Tuesday, 21 November 2023

My Most Favourite Book - Communist Manifesto

 

*నా ఆల్ టైమ్ ఫేవరెట్ ‘కమ్యూనిస్టు ప్రణాళిక’*

 

పుస్తకాల్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ ‘కమ్యూనిస్టు ప్రణాళిక’. నూట డెభ్భయి ఐదు యేళ్ళు  దాటుతున్నా దాని మీద మోజు తగ్గలేదు. ప్రపంచం చాలా మారిపోయిందని మనం రోజూ అనుకుంటుంటాంగానీ కార్ల్ మార్క్స్, ఫ్రెడెరిక్ ఏంగిల్స్  అంచనాకు మించి ఏదీ మారలేదు. నమ్మకపోతే ఇంకోసారి ప్రణాళిక చదవండి.

 

ఒక చారిత్రక సందర్భంలో ఏదైనా రాజకీయార్ధిక సామాజిక వ్యాసాన్ని రాయాల్సి వచ్చినప్పుడెల్లా నేను ఒకసారి కమ్యూనిస్టు మానిఫెస్టోను తిరగేస్తాను. ప్రతిసారీ అది నాకు కొత్తగానే కనిపిస్తుంది. అంతేకాదు; వర్తమాన రాజకీయ పరిణామాల విశ్లేషణలు సహితం  నాకు అందులో కనిపిస్తాయి.

 

రాత్రి మళ్ళీ చదివాను. మొత్తం ప్రణాళిక గతం గురించికాక వర్తమానం గురించి, మరీ ముఖ్యంగా ఇప్పటి మనదేశం గురించే  చెపుతున్నది అనిపిస్తుంది.

 

‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను  పుచ్చలపల్లి సుందరయ్యగారు మొదలు ఒక అరడజను మంది తెలుగు అనువాదం చేసుంటారు. ఇప్పుడు సాహితీ మిత్రులు ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వరరావు  ఇంకో అనువాదాన్ని తెస్తున్నాడు. ఉమా నూతక్కి అనువాదం చేసిన ఈ వెర్షన్ త్వరలో మార్కెట్ లోనికి వస్తున్నది.

 

తెలుగు భాషలో సాధారణంగా సరళ వాక్యాలు ఎక్కువగా వాడుతాం. ఇంగ్లీషు కాన్సెప్చ్యువల్ భాష. అందులోనూ సరళ వాక్యాలుంటాయిగానీ  కాంపౌండ్, కాంప్లెక్స్ వాక్యాలు ఎక్కువగా వుంటాయి. వాటిని తెలుగు చేసే సమయంలో చాలా ఇబ్బందులొస్తాయి. సైధ్ధాంతిక పుస్తకాల్ని అనువాదం చేసే సమయంలో ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతాయి.  

 

కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ ఆలోచనాశక్తి, రచనా శైలి గొప్పవని ఇప్పుడు కొత్తగా చెపితే జనం నవ్వుతారు. అయితే, మార్క్స్ ఏంగిల్స్ ల సిధ్ధాంతం, రచనా శైలీ ఇప్పటి వరకు సరళ తెలుగు లోనికి అనువాదం కాలేదనే ఒక అసంతృప్తి అయితే అభిమానుల్లో వున్నది. ఉమా నూతక్కి అనువాదం చాలా వరకు ఆ లోటుని తీరుస్తుంది.

 

“యూరప్ ను ఒక భూతం వెంటాడుతోంది;  ఆ భూతం పేరు కమ్యూనిజం. ఈ భూతాన్ని సీసాలో బంధించి బిరడా బిగించడానికి  … ” అనే ప్రవేశికలోని తొలి వాక్యం నాకు ఎంతో ఇష్టం. ఇంతటి వెటకారాన్ని చూసి కార్ల్ మార్క్స్ నరసాపురం వాడేమో అనే అనుమానం వచ్చి పులకరించిపోయేవాడిని.

 

ఇంగ్లీషులో spectre, exorcise అనే పదాలు వాడారు. ఉమా నూతక్కి వాటిని సరళీకరించే ఉద్దేశ్యంతో కాబోలు “నేడు యూరప్ ఖండాన్ని కమ్యూనిజమనే భయం ఆవహించింది. ఆ భీతిని పారద్రోలడానికి … “ అని మొదలెట్టారు. ఒకటి రెండు చోట్ల ఇలాంటి ఓవర్ సింప్లిఫికేషన్స్ తప్పిస్తే ఒక నవలిక చదువుకుంటున్నంత హాయిగా ఈ పుస్తకం  పేజీలు తిరగేయవచ్చు.

 

విశ్వేశ్వరావు ప్రచురించాడు కనుక పుస్తకం సహజంగానే  క్యూట్ గానూ అందంగానూ వుంది. నిజం చెప్పాలంటే ముద్దు పెట్టుకోవాలి అనిపించేలావుంది.  

 

త్వరలో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రాసంగికత మీద ఒక వ్యాసం రాస్తాను.

 

డానీ

విజయవాడ

22-11-2023 బుధవారం

 

 

“సమాజం గతంలో ఎంతగానో గౌరవించిన, భక్తి శ్రధ్ధలతో చూసిన ప్రతి వృత్తినీ పెట్టుబడీదారీ వ్యవస్థ చులకన చేసి పడేసింది. వైద్యులు, న్యాయవాదులు, పూజార్లు, కవులు, వైజ్ఞానిక శాస్త్రవేత్తల్ని తన కింద పనిచేసే వేతన కూలీలుగా మార్చేసింది” వాక్యాన్ని చదువుతుంటే హరిత విప్లవ పితామహుడు ఏంఎస్ స్వామినాధన్ సహా అనేక మంది లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డు గ్రహితలు గుర్తుకొస్తారు.

 

“ఉత్పత్తి వ్యవస్థను కేంద్రీకృతం చేసి దేశ సంపద కొద్దిమంది చేతుల్లో వుండేలా  చేసింది” అనే వాక్యాన్ని  చదువుతున్నప్పుడు బీచ్ శాండ్ టెండర్లు గుర్తుకొస్తాయి.

 

“ఆధునిక రాజ్యాంగపు రూపకల్పనతో  పెట్టుబడీదారీవర్గపు ఆర్ధిక రాజకీయ ఆధిపత్యాన్ని పెంచుకుంది” అనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీజీ పాలిస్తున్నారా? ఆదానీ అంబానీలు పాలిస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. “నేను ఒక దేవాలయాన్ని కట్టాలనుకున్నాను. ప్రారంభానికి ముందే దాన్ని దెయ్యాలు ఆక్రమించుకున్నాయి” అన్న బిఆర్ అంబేడ్కర్ ఆవేదన గుర్తుకు వస్తుంది.

 

“రాష్ట్రాలన్నీ ఒకే ప్రభుత్వం, ఒకే చట్టం, ఒకే పన్నుల విధానంతో ఏకీకృతం అయ్యాయి” అనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకేభాష, ఒకే మతం అంటున్న సంఘీయులు గుర్తుకొస్తారు.

 

“మేధోపరమైన ఆవిష్కరణలు ఉమ్మడి ఆస్తిగా మారుతాయి’ అన్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు సోషల్ మీడియాలోని పెడధోరణులు  గుర్తుకొస్తాయి. ఎవరయినా ఒక మంచి పోస్టు పెడితె దాన్ని షేర్ చేయడం మంచి సాంప్రదాయం. కొందరు దాన్ని తమ రచనలా పోస్టు చేసేస్తుంటారు. మేధో సంపత్తి హక్కులు లేవు. మనం రాసిన వాక్యాల్ని మనకే వినిపించేంత మహానుభావులున్న కాలం ఇది.   

 

“చౌక ధరల వస్తువులు అనే భారీ ఫిరంగులతో అది చైనా గోడల్ని కూడ కూల్చి వేస్తుంది” అన్న వాక్యాన్ని చదువుతున్నప్పుడు కమ్యూనిస్టులు అనబడేవారిని సహితం ఆవరించేసిన కన్స్యూమరిజం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్టును జయించడానికి  చైనా అనుసరిస్తున్న వ్యూహం చౌక ధరల సరుకులే!.

 

“పెట్టుబడీదారీవర్గం తన ప్రతిబింబం లాంటి ప్రపంచాన్ని సృష్టిస్తుంది”

 

“కుటుంబ సంబంధాలను కేవలం ఆర్ధిక సంబంధాలుగా కుదించి వేస్తుంది”

 

పెట్టుబడీదారీ సమాజపు దుర్మార్గాన్ని క్రూరత్వాన్నీ కపటత్వాన్నీ మార్క్స్ వివరించినంత గొప్పగా మరెవ్వరూ వివరించలేదు. పెట్టుబడీదారీ వ్యవస్థను ఒక్క క్షణం కూడ భరించరాదని ఒకటికి వందసార్లు చెప్పాడు. ఆలోచనాపరులు ప్రపంచాన్ని రకరకాలుగా వాఖ్యానిస్తే సరిపోదు; వాళ్లు చెయ్యాల్సింది ప్రపంచాన్ని మార్చడం అన్నాడు. అయితే, పెట్టుబడీదారీ సమాజాన్ని సమసమాజంగా మార్చడానికి అవసరమైన కార్యక్రమాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేదు. వివిధ దేశాల్లో కమ్యూనిస్టు పార్టిలకు నాయకత్వం వహించినవారు కూడ ఈ విషయంలో విఫలం అయ్యారు. పెట్టుబడీదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఒక  సమసమాజ నిర్మించడానికి ఎవ్వరూ ఒక ఆచరణాత్మక కార్యక్రమాన్ని ఇవ్వలేకపోయారు. పెట్టుబడీదారీ సమాజం నచ్చని వారికీ, సమాజంలో మౌలిక మార్పు కోరుకునేవారికి ఇప్పటికీ ఇది ప్రధాన లోటు.


No comments:

Post a Comment