాలైన కళాసాహిత్య రంగాల్లోనూ వర్గం వుంటుందని 20వ శతాబ్దం ఆరంభం నాటికే మాక్సిం గోర్కి వంటివారు స్పష్టం
చేసేశారు. “రచయితలారా! మీరు ఎటువైపు” అని నిలదీశారంటేనే సాంస్కృతిక
వ్యవస్థలోనూ వర్గం వుంటుందనేగా అర్ధం? సాంస్కృతిక వ్యవస్థలో మతం కూడ
వుంటుంది.
66. భారతదేశపు కమ్యూనిస్టు
సిధ్ధాంతవేత్తల్లో అనేకమందికి కమ్యూనిస్టు ప్రణాళికలోని తొలి వాక్యమే సరిగ్గా జీర్ణంకాలేదు.
ఆర్థిక వ్యవస్థలోనేగాక మతవ్యవస్థలోనూ యజమాని మతసమూహాలు, శ్రామిక మతసమూహాలు వుంటాయని గుర్తించడానికి వాళ్లకు గుండెలు
సరిపోలేదు. మత అంశాన్ని ముట్టుకునే సాహసం చేయలేకపోయారు. కమ్యూనిస్టులకు కులమతాలుండవంటూ గడుసుగా తప్పించుకునేందుకు
కొన్ని తప్పుడు వాదనల్ని ముందుకు తెచ్చారు. ఇది మేధో అపచారం మాత్రమేకాదు మార్క్స్ కు కూడ తీవ్ర అపచారం.
67. కమ్యూనిస్టు
ఆలోచనాపరుల్లో కొందరు గతంలో కులమతాల గురించి మాట్లాడి వున్నారుగానీ అది ఎన్నడూ పార్టి
లైన్ కాదు. అవి వినిపించీ వినిపించని అసమ్మతి రాగాలు మాత్రమే. కుల, మతాల
అస్తిత్వాల గురించి గట్టిగా మాట్లాడిన వారిని కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు అతి జుగుప్సాకరంగా
వేధించాయి. పార్టీ లైన్ ని మాత్రమేకాదు మార్క్సిస్టు పంథాను కూడ తప్పారంటూ వారిని
బయటికి పంపించివేశాయి. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు కూడ దీనికి మినహాయింపుకాదు. ఎస్సీలు,
బిసిలు, మైనారిటీలు, ఆదివాసులు చాలా వరకు బయటికి వెళ్ళిపోతుంటే ఈ పార్టీలు కొన్ని ప్రాణరక్షణ
చర్యలు మొదలెట్టాయిగానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది.
68. కమ్యూనిస్టు
సిధ్ధాంతవేత్తలు కులమతాల్ని పాటించకపోవచ్చు. కానీ సమాజంలో కొనసాగుతున్న కులమతాల మీద వారు ఏనాడో ఒక వర్గ విశ్లేషణ జరిపివుండాల్సింది.
69. వర్గ వ్యవస్థలో
యజమానివర్గం, శ్రామిక్వర్గం వున్నట్టు కుల వ్యవస్థలో యజమాని కులాలు, శ్రామిక
కులాలు వుంటాయనీ, మత వ్యవస్థలోనూ యజమాని మతాలు, శ్రామిక మతాలు వుంటాయని తేల్చి
వుండాల్సింది. కమ్యూనిస్టు పార్టీలు ఆ పని
చేయకపోవడంతో మతవ్యవస్థను అర్ధం చేసుకోవడంలో ఒక మేధో
ప్రతిష్టంభన కొనసాగింది. ఇలాంటి మేధో ప్రతిష్టంభన
కారణంగా దేశంలో వర్గపోరాటాల వుధృతి
క్రమంగా తగ్గిపోయింది.
70. మనం తక్షణం
చేయాల్సిన పనేమంటే సమాజంలో కొనసాగుతున్న అణిచివేతలు అన్నింటి సమగ్ర జాబితా ఒకటి సిధ్ధం
చేయాలి. వర్గ అణిచివేత, కుల అణిచివేత, మత అణిచివేత, తెగ అణిచివేత, లింగ అణిచివేత వగయిరాలు.
ఇలాంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రతి సమూహం తన మీద సాగుతున్న అణిచివేతను మాత్రమే గుర్తించి మిగిలిన సమూహాల
మీద సాగే అణిచివేతల్ని నిరాకరిస్తోంది. సమస్త అణిచివేతల నిర్మూలన నేటి ఎజెండ
కావాలి.
71. ఫూలే ‘ఆర్య-బ్రాహ్మణ
సమాజం’ అన్నాడు, అంబేడ్కర్ ‘హిందూ మతరాజ్యం’ అన్నాడు. ఫూలే - అంబేడ్కరిస్టులుగా
ప్రకటించుకుంటున్న కొందరు ప్రముఖులు సహితం వర్తమాన భారత సమాజానికి కుల, వర్గ, మత స్వభావం
వుంది అనడానికి సిధ్ధంగాలేరు. కమ్యూనిస్టులు వర్గం దగ్గరే ఆగిపోతే ఫూలే - అంబేడ్కరిస్టులు
కులం దగ్గర ఆగిపోతున్నారు. సమాజంలో మత అణిచివేతను గుర్తించడానికి
భయపడుతున్నారు. ఇలాంటి ధోరణి ఫూలేఇజం,
అంబేడ్కరిజంలకు వ్యతిరేకం. దుర్గం సుబ్బారావు, జిలుకర శ్రీనివాస్, గుంటూరు
లక్ష్మీన్రసయ్య, పసునూరి రవీదర్ వంటి కొందరు మాత్రం దీనికి మినహాయింపు.
72. మరోవైపు, దేశంలో సాంస్కృతిక జాతీయవాదం మత ప్రాతిపదిక మీద వేయితలల
మహాసర్పంలా పెరిగిపోయింది. దీనివల్ల శ్రామిక మతసమూహాలైన ముస్లింలు, శిక్కులు, క్రైస్తవులు భారీగా నష్టపోయారు. ఈ పాపంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కమ్యూనిస్టు
సిధ్ధాంతవేత్తలకు ఎంతో కొంత భాగం వుంది.
73. భారత మార్క్సిస్టు శిబిరంలో
మతవ్యవస్థను వర్గ విశ్లేషణ చేసి, అప్పటికి 60 యేళ్ళుగా కొనసాగుతున్న మేధో
ప్రతిష్టంభనను బద్దలుగొట్టిన మేధావి కే. వి. రమణారెడ్డి. 1985 నాటి విరసం గద్వాల పాఠశాలలో వారి ప్రసంగ
వ్యాసం ‘మతవర్గతత్వం సమీక్ష’ మార్క్సియన్ సామాజిక విశ్లేషణలో ఒక మహత్తర ఆవిష్కరణ.
74. ”ఏ మతవర్గ తత్వానికైనాసరే, మతమనే దానిలోనే మూలం వుందనుకోవడం అసమంజసం” అనే ప్రకటనతో మొదలవుతుంది ఆ వ్యాసం. “(సాంస్కృతికజాతీయవాదంవల్ల) లాభపడేదల్లా హిందూవుల్లోని అస్తిపరవర్గాలే. ప్రచారానికీ ప్రభావానికి పనికి వచ్చింది మాత్రం (హిందూవుల్లోని) అల్పమధ్యతరగతి నజ్జు మాత్రమే” “సాంస్కృతిక జాతీయవాదం కమ్యూనిస్టులకు వ్యతిరేకం; అమెరికా సామ్రాజ్యవాదానికి
అనుకూలం” వంటి అమూల్యమైన ఆవిష్కరణలు ఈవ్యాసంలో వున్నాయి. అప్పటినుండి నేను కేవిఆర్ ను భావోద్వేగ అభిమానంతో ‘1000 KV యార్’ అనేవాడిని.
75. ఆ తరువాతి కాలంలో కే.
బాలగోపాల్, వరవరరావు అణగారిన మత సమూహమైన ముస్లిం సామాజికవర్గం మీద గొప్ప సానుకూల వైఖరితో
వ్యవవహరించారు. ఈ ఘనత విరసంది. అందుకు ఆ ముగ్గురికీ, విరసంకు
మరొక్కమారు ధన్యవాదాలు.
76. ‘మతవర్గతత్వం సమీక్ష’ వ్యాసం సాంప్రదాయ కమ్యూనిస్టు సమూహాల్లో ఇప్పటికీ గొంతు దిగలేదు. వామపక్ష
అభిమానుల్లో ఇంకా పాత వాదనలు చేసేవారే ఎక్కువ మంది వున్నారు. వాళ్ళు వర్గాన్ని
మాత్రమే గుర్తిస్తారు. కుల వ్యవస్థలో వర్గాన్ని గుర్తించడానికి సుముఖంగా వుండరు. మత
వ్యవస్థలో వర్గాన్ని గుర్తించడానికి మరీ ఇబ్బంది పడిపోతారు.
77. మనది వర్గ కుల మత
తెగ లింగ తదితర అణిచివేతల సమాజం అని అర్థం
చేసుకోలేనివారు ఎన్నటికీ ఈ సమాజాన్ని మార్చలేరు. అలాంటి వారిని మనం
పట్టించుకోవాల్సిన పనిలేదు.
78. పీడిత సమూహాల
ఐక్యతకు సైధ్ధాంతిక ఐక్యత ఒక ముందస్తు షరతు.
79. సమస్త
వ్యవస్థల్లో వర్గం వుంటుందని
గుర్తించడమేగాక ఏ వ్యవస్థలో అయినా సరే అణిచివేతకు గురవుతున్న వాళ్ళ పక్షాన
నిలబడాలని ఒక విధానపరంగా భావించేవారే
పీడిత సమూహాల మిత్రులు.
80. వర్తమాన భారత
మతవ్యవస్థలో ముస్లింలను శ్రామిక మత సమూహంగా గుర్తిస్తున్నారా? లేదా? అని రాజకీయ పార్టిలు,
ఉద్యమ సంస్థలు, సామాజిక కార్యకర్తల్ని నిలదీయండి. సమాధానం సానుకూలంగా వుంటేనే
వాళ్ళు మన మిత్రులు.
81. సమాజాన్ని
మార్చడానికి పార్లమెంటరీ మార్గం రక్తరహితమనీ, విప్లవమార్గం రక్తసహితమనే నేరేటివ్ చాలా
మందిలో వుంటుంది. నిజానికి పార్లమెంటరీ విధానం కూడ రక్తపాత యుధ్ధం తరువాతనే
ఏర్పడింది. అనుమానం వున్నవాళ్ళు బ్రిటన్
లో ఆలివర్ క్రామ్వెల్ నాయకత్వంలో పార్లమెంటు పునరుధ్ధరణ కోసం 17వ శతాబ్దం
మధ్యలో సాగిన భీకర అంతర్యుధ్ధాన్ని పరిశీలించవచ్చు.
82. అస్తిత్వ సమూహాల అణిచివేతకు
పరిష్కారంఏమిటీ? అనే ప్రశ్న దాదాపు మూడు దశాబ్దాలుగా బలంగా
వినిపిస్తూనే వుంది. కొందరు పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గమే
మేలంటున్నారు. ఇంకొందరు సాయుధపోరాటమే శరణ్యం అంటున్నారు. అయితే, వీళ్ళిద్దరు చూపుతున్న రెండు మార్గాల్లోనూ గత ముఫ్ఫయ్యేళ్ళ ప్రొగ్రెస్ రిపోర్ట్
ఏమాత్రం ఉత్తేజకరంగా లేదు.
83. మరి టెర్రరిజం
(ఉగ్రవాదం) సంగతేమిటీ? అనేది ఈ సందర్భంలో ఎవరికయినా రావలసిన సందేహమే. టెర్రరిజం
అనేది మత అల్పసంఖ్యాకుల్ని అణిచివేయడానికి మత అధికసంఖ్యాకులకు మాత్రమే పనికి వచ్చే
ప్రక్రియ.
84. పాకిస్తాన్ ,
మయన్మార్ దేశాల్లో మనం చూస్తున్న
టెర్రరిజం మత అధిక సంఖ్యాకుల టెర్రరిజం. అమెరికాలో
కూడ ట్రంప్ కాలంలో రైట్ వింగ్ టెర్రరిజం ఊపందుకుంది.
85. ముస్లింలలో కొందరు
నిరాశ నిస్పృహలతో టెర్రరిజంనూ ఆశ్రయించాలని భావించవచ్చు. మత అల్పసంఖ్యాకులు
ఉగ్రవాదాన్ని ఆశ్రయిస్తే స్వీయ సమాజపు వినాశనం తప్పదు.
86. మత అధికసంఖ్యాకులకు
చెందిన హిందూ టెర్రరిస్టులు మహాత్మాగాంధీని హత్య చేసినపుడు ఆ టెర్ర్రిస్టుల స్వీయ
సామాజికవర్గం మీద ఊచకోతలు జరగలేదు. కానీ, మత అల్పసంఖ్యాకులయిన శిక్కు
టెర్రరిస్టులు ఇందిరా గాంధిని హత్య చేసినపుడు వేలాది మంది శిక్కుల మీద ఊచకోత
సాగింది.
87. మత అల్పసంఖ్యాక
సమూహానికి చెందిన టెర్రరిస్టులు తమ సామాజికవర్గ సమస్యల్ని పరిష్కరించిన సందర్భం ఒక్కటీలేదు. Big
NO to terrorism.
88. అన్నివైపులా ఇంతటి ప్రతికూల
వాతావరణంలో, ముస్లింలు తమ దారిని తామే వెతుక్కోవాల్సి
వచ్చింది. తమ కార్యక్రమాన్ని తామే రూపొందించుకోవాల్సి
వచ్చింది. తమ ఆందోళనను తామే చేపట్టాల్సివచ్చింది. తమ ఆందోళనా రూపాన్నీ తామే రూపొందించుకోవాల్సి వచ్చింది.
89. మూడు రంగుల జాతీయ జెండా
నీడన నిలబడి, ఒళ్ళో గాంధీజీ అంబేడ్కర్ల ఫొటోలు పెట్టుకుని, ఒక చేతితో భారత మతసామరస్య రాజ్యాంగాన్ని పట్టుకుని, ఇంకో చేతితో పిడికిలి బిగించి “న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం” అంటూ భారత ముస్లింలు నినదిస్తున్నారు.
90. “అప్పుడు కాలం కడుపుతోవుంది / కార్ల్ మార్క్స్ ను కనింది/ అదనపు విలువల కన్నపు దొంగల్ని/ కలుగుల్లోనే పట్టుకున్నాడు మార్క్స్” అన్నాడు మయకోవయోస్కీ. సరిగ్గా అదే తీరులో నయా మనువాద నియంతృత్వాన్ని దేశ రాజధాని నగరంలోనే దిగ్భందించే
ఒక వ్యూహాన్ని ముస్లిం మహిళలు కనుగొన్నారు. అదే షాహీన్ బాగ్ ఉద్యమం. It is not a
just discovery; it is an invention.
91. ‘భారత మతసామరస్య రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం’ను రూపొందించిన ఘనత భారత ముస్లిం మహిళలదే. దయచేసి ఇకముందు ఎవరూ లౌకిక పదాన్ని తేలిగ్గా
అస్పష్టంగా వాడవద్దు. మతసామరస్యం అని స్పష్టంగా వాడండి.
92. ప్రపంచ కమ్యూనిస్టు అభిమానులకు
పారీస్ కమ్యూన్ ఒక దారిని చూపినట్టు భారత అస్తిత్వ సమూహాలకు షాహీన్ బాగ్ ఒక పోరాట రూపాన్ని
అందించింది. నాలుగు నెలలుగా ఢిల్లీలో ఆందోళన సాగిస్తున్న
రైతాంగ నాయకత్వం షాహీన్ బాగ్ ఉద్యమాన్ని సగౌరవంగా తమకు “దారిచూపిన తల్లి”గా పేర్కొన్నది.
93. “మత సామరస్యం” భారత ముస్లింల సామాజిక కార్యక్రమం. “శాంతి సామరస్య భారత సమాజ నిర్మాణం’ వాళ్ళ రాజకీయ లక్ష్యం. ‘షాహీన్ బాగ్’ వాళ్ల పోరాటరూపం.
94. నయా మనువాద
నియంతృత్వానికి దేశంలో తాము ఒక్కరమే బాధితులంకాదని
ముస్లిం సమాజానికి చాలా స్పష్టంగా తెలుసు. ఆదివాసులు, దళితులు, బహుజనులు మాత్రమేగాక యజమాని కులాల్లోని పేదలు, సామాన్యులు,
తటస్తులు సహితం నయా మనువాద నియంతృత్వానికి బాధితులే. సామాజిక కార్యకర్తల్లో
సామ్యవాదులు, మానవ హక్కులు, పౌరహక్కులు, పర్యవరణ పరిరక్షణ కార్యకర్తలు సహితం
బాధితులే. ఈ జాబితా అంతటితో ముగియలేదు. ఇంకా అనేకానేక బాధిత సమూహాలున్నాయి. వీళ్ళ మధ్య ఒక సహజ అనుబంధం (organic connection)
వుంటుంది.
95. నయా మనువాద నియంతృత్వ
బాధితులందరి సమస్యలూ ఒకటి కావు; వాళ్ళ లక్ష్యాలూ ఒకటికావు. విభిన్న బాధితులు
ఎదుర్కొంటున్న సమస్యల్లో, ఎంచుకున్న లక్ష్యాల్లో
ఐక్యత మాత్రమేగాక ఘర్షణ కూడ వుందని ముస్లిం ఆలోచనాపరులు గుర్తిస్తున్నారు.
96. గమ్యాలు వేరయినా
గమనం ఒకటి కావచ్చు. సాటి అణగారిన సమూహాలందరితో సాధ్యమయినంత మేరకు కలిసి నయా మనువాద నియంతృత్వాన్ని
ధిక్కరించడమే నేటి చారిత్రక కర్తవ్యమని ముస్లిం ఆలోచనాపరులు భావిస్తున్నారు. 2024 లోక్ సభా ఎన్నికల్లో
జాతీయ ప్రజాస్వామిక (ఎన్డీయే) కూటమిని ఎలా ఓడించాలనేది వీరి ముందున్న తొలి సవాలు.
97. తక్షణ ఉమ్మడి ప్రయోజనాల
సాధన కోసం నయా మనువాద నియంతృత్వ బాధితులందరితో ఒక విశాల సంయుక్త కార్యాచరణ వేదికను
ఏర్పరచే దిశగా ఇప్పుడు ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) పనిచేస్తున్నది.
98. పార్లమెంటరీపంథా, సాయుధపోరాట పంథా, ఉగ్రవాద పంథాలు కాకుండ ఒక వినూత్న ప్రత్యామ్నాయ
మార్గం భారత రాజకీయాల్లో రావలసివుంది.
99. ఏ చారిత్రక దశలో
అయినా సరే అణిచివేతను ఎక్కువగా అనుభవిస్తున్న సమూహాలే పరిష్కారాల్ని కనుగొంటాయి. ఒక అల్పసంఖ్యాకవర్గంగా ఇప్పుడు ముస్లింల మీదే కొత్త మార్గాల్ని
కనిపెట్టాల్సిన చారిత్రక భారం వుంది. ఆ కర్తవ్యాన్ని వాళ్ళు తప్పక నెరవేరుస్తారు.
100. ముందుముందు అనేక అస్తిత్వ
సమూహాలు తమ జీవికను కాపాడుకోవడం కోసం, తమ భవిష్యత్తు కోసం షాహీన్ బాగ్ చూపిన మార్గంలో నడుస్తాయి. ఆక్రమంలో ఒక ఉమ్మడి కనీస కార్యక్రమం (సిఎంపి) కూడ
రూపుదిద్దుకుంటుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక దేశంలో ఆ
దిశగా ఒక కొత్త ప్రయాణం ఆరంభమవుతుంది.
(విరసం విజయవాడ పాఠశాలలో భాగంగా 2021 ఏప్రిల్ 11న ‘ఫాసిజం – భారత అస్తిత్వ సమూహాల ధిక్కారం’ అనే అంశం
మీద నిర్వహించిన సదస్సులో ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ప్రతినిధిగా చేసిన ప్రసంగం ఆధారంగా అభివృధ్ధి చేసిన వ్యాసం ఇది. )
రచన : 14 ఏప్రిల్ 2021
ముస్లిం సమాజం మీద
రాసిన 100 పాయింట్ల వ్యాసం ఇది. తప్పక చదివి మీ అభిప్రాయం రాయండి.
https://khanyazdani.blogspot.com/2021/05/muslim-programme-to-confront-neo-fascism.html
No comments:
Post a Comment