Thursday, 28 July 2022

What made P Sundarayy to resign to the post of GS and CC

 ఈనాటి రాజకీయ విషాదాన్ని

ఆనాడే పసిగట్టి హెచ్చరించిన

దార్శినికులు పుచ్చలపల్లి సుందరయ్య!

 

 

మొదటిభాగం

మనదేశంలో సిపిఐ నుండి సిపిఐ (యం), సిపిఐ (యం) నుండి సిపిఐ (ఎంఎల్) పార్టీలు పుట్టాయి. కొత్త వైరం గాబట్టి సిపిఐ (ఎం ఎంఎల్) పార్టీలు సిపిఐ కన్నా సిపిఐ (యం)ను ఎక్కువగా విమర్శిస్తూ వుండేవి. మా నాయకుడు కొండపల్లి సీతారామయ్యకు కూడ చండ్ర రాజేశ్వర రావుగారి విషయంలో ఓ సాఫ్ట్ కార్నర్ వుండేది. అంచేత మాకూ పుచ్చలపల్లి సుందరయ్యగారి మీద అంతగా సదభిప్రాయం వుండేది కాదు.

 

నేను సుందరయ్యగారి ఉపన్యాసాలు కొన్ని విన్నాను. అవి ఎన్నికల ప్రచార సభలు కనుక అవేమీ నాకు అంతగా రుచించలేదు.  వారి  ‘వీర తెలంగాణ - విప్లవ పోరాటం, గుణపాఠాలు’ కూడ చదివాను.  1948 నాటి పోలీస్ యాక్షన్ సందర్భంగానూ, ఆ తరువాతా నైజాం ఎస్టేట్ లో ముస్లింల మీద చాలా  దౌర్జన్యాలు జరిగాయి. వేల సంఖ్యలో ముస్లింలను చంపేశారు; వాళ్ళ అస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ స్త్రీలను .........  శారు. నాలాంటి సామాజిక నేపథ్యం వున్నవారికి ఇవి చాలా ముఖ్యం. ఇంతపెద్ద స్థాయిలో సాగిన ఒక నరమేధాన్ని ఆ పోరాట చరిత్రలో  నమోదు చేయదగ్గ అంశంగా సుందరయ్యగారికి అనిపించకపోవడం చాలా నిరుత్సాహాన్ని కల్గించింది.

 

కొన్నాళ్ళ క్రితం మిత్రుడు దుర్గం సుబ్బారావు “సిపిఐ (మార్క్సిస్టు) పార్టి ప్రధాన కార్యదర్శి పదవికి నేనెందుకు రాజీనామా చేశాను?’ అన్న సుందరయ్యగారి పుస్తకం పిడిఎఫ్ లింకును నాకు పంపించాడు. 1980లలో ఏదో ఓ నక్సలైటు గ్రూపు ఆ పుస్తకాన్ని ప్రచురించినట్టుంది. అప్పట్లో ఆ పుస్తకాన్ని చదవాలనిపించలేదు. ఆ లింకును కూడ తెరచి చూడలేదు.

 

బెంగాల్  ను దాదాపు మూడున్నర దశాబ్దాలు పాలించిన సిపియం కు  గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడ రాలేదు. పైగా, సిపియం అభిమానులు చాలా మంది బిజెపికి భారీగా మద్దతు ఇచ్చినట్టు  ఎన్నికల గణాంకాలు చాలా స్పష్టంగా తేల్చాయి. వామపక్ష రాజకీయాల్లో ఇది ఒక దిగ్బ్రాంతికర పరిణామం. బెంగాల్ ఎన్నికల ఫలితాల మీద చర్చ సందర్భంగా మిత్రుడు భార్గవ గడియారం ఓ మాటన్నాడు. ఈ ప్రమాదాన్ని సుందరయ్యగారు 1975లోనే పసిగట్టి సిపియం నాయకుల్ని గట్టిగా హెచ్చరించారు అన్నాడు.

 

          చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలోని సిపిఐ 1975-77 నాటి ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ను సమర్ధించి  ఒక చారిత్రక ఘోర తప్పిదానికి పాల్పడిందని మనకు తెలుసు.  ఇప్పటికీ సిపిఐ జాతీయ నాయకులు ఆ తప్పును గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుంటుంటారు. అయితే సిపిఐ (ఎం) కేంద్ర నాయకత్వం అదే ఎమర్జెన్సీ కాలంలో అంతకన్నా ఘోరమైన చారిత్రక తప్పిదానికి పాల్పడిందని సుందరయ్యగారి రాజీనామా లేఖను చదివితేగానీ అర్ధంకాదు.

 

ఇందిరాగాంధి 1975 జూన్ 25న ఎమర్జెన్సీని విధించారు. దాదాపు రెండు నెలల తరువాత 1975 ఆగస్టు 22న సుందరయ్యగారు సిపిఐ (మార్క్సిస్టు) పార్టి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.  ఇంగ్లీషులో A4 సైజులో ఈ డాక్యుమెంట్ 102 (A5 డెమ్మీ సైజులో 204) పేజీలుంది.

 

(ఈ కింది లింకులో  సుందరయ్యగారి రాజీనామా  డాక్యుమెంట్ వుంది.)

https://www.marxists.org/subject/india/cpi(m)/letter-resignation.pdf

 

“ప్రియమైన కామ్రేడ్స్!” అనే సంభోధనతో మొదలయిన ఈ డాక్యుమెంట్  ఆరంభంలోనే సుందరయ్యగారు తన రాజీనామాకు దారితీసిన పది కారణాలను క్లుప్తంగా సూటిగా ప్రకటించారు. ఆ తరువాత ఈ అంశాలను ఓ రెండు వందల పేజీల్లో చాలా విపులంగా వివరించారు.

 

వాటిల్లో వారు చెప్పిన మొదటి కారణం :

 

1.      

“సామ్రాజ్యవాద అనుకూల జన్ సంఘ్ ను నడిపించే ఆరెస్సెస్ అలనాటి జర్మనీలో నాజీల పౌర పారా-మిలటరీ దళం వంటిది. వాళ్ళతో చేతులు కలపడం  మన పార్టీకేగాక, మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ వుంటున్న ప్రజాస్వామిక సమూహాలకు చాలా ప్రమాదకరం. ఈ విషయం బయటికి తెలిస్తే, సామ్యవాద శక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక సమూహాలు మనల్ని వెలివేస్తాయి. అయినప్పటికీ,  ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే వంకతో మన కేంద్ర కమిటీలోని   అత్యధికులు జన్ సంఘ్ తో జతకట్టి సంయుక్త కార్యాచరణ చేబట్టాలని నిర్ణయించారు గాబట్టి పార్టి ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేయక తప్పడంలేదు”

 

ఈ ఆరంభ వాక్యాలు చదవగానే నేను సుందరయ్యగారి ముందు చూపుకు, ఆత్మగౌరవానికీ, నిజాయితీకి  ఫిదా అయిపోయాను.

 

I love you Sir.

 

(ఇంకా చాలా వుంది)

 

 

ఇందిరాగాంధిని సిపిఐ అతిగా ప్రేమించింది!

ఇందిరాగాంధీని సిపిఎం అతిగా ద్వేషించింది!

ఒకరిని మించిన తప్పు మరొకరిది!

 

 

రెండవ భాగం

 

దెయ్యాన్ని వదిలించుకోవడానికి భూతాన్ని నెత్తి మీద పెద పెట్టుకుంటే ఎలా? రాజీనామా డాక్యుమెంట్ లో సుందరయ్యగారి మొత్తం ఆవేదన, ఆందోళన ఇదే.

 

ఎమర్జెన్సీ కాలంలో సిపిఐ చేసిన తప్పిదం ప్రభావం ఓ పదేళ్ళ పాటు కొనసాగింది. అదేకాలంలో సిపియం చేసిన తప్పిదం ప్రభావం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. 2020వ దశకంలో జరుగబోయే రాజకీయ. ఆర్ధిక, సాంస్కృతిక, ధార్మిక పరిణామాల్ని సుందరయ్యగారు 1970వ దశకంలోనే దర్శించగలిగారు. అది వారి గొప్పతనం. వారి హెచ్చరికను పెడచెవిన పెట్టినవారికి చరిత్ర దిమ్మదిరిగే గుణపాఠం నేర్పింది.

 

“ఎమర్జెన్సీ” ఇందిరా గాంధీని వ్యతిరేకించకూడదా?  అనే ప్రశ్న ఈ సందర్భంలో సహజంగా ముందుకు వస్తుంది. తాను ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవాల్సి వుంటుందని సుందరయ్యగారికి తెలుసు. ఆ ప్రశ్నకు సమాధానం కూడ వారి దగ్గర సిధ్ధంగా వుంది.

 

ఇందిరాగాంధీ రాజకీయ విధానాలను తీవ్రంగా ఖండించాలి. ఆ విషయంలో వారు రాజీపడదలచలేదు. అయితే, ఆమె తప్పుడు విధానాలను ఖండించే వంకతో అంతకన్నా ప్రమాదకరమైన విధానాలుగల సమూహాలను ప్రోత్సహిస్తే కమ్యూనిస్టుల ప్రాధమిక ఉనికికే ముప్పు వస్తుంది అనేది వారి ఆందోళన. రాజకీయాల్లో భారతీయ జన సంఘ్ ను, కార్మికసంఘాల్లో  భారతీయ మజ్దూర్ సంఘ్ ను దూరంగా పెట్టి ఇతర శక్తులతో జతకట్టి ఇందిరాగాంధీనీ, ఎమర్జెన్సీనీ వ్యతిరేకించాలనేది వారి సూచన.

 

పౌర స్వేఛ్ఛ, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఏకాభిప్రాయంగల  శక్తులు అన్నింటితో అంశాల వారీగా  కలిసి పని చేయవచ్చు. అంతేగానీ, ప్రగతి నిరోధక శక్తులతో రాజకీయ కూటమిని  ఏర్పాటు చేయడం తప్పు అనేది సుందరయ్యగారి ధృఢ అభిప్రాయం.

 

ఆనాటి  రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల్ని వారు మూడు రకాలుగా వర్గీకరించారు. వీటిల్లో మొదటిది; అధికార (ఇందిరా) కాంగ్రెస్, రెండోది ప్రజాస్వామిక భావాలుగల విపక్షాలు; మూడోది; ఇందిరా కాంగ్రెస్ ను మించిన అభివృధ్ధి నిరోధక విపక్షాలు.  మొదటి వర్గాన్ని నిలవరించడానికి రెండోవర్గంతో కలవాలిగానీ, మూడో వర్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కలుపుకోకూడదని వారు ఈ డాక్యుమెంట్ లో అనేక సార్లు హెచ్చరించారు.

 

అంతకు ముందే కాంగ్రెస్ కొత్త పాతగా చీలి వుంది. కొత్త కాంగ్రెస్ తరువాతి కాలంలో ఇందిరా కాంగ్రెస్ గా మారింది. ఇందిరా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నది స్పష్టం. అందులో మరో అభిప్రాయం లేదు. అయితే కాంగ్రెస్ శిబిరంలో ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తున్నవారు అంతకన్నా  ప్రజావ్యతిరేకులు. కాంగ్రెస్ బయటవున్న స్వతంత్ర పార్టి ప్రతీఘాత శక్తి. జనసంఘ్ మతఅహంకార ప్రతీఘాత శక్తి. జయప్రకాశ్ నారాయణ్ సోషలిస్టుగా విఫలమయ్యాక జనసంఘ్, స్వతంత్రపార్టి వంటి ప్రతీఘాత శక్తుల్ని చేరదీసి కొత్త రాజకీయ సమీకరణ తయారు చేస్తున్నారు. 

 

ఇటు ఇందిరాగాంధీవల్ల పౌర స్వేఛ్ఛకూ, ప్రజాస్వామిక హక్కులకు కలుగుతున్న విఘాతాన్నీ, అటు జయప్రకాశ్ నారాయణ్, స్వతంత్ర పార్టి, జనసంఘ్ కూటమి వల్ల రాబోతున్న మరింత ముప్పునూ  ఒకేసారి ఎండగట్టాలి. దానికోసం దేశంలోని ప్రజాస్వామిక శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచాలి అనేది సుందరయ్యగారి పంథా.

 

సిపిఎం కేంద్ర కమిటీలోని  జ్యోతి (జ్యోతిర్మయి బసు), పిఆర్ (పి రామమూర్తి), బిటిఆర్ (బిటి రణదీవె), ఎంబి (మాకినేని బసవవున్నయ్య), ఇఎంఎస్ (నంబూద్రిపాద్) తదితరులు జయప్రకాశ్, జనసంఘ్ తో రాజకీయ ఐక్యసంఘటనకు అతి ఉత్సాహం చూపుతున్నారని సుందరయ్యగారు చాలా తీవ్రంగా ఆరోపించారు.  తను వారించినప్పటికీ లోక్ సభలో పార్టి  నాయకుడు జ్యోతి తన ఆదేశాలను ధిక్కరించి జనసంఘ్ తో ఐక్యకార్యాచరణ కమిటి  సమావేశాలకు హాజరవుతున్నారని వారు ఆరోపించారు.

 

ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం కలిసి పని చేయడానికీ రాజకీయ కూటమిగా ఏర్పడడానికీ (Joint Action and United Front) మధ్యగల తేడాను గుర్తించడంలో  కేంద్రకమిటీ సభ్యులు చాలా గందరగోళానికి గురయ్యారు. ఇఎంఎస్ ఏకంగా జేపి, కాంగ్రెస్ (ఓ)తో ఎన్నికల సర్దుబాటు చేసుకుంటున్నట్టు ఓ బహిరంగ ప్రకటన చేయడంతో సుందరయ్యగారు హతాశులయ్యారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాల మీద కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (CMP) నిర్ధారించుకోకుండా రాజకీయ కూటమిని ఎలా ప్రకటించేస్తారూ? అనేది వారి అభ్యంతరం.

 

తమది ‘కార్మికవర్గ పార్టి’ అనీ, ‘జనతా ప్రజాస్వామిక విప్లవం’ను విజయవంతం చేయడం తమ కర్తవ్యం అనే ప్రాణప్రదమైన  అంశం  కేంద్ర కమిటీ సభ్యులకు సహితం సరిగ్గా అర్ధం కాలేదని సుందరయ్యగారు ఆందోళన చెందడాన్ని ఈ డాక్యుమెంట్ లో చూస్తాము. కేంద్ర కమిటీ సభ్యులు విప్లవ కర్తవ్యాలను గాలికి వదిలి “పార్లమెంటరీ చట్టబధ్ధ భ్రమలలో” కూరుకుపోయారనేది వారి ఆవేదన.

 

లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద  విశాల ప్రజా సమూహాల్లో ఏమాత్రం గుర్తింపు-గౌరవం లేని ఆరెస్సెస్ – జనసంఘ్ లకు సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు  గుర్తింపు-గౌరవాన్ని తెస్తున్నారనేదే సుందరయ్యగారి ప్రధాన ఆరోపణ.

 

            కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజల విశ్వాసం తగ్గిపోవడం, మతవాద ఉగ్ర కార్పొరేట్ శక్తులు (Communal Extremist Corporate Forces) రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకోవడం నేటి సామాజిక వాస్తవికత. ఈ ప్రమాదాన్ని 1975లోనే హెచ్చరించిన పుస్తకం  పుచ్చలపల్లి సుందరయ్యగారి రాజీనామా పత్రం. ఈ అంశం మీద చర్చించాలనుకునే ఆసక్తిగలవారు  ముందు దాన్ని చదవండి. దీని ఇంగ్లీషు లింకును ఇంతకు ముందే ఇచ్చాను. 1980లలో ఓ నక్సలైట్ గ్రూపు ఈ పత్రాన్ని తెలుగులో  ప్రచురించిందని విన్నాను. చారిత్రక అవసరం రీత్యా ఇప్పుడూ ఎవరో ఒకరు దీన్ని తెలుగులో ప్రచురిస్తారు. ఇప్పటికి ఇంగ్లీషే ఆధారం. 

 (ఇంకావుంది)

 

 

 

 

ఆరెస్సెస్- జనసంఘ్ –బిఎంఎస్ లను

సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ  సభ్యుల్లోని అత్యధికులు

అలా అడ్డంగా వెనకేసుకుని రావడానికి  కారణం ఏమిటీ?.

 

 

ఆరెస్సెస్-జనసంఘ్ – భారతీయ మజ్దూర్ సంఘ్ లతో అంశాలవారీగా ఐక్య కార్యాచరణ (Joint Action)కు  మాత్రమే పరిమితం కాకుండా  ఐక్య రాజకీయ కూటమిని (United Front) కూడ నిర్మించాలని ఇఎంఎస్ నంబూద్రిపాద్ గట్టిగా పట్టుబట్టారు. 1975 జూన్ 26న ఎమర్జెన్సీని విధించడానికి కొన్ని రోజుల ముందు మళయాళ దినపత్రిక ‘మాతృభూమి’ లో వారు ఒక వ్యాసం రాసారు.

 

 హిట్లర్ నాజీయిజానికి వ్యతిరేకంగా జర్మనీని ఓడించడానికి సోవియట్ రష్యా  1940లలో సామ్రాజ్యవాద బ్రిటన్, అమెరికాలతో కూటమి కట్టినట్టు, జపాన్ దురాక్రణను పారద్రోలడానికి చైనాలో నియంత  ఛాంఘై షేక్ తో మావో జతకట్టినట్టు భారతదేశంలో నియంత  ఇందిరాగాంధీని గద్దె దించడానికి జనసంఘ్ (ఆరెస్సెస్)తో సహితం జతకట్టాలని ఇఎంఎస్ ఆ వ్యాసంలో ఒక సిధ్ధాంత ప్రాతిపదికను సిధ్ధం చేశారు. 

 

విధానపరంగా ఒక తప్పిదానికి పాల్పడడమేగాక దానికి  ఇఎంఎస్ ఒక సిధ్ధాంత సమర్ధనను కూడ జోడించడంతో సుందరయ్యగారికి గట్టిగానే మండింది.   

 

ఐక్యసంఘటనల్లో పాటించాల్సిన ప్రాణపద  నియమాలు ఇఎంఎస్ కు అర్ధం కాలేదనీ, భారతదేశ వాస్తవ పరిస్థితులకు పొంతనలేని ఒక యాంత్రిక అన్వయానికి వారు పాల్పడ్డారనేది సుందరయ్యగారి అభిప్రాయం.

 

హిట్లర్ వ్యతిరేక ఐక్యసంఘటనను నిర్మించే  సమయంలో  ఇతర ఫాసిస్టు శక్తుల్ని కూడ రష్యా దూరంగా వుంచిందని వారు గుర్తు చేశారు. ఇంగ్లండ్, అమెరిక, ఫ్రాన్స్  దేశాలు పెట్టుబడీదారీ, సామ్రజ్యవాద స్వభావం కలిగినవే అయినప్పటికీ  హిట్లర్ లా ఫాసిస్టులు కాదని వారు వివరించారు. చైనాలో కొంతభాగాన్ని జపాన్ నేరుగా ఆక్రమించి ఐదేళ్ళుగా తిష్టవేసివున్న సందర్భంలో బాహ్యశతృవుతో తలపడడానికి అంతర్గత శతృవైన  చాంకై షేక్ తో మావో ఐక్యసంఘటన కట్టారని  కూడ సుందరయ్య గుర్తు చేశారు.

 

భారత దేశంలోనూ బూర్జువాల ప్రతినిధి అయిన ఇందిరా గాంధీ సాగిస్తున్న నియంత పోకడల్ని ఎర్కోవడానికి బూర్జువా, ప్రజాస్వామిక శక్తులతో విశాల కూటమిని కట్టాలిగానీ అందులోనికి  ఆరెస్సెస్ – జనసంఘ్ లకు  ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానం కల్పించరాదని సుందరయ్యగారి ధృఢ అభిప్రాయం. ఇందిరా కాంగ్రెస్ కన్నా ఆరెస్సెస్- జనసంఘ్ మరింత  ప్రమాదకారులని ఈ డాక్యుమెంట్లో  వారు చాలా సార్లు  వివరించారు.

 

నిజానికి  సిపిఐ (ఎం) ‘కార్యక్రమం’లోనే వివిధ రాజకీయ పార్టీల మీద తమ వైఖరి గురించి చాలా స్పష్టంగా రాసుకున్నారు. అందులో 109వ పేరాలో జనసంఘ్ గురించి రాసుకున్నారు. “మనం జన సంఘ్ ను ఎలా చూడాలీ? బూర్జువా-భూస్వామ్యవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న  కాంగ్రెస్ (ఓ), బిఎల్ డి, స్వతంత్ర పార్టి మొదలైన రైటిస్ట్ ప్రతిపక్షాల్లో దానినీ ఒకటిగానే చూడాలా? లేకుంటే వాటికన్నా ప్రమాదకారిగా చూడాలా?” అనే ప్రశ్నతో ఆరంభం అవుతుంది ఆ వివరణ.

 

“అభివృధ్ధి నిరోధక, విప్లవ ప్రతిఘాతుక ధోరణులన్నింటికీ ప్రత్యక్ష స్వరూపం స్వతంత్ర పార్టి.  (నెహ్రూ సోషలిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ సి. రాజగోపాలాచారి దీనిని స్థాపించాడు.) దేశంలోని అభివృధ్ధి నిరోధక శక్తులన్నింటినీ ఒక జెండా కిందికి తీసుకుని రావడం దీని లక్ష్యం.” (అలా ఆ స్వతంత్ర పార్టి 1974లో భారతీయ లోక్ దళ్ (బిఎల్ డి) గా  మారింది.)

 

“వీళ్ళు (స్వతంత్రపార్టి కూటమి)  ప్రభుత్వరంగానికి వ్యతిరేకంగా దుర్మార్గమైన దాడులు చేస్తున్నారు. స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడీదారులకు మరిన్ని రాయితీలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు, సోషలిస్టు దేశాలతో భారత వాణిజ్య సంబంధాలను తప్పుబడుతుంటారు. మరోవైపు, అమెరిక పెట్టుబడులు మనదేశం లోనికి చొచ్చుకుని రావడానికి వీలుగా ద్వారాల్ని బార్లా  తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతుంటారు.  భూసంస్కరణలకు వీరు బధ్ధ వ్యతిరేకులు. చైనాతో సరిహద్దు తగువు సాగుతున్న  కారణంగా అమెరికాతో సైనిక మైత్రిని నెలకొల్పుకోవాలని వీరు వత్తిడి తెస్తున్నారు. స్వతంత్ర పార్టీ నుసరించే  విప్లవ ప్రతీఘాత విధానాలు, చర్యలు అన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. స్వతంత్ర పార్టి అంతటితో ఆగక జనసంఘ్ వంటి మతవాద పార్టితో చేతులు కలపాలని చూస్తున్నది. మత అధిపత్యవాదం అనే అదనపు లక్షణం వుండడంవల్ల స్వతంత్ర పార్టికన్నా జనసంఘ్ మరింత ప్రమాదకర పార్టి.” అని పేర్కొన్నారు.

 

అలాగే, ‘కార్మికసంఘాల ఐక్యత – భారతీయ మజ్దూర్ సంఘ్’ అనే అంశం మీద సిపిఐ (ఎం) కేంద్ర కమిటి 1974 సెప్టెంబరు నెలలో ఒక తీర్మానం చేసింది.

 

            “జనసంఘ్ అనేది హిందూ ధిపత్యవాదాన్ని పునరుధ్ధరించే మతోన్మాద సంస్థ. సంస్థాగతంగా అది ఆరెస్సెస్ కనుసన్నలో నడుస్తుంది. మాటల్లో చేతల్లో అది కమ్యూనిస్టులకు, సోషలిస్టు కూటమికి, శ్రామికవర్గానికి హింసాత్మక (violently) వ్యతిరేకి. మతపరంగా ముస్లింలను వేధించడం దాని పని. విదేశాంగ విధానంలో దానిది పాశ్చాత్యదేశాల అనుకూల వైఖరి” అనేది ఆ తీర్మానం సారాంశం.  
            

మనుషులు తమ ఆస్తినిబట్టి, కులాన్నిబట్టి ప్రవర్తిస్తారనేది ఒక యాంత్రిక తప్పుడు అన్వయం. ఆర్ధిక నిర్ణాయకవాదం అంటే మనుషులు తమకున్న స్వంతఆస్తిని బట్టి ప్రవర్తిస్తారనికానేకాదు, స్వంత ఆస్తి మీద తమకు వుండే దృక్పథంతో ప్రవర్తిస్తారని  అర్ధం.  అలాగే, సామాజికవర్గ నిర్ణాయకవాదం అంటే మనుషులు తాము పుట్టిన కులాన్ని బట్టి ప్రవర్తిస్తారనికానేకాదు, కులం మీద తమకు వుండే దృక్పధాన్నిబట్టి ప్రవర్తిస్తారని  అర్ధం. మత నిర్ణాయకవాదం కూడ అంతే. మనుషులు మతం మీద తమకు వుండే దృక్పధాన్నిబట్టి ప్రవర్తిస్తారు.  

 

ఆరెస్సెస్- జనసంఘ్ – బిఎంఎస్ ల ద్వార దేశానికీ, కమ్యూనిస్టులకూ ముంచుకొస్తున్న  ప్రమాదాల గురించి  ఇంత స్పష్టంగా  పార్టి కార్యక్రమంలో  రాసుకున్నప్పటికీ సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ  సభ్యుల్లోని అత్యధికులు వాటిని  అలా అడ్డంగా వెనకేసుకుని రావడానికి  కారణం ఏమిటీ?. వారివారి సామాజిక, సాంఘీక, ఆర్ధిక దృక్పథాలు ఈ సందర్భంగా ఏ మేరకు పనిచేశాయి అనేవి ఇప్పుడు కీలక ప్రశ్నలు. 

 

సుందరయ్యగారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడానికి దారితీసిన అంశం ఇదే. కేంద్రకమిటీ సమావేశాల్లో తానూ, బిటిఆర్ కత్తులు దూసుకునేవారిమని (loggerheads) వారు అందులో చాలా స్పష్టంగా  రాశారు.

 

(ఇక్కడితో ఈ సిరీస్ ను ముగిస్తున్నాను)

 

(ఈ వివాదం మీద ఇంకా ఆసక్తిగలవారు ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో సిపిఎం, కాంగ్రెస్‍, బిజెపి సభ్యుల మధ్య ఈ నెల  మొదటివారం నుండి సాగుతున్న మాటల యుధ్ధాన్ని పరిశీలించవచ్చు. ఈ వివాదంలో సిపిఎం మంత్రి సాజీ చెరియన్ జులై 6న రాజీనామా చేశారు. )

21 జులై 2022

 

( అయిపోయింది)

Are the Muslims ready to encourage their own Media

 ముస్లిం మీడియాను 

ప్రోత్సహించడానికి 

ముస్లిం సమాజం సిధ్ధమేనా? 



“మారడానికి సిధ్ధపడని జాతిని దేవుడు కూడ మార్చలేడు” అనే మాటను నేను మా ముస్లిం సమూహంలో చిన్నప్పటి నుండి వింటున్నాను. గడిచిన  అరవై ఏళ్ళలో భారత ముస్లింల జీవితాలు మెరుగుపడలేదు. పైగా, మరింతగా క్షీణించి పోతున్నాయి. కూడు, గుడ్డ, గూడు సంగతి డేవుడెరుగు;  ప్రాణరక్షణ కూడ కరువైన స్థితిలో నేటి ముస్లిం సమాజం వుంది. 


మన జీవితాలు మారలేదంటే మనం మారడానికి సిధ్ధంగా లేమని అర్ధం. లేదా మారడానికి అనుసరించాల్సిన మార్గాలేమిటో మనకు అర్ధంకాలేదని అర్ధం. ఓ సమాజం మారాలంటే అందులో రెండు అంశాలు కఛ్ఛితంగా వుండాలి; మేధావులు, మీడియా. ఆధునిక సమాజాల్లో మేధావులు, మీడియాలేని సమూహాలు పోటీని నిలదొక్కుకోలేక అంతరించి పోతాయి; లేదా మరింత చాదస్తంగా మారిపోతాయి. రెండింటి ఫలితం ఒక్కటే. 


మార్పుకు అత్యంత త్వరగా ప్రతిస్పందించే జీవరాశులు  మాత్రమే మనుగడ సాగిస్తాయి” అన్నాడు చార్లెస్ డార్విన్. బలమైన, అత్యంత తెలివైన జీవరాశులు  కూడ వాటి ముందు బలాదూర్ అనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు వీస్తున్న గాలి మార్గాన్ని భారమితి గుర్తించినట్టు జాతికి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని మేధావులు ముందుగా పసిగడతారు; వెంటనే స్పందిస్తారు.  స్వాతంత్ర్యానంతరం దేశంలోని అనేకానేక అణగారిన సమూహాలు తమ స్వంత మేధావుల్ని, మీడియానూ సృష్టించుకుంటూ మెరుగైన జీవితం దిశగా సాగుతున్నాయి. భారత ముస్లిం సమాజంలో ఇది రివర్స్ గేర్ లో సాగుతోంది. 


సౌదీ అరేబియా ప్రభుత్వం  తబ్లిఘీ జమాత్ కార్యకలాపాలను నిషేధించారనే వార్త రాగానే  ఇక్కడ  స్పందించగల భారత ముస్లిం సమాజం ఇక్కడి సామాజిక రాజకీయ పరిణామాల మీద స్పందించడంలేదు; కనీసం స్పందించాల్సినంతగా స్పందించడంలేదు.   



ముస్లింలకు స్వంత మీడియా లేకపోతే వచ్చే నష్టం ఏమిటీ? అని కొందరు ప్రశ్నించవచ్చు. నష్టం ఏమీ వుండదు. మన గురించి మన ప్రత్యర్ధులు ప్రచారం చేయదలుచుకున్న అభిప్రాయాలే వాస్తవాలుగా ప్రసారం అవుతుంటాయి!!!


అదృష్టావశాత్తు ముస్లిం సమాజంలో ఆలోచనాపరులకు కొదవలేదు; దురదృష్టావశాత్తు వారికి స్వీయ సమాజంలో గుర్తింపులేదు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ ఉద్యమం సాగినప్పుడు ముస్లిం ఆలోచనాపరులు కొన్నాళ్ళు కొంచెం వెలుగులో కనిపించారు. ఆ తరువాత కథ మామూలే.  ముస్లిం ఆలోచనాపరులు ఒకవైపు; ముస్లిం మౌలానాలు మరోవైపు.


ఇంతటి అననుకూల పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజపు మేలు కోసం  తెలుగులో కొన్ని పత్రికలు వస్తున్నాయి. చాలాకాలంగా ‘గీటురాయి’ వస్తున్నది. నెల్లూరు నుండి రఫీక్ ‘ఇస్లామిక్ వాయిస్’ అనే పత్రికను తెస్తున్నారు. కడప నుండి ఇంకో పత్రిక వస్తున్నది.  ఇంకా ఒకటో రెండో పత్రికలు వస్తున్నట్టు విన్నాను. ఇప్పుడు హైదరాబాద్ నుండి స్కైబాబా ఆధ్వర్యంలో ‘చమన్’ అనే త్రైమాసిక వెబ్ పత్రిక మొదలైంది.  


కమ్మర్షియల్ మీడియా కత వేరు. దాని కమ్మర్షియల్ విలువలు వేరు. దాన్ని కమ్మర్షియల్ ఆర్ధిక పునాదులు వేరు.  సామాజిక పత్రికల నిర్వహణకు స్వఛ్ఛంద మేధోశ్రమ కావాలి; అందుకు అంకితభావంగల ఒక టీం కావాలి. ఆర్ధిక సహాయం కావాలి.  మేధోసామర్ధ్యంకలవారు  పత్రికలను నిర్వహిస్తే వాటిని ఇతరులు ఆర్ధికంగా ఆదుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల జనాభా కోటిన్నర వరకు వుంటుంది. వీరిలో అక్షరాశ్యులు కోటి మంది అనుకుంటే, వారిలో తెలుగు చదివేవారు 50 లక్షల మందికి పైగా వుంటారు. ఇది చిన్న మార్కెట్ ఏమీకాదు. ఈ యాభై లక్షల మంది ఒక్కొక్కరు నెలకు ఒక్క రూపాయి సబ్ స్క్రిప్షన్ (చందా) కడితే పది పత్రికల్ని అవలీలగా ప్రచురించవచ్చు. 


టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా విజృంభిస్తున్న కాలంలో  పత్రికల్ని తేవడం పెద్ద కష్టంకాదు. దానికి తెలుగు ముస్లిం సమాజం సిధ్ధమేనా అనేదే ముఖ్యం? 


ఏఎం ఖాన్  యజ్దానీ (డానీ)

సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు, ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్  

23-07-2022

CHAMAN Jul - Sep – 2022 REVIEW

 చమన్

జులై- సెప్టెంబరు 2022 సంచిక

పరిచయం

 

స్కైబాబా సంపాదకత్వంలో వస్తున్న చమన్ జులై-సెప్టెంబరు 2022 త్రైమాసిక వెబ్- పత్రిక అందింది. చాలా అందంగావుంది. వ్యాసాలు శీర్షికలు ఆలోచనల్ని రేకెత్తించేవిగా వున్నాయి.

 

స్కైబాబా ఎడిటోరియల్ ‘ముస్లింలు మూలవాసులని గుర్తెరగాలి’ అంటూ ఒక ప్రతిపాదనని ముందు పెట్టింది.  10, 12 శతాబ్దాల్లో ఘజ్నీ, ఘోరీల కత్తి మొనల మీద భారత ఉపఖండంలోనికి ఇస్లాం ప్రవేశించిందనే నేరేటివ్ ఒకటి ఇటీవల భారీ ప్రచారంలోవుంది. నిజానికి దానికి మూడు వందల ఏళ్ల క్రితమే ఇస్లాం ఇక్కడికి మతప్రచారకుల ద్వార  వచ్చింది.  అనేక రకాల సామాజిక  కారణాలవల్ల స్థానిక ఎస్టి, ఎస్సి, బిసి సామాజికవర్గాలు సమూహాలు సమూహాలుగా ఇస్లాం ను స్వీకరించాయి.           ఆ ఆనవాళ్లను ఇప్పటికీ భారత ముస్లిం సమాజంలో చూడవచ్చు. వారివల్ల ఒక మిశ్రమ సంస్కృతి ముస్లిం సమాజంలో ఏర్పడింది.  ఆరెస్సెస్ చీఫ్  మోహన్ భగత్ గారు గత ఏడాది జులై 4న ప్రార్ధనా రీతులు వేరయినంత మాత్రాన హిందూ ముస్లింలు వేరుకాదు. మనందరి డిఎన్ 40 వేల సంవత్సరాలుగా వర్ధిల్లుతోంది. మైనారిటీలు అంటే మనతోపాటు జీవిస్తూ వచ్చిన మన సోదరులు. అనాదిగా కలిసివుంటున్న వాళ్ళను మళ్ళీ కలపడం ఏమిటీ?” అంటూ చాలా ప్రేమను వ్యక్తం చేశారు.

ముస్లింలలోని పూర్వ ఎస్టిలను, పూర్వ ఎస్సీలను, పూర్వ బిసిలను  వరుసగా ఎస్టీ, ఎస్సీ,  బిసి జాబితాల్లో చేర్చాలి. ఎథినిక్ జస్టిస్ అంటే అదే. ఓసీ ముస్లింలుగా  కొనసాగుతున్న ముస్లింలను విద్యా, ఉపాధిరంగాల్లో వారి స్వల్ప ప్రాతినిధ్యాన్నిబట్టి, సాంస్కృతికంగా ఎదుర్కొంటున్న వివక్షనుబట్టి వాళ్ళను కూడ  బిసి జాబితాలో చేర్చాలి. అప్పుడే స్కైబాబా ప్రతిపాదనకు సరైన న్యాయం జరుగుతుంది. 

 

ఆయితే ఈ వాస్తవాన్ని గుర్తించాల్సింది ఎవరూ? ముస్లిం రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిందెవరూ?  ముస్లిం సమాజమా? హిందూసమాజమా?  ఎస్టీ ఎస్సి బిసి ఆలోచనాపరులా? అణగారిన ముస్లిం సమూహాలకు సామాజిక న్యాయం జరపాల్సింది ఎవరూ?  అనేవి అసలు ప్రశ్నలు.

 

ముస్లింల ఆర్ధిక పునాదుల్ని పెకలిస్తూ, హిజబ్ తదితర వివాదాలతో ముస్లీం బాలికల్ని విద్యకు దూరంచేస్తూ, ముస్లిం సంస్కృతీ సాంప్రదాలకు విరుధ్ధంగా  చట్టాలు తెస్తూ అంతిమంగా ముస్లింలను బలవన్మరణాల దిశగా నెట్టివేసే లక్ష్యంతో సాగుతున్న పరిణామాలను వివరిస్తుంది నశ్రీన్ ఖాన్ వ్యాసం ‘ఆకలితో హతమార్చే కుట్ర’.

 

ముస్లింల మీద రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాల్లో అప్రకటిత బహిరంగ వెలివేత ఒకటి సాగుతునద్దని అయినప్పటికీ ముస్లిం సమాజం అవేశానికి గురికాకుండ  ‘సహనమే విద్వేషాన్ని ఓడించే ఆయుధం’ గా భావించాలన్నారు  మహమ్మద్ అబ్బాస్.

 

మూడు రంగుల జాతీయ జెండా  నీడన నిలబడిఒళ్ళో  గాంధీజీ  అంబేడ్కర్ల  ఫొటోలు  పెట్టుకునిఒక  చేతితో  భారత  మతసామరస్య  రాజ్యాంగాన్ని  పట్టుకునిఇంకో చేతితో  పిడికిలి బిగించి   “న్యాయం,  స్వేఛ్ఛసమానత్వంసోదరభావం”  అంటూ  నినదిస్తూ ముస్లిం మహిళలు ఆరంభించిన షాహీన్ బాగ్ ఉద్యమం ఇంకా ముగియలేదన్నారు ‘షాహీన్ బాగ్ దాదీలకు సలాం’ వ్యాసంలో దాదా హయాత్.

సచిన్ టెండూల్కర్ ప్రేరణతో మన దేశంలో  క్రికెట్ పాపులారిటీ పెరిగినంతగా సానియా మీర్జా  వెలుగులోనికి వచ్చాక టెన్నిస్ పాపులారిటీ పెరగలేదు. వారసత్వాన్ని అందుకున్న ముస్లిం మహిళలు చాలా తక్కువ. . ఇప్పుడు  బంగారు బాక్సర్ నిఖత్ జరీన్ ముస్లిం మహిళలకు కొత్త ఇన్ స్పిరేషన్ గా మారిది.  ఈ నేపథ్యంలో పుట్టిన రజిత కొమ్ము కథ బాగుంది.

ప్రజల అధికారిణిగా పేరు తెచ్చుకున్న తస్లిమా ముహమ్మద్ సేవల్ని వివరిస్తూ స్కైబాబా రాసిన కథనం ఉత్తేజాన్ని ఇచ్చేదిగా వుంది. వర్తమాన ఢిల్లీ  రాజకీయాలకు కొంత కామెడీనీ, తెలంగాణ యాసనూ జోడిస్తూ  హుమయూన్ సంఘీర్ రాసిన ‘పయాంగాలు’ కొంచెం రిలీఫ్ ఇస్తుంది.

 

తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ గురుకులాలవల్ల ముస్లిం విద్యార్ధులకు జరుగుతున్న ప్రయోజనాల మీద కే సీతారాములు నివేదిక అనేక విలువైన సమాచారాన్ని మనకు అందిస్తోంది. 

ముస్లిం ప్రముఖుల్ని పరిచయం చేసే శీర్షికలో ఈసారి హిందూపురానికి చెందిన సామాజిక కార్యకర్త ఉమమర్ ఫారూఖ్ ఖాన్ సేవల్ని వలి హుస్సేన్ పరిచయం చేశారు.

తొలి తెలుగు  ముస్లిం కథకులు షేక్ హూస్సేన్ సత్యాగ్నిని స్కైబాబా చేసిన ఇంటర్వ్యూలో   ఆసక్తికర అంశాలు అనేకం వున్నాయి.  రాజు దుర్గాని కథ ‘ఇంతెజార్ మే’ కూడ ఒక మంచి కథ.

 

ఇనాయతుల్లా ‘రోజాదర్గా’, వై కృష్ణ జ్యోతి ‘మతసామరస్యం నేటి అవసరం’, నిఖిత ఆర్ ఎస్ ‘మత సామరస్యతను ముస్లింల దగ్గరే నేర్చుకున్నాను’, వెంకటరామయ్య పద్యాల ‘దేశ ఆర్ధిక వ్యవస్థ, ప్రజాస్వామ్యం ప్రమాదంలో వున్నాయి’, సైకాలజిస్ట్ విశేష్ ‘ఈ మతోన్మాదం ఒక టెర్రరిజం కాదా?’ ‘మన మందరం ఒక కుటుంబం – ఈ భావన మతానికి అతీతమైనది’, విజయ ‘మూలం తల్లిదండ్రుల దగ్గరే వుంది’ మొదలయిన వ్యాసాలన్నీ మతసామరస్యం నేటి సామాజిక అవసరమనే వాస్తవాన్నీ అనేక రూపాల్లో మనకు వివరించారు.

తొలి ముస్లిం సంస్కర్త ఫాతిమా షేక్ మీద సయ్యద్ నశీర్ అహ్మద్ రాసిన పుస్తకాన్ని చల్లపల్లి స్వరూపరాణి సమీక్షించగా, కవి-కథకురాలు  షాజహానా  సంపాదకత్వంలో వచ్చిన ‘మొహర్’ సంకలనాన్ని సంగిశెట్టి శ్రీనివాస్, ఫర్హత్ నశ్రీన్ రాసిన ‘ది గ్రేట్ మొఘల్స్’ ను షేక్ మెహబూబ్ బాషా  సమీక్షించారు.

‘సియాసీ’ కాలమ్ లో జిలుకర శ్రీనివాస్ రాసిన ‘ముస్లిం సమాజంలో ‘ఆధునిక ఉద్యమం’ తప్పక చదవాల్సిన వ్యాసం.  ఈ వ్యాసంలో ప్రస్తావించిన ఆధునికత, రాచరిక మతరాజ్యం, ప్రజాస్వామ్యం వగయిరా పదజాలాల నేరేటివ్స్ ఇప్పుడు మారిపోతున్నాయి. పెట్టుబడీదారీ వ్యవస్థ అప్పట్లో తన అవసరాల కోసం కొన్ని విలువల్ని ప్రచారం చేసింది; రాజకీయ నిర్మాణాల్నీ రూపొందించింది. దీనినే మనం గొప్పగా ఆధునికత అంటున్నాం. అదే పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త చారిత్రక సందర్భంలో చాలా నేర్పుగా  మతాన్ని ఆశ్రయిస్తున్నది. ప్రజ్వామిక ఎన్నికల ద్వార నియంతృత్త్వాన్ని చెలాయిస్తున్నది. మారిన సందర్భంలో ఈ వ్యాసాన్ని కొంచెం విపులంగా చర్చించాల్సివుంది. అయితే, భారత ముస్లిం సమాజం మీద ప్రేమతో రాసిన వ్యాసం ఇది.

లద్దాఫ్, నూర్ బాషా, దూదేకుల ముస్లింలకు బతికున్నప్పుడు ఉర్దూభాష,  చనిపోయక ఖబరస్థాన్  పెద్ద సమస్యలని వివరిస్తూ  రాసిన నూర్జహాన్ కథ ‘కిదర్’.

ఎయిడ్స్ కన్నా ఎక్కువగా  కరోనా భయపెట్టింది. తల్లిదండ్రుల్ని వదిలి పిల్లలు పారిపోవడమేకాదు  పిల్లల్ని వదిలి తల్లిదండ్రులు కూడ పారిపోయారు. దాదాపు అన్నిచోట్లా దిక్కులేని కరోనా శవాలకు అంత్యక్రియలు జరిపింది ముస్లిం యువతే. అలాంటి ఒక టీమ్ గురించి ఇందులో ఒక కథనం వుంది. దీన్ని ‘కరోనా జిహాద్’ అన్నవాళ్ళూ లేకపోలేదు.

ఇప్పుడపఃఉ సామాజికార్ధిక రాజకీయ సినిమా రంగాల్లో ‘సెలెక్టివ్ మెమొరి’ కొనసాగుతోంది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో తెరవని ఫైల్స్ వివరణ బాగుంది.

ఇక చివర్లో ‘భారత ముస్లింలతో మీడియా ఎలా వ్యవహరిస్తోంది?’ అనే నా వ్యాసం వుంది.

మొత్తమ్మీద ఒక ఉపయోగకరమైన ‘చమన్’ సంచిక ఇది.

July 24, 2022

Wednesday, 13 July 2022

భారత ముస్లిం సమాజంలో కొత్త చీలిక !

 భారత ముస్లిం సమాజంలో కొత్త చీలిక

స్వతహాగా కులం మతం వర్గీకరణను పాటించే సిధ్ధాంతం కలది కనుక సంఘపరివారం ముస్లిం సమాజంలోని సాంస్కృతిక అంతస్తుల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది.  

కమ్యూనిస్టుల నుండి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుండి అంబేడ్కరిస్టులకు, అక్కడి నుండి మనువాదులకు 80:20 సమీకరణ లక్ష్యం కొనసాగుతోంది. 

-       డానీ

 ఆధునిక కులవ్యవస్థ పని తీరును ఇప్పుడు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నది కులనిర్మూలనవాదులు కాదు; సంఘపరివారం. సంఘపరివారం అంటే యజమాని కులాల సాంస్కృతిక సంస్థ. యజమాని కులాల రాజకీయార్ధిక సాంస్కృతిక ప్రయోజనాలను కాపాడడానికి  శ్రామిక కులాలను కూడగట్టడంలో సంఘపరివార సంస్థలు చాలా క్రియాశీలంగా రేయింబవళ్ళు పనిచేస్తున్నాయి. 

రాజకీయ రంగంలో మనం బిజెపి, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, టిడిపి, టిఆర్ ఎస్, వైసిపి, జనసేన వగయిరాలను లెక్కలు వేస్తుంటాము. వీటిల్లో అన్ని పార్టీలు కలిపి ఒక ఎత్తు అయితే ఇప్పుడు బిజెపి వాటికన్నాఎక్కువ  ఎత్తు. కాంగ్రెస్ కు రెండు మూడు అనుబంధ సంస్థలుంటాయి. కమ్యూనిస్టు పార్టీలకు ఓ అరడజను అనుబంధ సంస్థలుంటాయి.  సంఘపరివారానికి ఓ వందకు పైగా అనుబంధ సంస్థలు వుంటాయి; వాటిల్లో ఒకటి బిజెపి. ఏ విధంగా చూసినా భారత దేశంలో నిర్మాణపరంగా బిజెపికి దరిదాపుల్లో నిలిచే పార్టి మరొకటి వుండదు. 

మనది కులవ్యవస్థ అని, దడికట్టిన కులవ్యవస్థ అని, మనువాదానికి అనువుగా ఏర్పడిన కులవ్యవస్థ అని, ముస్లింలు కూడ  భారత గడ్డ మీద హిందూ బిసిలతో పోలిన ఒక శ్రామిక కులం అనీ  అనేక సందర్భాల్లో అనేకమంది ఆలోచనాపరులు సూత్రీకరించారు.  అయితే, సంఘపరివారం ఇలాంటి విశ్లేషణలు, సూత్రీకరణలతో ఆగిపోలేదు. అంతకన్నా ముందుకు అడుగులేసి కుల వ్యవస్థ నుండి రాజకీయ, ఆర్ధిక సాంస్కృతిక ప్రయోజనాలను సమర్ధంగా సాధిస్తోంది.    

శ్రామికులు, శ్రామిక కులాలు, శ్రామిక మతాల దృక్పథం నుండి వర్తమాన భారత సమాజాన్ని అర్ధం చేసుకుని వారి రాజకీయార్ధిక సాంస్కృతిక సమస్యలకు  పరిష్కార మార్గాల్ని చూపగల ఆలోచనాపరులు ఇటు కమ్యూనిస్టు శిబిరంలోనూ, అటు అంబేడ్కరిస్టు శిబిరంలోనూ ఇప్పుడు కనిపించడంలేదు. ముస్లిం సమాజంలో ఆలోచనాపరులు తక్కువ. ఆ కొద్దిమందికి కూడ తమ స్వీయసమాజంలో గుర్తింపు కూడ తక్కువే. ప్రత్యర్ధుల శిబిరాల్లోని తాత్విక డొల్లతనాన్ని సంఘపరివారం గొప్ప నైపుణ్యంతో వినియోగించుకుంటున్నది. 

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కమ్యూనిస్టు పార్టి కొన్నాళ్ళు చాలా క్రియాశీలంగా వుండింది. దేశంలో శ్రామికులు 80 శాతం పెట్టుబడీదారులు 20 శాతం గనుక శ్రామికులదే అంతిమ విజయం అని వాళ్ళు గట్టిగా ప్రచారం చేసేవారు. మరోవైపు, అధికార కాంగ్రెస్ కూడ అంతే ధీమాగా మనం 80 శాతం వాళ్ళు 20 శాతం అనేది. 1952 నాటి తొలి లోక్ సభ ఎన్నికల్లో, జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలోని సోషలిస్ట్ పార్టికి 10.59 శాతం, ఆచార్య కృపలాని నాయకత్వంలోని  కిసాన్ మజ్దూర్ ప్రజా పంచాయత్ కు 5.79 శాతం, అజయ్ ఘోష్ నాయకత్వంలోని సిపిఐకు 3.39 శాతం వెరసి 20 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటికి 80:20  లెక్క అలా సరిపోయింది.    

1990వ దశకం ఆరంభంలో తూర్పు యూరోపు సోషలిస్టు దేశాలు, సోవియట్ రష్యా సంయుక్త రాష్ట్రాల (USSR) పతనం అనంతరం  సామ్యవాద సిధ్ధాంతం మీద నమ్మకం ప్రపంచ వ్యాప్తంగా నైతిక సంక్షోభంలో పడింది. భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు తమ 80 శాతం ఓటు బ్యాంకును ఆస్వాదించకుండానే వర్గ విశ్లేషణల స్థానాన్ని కులమత విశ్లేషణలు ఆక్రమించేశాయి. శ్రామిక కులాలు, శ్రామిక తెగలు, శ్రామిక మత సమూహాలు ఏకమయితే ముందు రాజకీయ అధికారం,  ఆ వెనుక రాజ్యాధికారం దక్కుతుందనే కొత్త సిధ్ధాంతాలు పుట్టుకు వచ్చాయి. కాన్షీరామ్ చాలా ధీమాగా  మనం 80 శాతం వాళ్ళు 20 శాతం అనేవారు. కాన్షీరామ్ ప్రయోగం అప్పట్లో ఉత్తర ప్రదేశ్ లో పని చేస్తున్నట్టే  కనిపించింది. తరువాతి కాలంలో అక్కడి రాజకీయ సామాజిక పరిణామాలు కాన్షీరామ్ ప్రయోగం మీద కూడ నమ్మకం సడలేలా చేశాయి. 

“కుల వ్యవస్థ అంటే కేవలం శ్రమ విభజనమాత్రమేకాదు; అది శ్రామికుల విభజన కూడ” అన్నాడు అంబేడ్కర్. ఈ సామాజిక విభజనకు సైధ్ధాంతిక సమర్ధనను ఇచ్చిన మనువాదులే ఇప్పుడు ఈ విభజనని తమ రాజకీయార్ధిక సాంస్కృతిక ప్రయోజనాల కోసం అత్యంత సమర్ధంగా వాడుకుంటున్నారు.    

ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు అటవీ ప్రాంతాల్లో మైదాన వాసులకు వ్యతిరేకంగా  గిరిజనుల్ని వేగంగా  సమీకరిస్తున్నాయి, మైదాన ప్రాంతాల్లో యజమాని కులాలను బూచీలుగా చూపి బిసి సమూహాలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయి. భారత ముస్లిం సమాజంలోని వెనుకబడిన సమూహాలకు విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించింది   సంఘపరివారం అండతో పనిచేస్తున్న బిసి సంఘాలే. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం బలంగావున్న అడవిప్రాంతాల్లోని గిరిజనులు క్రమంగా సంఘపరివారానికి చెందిన  వనవాసికళ్యాణ్ శాఖల్లో చేరుతున్నారు. 

సంఘపరివారం ప్రభావం ఎస్సీ సమూహాల్లోనూ  చొచ్చుకుపోయింది. తమను తాము గొప్ప అంబేడ్కరిస్టులుగా ప్రకటించుకున్న రామ్ విలాస్ పాశ్వాన్, ఉదిత్ రాజ్ తదితరులు బిజెపి సేవల్లో తరించారు. అంబేడ్కర్ ఆశయాలతో పుట్టిన రిపబ్లికన్ పార్టి శాఖల్లో ఒకటైన ఆర్పిఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా వున్నారు.  ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమకాలంలో జగ్జీవన్ రామ్ పేరు బలంగా ముందుకు వచ్చింది. ఆ కారంణంగా కావచ్చు మాదిగ సామాజికవర్గంలోని ఒక సెక్షన్ లో అంబేడ్కర్ మీద కొంత అసంతృప్తి కొనసాగుతోంది. ఈ కొద్దిపాటి సందు చాలు సంఘపరివారం దూరిపోవడానికి.  ఇటీవల కోనసీమ జిల్లా పేరుకు ముందు అంబేడ్కర్ పేరును చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన నిరసనల్లో మాదిగ సామాజికవర్గానికి చెందిన కొందరు ఉత్సాహంగా పాల్గొనడం కొత్త పరిణామం. దీని వెనుకా సంఘపరివారం ప్రభావం వుంది. 

సామాజికరంగంలో ముస్లింలు, క్రైస్తవులను, రాజకీయ రంగంలో కమ్యూనిస్టుల్నితప్ప మిగిలిన సమస్త సమూహాలను ఒకదాని వెనుక మరోదాన్ని సంఘపరివారం చాలా సులువుగా ఆకర్షిస్తోంది. ఈ ధైర్యంతోనే ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి “మనం 80 శాతం-వాళ్ళు 20 శాతం” అంటూ ధీమాగా ప్రకటించింది. కమ్యూనిస్టుల నుండి కాంగ్రెస్ కు, కాంగ్రెస్ నుండి అంబేడ్కరిస్టులకు, అక్కడి నుండి మనువాదులకు 80:20 సమీకరణ లక్ష్యం కొనసాగుతోంది. 

ఇప్పుడు వాళ్ళు కమ్యూనిస్టులు, క్రైస్తవులు, ముస్లింలను సహితం విభజించి తమ వైపుకు లాక్కొనే ప్రయత్నాలు మొదలెట్టారు.  పశ్చిమ బెంగాల్ లో మూడున్నర దశాబ్దాలపాటు అధికారంలోవున్న మార్క్సిస్టు పార్టికి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడ రాలేదు. సిపియం ఓట్లు 15 శాతం పడిపోగా బిజెపి ఓట్లు 28 శాతం పెరిగాయి. కమ్యూనిస్టుల ఓట్లను బిజెపి లాగేసిందని విడిగా చెప్పనవసరంలేదు. అన్నేళ్లు కమ్యూనిస్టు పార్టిలకు అభిమానులుగా వున్నవాళ్ళు ఇలా సంఘ్ పరివారంలో చేరిపోవడానికి  దారితీసిన  అంశం ఏమిటీ? అనేది ఎవరికయినా రావలసిన ప్రశ్న. దానికి సమాధానం మతం. 

ముస్లింల జనాభా అధికంగా వున్న లక్షద్వీప్, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలు  కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే. వాటిని అసెంబ్లీ ఎన్నికలకు అవకాశం లేకుండా చేశారు. క్రైస్తవ ఓటర్లు  అత్యధికంగా వున్న , నాగాలాండ్, మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లో, బిజెపి వ్యతిరేక పక్షాల ఓట్ల శాతం తగ్గుతుంటే, బిజెపి మిత్రపక్షాల ఓట్లశాతం పెరుగుతోంది. అక్కడి రాజకీయ సమీకరణల్లో ఏం జరుగుతోందో వూహించడం కష్టంకాదు. ఇప్పుడు సంఘపరివారం రాజకీయాల్లో ముస్లింల వంతు వచ్చింది. 

బయటివారు తరచూ పొరబడుతున్నట్టు భారత ముస్లిం సమాజం ఏకశిలా సదృశ్యం ఏమీకాదు. షియాలు, సున్నీలు, సూఫీలు అనే తెగలు, దేవ్ బంద్, బరేల్వి  పీఠాలు, ఇస్లామీ హింద్, ఉలేమా ఏ హింద్,  తబ్లిగ్, అహ్లె హదీస్  వగయిరా జమాతులు, అష్రాఫ్, అజ్లాఫ్, అర్జాల్ వంటి సాంస్కృతిక అంతస్తులు వగయిరాలతో భారత ముస్లిం సమాజం ఒక విభజిత సమూహం. 

భారత ముస్లిం సమాజంలో సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్ మొదలయిన కొన్ని సమూహాలను సాంప్రదాయికంగా అష్రాఫ్ అంటారు. వీరిని ముస్లిం ఓసిలు అనవచ్చు.  నూర్ బాషా, లద్దాఫ్ వగయిరా సమూహాలను సాంప్రదాయికంగా అజ్లాఫ్ అంటారు. వీరిని ముస్లిం బిసిలు అనవచ్చు. గారడీ సాయిబులు, పాములవాళ్ళు తదితర సమూహాలను సాంప్రదాయికంగా అర్జాల్ అంటారు. వీరిని ముస్లిం ఎస్సీలు, ఎస్టిలు అనవచ్చు. స్వతహాగా కులం మతం వర్గీకరణను పాటించే సిధ్ధాంతం కలది కనుక సంఘపరివారం ముస్లిం సమాజంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని  తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది.   

ముస్లిం జనాభా ఎక్కువగావున్న నగరాల్లో ఉత్తరప్రదేశ్ లోని లక్నో ఒకటి. అక్కడి నుండి అటల్ బిహారీ వాజ్ పాయి ఐదుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు.  బిజెపి గెలుపు కోసం ముస్లిం సమాజంలోని చీలకలు తెచ్చే  ప్రయత్నాలు ఆ సమయంలోనే మొదలయ్యాయి. సంఘ్ పరివారం సున్నీలకు మాత్రమే వ్యతిరేకంగానీ షియాలను మిత్రులుగా భావిస్తుందని వాజ్ పాయి సంకేతాలు ఇచ్చేవారు. హైదర్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు, లక్నో, గాజియాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల నుండి మూడుసార్లు ఎన్నికయిన రాజ్ నాథ్ సింగ్ కూడ వాజ్ పాయి వేసిన బాటలో ఓట్ల కోసం షియా నాయకులతో సన్నిహితంగా మెలిగేవారు. 

బిజెపి ఆకర్ష్ పథకానికి లోనైన షియా నేత బుక్కల్ నవాబ్ ఏకంగా ‘ఆరెస్సెస్’  అనే పేరు వచ్చేలా ‘రాష్ట్రీయ షియా సమాజ్’  అనే సంస్థను స్థాపించారు. ఈ  సాన్నిహిత్యం కారణంగా షియా ప్రతినిధులకు ఉత్తరప్రదేశ్ లోని బిజెపి ప్రభుత్వంలోనూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ కొన్ని పదవులు లభించాయి. ముక్తార్ అబ్బాస్‌ నక్వీ, మొహసిన్ రజా, ఘైరుల్ హసన్ రిజ్వీ వంటి పేర్లు అధికార వరండాల్లో కొన్నాళ్లు మెరిశాయి. చారిత్రక వైచిత్రి ఏమంటే, దేశ విభజనకు కారకుడిగా సంఘపరివారం నిత్యం నిందించే ముహమ్మద్ ఆలీ జిన్నా షియా సామాజికవర్గానికి చెందినవారే. 

షియాల తరహాలో కొందరు సూఫీ నేతల్ని సహితం చేరదీసే ప్రయత్నాలు బిజెపి ముమ్మరంగా సాగించింది. 2016లో ఢిల్లీలో జరిగిన ప్రపంచ సూఫీల సదస్సును  ప్రధాని నరేంద్ర మోదిజీ ప్రారంభించారు.  అయితే, మొత్తం భారత షియా, సూఫీ సమూహాలు బిజెపి, ఆరెస్సెస్ ప్రవచించే హిందూరాష్ట్ర సిధ్ధాంతాలతో రాజీ పడిపోయాయనడం చాలా పెద్ద తప్పు అవుతుంది. హిందూ అనే పదాన్ని సంఘపరివారం దేశం అనే అర్ధంలో వాడితే సున్నీ, షియా, సూఫీలు ఎవ్వరికీ అభ్యంతరం వుండదు. హిందూ అనే పదాన్ని సంఘపరివారం మతం అనే అర్ధంలో వాడుతోంది. అదే వివాదానికి మూలం. 

బిజెపితో పొలిటికల్ హానీమూన్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఆలోచనాపరులు సహితం షియా సమూహాల్లో వున్నారు.  “అధికారానికి దగ్గరగా కనిపిస్తున్న షియా నాయకులు పచ్చి స్వార్థపరులు. ఈ విషయం బిజెపికి కూడ తెలుసు. షియా-సున్నీల మధ్య  విభజన భాష మాట్లాడేవారిని ఆ పార్టి చేరదీస్తోంది. షియా నాయకులు కొందరు అలా అధికారానికి చేరువ కావచ్చుగానీ షియా ప్రజలకు వాళ్ళేమీ అధికార ప్రతినిధులుకారు” అంటూ షియా సామాజికవర్గ ప్రముఖులు, లక్నో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హైదర్ అబ్బాస్ అనేకసార్లు తీవ్రంగా విమర్శించారు. 

బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టాల్ని తీసుకుని వచ్చినపుడు సున్నీలతోపాటూ షియా, సూఫీ సమూహాలు సహితం గట్టిగా వ్యతిరేకించాయి. పరిణామం బిజెపికి మింగుడుపడలేదు. దానితో, ముస్లిం సమాజంలో తమకు అనువుగా మారగల కొత్త సమూహాల కోసం పార్టి అన్వేషణ ఆరంభించింది ఇటీవల హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో జులై 3న  ప్రధాని నరేంద్ర మోదీజీ ప్రసంగిస్తూ, హిందూయేతర సమూహాల్లోని పీడిత, అణగారిన వర్గాలను సమీకరించడానికి కృషి చేయాలని పార్టి నాయకులకు పిలుపునిచ్చారు. ఆ మరునాడే ప్రధాని ఆదేశాలు అమల్లోనికి వచ్చేశాయి.   

షియా తెగకు చెందిన ముఖ్తార్ అబ్బాస్ నక్వి బిజెపి మద్దతుతో ఉత్తరప్రదేశ్ నుండి  రాజ్యసభకు ఎన్నికై కేంద్ర ప్రభుత్వంలో, మైనారిటీ వ్యవహారాల మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగారు. మొన్న జులై 4న ఆయన రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. బిజెపి ఆయనకు మరో ఛాన్స్ ఇవ్వలేదు. మరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  యోగీ ఆదిత్యనాథ్ తన మంత్రివర్గంలో దానిష్ ఆజాద్ ఆన్సారికి స్థానం కల్పించారు. అన్సారీ సున్నీ బిసి. వీరిని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో పాస్మందా అంటారు. పర్షియన్ భాషలో పాస్మందా అంటే ‘వెనుకబడినవారు’ అని అర్ధం. 

సంఘపరివారం షియాలు, సూఫీలను పక్కన పెట్టి సున్నీ ముస్లిం సమాజంలోని వెనుకబడినవర్గాల (పాస్మందాలు)  మీద దృష్టి పెట్టిందనడానికి ఇది తాజా ఉదాహరణ. భారత ముస్లిం సమాజంలో కొత్త చీలిక రాబోతున్నదనడానికి ఇది తొలి సంకేతం

ఆంధ్రప్రదేశ్ లో వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఓ 14 విభాగాలకు చెందిన  ముస్లిం వెనుకబడిన తరగతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యా, ఉపాధిరంగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీనిమీద సంఘ్ పరివారమే వివాదాన్ని రేపడంతో  ప్రస్తుతం  ఈ సౌకర్యం సుప్రీం కోర్టులో స్టేతో కొనసాగుతోంది.  ఇది ఏ రోజైనా ఆగిపోవచ్చనే భయం ముస్లిం వెనుకబడిన తరగతుల్ని వెంటాడుతోంది. ఎలాగూ ముస్లిం వెనుకబడిన తరగతుల్ని ఆకర్షించే యత్నంలో సంఘపరివారం వుంది కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం వెనుకబడిన తరగతులకు ఆ 4 శాతం రిజర్వేషన్లు శాశ్వితంగా దక్కేలా న్యాయ ప్రక్రియ సాగించాలి. అంతే కాకుండ వీరందరినీ జాతీయ ఒబిసి జాబితాలోనూ చేర్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి జాతీయ ఒబిసి జాబితాలో ప్రస్తుతం మెహతర్ (పాకీ, పారిశుధ్ధ్య కార్మికులు) ముస్లింలకు మాత్రమే స్థానం వుంది. 

శ్రామికులు, శ్రామిక కులాలు, శ్రామిక మత సమూహాల ఆకాంక్ష ‘వర్గ- కుల-మత వివక్ష, అణిచివేతలు లేని వ్యవస్థ.  ఈ సమూహాల వెతల్ని తొలగించడం వర్తమాన ప్రభుత్వాలతో అయ్యేపని కాదు. కనీసం ఈ  వెతల్ని తగ్గించడానికయినా ప్రభుత్వాలు కొన్ని ఉద్దీపన చర్యల్ని ప్రవేశపెడుతుండాలి. వీటినే మనం affirmative action, రిజర్వేషన్లు అంటుంటాం. 

శిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు తమంతతాముగా  రిజర్వేషన్లు లేవు. మెజారిటీ మత  సమూహం నుండి మైనారిటీ మత సమూహాలు తరచూ తీవ్రమైన సాంస్కృతిక వివక్షను ఎదుర్కొంటుంటాయి. బాహ్య వివక్షను ప్రమాణంగా తీసుకుని మైనారిటీ సమూహాలన్నింటినీ  బిసి / ఒబిసి జాబితాలో చేర్చాలి. కానీ అలా జరగడంలేదు. ఎస్సీ- క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులకు బిసి/ఒబిసి రిజర్వేషన్లున్నాయి. వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు పొందాలంటే తాము హిందూ ఎస్సీలని నిరూపించుకోవాలి. అదో ప్రోటోకాల్. పేరులో ‘అహ్మద్’ అనే పదంవుంటే ‘బిసి-ఇ’ సర్టిఫికేట్లు జారీ చేసేదిలేదని ఇటీవల కొన్ని చోట్ల తహశీలుదార్లు స్వంత ఫర్మానాలు జారీచేస్తున్నారు. విద్యా, ఉపాధిరంగంలో రిజర్వేషన్లు పొందాలంటే తాము ఓసి ముస్లింలు కాదని నిరూపించుకునే బాధ్యత అప్లికెంట్ దే  అన్నమాట. 

ఈ రిజర్వేషన్లు తరచూ ఒక సంధిగ్ధతను సృష్టిస్తుంటాయి. సమాజంలో వివక్ష, అణిచివేతలు లేకుంటే  ఎవరికీ ఉద్దీపన చర్యలతో పని వుండదు. ఉద్దీపన చర్యలు పొందాలంటే వివక్ష, అణిచివేతలు ఉన్నాయని నిరూపించుకుంటూ వుండాలి. అంటే రిజర్వేషన్లను ఆస్వాదిస్తున్నవారికి కులమత వివక్ష అణిచివేతలు అనేవి తొలగించుకోవాల్సిన కీడులుగాగాక భద్రపరచుకోవాల్సిన విలువలుగా మారిపోతాయి. ఇదే నయా మనువాదుల రాజకీయాలకు ప్రాణవాయువుగా పనిచేస్తోంది.  

హిందూయేతర మత సమూహాలు కాంగ్రెస్ నో, కమ్యూనిస్టుల్నో, మరో బిజెపియేతర పక్షాన్నో సమర్ధిస్తున్నాయని బిజెపికి ఒక స్పష్టమైన అంచనా వుంది. ఆ మత సమూహాల్లో కుల ప్రాతిక మీద రాజకీయ విభజన సృష్టించడానికి  బిజెపి సర్వశక్తుల్ని వినియోగిస్తున్నది. దీనివల్ల ఆ పార్టి  రెండు రకాల ప్రయోజనాలను ఆశిస్తున్నది.  మొదటిది; ప్రతిపక్షాల ఓటు బ్యాంకు కుచించుకుపోవాలి. రెండోది; బిజెపి ఓటు బ్యాంకు విస్తరించాలి. హిందూయేతర సమూహాల్లోని దిగువ తరగతులు తమను బలపరుస్తాయని  కమలనాధులు గట్టిగా నమ్ముతున్నారు. వీటి ఫలితాలు 2024 పార్లమెంటు ఎన్నికల్లో  తమకు అనుకూలంగా మారుతాయని బిజెపి వ్యూహకర్తలు  అంచనాలు వేస్తున్నారు. 

ప్రధాని పిలుపు కేవలం ముస్లిం సమాజం కోసం కోసం మాత్రమే ఇచ్చిందికాదు. హిందూయేతర సమూహాలైన క్రైస్తవ, శిక్కు, బౌధ్ధ మత సమూహాలకు కూడ ఇది వర్తిస్తుంది. షాహీన్ బాగ్ ఉద్యమానికి శిక్కు ప్రతినిధులు సంఘీభావాన్ని తెలపడం బిజెపికి మింగుడుపడలేదు. అనంతరం ఢిల్లీలో సాగిన రైతుల ఆందోళనతో శిక్కు సమూహం బిజెపికి కొరకరాని కొయ్యగా మారింది. పంజాబ్ లో శిక్కు సమూహంలోని దిగువ తరగతుల్ని బిజెపి ఓటర్లుగా మార్చే ప్రక్రియను వేగవంతం చేశారు.   ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మిజోరం, మేఘాలయల్లోనేగాక దక్షణాది రాష్ట్రమైన కేరళలోనూ  క్రైస్తవ సమాజంలోని దిగువ అంతస్తుల్ని ఆకర్షించే పని ఇక వేగాన్ని పుంజుకుంటుంది. 

విభజించి పాలించు వ్యూహంతో బిజెపి ముందుగా షియా తెగను చేరదీసింది. ఆ పిదప సూఫీలను దగ్గరకు తీసుకుంది. ఆ రెండు ప్రయోగాలు కొనసాగలేదు. ‘తక్షణ ట్రిపుల్ తలాక్’ నెపంతో ముస్లిం మహిళలకు గాలం వేసింది. ఆ పాచికా పారలేదు. ఇప్పుడు పాస్మందా ముస్లింలకు ‘స్నేహ’ హస్తాన్ని చాచుతోంది. అదీ అంత సులువైన వ్యవహారం కాదు. అక్కడా దానికి భంగపాటు తప్పదు.  

   ఇలాంటి కుట్ర పూరిత ఎత్తుగడలతో కాకుండ సచార్ కమిటీ సిఫార్సుల్ని అమలు పరిస్తే అది రాజకీయంగా ముస్లింల అభిమానాన్ని పొందవచ్చు.  అలా చేస్తుందా? చేయడం దానికి సాధ్యమేనా? 

(రచయిత సీనియర్ పాత్రికేయులు,
సమాజ విశ్లేషకులు, ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్)

  విజయవాడ, 13 జులై 2022

‘భారత ముస్లిం సమాజంలో కొత్త చీలిక’

డానీ వ్యాసం  - ‘వీక్షణం’ ఆగస్టు- 2022 

https://veekshanam.files.wordpress.com/2022/08/08.-august-2022.pdf?fbclid=IwAR1qAvyX8CmzS3D7JmWALF0dE4OG-tIB0BaJTYI-51bS4yctu-WhQma16vE