Sunday 19 November 2023

Caste Census: A Step Towards Social Revolution

Caste Census: A Step Towards Social Revolution

సామాజిక విప్లవానికి నాంది కులగణన 

గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ,  శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాలన్నింటినీ కూడితే సులువుగా 300 దాటుతుంది!. ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతుంది. 

సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా  కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి వుంటుంది. మన దేశంలో 5 వేలకు మించికులాలున్నాయని  అంచనా. కులాల తొనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర (social stratification) ఏర్పడుతోంది.   వీటిని అర్ధం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామాజిక విప్లవానికి కులగణన నాందీ పలుకుతుంది. 

ఎస్సీ, ఎస్టిలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది. 1979 జనవరి1న ప్రధాని మురార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబిసిలకు  రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్ ఎడ్యూకేషనల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమీషన్’ (SEBC)ను నియమించారు. స్వల్పకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భిందేశ్వరీ ప్రసాద్ మండల్ ను ఛైర్మన్ గా నియమించడంతో దానికి ‘మండల్ కమీషన్’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన  తరువాత 1980 డిసెంబరు 31న  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బిపి మండల్ తన నివేదికను సమర్పిస్తూ ఓబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు.  దాని మీద తీవ్ర భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఈ వివాదం ‘ఇంద్ర సహానీ కేసు’ పేరుతో సుప్రీం కోర్టుకు వెళ్ళింది. 

ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్ కమీషన్ ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించలేదు. బ్రిటీష్ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బిసిల జనాభా 54 శాతం వుంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం  రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. ఓబిసి రిజర్వేషన్లు పొందడానికి రెండు అర్హతల్ని కమీషన్ నిర్ణయించింది. ఆ సమూహం సామాజిక వివక్షకు గురవుతూ వుండాలి, విద్యారంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం తక్కువగా వుండాలి. 

ఒబిసి రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని విపి సింగ్ మండల్ కమీషన్ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచబోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్ నాయకుడైన విపిసింగ్ కు లోక్ సభలో మెజారిటీ లేదు. ఎన్ టి రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అభ్యర్ధిగా రంగంలో దిగి, బయటి నుండి బిజెపి ఇచ్చిన మద్దతుతో ఆయన  ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు.  

అప్పట్లో బిజెపికి లోక్ సభలో 85 సీట్లున్నాయి. ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసిలు పార్టికి దూరం అయిపోతారని ఆ పార్టి భయపడింది. అప్పటి బిజేపి అధ్యక్షులు ఎల్ కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుండి అయోధ్య వరకు 35 రోజుల  ‘రామ్ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి  రెండు లక్ష్యాలున్నాయి. మొదటిది; మండల్ కమీషన్ సిఫార్సుల అమలును అడ్డుకోవడానికి ఏకంగా విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్ –కమండల్’  అని పిలిచేవారు.  బిజెపి తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న  విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. 

రెండేళ్ల తరువాత  1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనీ, క్రీమీలేయర్ కుటుంబాలను రిజర్వేషన్ పరిధి నుండి తప్పించాలనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. 

సిపాయిల తిరుగుబాటు అనబడే భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం బ్రిటీష్ పాలకులకు అనేక గుణపాఠాలు నేర్పింది. భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల,మత స్వభావాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాల్సిన అవసరముందని  వాళ్లు గుర్తించారు. అప్పట్లో సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా నియమితుడైన డబ్ల్యూ సి ప్లౌడెన్ (W.C. Plowden)1981లో తొలిసారిగా జనగణన నిర్వహించాడు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్ హంటర్ (William Wilson Hunter) నాయకత్వాన ఏర్పడిన కమీషన్ దేశంలో కులగణన నిర్వహించింది. దీనినే హంటర్ కమీషన్ అంటారు.  

అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. గానీ, హంటర్ కమీషన్ తరువాత ఇప్పటి వరకు  140 యేళ్ళుగా మనదేశంలో  కులగణన జరగలేదు.  ఇప్పటి వరకు వివిధ కులాలు జనాభాలో తమ శాతం గురించి చెప్పుకుంటున్నవన్నీ కాకిలెక్కలు అంటే బాగుండకపోవచ్చుగానీ వాటిని ‘ఎన్నికల లెక్కలు’ అనవచ్చు. 

స్వతంత్ర్య భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బీహార్ కు దక్కుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ గత ఏడాది బీహార్ లో కులగణన మొదలెట్టారు. కోర్టు కేసు రావడంతో కొంతకాలం సర్వే ఆగిందిగానీ మొత్తానికి కోర్టు అనుమతి పొంది సర్వేను పూర్తి చేశారు. ఆ ఫలితాలను గత నెలలో ప్రకటించారు.  దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. బీహార్ లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో 7 వందలకు పైగా  కులాలున్నట్టు అంచనా. ఆ లెఖ్ఖన ఏపి కులగణన ప్రాజెక్టు బీహార్ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. 

రెండేళ్ళ క్రితం బీహార్ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ, ఎస్టి మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానంకాదని 2021 జులై 20న  పార్లమెంటులో ఒక విస్పష్ఠ ప్రకటన చేశారు. 

బిజెపిది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు,  కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ఐదు రోజుల వ్యవధిలో ఒకే నగరంలో  రెండు కుల సమ్మేళనాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరేనేమో! వారు హైదరాబాద్ లో బిసి సమ్మేళనంలో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళి వచ్చి మాదిగ సమ్మేళనంలో పాల్గొన్నారు. కానీ, విధానపరంగా వారు కులగణనకు వ్యతిరేకం.  హైదరాబాద్ లో జరిగింది మంద కృష్ణ మాదిగ ‘కంటితుడుపు’ కార్యక్రమం మాత్రమే. 

నిజానికి సామాజిక న్యాయాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. అడవి ఎస్టీల పథకాలను అర్బన్ ఎస్టిలు మింగేస్తున్నారనీ, బిసిల పథకాలను రెండు మూడు కులాలే అందుకుంటున్నాయనీ అనడం ఇకముందు కుదరదు. బిసి ముస్లింల వాటాల్ని ఓసి ముస్లింలు మింగేస్తున్నారని స్వయంగా ప్రధాని ప్రచారం చేస్తున్నారు. పైగా వారు ఈమధ్య ముస్లిం సమాజంలోని బహుభార్యత్వాన్ని ఎద్దేవ చేస్తూ “హమ్ పాంచ్; హమారే పచ్చీస్” (మేము ఐదు; మావాళ్లు పాతిక)  అంటున్నారు. కులగణన నిర్వహిస్తే దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు పెరిగిపోతున్నదో, తరిగిపోతున్నదో తేలిపోతుందిగా? దానికి మాత్రం ప్రధాని సిధ్ధంగాలేరు. 

ఇప్పుడు కులగణన ‘ఇండియా కూటమి’కి  కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ప్రతి సభలోనూ  “జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్”,  “జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ” (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. 

కొత్త మిలినియంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయవాదం బలపడింది. రాష్ట్ర విభజన తరువాత  రెండు తెలుగు రాష్టాల్లోనూ కులాల కుమ్ములాట మొదలయింది. తెలంగాణలోకన్నా ఆంధ్రప్రదేశ్ లో దీని మోతాదు మితిమీరింది. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం అభిమానులు సహితం ఈ పరిణామాల్ని జీర్ణం చేసుకోలేకపోయిన సందర్భాలూ వున్నాయి. 

వైస్సార్ సిపి రాజకీయంగా ఎన్డియే లో భాగస్వామికాదు. పార్లమెంటు వ్యవహారాల్లో ఎన్డీయేతో వుంటున్నది. బిజెపికి నచ్చని కులగణన కార్యక్రమాన్ని చేపట్టడం వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే. అది విజయవంతంకావడం రాజకీయంగా వైసిపికికన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది. 

డానీ

సమాజ విశ్లేషకులు

రచన : 19 నవంబరు 2023

No comments:

Post a Comment