Monday 20 November 2023

The Hero and illusions

 రాబిన్ హుడ్ – పండుగ సాయన్న – మీరేసాబు

 

ఓ ఏడేళ్ళ క్రితం స్థానిక ప్రతినిధి ద్వార   ఓ హాలివుడ్ సంస్థకు  ఒక సినిమా కథ ఔట్  లైన్   రాసే ఆఫర్ వచ్చింది. వాళ్ళకు ఒక సాంప్రదాయం వుంది.  కథ జానర్ వాళ్ళే నిర్ణయిస్తారు. కొన్ని సీన్లు కూడ చెపుతారు. మన స్థానిక జానపద సాంప్రదాయాన్ని, మన గద్వాల పాలెస్, గోల్కొండ ఖిలా వంటి చారిత్రక  కట్టడాలనీ,  చారిత్రక నగరాలనీ జోడించి క్లుప్తంగా  కథ చెప్పమన్నారు. దాని కోసం వాళ్లు నాకు కొంత ఫీజు చెల్లించారుగానీ అది చెప్పుకోదగ్గంత గొప్పదేమీ కాదు.

 

ఇలా వాళ్ళు అనేక దేశల్లో అనేక మందిని సంప్రదిస్తుంటారని తరువాత తెలిసింది. వచ్చిన ఇన్ పుట్స్ ని దగ్గర పెట్టుకుని ఒకరు ఒక కథ తయారు చేస్తారు. ఇంకొకరు స్క్రీన్ ప్లే రాస్తారు.  దానికి ఒక ఇలస్ట్రేటర్ ను పెట్టి స్టోరీ లైన్ గీయిస్తారు. ఇప్పుడయితే ప్రీ-షూటింగ్ ‘ప్రీ-విజువలైజేషన్’ టెక్నాలజీ కూడ వచ్చేసింది. అది స్టూడియోవారెవకైనా నచ్చితే సినిమా తీస్తారు. ఇంత కతుంది గనుక నాకు వచ్చిన ఆఫర్ గొప్పదేమీకాదు. నేనేదో స్కెచ్ రాసి పంపించేశాను. అయితే ఈ అనుభవంలో కొన్ని ఆసక్రికర అంశాలున్నాయి.

 

వాళ్లకు రాబిన్ హుడ్ జానర్ లో “పెద్దలను దోచి పేదలకు పెట్టే దొంగ” కథ కావాలి. అందులో  రైలు దోపిడి, కోట ముట్టడి  వంటి  యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలూ వుండాలి అని ముందే చెప్పారు.

 

మనలో చాలామందికి రాబిన్ హుడ్ కథ తెలుసు.  హైస్కూలు రోజుల్లో ‘నాన్ డిటెయిల్’ గా చదివి వుంటాము. రాబిన్ హుడ్ మీద హాలీవుడ్ లో 1938 నుండి ఇప్పటి వరకు అరడజనుకు పైగా సినిమాలొచ్చాయి. వాటి సిడీలన్నీ కొనుక్కొచ్చి చూసేశాను.   

 

పశ్చిమ ఆసియాలో 11-13 శతాబ్దాల మధ్య జెరూసలేం మీద పట్టు కోసం పవిత్ర యుధ్ధాలు (Crusades) సాగాయి. ఇప్పుడూ హమస్ – ఇజ్రాయిలు యుధ్ధం సాగుతున్న నేపథ్యంలో సినిమా స్కెచ్ కథ గుర్తుకు వచ్చింది.

 

పవిత్ర యుధ్ధంలో  బ్రిటీష్ రాజు  కింగ్ రిచర్డ్ – 1, ద లయన్ హార్ట్ (Richard I,  the Lionheart) ముఖ్యుడు. రిచర్డ్ సోదరుడు ప్రిన్స్ జాన్ చాలా దుర్మార్గుడు. అన్న యుధ్ధరంగంలో వుంటే ప్రిన్స్ జాన్ ప్రజల్ని క్రూరంగా వేధించేవాడు. ప్రిన్స్ జాన్ మీదనే రాబిన్ హుడ్ తిరుగుబాటు చేశాడు అనేది కథ.

 

"Robin Hood: Prince of Thieves" (1991) సినిమాలో అజీమ్ అనే ఒక ముస్లిం  రాబిన్ హుడ్ కు ప్రాణ స్నేహితునిగా వుంటాడు. ఈ  ట్విస్టు నాకు నచ్చింది.  అజీమ్ పాత్రను మోర్గాన్ ఫ్రీమన్ పోషించాడు.  సీన్ కానరీ, ఆడ్రి హెబ్బర్న్ నటించిన  Robin and Marian (1976)’ కూడ నాకు బాగా నచ్చింది. ఆడ్రి హెబ్బర్న్ మీద మాతరం వాళ్ళకు చిన్నది కాకుండ పెద్ద క్రష్ వుండేది. ఆమె మా వైపు కన్నెత్తి చూడక పోయినాసరే మేము కళ్ళు పెద్దవి చేసుకుని తెర మీద ఆమెను చూస్తుండి పోయేవాళ్ళం!.

 

పిల్లల బొమ్మల పుస్తకాల కోసం బ్రిటీష్ చిత్రకారుడు హోవార్డ్ పైలే (Howard Pyle) రాబిన్ హుడ్ పాత్రను సృష్టించాడు. ఎందుకయినా మంచిదని పైలే పుస్తకం The Merry Adventures Of Robin Hood కూడ తిరగేశాను. అలాగే జయధీర్‌ తిరుమలరావు సంపాదకత్వంలో వచ్చిన ‘జానపద చారిత్రక గేయ గాధలు’ చదివాను. ఆ తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో  ప్రచురించిన తమిళ జానపద గాధలు పుస్తకం ఒకటి చదివాను. అప్పుడు నాకు అర్ధం అయ్యిందేమంటే హీరోల కథలన్నీ ఒకటే అని.

 

హీరో అంటేనే జానపద కథానాయకుడని అర్ధం. జానపద కథానాయకులు విషయంలో  కొన్ని నిజజీవిత సంఘటనలు వుంటాయి. వాటిని జానపద కళాకారులు తమ కాల్పానిక శక్తితో చాలా పెంచేస్తారు. నాటకీకరిస్తారు.  ఒక్క రాబిన్ హుడ్ విషయంలోనేకాదు అందరి విషయంలోనూ ఇలాగే  జరుగుతుంది. అల్లూరి శ్రీరామ రాజు జీవితంలో  సీత లేదు; నాటకం కోసం ఓ స్త్రీ పాత్రను పడాల సృష్టించాడంటే ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టరు థామస్ జార్జ్ రూథర్డ్ ఫర్డ్ (Thomas George Rutherford), శ్రీరామరాజు ఎప్పుడడయినా కలిశారా? అన్నదీ అనుమానమే. అసలు శ్రీరామరాజు 1924 మే 7న చనిపోయిన రోజున ఆ జిల్లా కలెక్టరు ఎవరూ? అని కూడ ఎవరూ పరిశీలించరు. విశాఖపట్నం జిల్లా కలెక్టరు ఆఫీసుకు వెళ్ళి అక్కడి పెట్టిన బోర్డులో జాబితాను చూసినా తేలిపోయే విషయం కదా! . 

 

జానపద కథానాయకుల మీద ప్రజలకు విపరీతమైన అభిమానం ఆరాధనా భావం వుంటుంది. తమకు తోచిన ప్రతి మంచినీ వాళ్ళు ఆ జానపద హీరోలకు ఆపాదించేస్తుంటారు. కొమురం భీం,  రాంజీ గోండ్, పండుగ శాయన్న, మీరే సాబూ, సర్వాయి పాపన్న తదితరుల కథలన్నీ అంతే. వీటిల్లో వాస్తవం ఎంత?  కల్పితం ఎంత? తేల్చడం తరువాతి తరాలకు చాలా కష్టం.

 

అన్నింట్లో కథ ఒకటే. పంటలు పండవు, ప్రజలకు పనీ వుండదు; తిండీ వుండదు, పన్నులు కట్టాలి. పాలకులు ఎక్కడో రాజధానిలో వుంటారు. వాళ్ళు వీళ్లని పట్టించుకోరు. వాళ్ళ జిల్లా ప్రతినిధులు, పరగణాల ప్రతినిధులు మహా క్రూరులు, వాళ్లు ప్రజల నడ్డి విరగ్గొట్టి కప్పం వసూలు చేస్తుంటారు. చావుకన్నా ఘోరమైన జీవితం ఆ ప్రజలది. ఇలా వుండగా ‘దేవుడు’ ఒకడ్ని పంపిస్తాడు. అతను  పాలకుల స్థానిక ప్రతినిధుల్ని తన్ని తరిమిగొడతాడు. సర్కారు గిడ్దంగుల్ని బద్దలు గొట్టి ఆకలిగొన్నవారికి అన్నం పెడతాడు.  అతను పేదల దేవుడిగా వెలిగిపోతున్న దశలో రాజధాని నుండి భారీ సైన్యం వచ్చి బంధిస్తుంది. లేదా, అతని అనుచరుల్లో ఎవరో ఒకరు ద్రోహానికి పాల్పడి అతన్ని పట్టిస్తారు. ఇక ముందు మరెవ్వరూ తిరుగుబాటు చేయకుండ అతన్ని అందరి ముందు క్రూరంగా ఉరి వేస్తారు. జనం అక్కడో స్మారక స్థూపం కట్టి ఏడాదికోసారి ఉత్సవం జరిపి పాటలు పాడుతుంటారు.

 

కమ్యూనిస్టు సాహిత్యంలోనూ ఇలాంటి హీరోలు వుంటారు.  “ఏడ పుట్టి ఏడ పెరిగే - ఏడకొచ్చి ఏడ చచ్చే”  వంటి పాటలు, ఒగ్గు కథలు వుంటాయి.

 

ఈ జానపద కథా నాయకులకు ఒక పరిమితి వుంటుంది. వీరి కార్యక్షేత్రం చాలా చిన్నది. ఉదాహరణకు పండుగ శాయన్న ప్రభావం చక్రవర్తులతో తలపడినట్టు జానపద కళాకారులు చిత్రిస్తుంటారు.  కిన్నెర పాట ప్రకారం పండుగ శాయన్న ప్రభావం పధ్నాలుగు గ్రామాలకు విస్తరించి వుంటుంది. ఆపైన గద్వాల పరగణ,  ఆపైన నిజాం సంస్థానం, ఆ పైన బ్రిటీష్ రెసిడెంట్ . ఆపైన గవర్నర్ జనరల్, వైశ్రాయి, ఆ పైన బ్రిటీష్ మహారాణి వుంటారని  ఆ కళాకారులకు తెలీదు. నేరుగా బ్రిటీష్ రాణి సింహాసనం  కదిలిపోయినట్టు కథనం సాగుతుంటుంది.

 

ఈ సాంప్రదాయం చారిత్రక సినిమాలన్నింటిలోనూ వుంటుంది. పేరుకు మాత్రం కొన్ని పాత్రల్ని చరిత్ర నుండి తీసుకుంటారు. ఆ తరువాత కథనం అంతా సినిమా బాక్సాఫీసు ఫార్మూలాను అనుసరిస్తుందేతప్ప చారిత్రక వాస్తవాన్ని పట్టించుకోదు.

 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

రచన : 20 – 11- 2023

No comments:

Post a Comment