Wednesday, 29 May 2024

Maabhoomi Song - Gaddar Controversy

 పాటను మార్చినా కొంచెం అతికేలా వుండాలి! 

A.m. Khan Yazdani Danny

March 21, 2024 · 


పాటను మార్చినా కొంచెం అతికేలా వుండాలి!

ఒకవైపు రెడ్ది ముఖ్యమంత్రికి, ఇంకో వైపు  రెడ్ది సెన్సార్ బోర్డు డైరెక్టరుకు భయపడి  ప్రతాపరెడ్డిని నైజము సర్కారోడను చేశారు. 

ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డి (నల్గొండ జిల్లా) విసునూరు దొర రాంచంద్రారెడ్డి (వరంగల్  జిల్లా) అనుకుంటా. ఈ పాట పుట్టింది నల్గొండ జిల్లాలో. అప్పటి పోరాటానికి నైజాం నవాబు అసలు లక్ష్యమేకాదు. అంతటి విస్తృతీ లేదు. 

నిజాం నవాబు  హైదరాబాద్ నగర వీధుల్లో 16 ఎడ్లబండ్లు కట్టుకుని  తిరుగుతుంటాడని మెదడు వున్నవాడు ఎవరయినా రాస్తారా? పాట ఒరిజినల్ లో కవి-గాయకుడు-కార్యకర్త  యాదగిరి అలాంటి తప్పు చేయలేదు.  

ప్రతాప రెడ్డి పేరు తీసి నిజాం నవాబు పేరు పెట్టాలనుకున్నప్పుడు 16 ఎడ్లబండ్లు తీసి 16 రోల్స్ రాయిస్ కార్లు అని పెడితే కొంచెం అతికేది.



Sai Vamshi

 March 21, 2024 · · 

'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? ✍️✍️

'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? ✍️✍️

... యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ ఆర్.నారాయణమూర్తి గారు 'వీరతెలంగాణ' సినిమా తీసి, అందులో బండి యాదగిరి గారి 'బండెనక బండి కట్టి' పాట వాడారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ పాట జనాన్ని ఎంత ఉత్తేజితుల్ని చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

బండెన్క బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి

ఏ బండ్లో వస్తవ్ కొడుకో దేశ్‌ముఖ్ దొరగాడా

నాజీల మించినవ్‌రో దేశ్‌ముఖ్ దొరగాడా

దేశ్‌ముఖ్‌లు, దొరలు నిజాం రాజుకంటే తక్కువేమీ కాదన్న అర్థం ఇందులో ఉంది. సినిమాలో ఈ పాట నారాయణమూర్తి గారి మీదే చిత్రీకరించారు. యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలో ఏది ఎలా వాడాలో ఆయనకు తెలుసుగా!(ఆ పాటను గద్దర్ గారి గొంతులో మీరు విని తీరాలి. ఆహా! అదొక అనుభవం. 'మాభూమి' సినిమాలో ఉంది).

అదే నారాయణమూర్తి గారు 'రజాకార్' సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చి నిజాం రాజ్యంలో రజాకార్లు చేసిన అన్యాయాల గురించి వివరించారు. హైదరాబాద్ స్టేట్‌కు ముస్లింలు, హిందువులు రెండు కళ్లు అన్నారు. ముస్లింలు అల్లానే పూజిస్తారు, క్రైస్తవులు క్రీస్తునే పూజిస్తారు, హిందువులు మాత్రం చర్చిలు, దర్గాలకు వెళ్తారని గొప్పగా చెప్పారు. హిందువులు చర్చిలు, దర్గాలకు వెళ్లడమేమిటి నాన్సెన్స్ అనుకున్నారేమో, ఆ కార్యక్రమంలో కొందరు ఆ మాటలకు అరిచారు. ఆయన వారిని కసిరి ప్రసంగం కొనసాగించారు. 

ఇన్ని చెప్పారు సరే, మరి దొరలు, భూస్వాముల దురాగతాల గురించి ఒక్క విషయమూ చెప్పలేదే? గడీల్లో వెట్టి చాకిరీ గురించి మాట్లాడలేదే? 'ఏ బండ్లో వస్తవ్ కొడుకో దేశ్‌ముఖ్ దొరగాడా' అనే లైన్ పాడలేదు ఎందుకు? రజాకార్లు అనేవాళ్లు ఏయే ప్రాంతాల నుంచి వచ్చారు, ఏయే ప్రాంతాలకు వెళ్లారు అనే వివరాలు తెలిసిన ఆయనకు అసలైన చరిత్ర తెలియదా? విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి అరాచకాలు, కంఠాత్మకూర్‌ గడీ అన్యాయాలు, కడవెండిలో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ అక్రమాలకు ఎదురుతిరిగి, రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు చేసిన దొడ్డి కొమరయ్య హత్య.. ఇవన్నీ మరిచారా? అందరూ అమాయకులైపోయారా?

పటేల్ ప్రధాని కాకుండా నెహ్రూ అడ్డుకున్నాడనే మాట గుర్తున్న నారాయణమూర్తి గారికి, భారతదేశంలో విలీనం అనంతం తెలంగాణలోని పేదల భూములు ఏమయ్యాయో తెలియదా? ఎవరి అధీనంలోకి వెళ్ళాయో గుర్తులేదా? 'రజాకార్' సినిమాకి చాలా ఏళ్ల ముందే వచ్చిన 'మాభూమి', 'దాసి' సినిమాలు చూడలేదా? వాటిలో నిజాలు కళ్లకు కట్టలేదా? బాలింతల పాలు పిండింది ఎవరో తెలియదా? ఇంత చరిత్ర మరిచారా? ఆ దొరలే బాలింతల పాలు పిండించినట్లు 'వీరతెలంగాణ' సినిమాలో చూపించారే! తేడా ఎక్కడ జరిగింది?

జనం చూస్తూ చూస్తూ ఉంటే చివరకు సినిమా స్టూడియోల్లో కల్పనాత్మక చారిత్రక పాఠాలు, సినిమా స్ర్కిప్ట్‌లలో వండి వార్చిన దేశభక్తి ప్రపత్తులు పెరుగుతాయి. వాటిని చూసి జనం ఎంత ఊగితే, అవతల కాసులు, ఓట్లు అన్ని రాలతాయి. అది సత్యం! తెలియనివారు ఇదిగో ఇలా తమకు తెలిసిన చరిత్రను తెలియనట్టే మర్చిపోతారు. 

అన్నట్టు, 'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? అసలు ఎప్పుడైనా ఆ సినిమా చూశారా? ముందు వెళ్ళి చూసి రండి.

- విశీ(వి.సాయివంశీ) 


Thursday, 16 May 2024

మూడు యుధ్ధనీతులు

 మూడు యుధ్ధనీతులు 

2023

నాకు ఎవరెవరు బోధించారో.  ఎలా ఎలా ఉపదేశించారో ఇప్పుడు వివరంగా చెప్పలేనుగానీ వారి మాటల సారం నా మనసులో బలంగా నాటుకుపోయింది. అదేమంటే. 


1. నీకు తెలియాల్సింది నీ బలం గురించి మాత్రమేకాదు; నీ బలహీనతలూ నీకు కఛ్ఛితంగా తెలియాలి.  

2. శత్రువుతో తలపడాల్సినప్పుడు నీ శక్తిని తక్కువగా అంచనా వెయ్యి; ప్రత్యర్ధి  శక్తిని ఎక్కువగా అంచనా వెయ్యి. 

3. యుధ్ధరంగంలో ద్రోహుల్ని, గుంటనక్కల్ని దరిదాపుల్లోనికి కూడ  రానియ్యకు. వాళ్ళు నీ శత్రువులకన్నా ప్రమాదకారులు. 



రాత్రి ఒకరు ఫోన్ చేస్తే మాటలు నమలకుండా ఒక మాట చెప్పాను "నువ్వు గుంటనక్క" అని. ఇలా అన్నందుకు నేను ఎన్నడూ చింతించను. 


ఆకురాతి మురళీ కృష్ణ  ముస్లిం సమాజం మీద చేసిన ఆరోపణల మీద ఈ గ్రూపులో ఇంత చర్చ జరుగుతోందా? నాకు ఈ క్షణం వరకు తెలీదు. 


ఆకురాతి మురళీ కృష్ణ  ఐక్యవేదిక గ్రూపులో ముస్లిం సమాజం మీద అకారణంగా దాడి చేశారు. నేను వారి మీద గానీ వారి సామాజికవర్గం మీదగానీ ఏ దశలోనూ ఎలాంటి పరుష పదాలూ వాడలేదు. నేను చాలా వినయంగా - 

MuraliKrishna Akurati గారూ! 

ఇది చాలా అభ్యంతరకర పోస్టు. 

1. ముస్లిం నాయకత్వాలు ఆ.కు. (ఆధిపత్య కులాల) పార్టీలనే నమ్ముకుని వుంటున్నారు. 

2. దళితబహుజనులతో కలిసి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ నిర్మాణానికి ముస్లింలు ముందుకు రావడంలేదు.

3. ముస్లింలకు ఫూలే అంబేడ్కర్ ఐడియాలజీ లేదు.  

4. ముస్లింలు ఎంతసేపటికీ వ్యాపార దృక్పథాన్ని వదలడం లేదు. 

 అనే 4 ఆరోపణలు మీరు చేశారు. 


మీ ముందు మూడు ఆప్షన్లున్నాయి. 

1. మీరు చేసిన ఆరోపణల్ని నిరూపించాలి.  

2. నిరూపించలేకపోతే  ఆ ఆరోపణల్ని ఉపసంహరించుకోవాలి.

3. ఫాసిజానికి అత్యంత బాధితులయిన ముస్లిం సమాజం మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు  బహిరంగ  క్షమాపణలు చెప్పాలి. 

అని అడిగాను. 


అలాగే గ్రూపు adminsకు మూడు విజ్ఞప్తులు  చేశాను. 


1. అణగారిన సమూహాల ఐక్యతకు భంగం కలిగిస్తూ మురళీకృష్ణ ఆకురాతి  ముస్లిం సమాజం మీద అసంబర్ధంగా  చేసిన ఆరోపణల పోస్టును ముందు తొలగించండి. 

2. వారి ఆరోపణల్ని తిప్పికొట్టే ఆవకాశాన్ని నాకు కల్పించండి. 

3. మురళీకృష్ణ ఆకురాతి ఈ గ్రూపు ఆశయాలకు భంగం కలిగించారని తేలితే వారిని ఈ గ్రూపు నుండి తప్పించండి. 


ఇది ఎక్కడయినా డెమోక్రాటిక్ ప్రాసెస్. ఇది జరగాల్సిందే. 


ఈ సందర్భంలో ముసిం సమాజ ప్రతినిధులు ఈ డెమోక్రాటిక్ ప్రాసెస్ ను ప్రారంభించమని ఈ గ్రూపు adminsను కోరాలి. 


MuraliKrishna Akurati ఆరోపణల మీద తమ అభ్యంతరాలను చెపుతూ పోస్టులు పెట్టాలి. (అభ్యంతరాలను చెప్పడం అంటే హిందూ బిసీ సమూహాలను విమర్శించమనికాదు) 


వాళ్లు ఇంకో పనికూడ చేయవచ్చు. నాకు ఫోన్ చేసి MuraliKrishna Akurati పెట్టిన పోస్టు అభ్యంతరకరమే అయినప్పటికీ  ఐక్యత కోరుతూ  ఈ చర్చను ఇక్కడితో ఆపేద్దాం అని నాకు సూచించవచ్చు. నేను వెంటనే సానుకూలంగా స్పందించేవాడిని. ఏ ఒక్కరూ ఆ రెండు పనులు చేయలేదు. 


గ్రూపు అడ్మిన్ డెమోక్రాటిక్  ప్రాసెస్ ను మొదలు పెట్టకముందే  ఒక 

ముస్లిం ప్రతినిధి MuraliKrishna Akuratiని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టారు. 


MuraliKrishna Akurati గారు ఈ పోస్టు పెట్టడంలో  malice ఏమిటీ? అనే సందేహం కూడా వీరికి రాలేదు. 


"MuraliKrishna Akurati చాలా మంచి మనిషి. నాకు చాలాకాలంగా తెలుసు. నాకు  పెద్దన్నలాంటివారు" అని కితాబు ఇచ్చారు. 


ఈ వివాదంలో ఆయన MuraliKrishna Akurati  పక్షం వహించారు. అంటే MuraliKrishna Akurati ముస్లిం సమాజం మీద చేసిన ఆరోపణల్లో నేరుగా భాగస్వామి అయ్యారు. 


గ్రూపులో MuraliKrishna Akurati  పక్షం వహిస్తూ పోస్ట్ పెట్టాక వారు నాకు ఫోన్ చేసి MuraliKrishna Akurati గారి గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం మొదలెట్టారు.  


ఇది కపటం! గుంటనక్క వ్యవహారం! 


నీ గురించి కొంచెం ఆశ్చర్యం, అనుమానం, ఆసక్తి అన్నీ కలుగుతున్నాయి.  

Friday, 10 May 2024

ఏపి ముస్లింలు బిజెపిని ఓడించాలి – వైసిపిని గెలిపించాలి

 ఏపి ముస్లింలు బిజెపిని ఓడించాలి – వైసిపిని గెలిపించాలి

 అనే శీర్షికతో ఈరోజు ‘సాక్షి’ దినపత్రికలో నా వ్యాసం వచ్చింది.  

 

పత్రికల పేజీల్లో స్థలా భావంవల్లగానీ, ఇతర కారణాలవల్లగాన్నీ కొన్ని పేరాలు, కొన్ని వాక్యాలనుగానీ ఎడిట్ చేయడమో, తగ్గించడమో జరుగుతూవుంటుంది.

 

నా వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆసక్తిగలవారు చదువుకోవచ్చు.

 

*అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ (డానీ)*

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

 

*ఏపి ముస్లింలు బిజెపిని ఓడించాలి – వైసిపిని గెలిపించాలి*

స్వతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని ప్రమాదకర రీతిలో  2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడ జరుగుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీజీ, బిజెపిల  నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికారంలోవున్న ఎన్డియే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ప్రకటిస్తున్నది, అనేక లక్షల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేస్తున్నది. భూమీ, ఆకాశం, సముద్రం, అడవులు, కొండలు, గనులు, ఓడరేవులు, విమానాశ్రయాలు అన్నింటినీ తన మిత్రులయిన కార్పొరేట్లకు   ధారాదత్తం చేస్తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అర్ధిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. 

దేశప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, శిక్కులు తదితరులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపినెస్ రిపోర్టులో భారత దేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగాలేరు. అణిచివేతకు గురవుతున్న  ప్రతి ఆరుగుర్రిలో ఒకరు మాత్రమే ముస్లింలు.; ఐదుగురు హిందువులు. దీని అర్ధం ఏమంటే  మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పుపుచ్చడానికి, హిందూ-ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుధ్ధంగా మార్చడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీజీ నడుంబించారు.

ఎన్నికల్ని మతయుధ్ధంగా మారిస్తేతప్ప, ప్రజాస్వామిక పధ్ధతుల్లో తాము గెలవలేమని బిజెపి వ్యూహకర్తలకు స్పష్టంగా తెలిసిపోయింది.  2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టి 1761 నాటి పానిపట్టు యుధ్ధంతో పోల్చేది. ఆ యుధ్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుస్థితి వస్తుందని భయపెట్టేది.  ఉత్తరప్రదేష్ ఎన్నికల్ని ఔరంగ జేబ్, శివాజి మహారాజ్ ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. అలాగే గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్ కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.

లోక్ సభ ఎన్నికల తొలి, మలి విడతల పోలింగ్ లో బిజెపి తన బలమైన కోటగా భావించే ఉత్తర భారతదేశంలోనే బలహీనపడిందనే సంకేతాలు వెలువడ్డాయి. దానితో భయపడిపోయిన ప్రధాని మోదీజీ ముస్లింల మీద మరింత విషం కక్కుతున్నారు. అబధ్ధాలు చెప్పడానికి కూడ వారు వెనుకాడడంలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారం లోనికి వస్తే “హిందూ స్త్రీల మంగళ సూత్రాలను లాక్కుని ముస్లింలకు పంచుతారు”  అంటూ వారు ఒక కొత్త ప్రచారాన్ని మొదలెట్టారు. ‘లవ్ జిహాద్’, ‘ఎకనామిక్ జిహాద్’ దశలను దాటి ఇప్పుడు ‘ఓట్ జిహాద్’ అనే కొత్త పదాన్ని ప్రచారంలో పెట్టారు. ఎన్నికల ప్రచారాన్ని ఈ స్థాయికి దొగజార్చిన  ప్రధాని మనకు గతంలో కనిపించరు.

వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమాజంలోని కింది కులాలకు కేటాయిస్తామని బిజెపి చాలా కాలంగా చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలు ఈ మాటల్ని నమ్మలేదు. కర్ణాటకలో అధికారంలోవున్న బిజెపిని ఓడించారు. తెలంగాణలో బిజెపి అధికారాన్ని చేపట్టకుండ అడ్డుకున్నారు. 

మతప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం ఆమోదించదు అని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మతప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవానికి మత రిజర్వేషన్లే. మాల సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తి తాను హిందూవుననిగానీ శిక్కు అనిగానీ, బౌధ్ధుడ్ని అనిగానీ  ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందుతాడు. తాను క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బిసి రిజర్వేషను పొందుతాడు. ఏమిటీ దీని అర్ధం? మన రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఏర్పడ్డాయని కదా?

వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు వేరు. ప్రభుత్వాలు వాటిని మత ప్రాతిపదికన ఇవ్వరు. సామాజిక వివక్షను అనుభవిస్తూ విద్యా, ఉపాధి రంగాల్లో తక్కువ ప్రాతినిధ్యంగల సమూహాలకు బిసి గుర్తింపునిస్తారు. ఇటీవల ఇందులో  మూడవ షరతుగా క్రీమీలేయర్ ను చేర్చారు. ‘బిసి’ లోని ‘సి’ ని చాలా మంది తెలియక కులం (క్యాస్ట్) అనుకుంటున్నారు. ‘సి’ అంటే  కులం కాదు తరగతి (క్లాసెస్).

బిజెపి ముస్లిం రిజర్వేషన్ గా ప్రచారం చేస్తున్నది కూడ నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసిలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్ లకు బిసి రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్ధికంగా వెనుకబడిన సమూహాలు (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్దిపొందవచ్చు. అక్కడా వాళ్ళను అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్ధికరంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చివేయడం బిజెపి విధానంగా మారింది. ఇది భారత రాజ్యంగ ఆధునిక ఆదర్శాలయిన మతసామరస్యానికి, సామ్యవాదానికి మాత్రమేగాక తొలి ఆదర్శమయిన ప్రజాస్వామ్యానికి కూడ వ్యతిరేకం.

ఏపిలో ప్రధాన పోటీదారులు అధికార  వైయస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగు దేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మతసామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బిజెపి ఈ నేల మీద తనంతతానుగా  మొలకెత్తలేని విత్తనం.  2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బిజెపికి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టికి ఒక్క సీటు కూడ దక్కలేదు. ఆంద్రప్రదేశ్ ప్రజలు బిజెపిని వంద అడుగుల లోతు సమాధి తవ్వి పూడ్చిపెట్టేశారు. అలాంటి పార్టితో పొత్తు పెట్టుకుని చంద్రబాబు టిడిపి ఈ ఎన్నికల్లో ఒక చారిత్రిక తప్పిదానికి పాల్పడింది.  

జాతీయ స్థాయిలో ఎన్డిఏకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. అందులో సందేహంలేదు. ఆంధ్రప్రదేశ్  ముస్లింలు కూడ ఈసారి ఎన్నికల్లో ఒక లెఖ్ఖప్రకారం కాంగ్రెస్ కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపిలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న  ప్రాధాన్యతల్ని ఆ పార్టి ఏపి నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపి పిసిసి అధ్యక్షురాలైన వైయస్ షర్మీలాకు బిజెపిని ఓడించాలనే  పట్టుదల వున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి మీద కన్నా వైయయస్సార్ కాంగ్రెస్ మీదనే వారు ఎక్కువ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇది కాంగ్రెస్ కు ఏమేరకు ఉపయోగపడుతుందోగానీ, అంతిమంగా బిజెపికే మేలు చేస్తుంది. ఎన్డీయే మీడియా కూడ తమ ప్రయోజనాల మేరకు షర్మీలకు కవరేజి ఇస్తున్నది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సంస్థాగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదనే మాటా కూడ వినవస్తున్నది.

కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏ కూటమిని ఓడించాలా? అనేది ఏపి ముస్లింల ముందున్న అతి పెద్ద ప్రశ్న.

రాష్ట్ర ఆర్ధిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసిపి జగన్ ఇన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోవున్న ఎన్డియేతో చాలా  సఖ్యంగా వున్నారు. “మోదీ-షాలు  వంగమంటే జగన్ పాకారు” అన్నా అతిశయోక్తికాదు.  అయితే,  ఇప్పుడు ఆయనే ఏపి నేల మీద బిజెపిని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు.   ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బిజెపి జగన్ ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది.  మోదీ- అమిత్ షాలను దీటుగా డీకొనడానికి జగన్ సిధ్ధం అయితేనే వైయస్సార్  సిపి రాజకీయ ఉనికి నిలబడుతుంది.

భారత జాతీయ కాంగ్రెస్సా? వైయస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్యమాత్రమేకాదు ఒక విధంగా నైతిక సమస్య కూడ.  ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, భారత జాతీయ కాంగ్రెస్ ఏపి యూనిట్  వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసిపికి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడ.

ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటి (ముస్లిం JAC), ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు,  ప్రొఫెషనల్స్, తో  జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడ ఈ మేరకు ఒక తీర్మానం చేసింది.

*ఏఎం ఖాన్ యజ్దానీ డానీ*

కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*

9010757776

8 మే 2024

 

https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=11/05/2024&pgid=387442&device=desktop&view=3

Friday, 3 May 2024

*సంపదను పెంచాలా? పంచాలా?*

 *సంపదను పెంచాలా? పంచాలా?* 

*ఏఎం ఖాన్ యజ్దానీ (డానీ)* 


'నవ్యాంధ్రప్రదేశ్ పదేళ్ళ ప్రస్తానం' అనే అంశం మీద బిబిసి తెలుగు విభాగం  మే 3న విజయవాడలో ఒక చర్చాగోష్టి నిర్వహించింది. సాధారణంగా ఇలాంటి చర్చా గోష్టుల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులే ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు.  సామాజిక విశ్లేషకులకు చాలా తక్కువ సమయం దక్కుతుంది. మోడరేటర్ గా వ్యవహరించిన బిబిసి తెలుగు ఎడిటర్ జిఎస్ రామ్మోహన్ అందరూ  రెండు మూడు నిముషాలలోపే తమ అభిప్రాయాలను చెప్పాలని, అలా చేస్తే ఒక్కొక్కరు అనేకమార్లు చర్చలో పాల్గొన్వచ్చని సూచించారు. రాజకీయ నాయకులతో అలా కుదరదుగా. 


మోడరేటర్ సూచన మేరకు నేను 3 నిముషాల ప్రసంగాన్ని సిధ్ధం చేసుకున్నాను. దాని పూర్తి ప్రసంగ పాఠం ఇది.


1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం  తెలంగాణకు అడ్వాంటేజ్ గానూ నవ్యాంధ్రకు డిజ్- అడ్వాంటేజ్ గానూ మారింది.


2. విభజన నిందను కేవలం కాంగ్రెస్ మీద నెట్టివేయడం భావ్యంకాదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు అందులో భాగం వుంది.


3. కష్టాల్లోవున్న కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని ప్రజలు 2014 ఎన్నికల్లో చంద్రబాబును ఎన్నుకున్నారు. ఆయన తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 


4. చంద్రబాబు "సంపదను పెంచుతాను" అనే విధానంతో ముందుకు సాగారు. 


5. చంద్రబాబు అనుసరించిన  విధానం 2019 ఎన్నికల్లో  40 శాతం ఓటర్లకు నచ్చింది. 60 శాతానికి నచ్చలేదు. ఆయన ఓడిపోయారు. 


6. సమాజంలో ప్రతీ చర్యకు సమానమైన తద్వెతిరేకమైన ప్రతిచర్య వుంటుంది అని మనందరికీ తెలుసు.


7. చంద్రబాబు "సంపదను పెంచుతాను" అంటే జగన్ "సంపదను పంచుతాను" అనే వాగ్దానంతో ముందుకు వచ్చారు.  


8. జగన్ ప్రతిపాదిత విధానం   50 శాతం ఓటర్లకు నచ్చింది. ఆయన రెండవ ముఖ్యమంత్రి అయ్యారు.


9. చంద్రబాబు, జగన్ ల విధానాల్లో ఇంతటి వైరుధ్యం వున్నప్పటికీ ఒక విషయంలో వాళ్ళ మధ్య గొప్ప ఐక్యత వుంది. 


10. మోదీ తమను ఆదుకుంటారని ఇద్దరూ చాలా గట్టిగా నమ్మేరు. కేంద్రంలో  నరేంద్ర మోదీజీకి ఇద్దరూ  దాదాపు ఊడిగం చేశారు.


11.  మోదీజీ ఆదుకుంటారనుకుంటే మోదీజీ ఇద్దరితో అడుకున్నారు. 


12. ఆడుకోవడం అనేది ఇక్కడ చిన్నమాట.  ఇంకా పెద్ద మాట బండమాట వాడాలి. 


13. రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం నిలువునా మోసం చేసింది. పోలవరం ప్రాజెక్టు,  ప్రత్యేక తరహా ప్రతిపత్తి వీటిల్లో రెండు మాత్రమే.


14. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు స్థూలంగా బిజేపికి ఓటెయ్యరు. కానీ ఏపిలో బిజెపి పాలనను కొనసాగించింది అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్. 

15. మళ్ళా "సంపదను పెంచుతాను" అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల్లో ముందుకు వచ్చారు. మరోసారి "సంపదను పంచుతాను" అంటూ జగన్ మరో ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. 


16. సంపదను పెంచాలో పంచాలో, సంపదను  పెంచి పంచాలో జనం తేలుస్తారు.


//EOM//



*బిజెపితో జతకట్టడం చంద్రబాబు చారిత్రక తప్పిదం *

 *బిజెపితో జతకట్టడం చంద్రబాబు చారిత్రక తప్పిదం *


ఏ యం ఖాన్ యజ్దానీ (డానీ)

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు 


‘ఇండియా టుడే’ డిప్యూటి ఎడిటర్ అమర్ నాథ్ కే మీనన్ నన్ను ఏపి ఎన్నికల మీద ఏప్రిల్ 26న   ఇంటర్ వ్యూ చేశారు. 


Note : నేను సాధారణంగా 10-15 పదాలు మించకుండ ఎదో ఒక అంశం మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాను. అంతకు మించి ఫేస్ బుక్ ఆమోదించదు కూడ. అవన్నీ ఒన్ లైనర్స్ కనుక ఒక్కోసారి సంపూర్ణ అర్ధాన్ని ఇవ్వవు. కొన్ని సందర్భాల్లో అపార్ధాలకు కూడ దారి తీస్తుంటాయి. వ్యాసాలు, ఇంటర్ వ్యూలు ఈ లోటును తీరుస్తుంటాయి. దానికి ఈ ఇంటర్ వ్యూ పనికి వస్తుందనుకుంటాను. 


*Q – 1. How is the 2024 election in Andhra Pradesh different from that in 2019?*


2019లో చంద్రబాబు అధికారంలో వున్నారు. అప్పట్లో బిజెపికి పూర్తి వ్యతిరేకంగా వున్నారు. ఒంటరిగా పోటీచేశారు.  40 శాతం ఓట్లు వచ్చినా  23 సీట్లు మాత్రమే దక్కాయి. అధికారాన్ని కోల్పోయారు. 


జగన్ అప్పుడు ప్రతిపక్షంలో వున్నారు. ఒంటరిగా పోటీచేసి చంద్రబాబు వైఫల్యాలతో, ‘నవరత్నాలు’ పథకాల  ఆకర్షణతో 50 శాతం ఓట్లు సాధించారు. 152 సీట్లు దక్కీంచుకుని అధికారాన్ని చేపట్టారు. 


ఇప్పుడు జగన్ అధికారంలో వున్నారు, చంద్రబాబు ప్రతిపక్షంలో వున్నారు. జగన్ పాలనలో సామాన్య ప్రజలు స్థూలంగా సంతోషంగా వున్నారా? లేదా? అన్నదొక్కటే ఇప్పుడు చర్చనీయాంశం. అదే ఇప్పుడు ఎన్నికల రెఫరెండం. 


Q-2. What do you see as the role of Pawan Kalyan and his JSP? Has he emerged as an influential force?


సినిమాల్లో పవన్ కళ్యాణ్ 'పవర్ స్టార్'; రాజకీయాల్లో మాత్రం వారు పవర్ స్టార్ కాదు.  గత పదేళ్ళుగా రాజకీయాల్లో ఒక పార్టికి నాయకునిగావున్నా  ఇప్పటి వరకు వారికి చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ దక్కలేదు.  జనసేన పార్టికి గ్రామ స్థాయిలో  నిర్మాణం అస్సలు లేదు. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత పవన్ కళ్యాణ్ బలహీనతలు ఒక్కొక్కటి వరుసగా బయటపడుతున్నాయి. ఆయన స్వీయ సామాజికవర్గం అయిన కాపులు సహితం ఆయనకు ఏ మేరకు మద్దతు ఇస్తారో  చెప్పడం కూడ కష్టం. టిడిపితో జనసేన  పొత్తు కుదుర్చుకున్నప్పటికీ   ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న  ప్రత్యేక సామాజిక పరిస్థితుల్లో కాపుల ఓట్లు కమ్మ సామాజికవర్గానికి ఏ మేరకు బదిలీ అవుతాయో ఎవరూ నమ్మకంగా చెప్పలేకపోతున్నారు. 


Q-3. What do you perceive are his strengths and contribution to the National Democratic Alliance?


ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్  చాలా గొప్పగా ఆకర్షణీయమైన  సినిమా డైలాగులు చెపుతుంటారు. జనం కూడా ఒక సినిమా చూస్తున్నట్టు వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, తెలుగుదేశం- బిజెపి- జనసేన కూటమి అభ్యర్ధుల్ని గెలిపించుకునే శక్తి సామర్ధ్యాలు ఆయనకు వున్నవని చెప్పడం కష్టం. వారు  పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడమే వారికి ఇప్పుడు చాలా పెద్ద సవాలుగా మారింది.


Q-4. What are the strengths and weaknesses of Chandrababu Naidu and the TDP?


చంద్రబాబు పరిపాలన విధానం మీద రాష్ట్ర ప్రజలకు ఒక స్థిర అభిప్రాయం వుంది. ఆ తీర్పును వాళ్ళు 2019 ఎన్నికల్లో చెప్పేశారు. మరోవైపు, ఈ ఐదేళ్లలో చంద్రబాబు కొత్తగా స్కోరు చేసిన అంశం ఒక్కటీ లేదు. అయితే, జగన్ పరిపాలనలో అనేక లోపాలు, వైఫల్యాలు వున్నాయి.  అలాగే అధికార పార్టి మీద ప్రజల్లో సహజంగానే కొంత వ్యతిరేకత (ఇన్ కుంబెన్సీ  ఫ్యాక్టర్స్) వుంటుంది. ఇవి రెండూ చంద్రబాబుకు కలిసి రావచ్చు. 


చంద్రబాబు విజయం జగన్ ఓటమిగా మారే అవకాశాలకన్నా జగన్ ఓటమి చంద్రబాబు విజయంగా మారే అవకాశాలు ఎక్కువ.  


 అయితే, విధాన ప్రకటనల్లో చంద్రబాబుకు ఏమాత్రం స్థిరత్వంలేదు. జగన్ మార్కు ఉచితాలవల్ల రాష్ట్ర అభివృధ్ధి 30 ఏళ్ళు వెనక్కి పోయిందని వారు ఒకరోజు అంటారు. మరునాడు జగన్ ను మించిన ఉచితాలు ఇస్తానని మరిన్ని భారీ హామీలు ఇస్తున్నారు.  (30 ఏళ్ల క్రితం అసలు ఈ రాష్ట్రమే లేదు. అది వేరే కత.) 


వార్డు వాలంటరీ వ్యవస్థ మీద,  అయితే ఒకదానితో మరోదానికి  బొత్తిగా పొంతన లేని అభిప్రాయాల్ని చంద్రబాబు రోజుకొకటి చొప్పున ప్రకటిస్తున్నారు. వారివల్ల సామాజిక పెన్షన్ల లబ్దిదారులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. అది టిడిపికి ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చు. 


Q-5. What is it that they need to fulfil their goal of edging out the YSRCP?


 వైయస్సార్ సిపిని తాను ఒంటరిగా  ఓడించగలననే నమ్మకం చంద్రబాబుకు ఏ కోశానా లేదు. అదనపు బలం కోసం ఆయన జనసేన, బిజెపిలతో పొత్తు పెట్టుకున్నారు.  ఓటర్లలో జనసేన శక్తి 6 - 8 శాతానికి మించి వుండదు. పైగా నరేంద్ర మోదీ, అమిత్ షా, పియూష్ గోయల్, రాజ్ నాధ్ సింగ్ ల విద్వేషపూరిత ప్రచార శైలితో ముస్లిం తదితర మైనారిటీల సమూహాలు టిడిపి-కూటమి మీద  అసహనంతో వున్నాయి.


 బాబూ మార్కు అభివృధ్ధి  'సంపదను పెంచడం'. దీని మీద టిడిపి అభిమానులు గట్టిగా ఆశలు పెంచుకుని వున్నారు. గానీ, ఆ విధానాల మీద సామాన్య ప్రజలకు సదభిప్రాయం లేదు. నాడు కాంగ్రెస్ నేడు బిజెపి ఏపికి అన్యాయం చేశాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వుంది. నిజానికి రెండు నెలల క్రితం రాజకీయ వాతావరణం చంద్రబాబుకు అనుకూలంగా కనిపించింది. బిజెపితో పొత్తు పెట్టుకున్నాక ఆయన గ్రాఫ్  వేగంగా పడిపోతున్నది. బిజెపి ఏపి నేల మీద తానుగా మొలకెత్తలేని విత్తనం. ఆ పార్టికి చంద్రబాబు నారు నీరు పోశారు. ఇది కూడ టిడిపికి ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. 


Q-6. What is the mainstay of YSRCP and what are the weaknesses that it has to plug to ensure a second term in office?


ఎన్నికల ప్రచారం సందర్భంగా  మీడియాలో వచ్చే 'ప్రాయోజిత' కథనాలకూ సామాన్య ప్రజల ఆలోచనలకు పొంతన వుండదు. జగన్ పాలనలో సామాన్య ప్రజలు స్థూలంగా సంతోషంగా వున్నారా? లేదా? అన్నదొక్కటే ఇప్పుడు చర్చనీయాంశం. ‘నవరత్నాలు’ పథకాలలే ఇప్పటికీ జగన్ ఆయువుపట్టు.  అందులో వైన్ పాలసీ తప్ప మిగిలినవి జనాదరణ పొందాయని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. అయితే, శాండ్, మైనింగ్ విధానాలు,  కొత్తగా తెచ్చిన 'ల్యాండ్  టైటిల్ చట్టం', వ్యవసాయ మోటార్లకు  మీటర్లు అమర్చడం వగయిరాలు  జగన్ కు స్పష్టంగా మైనస్ పాయింట్లు. 


ఏపిలో రెడ్లు ఇప్పుడు అధికార సామాజికవర్గం. ఆ సామాజికవర్గం మీద  సహజంగానే కొంత వ్యతిరేకత వుంటుంది. అది కూడ జగన్ కు మైనస్ కావచ్చు. 


ఎస్టి, ఎస్సీ, బిసి, మైనారిటీ సామాజికవర్గాల్లో ఇప్పటికీ జగన్ కే గట్టి పట్టు  వుంది. ఓసీ సమూహాల్లో స్వీయ సామాజికవర్గమైన రెడ్లతోపాటు కాపు సామాజికవర్గం  మీద జగన్ నమ్మకం పెట్టుకున్నారు. వార్డు వాలంటీర్స్ వ్యవస్థ  జగన్ కు చాలా పెద్ద ఎస్సెట్.  వాలంటీర్లు ఉద్యోగాలకు సామూహిక రాజీనామాలు చేసి  వైసిపికి కాల్బలంగా పనిచేస్తున్నారు. ఈ సోషల్ ఇంజినీరింగ్ మంచి ఫలితాలను ఇస్తుందనే  ధైర్యంతోనే మరోసారి ఆయన ఒంటరి పోరాటానికి సిధ్ధం అయ్యారు.


(ఇంటర్ వ్యూ ఇంగ్లీషులో సాగింది. ఫేస్ బుక్ లోని తెలుగు మిత్రుల సౌకర్యం కోసం తెలుగు అనువాదాన్ని పోస్ట్ చేస్తున్నాను)