భారత ముస్లిం సమాజంలో కొత్త చీలిక
స్వతహాగా కులం మతం వర్గీకరణను పాటించే సిధ్ధాంతం కలది కనుక సంఘపరివారం ముస్లిం సమాజంలోని సాంస్కృతిక అంతస్తుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది.
కమ్యూనిస్టుల నుండి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుండి అంబేడ్కరిస్టులకు, అక్కడి నుండి మనువాదులకు 80:20 సమీకరణ లక్ష్యం కొనసాగుతోంది.
-
డానీ
రాజకీయ రంగంలో మనం బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టిడిపి, టిఆర్ ఎస్, వైసిపి, జనసేన వగయిరాలను లెక్కలు వేస్తుంటాము. వీటిల్లో అన్ని పార్టీలు కలిపి ఒక ఎత్తు అయితే ఇప్పుడు బిజెపి వాటికన్నాఎక్కువ ఎత్తు. కాంగ్రెస్ కు రెండు మూడు అనుబంధ సంస్థలుంటాయి. కమ్యూనిస్టు పార్టీలకు ఓ అరడజను అనుబంధ సంస్థలుంటాయి. సంఘపరివారానికి ఓ వందకు పైగా అనుబంధ సంస్థలు వుంటాయి; వాటిల్లో ఒకటి బిజెపి. ఏ విధంగా చూసినా భారత దేశంలో నిర్మాణపరంగా బిజెపికి దరిదాపుల్లో నిలిచే పార్టి మరొకటి వుండదు.
మనది కులవ్యవస్థ అని, దడికట్టిన కులవ్యవస్థ అని, మనువాదానికి అనువుగా ఏర్పడిన కులవ్యవస్థ అని, ముస్లింలు కూడ భారత గడ్డ మీద హిందూ బిసిలతో పోలిన ఒక శ్రామిక కులం అనీ అనేక సందర్భాల్లో అనేకమంది ఆలోచనాపరులు సూత్రీకరించారు. అయితే, సంఘపరివారం ఇలాంటి విశ్లేషణలు, సూత్రీకరణలతో ఆగిపోలేదు. అంతకన్నా ముందుకు అడుగులేసి కుల వ్యవస్థ నుండి రాజకీయ, ఆర్ధిక సాంస్కృతిక ప్రయోజనాలను సమర్ధంగా సాధిస్తోంది.
శ్రామికులు, శ్రామిక కులాలు, శ్రామిక మతాల దృక్పథం నుండి వర్తమాన భారత సమాజాన్ని అర్ధం చేసుకుని వారి రాజకీయార్ధిక సాంస్కృతిక సమస్యలకు పరిష్కార మార్గాల్ని చూపగల ఆలోచనాపరులు ఇటు కమ్యూనిస్టు శిబిరంలోనూ, అటు అంబేడ్కరిస్టు శిబిరంలోనూ ఇప్పుడు కనిపించడంలేదు. ముస్లిం సమాజంలో ఆలోచనాపరులు తక్కువ. ఆ కొద్దిమందికి కూడ తమ స్వీయసమాజంలో గుర్తింపు కూడ తక్కువే. ప్రత్యర్ధుల శిబిరాల్లోని తాత్విక డొల్లతనాన్ని సంఘపరివారం గొప్ప నైపుణ్యంతో వినియోగించుకుంటున్నది.
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కమ్యూనిస్టు పార్టి కొన్నాళ్ళు చాలా క్రియాశీలంగా వుండింది. దేశంలో శ్రామికులు 80 శాతం పెట్టుబడీదారులు 20 శాతం గనుక శ్రామికులదే అంతిమ విజయం అని వాళ్ళు గట్టిగా ప్రచారం చేసేవారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ కూడ అంతే ధీమాగా మనం 80 శాతం వాళ్ళు 20 శాతం అనేది. 1952 నాటి తొలి లోక్ సభ ఎన్నికల్లో, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టికి 10.59 శాతం, ఆచార్య కృపలాని నాయకత్వంలోని కిసాన్ మజ్దూర్ ప్రజా పంచాయత్ కు 5.79 శాతం, అజయ్ ఘోష్ నాయకత్వంలోని సిపిఐకు 3.39 శాతం వెరసి 20 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటికి 80:20 లెక్క అలా సరిపోయింది.
1990వ దశకం ఆరంభంలో తూర్పు యూరోపు సోషలిస్టు దేశాలు, సోవియట్ రష్యా సంయుక్త రాష్ట్రాల (USSR) పతనం అనంతరం సామ్యవాద సిధ్ధాంతం మీద నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా నైతిక సంక్షోభంలో పడింది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు తమ 80 శాతం ఓటు బ్యాంకును ఆస్వాదించకుండానే వర్గ విశ్లేషణల స్థానాన్ని కులమత విశ్లేషణలు ఆక్రమించేశాయి. శ్రామిక కులాలు, శ్రామిక తెగలు, శ్రామిక మత సమూహాలు ఏకమయితే ముందు రాజకీయ అధికారం, ఆ వెనుక రాజ్యాధికారం దక్కుతుందనే కొత్త సిధ్ధాంతాలు పుట్టుకు వచ్చాయి. కాన్షీరామ్ చాలా ధీమాగా మనం 80 శాతం వాళ్ళు 20 శాతం అనేవారు. కాన్షీరామ్ ప్రయోగం అప్పట్లో ఉత్తర ప్రదేశ్ లో పని చేస్తున్నట్టే కనిపించింది. తరువాతి కాలంలో అక్కడి రాజకీయ సామాజిక పరిణామాలు కాన్షీరామ్ ప్రయోగం మీద కూడ నమ్మకం సడలేలా చేశాయి.
“కుల వ్యవస్థ అంటే కేవలం శ్రమ విభజనమాత్రమేకాదు; అది శ్రామికుల విభజన కూడ” అన్నాడు అంబేడ్కర్. ఈ సామాజిక విభజనకు సైధ్ధాంతిక సమర్ధనను ఇచ్చిన మనువాదులే ఇప్పుడు ఈ విభజనని తమ రాజకీయార్ధిక సాంస్కృతిక ప్రయోజనాల కోసం అత్యంత సమర్ధంగా వాడుకుంటున్నారు.
ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు అటవీ ప్రాంతాల్లో మైదాన వాసులకు వ్యతిరేకంగా గిరిజనుల్ని వేగంగా సమీకరిస్తున్నాయి, మైదాన ప్రాంతాల్లో యజమాని కులాలను బూచీలుగా చూపి బిసి సమూహాలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. భారత ముస్లిం సమాజంలోని వెనుకబడిన సమూహాలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించింది సంఘపరివారం అండతో పనిచేస్తున్న బిసి సంఘాలే. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం బలంగావున్న అడవిప్రాంతాల్లోని గిరిజనులు క్రమంగా సంఘపరివారానికి చెందిన వనవాసికళ్యాణ్ శాఖల్లో చేరుతున్నారు.
సంఘపరివారం ప్రభావం ఎస్సీ సమూహాల్లోనూ చొచ్చుకుపోయింది. తమను తాము గొప్ప అంబేడ్కరిస్టులుగా ప్రకటించుకున్న రామ్ విలాస్ పాశ్వాన్, ఉదిత్ రాజ్ తదితరులు బిజెపి సేవల్లో తరించారు. అంబేడ్కర్ ఆశయాలతో పుట్టిన రిపబ్లికన్ పార్టి శాఖల్లో ఒకటైన ఆర్పిఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా వున్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమకాలంలో జగ్జీవన్ రామ్ పేరు బలంగా ముందుకు వచ్చింది. ఆ కారంణంగా కావచ్చు మాదిగ సామాజికవర్గంలోని ఒక సెక్షన్ లో అంబేడ్కర్ మీద కొంత అసంతృప్తి కొనసాగుతోంది. ఈ కొద్దిపాటి సందు చాలు సంఘపరివారం దూరిపోవడానికి. ఇటీవల కోనసీమ జిల్లా పేరుకు ముందు అంబేడ్కర్ పేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన నిరసనల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన కొందరు ఉత్సాహంగా పాల్గొనడం కొత్త పరిణామం. దీని వెనుకా సంఘపరివారం ప్రభావం వుంది.
సామాజికరంగంలో ముస్లింలు, క్రైస్తవులను, రాజకీయ రంగంలో కమ్యూనిస్టుల్నితప్ప మిగిలిన సమస్త సమూహాలను ఒకదాని వెనుక మరోదాన్ని సంఘపరివారం చాలా సులువుగా ఆకర్షిస్తోంది. ఈ ధైర్యంతోనే ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి “మనం 80 శాతం-వాళ్ళు 20 శాతం” అంటూ ధీమాగా ప్రకటించింది. కమ్యూనిస్టుల నుండి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుండి అంబేడ్కరిస్టులకు, అక్కడి నుండి మనువాదులకు 80:20 సమీకరణ లక్ష్యం కొనసాగుతోంది.
ఇప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు, క్రైస్తవులు, ముస్లింలను సహితం విభజించి తమ వైపుకు లాక్కొనే ప్రయత్నాలు మొదలెట్టారు. పశ్చిమ బెంగాల్ లో మూడున్నర దశాబ్దాలపాటు అధికారంలోవున్న మార్క్సిస్టు పార్టికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడ రాలేదు. సిపియం ఓట్లు 15 శాతం పడిపోగా బిజెపి ఓట్లు 28 శాతం పెరిగాయి. కమ్యూనిస్టుల ఓట్లను బిజెపి లాగేసిందని విడిగా చెప్పనవసరంలేదు. అన్నేళ్లు కమ్యూనిస్టు పార్టిలకు అభిమానులుగా వున్నవాళ్ళు ఇలా సంఘ్ పరివారంలో చేరిపోవడానికి దారితీసిన అంశం ఏమిటీ? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. దానికి సమాధానం మతం.
ముస్లింల జనాభా అధికంగా వున్న లక్షద్వీప్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే. వాటిని అసెంబ్లీ ఎన్నికలకు అవకాశం లేకుండా చేశారు. క్రైస్తవ ఓటర్లు అత్యధికంగా వున్న , నాగాలాండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లో, బిజెపి వ్యతిరేక పక్షాల ఓట్ల శాతం తగ్గుతుంటే, బిజెపి మిత్రపక్షాల ఓట్లశాతం పెరుగుతోంది. అక్కడి రాజకీయ సమీకరణల్లో ఏం జరుగుతోందో వూహించడం కష్టంకాదు. ఇప్పుడు సంఘపరివారం రాజకీయాల్లో ముస్లింల వంతు వచ్చింది.
బయటివారు తరచూ పొరబడుతున్నట్టు భారత ముస్లిం సమాజం ఏకశిలా సదృశ్యం ఏమీకాదు. షియాలు, సున్నీలు, సూఫీలు అనే తెగలు, దేవ్ బంద్, బరేల్వి పీఠాలు, ఇస్లామీ హింద్, ఉలేమా ఏ హింద్, తబ్లిగ్, అహ్లె హదీస్ వగయిరా జమాతులు, అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ వంటి సాంస్కృతిక అంతస్తులు వగయిరాలతో భారత ముస్లిం సమాజం ఒక విభజిత సమూహం.
భారత ముస్లిం సమాజంలో సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్ మొదలయిన కొన్ని సమూహాలను సాంప్రదాయికంగా అష్రాఫ్ అంటారు. వీరిని ముస్లిం ఓసిలు అనవచ్చు. నూర్ బాషా, లద్దాఫ్ వగయిరా సమూహాలను సాంప్రదాయికంగా అజ్లాఫ్ అంటారు. వీరిని ముస్లిం బిసిలు అనవచ్చు. గారడీ సాయిబులు, పాములవాళ్ళు తదితర సమూహాలను సాంప్రదాయికంగా అర్జాల్ అంటారు. వీరిని ముస్లిం ఎస్సీలు, ఎస్టిలు అనవచ్చు. స్వతహాగా కులం మతం వర్గీకరణను పాటించే సిధ్ధాంతం కలది కనుక సంఘపరివారం ముస్లిం సమాజంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది.
ముస్లిం జనాభా ఎక్కువగావున్న నగరాల్లో ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఒకటి. అక్కడి నుండి అటల్ బిహారీ వాజ్ పాయి ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. బిజెపి గెలుపు కోసం ముస్లిం సమాజంలోని చీలకలు తెచ్చే ప్రయత్నాలు ఆ సమయంలోనే మొదలయ్యాయి. సంఘ్ పరివారం సున్నీలకు మాత్రమే వ్యతిరేకంగానీ షియాలను మిత్రులుగా భావిస్తుందని వాజ్ పాయి సంకేతాలు ఇచ్చేవారు. హైదర్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు, లక్నో, గాజియాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎన్నికయిన రాజ్ నాథ్ సింగ్ కూడ వాజ్ పాయి వేసిన బాటలో ఓట్ల కోసం షియా నాయకులతో సన్నిహితంగా మెలిగేవారు.
బిజెపి ఆకర్ష్ పథకానికి లోనైన షియా నేత బుక్కల్ నవాబ్ ఏకంగా ‘ఆరెస్సెస్’ అనే పేరు వచ్చేలా ‘రాష్ట్రీయ షియా సమాజ్’ అనే సంస్థను స్థాపించారు. ఈ సాన్నిహిత్యం కారణంగా షియా ప్రతినిధులకు ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వంలోనూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కొన్ని పదవులు లభించాయి. ముక్తార్ అబ్బాస్ నక్వీ, మొహసిన్ రజా, ఘైరుల్ హసన్ రిజ్వీ వంటి పేర్లు అధికార వరండాల్లో కొన్నాళ్లు మెరిశాయి. చారిత్రక వైచిత్రి ఏమంటే, దేశ విభజనకు కారకుడిగా సంఘపరివారం నిత్యం నిందించే ముహమ్మద్ ఆలీ జిన్నా షియా సామాజికవర్గానికి చెందినవారే.
షియాల తరహాలో కొందరు సూఫీ నేతల్ని సహితం చేరదీసే ప్రయత్నాలు బిజెపి ముమ్మరంగా సాగించింది. 2016లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ సూఫీల సదస్సును ప్రధాని నరేంద్ర మోదిజీ ప్రారంభించారు. అయితే, మొత్తం భారత షియా, సూఫీ సమూహాలు బిజెపి, ఆరెస్సెస్ ప్రవచించే హిందూరాష్ట్ర సిధ్ధాంతాలతో రాజీ పడిపోయాయనడం చాలా పెద్ద తప్పు అవుతుంది. హిందూ అనే పదాన్ని సంఘపరివారం దేశం అనే అర్ధంలో వాడితే సున్నీ, షియా, సూఫీలు ఎవ్వరికీ అభ్యంతరం వుండదు. హిందూ అనే పదాన్ని సంఘపరివారం మతం అనే అర్ధంలో వాడుతోంది. అదే వివాదానికి మూలం.
బిజెపితో పొలిటికల్ హానీమూన్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఆలోచనాపరులు సహితం షియా సమూహాల్లో వున్నారు. “అధికారానికి దగ్గరగా కనిపిస్తున్న షియా నాయకులు పచ్చి స్వార్థపరులు. ఈ విషయం బిజెపికి కూడ తెలుసు. షియా-సున్నీల మధ్య విభజన భాష మాట్లాడేవారిని ఆ పార్టి చేరదీస్తోంది. షియా నాయకులు కొందరు అలా అధికారానికి చేరువ కావచ్చుగానీ షియా ప్రజలకు వాళ్ళేమీ అధికార ప్రతినిధులుకారు” అంటూ షియా సామాజికవర్గ ప్రముఖులు, లక్నో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హైదర్ అబ్బాస్ అనేకసార్లు తీవ్రంగా విమర్శించారు.
బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాల్ని తీసుకుని వచ్చినపుడు సున్నీలతోపాటూ షియా, సూఫీ సమూహాలు సహితం గట్టిగా వ్యతిరేకించాయి. ఈ పరిణామం బిజెపికి మింగుడుపడలేదు. దానితో, ముస్లిం సమాజంలో తమకు అనువుగా మారగల కొత్త సమూహాల కోసం ఆ పార్టి అన్వేషణ ఆరంభించింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో జులై 3న ప్రధాని నరేంద్ర మోదీజీ ప్రసంగిస్తూ, హిందూయేతర సమూహాల్లోని పీడిత, అణగారిన వర్గాలను సమీకరించడానికి కృషి చేయాలని పార్టి నాయకులకు పిలుపునిచ్చారు. ఆ మరునాడే ప్రధాని ఆదేశాలు అమల్లోనికి వచ్చేశాయి.
షియా తెగకు చెందిన ముఖ్తార్ అబ్బాస్ నక్వి బిజెపి మద్దతుతో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో, మైనారిటీ వ్యవహారాల మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగారు. మొన్న జులై 4న ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. బిజెపి ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వలేదు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తన మంత్రివర్గంలో దానిష్ ఆజాద్ ఆన్సారికి స్థానం కల్పించారు. అన్సారీ సున్నీ బిసి. వీరిని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పాస్మందా అంటారు. పర్షియన్ భాషలో పాస్మందా అంటే ‘వెనుకబడినవారు’ అని అర్ధం.
సంఘపరివారం షియాలు, సూఫీలను పక్కన పెట్టి సున్నీ ముస్లిం సమాజంలోని వెనుకబడినవర్గాల (పాస్మందాలు) మీద దృష్టి పెట్టిందనడానికి ఇది తాజా ఉదాహరణ. భారత ముస్లిం సమాజంలో కొత్త చీలిక రాబోతున్నదనడానికి ఇది తొలి సంకేతం!
ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ 14 విభాగాలకు చెందిన ముస్లిం వెనుకబడిన తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యా, ఉపాధిరంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీనిమీద సంఘ్ పరివారమే వివాదాన్ని రేపడంతో ప్రస్తుతం ఈ సౌకర్యం సుప్రీం కోర్టులో స్టేతో కొనసాగుతోంది. ఇది ఏ రోజైనా ఆగిపోవచ్చనే భయం ముస్లిం వెనుకబడిన తరగతుల్ని వెంటాడుతోంది. ఎలాగూ ముస్లిం వెనుకబడిన తరగతుల్ని ఆకర్షించే యత్నంలో సంఘపరివారం వుంది కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం వెనుకబడిన తరగతులకు ఆ 4 శాతం రిజర్వేషన్లు శాశ్వితంగా దక్కేలా న్యాయ ప్రక్రియ సాగించాలి. అంతే కాకుండ వీరందరినీ జాతీయ ఒబిసి జాబితాలోనూ చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి జాతీయ ఒబిసి జాబితాలో ప్రస్తుతం మెహతర్ (పాకీ, పారిశుధ్ధ్య కార్మికులు) ముస్లింలకు మాత్రమే స్థానం వుంది.
శ్రామికులు, శ్రామిక కులాలు, శ్రామిక మత సమూహాల ఆకాంక్ష ‘వర్గ- కుల-మత వివక్ష, అణిచివేతలు లేని వ్యవస్థ. ఈ సమూహాల వెతల్ని తొలగించడం వర్తమాన ప్రభుత్వాలతో అయ్యేపని కాదు. కనీసం ఈ వెతల్ని తగ్గించడానికయినా ప్రభుత్వాలు కొన్ని ఉద్దీపన చర్యల్ని ప్రవేశపెడుతుండాలి. వీటినే మనం affirmative action, రిజర్వేషన్లు అంటుంటాం.
శిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు తమంతతాముగా రిజర్వేషన్లు లేవు. మెజారిటీ మత సమూహం నుండి మైనారిటీ మత సమూహాలు తరచూ తీవ్రమైన సాంస్కృతిక వివక్షను ఎదుర్కొంటుంటాయి. బాహ్య వివక్షను ప్రమాణంగా తీసుకుని మైనారిటీ సమూహాలన్నింటినీ బిసి / ఒబిసి జాబితాలో చేర్చాలి. కానీ అలా జరగడంలేదు. ఎస్సీ- క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులకు బిసి/ఒబిసి రిజర్వేషన్లున్నాయి. వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు పొందాలంటే తాము హిందూ ఎస్సీలని నిరూపించుకోవాలి. అదో ప్రోటోకాల్. పేరులో ‘అహ్మద్’ అనే పదంవుంటే ‘బిసి-ఇ’ సర్టిఫికేట్లు జారీ చేసేదిలేదని ఇటీవల కొన్ని చోట్ల తహశీలుదార్లు స్వంత ఫర్మానాలు జారీచేస్తున్నారు. విద్యా, ఉపాధిరంగంలో రిజర్వేషన్లు పొందాలంటే తాము ఓసి ముస్లింలు కాదని నిరూపించుకునే బాధ్యత అప్లికెంట్ దే అన్నమాట.
ఈ రిజర్వేషన్లు తరచూ ఒక
సంధిగ్ధతను సృష్టిస్తుంటాయి. సమాజంలో వివక్ష, అణిచివేతలు లేకుంటే ఎవరికీ ఉద్దీపన చర్యలతో పని వుండదు. ఉద్దీపన చర్యలు
పొందాలంటే వివక్ష, అణిచివేతలు ఉన్నాయని నిరూపించుకుంటూ వుండాలి. అంటే రిజర్వేషన్లను
ఆస్వాదిస్తున్నవారికి కులమత వివక్ష అణిచివేతలు అనేవి తొలగించుకోవాల్సిన కీడులుగాగాక
భద్రపరచుకోవాల్సిన విలువలుగా మారిపోతాయి. ఇదే నయా మనువాదుల రాజకీయాలకు ప్రాణవాయువుగా పనిచేస్తోంది.
హిందూయేతర మత సమూహాలు కాంగ్రెస్ నో, కమ్యూనిస్టుల్నో, మరో బిజెపియేతర పక్షాన్నో సమర్ధిస్తున్నాయని బిజెపికి ఒక స్పష్టమైన అంచనా వుంది. ఆ మత సమూహాల్లో కుల ప్రాతిక మీద రాజకీయ విభజన సృష్టించడానికి బిజెపి సర్వశక్తుల్ని వినియోగిస్తున్నది. దీనివల్ల ఆ పార్టి రెండు రకాల ప్రయోజనాలను ఆశిస్తున్నది. మొదటిది; ప్రతిపక్షాల ఓటు బ్యాంకు కుచించుకుపోవాలి. రెండోది; బిజెపి ఓటు బ్యాంకు విస్తరించాలి. హిందూయేతర సమూహాల్లోని దిగువ తరగతులు తమను బలపరుస్తాయని కమలనాధులు గట్టిగా నమ్ముతున్నారు. వీటి ఫలితాలు 2024 పార్లమెంటు ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతాయని బిజెపి వ్యూహకర్తలు అంచనాలు వేస్తున్నారు.
ప్రధాని పిలుపు కేవలం ముస్లిం సమాజం కోసం కోసం మాత్రమే ఇచ్చిందికాదు. హిందూయేతర సమూహాలైన క్రైస్తవ, శిక్కు, బౌధ్ధ మత సమూహాలకు కూడ ఇది వర్తిస్తుంది. షాహీన్ బాగ్ ఉద్యమానికి శిక్కు ప్రతినిధులు సంఘీభావాన్ని తెలపడం బిజెపికి మింగుడుపడలేదు. అనంతరం ఢిల్లీలో సాగిన రైతుల ఆందోళనతో శిక్కు సమూహం బిజెపికి కొరకరాని కొయ్యగా మారింది. పంజాబ్ లో శిక్కు సమూహంలోని దిగువ తరగతుల్ని బిజెపి ఓటర్లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం, మేఘాలయల్లోనేగాక దక్షణాది రాష్ట్రమైన కేరళలోనూ క్రైస్తవ సమాజంలోని దిగువ అంతస్తుల్ని ఆకర్షించే పని ఇక వేగాన్ని పుంజుకుంటుంది.
విభజించి పాలించు వ్యూహంతో బిజెపి ముందుగా షియా తెగను చేరదీసింది. ఆ పిదప సూఫీలను దగ్గరకు తీసుకుంది. ఆ రెండు ప్రయోగాలు కొనసాగలేదు. ‘తక్షణ ట్రిపుల్ తలాక్’ నెపంతో ముస్లిం మహిళలకు గాలం వేసింది. ఆ పాచికా పారలేదు. ఇప్పుడు పాస్మందా ముస్లింలకు ‘స్నేహ’ హస్తాన్ని చాచుతోంది. అదీ అంత సులువైన వ్యవహారం కాదు. అక్కడా దానికి భంగపాటు తప్పదు.
ఇలాంటి కుట్ర పూరిత ఎత్తుగడలతో కాకుండ సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు పరిస్తే అది రాజకీయంగా ముస్లింల అభిమానాన్ని పొందవచ్చు. అలా చేస్తుందా? చేయడం దానికి సాధ్యమేనా?
(రచయిత సీనియర్ పాత్రికేయులు,
సమాజ విశ్లేషకులు, ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్)
‘భారత ముస్లిం సమాజంలో
కొత్త చీలిక’
డానీ వ్యాసం - ‘వీక్షణం’ ఆగస్టు- 2022
No comments:
Post a Comment