Saturday, 21 October 2023

Palestine an Unending Story

 Palestine an Unending Story 830/ 6,000

 *ఈ యుద్ధం ఈనాటిది కాదు, ఆగేదీ లేదు*

     ప్రపంచ మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయి. జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం మతాలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు కలిసే అరబ్ ప్రాంతంలో ఆవిర్భవించాయి. మూడు మతాలూ అరబ్బు ప్రాంతానికి చెందిన సెమిటిక్ (Semitic) భాషలయిన హెబ్రూ, అరబ్బి, అరామయికలను పవిత్ర భాషలుగా భావిస్తాయి. భాషా సంస్కృతుల పరంగా ఇవి సెమిటిక్ సంచార జాతులు. మూడు మతాలకూ ఆదిపురుషుడు ఆదాము, ఆధ్యాత్మిక మూలపురుషుడు ప్రవక్త అబ్రహాం.

 మూల పురుషుడు ఒకరే కావడంతో వీటినిఅబ్రహామిక్ మతాలు అంటారు. ఇవి ఏకేశ్వరోపాసన మతాలు. యూదులతోరా, క్రైస్తవులబైబిల్ (ముఖ్యంగాపాతనిబంధనలో), ముస్లింలఖురాన్లో ఉమ్మడి చారిత్రక ఘట్టాలు అనేకం వుంటాయి. మోజెస్, జీసస్లను ఇస్లాం కూడ తన ప్రవక్తలు (పైగంబరు మూసా, ఈసా)గా భావిస్తుంది. 

జెరూసలేంలోనిపశ్చిమగోడ (Wailing Wall) యూదులకు పుణ్యక్షేత్రం. మరోవైపు, జెరూసలేం క్రైస్తవులకు, ముస్లింలకు కూడ పుణ్యక్షేత్రమే. అయితే వేల సంవత్సరాలుగా యూదులు పాలస్తీనాలో నివసించడంలేదు. యూరప్తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలకు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. దాదాపు రెండు వేల ఏళ్ళుగా పాలస్తీనాలో అరబ్బు జాతే నివాసం ఉంటున్నది. 

వేల సంవత్సరాలుగా పాలస్తీనా వలస పాలనల్లోనే వున్నది. నాలుగవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి బైజాంటైన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పినపుడు పాలస్తీనా అందులో భాగం. 1453లో బైజాంటైన్ సామ్రాజ్యం పతనమై యూరోప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని విశాలమైన భూభాగంలో ఒట్టోమన్ టర్క్స్ సామ్రాజ్యం ఏర్పడింది. ఇది టర్కీ, గ్రీస్, మొదలు సిరియా, లెబనాన్, జోర్డాన్, పాలస్తీనా వరకు విస్తరించింది. 

ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం, వడ్డీ చెల్లించడం రెండూమహాపాపం. ఇలాంటి నిబంధన ఒకటి క్రైస్తవంలో కూడ వుంది. జుడాయిజంలో వడ్డీ మీద అలాంటి నిషేధం వున్నట్టు లేదు. కొన్ని యూదు కుటుంబాలు వడ్డీ వ్యాపారులుగా మారి యూరప్లోనే గాక యూఎస్లోనూ ఆర్ధికంగా బాగా బలపడ్డాయి. షేక్స్ పియర్మర్చెంట్ ఆఫ్ వెనిస్లోషైలాకో, ఛార్లెస్ డికెన్స్ఆలివర్ ట్విస్ట్లోఫాగిన్ పాత్రలు యూదుల వడ్డీ వ్యాపారాన్ని చిత్రించాయి. యూదుల నుండి మహామేధావులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎందరో పుట్టుకొచ్చినా వడ్డీ వ్యాపారం కారణంగా సమాజం మీద యూరప్, యూఎస్లలో తీవ్ర వ్యతిరేకత కొనసాగింది. దీనినే యాంటి సెమిటిజం అంటారు. 

ఆస్ట్రియా సెర్బియాల మధ్య 1914 జూలైలో మొదలయిన చిన్న యుద్ధం క్రమంగా మొదటి ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఫ్రాన్స్, యూకే, రష్యా, యూఎస్, ఇటలీఅలైస్ పవర్స్గా, జర్మనీ, ఆస్ట్రియాహంగేరి, బల్గేరియా, ఒట్టోమన్సెంట్రల్ పవర్స్గా రంగంలో దిగాయి. నాలుగేళ్ళు యుద్ధం సాగింది. ఆయుధాలు తదితర యుద్ధ ఖర్చుల కోసం యుకె, యూఎస్లు యూదు పెట్టుబడిదారుల నుండి పెద్ద ఎత్తున నిధుల్ని స్వీకరించాయి. 

కలిసివచ్చిన అవకాశాన్ని యూదులూ సద్వినియోగం చేసుకున్నారు. అబ్రహాంకు (నాలుగువేల సంవత్సరాల క్రితం) యహోవా కలలో కనిపించి యూదులకు పాలస్తీనాను ప్రసాదిస్తున్నట్టు చెప్పాడట. ‘తోరాలో వాక్యం వుందని విస్తృతంగా ప్రచారం సాగింది. యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో ఛైమ్ వ్యిజ్మన్న్ (Chaim Weizmann) జియోనిస్ట్ ఉద్యమాన్ని ఆరంభించాడు. 

జుడాయిజం అంటే మతం; జియోనిజం అంటే రాజకీయార్ధిక సాంస్కృతిక యుద్ధం. ఇప్పటి భాషలో సులభంగా అర్ధం చేసుకోవాలంటే హిందూహిందూత్వ అనుకోవచ్చు. ‘రాజకీయం అంటే రక్తపాతం లేని యుద్ధం. యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయం!’. 

ఆర్ధిక సహకారం కోసం అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ లాయడ్ జార్జ్, విదేశాంగ కార్యదర్శి ఆర్ధర్ బ్లాఫోర్ ఇద్దరూ జియోనిజం డిమాండ్లకు లొంగిపోయారు. యుద్ధానంతరంయూదు ప్రజలకు ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తాము అని వారు ప్రకటించారు. దీనినే బ్లాఫోర్ ప్రకటన అంటారు. 

యుద్ధంలో ఒట్టోమన్ ఎంపైర్, జర్మనీ ఘోరంగా ఓడిపోయాయి. యూకే, యూఎస్, ఫ్రాన్స్ లబ్ధిపొందాయి. ఫ్రాన్స్లోని సేవ్రెస్ వర్సేయిల్స్లో జరిగిన శాంతి ఒప్పందాల్లో పాలస్తీనా మీద యుకేకు ప్రత్యేక అధికారాలు (Mandate) వచ్చాయి. పాలస్తీనాలో స్వయం పరిపాలన ఏర్పాటు చేయాలనే నిబంధన వున్నా దాన్ని బ్రిటన్ పట్టించుకోలేదు. ప్రపంచశాంతిభద్రతలను పరిరక్షించడానికి 1920లో ఏర్పడిన నానాజాతి సమితి (League of Nations) కూడ బ్రిటన్ను నియంత్రించలేకపోయింది. 

బ్లాఫోర్ ప్రకటన ప్రభావంతో వివిధ దేశాల నుండి పాలస్తీనాకు యూదుల వలసలు పెరిగాయి. యూదులతో అరబ్బులకు అప్పటికి ఎలాంటి పేచీలేదు. మొదటి దశలో వాళ్లు సహృదయంతో యూదుల రాకను ఆహ్వానించారు. కానీ, ఒక పథకం ప్రకారం యూదులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అరబ్బులకు అనుమానం వచ్చి వివాదం మొదలయింది. 

ఏసుక్రీస్తును శిలువ వేశారని క్రైస్తవుల్లో అనాదిగా యూదుల మీద ఒక కోపం వుంది. యూదు వ్యతిరేకతను జర్మనీలో తన రాజకీయార్ధిక నియంతృత్వాన్ని పటిష్ఠం చేసుకోవడానికి నాజీ హిట్లర్ బాగా వాడుకున్నాడు. యూదుల మీద హిట్లర్ అత్యంత క్రూరమైన నరమేధం సాగించాడు. ఈలోగా రెండో ప్రపంచయుద్ధం ఆరంభమయింది.

అప్పటికే అమెరికా ఆర్ధిక వ్యవస్థను, మీడియాను శాసించే స్థాయికి చేరుకున్న యూదు పెట్టుబడిదారులు హిట్లర్ నరమేధానికి వ్యతిరేకంగా భారీ ప్రచారాన్ని సాగించారు. ఇందులో అనేక అతిశయోక్తుల్ని కూడ జోడించారు. జియోనిస్టుల ప్రచారానికి రెండు లక్ష్యాలున్నాయి. మొదటిది; యూదుల మీద సానుభూతిని పెంచడం. రెండోది; పాలస్తీనాను యూదులకు స్వాధీనం చేయడం. వాళ్ళు పాలస్తీనాను యూదులకువాగ్దానం చేయబడిన భూమి (Promised Land)గా ప్రచారం మొదలెట్టారు. ‘భూమి లేని ప్రజలకు ప్రజలు లేని భూమి (A land without a people for a people without a land) అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది శుద్ధ అబద్ధపు ప్రచారం. పాలస్తీనాలో ప్రజలు లేకపోలేదు; యూదుల నివాసానికి దేశాలూ లేకపోలేదు. 

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి 1947 నవంబరు 29 181 తీర్మానం ద్వార బ్రిటీష్ మాండేట్గా వున్న పాలస్తీనాను విభజించింది. అప్పటికి పాలస్తీనా విస్తీర్ణం 27 వేల చదరపు కిలోమీటర్లు. అందులో 56 శాతం (15,120 చదరపు కిలోమీటర్లు) ఇజ్రాయిలఖకూ, 43 శాతం (11,610 చదరపు కిలోమీటర్లు) పాలస్తీనాకు కేటాయించారు. మిగిలిన ఒక శాతం (270 చదరపు కిలోమీటర్లు) ప్రాంతాన్ని జెరూసలెంకు కేటాయించి అంతర్జాతీయ ఉమ్మడి స్థలంగా వుంచారు. 

పాలస్తీనా విభజనే అన్యాయం అనుకుంటే అది అక్కడితో ఆగలేదు. ‘ఒంటె ఎడారిలో గుడారం కథ పాలస్తీనాలో పునరావృతం అయింది. అనేక తప్పుడు చట్టాలు, విధానాలతో పాలస్తీనా నుండి పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ పథకం ప్రకారం తరిమేయడం మొదలెట్టింది. రోజు పాలస్తీనాలో 10 శాతం నేల కూడ పాలస్తీనియన్ల ఆధీనంలో లేదు. వాళ్ళు లెబనాన్, జోర్డాన్, సిరియా, ఈజిప్టు దేశాల్లో శరణార్ధులుగా వుంటున్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిన రోజు నుండే ఇజ్రాయిల్పాలస్తీనా యుద్ధం మొదలయింది. ప్రపంచ పటం మీద మాతృభూమిని కోల్పోయిన సమూహం పాలస్తీనియన్లు. నిలబడడానికి నేల కోసం 75 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న సమూహం వాళ్ళు. 

    సామాజిక ఆర్ధిక రంగాల్లో విఫలమైన రాజ్యాధినేతలు దేశప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడాన్ని పలు దేశాల్లో చూస్తుంటాం. ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పుడు అలాంటి ప్రయత్నాల్లో వున్నాడు. 1948లో ఇజ్రాయిల్ అతిభయంకరంగా దాడులు జరిపి వందల మంది పాలస్తీనియన్లను చంపేసింది, మిగిలినవాళ్ళను తరిమేసింది. నరమేధాన్ని (catastrophe)  అరబ్బీలోనక్బా అంటారు. తనమీద ఇజ్రాయిలీల్లో పెరుగుతున్న అసంతృప్తిని తొలగించడానికిమరో నక్బా సృష్టిస్తాం అంటూ నెతన్యాహు ఇటీవల తరచూ అంటున్నాడు. 

    మరో నక్బాకు సిద్ధమవుతున్న ఇజ్రాయిల్ మీదకు హమాస్ అకస్మాత్తుగా వేల రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయిల్ నిఘా భద్రతా పరికరాలకు మించిన సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గరా ఉందని హమాస్ఇలా చాటిచెప్పడం అంతర్జాతీయ మార్కెట్లో ఇజ్రాయిల్కు పెద్ద ఎదురుదెబ్బ. 

ఇజ్రాయిల్పై అక్టోబరు 7 హమాస్ జరిపిన రాకెట్ దాడులతోనే యుద్ధం ఆరంభం కాలేదు. గాజాస్ట్రిప్ మీద ఇజ్రాయిల్ కురిపించిన బాంబుల వర్షంతో యుద్ధం ముగిసేది కూడ కాదు. ఘర్షణ పాలస్తీనాఇజ్రాయిల్లకు పరిమితమవుతుందని కూడా చెప్పలేం. 

డానీ

సీనియర్ జర్నలిస్టు 

రచన : 21 అక్టోబరు

ప్రచురణ : 27 అక్టోబరు 2023

https://www.andhrajyothy.com/2023/editorial/this-war-is-not-today-it-will-never-stop-1158756.html