ఏపి ముస్లింలు బిజెపిని ఓడించాలి – వైసిపిని గెలిపించాలి
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Friday, 10 May 2024
ఏపి ముస్లింలు బిజెపిని ఓడించాలి – వైసిపిని గెలిపించాలి
అనే శీర్షికతో ఈరోజు ‘సాక్షి’ దినపత్రికలో నా వ్యాసం
వచ్చింది.
పత్రికల పేజీల్లో స్థలా భావంవల్లగానీ,
ఇతర కారణాలవల్లగాన్నీ కొన్ని పేరాలు, కొన్ని వాక్యాలనుగానీ ఎడిట్ చేయడమో, తగ్గించడమో
జరుగుతూవుంటుంది.
నా వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ ఇస్తున్నాను.
ఆసక్తిగలవారు చదువుకోవచ్చు.
*అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ
(డానీ)*
కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక
(MTF)
*ఏపి ముస్లింలు బిజెపిని ఓడించాలి – వైసిపిని గెలిపించాలి*
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని
ప్రమాదకర రీతిలో 2024 లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడ జరుగుతున్నాయి.
దేశప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం
క్రైస్తవులు, శిక్కులు తదితరులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపినెస్ రిపోర్టులో
భారత దేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగాలేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగుర్రిలో ఒకరు మాత్రమే ముస్లింలు.; ఐదుగురు
హిందువులు. దీని అర్ధం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన
బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పుపుచ్చడానికి, హిందూ-ముస్లింల మధ్య తగువుపెట్టి
ఎన్నికల్ని ఒక మత యుధ్ధంగా మార్చడానికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీజీ నడుంబించారు.
ఎన్నికల్ని మతయుధ్ధంగా మారిస్తేతప్ప, ప్రజాస్వామిక పధ్ధతుల్లో
తాము గెలవలేమని బిజెపి వ్యూహకర్తలకు స్పష్టంగా తెలిసిపోయింది. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టి 1761 నాటి పానిపట్టు
యుధ్ధంతో పోల్చేది. ఆ యుధ్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ
బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 సంవత్సరాలు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి,
మళ్ళీ అలాంటి దుస్థితి వస్తుందని భయపెట్టేది.
ఉత్తరప్రదేష్ ఎన్నికల్ని ఔరంగ జేబ్, శివాజి మహారాజ్ ల మధ్య పోరాటంగా ప్రచారం
చేసింది. అలాగే గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్ కు ఓటేస్తారా?
రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.
లోక్ సభ ఎన్నికల తొలి, మలి విడతల పోలింగ్ లో బిజెపి తన
బలమైన కోటగా భావించే ఉత్తర భారతదేశంలోనే బలహీనపడిందనే సంకేతాలు వెలువడ్డాయి. దానితో
భయపడిపోయిన ప్రధాని మోదీజీ ముస్లింల మీద మరింత విషం కక్కుతున్నారు. అబధ్ధాలు చెప్పడానికి
కూడ వారు వెనుకాడడంలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అధికారం లోనికి వస్తే
“హిందూ స్త్రీల మంగళ సూత్రాలను లాక్కుని ముస్లింలకు పంచుతారు” అంటూ వారు ఒక కొత్త ప్రచారాన్ని మొదలెట్టారు. ‘లవ్
జిహాద్’, ‘ఎకనామిక్ జిహాద్’ దశలను దాటి ఇప్పుడు ‘ఓట్ జిహాద్’ అనే కొత్త పదాన్ని ప్రచారంలో
పెట్టారు. ఎన్నికల ప్రచారాన్ని ఈ స్థాయికి దొగజార్చిన ప్రధాని మనకు గతంలో కనిపించరు.
మతప్రాతిపదికన రిజర్వేషన్లను రాజ్యాంగం ఆమోదించదు అని మరో
బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మతప్రాతిపదికనే కులాలుంటాయి.
భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవానికి మత రిజర్వేషన్లే.
మాల సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తి తాను హిందూవుననిగానీ శిక్కు అనిగానీ, బౌధ్ధుడ్ని
అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను
పొందుతాడు. తాను క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బిసి రిజర్వేషను పొందుతాడు. ఏమిటీ దీని
అర్ధం? మన రిజర్వేషన్లు మత ప్రాతిపదికన ఏర్పడ్డాయని కదా?
వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు వేరు. ప్రభుత్వాలు వాటిని
మత ప్రాతిపదికన ఇవ్వరు. సామాజిక వివక్షను అనుభవిస్తూ విద్యా, ఉపాధి రంగాల్లో తక్కువ
ప్రాతినిధ్యంగల సమూహాలకు బిసి గుర్తింపునిస్తారు. ఇటీవల ఇందులో మూడవ షరతుగా క్రీమీలేయర్ ను చేర్చారు. ‘బిసి’ లోని
‘సి’ ని చాలా మంది తెలియక కులం (క్యాస్ట్) అనుకుంటున్నారు. ‘సి’ అంటే కులం కాదు తరగతి (క్లాసెస్).
బిజెపి ముస్లిం రిజర్వేషన్ గా ప్రచారం చేస్తున్నది కూడ
నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసిలుగా పరిగణించే సయ్యద్, పఠాన్,
మొఘల్, బేగ్ లకు బిసి రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్ధికంగా వెనుకబడిన
సమూహాలు (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్దిపొందవచ్చు. అక్కడా వాళ్ళను అనేక ఇబ్బందులు పెడుతున్నారు.
ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్ధికరంగంలో అతి క్రూరంగా బుల్
డోజర్లతో కూల్చివేయడం బిజెపి విధానంగా మారింది. ఇది భారత రాజ్యంగ ఆధునిక ఆదర్శాలయిన
మతసామరస్యానికి, సామ్యవాదానికి మాత్రమేగాక తొలి ఆదర్శమయిన ప్రజాస్వామ్యానికి కూడ వ్యతిరేకం.
జాతీయ స్థాయిలో ఎన్డిఏకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని
ఇండియా కూటమి మాత్రమే. అందులో సందేహంలేదు. ఆంధ్రప్రదేశ్ ముస్లింలు కూడ ఈసారి ఎన్నికల్లో ఒక లెఖ్ఖప్రకారం
కాంగ్రెస్ కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపిలో కాంగ్రెస్ నిర్మాణం
బలంగా లేదు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న
ప్రాధాన్యతల్ని ఆ పార్టి ఏపి నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపి పిసిసి
అధ్యక్షురాలైన వైయస్ షర్మీలాకు బిజెపిని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. ఎన్డీఏ కూటమి మీద కన్నా
వైయయస్సార్ కాంగ్రెస్ మీదనే వారు ఎక్కువ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇది కాంగ్రెస్
కు ఏమేరకు ఉపయోగపడుతుందోగానీ, అంతిమంగా బిజెపికే మేలు చేస్తుంది. ఎన్డీయే మీడియా కూడ
తమ ప్రయోజనాల మేరకు షర్మీలకు కవరేజి ఇస్తున్నది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ సంస్థాగత
సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదనే మాటా కూడ వినవస్తున్నది.
కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బిజెపి
నాయకత్వంలోని ఎన్డిఏ కూటమిని ఓడించాలా? అనేది ఏపి ముస్లింల ముందున్న అతి పెద్ద ప్రశ్న.
రాష్ట్ర ఆర్ధిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసిపి జగన్
ఇన్నాళ్ళుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోవున్న ఎన్డియేతో చాలా సఖ్యంగా వున్నారు. “మోదీ-షాలు వంగమంటే జగన్ పాకారు” అన్నా అతిశయోక్తికాదు. అయితే,
ఇప్పుడు ఆయనే ఏపి నేల మీద బిజెపిని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బిజెపి జగన్ ల
మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. మోదీ- అమిత్
షాలను దీటుగా డీకొనడానికి జగన్ సిధ్ధం అయితేనే వైయస్సార్ సిపి రాజకీయ ఉనికి నిలబడుతుంది.
భారత జాతీయ కాంగ్రెస్సా? వైయస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న
మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్యమాత్రమేకాదు ఒక విధంగా నైతిక
సమస్య కూడ. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు,
భారత జాతీయ కాంగ్రెస్ ఏపి యూనిట్ వాస్తవిక
బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసిపికి మద్దతు ఇవ్వడమే
మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడ.
ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటి (ముస్లిం
JAC), ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు,
అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫెషనల్స్, తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడ ఈ మేరకు ఒక తీర్మానం
చేసింది.
*ఏఎం ఖాన్ యజ్దానీ డానీ*
కన్వీనర్, *ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)*
9010757776
8 మే 2024
https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=11/05/2024&pgid=387442&device=desktop&view=3
Subscribe to:
Post Comments (Atom)
మతం పేరుతో ఓట్లను అడగటం చాలా తప్పు.
ReplyDeleteమీరు ఒక విధ్వంసకరపార్టీకోసం ఇలా ఓట్లు అడుగుతున్నారు. తప్పులు తప్ప మరేమీ చేయని వారికోసం ఇలా మాట్లాడే మీతప్పు ఎంచి ఏమి లాభం?
కానీయండి. భ్రష్టస్య కావా గతిః.