Friday, 3 May 2024

*సంపదను పెంచాలా? పంచాలా?*

 *సంపదను పెంచాలా? పంచాలా?* 

*ఏఎం ఖాన్ యజ్దానీ (డానీ)* 


'నవ్యాంధ్రప్రదేశ్ పదేళ్ళ ప్రస్తానం' అనే అంశం మీద బిబిసి తెలుగు విభాగం  మే 3న విజయవాడలో ఒక చర్చాగోష్టి నిర్వహించింది. సాధారణంగా ఇలాంటి చర్చా గోష్టుల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులే ఎక్కువ సమయాన్ని తీసుకుంటారు.  సామాజిక విశ్లేషకులకు చాలా తక్కువ సమయం దక్కుతుంది. మోడరేటర్ గా వ్యవహరించిన బిబిసి తెలుగు ఎడిటర్ జిఎస్ రామ్మోహన్ అందరూ  రెండు మూడు నిముషాలలోపే తమ అభిప్రాయాలను చెప్పాలని, అలా చేస్తే ఒక్కొక్కరు అనేకమార్లు చర్చలో పాల్గొన్వచ్చని సూచించారు. రాజకీయ నాయకులతో అలా కుదరదుగా. 


మోడరేటర్ సూచన మేరకు నేను 3 నిముషాల ప్రసంగాన్ని సిధ్ధం చేసుకున్నాను. దాని పూర్తి ప్రసంగ పాఠం ఇది.


1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం  తెలంగాణకు అడ్వాంటేజ్ గానూ నవ్యాంధ్రకు డిజ్- అడ్వాంటేజ్ గానూ మారింది.


2. విభజన నిందను కేవలం కాంగ్రెస్ మీద నెట్టివేయడం భావ్యంకాదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలకు అందులో భాగం వుంది.


3. కష్టాల్లోవున్న కొత్త రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని ప్రజలు 2014 ఎన్నికల్లో చంద్రబాబును ఎన్నుకున్నారు. ఆయన తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 


4. చంద్రబాబు "సంపదను పెంచుతాను" అనే విధానంతో ముందుకు సాగారు. 


5. చంద్రబాబు అనుసరించిన  విధానం 2019 ఎన్నికల్లో  40 శాతం ఓటర్లకు నచ్చింది. 60 శాతానికి నచ్చలేదు. ఆయన ఓడిపోయారు. 


6. సమాజంలో ప్రతీ చర్యకు సమానమైన తద్వెతిరేకమైన ప్రతిచర్య వుంటుంది అని మనందరికీ తెలుసు.


7. చంద్రబాబు "సంపదను పెంచుతాను" అంటే జగన్ "సంపదను పంచుతాను" అనే వాగ్దానంతో ముందుకు వచ్చారు.  


8. జగన్ ప్రతిపాదిత విధానం   50 శాతం ఓటర్లకు నచ్చింది. ఆయన రెండవ ముఖ్యమంత్రి అయ్యారు.


9. చంద్రబాబు, జగన్ ల విధానాల్లో ఇంతటి వైరుధ్యం వున్నప్పటికీ ఒక విషయంలో వాళ్ళ మధ్య గొప్ప ఐక్యత వుంది. 


10. మోదీ తమను ఆదుకుంటారని ఇద్దరూ చాలా గట్టిగా నమ్మేరు. కేంద్రంలో  నరేంద్ర మోదీజీకి ఇద్దరూ  దాదాపు ఊడిగం చేశారు.


11.  మోదీజీ ఆదుకుంటారనుకుంటే మోదీజీ ఇద్దరితో అడుకున్నారు. 


12. ఆడుకోవడం అనేది ఇక్కడ చిన్నమాట.  ఇంకా పెద్ద మాట బండమాట వాడాలి. 


13. రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం నిలువునా మోసం చేసింది. పోలవరం ప్రాజెక్టు,  ప్రత్యేక తరహా ప్రతిపత్తి వీటిల్లో రెండు మాత్రమే.


14. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు స్థూలంగా బిజేపికి ఓటెయ్యరు. కానీ ఏపిలో బిజెపి పాలనను కొనసాగించింది అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్. 

15. మళ్ళా "సంపదను పెంచుతాను" అంటూ చంద్రబాబు 2024 ఎన్నికల్లో ముందుకు వచ్చారు. మరోసారి "సంపదను పంచుతాను" అంటూ జగన్ మరో ఎన్నికల సమరానికి సిద్ధం అయ్యారు. 


16. సంపదను పెంచాలో పంచాలో, సంపదను  పెంచి పంచాలో జనం తేలుస్తారు.


//EOM//



No comments:

Post a Comment