Wednesday 29 May 2024

Maabhoomi Song - Gaddar Controversy

 పాటను మార్చినా కొంచెం అతికేలా వుండాలి! 

A.m. Khan Yazdani Danny

March 21, 2024 · 


పాటను మార్చినా కొంచెం అతికేలా వుండాలి!

ఒకవైపు రెడ్ది ముఖ్యమంత్రికి, ఇంకో వైపు  రెడ్ది సెన్సార్ బోర్డు డైరెక్టరుకు భయపడి  ప్రతాపరెడ్డిని నైజము సర్కారోడను చేశారు. 

ఎర్రపహడ్ దొర‌ ప్రతాప రెడ్డి (నల్గొండ జిల్లా) విసునూరు దొర రాంచంద్రారెడ్డి (వరంగల్  జిల్లా) అనుకుంటా. ఈ పాట పుట్టింది నల్గొండ జిల్లాలో. అప్పటి పోరాటానికి నైజాం నవాబు అసలు లక్ష్యమేకాదు. అంతటి విస్తృతీ లేదు. 

నిజాం నవాబు  హైదరాబాద్ నగర వీధుల్లో 16 ఎడ్లబండ్లు కట్టుకుని  తిరుగుతుంటాడని మెదడు వున్నవాడు ఎవరయినా రాస్తారా? పాట ఒరిజినల్ లో కవి-గాయకుడు-కార్యకర్త  యాదగిరి అలాంటి తప్పు చేయలేదు.  

ప్రతాప రెడ్డి పేరు తీసి నిజాం నవాబు పేరు పెట్టాలనుకున్నప్పుడు 16 ఎడ్లబండ్లు తీసి 16 రోల్స్ రాయిస్ కార్లు అని పెడితే కొంచెం అతికేది.



Sai Vamshi

 March 21, 2024 · · 

'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? ✍️✍️

'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? ✍️✍️

... యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటూ ఆర్.నారాయణమూర్తి గారు 'వీరతెలంగాణ' సినిమా తీసి, అందులో బండి యాదగిరి గారి 'బండెనక బండి కట్టి' పాట వాడారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ పాట జనాన్ని ఎంత ఉత్తేజితుల్ని చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

బండెన్క బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి

ఏ బండ్లో వస్తవ్ కొడుకో దేశ్‌ముఖ్ దొరగాడా

నాజీల మించినవ్‌రో దేశ్‌ముఖ్ దొరగాడా

దేశ్‌ముఖ్‌లు, దొరలు నిజాం రాజుకంటే తక్కువేమీ కాదన్న అర్థం ఇందులో ఉంది. సినిమాలో ఈ పాట నారాయణమూర్తి గారి మీదే చిత్రీకరించారు. యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమాలో ఏది ఎలా వాడాలో ఆయనకు తెలుసుగా!(ఆ పాటను గద్దర్ గారి గొంతులో మీరు విని తీరాలి. ఆహా! అదొక అనుభవం. 'మాభూమి' సినిమాలో ఉంది).

అదే నారాయణమూర్తి గారు 'రజాకార్' సినిమా ప్రచార కార్యక్రమానికి వచ్చి నిజాం రాజ్యంలో రజాకార్లు చేసిన అన్యాయాల గురించి వివరించారు. హైదరాబాద్ స్టేట్‌కు ముస్లింలు, హిందువులు రెండు కళ్లు అన్నారు. ముస్లింలు అల్లానే పూజిస్తారు, క్రైస్తవులు క్రీస్తునే పూజిస్తారు, హిందువులు మాత్రం చర్చిలు, దర్గాలకు వెళ్తారని గొప్పగా చెప్పారు. హిందువులు చర్చిలు, దర్గాలకు వెళ్లడమేమిటి నాన్సెన్స్ అనుకున్నారేమో, ఆ కార్యక్రమంలో కొందరు ఆ మాటలకు అరిచారు. ఆయన వారిని కసిరి ప్రసంగం కొనసాగించారు. 

ఇన్ని చెప్పారు సరే, మరి దొరలు, భూస్వాముల దురాగతాల గురించి ఒక్క విషయమూ చెప్పలేదే? గడీల్లో వెట్టి చాకిరీ గురించి మాట్లాడలేదే? 'ఏ బండ్లో వస్తవ్ కొడుకో దేశ్‌ముఖ్ దొరగాడా' అనే లైన్ పాడలేదు ఎందుకు? రజాకార్లు అనేవాళ్లు ఏయే ప్రాంతాల నుంచి వచ్చారు, ఏయే ప్రాంతాలకు వెళ్లారు అనే వివరాలు తెలిసిన ఆయనకు అసలైన చరిత్ర తెలియదా? విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి అరాచకాలు, కంఠాత్మకూర్‌ గడీ అన్యాయాలు, కడవెండిలో రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ అక్రమాలకు ఎదురుతిరిగి, రామచంద్రారెడ్డిపై తిరుగుబాటు చేసిన దొడ్డి కొమరయ్య హత్య.. ఇవన్నీ మరిచారా? అందరూ అమాయకులైపోయారా?

పటేల్ ప్రధాని కాకుండా నెహ్రూ అడ్డుకున్నాడనే మాట గుర్తున్న నారాయణమూర్తి గారికి, భారతదేశంలో విలీనం అనంతం తెలంగాణలోని పేదల భూములు ఏమయ్యాయో తెలియదా? ఎవరి అధీనంలోకి వెళ్ళాయో గుర్తులేదా? 'రజాకార్' సినిమాకి చాలా ఏళ్ల ముందే వచ్చిన 'మాభూమి', 'దాసి' సినిమాలు చూడలేదా? వాటిలో నిజాలు కళ్లకు కట్టలేదా? బాలింతల పాలు పిండింది ఎవరో తెలియదా? ఇంత చరిత్ర మరిచారా? ఆ దొరలే బాలింతల పాలు పిండించినట్లు 'వీరతెలంగాణ' సినిమాలో చూపించారే! తేడా ఎక్కడ జరిగింది?

జనం చూస్తూ చూస్తూ ఉంటే చివరకు సినిమా స్టూడియోల్లో కల్పనాత్మక చారిత్రక పాఠాలు, సినిమా స్ర్కిప్ట్‌లలో వండి వార్చిన దేశభక్తి ప్రపత్తులు పెరుగుతాయి. వాటిని చూసి జనం ఎంత ఊగితే, అవతల కాసులు, ఓట్లు అన్ని రాలతాయి. అది సత్యం! తెలియనివారు ఇదిగో ఇలా తమకు తెలిసిన చరిత్రను తెలియనట్టే మర్చిపోతారు. 

అన్నట్టు, 'మాభూమి' సినిమా రీరిలీజ్ ఎప్పుడు? అసలు ఎప్పుడైనా ఆ సినిమా చూశారా? ముందు వెళ్ళి చూసి రండి.

- విశీ(వి.సాయివంశీ) 


No comments:

Post a Comment