Thursday, 28 July 2022

What made P Sundarayy to resign to the post of GS and CC

 ఈనాటి రాజకీయ విషాదాన్ని

ఆనాడే పసిగట్టి హెచ్చరించిన

దార్శినికులు పుచ్చలపల్లి సుందరయ్య!

 

 

మొదటిభాగం

మనదేశంలో సిపిఐ నుండి సిపిఐ (యం), సిపిఐ (యం) నుండి సిపిఐ (ఎంఎల్) పార్టీలు పుట్టాయి. కొత్త వైరం గాబట్టి సిపిఐ (ఎం ఎంఎల్) పార్టీలు సిపిఐ కన్నా సిపిఐ (యం)ను ఎక్కువగా విమర్శిస్తూ వుండేవి. మా నాయకుడు కొండపల్లి సీతారామయ్యకు కూడ చండ్ర రాజేశ్వర రావుగారి విషయంలో ఓ సాఫ్ట్ కార్నర్ వుండేది. అంచేత మాకూ పుచ్చలపల్లి సుందరయ్యగారి మీద అంతగా సదభిప్రాయం వుండేది కాదు.

 

నేను సుందరయ్యగారి ఉపన్యాసాలు కొన్ని విన్నాను. అవి ఎన్నికల ప్రచార సభలు కనుక అవేమీ నాకు అంతగా రుచించలేదు.  వారి  ‘వీర తెలంగాణ - విప్లవ పోరాటం, గుణపాఠాలు’ కూడ చదివాను.  1948 నాటి పోలీస్ యాక్షన్ సందర్భంగానూ, ఆ తరువాతా నైజాం ఎస్టేట్ లో ముస్లింల మీద చాలా  దౌర్జన్యాలు జరిగాయి. వేల సంఖ్యలో ముస్లింలను చంపేశారు; వాళ్ళ అస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ స్త్రీలను .........  శారు. నాలాంటి సామాజిక నేపథ్యం వున్నవారికి ఇవి చాలా ముఖ్యం. ఇంతపెద్ద స్థాయిలో సాగిన ఒక నరమేధాన్ని ఆ పోరాట చరిత్రలో  నమోదు చేయదగ్గ అంశంగా సుందరయ్యగారికి అనిపించకపోవడం చాలా నిరుత్సాహాన్ని కల్గించింది.

 

కొన్నాళ్ళ క్రితం మిత్రుడు దుర్గం సుబ్బారావు “సిపిఐ (మార్క్సిస్టు) పార్టి ప్రధాన కార్యదర్శి పదవికి నేనెందుకు రాజీనామా చేశాను?’ అన్న సుందరయ్యగారి పుస్తకం పిడిఎఫ్ లింకును నాకు పంపించాడు. 1980లలో ఏదో ఓ నక్సలైటు గ్రూపు ఆ పుస్తకాన్ని ప్రచురించినట్టుంది. అప్పట్లో ఆ పుస్తకాన్ని చదవాలనిపించలేదు. ఆ లింకును కూడ తెరచి చూడలేదు.

 

బెంగాల్  ను దాదాపు మూడున్నర దశాబ్దాలు పాలించిన సిపియం కు  గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడ రాలేదు. పైగా, సిపియం అభిమానులు చాలా మంది బిజెపికి భారీగా మద్దతు ఇచ్చినట్టు  ఎన్నికల గణాంకాలు చాలా స్పష్టంగా తేల్చాయి. వామపక్ష రాజకీయాల్లో ఇది ఒక దిగ్బ్రాంతికర పరిణామం. బెంగాల్ ఎన్నికల ఫలితాల మీద చర్చ సందర్భంగా మిత్రుడు భార్గవ గడియారం ఓ మాటన్నాడు. ఈ ప్రమాదాన్ని సుందరయ్యగారు 1975లోనే పసిగట్టి సిపియం నాయకుల్ని గట్టిగా హెచ్చరించారు అన్నాడు.

 

          చండ్ర రాజేశ్వరరావు నాయకత్వంలోని సిపిఐ 1975-77 నాటి ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ను సమర్ధించి  ఒక చారిత్రక ఘోర తప్పిదానికి పాల్పడిందని మనకు తెలుసు.  ఇప్పటికీ సిపిఐ జాతీయ నాయకులు ఆ తప్పును గుర్తు చేసుకుని ఆత్మవిమర్శ చేసుకుంటుంటారు. అయితే సిపిఐ (ఎం) కేంద్ర నాయకత్వం అదే ఎమర్జెన్సీ కాలంలో అంతకన్నా ఘోరమైన చారిత్రక తప్పిదానికి పాల్పడిందని సుందరయ్యగారి రాజీనామా లేఖను చదివితేగానీ అర్ధంకాదు.

 

ఇందిరాగాంధి 1975 జూన్ 25న ఎమర్జెన్సీని విధించారు. దాదాపు రెండు నెలల తరువాత 1975 ఆగస్టు 22న సుందరయ్యగారు సిపిఐ (మార్క్సిస్టు) పార్టి ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు.  ఇంగ్లీషులో A4 సైజులో ఈ డాక్యుమెంట్ 102 (A5 డెమ్మీ సైజులో 204) పేజీలుంది.

 

(ఈ కింది లింకులో  సుందరయ్యగారి రాజీనామా  డాక్యుమెంట్ వుంది.)

https://www.marxists.org/subject/india/cpi(m)/letter-resignation.pdf

 

“ప్రియమైన కామ్రేడ్స్!” అనే సంభోధనతో మొదలయిన ఈ డాక్యుమెంట్  ఆరంభంలోనే సుందరయ్యగారు తన రాజీనామాకు దారితీసిన పది కారణాలను క్లుప్తంగా సూటిగా ప్రకటించారు. ఆ తరువాత ఈ అంశాలను ఓ రెండు వందల పేజీల్లో చాలా విపులంగా వివరించారు.

 

వాటిల్లో వారు చెప్పిన మొదటి కారణం :

 

1.      

“సామ్రాజ్యవాద అనుకూల జన్ సంఘ్ ను నడిపించే ఆరెస్సెస్ అలనాటి జర్మనీలో నాజీల పౌర పారా-మిలటరీ దళం వంటిది. వాళ్ళతో చేతులు కలపడం  మన పార్టీకేగాక, మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ వుంటున్న ప్రజాస్వామిక సమూహాలకు చాలా ప్రమాదకరం. ఈ విషయం బయటికి తెలిస్తే, సామ్యవాద శక్తులు, సామ్రాజ్యవాద వ్యతిరేక సమూహాలు మనల్ని వెలివేస్తాయి. అయినప్పటికీ,  ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామనే వంకతో మన కేంద్ర కమిటీలోని   అత్యధికులు జన్ సంఘ్ తో జతకట్టి సంయుక్త కార్యాచరణ చేబట్టాలని నిర్ణయించారు గాబట్టి పార్టి ప్రధాన కార్యదర్శి పదవికి నేను రాజీనామా చేయక తప్పడంలేదు”

 

ఈ ఆరంభ వాక్యాలు చదవగానే నేను సుందరయ్యగారి ముందు చూపుకు, ఆత్మగౌరవానికీ, నిజాయితీకి  ఫిదా అయిపోయాను.

 

I love you Sir.

 

(ఇంకా చాలా వుంది)

 

 

ఇందిరాగాంధిని సిపిఐ అతిగా ప్రేమించింది!

ఇందిరాగాంధీని సిపిఎం అతిగా ద్వేషించింది!

ఒకరిని మించిన తప్పు మరొకరిది!

 

 

రెండవ భాగం

 

దెయ్యాన్ని వదిలించుకోవడానికి భూతాన్ని నెత్తి మీద పెద పెట్టుకుంటే ఎలా? రాజీనామా డాక్యుమెంట్ లో సుందరయ్యగారి మొత్తం ఆవేదన, ఆందోళన ఇదే.

 

ఎమర్జెన్సీ కాలంలో సిపిఐ చేసిన తప్పిదం ప్రభావం ఓ పదేళ్ళ పాటు కొనసాగింది. అదేకాలంలో సిపియం చేసిన తప్పిదం ప్రభావం నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతూ ఇప్పుడు పరాకాష్టకు చేరుకుంది. 2020వ దశకంలో జరుగబోయే రాజకీయ. ఆర్ధిక, సాంస్కృతిక, ధార్మిక పరిణామాల్ని సుందరయ్యగారు 1970వ దశకంలోనే దర్శించగలిగారు. అది వారి గొప్పతనం. వారి హెచ్చరికను పెడచెవిన పెట్టినవారికి చరిత్ర దిమ్మదిరిగే గుణపాఠం నేర్పింది.

 

“ఎమర్జెన్సీ” ఇందిరా గాంధీని వ్యతిరేకించకూడదా?  అనే ప్రశ్న ఈ సందర్భంలో సహజంగా ముందుకు వస్తుంది. తాను ఇలాంటి ప్రశ్నను ఎదుర్కోవాల్సి వుంటుందని సుందరయ్యగారికి తెలుసు. ఆ ప్రశ్నకు సమాధానం కూడ వారి దగ్గర సిధ్ధంగా వుంది.

 

ఇందిరాగాంధీ రాజకీయ విధానాలను తీవ్రంగా ఖండించాలి. ఆ విషయంలో వారు రాజీపడదలచలేదు. అయితే, ఆమె తప్పుడు విధానాలను ఖండించే వంకతో అంతకన్నా ప్రమాదకరమైన విధానాలుగల సమూహాలను ప్రోత్సహిస్తే కమ్యూనిస్టుల ప్రాధమిక ఉనికికే ముప్పు వస్తుంది అనేది వారి ఆందోళన. రాజకీయాల్లో భారతీయ జన సంఘ్ ను, కార్మికసంఘాల్లో  భారతీయ మజ్దూర్ సంఘ్ ను దూరంగా పెట్టి ఇతర శక్తులతో జతకట్టి ఇందిరాగాంధీనీ, ఎమర్జెన్సీనీ వ్యతిరేకించాలనేది వారి సూచన.

 

పౌర స్వేఛ్ఛ, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఏకాభిప్రాయంగల  శక్తులు అన్నింటితో అంశాల వారీగా  కలిసి పని చేయవచ్చు. అంతేగానీ, ప్రగతి నిరోధక శక్తులతో రాజకీయ కూటమిని  ఏర్పాటు చేయడం తప్పు అనేది సుందరయ్యగారి ధృఢ అభిప్రాయం.

 

ఆనాటి  రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల్ని వారు మూడు రకాలుగా వర్గీకరించారు. వీటిల్లో మొదటిది; అధికార (ఇందిరా) కాంగ్రెస్, రెండోది ప్రజాస్వామిక భావాలుగల విపక్షాలు; మూడోది; ఇందిరా కాంగ్రెస్ ను మించిన అభివృధ్ధి నిరోధక విపక్షాలు.  మొదటి వర్గాన్ని నిలవరించడానికి రెండోవర్గంతో కలవాలిగానీ, మూడో వర్గాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కలుపుకోకూడదని వారు ఈ డాక్యుమెంట్ లో అనేక సార్లు హెచ్చరించారు.

 

అంతకు ముందే కాంగ్రెస్ కొత్త పాతగా చీలి వుంది. కొత్త కాంగ్రెస్ తరువాతి కాలంలో ఇందిరా కాంగ్రెస్ గా మారింది. ఇందిరా కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నది స్పష్టం. అందులో మరో అభిప్రాయం లేదు. అయితే కాంగ్రెస్ శిబిరంలో ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తున్నవారు అంతకన్నా  ప్రజావ్యతిరేకులు. కాంగ్రెస్ బయటవున్న స్వతంత్ర పార్టి ప్రతీఘాత శక్తి. జనసంఘ్ మతఅహంకార ప్రతీఘాత శక్తి. జయప్రకాశ్ నారాయణ్ సోషలిస్టుగా విఫలమయ్యాక జనసంఘ్, స్వతంత్రపార్టి వంటి ప్రతీఘాత శక్తుల్ని చేరదీసి కొత్త రాజకీయ సమీకరణ తయారు చేస్తున్నారు. 

 

ఇటు ఇందిరాగాంధీవల్ల పౌర స్వేఛ్ఛకూ, ప్రజాస్వామిక హక్కులకు కలుగుతున్న విఘాతాన్నీ, అటు జయప్రకాశ్ నారాయణ్, స్వతంత్ర పార్టి, జనసంఘ్ కూటమి వల్ల రాబోతున్న మరింత ముప్పునూ  ఒకేసారి ఎండగట్టాలి. దానికోసం దేశంలోని ప్రజాస్వామిక శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచాలి అనేది సుందరయ్యగారి పంథా.

 

సిపిఎం కేంద్ర కమిటీలోని  జ్యోతి (జ్యోతిర్మయి బసు), పిఆర్ (పి రామమూర్తి), బిటిఆర్ (బిటి రణదీవె), ఎంబి (మాకినేని బసవవున్నయ్య), ఇఎంఎస్ (నంబూద్రిపాద్) తదితరులు జయప్రకాశ్, జనసంఘ్ తో రాజకీయ ఐక్యసంఘటనకు అతి ఉత్సాహం చూపుతున్నారని సుందరయ్యగారు చాలా తీవ్రంగా ఆరోపించారు.  తను వారించినప్పటికీ లోక్ సభలో పార్టి  నాయకుడు జ్యోతి తన ఆదేశాలను ధిక్కరించి జనసంఘ్ తో ఐక్యకార్యాచరణ కమిటి  సమావేశాలకు హాజరవుతున్నారని వారు ఆరోపించారు.

 

ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం కలిసి పని చేయడానికీ రాజకీయ కూటమిగా ఏర్పడడానికీ (Joint Action and United Front) మధ్యగల తేడాను గుర్తించడంలో  కేంద్రకమిటీ సభ్యులు చాలా గందరగోళానికి గురయ్యారు. ఇఎంఎస్ ఏకంగా జేపి, కాంగ్రెస్ (ఓ)తో ఎన్నికల సర్దుబాటు చేసుకుంటున్నట్టు ఓ బహిరంగ ప్రకటన చేయడంతో సుందరయ్యగారు హతాశులయ్యారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ అంశాల మీద కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని (CMP) నిర్ధారించుకోకుండా రాజకీయ కూటమిని ఎలా ప్రకటించేస్తారూ? అనేది వారి అభ్యంతరం.

 

తమది ‘కార్మికవర్గ పార్టి’ అనీ, ‘జనతా ప్రజాస్వామిక విప్లవం’ను విజయవంతం చేయడం తమ కర్తవ్యం అనే ప్రాణప్రదమైన  అంశం  కేంద్ర కమిటీ సభ్యులకు సహితం సరిగ్గా అర్ధం కాలేదని సుందరయ్యగారు ఆందోళన చెందడాన్ని ఈ డాక్యుమెంట్ లో చూస్తాము. కేంద్ర కమిటీ సభ్యులు విప్లవ కర్తవ్యాలను గాలికి వదిలి “పార్లమెంటరీ చట్టబధ్ధ భ్రమలలో” కూరుకుపోయారనేది వారి ఆవేదన.

 

లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద  విశాల ప్రజా సమూహాల్లో ఏమాత్రం గుర్తింపు-గౌరవం లేని ఆరెస్సెస్ – జనసంఘ్ లకు సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు  గుర్తింపు-గౌరవాన్ని తెస్తున్నారనేదే సుందరయ్యగారి ప్రధాన ఆరోపణ.

 

            కమ్యూనిస్టు పార్టీల మీద ప్రజల విశ్వాసం తగ్గిపోవడం, మతవాద ఉగ్ర కార్పొరేట్ శక్తులు (Communal Extremist Corporate Forces) రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకోవడం నేటి సామాజిక వాస్తవికత. ఈ ప్రమాదాన్ని 1975లోనే హెచ్చరించిన పుస్తకం  పుచ్చలపల్లి సుందరయ్యగారి రాజీనామా పత్రం. ఈ అంశం మీద చర్చించాలనుకునే ఆసక్తిగలవారు  ముందు దాన్ని చదవండి. దీని ఇంగ్లీషు లింకును ఇంతకు ముందే ఇచ్చాను. 1980లలో ఓ నక్సలైట్ గ్రూపు ఈ పత్రాన్ని తెలుగులో  ప్రచురించిందని విన్నాను. చారిత్రక అవసరం రీత్యా ఇప్పుడూ ఎవరో ఒకరు దీన్ని తెలుగులో ప్రచురిస్తారు. ఇప్పటికి ఇంగ్లీషే ఆధారం. 

 (ఇంకావుంది)

 

 

 

 

ఆరెస్సెస్- జనసంఘ్ –బిఎంఎస్ లను

సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ  సభ్యుల్లోని అత్యధికులు

అలా అడ్డంగా వెనకేసుకుని రావడానికి  కారణం ఏమిటీ?.

 

 

ఆరెస్సెస్-జనసంఘ్ – భారతీయ మజ్దూర్ సంఘ్ లతో అంశాలవారీగా ఐక్య కార్యాచరణ (Joint Action)కు  మాత్రమే పరిమితం కాకుండా  ఐక్య రాజకీయ కూటమిని (United Front) కూడ నిర్మించాలని ఇఎంఎస్ నంబూద్రిపాద్ గట్టిగా పట్టుబట్టారు. 1975 జూన్ 26న ఎమర్జెన్సీని విధించడానికి కొన్ని రోజుల ముందు మళయాళ దినపత్రిక ‘మాతృభూమి’ లో వారు ఒక వ్యాసం రాసారు.

 

 హిట్లర్ నాజీయిజానికి వ్యతిరేకంగా జర్మనీని ఓడించడానికి సోవియట్ రష్యా  1940లలో సామ్రాజ్యవాద బ్రిటన్, అమెరికాలతో కూటమి కట్టినట్టు, జపాన్ దురాక్రణను పారద్రోలడానికి చైనాలో నియంత  ఛాంఘై షేక్ తో మావో జతకట్టినట్టు భారతదేశంలో నియంత  ఇందిరాగాంధీని గద్దె దించడానికి జనసంఘ్ (ఆరెస్సెస్)తో సహితం జతకట్టాలని ఇఎంఎస్ ఆ వ్యాసంలో ఒక సిధ్ధాంత ప్రాతిపదికను సిధ్ధం చేశారు. 

 

విధానపరంగా ఒక తప్పిదానికి పాల్పడడమేగాక దానికి  ఇఎంఎస్ ఒక సిధ్ధాంత సమర్ధనను కూడ జోడించడంతో సుందరయ్యగారికి గట్టిగానే మండింది.   

 

ఐక్యసంఘటనల్లో పాటించాల్సిన ప్రాణపద  నియమాలు ఇఎంఎస్ కు అర్ధం కాలేదనీ, భారతదేశ వాస్తవ పరిస్థితులకు పొంతనలేని ఒక యాంత్రిక అన్వయానికి వారు పాల్పడ్డారనేది సుందరయ్యగారి అభిప్రాయం.

 

హిట్లర్ వ్యతిరేక ఐక్యసంఘటనను నిర్మించే  సమయంలో  ఇతర ఫాసిస్టు శక్తుల్ని కూడ రష్యా దూరంగా వుంచిందని వారు గుర్తు చేశారు. ఇంగ్లండ్, అమెరిక, ఫ్రాన్స్  దేశాలు పెట్టుబడీదారీ, సామ్రజ్యవాద స్వభావం కలిగినవే అయినప్పటికీ  హిట్లర్ లా ఫాసిస్టులు కాదని వారు వివరించారు. చైనాలో కొంతభాగాన్ని జపాన్ నేరుగా ఆక్రమించి ఐదేళ్ళుగా తిష్టవేసివున్న సందర్భంలో బాహ్యశతృవుతో తలపడడానికి అంతర్గత శతృవైన  చాంకై షేక్ తో మావో ఐక్యసంఘటన కట్టారని  కూడ సుందరయ్య గుర్తు చేశారు.

 

భారత దేశంలోనూ బూర్జువాల ప్రతినిధి అయిన ఇందిరా గాంధీ సాగిస్తున్న నియంత పోకడల్ని ఎర్కోవడానికి బూర్జువా, ప్రజాస్వామిక శక్తులతో విశాల కూటమిని కట్టాలిగానీ అందులోనికి  ఆరెస్సెస్ – జనసంఘ్ లకు  ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానం కల్పించరాదని సుందరయ్యగారి ధృఢ అభిప్రాయం. ఇందిరా కాంగ్రెస్ కన్నా ఆరెస్సెస్- జనసంఘ్ మరింత  ప్రమాదకారులని ఈ డాక్యుమెంట్లో  వారు చాలా సార్లు  వివరించారు.

 

నిజానికి  సిపిఐ (ఎం) ‘కార్యక్రమం’లోనే వివిధ రాజకీయ పార్టీల మీద తమ వైఖరి గురించి చాలా స్పష్టంగా రాసుకున్నారు. అందులో 109వ పేరాలో జనసంఘ్ గురించి రాసుకున్నారు. “మనం జన సంఘ్ ను ఎలా చూడాలీ? బూర్జువా-భూస్వామ్యవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న  కాంగ్రెస్ (ఓ), బిఎల్ డి, స్వతంత్ర పార్టి మొదలైన రైటిస్ట్ ప్రతిపక్షాల్లో దానినీ ఒకటిగానే చూడాలా? లేకుంటే వాటికన్నా ప్రమాదకారిగా చూడాలా?” అనే ప్రశ్నతో ఆరంభం అవుతుంది ఆ వివరణ.

 

“అభివృధ్ధి నిరోధక, విప్లవ ప్రతిఘాతుక ధోరణులన్నింటికీ ప్రత్యక్ష స్వరూపం స్వతంత్ర పార్టి.  (నెహ్రూ సోషలిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ సి. రాజగోపాలాచారి దీనిని స్థాపించాడు.) దేశంలోని అభివృధ్ధి నిరోధక శక్తులన్నింటినీ ఒక జెండా కిందికి తీసుకుని రావడం దీని లక్ష్యం.” (అలా ఆ స్వతంత్ర పార్టి 1974లో భారతీయ లోక్ దళ్ (బిఎల్ డి) గా  మారింది.)

 

“వీళ్ళు (స్వతంత్రపార్టి కూటమి)  ప్రభుత్వరంగానికి వ్యతిరేకంగా దుర్మార్గమైన దాడులు చేస్తున్నారు. స్వదేశీ, విదేశీ గుత్త పెట్టుబడీదారులకు మరిన్ని రాయితీలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు, సోషలిస్టు దేశాలతో భారత వాణిజ్య సంబంధాలను తప్పుబడుతుంటారు. మరోవైపు, అమెరిక పెట్టుబడులు మనదేశం లోనికి చొచ్చుకుని రావడానికి వీలుగా ద్వారాల్ని బార్లా  తెరవాలని ప్రభుత్వాన్ని కోరుతుంటారు.  భూసంస్కరణలకు వీరు బధ్ధ వ్యతిరేకులు. చైనాతో సరిహద్దు తగువు సాగుతున్న  కారణంగా అమెరికాతో సైనిక మైత్రిని నెలకొల్పుకోవాలని వీరు వత్తిడి తెస్తున్నారు. స్వతంత్ర పార్టీ నుసరించే  విప్లవ ప్రతీఘాత విధానాలు, చర్యలు అన్నింటినీ కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. స్వతంత్ర పార్టి అంతటితో ఆగక జనసంఘ్ వంటి మతవాద పార్టితో చేతులు కలపాలని చూస్తున్నది. మత అధిపత్యవాదం అనే అదనపు లక్షణం వుండడంవల్ల స్వతంత్ర పార్టికన్నా జనసంఘ్ మరింత ప్రమాదకర పార్టి.” అని పేర్కొన్నారు.

 

అలాగే, ‘కార్మికసంఘాల ఐక్యత – భారతీయ మజ్దూర్ సంఘ్’ అనే అంశం మీద సిపిఐ (ఎం) కేంద్ర కమిటి 1974 సెప్టెంబరు నెలలో ఒక తీర్మానం చేసింది.

 

            “జనసంఘ్ అనేది హిందూ ధిపత్యవాదాన్ని పునరుధ్ధరించే మతోన్మాద సంస్థ. సంస్థాగతంగా అది ఆరెస్సెస్ కనుసన్నలో నడుస్తుంది. మాటల్లో చేతల్లో అది కమ్యూనిస్టులకు, సోషలిస్టు కూటమికి, శ్రామికవర్గానికి హింసాత్మక (violently) వ్యతిరేకి. మతపరంగా ముస్లింలను వేధించడం దాని పని. విదేశాంగ విధానంలో దానిది పాశ్చాత్యదేశాల అనుకూల వైఖరి” అనేది ఆ తీర్మానం సారాంశం.  
            

మనుషులు తమ ఆస్తినిబట్టి, కులాన్నిబట్టి ప్రవర్తిస్తారనేది ఒక యాంత్రిక తప్పుడు అన్వయం. ఆర్ధిక నిర్ణాయకవాదం అంటే మనుషులు తమకున్న స్వంతఆస్తిని బట్టి ప్రవర్తిస్తారనికానేకాదు, స్వంత ఆస్తి మీద తమకు వుండే దృక్పథంతో ప్రవర్తిస్తారని  అర్ధం.  అలాగే, సామాజికవర్గ నిర్ణాయకవాదం అంటే మనుషులు తాము పుట్టిన కులాన్ని బట్టి ప్రవర్తిస్తారనికానేకాదు, కులం మీద తమకు వుండే దృక్పధాన్నిబట్టి ప్రవర్తిస్తారని  అర్ధం. మత నిర్ణాయకవాదం కూడ అంతే. మనుషులు మతం మీద తమకు వుండే దృక్పధాన్నిబట్టి ప్రవర్తిస్తారు.  

 

ఆరెస్సెస్- జనసంఘ్ – బిఎంఎస్ ల ద్వార దేశానికీ, కమ్యూనిస్టులకూ ముంచుకొస్తున్న  ప్రమాదాల గురించి  ఇంత స్పష్టంగా  పార్టి కార్యక్రమంలో  రాసుకున్నప్పటికీ సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ  సభ్యుల్లోని అత్యధికులు వాటిని  అలా అడ్డంగా వెనకేసుకుని రావడానికి  కారణం ఏమిటీ?. వారివారి సామాజిక, సాంఘీక, ఆర్ధిక దృక్పథాలు ఈ సందర్భంగా ఏ మేరకు పనిచేశాయి అనేవి ఇప్పుడు కీలక ప్రశ్నలు. 

 

సుందరయ్యగారిని తీవ్ర మనస్తాపానికి గురిచేసి ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయడానికి దారితీసిన అంశం ఇదే. కేంద్రకమిటీ సమావేశాల్లో తానూ, బిటిఆర్ కత్తులు దూసుకునేవారిమని (loggerheads) వారు అందులో చాలా స్పష్టంగా  రాశారు.

 

(ఇక్కడితో ఈ సిరీస్ ను ముగిస్తున్నాను)

 

(ఈ వివాదం మీద ఇంకా ఆసక్తిగలవారు ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో సిపిఎం, కాంగ్రెస్‍, బిజెపి సభ్యుల మధ్య ఈ నెల  మొదటివారం నుండి సాగుతున్న మాటల యుధ్ధాన్ని పరిశీలించవచ్చు. ఈ వివాదంలో సిపిఎం మంత్రి సాజీ చెరియన్ జులై 6న రాజీనామా చేశారు. )

21 జులై 2022

 

( అయిపోయింది)

No comments:

Post a Comment