Monday, 16 October 2023

Why do people commit suicide?

 Why do people commit suicide?

ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారూ?

 

హైదరాబాద్ లో గ్రూప్ – 2 విద్యార్ధిని ప్రవళిక మరణం ఆత్మహత్యల అంశాన్ని మరోసారి చర్చను లేవదీసింది. గ్రూప్ -2 పరీక్షల్ని ప్రభుత్వం వాయిదావేయడం వల్లనే ఆమె నిరాశకుగురై చనిపోయిందని కొన్ని విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.

 ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యాక ఇలాంటి సంఘటనలు జరిగితే విపక్షాలకు లడ్డు దొరికినట్టు అవుతుంది. మృతదేహానికి నివాళులర్పించడానికి ఇటు కాంగ్రెస్, అటూ బిజెపి నాయకులు పోటీలు పడ్డారు. మీడియా సమావేశాలు పెట్టి అధికార బిఆర్ ఎస్ ను తిట్టిపోశారు.   

ఆందోళన చేస్తున్న విద్యార్ధుల్ని పోలీసులు అరెస్టు చేశారు. హడావిడిగా పోస్టుమార్టం జరిపించి భారీ బందోబస్తుతో ప్రవళిక మృతదేహాన్ని వరంగల్‍ జిల్లాలోని స్వగ్రామమైన బిక్కాజిపల్లికి తరలించారు.

రాష్ట్ర గవర్నర్ గ తమిళ సై సహితం ఈ పరిణామాల మీద స్పందించారు. ప్రవళిక మ‌ృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్రప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఈలోగా, ప్రవల్లిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వివరించారు. ఆమె సెల్ ఫోన్‌లో వాట్సప్ చాటింగ్‌ను చెక్ చేశామనీ, సూసైడ్ నోట్  ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించామనీ వారన్నారు.

పోలీసుల కథనం ప్రకారం శివరామ్‌ అనే ఓ మిత్రునితో ప్రవళిక కొన్నాళ్ళుగా ప్రేమలో వుంది.  అతను మరో అమ్మాయితో పెళ్ళికి సిధ్ధమయ్యి, నిశ్చితార్థం కూడ చేసుకున్నాడు. అది ప్రవళిక మనసును గాయపరిచింది. మరణానికి ముందు మృతురాలు వాట్సప్‌లో స్నేహితులతో ఈ వివరాలనూ తన బాధను పంచుకుంది.

మనుషులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారూ? అనే ప్రశ్న ఇలాంటి సందర్భాల్లో ముందుకు వస్తుంటుంది. ప్రతి ఆత్మహత్యకూ ఏదో ఒక కారణం వుంటుంది. ఆ కారణాలనే పామరుల నుండి పండితుల వరకు వల్లె వేస్తుంటారు. అలా అనుకుంటే ప్రతి ఆత్మహత్య ప్రత్యేకమైనదే అవుతుంది. వ్యక్తిగతం అవుతుంది. అప్పుడు ఆత్మహత్యలను సూత్రీకరించడం కుదరదు. చర్చించడమూ కుదరదు.

ఆత్మహత్యలకు సమాజమే కారణం అని నిర్ధారించిన వాడు ఒకడున్నాడు. అతనే ఫ్రెంచ్ సమాజ శాస్త్రవేత్త ఎమిలి డర్ఖేమ్‌ (1858 - 1917). సామాజిక సంక్షోభం కారణంగానే మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని నిర్ధారిస్తూ 1897లో ఆయన ‘లా సూసైడ్’ శీర్షికతో ఓ నాలుగు వందల పేజీల ఉద్గ్రంధాన్ని రాశాడు.

మనుషులు ఏం కోరుకుంటారూ? అని అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో సమాధానం చెపుతారు. భారీ ఆదాయం వచ్చే ఉద్యోగం, విలాసవంతమైన ఇల్లు, అందమైన భార్య, మొనగాడైన భర్త, డాజ్యసభ సీటు, కేబినెట్లో స్థానం ఇలా సాగుతుంది కోరికల  జాబితా. వీటన్నింటినీ డర్ఖేమ్‌ కొట్టిపడేస్తాడు. ఈ కోరికలన్నీ పైకి కనిపించే అంశాలు; సారాంశంలో ప్రతి మనిషీ సంఘీభావం (solidarity)ను కోరుకుంటాడు అంటాడు. అదే మనిషి ప్రాధమిక కోరిక.

జీవితంలో ఏది లోపించినా మనిషి జీవితాన్ని కొనసాగించగలడు. కానీ, సంఘీభావం లోపించినపుడు మనిషి ఒక్క క్షణం కూడ బతకలేడని అతను నిర్ధారిస్తాడు. సమాజంలో సంఘీభావం ఏ స్థాయిలో వుందో కొలవడానికి డర్ఖేమ్ ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దానిపేరే ‘ఆత్మహత్య’. సంఘీభావానికీ ఆత్మహత్యలకు విలోమానుపాత సంబంధం (Inverse relationship) వుంటుందని ఆయన తేల్చాడు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు ఎక్కువగావుంటే అక్కడ సంఘీభావం తక్కువగావున్నట్టు. ఒక సమాజంలో ఆత్మహత్యల రేటు తక్కువగా వుంటే ఆ సమాజంలో సంఘీభావం ఎక్కువగా వున్నట్టు భావించాలన్నాడు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాదీ దేశాల వారీగా ఆత్మహత్యల నివేదికను ప్రకటిస్తూ వుంటుంది. వివిధ దేశాల్లో ఏడాదికి లక్ష మందికి 10 నుండి 40 మంది వరకు ఆత్మహత్యలు చేసుకుంటారు. అయితే ఈ గణాంకాలను కఛ్ఛితమైనవి అనుకోలేము. ఎందుకంటే అనేక కుటుంబాలు ఆత్మహత్యను సామాజిక అవమానంగా భావిస్తాయి. ఆ వివరాలు బయటికి పొక్కకుండ జాగ్రత్త పడతాయి.  లైఫ్ ఇన్సూరెన్సు తదితర టెక్నికల్ కారణాలవల్లనూ కొందరు ఆత్మహత్యల్ని దాచిపెడతారు.  కొన్ని దేశాల్లో ఆత్మహత్య అనేది శిక్షించదగ్గ నేరం. ఇన్ని కారణాలవల్ల ఆత్మహత్యల గురించి కఛ్ఛితమైన నివేదికలు రావు.

అయితే, కొన్ని నిర్ధారణలు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు పనికి వస్తాయి. మహిళల్లో ఎక్కువ శాతం ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటారు; కానీ పురుషులు ఎక్కువ శాతం ఆత్మహత్యలు చేసుకుంటారు. చదువుకోనివారికన్నా చదువుకున్నవారు, కుంటుంబ వ్యవస్థలోవున్నవారికన్నా కుటుంబ వ్యవస్థలో లేని వారు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటారట!

జంతువులు ఒంటరిగా జీవించగలవుగానీ మనుషులు ఒంటరిగా జీవించలేరు. యుధ్ధ సమయాల్లో, ఉద్యమాల సందర్భల్లో మనుషుల మధ్య సంఘీభావం వున్నత స్థాయిలో వుంటుంది. అప్పుడు ఆ సమాజాల్లో ఆత్మహత్యల రేటు చాలా తక్కువగా వుంటుంది.

యుధ్ధరంగంలో, విప్లవోద్యమాల్లో, ప్రేమలో మనుషులు అద్భుతమైన సంఘీభావాన్ని ఆస్వాదిస్తావారు. ఆ దశ దాటిపోగానే ఆ స్థాయి సంఘీభావాన్ని పొందలేక గొప్ప నైరాశ్యానికి గురయ్యు స్వఛ్ఛందంగా చనిపోవాలనుకుంటారు.

ఎమిలి డుర్ఖేమ్ దృష్టిలో ఆత్మహత్యలకు రెండే కారణాలుంటాయి. వీటిల్లో మొదటిది అనుబంధాలు; రెండోది ఆంక్షలు (Relations and restrictions). అనుబంధాలవల్ల రెండు రకాలు ఆత్మహత్యలు, ఆంక్షలవల్ల మరో రెండు రకాల ఆత్మహత్యలు జరుగుతాయంటాడు. మొత్తం ఆత్మహత్యలు నాలుగు రకాలని ఆయన వర్గీకరించాడు.

మనుషుల మీద ప్రేమాభిమానాలు చాలా ఎక్కువయినపుడు వారి కోసం కొందరు స్వఛ్ఛందంగా చనిపోవడానికి   సిధ్ధపడతారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి శ్రీరామరాజు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చనిపోయినవారూ, నక్సలైట్ ఉద్యమ అమరులు ఈ కోవలోనికి వస్తారు. మనం ఇలాంటి చావుల్ని బలిదానాలు (altruistic suicide) అంటాము.

మనుషుల మీద ప్రేమాభిమానాలు బొత్తిగా లేనప్పుడూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనుషుల మీద ప్రేమాభిమానాలు లేని మనిషి ఒక అహంతో బతుకుతుంటాడు.  ఒక దశలో అతనే మొత్తంగా ఒంటరివాడై పోతాడు. బయటి నుండి సంఘీభావం అందక స్వఛ్ఛందంగా చనిపోవాల్సిన పరిస్థితి అతనికి వస్తుంది. ఇలాంటి చావుని అహంభావ ఆత్మహత్య (egoistic suicide) అంటారు.

కొందరి మీద ఇంటాబయట విపరీతమైన ఆక్షలుంటాయి. బట్టలు ఎలా వేసుకోవాలీ, తల ఎలా దువ్వుకోవాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి వరకు కొందర్ని తల్లిదండ్రులే శాసిస్తుంటారు. కొందరికి ఆఫీసులో పైఅధికారులు చాలా ఆంక్షలు పెట్టి వేధిస్తుంటారు. వీటిని తట్టుకోలేక కొందరు స్వఛ్ఛంద మరణానికి సిధ్ధపడతారు. వీటిని నిర్బంధ మరణం (fatalistic suicide) అంటారు. కొన్ని సందర్భాల్లో “ప్రభుత్వం చేసిన హత్య” అంటుంటాం. ఇలాంటివి ఈ కోవలోనికే వస్తాయి.

ఆంక్షల్ని, నియమ నిబంధనల్ని అస్సలు పట్టించుకోని వారు కొందరుంటారు. వీరిలోనూ ఆత్మహత్యల రేటు ఎక్కువగా వుంటుంది. వీటిని క్రమశిక్షణరహిత ఆత్మహత్యలు (anomic suicide) అనవచ్చు.

ఓ నాలుగయిదు ఏళ్ల క్రితం ఆత్మహత్యల అంశం మీద ఉత్తరాంధ్రాకు చెందిన ఓ లేడీ లెక్చరర్ తో గట్టి వాదోపవాదం జరిగింది. ఆత్మహత్యలకు మానసిక (psychological) కారణాలు వుంటాయనేది వారి అభిప్రాయం. సమాజస్థితిగతులే మానసిక స్థితిగతుల్ని నిర్ణయిస్తాయి.  పైకి మనకు అలా ఎన్ని రకాలుగా కనిపించినప్పటికీ ఆత్మహత్యలు నాలుగే రకాలు.

విషాదం ఏమంటే నాతో వాదించిన ఆ సైకాలజీ లేడీ లెక్చరర్ ఓ నాలుగేళ్ళ తరువాత ఆత్మహత్య చేసుకున్నారు.

వారికి పెళ్లయిందిగానీ విడిపోయారు; భర్త వున్నాడు. అతని నుండి ఆ వారు లాంచనంగా విడాకులు తీసుకోలేదు. వారు ఇంకోకతనితో సహజీవనం మొదలెట్టారు. అతనికీ పెళ్ళి అయిందిగానీ విడిపోయారు. భార్య, పిల్లలు వున్నారు. అతనూ లాంఛనంగా విడాకులు తీసుకోలేదు. అతను తన పిఎఫ్, పెన్షనులకు తన మరణానంతరం లేడీ లెక్చరర్ పేరును నామినీగా రాయాలి; గానీ రాయలేదు. ఈమె అతని స్థలంలో ఇల్లు కట్టుకుంది. కానీ, ఆ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయుంచుకోలేదు.

వివాహానికి కొన్ని నియమ నిబంధనలు వున్నట్టే సహజీవనానికి కూడ కొన్ని నియమనిబంధనలు వుంటాయి. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారుగానీ చట్టబధ్ధ లాంఛనాలని పాటించడానికి ఇష్టపడలేదు.  

ఇలా వుండగా ఓరోజు ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అతని శవంతో పాటు, వాళ్ళుంటున్న ఇంటినీ ‘పూర్వ’ భార్యా పిల్లలు స్వాధీనం చేసుకున్నారు. ఆమెకప్పుడు భర్తలేడు, ‘పూర్వ’ భర్త దగ్గరికి వెళ్ళలేరు.  ఇల్లూలేదు; సహజీవన భర్త పిఎఫ్ పెన్షన్ తనకు వచ్చే అవకాశమూ లేదు. అమల్లోవున్న నియమనిబంధనల ప్రకారం  ప్రభుత్వ రికార్డుల్లో  ఆమె అతనికి భార్య కాదు. అతను చనిపోయిన వారం పదిరోజుల్లోనే వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది క్రమశిక్షణరాహితం కారణంగా జరిగిన ఆత్మహత్య!

మరణానికి ముందు ప్రవళ్ళిక కొందరు స్నేహితురాళ్ళకు ఫోన్లు చేసింది. తన బాధను చెప్పుకుంది. వీరిలో ఒకరిద్దరు గట్టిగా సంఘీభావాన్ని వ్యక్తం చేసినా ఆమె ఆత్మహత్య నిర్ణయాన్ని మార్చుకుని వుండేది. ఆత్మహత్య నిర్ణయాన్ని మార్చుకోవడానికి కొన్ని సెకన్లు చాలంటారు నిపుణులు.

ఆత్మహత్యల్ని నివారించడానికి ప్రస్తుతం కొన్ని స్వఛంద సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి కొన్ని యాప్ లు కూడా వున్నాయి. అయితే, ఆత్మహత్యల్ని నివారించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది సంఘీభావం. అది వర్తమాన సమాజంలో క్రమంగా కనుమరుగైపోతున్నది. ఇది అమానవీయమైన పరిణామం. దీనిని నివారించి మనుషుల మధ్య సంఘీభావాన్ని నెలకొల్పడానికి అందరూ పూనుకోవాల్సిన సందర్భం ఇది.

డానీ

సమాజవిశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

9010757776

ప్రచురణః సాక్షి  డైలీలో 17 అక్టోబరు 2023  

https://epaper.sakshi.com/Hyderabad_Main?eid=123&edate=17/10/2023&pgid=256377&device=desktop&view=3

No comments:

Post a Comment