*గద్దర్ మళ్ళీ దొరకడు*
గద్దర్ గురించి ఆయన జీవిత కాలంలోనూ ఆ తరువాతి కాలం లోనూ చాలామంది
మాట్లాడారు. ఇప్పటికీ మాట్లాడుతూనే వున్నారు. ఇక ముందు కూడ మాట్లాడుతారు.
చారిత్రక పురుషుల మీద చర్చ నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. ఒక్కో కొత్త దశలో
ఒక్కో కొత్త ప్రమాణాలతో వాళ్ళను గుర్తు చేసుకుంటూనే వుంటాము.
మనకు చాలామంది కవులు, గాయకులు వున్నారు. కానీ గద్దర్ వేరు. గద్దర్ కన్నా
బాగా పాడేవారు వుండవచ్చు, కానీ గద్దర్ వేరు.
గద్దర్ కన్నా గొప్పగా పాట రాసేవారు వుండవచ్చు, కానీ గద్దర్ వేరు. -
మనిషినీ, ప్రకృతినీ గద్దర్ కన్నా
గొప్పగా వర్ణించవచ్చు - కానీ గద్దర్ వేరు.
శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాటాన్ని క్రూరంగా అణిచివేసిన తరువాత మరో
విప్లవోద్యమం మనగడ్డ మీద తలెత్తుతుందని ఎవరూ అనుకుని వుండరు.
కానీ తెలంగాణలో మరీ ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతాంగ సాయుధ
పోరాటం మొలకెత్తి ఎపుగా పెరిగింది.
దానికి రాళ్ళెత్తిన ముఖ్య కూలీల్లో గద్దర్ ఒకడు. అది అతని చారిత్రక ప్రాముఖ్యత.
ఒక చారిత్రక సాంస్కృతిక అవసరాన్ని అతను నెరవేర్చాడు.
తప్పులు అందరూ చేస్తారు. చారిత్రక కర్తవ్యాలను కొందరే నెరవేరుస్తారు. వాళ్ళే
చరిత్రను సృష్టిస్తారు. ఆ తరువాత వాళ్ళ బాటలో చాలా మంది నడుస్తారు. కాని, మార్గదర్శకుడు
ఒకడే వుంటాడు.
1970వ దశకంలో యువతరం విప్లవించింది. కార్మిక, కర్షక, విద్యార్ధి, మేధావి ఐక్యత
వర్ధిల్లాలి అని నినదించింది.
నినాదం బాగుంది. సిధ్ధాంతమూ బాగుంది. కానీ కార్మిక కర్షకులకు విప్లవ సిధ్ధాంతాన్ని
అర్ధం అయ్యేలా చెప్పడం అంత సులువుకాదు. చాలా పెద్ద టాస్క్. చాలా పెద్ద సవాలు.
ఆ టాస్క్ ను తన రచనతో, గాత్రంతో, హావాభావాలతో చాలా సులువుగా పూర్తి చేసినవాడు గద్దర్.
విప్లవ సాహిత్యాన్ని ఎలాగూ ప్రజల కోసమే రాయాలి. అది ప్రజలకు సులువుగా అర్ధం అయ్యేట్టూ
వుండాలి.
గద్దర్ తో నా ప్రయాణాన్ని చెప్పడానికి ఇది సందర్భం కాదు. ఒక సంఘటనను చెప్పక తప్పదు.
1992లో AILRC వ్యవస్థాపక సభ ఢిల్లో జరిగింది.
అనేక రాష్ట్రాల నుండి ప్రతినిధులు వచ్చారు. తెలుగు వక్తల ప్రసంగాలను హింది బెల్ట్ వారికి
క్లుప్తంగా వివరించే బాధ్యతను నాకు అప్పచెప్పారు. నేను చాలా మంది ప్రసంగాలను వాళ్ళకు
హిందీ –ఇంగ్లీషులో అనువాదం చేసి చెపుతున్నాను. ఇంతలో వేదిక మీడికి గద్దర్ వచ్చాడు.
గద్దర్ మాట్లాడడుగా పాడుతాడు; నటిస్తాడు. పాడుతూ నటిస్తాడు నటిస్తూ పాడుతాడు. కొంత
పాట అయ్యాక నేను అనువాదానికి సిధ్ధం అయ్యాను. ఉత్తరాది వారు నన్ను వారించారు. అనువాదం
అక్కర లేదు; మాకు అర్ధం అయిపోతున్నది అన్నారు. అంతటి కమ్యూనికేషన్ శక్తి గద్దర్ ది.
గద్దర్ లాంటివాళ్ళు చాలామంది రావచ్చు; కానీ గద్దర్ మళ్ళీ దొరకడు.
(30 జనవరి గద్దర్ జయంతి)
No comments:
Post a Comment