Man - Religion and the Society
'మనిషి- మతం- సమాజం'
మతంవేరు; సామాజిక జీవితం వేరు
మతం అంటేనే ఒక విశ్వాసం.
విశ్వాసానికి రెండు పార్శ్వాలుంటాయి.
విశ్వాసుల మధ్య ఒక సంఘీభావాన్ని మతం నెలకొల్పుతుంది.
సంఘీభావం వల్లనే సమాజంలో మతం కొనసాగుతుందని సమాజ శాస్త్రవేత్తలు చాలామంది చెప్పారు.
కార్ల్ మార్క్స్ కూడ దాదాపు అలాంటి అభిప్రాయాన్నే చెప్పాడు.
మతాలకు మరో పార్శ్వం కూడ వుంటుంది;
అది అన్యులను అనగా
తమ విశ్వాసాన్ని విశ్వసించని వారిని ద్వేషిస్తుంది.
మినహాయింపు లేకుండా ఈ ద్వేషం అన్ని మతాల్లోనూ వున్నది.
ఇది ఇస్లాంకు సంబంధించిన ప్రత్యేక లక్షణం ఏమీ కాదు.
సురులు అసురులనే విభజన ఒక మతంలో వుంటే
మోమిన్లు, కాఫిర్లు అనే విభజన ఇంకో మతంలో వుంది.
విశ్వాసులు, అన్యులు అనే విభజన మరో మతంలో వుంది.
నీ బంధువులని కూడ చూడకు; విపక్షంలో వున్నాడుగాబట్టి క్రూరంగా చంపేయడమే నీపని; దాని పాపపుణ్యాలు నాకు వదిలేయి అని సాక్షాత్తు దేవుని నోటితో చెప్పించిన గ్రంధాలున్నాయి.
శాఖా బేధాలతో విష్ణువుపక్కన శివుడ్ని భరించలేక చాలా యుధ్ధాలు జరిగాయి.
శైవులు, వైష్ణవులు ఒకరినొకరు ఎంత క్రూరంగా చంపుకున్నారో మనకు తెలుసు.
బౌధ్ధమతాన్ని ఎంత కర్కశంగా అంతం చేశారో మనకు తెలుసు.
యూరప్ లో దశాబ్దాల తరబడి క్రూసేడర్లు జరిగాయి.
ఫ్రెంచ్ విప్లవానికి ముందు యుధ్ధాలన్నీ మతరూపంలోనే జరిగాయి.
ఇప్పుడు మనం ఆధునిక యుగంలో వున్నాం.
మతంకన్నా సామాజిక జీవనమే ముఖ్యమనే భావనే ఎక్కువమందిలో వుంది.
ఏ మతగ్రంధానికి అయినా ఎవ్వరూ సవరణలు తేలేదు; తేలేరు.
ఒకసారి వాటిని ‘పవిత్ర గ్రంధం’ అన్న తరువాత అందులోని వాక్యాలను కాదుకదా ఒక్క అక్షరాన్ని పొల్లుని కూడ మార్చడం కుదరదు.
దాన్ని చారిత్రక పరిణామాలకు అనుగుణంగా సవరణలు కుదరదు.
అది ఏ మతగ్రంధం అయినా అంతే.
పురుష సూక్తంలో జ్ఞానం కోసం బ్రాహ్మణుల్ని, పాలించడం కోసం క్షత్రీయుల్ని, వాణిజ్యం కోసం వైశ్యుల్ని, సేవల కోసం శూద్రుల్ని సృష్టిస్తున్నట్టు దేవుడే చెప్పాడు.
ఇప్పుడు పురుష సూక్తాన్ని ఆచరించడం కుదరదు; ఆచరించలేము కనుక దాన్ని మార్చాలనుకున్నా కుదరదు. అన్ని మతాల్లోనూ ఈ సమస్యలున్నాయి.
మనుస్మృతి రాజ్యాంగంగా మారుస్తాం అని సంఘపరివారం నాయకులు కొందరు అప్పుడప్పుడు శపథాలు చేస్తుంటారు. పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థలో అది ఎప్పటికీ సాధ్యం అయ్యే పనికాదు. బ్రాహ్మణ అభ్యర్ధిని రాష్ట్రపతిని చేసి క్షత్రీయ అభ్యర్ధుల్ని ప్రధానమంత్రితో సహా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి, వైశ్యులకు వాణిజ్య వ్యాపార రంగాల్ని కట్టబెట్టేసి, శ్రామిక సేవారంగంలో శూద్రుల్ని వుండమంటారా? హిందూ రాజ్యంగా ప్రకటించుకోవాలనుకున్న సమయంలోనే నేపాల్ లో చాతుర్వర్ణ ‘బాధ్యతల విభజన సాధ్యం కాలేదు.
పైకి చెప్పినా చెప్పక పోయినా, ఉఛ్ఛరించినా ఉఛ్ఛరించకపోయినా అన్ని మత సమూహాల్లోనూ ఇప్పుడు ఒక సర్దుబాటు ఫార్మూలాలు వచ్చేశాయి.
వాళ్ళు మతగ్రంధాలను మార్చుకోరుకానీ, వాస్తవ జీవితంలో వచ్చే మార్పుల్ని అంగీకరిస్తూ కొనసాగుతుంటారు. వాళ్ళేమీ మత విశ్వాసాలను వదులుకోరు. మత విశ్వాసాన్నే వదులుకుంటే సంఘీభావం సంక్షోభంలో పడిపోతుంది. అంచేత, దేవునిపట్ల విశ్వాసాన్ని కొనసాగించుకుంటూనే మత గ్రంధాల్లోని వివాదాస్పద అంశాలను అందరూ ఆచరణాత్మకంగా పక్కన పెడుతున్నారు.
మతసామరస్యం అంటే అదే. అందరూ దేవుడ్ని నమ్ముతారు కనుక ఆ మేరకు వాళ్ళ మధ్య ఐక్యత వుంటుంది. దైవ విశ్వాసం అనేది విభిన్న మతస్తుల మధ్య ఐక్యతకు పునాదిగా వుంటుంది. ఒకే సబర్మతీ అశ్రమంలో మహాత్మా గాంధీజీ హిందూ పూజలు చేసుకునేవారు; ఆ పక్కనే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ముస్లిం నమాజ్ చేసుకునేవారు.
అయితే, ఐక్యతకు విరుధ్ధమైన అంశాలు సహితం అందరి మత గ్రంధాల్లో వుంటాయి. ఆ విషయం వాళ్ళందరికీ తెలుసు. వాటిల్లో సర్దుబాటు చేసుకోగల అంశాలు కొన్నుంటాయి. వాటిని సర్దుబాటు చేసుకుంటారు. అలా సర్దుబాటు చేసుకోలేని అంశాలు కొన్నుంటాయి. అలాంటి విరుధ్ధమైన అంశాలను పక్కన పెడతారు. అలా మాత్రమే మత సామరస్యం వర్ధిల్లుతుంది.
కమ్యూనిస్టు పార్టీల నాయకులకు మతం విషయంలో ఒక సంధిగ్ధం వుంటుంది. “మతం ఒక మత్తుమందు” అని కార్ల్ మార్క్స్ అన్నట్టు మాత్రమే వారికి గుర్తుంటుంది. దానికి ముందూ వెనుక మార్క్స్ మతం గురించి చాలా మాటలన్నాడు. వర్గ సమాజంలో పీడితులకు, నిస్సహాయులకు నిట్టుర్పు నివ్వడానికి ఒక సామాజిక అవసరంగా మతం కొనసాగుతుందని ఆయన వివరణ ఇచ్చాడు. “హృదయం లేని సమాజానికి మతం ఒక హృదయం” అంటూ కవితాత్మకంగా వర్ణించాడు. పైగా ఆయన మతం మత్తు మాత్రమే కాదు ఒక మందు కూడ అన్నాడు. కష్టాల్లో వుండే సమూహాలకు మతం చాలా అవసరం. వ్యతిరేకించాల్సిన అవసరం లేనిచోట కూడ మతాన్ని అనవసరంగా వ్యతిరేకించి కమ్యూనిస్టులు శ్రామికులకు కూడ దూరం అయిపోయారు.
ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అన్నింటికీ కలిపి ఒక్క శాతం ఓట్లు కూడ పడడంలేదు. కమ్యూనిస్టు పార్టీలకు పడే ఓట్లతో సమాజాన్ని విశ్లేషించాల్సివస్తే మన దేశంలో శ్రామికవర్గం ఒక్క శాతమే అనే విచిత్ర నిర్ధారణకు రావల్సి వుంటుంది. మతం కారణంగా ప్రజలు తమకు దూరం అయిపోయారని తెలుసుకున్న కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, బతకమ్మ పండుగలు చేస్తున్నారు; బోనాలు ఎత్తుతున్నారు.
చాలామందికి మతానికీ, మతతత్వానికీ తేడా తెలీదు. మతం అనేది దైవ విశ్వాసం. ఎవరి దేవుడ్ని వాళ్ళు పూజించుకుంటే ఎవరికీ పెద్దగా ఇబ్బంది వుండదు. ప్రార్ధనా మందిరాల దగ్గర మైకుల వాల్యూమ్ పోటీ తగ్గించుకుంటే సరిపోతుంది.
రాజకీయార్ధిక ప్రయోజనాలను సాధించడానికి మతాన్ని ఒక ఆయుధంగానో, తురుపు ముక్కగానో, మత్తుమందుగానో ఉపయోగించడాన్ని మతతత్వం అంటారు. దీనికి వినాయక్ దామోదర్ సావర్కర్ ‘హిందూత్వ’ అని పేరు పెట్టారు. దీనికీ మత విశ్వాసానికీ సంబంధంలేదు. హిందూత్వ సిధ్ధాంతాన్ని వివరిస్తూ ఆయన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందూత్వ’ (Essentials of Hindutva) పేరిట 1922లో ఓ సైధ్ధాంతిక గ్రంధం రాసి 1923లో ప్రచురించారు. ఆ తరువాత దీన్నీ ‘హిందూత్వ – హిందువు ఎవరూ?’ (Hindutva: Who Is a Hindu?) పేరుతో పునర్ ముద్రించారు. ఈ నేపథ్యం తెలియని చాలామంది హిందువులు ‘హిందూత్వ’ అంటే తమను తిడుతున్నట్టు అపోహ పడుతుంటారు. హిందూత్వకూ హిందూమత విశ్వాసానికీ సంబంధం లేదు.
భవిష్యత్ భారత దేశంలో మనం ఎలా బతుకుదాం? అనే చర్చ రాజ్యాంగ సభ ఆరంభంలోనే వచ్చింది. తొలి సమావేశంలోనే జవహర్ లాల్ నెహ్రు భావిభారత పౌరులు“స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం” తో మెలగాలంటూ రాజ్యాంగ రచనకు ఒక మార్గదర్శకత్వాన్ని ఇచ్చారు. ఈ ఆదర్శాలను ఫ్రెంచ్ విప్లవం నుండి తెచ్చుకున్నారా? లేక బుధ్ధుని సందేశాల నుండి తెచ్చుకున్నారా? అనే చర్చ ఒకటుంది. అది ఎలావున్నా ఆ మూడే భారత పౌరులకు జీవన విధానం కావాలి. ఆ తరువాత మతసామరస్య, సామ్యవాద ఆదర్శాలు కూడ మన రాజ్యాంగంలో వచ్చి చేరాయి.
మతాన్ని ఎవరయినా వ్యక్తగత అంశంగా వుంచుకోవాలి. దాన్ని రోడ్ల మీదకు తెచ్చి వివాదంగా మార్చకూడదు. అన్ని మతాల్లోనూ వర్తమాన సమాజానికి అతకని, అన్వయించడం సాధ్యంకాని, ఆచరణ చేయలేని అనేక అంశాలుంటాయి. వాటిని నిద్రావస్థలో వుంచాలి.
మతాన్ని సామాజిక జీవితం నుండి వేరు చేయాలనేదే ప్రజాస్వామ్యంలో మొదటి అంశం. ఇది మతాన్నే వద్దనడం కాదు. ఒక మతసమూహానికి సామాజిక, రాజకీయార్ధిక రంగాల్లో ఉనికికి ముప్పువచ్చినపుడు దానిని కాపాడడానికి కోసం ఉద్యమించవచ్చు. అలా మైనారిటీవాదం ఆవిర్భవించింది. మణిపూర్ లో అది ఒక పోరాట రూపమే తీసుకుంది.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
9010757776
No comments:
Post a Comment